రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, ఏప్రిల్ 2021, మంగళవారం

 

Tuesday, May 1, 2018

642 : స్క్రీన్ ప్లే సంగతులు


        నాల్గు రోజుల క్రితం పరిశీలన కోసం ప్రకటించిన కొరియన్ రోమాంటిక్ డ్రామా ‘ది క్లాసిక్’  ని చూసేసే వుంటారు ఈ పాటికి. చూడాలనే ఈ వ్యాసానికి విరామం ఇచ్చాం. తెలుగు రోమాంటిక్ డ్రామాల్ని ఫ్యామిలీ డ్రామాల తరగతికి తరలిస్తే, ఇటు రోమాంటిక్  డ్రామాలకీ,  అటు ఫ్యామిలీ డ్రామాలకీ రెండిటికీ న్యాయం చేయవచ్చేమో నన్న ఒక ఆలోచనకి బీజం వేసిన  ‘ది క్లాసిక్’ (2003) ని చూస్తే,  ఒక విషయం  అర్ధమయ్యే వుంటుంది.  తెలుగులో వస్తున్న రోమాంటిక్ డ్రామాలకీ, దీనికీ తేడా ఫీలయ్యే వుంటారు. ముగింపు ఒక తియ్యటి  బాధగా మిగిలిపోయే వుంటుంది. ఐతే  సాధారణ ప్రేక్షకులుగా ఫీలవ్వడం వేరు, కథకులుగా అలాటి  ఫీల్ ని ఫీలై  రాయడం వేరు. రాసినా ఆ ఫీల్ ని  తెలుగు దర్శకత్వంలో ప్రకటించడం ఇంకా వేరు. ఇక్కడే తేడా కొట్ట వచ్చు. ఎంత విరివిగా కొరియన్ ఆధునిక సినిమాల్ని కాపీ కొట్టినా, తెలుగు దర్శకత్వంలో అవి ఇంకా పాత చింతకాయ మూసలోకే  తిరగబెడుతున్నాయి. కాబట్టి కాసేపు తెలుగు వాళ్ళమని మర్చిపోయి, కొరియన్ కుర్రాళ్ళుగా అవతార మెత్తితే తప్ప (వరల్డ్ మూవీస్ వీరులే  వుండగా కొరియన్ కుర్రాళ్లుంటే  తప్పేంటి? వరల్డ్ మూవీస్ కంటే ఇదింకా కమర్షియల్ కూడా), వైవిధ్యమనేది  తెలుగులోకి తీసుకురావడం అస్సలు వీలుకాదు. కథ ప్రకారం ‘ది క్లాసిక్’  కి ‘మా నాన్న – మీ అమ్మ’  అని బ్రహ్మాండంగా తెలుగులో తనివితీరా టైటిల్ పెట్టుకోవచ్చు. అంత వరకే అనుమతి.  మిగతా కథా కాకరకాయ మూస తెలుగు వూరగాయ వేస్తూ కూర్చుంటే మాత్రం ఫ్యామిలీస్ కి ఉద్దేశించాలనే రోమాంటిక్ డ్రామాలు మళ్ళీ మొదటికే వస్తాయి. ఇవ్వాళ్టి ఫ్యామిలీస్ వాళ్ళ తాతల కాలంలో లేరు. కాబట్టి ఫ్యామిలీ డ్రామా అనగానే తాత ముత్తాతల మీద కూడా పడిపోయి, కుర్రకుంకలకి కట్ట బెడితే, ఇది మల్లెల వేళయనీ ...అని ఫ్యామిలీ బాణీలు విన్పించవు బాక్సాఫీసు దగ్గర సరికదా, ఎండ మండిపోతూంటుంది పాత ముక్కిన చాదస్తానికి. ఒక్క అమాయక ప్రేక్షకుడూ నక్కి వుండడు గేటు లోపల!

