రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, July 9, 2016

రివ్యూ






రచన – దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్

తారాగణం ; సల్మాన్ ఖాన్, అనూష్కా శర్మ, అనంత్ శర్మ,
రణదీప్ హూడా, అమిత్ సాద్ తదితరులు
సంగీతం : విశాల్ -  శేఖర్, ఛాయాగ్రహణం : ఆర్టర్ జురావ్ స్కీ
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్
నిర్మాత :  ఆదిత్య చోప్రా
విడుదల : 6 జులై 2016

***
       స్పోర్ట్స్ డ్రామా తీసుకుని సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ ఫ్యాన్స్ కి  పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. కిందటిసారి ‘భజరంగీ భాయిజాన్’ అనే ఎంటర్ టైనర్ తో ఫ్యాన్స్ నే కాకుండా ఇతర అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించగల్గిన సల్మాన్, ఈ సారి సీరియస్ డ్రామాని మిళితం చేసిన బలమైన  -సారీ!  - బరువైన కమర్షియల్ ని అందించాడు. పహిల్వాన్ గా ప్రారంభమై మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యోధుడిగా ఎదిగే క్రమాన్ని యమ సీరియస్ గా చూపించుకొచ్చాడు. ఈ క్రమంలో రెండు అంశాలు ప్రతిబంధకాలుగా మారాయి : ఒకటి, నార్మల్ హిందీ భాష  కాకుండా హర్యాన్వీ యాసతో సినిమా నిండి వుండడం; రెండు, ఎక్కడా ఎమోషన్ అనేది క్యారీ కాక పోవడం. గత  ఆగస్టులో విడుదలైన  అక్షయ్ కుమార్ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘బ్రదర్స్’ ని గుర్తుకు తెచ్చే ‘సుల్తాన్’  సెకండాఫ్ అంతా కూడా  ‘బ్రదర్స్’  లాగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్ తో నిండిపోయి ఒక స్పోర్ట్స్ చానెల్ చూస్తున్నట్టు వుంటుంది. ఐతే ఈ ఈవెంట్ లో ‘బ్రదర్స్’ లో వున్నంత జీవం ‘సుల్తాన్’ లో లోపించడం ప్రత్యేకత.

     ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’ అనే సూపర్ హిట్ రోమాంటిక్ కామెడీ తీసిన చోప్రా క్యాంపు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, ‘సుల్తాన్’ లాంటి ఆలిండియా – ఓవర్సీస్ హిందీ కమర్షియల్ సినిమాని కూడా ఒక ప్రాంతానికి వర్తింపజేసి అక్కడి వాతావరణంతో, యాసతో, పాటలతో, డ్రామాతో ప్రాంతీయ సినిమాలా అన్పించేలా తీయడమనేది మాత్రం నార్మల్ హిందీ సినిమాలు చూసేవాళ్ళకి  కాస్త ఇబ్బంది పెట్టే వ్యవహారమే. పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ గా వున్న ‘సుల్తాన్’ ఫ్యామిలీస్ కంటే కూడా ఫక్తు మాస్ కమర్షియల్ అంశాలతో యూత్ ని ఎక్కువ ఆకర్షిస్తూ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. 

        ఇంతకీ దీని కథా కమామిషు ఏమిటి?

కథ
      ఢిల్లీకి చెందిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ సంస్థ ప్రతినిధి ఆకాష్ ఒబెరాయ్ ( అమిత్ సాధ్) త్వరలో జరగనున్న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో  పోటీకి పెట్టాల్సిన ఫైటర్  గురించి అన్వేషిస్తూ హర్యానాలోని ఒక గ్రామానికొస్తాడు. అక్కడ తన క్కావలసిన మాజీ రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్ సుల్తాన్ (సల్మాన్ ఖాన్) ని కలుసుకుంటాడు. కానీ  సుల్తాన్ తనకి అసక్తిలేదని ఆ ఆఫర్ ని తిరస్కరిస్తాడు.  అక్కడి ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఒక బ్లడ్ బ్యాంకు స్థాపించడానికి విరాళాలు సేకరించే పని కూడా పెట్టుకున్న సుల్తాన్ గతం గురించి అతడి మిత్రుడు గోవింద్ ( అనంత్ శర్మ) ఆకాష్ ఒబెరాయ్ కి చెప్పడం ప్రారంభిస్తాడు. 

