రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, డిసెంబర్ 2018, సోమవారం

713 : స్క్రీన్ ప్లే సంగతులు


          చాలా కామన్ సెన్స్ – ఐడియాని ప్లాన్ చేసుకోకపోతే సినిమా ఫ్లాపే. ఈ బేసిక్స్ ని ఎవ్వరూ ఛాలెంజి చేయలేరు. ఐడియాని ప్లాన్ చేసుకోక పోతే సినిమా అట్టర్ ఫ్లాపే. ఇంకో మాటే లేదు. క్రియేటివ్ స్కూల్లోంచి  స్ట్రక్చర్ స్కూల్లోకి వచ్చినప్పుడే హిట్ ఫ్లాపులు అర్ధమవుతాయి. అంతవరకూ చీకట్లో బాణాలేయడమే. సొంత వైద్యంలాంటి క్రియేటివ్ స్కూళ్ళే  సినిమాల్ని చూడలేకుండా చేస్తున్నాయి. క్రియేటివ్ స్కూలు గుండు గుత్త ధోరణిలో వుంటుంది. స్ట్రక్చర్ స్కూల్లో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వుంటుంది. ముందు ఐడియా మూల్యాంకన వుంటుంది. ఈ ఐడియాకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా? ఇందులో యూత్ అప్పీల్ ననుసరించి రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, లేదా రెండూ ప్లే అవుతున్నాయా? ఇప్పటి యూత్ కి సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ ఇదే. ‘హుషారు’ లో ఎకనమిక్స్ చక్కగా ప్లే అయింది. జేబునిండా డబ్బు, చేతినిండా అమ్మాయీ, వీటికోసం పాట్లు - ఇవే తెర మీద చూడాలని కోరుకుంటారు ఈ కాలం కుర్రకారు.  తర్వాత ఐడియాకి స్ట్రక్చర్ వుందా? ఇది పనికొచ్చే కథేనా, లేక పనికిరాని గాథా? ఇందులో ప్లాట్ పాయింట్ వన్ కి యూత్ అప్పీల్ వుందా? ...ఇలా స్టెప్ బై స్టెప్ బేరీజు వేసినప్పుడు ఐడియా దశలోనే సినిమా భవితవ్యం తేలిపోతుంది. సినిమా మొత్తం తీసి, విడుదల చేసి, అది ఫ్లాపయ్యాక గానీ తీసింది ఫ్లాప్ కథ అని తెలియకపోవడం అంతా ఏదో సామెత చెప్పినట్టు వుంటుంది. 

         
స్ట్రక్చర్ గ్యారంటీగా సక్సెస్ నిస్తుందా అంటే, స్ట్రక్చర్ ని ఫాలో అయ్యే హాలీవుడ్ లోనే 50 శాతానికి మించి సక్సెస్ లేదు. కానీ 50 శాతం సక్సెస్ అంటే గ్రేటే. స్ట్రక్చర్ ని ఫాలో అవని టాలీవుడ్ లో పది శాతం కూడా సక్సెస్ లేదుగా? ముందు స్ట్రక్చర్ కథకి ఓ అర్ధం పర్ధం సమకూరుస్తుంది. దీంతో ఎంత సక్సెస్ అవుతుందనేది ఆ  స్ట్రక్చర్ తో వుండే కథతో చూపెట్టే క్రియేటివ్ యాస్పెక్టే నిర్ణయిస్తుంది.  మళ్ళీ ఈ క్రియేటివ్ యాస్పెక్ట్  స్ట్రక్చర్ లాగా శిలాసదృశం కాదు, అప్పుడున్న మార్కెట్ యాస్పెక్ట్ ని బట్టి కథకథకీ వేర్వేరు కళా ప్రదర్శన చేస్తుంది. స్ట్రక్చర్ పెద్ద వాళ్ళు ఇచ్చింది, దాంతో కళా ప్రదర్శన చిన్న వాళ్ళు చేసుకోవాలి. స్ట్రక్చర్ లేని కళా ప్రదర్శన ఫ్లాపే. స్ట్రక్చర్ వున్నా దాంతో కళా ప్రదర్శన చేసుకుంటూ హాలీవుడ్ 50 సక్సెస్ ని తాక గల్గుతోంది. క్రియేటివ్ యాస్పెక్ట్ లేదా కళా ప్రదర్శనేది ఏ దర్శకుడికా దర్శకుడు, ఏ రచయితకా రచయిత సొంత శక్తి యుక్తులతో తమలోంచి వెలికి తీయాల్సిన సృజనాత్మక పార్శ్వమే. కాబట్టి హాలీవుడ్ లోనైనా 100 శాతం సక్సెస్ కి గ్యారంటీ ఇవ్వలేరు. ఇక స్ట్రక్చరే లేకపోతే ఉత్త క్రియేటివిటీతో   ఒక్క శాతం సక్సెస్ కూడా ఇవ్వలేరు.  ఇందుకే వారంవారం తెలుగు సినిమాలు పేక మేడల్లా టపటపా కూలిపోతున్నాయి. ఉత్త క్రియేటివిటీతో పేకమేడలే లేస్తాయి. స్ట్రక్చర్ వుంటే పునాదులూ సిమెంట్ గోడలూ నిలుస్తాయి. 

