1970 లలో ప్రారంభమై చరిత్రని మార్చేసిన ఇండియన్ కమర్షియల్ మసాలా సినిమాలు 2025 వచ్చేసరికల్లా ముసలి సినిమాలైపోయాయి. మసాలా సినిమాలు యాక్షన్, కామెడీ, రోమాన్స్, డ్రామా లేదా మెలోడ్రామాలతో వుంటూ, మ్యూజికల్ గానూ ఉర్రూతలూగించేవి. సప్తవర్ణాలతో కలర్ఫుల్ గానూ వుండడమూ వీటి ప్రధాన లక్షణం. ఈ సినిమాల్ని ఈస్ట్ మన్ కలర్ సినిమా లనేవాళ్ళు. కానీ టెక్నాలజీ మారేక గ్రేడింగ్ పేరుతో రంగులన్నీ ఎగ్గొట్టి రెండు మూడు డార్క్ కలర్స్ తో నింపేస్తున్నారు- వయోలెంట్ గా వుండేలా. ఇలా మసాలా తగ్గించేశారు.
నవరసాలు మసాలా సినిమాల ముడి పదార్ధాలే- అయితే కలర్స్ తగ్గించేసినట్టే నవరసాలు కూడా తగ్గించేసి ఒక్క వయోలెన్స్ నే ముడి పదార్ధంగా మార్చేశారు. మిగిలిన ఎనిమిది రసాలలో రోమాన్స్ వుంటుంది- తర్వాత ఆ ప్రేమ ఏమవుతుందో, హీరోయిన్ అడ్రసు లేకుండా ఎటెళ్ళి పోతుందో తెలీదు, స్టార్ వెళ్ళి విలన్ తో వయోలెన్స్ చేస్తూ బిజీ అయిపోతాడు. కామెడీ వుంటుంది- ఆ కామెడీ కమెడియన్లతో గాక స్టార్ తోనే వుంటుంది. ఇదికూడా ఏమైపోతుందో తెలీదు- స్టార్ వయోలెన్స్ తో బాక్సాఫీసు భక్తిని ప్రదర్శించడంలో బిజీ అయిపోతాడు. ఇలా వినోదాత్మక విలువల్ని వదిలేసి ఖడ్గం పట్టి శత్రువుల్ని నరుక్కుంటూ పోయి రక్తాలు పారిస్తాడు. ఆ తెగి పడేవి శత్రువుల తలలు కాదు- బాక్సాఫీసుని బ్రతికించే నవరసాల అమృత భాండాలే. పోనీ వయోలెన్స్ తోనైనా కథ తాలూకు భావోద్వేగాలుంటాయా అంటే- నరికేటప్పుడు మోహమంతా ఉగ్రరూపమే కదా అంటాడు.
ఈ నేపథ్యంలో విడుదలైన ‘మాస్ జాతర’ ఎంత కమర్షియల్ బాధ్యతగా వుందో చూద్దాం. రచయిత భాను భోగవరపు దర్శకుడుగా మారి మాస్ మహారాజా రవితేజ - డాన్సింగ్ డాల్ శ్రీలీల లతో తలపెట్టిన ఈ 90 కోట్ల బడ్జెట్ మూవీ కథ - ఒక రైల్వే పోలీస్ ఎస్సై, రైళ్ళ ద్వారా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ ని ఎలా అంతం చేశాడనేది. కథ వరంగల్ లో ప్రారంభమవుతుంది. అక్కడ లక్ష్మణ్ భేరి (రవితేజ) వరంగల్ లో రైల్వే ఎస్సై. చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో తాత హనుమాన్ భేరి (రాజేంద్ర ప్రసాద్) పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీసుగా తన పరిధిలోకి రాని అన్యాయాల్ని ఎదుర్కొనే సామాజిక స్పృహతో వుంటాడు. తను పెళ్ళి ప్రయత్నాలు చేస్తూంటే తాత చెడగొడుతూంటాడు. ఎందుకంటే ఈ మనవడు పెళ్ళి చేసుకుంటే తనని ఓల్డ్ ఏజి హోంలో పడేస్తాడని అనుమానం.