        ఎనిమిదేళ్ళ క్రితం గ్రామంలో కేబుల్ టీవీ నిర్వహిస్తూ మిత్రులతో హుషారుగా తిరిగే సుల్తాన్ ఆ వూళ్ళో  కుస్తీ పోటీలకి శిక్షణ నిచ్చే బర్కత్ (కుముద్ మిశ్రా) కూతురు  ఆర్ఫా (అనూష్కా శర్మ) తో ప్రేమలో పడతాడు. ఆమెకీ ప్రేమలూ గీమలూ నచ్చవు. రెజ్లింగ్ లో వరల్డ్ ఛాంపియన్ అన్పించుకునే లక్ష్యంతో, ఒలంపిక్స్ కి వెళ్లాలని  కృషి చేస్తూంటుంది. ఒక లక్ష్యం  లేకుండా తిరిగే సుల్తాన్ ని అవమానిస్తుంది. దీంతో తనూ ఆమె తండ్రి దగ్గరే  కుస్తీ నేర్చుకుని నేషనల్ ఛాంపియన్ వరకూ ఎదుగుతాడు. అతణ్ణి పెళ్లి  చేసుకుంటుంది ఆర్ఫా. గర్భవతవుతుంది. ఆమెకి నెలలు నిండిన సమయంలో వరల్డ్ ఛాంపియన్ కెళ్తాడు సుల్తాన్. అక్కడ  గెలుస్తున్న సమయంలో ఇక్కడ కొడుకు పుట్టి చనిపోతాడు. అరుదైన ‘ఓ-పాజిటివ్’ బ్లడ్ గ్రూపుతో పుట్టిన కొడుకు రక్తం దొరక్క రక్త హీనతతో చనిపోతాడు. సుల్తాన్ ది ఆ బ్లడ్ గ్రూపే. దీంతో తను దగ్గరుండి కొడుకుని రక్షించుకోలేక పోయాననే తీవ్ర క్షోభకి లోనవుతాడు. కొడుకుని బతికించుకోలేకపోయిన తను కూడా  మొహం చూపించలేనని దూరమవుతుంది ఆర్ఫా. ఇక సుల్తాన్ తన కొడుకు లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని వాడి పేర బ్లడ్ బ్యాంకు స్థాపించే లక్ష్యం తో, క్రీడా రంగాన్ని వదిలేసి, ఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు...  

