రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 24, 2019

851 : స్క్రీన్ ప్లే సంగతులు


          ‘ఇస్మార్ట్ శంకర్’ తో క్రియేటివ్ యాస్పెక్ట్ ని పక్కన బెట్టి కేవలం మార్కెట్ యాస్పెక్ట్ పట్టుకుని వర్కౌట్ చేసుకున్నారు. ఈ మార్కెట్ యాస్పెక్ట్ కి తొలిసారిగా ఒక పాపులర్ స్టార్ పూర్తి స్థాయి తెలంగాణా రఫ్ మాస్ క్యారక్టర్ వేయడం క్రేజీ ఆకర్షణయింది. ఆ పాపులర్ స్టార్ రామ్ అనే ఒక ఎనర్జిటిక్ సాఫ్ట్ హీరో కావడం సర్ప్రైజ్ ఎలిమెంటైంది. మాస్ ప్రేక్షకుల్లో పేరున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పాపులారిటీ తోడయ్యింది. పాత కంటెంట్ నే రాం హైపర్ క్యారక్టరైజేషన్ తో కమర్షియల్ గా ఇన్నోవేట్ చేయడం ప్లస్ అయింది. ఇలా సినిమాలో కంటెంట్ ని కాకుండా కేవలం స్టార్ ఇమేజిని మేకోవర్ చేసి, స్టార్ ని మాత్రమే మార్కెటింగ్  సరుకుగా చేసి - అదీ యువ ప్రేక్షకుల్లో కేవలం బాయ్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ -మార్కెట్ కి అమ్మడమనే వ్యూహం గురి తప్పకుండా హిట్టయింది.

          లా ఈ మధ్యకాలంలో క్రియేటివ్ యాస్పెక్ట్ తో కాకుండా కేవలం హైపర్ క్యారక్టరైజేషన్ ని పట్టుకుని సక్సెస్ అయిన మూవీ ఇంకొకటుంది. అది మారుతీ దర్శకత్వంలో నాని నటించిన ‘భలేభలే మగాడివోయ్’ అనే రోమాంటిక్ కామెడీ. ఇందులో నాని పోషించిన మతిమరుపు పాత్ర స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నే ఎగేసి, సినిమా సాంతం థ్రిల్ చేస్తూ, తన చేష్టలతో పది నిమిషాలకో బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ పోతుంది. చాలా పూర్వం హాలీవుడ్ లో ఈజిప్షియన్ నిర్మాత ఫువాద్ సయీద్ ఒకటే చెప్పే వాడు- మీరు కథ ఏం చేసుకుంటారో నాకనవసరం, నాకు మాత్రం హీరోతో  పది నిమిషాలకో బ్యాంగ్ పడాలని. ఇలా హిట్టయినవే ఎడ్డీ మర్ఫీ నటించిన ‘బేవర్లీ హిల్స్ కాప్’  సిరీస్ సినిమాలు.

          క్రియేటివ్ యాస్పెక్ట్ కొచ్చేసరికి ఇస్మార్ట్ శంకర్ రొటీన్ గానే పూరీకి చేతనయ్యే కొత్తదనం లేని అదే పాత మూస ఫార్ములా టెంప్లెట్ కథగానే వుండిపోయింది. ఒక సీఎం సొంత తండ్రిని హీరో చేత చంపించడం, ఆ గుట్టు బయటపడకుండా ఆ హీరోని చంపాలని చూడ్డం, ఈ ప్రయత్నంలో హీరోయిన్ ని చంపేస్తే హీరో పగబట్టడం...ఇలా ఏనాటిదో కథ. దీనికి హీరోకి ‘మెమరీ మార్పిడి’ అనే కొత్త పాయింటుని హాలీవుడ్ మూవీలోంచి లేపి వాడారు. ఏ కొత్త పాయింటు నైనా  మళ్ళీ అదే పాత మూస ఫార్ములా కథకే జోడించడం మినహా, ఇంకే వైవిధ్యాన్నీ అందించలేని వేళ్ళూనిన అశక్తతకి కొనసాగింపు ఇది ...

          ప్రయోగించిన మార్కెట్ యాస్పెక్ట్ కి జోడించిన క్రియేటివ్ యాస్పెక్ట్ లోని లోపాల్ని మరిపించడానికి, ఇన్నోవేట్ చేసిన హీరో తెలంగాణా పాత్రని ఒవరాక్షన్ తో, వీలయినంత వెకిలి విన్యాసాలతో, పూనకపు డాన్సులూ పాటలతో, మొరటు రోమాన్సుతో, అశ్లీల పంచ్ డైలాగులతో, హై వోల్టేజి యాక్షన్ సీన్లతో నింపేశారు. ఇంత చేసినా ఈ హైపర్ క్యారక్టరైజేషన్ తో పైన చెప్పుకున్న నాని పాత్రలాగా పది నిమిషాలకో బ్యాంగు పడలేదు, ప్రతీ పదిహేను నిమిషాలకోసారి ఫైటా ఫైటీ యాక్షన్ సీన్లే పడ్డాయి. 