        స్ట్రక్చర్ దృష్టికోణంలో ఐడియా ఆలోచిస్తే ప్రధాన కథ ఉపకథ అయిపోదు. స్ట్రక్చర్ = కామన్ సెన్స్, అంతే. చింతపండు తెమ్మని  బజారుకి పంపిన పనిపిల్ల చింత పండే తెస్తుంది. చీపురు కట్టతో వస్తే ఇల్లు గలావిడకి నచ్చదు, డిస్సపాయింటవుతుంది. చీపురు కట్టని చింత పండుగా మార్చమని రివ్యూ రాసిస్తుంది. రివ్యూ పని పిల్లకేం అర్ధమవుతుంది, పని పిల్లకదా – అందుకని చీపురు కట్ట తిరగేసి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాల్సి వస్తుందేమో. పనిపిల్ల కిది వుండాల్సిన కామన్ సెన్స్. ఒక స్ట్రక్చర్ లో పని చేసుకుపోవడం. అలాగే మాంచి లిప్ లాక్స్ తో కూడిన హాట్ హట్ ఎరోటిక్ లవ్ స్టోరీ జమాయించి చూపిస్తామని పిల్చి, బానిసల తిరుగుబాటు చూపిస్తే ప్రేక్షకులకీ నచ్చదు. యూత్ ఆడియెన్స్ కేం పనీపాటా లేదా? ఒకప్పుడు నిరుద్యోగం వల్ల కమ్యూనిజం, నక్సలిజం ఆకర్షించి అలాటి ఎర్ర డప్పు విప్లవ సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడూ? మూలమూలనా గ్లోబలైజేషన్ ఫలాలనుభవిస్తూ, వాటి ఆకర్షణలో పడి పరవళ్ళు తొక్కుతున్నారు. ఎక్కడెక్కడి ఆకలిదప్పుల ప్రాంతీయ ఆర్టు సినిమాలూ మూలనబడ్డాయి. దేశంలో 18 ప్రాంతీయ భాషల్లో ఆర్టు సినిమాలుంటే అవన్నీ కమర్షియల్ సినిమాలుగా మారిపోయాయి. ఇదివరకు లేని ఛత్తీస్ ఘర్, ఉత్తారఖండ్ వంటి ప్రాంతాల్లో కూడా మల్టీ ప్లెక్సులు వెలిశాయి. కర్ణాటకలోని ప్రాంతీయ తుళు భాషా సినిమాలు, తమిళనాడులోని  ప్రాంతీయ బడుగ భాషా సినిమాలూ కమర్షియల్ ఫీల్డులో కొచ్చేశాయి. ఇలా వుంటే, తెలంగాణాలో ఇంకా ఆర్టు సినిమాలు తీయాలన్నఆలోచనలున్నాయి. ఇదిక  కుదిరేపని కాదు. 