        ఈ గతం తెలుసుకున్న ఆకాష్ ఒబెరాయ్ బ్లడ్ బ్యాంకు పెట్టాలంటే సుల్తాన్ మళ్ళీ రెజ్లింగ్ కి సిద్ధం కావాలని, చాలా  డబ్బొస్తుందనీ  ఒప్పించి తీసుకుపోతాడు...ఆ వరల్డ్ మిక్స్డ్ మార్షల్ ఈవెంట్ కోసం తిరిగి శిక్షణ పొంది,  అంతర్జాతీయ ఫైటర్స్ ని సుల్తాన్ ఎలా ఓడించాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      ముందే చెప్పుకున్నట్టు గత ఆగస్టులో విడుదలైన ‘బ్రదర్స్’ ని గుర్తుకు తెస్తుంది ఈ కథ. ‘బ్రదర్స్’  హాలీవుడ్ ‘వారియర్’  కి అధికారిక రీమేక్. అందులో సగటు ఉద్యోగి అయిన అక్షయ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన కూతురి వైద్యం కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా మారతాడు.
        ‘సుల్తాన్’ లో సల్మాన్ ఖాన్ చనిపోయిన కొడుకు పేర బ్లడ్ బ్యాంకు కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా దిగుతాడు.
        ‘బ్రదర్స్’ లో ఓపక్క క్యాన్సర్ తో యాతన పడుతున్న కూతురితో ప్రత్యక్ష బాధ మనం ఫీలవుతాం.
        ‘సుల్తాన్’ లో ఎప్పుడో చనిపోయిన కొడుకుతో అలాటి ప్రత్యక్ష బాధ ఫీలవ్వం. కనీసం ఆ పుట్టిన శిశువుని కూడా మనకెప్పుడూ చూపించలేదు.
         ‘బ్రదర్స్’  ఈవెంట్ లో సొంత తమ్ముడు( సిద్ధార్థ్ మల్హోత్రా) తో తలపడాల్సి వస్తుంది అక్షయ్ కుమార్ కి.
        ‘సుల్తాన్’ ఈవెంట్ లో ఏ సంబంధం, ఏ సెంటిమెంట్లూ లేని ఇతర ఫైటర్లతో తలపడతాడు సల్మాన్.
        ‘బ్రదర్స్’ లో చిన్నప్పుడు స్పర్ధలతో విడిపోయిన అన్నదమ్ములు. ఆ కక్షలు ఇంకా కొనసాగుతూ హై ఓల్టేజీ నేపధ్యం. 
        ‘సుల్తాన్’  లో ప్రత్యర్ధులతో గతంలో ఏ కక్షలూ, వృత్తిగత వైషమ్యాలూ లేని జీరో ఓ ల్టేజీ నేపధ్యం.
        ‘బ్రదర్స్’ లో కూతుర్ని బతికించుకోవడానికి సొంత తమ్ముడ్ని కొట్టి ఓడించాలన్న కసితో  అక్షయ్. ఇక్కడ బలమైన మెలోడ్రామా.
        ‘సుల్తాన్’ లో కొడుకు బ్లడ్ బ్యాక్ కోసం ఎట్టి పరిస్థితిలో ప్రత్యర్ధుల్ని ఓడించాలన్న కసితో  సల్మాన్. ఇక్కడ ఆ ప్రత్యర్ధులు తనకేమీ కాకపోవడంతో  మెలోడ్రామా నిల్.
        ‘బ్రదర్స్’ లో అన్న కూతురి పరిస్థితి తెలీని తమ్ముడికి  పాత కక్షల కొద్దీ అన్నమీద గెలవాలన్న పట్టుదల. ఇక్కడ హీరో ( అన్న) లక్ష్యానికి బలమైన ప్రత్యర్ధి తమ్ముడు.  దీంతో కథకి హీరోతో బాటూ విలనూ  కుదిరారు.
        ‘సుల్తాన్’ లో తనకేమీ కాని సల్మాన్  ప్రత్యర్దులకి పాతకక్షలతో గెలిచి తీరాలన్న ఎమోషన్ లేదు. ఇక్కడ హీరో (సల్మాన్) లక్ష్యానికి అడ్డుతగిలే ప్రత్యర్ధు లెవరూ లేరు. అందుకని ఈ కథలో హీరోకి విలన్లు లేరు.
        ‘బ్రదర్స్’ లో అక్షయ్ తమ్ముడ్ని కసిదీరా కొడుతున్నప్పుడు చిన్నప్పుడు అల్లారు ముద్దుగా అతణ్ణి ఎత్తుకు తిరిగిన దృశ్యాలతో మనకి గుండెలు బరువెక్కే అనుభవం.
        ‘సుల్తాన్’ లో సల్మాన్ పోరాడుతున్నప్పుడు కొడుకు ఖాళీ ఉయ్యాల దృశ్యాలతో ఎమోషన్ నిల్. తను కొడుతున్న ప్రత్యర్ధులకి కొడుకుతో ఏ కనెక్షనూ లేకపోవడం వల్ల.
         ‘బ్రదర్స్’ లో  కూతురి అవసరం కొద్దీ నడివయసులో ఫైటర్ గా దిగిన అన్నకి,  కుర్ర వయసులో వున్న తమ్ముడి తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ హోరాహోరీ.
        ‘సుల్తాన్’ లో అప్పటికి నడివయసు పాత్రగా వున్న సల్మాన్ కి, ప్రత్యర్ధులతో ఈ కాంట్రాస్ట్ లేని  మిక్స్డ్ మార్షల్  ఆర్ట్స్ జోరు.
        ‘బ్రదర్స్’ లో అన్న మీద తమ్ముడు గెలుస్తాడా, తమ్ముడి కోసం అన్న త్యాగం చేస్తాడా అన్న ఎడతెగని సస్పెన్స్.
        ‘సుల్తాన్’ లో ప్రత్యర్ధుల మీద సల్మానే  గెలుస్తూ పోతాడని ముందే తెలిసిపోయే విషయం. దీంతో సస్పెన్స్, ఉత్కంఠ, థ్రిల్, ఎమోషన్, ఇంటరెస్ట్ వగైరా నిల్.
        ‘బ్రదర్స్’ లో చివరికి తమ్ముడి భుజం విరిచేసి- ‘ఒరే ఇక చాలించరా!’ అని అన్న ఏడ్పు. అయినా పట్టువదలక  అలాగే అన్నని పడ దోసి లాక్ చేసి- ‘ఆవిడ నాక్కూడా అమ్మే కదరా?’ అన్న తమ్ముడి ఆక్రందన.
        ‘సుల్తాన్’  లో సల్మాన్ ప్రక్క టెముకలు విరిచేస్తాడు ప్రత్యర్ధి. ఆ గాయమైన చోటే కొడుతూంటే అలాగే ఫైట్ చేస్తాడు సల్మాన్ గాయం తాలూకు బాధతో మాత్రం.
        ‘బ్రదర్స్’ లో ఈవెంట్ గెలిచి, భుజం విరిగిన తమ్ముణ్ణి ఆర్తిగా పొదివి పట్టుకుని బయటికి తీసుకుపోతాడు  అక్షయ్.
         ‘సుల్తాన్’ లో ఈవెంట్ గెలిచి ఎమోషనల్ గా  భార్య దగ్గరికి వెళ్తాడు సల్మాన్.
        ‘బ్రదర్స్’  లో స్టోరీ పాయింటు ( కూతురి చికిత్స కోసం ఈవెంట్ గెలవడం) తో బాటు, కథా ప్రయోజనం కూడా నెరవేరింది. కథా ప్రయోజనం ఈ ఈవెంట్ ద్వారా తిరిగి అన్నదమ్ములు ఒకటవడం.
        ‘సుల్తాన్’ స్టోరీ పాయింటు (బ్లడ్ బ్యాంక్ కోసం ఈవెంట్ గెలవడం) తో పాటు కథా ప్రయోజనం కూడా నేరవీరింది గానీ, విడిపోయిన భార్యాభర్తలు ఒకటవడం ముందే చూపించడం తో  ముగింపులో చూపించడానికి ఏమీ లేకుండా పోయింది.
        ‘బ్రదర్స్’ లో అన్నదమ్ముల కలయిక అనే ముగింపుతో సంతృప్తిగా బయటి కొస్తాం.
        ‘సుల్తాన్’ లో భార్యాభర్తల కలయిక ముందే జరిగిపోవడంతో కేవలం ఈవెంట్ గెలవడం తాలూకు యాంత్రిక ముగింపుతో అసంతృప్తితో బయటి కొస్తాం. 