          ఈ కథ ఒక ట్విస్టు మీద ఆధారపడ్డ కథ. హీరో మెదడులో ఇంకొకరి జ్ఞాపకాలతో కూడిన చిప్ ని అమర్చి వాడుకోవాలనుకునే ఈ ట్విస్టు ఇంటర్వెల్లో వస్తుంది. ఐతే ఇక్కడ్నించే సెకండాఫ్ కంటెంట్ ఖల్లాస్ అయింది. ‘నిను వీడని నీడను నేను’ లో ఇలాటిదే ట్విస్టుని మేనేజి చేయలేకే సెకండాఫ్ ని గందరగోళం చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వేరు, ఇంటర్వెల్ ట్విస్టు వేరు. ఈ రెండిటి మధ్య తేడా గ్రహించకపోవడంతో, సెకండాఫ్ ని ఇంకెంత థ్రిల్లింగ్ గా మార్చవచ్చో పూరీ తెలుసుకోలేదు. ఆఫ్ కోర్స్, ఆయన టార్గెట్ కంటెంట్ కాదు, క్యారక్టరే.

ముందుగా హాలీవుడ్ మూవీ కథ 
   ఒక రిచ్ స్పానిష్ అరాచకవాది ఈ ప్రపంచాన్నిఅంతమొందించాలనుకుని ఒక హ్యాకర్ ని నియమిస్తాడు. ప్రపంచ దేశాల్లోని అణు డిఫెన్స్ కోడ్స్ ని బైపాస్ చేసే ప్రోగ్రాంని రూపొందించేందుకు. అరాచకవాది కుట్ర పసిగట్టిన హ్యాకర్ పారిపోయి సీఐఏ ఏజెంట్ కి చెప్పేస్తాడు. ఆ ప్రోగ్రాం ఏజెంట్ కి అందించాలంటే డబ్బుతో బాటు తనకో కొత్త ఐడెంటిటీ నివ్వాలని. హ్యాకర్ ని ఒకచోట దాచిన సీఐఏ ఏజెంట్ ని అరాచకవాది ముఠా పట్టుకుంటారు. హ్యాకర్ ని దాచిన చోటు చెప్పమని చిత్రవధ చేసి చంపేస్తారు. 

          దీంతో సీఐఏ బాస్ ఎలర్ట్ అవుతాడు. ఇప్పుడు హ్యాకర్ ని పట్టుకోవాలంటే ఆ సమాచారం తెలిసిన ఏజెంట్ డెడ్ బాడీ లోంచి మెమరీని ట్రాన్స్ ఫర్ చేయాలని న్యూరో సర్జన్ ని ఆదేశిస్తాడు. జ్ఞాపకాల మార్పిడి మీద పరిశోధనలు చేస్తున్న న్యూరో సర్జన్, ఒక కరుడు గట్టిన క్రిమినల్ మెదడులోకి ఏజెంట్ మెదడులోని మెమరీని మార్చేస్తాడు. 

          ఈ క్రిమినల్ కి చిన్నప్పుడు దెబ్బ తగిలి ఎమోషన్స్, స్కిల్స్, మెమరీ పవర్ వంటివి సరిగ్గా పనిచేయవు. వాడి బ్రెయిన్లో కంట్రోల్ ప్యానెల్ పనిమానేసి కూర్చుందన్న మాట. ఇప్పుడు సీఐఏ ఏజెంట్ మెమరీ చిప్ ని తనకి అమర్చాక కొత్తగా లేచి కూర్చుంటాడు. హ్యాకర్ గురించి తనకేమీ జ్ఞాపకం రావడం లేదని అనడంతో, వీణ్ణి వెంటనే చంపెయ్యమని ఆదేశిస్తాడు సీఐఏ బాస్.

          తప్పించుకు పారిపోయినక్రిమినల్ సీఐఏ ఏజంట్ లాగే బిహేవ్ చేస్తాడు. ఆ ఏజంట్ ఎమోషన్స్, స్కిల్స్ వచ్చేస్తాయి. వాటితో దొరక్కుండా తప్పించుకుంటూ ఆ చనిపోయిన ఏజెంట్  భార్యని కలుసుకుంటాడు...