ఇలా వుండగా, లక్ష్మణ్ భేరి ఓ రాజకీయ నాయకుడి కొడుకుని కొట్టడంతో అక్కడ్నుంచి ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం అడవివరం స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఇలాగైనా తాతని వదిలించుకుంటే అడవివరంలో పెళ్ళికి అడ్డు వుండడని తాతని ఓల్డ్ ఏజి హోంలో పడేసి వెళ్ళిపోతాడు. అడవి వరంలో శివుడు (నవీన్ చంద్ర) అనే స్మగ్లర్ జనాల చేత గంజాయి పండిస్తూ కోల్ కతా కి స్మగ్లింగ్ చేస్తూంటాడు. అతడికి రాజకీయ వర్గాల, పోలీసు వర్గాల అండ దండిగా వుంటుంది. ఇతడి వ్యవహారాల్ని గమనించిన లక్ష్మణ్ భేరి అడ్డుకోవడం మొదలెడతాడు. పరిధి దాటి ఇన్వాల్వ్ అవుతున్న అతడికి పోలీసులు అడ్డుపడతారు.
ఇంకోవైపు లక్ష్మణ్ భేరి తులసి (శ్రీలీల) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా వుంటుంది. ఈ క్రమంలోశివుడి ముఠా పోలీసు అధికారిని చంపేయడంతో, లక్ష్మణ్ భేరి శివుడు రైల్లో స్మగ్లింగ్ చేస్తున్న గంజాయిని ఎత్తుకుపోయి దాచేస్తాడు. ఈ ఇంటర్వెల్ తర్వాత, లక్ష్మణ్ దాచేసిన గంజాయి కోసం శివుడు చేసే ప్రయత్నాల్ని లక్ష్మణ్ భేరీ ఎలా అడ్డుకున్నాడనేది సెకండాఫ్ కథ.
స్క్రీన్ ప్లే ట్రబుల్స్
ముందు కాన్ఫ్లిక్ట్ చూద్దాం…లక్ష్మణ్ భేరి శివుడు స్మగ్లింగ్ చేస్తున్న గంజాయిని ఎత్తుకుపోయి దాచేస్తే, ఆ గంజాయి కోసం శివుడు చేసే ప్రయత్నాల్ని లక్ష్మణ్ భేరీ అడ్డుకోవడమన్నది కాన్ఫ్లిక్ట్. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లో కూడా విలన్ దిగుమతి చేసుకున్నఆర్డీ ఎక్స్ ని ప్రకాష్ రాజ్ దాచేస్తే ఆ ఆర్డీ ఎక్స్ గురించి పోరాటమే. రెండూ ఒకటే. జీవం లేని కాన్ఫ్లిక్ట్ కాని కాన్ఫ్లిక్టులు. రెండూ ఫ్లాపయ్యాయి.
గంజాయి కోసం పోరాటం ఎవరికవసరం. ఇందులో ఏం ఎమోషన్ వుందని - ఎవరికి ఎమోషన్ వుందని -విలన్ శివుడికి తప్ప. అతడి ఎమోషన్ ప్రేక్షకుల ఎమోషన్ అవుతుందా? గంజాయిని దాచేయడంతో లక్ష్మణ్ కోల్పోయేదేమీ లేనప్పుడు, అతడితో ఎమోషనే లేనప్పుడు, సెకండాఫ్ కథని ఎవరు కేర్ చేస్తారు? మరేం చేయాలి? లక్ష్మణ్ భేరీ తాతని ముందుకు తేవచ్చు. లక్ష్మణ్ గంజాయి దోచుకోగానే, శివుడు లక్ష్మణ్ తాతని కిడ్నాప్ చేసి ఇరకాటంలో పెట్టొచ్చు. ఇలా ఇంటర్వెల్ ని లాక్ చేయొచ్చు. అప్పుడు జీవమున్నకాన్ఫ్లిక్ట్ లా వుంటుంది. ఇది రొటీనే అయినా తాత ప్రాణాలు బేరానికి పెడితే పుట్టే ఎమోషన్ నుంచి లక్ష్మణ్ తప్పించుకోలేడు. ప్రేక్షకులూ తప్పించుకోలేరు.