          విశేషమేమిటంటే,  ‘ది క్లాసిక్’ డ్రామాలో పెద్ద వయసు పాత్రలే లేవు. ఇది చాలా ఆనందం కల్గించే విషయం. పెద్దలూ వాళ్ళ మూతికి నీతులూ ఇక్కడ బంద్ (వయసులో వున్నప్పుడు వాళ్లకేం నీతులుండేవో ఎవరికి తెలుసు). ఒకటి రెండు పెద్ద పాత్రలున్నా (తాత, తండ్రి) అవి ఒకటి రెండు సీన్లకే పరిమిత మయ్యాయి. నాణేనికి ఇంకో వైపుచూస్తే, రోమాంటిక్ డ్రామాల్లో వయసు మళ్ళిన పాత్రలు వుండి తీరాలని, అప్పుడే అవి ఫ్యామిలీస్ కి కూడా ఆముదంలా పట్టుకుంటాయనీ  రూలేమీ లేదు. ప్రతీ వయసు మళ్ళిన వ్యక్తీ తన టీనేజీకి బందీయే. ఇంకా బాల్యం గుర్తుండక పోవచ్చుగానీ, తమ టీనేజీ రోజుల్ని మర్చిపోలేరు. ఈ మనః స్థితి మీద ప్లే చేస్తే పెద్ద వాళ్ళు కూడా రోమాంటిక్ డ్రామాలకి కనెక్ట్ అవుతారు. దీన్నెలా కనెక్ట్ చేశాడూ దర్శకుడంటే, కథలో టీనేజీ హీరోయిన్ - ఆమె తల్లి ప్రేమ కథలో కూడా ఆమె  తల్లిది టీనేజీ వయసు – పైగా ఈ రెండు పాత్రల్నీ ఒకే టీనేజీ నటి నటించడం. తల్లీ కూతుళ్ళ ఇద్దరి ప్రేమ కథలూ వాళ్ళ టీనేజీ అప్పటివే.  ఇలా యూత్ కి యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో పేరెంట్స్ కీ గతంలో వాళ్ళ యూత్ – ఇలా టూ ఇన్ వన్ షో!

దర్శకుడు క్వాక్ జే యంగ్.  
        అంతేగానీ తల్లి కదా అని చెప్పి,  ఓ గొప్ప తెలుగు చిల్లరాలోచన చేసి, ఓ మాంచి దిట్టంగా వున్న పెద్దావిడని తెచ్చి పడేసి, అడల్ట్ ప్రేమ కట్టబెట్టి  వుంటే – ఆ నటీ, ఆమె సహ నటుడూ సీనియర్ నటులుగా కలిసి వ్రతం చెడగొట్టే వాళ్ళు. ఇలాకాక ఇక్కడ ప్రెజెంట్ స్టోరీ టీనేజీ పాత్రలతో ఎంత ఫ్రెష్ నెస్ తో వుంటుందో, ఫ్లాష్ బ్యాక్ కథ కూడా అప్పటి టీనేజీ పాత్రలతో అంతే ఫ్రెష్ నెస్ తో ఆసక్తి గొల్పుతుంది. వెరసి రెండూ భిన్న కాలాల టీనేజి ప్రేమలై  ఒక వైవిధ్యం. ఇది కూడా  మార్కెట్ యాస్పెక్టే. మొత్తంగా యూత్ అప్పీల్ కూడా (పేరెంట్స్ కూడా ఒకప్పటి యూతే కదా). 

          ఇప్పుడు తెలుగులో కావాల్సింది సినిమాకో లుక్ మార్చుకునే హీరోల మేకోవర్ ప్రయత్నాలు కాక, కథల మేకోవర్ తంటాలేమో ఆలోచించుకోవాలి. కథల లుక్ ని మార్చేసే మేకోవర్ల కోసం అతి సింపుల్ గా వుండే కొరియన్ డ్రామాల్ని చూడొచ్చు. 

          ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతి, ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివర, మహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు.... ఇది ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు – దేని అస్తమయాన్ని? అక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే... ఇలా ఈ ‘ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. 

          ఒక అస్తమయంతో ఇంకో సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరం, ఒక ద్వంద్వం.

స్థూలంగా ఇదీ కథ
      కాలేజీ స్టూడెంట్ జీహై (సన్ యే జిన్), డ్రామా దర్శకుడూ  స్టూడెంటు అయిన   సాంగ్ మిన్ ( జో ఇన్ సియోంగ్) ని ప్రేమిస్తూంటుంది. ఫ్రెండ్ సూ క్యుంగ్ (లీ సంగ్ క్యుంగ్)   కూడా అతన్నే ప్రేమిస్తూంటే సందిగ్ధంలో పడుతుంది. ఒకరోజు తన తల్లి పాత  ఉత్తరాల్ని, డైరీ నీ చూస్తుంది. డైరీలో 1960 లనాటి తల్లి జూహీ (సన్ యే జిన్ ద్విపాత్రాభినయం) ప్రేమకథని ఆసక్తిగా చదువుతుంది.  అప్పట్లో జూహీ, జూన్ హా (జో సియోంగ్ వూ) తో ప్రేమలో వుంటుంది. కానీ ఆమె తాత ఆమె పెళ్లిని టీసూ ( జున్ టీసూ) తో నిశ్చయం చేశాడు. ఇప్పుడు తల్లి ప్రేమ కథ ఎలా ముగిసింది? తల్లి ప్రేమ కథ తెలుసుకున్న జీహై ప్రేమకి ఎలాటి ముగింపు దొరికింది? ఇదీ విషయం. 