          ఇదంతా మార్కెట్ యాస్పెక్ట్.  దీన్ని కాదని బానిస బాధల కథ ఎలా చూపిస్తారు. మార్కెట్ కి ఇప్పుడేం కావాలో అదివ్వాలా వద్దా? ఇలాటి విప్లవ సినిమాలు ఒక సెక్షన్ గా ఆర్. నారాయణ మూర్తి తీస్తూంటారు, ఆయనకి వదిలేయాలి. ఆయనకదే పని కాబట్టి.  ‘భైరవ గీత’ బానిసల కథ 1991 లో నిజంగా జరిగిందన్నారు. దీన్ని ఒప్పుకున్నా, ఈ చెప్పిన ప్రకారమే బానిసల తిరుగు బాటుకి ఓ ప్రేమకథ ప్రేరణ అయినప్పుడు, బాక్సాఫీలు అప్పీల్ కి కొమ్ముకాసే ఆ ప్రేమ కథని మధ్యలో వదిలేసి, ఎలా బానిసల కథని ప్రధానంగా చేసి చూపిస్తారు, దానికే ముగింపు నెలా ఇస్తారు. ‘లగాన్’ కూడా బానిసల కథే. దాన్ని క్రికెట్ తో వినోదాత్మకంగా ఎందుకు చూపించారు? ‘గోల్డ్’ కూడా అండర్ డాగ్స్ కథే. దాన్ని హాకీతో కలిపి ఎందుకు వినోద పర్చారు? సామాజిక సమస్యల్ని ఉన్నదున్నట్టు సామజిక సమస్యలుగానే  చూపిస్తే ఆర్ట్ సినిమా అవుతుంది. సామాజిక సమస్యలకి షుగర్ కోటింగ్ వేసి ఎంటర్ టైన్ చేస్తే కమర్షియల్ సినిమా అవుతుంది కదా? ఇందులో తప్పేమైనా వుందా? 

          ‘భైరవ గీత’ ని ఆర్ట్ సినిమాగా తీయాలనుకుని వుండరు. తెలుగులో ఎవ్వరూ ఆర్ట్ సినిమాలు తీయాలనుకోరు. కానీ తీస్తున్న ఎన్నో స్టార్ సినిమాలు కూడా కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే. ఇది ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఇది బుద్ధిపూర్వకంగా చేస్తున్నారని కాదు, కమర్షియల్ సినిమా తీస్తున్నామనుకుని ఆర్ట్ సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఈ సమస్యకి మూలం క్రియేటివ్ స్కూల్లో వుంది. స్ట్రక్చర్ స్కూల్లో ఇలా కమర్షియల్ సినిమాలు ఆర్టు సినిమాలుగా తయారు కావు. ఎందుకంటే ఐడియా దగ్గరే పట్టేస్తుంది స్ట్రక్చర్. క్రియేటివ్ స్కూలు చలి మంటేసుకుని తలా ఓ కట్టె పుల్ల వేయడం లాంటిది. మిగిలేది బూడిదే. క్రియేటివ్ స్కూలు ఇంకో కుటీర పరిశ్రమే టెంప్లెట్ స్కూలు. ఇది వేరే టాపిక్.
***
ప్రధాన కథ – ఉప కథ
     భైరవ రాయలసీమ భూస్వామి సుబ్బారెడ్డి దగ్గర బానిసలా పని చేస్తూంటాడు. ఇది తాతలు తండ్రుల నుంచీ సంక్రమించిన బానిసత్వం. భైరవకి పేదరికంలో మగ్గుతున్న తల్లి వుంటుంది. ఇంతలో సిటీలో చదువుకుంటున్న సుబ్బారెడ్డి కూతురు గీత వూళ్ళోకి వస్తుంది. ఆమెని చూడగానే ప్రేమలో పడిపోతాడు. కానీ బయటపడకుండా జాగ్రత్త పడతాడు. ప్రత్యర్థులతో ఒక ప్రమాదకర పరిస్థితి నుంచి ఆమెని కాపాడతాడు. ఆమె ప్రేమలో పడుతుంది. కానీ వ్యక్తం చేయదు. ఇంతలో కట్టారెడ్డి అనే ఎదుటి ఫ్యాక్షనిస్టు కొడుకుతో గీతకి సంబంధం కుదుర్చుకుంటాడు సుబ్బారెడ్డి. ఈ శుభాకార్యంలో భైరవ ఏదో తేడాగా ప్రవర్తించాడని కొడతాడు కట్టారెడ్డి. ఇది తాళలేక కట్టారెడ్డిని కొట్టేస్తుంది గీత. ఇక భైరవనే చేసుకుంటానని తెగేసి చెప్పేస్తుంది. దీంతో భైరవని చంపెయ్యమని ముఠాని పురమాయిస్తాడు ఆమె తండ్రి. గీత భైరవతో పారిపోతుంది. ఇదీ స్థూలంగా ఫస్టాఫ్ కథ. 