ఈ కాన్ఫ్లిక్ట్ లో తాతే ఎందుకు? లక్ష్మణ్ ప్రేమిస్తున్న తులసి ఎందుక్కాకూడదు? ఎందుకంటే శివుడు తులసిని బందీగా పెట్టుకుంటే కథలో ఎంటర్ టైన్మెంట్ పుట్టదు. ఈ సినిమా టైటిల్ ‘మాస్ జాతర’ అయినప్పుడు ఫక్తు ఎంటర్ టైన్మెంట్ కథే అవుతుంది తప్ప- మసాలా యాక్షన్ అవచ్చు తప్ప, విలన్ తో వయోలెంట్ యాక్షన్ కథ అవబోదు.
కామెడీగా వుండే తాతతో లక్ష్మణ్ కి పెళ్ళి విషయంగా ముందే కాన్ఫ్లిక్ట్ వుంది. ఆ కాన్ఫ్లిక్ట్ వుండగా శివుడు కిడ్నాప్ చేస్తే ఇంటర్వెల్లో ఊహించని ట్విస్టు పుడుతుంది. వరంగల్లో పెళ్ళికి అడ్డున్నాడని లక్ష్మణ్ తాతని ఓల్డ్ ఏజీ హోం లో పడేసి వస్తే, ఆ తాత తప్పకుండా పగబట్టే వుంటాడు. అలాటి తాతని శివుడు ఖర్మకాలి కిడ్నాప్ చేస్తే, లక్ష్మణ్ మోరల్ డైలమాలో పడతాడు. తాతని విడిపించుకుంటే అసలే పగబట్టి వున్న అతను ఇక ఎట్టి పరిస్థితిలో తన పెళ్ళి జరగనివ్వడు. విడిపించుకోక పోతే ఆ శివుడు తాతని చంపేస్తాడు - ఏం చేయాలి? తాత ప్రాణాలా, తన పెళ్ళి పెటాకులా? బందుత్వానికీ, స్వార్ధానికీ మధ్య అంతర్గతంగా మానసిక సంఘర్షణ. శివుడితో బహిర్గతంగా భౌతిక సంఘర్షణ. ఇలా పాత్రచిత్రణ సమగ్రంగా వుంటుంది.
ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి సెకండాఫ్ కవసరమైన కామెడీ సిట్యుయేషన్స్ అన్నీ ఏర్పడతాయి. గంజాయి కోసం శివుడి విలనీని లక్ష్మణ్ పెళ్ళి సమస్యకి ముడిపెట్టి -మధ్యలో తాతని బలి మేకని చేస్తే కావలసిన హాస్య ప్రహసనాలన్నీ పుడతాయి. ఆ కాన్ఫ్లిక్ట్ లో లక్ష్మణ్, శివుడు, తాత, తులసి చెరో వైపు లాగే శక్తులుగా గందరగోళం సృష్టిస్తే మాస్ మసాలా అంతా కుదిరి - ఇది బాక్సాఫీసుకి పనికిరాని గంజాయి గురించి జీవం లేని కథ కాకుండా, లక్ష్మణ్ పెళ్ళి గురించిన రోమాంటిక్ అప్పీలున్న ఆడియెన్స్ ఫ్రెండ్లీ కథయ్యే అవకాశ ముంటుంది.
ఇందుకే ఐడియాతో మొదలెట్టాలని…
ఈ కథ అనుకున్నప్పుడు ముందుగా ఐడియాని నిర్మించుకున్నట్టు లేదు. ముందు ఐడియాని వర్కౌట్ చేసి వుంటే కథ కథలా వచ్చేది. ఒక ఐడియా అనుకున్నప్పుడు దాంట్లో ప్లాట్ పాయింట్ వన్, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్ టూ -ఈ మూడు మలుపులూ వున్నాయా సరి చూసుకుంటే సమస్య వుండదు. మలుపులు కుదరక పొతే కుదిరేవరకూ దిద్దు బాట్లు చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే వన్ లైన్ ఆర్డర్ కి వెళ్ళాలి. లేకపోతే తప్పుల తడిక స్క్రీన్ ప్లే వస్తుంది.