          ఐతే కొరియన్ దర్శకుడు అటక మీంచి పాతావకాయ జాడీనే దించాడనడానికి ఎలాటి మొహమాటమూ పడనక్కర్లేదు. వాళ్ళ జాడీ కూడా తెలుగు జాడీ లాగే వుంది. ఇందులో సమకూరిన దినుసులు ఇవీ : తొలిప్రేమ మరిచిపోలేని క్షణాలు, అందమైన అమ్మాయికి కష్టాలు, వర్షంలో విహారం, కాలు బెణికి హీరో వీపున స్వారీ, వెచ్చటి చెట్టు కింద పుచ్చకాయ ఆరగింపు, మిణుగురు పురుగులు పట్టడం, ఇంత చేసిన హీరోకి నెక్లెస్ తీసి కట్టేయడం, ఉత్తరాలు, పావురాలు, ప్రేమిస్తున్న అమ్మాయికి తన ఫ్రెండ్ తో ఉత్తరాలు రాయించడం, స్నేహాలు, త్యాగాలు...


          పల్లెటూళ్ళో ఎడ్ల బండి మీద పట్నం అమ్మాయి, చిల్లర నేస్తాలతో అల్లరి చేస్తున్న హీరో పేడ పురుగు తీసి ఆమెకి చూపించడం -  వాట్ పేడ పురుగు హై దిసీజ్ - అని జీవితంలో మొదటిసారి చూస్తున్న పట్నం అమ్మాయి షాక్ అవడం, నేస్తాలు ఎడా పెడా పేడ పోసుకుంటూ పోకిరీతనాలు పోవడం, రాజకీయ నాయకుడి మనవరాలికీ, బిజినెస్ మాన్ కొడుక్కీ పెళ్లి సంబంధం, వాళ్ళే అమ్మాయి అబ్బాయి చనువు పెంచుకోవాలని స్వేచ్ఛగా  వదిలెయ్యడం, ఐనా  ప్రేమించని కొడుకుని బిజినెస్ మాన్ బెల్టు తీసి చెమ్డా లెక్కదీయడం, నీయబ్బ నువ్వే ఇలా చేస్తావా అని ఆ కొడుకు అదే బెల్టుతో ఉరేసుకోవడం...


          ఐతే చాలా క్లాస్ గా, అర్ధవంతంగా చెప్పాడు చెబుతున్న విషయం. ఇందులో ఏడ్పించే సన్నివేశాలు అనేకం వున్నాయి. పాత్ర చిత్రణ, సన్నివేశ బలంలేని ఉత్తుత్తి ఏడ్పులు కావు. ఎవరికైనా పుట్టినప్పటి పాత ఫేసే వుంటుంది. మేకోవర్ తో కొత్తగా మెరుస్తుంది. పాత మసాలా దినుసుల్నే అలా ఆచితూచి వాడుకుంటూ, పాతని తిరగమోతతో కొత్తగా చూపించడమే రోమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలకి కొత్త మార్కెట్ ని సంతరింప జేయవచ్చు. 


          ఇంత కథా రెండు గంటలే. రెండు మాంటేజ్ సాంగ్స్ వుంటాయి. అడుగడుగునా తెలుగు సినిమాలకి ఏ అంశం ఎలా అప్లయి అవుతుందాని చూసుకుంటూ వెళ్తూంటే, ఏదీ తీసేయడానికి వుండదు. అలాగని కాపీ కొట్టాలని కాదు. మేకింగ్ ని తులనాత్మకంగా పరిశీలించడం. తెలుగులో రోమాంటిక్ ఫ్యామిలీ డ్రామాల్ని ఇలా రెండు మాంటేజ్ సాంగ్స్ తో రెండు గంటల నిడివితో తీస్తే ఆడవా? –అంటే తప్పకుండా  ఆడే అవకాశముంది. ‘శివ’లో పాటలు తీసేస్తే కథ తప్ప,  వేరే ఏ కామెడీ ట్రాకులూ ఉప కథలూ లేవుగా? సూటి కథనే సీను తర్వాత సీనుగా చూసుకుంటూ వెళ్ళారుగా  ప్రేక్షకులు?