     
ఈ ఫస్టాఫ్ సీన్లు ఎలా పడ్డాయో చూద్దాం :    
 బిగినింగ్ విభాగం
          *ప్రపంచంలో యుద్ధాలకి కులం కాదు, మతం కాదు కారణమని, ఉన్నోడికీ  లేనోడికీ మధ్యే యుద్ధాలనీ వాయిసోవర్ తో ప్రారంభం.
          *బానిసగా భైరవ జీవితం పరిచయం, అతడికో తల్లి.
          *భైరవ యజమానిగా సుబ్బారెడ్డి పరిచయం, కింది కులాలంటే అతడికున్న అక్కసు.
          *ప్రత్యర్థి కేశవరెడ్డితో సుబ్బారెడ్డి కోడి పందాల్లో ఓడిపోవడం, అతడి కొడుకు కట్టారెడ్డిని తన కూతురికి అడగడం.
          *ఒక బానిసని క్రూరంగా చంపి కట్టా రెడ్డి పరిచయం.
          *సిటీలో చదువుకుంటున్న సుబ్బారెడ్డి కూతురు గీత రావడం, ఆమెని చూసి భైరవ ప్రేమలో పడడం.
          *భైరవతో, మరికొందరు బానిసలతో, గీత వూరి పరిసరాల విహారానికి బయల్దేరడం, పాట.
          *పాట పూర్తవగానే,  గీత మీద ఆమె తండ్రి అజ్ఞాత శత్రువుదాడి, భైరవ ఆమెని కాపాడడం, ఆమె ప్రేమలో పడడం.
          *కూతురు మీద దాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సుబ్బారెడ్డి, అజ్ఞాత శత్రువెవరో  తెలీక, తన దగ్గరున్న బానిసని నిప్పంటించి చంపడం, వీడి హస్తముందని ప్రకటించుకోవడం.
          *గీతమీద దాడి సంగతి భైరవ తల్లికి చెప్తే, ఆమె ఆందోళన చెందడం.
          *ప్రేమలో తియ్యటి కలల్లో వున్న గీతకి, తల్లి ఎంగేజ్ మెంట్ సంగతి చెప్తే, గీత ఆందోళన చెంది నో అనడం.
ప్లాట్ పాయింట్ వన్ సీను :
          *ఎంగేజి మెంట్ కి కట్టారెడ్డి అట్టహాసంగా మందీ మార్బలంతో రావడం. గతి లేక గీత తలవంచడం. అప్పుడేదో పొరపాటు జరిగిందని భైరవని కట్టారెడ్డి కొట్టడం, దీంతో గీత కట్టారెడ్డి చెంప మీద కొట్టడం. ఆవేశపడ్డ కట్టారెడ్డిని సుబ్బారెడ్డి శాంతపర్చి పంపడం.  
మిడిల్ విభాగం : 
          *గీత ఈ పెళ్లి చేసుకోనని, భైరవనే చేసుకుంటానని తండ్రి సుబ్బారెడ్డికి చెప్పేయడం, ఎక్కడున్నా భైరవని వెతికి చంపెయ్యమని సుబ్బారెడ్డి ఆదేశాలివ్వడం.
          *సుబ్బారెడ్డి అనుచరులు భైరవని వెతకడం.
          *గీత పారిపోయి వచ్చి భైరవని కలుసుకోవడం. పెళ్లి చేసుకోమంటే భైరవ నిరాకరించడం.
          *ముఠా బారి నుంచి భైరవ, గీత తప్పించుకుని పారిపోవడం, వరస ఛేజింగులు.
          *ఇదంతా సుబ్బారెడ్డి మానిటరింగ్ చేయడం.
          *తనని కొట్టినందుకు గీత మీద పగతో వున్న కట్టారెడ్డితో కలిసి వాళ్ళని పట్టుకుందామని సుబ్బారెడ్డి అనడం, కట్టారెడ్డి  సుబ్బారెడ్డితో చేతులు కలపడం.
          *భైరవ, గీతల ఎరోటిక్ పాట.  
          *పాటయ్యాక ఇంకో ఎటాక్, ఇంకోసారి పారిపోవడం.
          *పారిపోతున్న గీత భైరవకి కిస్ పెట్టి, తన ప్రేమని ఎస్టాబ్లిష్ చేసేయడం ముఠాకి. ఇంటర్వెల్.
***
           పై ఆర్డర్ సినిమా చూస్తూ రఫ్ గా నోట్ చేసుకున్నవి ఫోన్లో, ప్రధానాంశాలు మిస్ కాకుండా. ప్రధానాంశాల్లో ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేసే  బిగినింగ్ బిజినెస్ ముఖ్యమైనది. పై సీన్లలో ఎంగేజ్ మెంలో గీత కట్టారెడ్డిని కొట్టడం ప్లాట్ పాయింట్ వన్ అని చూశాం. ఇక్కడితో బిగినింగ్ విభాగపు సీన్లు ముగిశాయి. ఈ సీన్లలో 1. కథానేపధ్యం, లేదా జానర్ ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య (ప్లాట్ పాయింట్ వన్) ఏర్పాటు ఎలా జరిగాయో చూద్దాం: 