ఐడియాగా ఈ కథని చూసినప్పుడు- లక్ష్మణ్ వరంగల్లో తాతని ఓల్డ్ ఏజీ హోం లో పడేసి వెళ్ళిపోయే సన్నివేశాన్ని తగిన సంఘర్షణతో హైలైట్ అయ్యేట్టు బలంగా సృష్టిస్తే -అది ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది. తర్వాత ఇంటర్వెల్లో లక్ష్మణ్ శివుడి గంజాయిని పట్టుకుని దాచేస్తే, దీనికి కౌంటర్ గా శివుడు వరంగల్ నుంచి తాతని ఈడ్చుకొస్తే, ఎత్తుకు పైయెత్తుతో కాన్ఫ్లిక్ట్ కి డెప్త్, ఊహించని ట్విస్టు, లక్ష్మణ్ కి మోరల్ డైలమాలతో బలమైన ఎమోషనూ ఇంటర్వెల్లో పుడతాయి. దీంతో సెకండాఫ్ కి కథనం సులువవుతుంది- అది వున్న కథని వ్యూహాత్మకంగా ముదుకు నడిపిస్తుంది. కథకంటే ముందు దాని ఐడియాని నిర్మించుకోవడమంటే స్క్రీన్ ప్లేకి పక్కా బ్లూ ప్రింట్ వేసుకోవడమే.కానీ దురదృష్టమేమిటంటే, స్క్రీన్ ప్లేలు స్ట్రక్చర్ స్కూల్లో గాక ఇంకా స్ట్రక్చర్ లేని క్రియేటివ్ స్కూల్లో తయారవుతున్నాయి. స్ట్రక్చరాశ్యులు టెలిస్కోపు కాదు కదా మైక్రోస్కోపు పెట్టి వెతికినా కనిపించడం లేదు…
మరి సెకండాఫ్ ఎలా సాగింది?
సెకండాఫ్ లో గంజాయి పోగొట్టుకున్న శివుడికి మాత్రమే గోల్ వుంది దాన్ని చేజిక్కించుకోవాలని. ఎక్కడ దాచాడో లక్ష్మన్ తో కక్కించేందుకు తులసి చేత చేపల పులుసులో మందు కలిపించి తినిపించే లాంటి సిల్లీ కామెడీలు చేస్తాడు. ఇక పదే పదే అతడి ముఠా లక్ష్మణ్ మీద ఎటాక్స్ చేస్తూంటారు. చివరికి ప్లాట్ పాయింట్ టూ సన్నివేశంలో గంజాయి దాచిన స్థావరాన్ని కనుక్కుని ఎటాక్ చేస్తారు ముఠా. అక్కడ తాత వుంటాడు తుపాకులు పెట్టుకుని. ఈ తాత వరంగల్ నుంచి ముందే వచ్చేసి కామెడీలు చేస్తూంటాడు లక్ష్మణ్ తో. ఇప్పుడు గంజాయికి కాపలా వున్న అతడి గతం రివీలవుతుంది మాజీ సైనికుడుగా. ఈ తాతని ముఠా చంపేసి గంజాయి దోచుకునేసరికి- క్లయిమాక్స్ మొదలవుతుంది. ఈ క్లయిమాక్స్ జాతరలో లక్ష్మణ్ శివుడిని చంపేసి సినిమాని ముగిస్తాడు.
ఈ సెకండాఫ్ లో లక్ష్మణ్ ఏమీ చేయడు. ఎందుకంటే పట్టుకున్న గంజాయితో ఏం చేయబోతున్నాడో గోల్ లేదు. వూరికే దాచిపెట్టాడు. ప్రభుత్వానికి అప్పజెప్పి శివుడిని అరెస్ట్ చేసే కామన్ సెన్స్ వుండదు. రవితేజ లాటి పెద్ద స్టార్ కి గోల్ లేని పాత్ర కచ్చా ఇచ్చారంటే రచనా సామర్ధ్యం ఏ స్థాయిలో వుందో గమనించ వచ్చు. శివుడి ముఠా ఎటాక్స్ చేస్తూంటే తిప్పికొట్టడమే పనిగా పెట్టుకున్న - సినిమా విజయానికి ఏ మాత్రం పనికిరాని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ అన్నమాట!
ఇక తులసికి శివుడిని సహకరిస్తున్న కథ వుంటుంది.అదేమిటంటే ఆమె అక్కని తనకిచ్చి పెళ్ళి చేయలేదని శివుడు బంధించాడు. అక్క క్షేమం కోసం తులసి శివుడు చెప్పినట్టు చేస్తోంది. ఇది కనిపెట్టిన లక్ష్మణ్ ఆ అక్కని విడిపిస్తాడు. తర్వాత గంజాయికి కాపలా వున్న తాతని చంపేస్తే జాతరలో శివుడిని చంపేస్తాడు, ఇంతే.