          ఈ మూవీలో వున్న దృశ్య పరంపరని చూస్తే, తెలుగులో ఇలాటి కథా కథనాలతో కాస్త హృద్యంగా రెండు గంటల్లో తీస్తే,  ఇంకే లోటూ ప్రేక్షకులు ఫీలవలేరనేది రూఢీ అయిపోతుంది. రెండు గంటల కథే  కడుపు నిండా కథై పోతుంది. 


          మేకింగ్ కి సంబంధించి మరొకటేమిటంటే, నటీనటుల ఎంపిక. ఆరుగురు యువ నటులూ మాంచి ఫిజిక్ తో, ఫోటో జెనిక్ గా, కంటికింపైన కాస్ట్యూమ్స్ తో, గడ్డాలూ మీసాల రౌడీ ఫేసులు  లేకుండా,  ఎల్లడెలా రోమాంటిక్ ఫీల్ ని వెదజల్లుతూ కథతో పాటు ట్రావెల్ అవడం. ఇలా అందరూ కొత్త వాళ్ళతో తక్కువ బడ్జెట్ లో తీసినా వర్కౌట్ అయిపోతుంది. ఇందులో తల్లీ కూతుళ్ళ రెండు పాత్రలూ వేసిన నటి సన్ యే జిన్ కి,  అప్పుడు వయసు పద్దెనిమిదే. అద్భుతంగా నటించింది.


కథా, గాథా? 
      ఈ మూవీని చూసిన స్ట్రక్చరాశ్యులకి  ఇందులో స్ట్రక్చర్ ఏమిటా; ఇదసలు కథా, గాథా;  పాత్రలేమిటి పాసివా, యాక్టివా అని సవాలక్ష సందేహాలు రావచ్చు. ఫ్లాష్ బ్యాక్ తో వుండే స్క్రీన్ ప్లేలు ఫ్లాష్ బ్యాక్ ని ప్రధాన కథకి సమాచారం కోసం వాడుకుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ కథ కాదు. కనుక అది గాథ అయి వున్నా ఫర్వాలేదు. ఫ్లాష్ బ్యాక్ తో కమర్షియల్ సినిమా ఆడదు కాబట్టి. ప్రధాన కథతోనే  ఆడుతుంది కాబట్టి. ఫ్లాష్ బ్యాక్  అనేది ప్రధాన కథకి అవసరమున్న  సమాచారాన్నందించే వనరు మాత్రమే కాబట్టి, ఆ ఫ్లాష్ బ్యాక్ కథ అయి వుండనవసరం లేదు.  గాథ కావొచ్చు. అందుకని సహజంగానే ఫ్లాష్ బ్యాక్ లో పాత్రలు పాసివ్ గానే వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ అందించిన సమాచారంతో ప్రధాన కథలో తలెత్తిన సమస్య పరిష్కారమౌతుంది, అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్ లో పాసివ్ గా వుండిపోయిన బాధిత పాత్రలకీ, ప్రధాన కథలో సమస్యా పరిష్కారంతో న్యాయం చేకూరుతుంది. 

          అందుకని ప్రధాన కథ కథ అయితే, దాని ఫ్లాష్ బ్యాక్ గాథ అయి తీరాల్సిందే. రెండూ కథలై పోతే కథే (స్క్రీన్ ప్లే నే ) కుదరదు. రెండు విడివిడి కథలవుతాయి. 


          ఫ్లాష్ బ్యాక్ తో వుండే సినిమాల్లో స్ట్రక్చర్ ని ప్రధాన కథకే చూసుకోవాలి. స్ట్రక్చర్ వుందంటే యాక్టివ్ పాత్ర లున్నట్టే. సమస్య – సంఘర్షణ – పరిష్కారమనే త్రీ యాక్ట్ లో స్క్రీన్ ప్లే కుదిరినట్టే. ఫ్లాష్ బ్యాక్ లోని సమాచారాన్ని ఆ  స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా వెదజల్లుకుంటూ పోవడమే – ప్రధాన కథలో పాత్రలకి తలెత్తిన సమస్యకి తగిన పరిష్కారం మొలకెత్తే వరకూ. 


          ఈ మూవీ స్క్రిప్టింగ్ ఇలాగే వుంది. హీరోయిన్ ప్రేమకథ కథే. ఇందులో హీరోయిన్,  ఆమె  ప్రేమిస్తున్న హీరో, ఆ హీరోని  ప్రేమిస్తున్న సెకండ్ హీరోయిన్, ముగ్గురూ లక్ష్యం కోసం (ప్రేమని పొందడం)  ప్రయత్నించే యాక్టివ్ పాత్రలే. ఈ ప్రధాన కథలో ప్రధాన పాత్ర హీరోయినే. తన సమస్యకి ఆమె నిర్ణయం తీసుకుని సంఘర్షిస్తుంది. 