 
         ఇక్కడ్నించీ ఏజెంట్ జ్ఞాపకాలతో పర్సనల్ కథగా మారిపోతుంది. సెకండాఫ్ ఈ మూవీలో కూడా దెబ్బతింది. నటించింది ప్రముఖ స్టార్ కెవిన్ కోస్టనర్ అయినా ప్రేక్షకులకి ఈ కథ నచ్చలేదు. 31.5 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 38.8 మిలియన్ డాలర్ల కలెక్షన్లు మాత్రమే  వచ్చాయి. రేటింగ్స్ 2, 1, వరస్ట్ అని ఇచ్చారు. “నేనీ సినిమా చూసిన జ్ఞాపకాలని చేరిపివేసే ప్రక్రియని సైంటిస్టులు కనుగొంటే బావుణ్ణు” అని ఒక రివ్యూ రైటర్ సెటైరేశాడు. 

          చనిపోయిన ఏజంట్ జ్ఞాపకాలని హీరోకి ఎక్కించి హ్యాకర్ ని పట్టుకోవాలన్న ప్లాను సీఐఏది. అప్పుడా హీరో ఏజెంట్ జ్ఞాపకాలతో ప్రవర్తించడమంటే ప్రత్యర్ధుల చేతిలో కీలుబొమ్మగా మారిపోవడమే. అంటే అంతవరకూ క్రిమినల్ గా వున్న యాక్టివ్ పాత్ర ఉత్త పాసివ్ పాత్రగా మారిపోవడమే. ఇలా జ్ఞాపకాల మార్పిడి కథకి బ్యాంగ్ కాదు, ట్విస్టు అని గ్రహించకపోవడం వల్ల ఇలా జరిగింది. బ్యాంగులో కథకి కొత్త మలుపు వుంటుంది, ట్విస్టులో కథకి ముడి పడ్డం వుంటుంది. బ్యాంగుతో కథ కొత్త మలుపు తిరగడంతో ఆ మలుపు ననుసరించే తర్వాతి కథ దానికదే కొనసాగుతుంది. ట్విస్టుతో కథకి ముడి పడడంతో కథ ముందుకెళ్లదు. అక్కడికక్కడ ముడి విప్పితేనే ముందుకెళ్తుంది. 

          అంటే తనలో ఏజెంట్ జ్ఞాపకాలని నింపిన వాళ్ళమీద తిరగబడి, తన జీవితాన్ని తను క్లెయిమ్ చేసుకుంటూ, ఏజెంట్ జ్ఞాపకాలకి విరుగుడు కనిపెట్టే ప్రయత్నాలతో ప్రత్యర్ధుల్లో అలజడి రేపాలి. అప్పుడు యాక్టివ్ పాత్రగానే కొనసాగుతాడు.

          ఈ టైపు ట్విస్టు కి విరుగుడు ‘ఫేస్ ఆఫ్’ లో చూడొచ్చు. హీరో టెర్రరిస్టుని పట్టుకుని తరలిస్తూంటే వాడు విమాన ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆ టెర్రరిస్టు నెట్వర్క్ ని ఛేదించాలని హీరో తన రూపాన్ని టెర్రరిస్టు రూపంగా సర్జరీ చేయించుకుంటాడు. హీరో టెర్రరిస్టు రూపంగా మారి తనకి ఎసరు పెడుతోంటే, బతికున్న టెర్రరిస్టు హీరో రూపంలో వచ్చి అలజడి సృష్టిస్తాడు.  

          ఇలా ఫేస్ ఆఫ్ కథయినా, బ్రెయిన్ ఆఫ్ కథైనా, బాధిత పాత్ర తన ఐడెంటిటీ కోసం జరిపే పోరాటంగానే వుంటుంది తప్ప, ఆ రెండో వ్యక్తిగా మారిపోయి స్ట్రగుల్ చేసే పాసివ్ కథగా వుండదు. 

తెలుగు మూవీ కథ 
     ఒక  హత్య కేసులో జైల్లో వున్న శంకర్ (రామ్) తప్పించుకుని పారిపోతాడు. గతంలో తను ప్రేమించిన చాందినీ (నభా పటేల్) గుర్తుకొస్తుంది. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ రుబాబుగా బతుకుతున్న శంకర్, చాందినీని విపరీతంగా ప్రేమిస్తాడు. ఇంతలో కాకా అనే చిన్నప్పట్నుంచీ శంకర్ని పెంచినతను ఒక హత్య చేయమని డబ్బిస్తాడు. ఆ డబ్బు తీసుకుని సీఎం తండ్రి (పునీత్ ఇస్సార్) ని చంపిన శంకర్, చాందినీతో ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్ళిపోతాడు. అప్పుడు సీఎం (దీపక్ శెట్టి), ఇతడి మామ (ఆశీష్ విద్యార్థి). ఇద్దరూ శంకర్ ని చంపి సాక్ష్యం లేకుండా చేయాలనీ గోవాకి పోలీసుల్ని పంపుతారు. ఆ పోలీసుల దాడిలో చాందినీ చచ్చిపోయి, శంకర్ దొరికిపోయి జైలుకి పోతాడు. 