సెకండాఫ్ ప్రారంభంలో గంజాయి స్మగ్లింగ్ వెనుక రాజకీయనాయకులు ఎవరున్నారో కనుక్కోవాలంటాడు లక్ష్మణ్. ఈ విషయమే మర్చిపోతాడు. అయినా శివుడితో ముఠా కట్టిన రాజకీయ నాయకులెవరూ కన్పించరు కథలో. అసలు గంజాయిని దాచి పెట్టి ఏం చేయాలనుకుంటున్నాడో తనకే తెలీదు. ఈ తెలియని తనంతో తాతని కాపలా పెట్టి బలి తీసుకున్నట్టే అయింది పాత్రచిత్రణ!
ఫస్టాఫ్ డిటో
ఫస్టాఫ్ వరంగల్ రాజకీయాలతో బోరుగా సాగే రెండు యాక్షన్ ఎపిసోడ్లతో వృధాగా గడుస్తుంది టైము. తర్వాత పెళ్ళి ప్రయత్నాలు, వాటిని తాత చెడ గొట్టడాలు, రాజకీయ నాయకుడి కొడుకుని కొట్టాడని ట్రాన్స్ ఫర్ అవడం వగైరా జరిగి అడివి వరం వస్తాడు.
స్క్రీన్ ప్లే చేయడంలో అనుభవరాహిత్యం వల్ల మొదటి 25 నిముషాల సీన్లూ వృధాగా అనిపిస్తాయి. ఇంతవరకూ సీన్లు ఎత్తేసి లక్ష్మణ్ అడవివరంలో ఎంటరయ్యే సీనుతో ప్రారంభించివుంటే, అక్కడున్న వాతావరణం తో లక్షణ్ పాత్ర పట్ల సస్పెన్స్ పుట్టి ఇంటరెస్టింగ్ గా సాగేది కథ. తర్వాత ఫ్లాష్ బ్యాక్ వేసి వరంగల్లో అతడి జీవితం, తాతతో జరిగిన కథా చూపించ వచ్చు. కానీ అనుభవ రాహిత్యం వల్ల ఫస్టాఫ్ ని కూడా నీరు గార్చేశారు.
సినిమా సాంతం కథనం బోరుగా సాగడానికి కారణం డైనమిక్స్ లేకపోవడం. సీను- దానికి యాంటీ సీనూ అనే డైనమిక్స్ వుంటే అడుగడుగునా థ్రిల్ చేస్తూ సాగే అవకాశముంటుంది. పొతే సినిమాలో మాసే లేదు, ఇక జాతరే అన్పించదు. పాత్రల బలాబలాల సమీకరణ వుండుంటే ఈ పరిస్థితి వుండదు. కానీ హీరో సీరియస్ గా వుంటాడు, విలనూ సీరియస్ గానే వుంటాడు, మధ్యలో జోకర్లలాంటి అతడి ముఠా వుంటుంది. ఇందుకే మాస్ జాతర సాధ్యం కాలేదు. మాస్ జాతర హీరో చేతిలో వుండాలి. అంటే హీరో, అతడి అనుచరులూ కామెడీ క్యారక్టర్లుగా వుంటూ- విలన్ అతడి ముతా సీరియస్ క్యారక్టర్లుగా వుంటే - కామెడీ వర్సెస్ సీరియస్ అనే విభజనతో స్పష్టంగా బలాబలాల సమీకరణ జరిగి విజువల్ అప్పీల్ వుంటుంది.
ఇంతకీ మాస్ జాతర సీన్లు ఎలా వుంటాయి? అక్టోబర్ లో విడుదలైన తమిళ ‘డ్యూడ్’ లో ప్రారంభంలో ప్రియురాలి పెళ్ళికి వెళ్ళే హీరో ప్రదీప్ రంగనాథన్ అక్కడ సృష్టించే రచ్చ, నానా అల్లరీ, ప్రియురాలి తాళి తెంపిసి తన్నులు తినబోయే కామెడీ ఎక్స్ ప్రస్ స్పీడుతో ఎలా వుంటుందో అదేమాస్ జాతర సీనంటే. మాస్ జాతరలో లేనిది ఇలాటి సీన్లే!
-సికిందర్
.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)