ఎవరెలా చేశారు 
      సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ లో వున్నంత స్లిమ్ గా, గ్లామరస్ గా కాక, భారీ కాయంతో ఫేస్ తో మృదుత్వం తగ్గి మోటుగా కన్పిస్తాడు. వయసు పైబడ్డం వల్ల రోమాంటిక్ సీన్స్ లో డాన్సుల్లో ఇదివరకటి పెప్, ఫన్, బాక్సాఫీసు అప్పీల్ కన్పించదు. ఆ భారీకాయం పోరాటాలకే పనికొచ్చింది. అదికూడా  సాటి ఫైటర్ల ఫాంలో వున్న శరీరాల ముందు ఎబ్బెట్టుగా కన్పిస్తాడు. పొట్ట పెరిగి కొట్టొచ్చినట్టు కన్పిస్తూంటుంది. సాటి ఫైటర్ల ప్రొఫెషనల్ కండలకీ, సల్మాన్ కండలకీ తేడా కూడా అంతే. ఫస్టాఫ్ లో ప్రేమ పేరుతో పెప్ తగ్గినా కామెడీ చేస్తూ ఎలాగో ఎంటర్ టైన్ చేసినా, సెకండాఫ్ కొచ్చేసరికి పూర్తి సీరియస్ పాత్రగా మారిపోతాడు. రిలీఫ్, ఎంటర్ టైన్ మెంట్ ఏదీ ఇవ్వడు. 