          ఇదే ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే, ప్రధాన కథలోని హీరోయిన్ తల్లి కి సంబంధించిన ఆ  ప్రేమకథ కథలా వుండదు. తనూ తనకి ప్రేమలో తారస పడ్డ  ఆ ఇద్దరు హీరోలూ ముగ్గురూ పాసివ్ పాత్రలే. ప్రధాన పాత్ర తనే. లక్ష్యముంది ప్రేమకోసం. కానీ నేరవేర్చుకోలేని, నిర్ణయం తీసుకోలేని  అశక్తురాలు. ఆ ఇద్దరూ అంతే. అదొక ట్రాజెడీ, ఓ గాథ.


ముక్కోణాల సంగతి 
     ఇక ప్రధాన కథలో, ఫ్లాష్ బ్యాకులో వున్నవి రెండూ కూడా ముక్కోణ ప్రేమలే. ప్రధాన కథలో ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. ఫ్లాష్ బ్యాక్ లో ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలు. ఈ బ్లాగులో ఏప్రెల్ 24,  Q & A లో, ముక్కోణ ప్రేమ కథలు ఎందుకు ఆకట్టుకోవడంలేదో చెప్పుకుంటూ, దీనికి పరిష్కారంగా జేన్  ఆస్టెన్  ఫార్ములా  ప్రస్తావించుకున్నాం. సరీగ్గా ఆ ఫార్ములా ఇక్కడ అమలైంది! 

          జేన్ ఆస్టెన్ సక్సెస్ ఫుల్ ఫార్ములా ప్రకారం, ఈ ముక్కోణ ప్రేమలో హీరోయిన్ హీరోని ప్రేమిస్తూంటే,  సెకెండ్ హీరోయిన్ కూడా ప్రేమిస్తూంటుంది. కానీ సెకండ్ హీరోయిన్ తో వున్న స్నేహానికి విలువిచ్చి హీరోయిన్ తప్పుకుంటుంది. 


          హీరో వైపు చూస్తే, ఇతను ఇద్దరమ్మాయిలతో వున్నా ఎవర్ని ప్రేమిస్తున్నాడో తెలీదు. హీరోయిన్ చేసిన త్యాగం తెలియడంతో, అప్పుడు సెకెండ్ హీరోయిన్ని రెండు పీకి హీరోయిన్ వైపు వచ్చేస్తాడు. మొదట హీరోయిన్నే  ప్రేమించాడు, కానీ బయట పెట్టుకోలేదు. ఆస్టెన్ ఫార్మలా ప్రకారం పాత్ర ఇద్దరితో ఒకేసారి ప్రేమలో వుండదు. అదే ఇక్కడ జరిగింది. హీరో హీరోయిన్నే ప్రేమించాడు, దొరికింది కదాని సెకెండ్ హీరోయిన్ని కూడా ప్రేమించడు. 


          ఇక ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ తల్లితో ఇద్దరబ్బాయిలు ఇంటరాక్ట్ అవుతున్నా, ఆమె హీరో ఒక్కడినే  ఇష్టపడి, సెకండ్ హీరోని  అస్సలు పట్టించుకోదు. ఇష్టపడ్డ హీరో అనుకోని ట్రాజెడీకి గురై, ఆమెకి ముఖం చూపించలేక వేరే పెళ్లి చేసుకోవడంతో, చేసేది లేక ఆమె సెకండ్ హీరోతో పెద్దలు నిశ్చయించిన పెళ్ళే చేసుకుంటుంది. ఇక్కడ కూడా పాత్ర ఏకకాలంలో ఇద్దరితో ప్రేమలో పడదు, పడి ఎవర్ని ఎంపిక చేసుకోవాలో తెలీని డ్రామాలో పడదు ఆస్టెన్ ఫార్ములా ప్రకారం...   ఆస్టెన్ ఫార్ములా వెండి తెర కొచ్చేసి స్క్రీన్ ప్లే లో,  కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేని  ఎలా సపోర్టు చేస్తుందో కూడా,  పైన చెప్పుకున్న Q & A లో వివరించుకున్నాం.


          ఇలా బ్యాక్ గ్రౌండ్ సందేహాలన్నీ తీర్చుకున్నాక, ఇక ఒక్కో సీనేమిటో, దాని పాయింటేమిటో వరసగా తెలుసుకుందాం...


సికిందర్
(దీని కొనసాగింపు వ్యాసాల కోసం  బ్లాగులో సెర్చి చేసుకోవచ్చు)