          ఇప్పుడు జైల్లోంచి పారిపోయిన శంకర్ చాందినీ చావుకి కారకులైన వాళ్ళ మీద పగబడతాడు. మరోవైపు సీబీఐ అధికారి ( సాయాజీ షిండే) సీఎం తండ్రి  వెనుక కుట్రదారుల్ని కనుక్కోవడానికి అసిస్టెంట్ అరుణ్ (సత్యదేవ్) తో ప్రయత్నాల్లో వుంటాడు. శంకర్ నీ, అరుణ్ నీ లేపెయ్యడానికి కుట్రదార్లు ప్లాన్ చేసి ఎటాక్ చేస్తారు. ఇద్దరూ చావుబతుకుల్లో వుంటారు. అరుణ్ ప్రేమిస్తున్న సారా (నిధీ అగర్వాల్) సైంటిస్టు. ఆమె జ్ఞాపకాల మార్పిడి పైన పరిశోధన చేస్తూంటుంది. సీబీఐ ఆఫీసర్ చనిపోతున్న అరుణ్ మెమరీని శంకర్ కి ట్రాన్స్ ఫర్ చేయమని ఆదేశిస్తాడు. కుట్ర దారుల్ని పట్టుకోవాలంటే అరుణ్ మెమరీ చాలా అవసరమంటాడు. అలా అరుణ్ మెమరీతో వున్న చిప్ ని శంకర్ మెదడులో అమరుస్తుంది సారా. కళ్ళు తెర్చిన శంకర్ సగం తన జ్ఞాపకాలతో, సగం అరుణ్ జ్ఞాపకాలతో విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలెడతాడు...

          ఇలా అరుణ్ జ్ఞాపకాల్ని బలవంతంగా శంకర్ కి ఎక్కించే ఈ ఇంటర్వెల్ సీను కూడా బ్యాంగ్ కాదు, ట్విస్టు. బ్యాంగ్ అయితే మొదట్నుంచీ దీనికి ప్లానింగ్ వుంటుంది. ఇక్కడ ముందస్తు ప్లానింగ్ లేదు. జ్ఞాపకాల్ని మార్చాలన్న నిర్ణయాన్ని అప్పటికప్పుడు తీసుకుని అమలు చేశారు. కాబట్టి ఇది అనూహ్యంగా వచ్చిన సీను. అనూహ్యంగా వచ్చేసీను ట్విస్టు అవుతుంది.

         ఈ ట్విస్టులో కూడా ఏం చేశారంటే, అరుణ్ జ్ఞాపకాలు పూర్తిగా ఎక్కవనీ, కొద్ది కొద్దిగా మాత్రమే ఎక్కుతాయనీ కండిషన్స్ అప్లయి లాంటి క్లాజు పెట్టుకున్నారు. అంటే ఈ ట్విస్టుతో శంకర్ ని అరుణ్ గా మార్చడం దర్శకుడికే మాత్రం ఇష్టం లేదు. ఫస్టాఫ్ లో వూర మాస్ హంగామా చేసిన శంకర్ పాత్ర మీదే మమకారం పెంచుకుని, సెకండాఫ్ లో దాంతో కాసేపు శంకర్ గా సరదా తీర్చుకుంటూ, అప్పుడప్పుడు అయిష్టంగా అరుణ్ గా మారుస్తూ పోయారు. 

          ఇలా ట్విస్టుకి అర్ధం లేకుండా కూడా చేశారు. శంకర్ పూర్తిగా అరుణ్ గా మారకపోతే ట్విస్టు ఎందుకు?  క్రిమినల్ లో లాగా, ఫేస్ ఆఫ్ లోలాగా రోల్ రివర్సల్స్ లేకపోతే కథకి అర్థమే లేదు. తనలో ఎవరివో జ్ఞాపకాల్ని నింపి తను ప్రేమించే తన ఐడెంటిటీని మార్చేసిన వాళ్ళ మీద తిరగబడి, ఫాల్స్ ఐడెంటిటీనివదిలించుకునే కథగా వుండాల్సింది...ఈ ఆలోచనే లేక పాసివ్ గా మారిపోయాడు శంకర్. సెకండాఫ్ లో తనలో అరుణ్ ని కూడా మోస్తూ అదే శంకర్ గా చనిపోయిన హీరోయిన్ జ్ఞాపకాలతో క్లయిమాక్స్ వరకూ కాలక్షేపం చేశాడు.

సికిందర్