        అనూష్కా శర్మ గ్లామర్ పాత్రలో బాగానే వుందిగానీ, స్త్రీ స్వేచ్చ గురించి అంత చెప్పి  రెజ్లింగ్ లో పెద్ద లక్ష్యమే పెట్టుకున్న ఆమె పాత్ర-  పెళ్లి చేసుకోవడం, అయినా  గర్భం దాల్చకుండా జాగ్రత్త పడకపోవడం, తల్లిగా మారడం- లక్ష్యం గాలి కెగిరిపోవడం- పాత్రని చంపి కథ నడపడం కోసమన్నట్టుగా తయారయ్యింది. ఇంటర్వెల్ కే  పుట్టిన కొడుకు చనిపోయిన కాడ్నించీ తనుకూడా విషాదంగానే వుండిపోతుంది చివరివరకూ.  

        ఈ రెండే చెప్పుకోదగ్గ పాత్రలు. మిగిలిన పాత్రలకి పెద్దగా పనేమీ లేదు. రణదీప్ హూడా కూడా సల్మాన్ కి ట్రైనింగ్ ఇచ్చి తప్పుకుంటాడు. అతను  కూడా ఈవెంట్ లో సల్మాన్ కి తోడుగా వుంటే అర్ధవంతంగా వుండేది. 

        హర్యాన్వీ హిందీ, పాటలు కూడా అలాంటివే, ఫస్టాఫ్ అంతా హర్యానా కల్చర్ తో పల్లెటూళ్లోనే, అక్కడి పల్లెటూరి పాత్రలూ...ఒక హిందీ సినిమా చూస్తున్నట్టు కాకుండా  ఏ  భోజ్ పురి లాంటి ప్రాంతీయ సినిమానో చూస్తున్నట్టు వుంటుంది. ఇక ఫైట్స్ అద్భుతంగా వున్నాయి గానీ, వాటి నేపధ్యంలో జీవం లేకపోవడంతో అవి ఫక్తు స్పోర్ట్స్ టీవీ చూస్తున్నట్టు అన్పిస్తాయి. ఇక ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఛాయాగ్రహణం భారీగానే వుండడం ఆశ్చర్య పడాల్సిన పనికాదు. 

చివరికేమిటి
    సినిమా ఎలా వున్నా సల్మాన్ కోసం చూసేసి ఓ పనయ్యిందని పించుకునే వాళ్ళు ఎలాగూ చూస్తారు, చూస్తున్నారు. వాళ్ళల్లో లేడీస్ మాత్రం వాళ్ళ భర్తలతో, పిల్లలతో ఫస్టాఫ్ లోనే వెళ్ళిపోయే దృశ్యాలు మన దగ్గర కన్పిస్తున్నాయి- నార్మల్ హిందీ భాషలో మాటలు, పాటలూ లేకపోవడం వల్లకావొచ్చు. ఇక సెకండాఫ్ లో నైతే  లేడీస్ ఆకట్టుకునే అంశాలకి దూరంగా  ఫైట్ తర్వాత భారీ ఫైట్ గా సాగడంతో – ఈ మధ్య కాలంలో మొదటి సారిగా సల్మాన్ వాళ్ళని నిరాశ పరుస్తాడు. యూత్ కి ఓకే. వాళ్ళలో ‘బ్రదర్స్’ చూసి వున్నవాళ్ళకి కూడా ఓకే.  సల్మాన్  ఎత్తి ఎత్తి కొడుతూంటే చూడాలిగానీ,  సినిమాలో అసలు సరుకు ఎవరికవసరం?

-సికిందర్
http://www.cinemabazaar.in