         ఇది ఉన్నోడికీ  లేనోడికీ మధ్య యుద్ధమని వాయిసోవర్ తో జానర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్యాక్షన్ నేపధ్య వాతావరణం చూపించారు. తర్వాత ప్రధాన పాత్ర భైరవని, అతడి తల్లినీ, వాళ్ళ బానిసత్వాన్నీ పరిచయం చేశారు. దీని తర్వాత ఆలస్యం చేయకుండా భైరవ కాబోయే ప్రత్యర్ధి సుబ్బారెడ్డిని పరిచయం చేశారు. కానీ అతను తన కోసం ప్రాణాలర్పించిన కింది కులస్థుల ఫోటోల్ని  అసహ్యంతో తన్నేస్తూ, కులవివక్షని ప్రదర్శిస్తాడు. వాయిసోవర్ లో చెప్పినట్టు ఉన్నోడికీ లేనోడికీ వర్గపోరాటంలా అన్పించదు. ఈ కులప్రస్తావన అనవసరం. ఇలా ప్రధాన పాత్ర భైరవని, ప్రత్యర్ధి పాత్ర సుబ్బారెడ్డినీ పక్కపక్కన పరిచయం చేసిన తర్వాత, ఇంకేం చేయాలి? వీళ్ళిద్దరి మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన మొదలెట్టాలి. అదే చేశారు. సుబ్బారెడ్డి తన ప్రత్యర్థి కేశవరెడ్డితో కోడి పందాల్లో ఓడిపోవడం, అతడి కొడుకు కట్టారెడ్డిని తన కూతురికి అడగడం. ఇలా చేయడం ద్వారా ఇంకా ప్రేమలోనే పడని  హీరోకి ముందే లాక్ వేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచారు. ఇది మంచి డైనమిజం. దీని వెంటనే సుబ్బారెడ్డి కూతుర్ని చేసుకోబోయే కట్టారెడ్డి అనేవాడు ఎంత క్రూరుడో ఓ దారుణ హత్య ద్వారా పరిచయం చేశారు. ఇప్పుడు ప్రేక్షకులకి తెలిసి, భైరవకి తెలీక ఇద్దరు ప్రత్యర్థులు వెంటనే ఏర్పాటయ్యారు. ఇలా టైం వేస్ట్ చేయకుండా ప్రతీ సీనునీ బిగినింగ్ బిజినెస్ కి కాజ్ అండ్ ఎఫెక్ట్ డైనమిక్స్ తో వాడుకుంటూ, పకడ్బందీగా కథ ఏర్పాటు చేసుకొచ్చారు. 

        ఇలా ఒక పరిస్థితిని ఏర్పాటు చేశాక, దీనికి  కేంద్ర బిందువుగా హీరోయిన్ గీత పాత్రని ఈ పరిస్థితిలోకి ప్రవేశపెట్టారు. దర్శకుడి ధర్మం ప్రేక్షకులకి 2 + 2 = అని సజెస్ట్ చేసి జవాబు ప్రేక్షకులే ఆలోచించుకునేందుకు వదిలెయ్యడమని, హాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ ఎర్నెస్ట్ లూబిస్చ్ (1892 – 1947) అంటాడు. అంతేగానీ స్పూన్ ఫీడింగ్ చేయడం కాదు. పై సీన్ల క్రమాన్ని కలుపుకుని చూస్తూ పోతూంటే వాటి అర్ధం ప్రేక్షకుల ఆలోచనలకి అందుతూనే వుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి కీలక పాత్రలు పరిచయమవుతున్న క్రమాన్ని చూస్తూంటే. ఈ పరిచయక్రమాన్ని ఆశ్రయించే దానికదే కథ పుడుతూ, అది ముందు కెళ్తూ వుంది. కథని పాత్రలు పుట్టిస్తూంటాయి, కథకుడు కాదు. ఇక్కడ పాత్రల పరిచయ క్రమం మారిస్తే కథ ముందు కెళ్తున్నట్టు వుండదు. సర్వసాధారణంగా ఏం చేస్తూంటారంటే, కథని చకచకా ముందుకు తీసికెళ్ళడం వదిలేసి, పాత్రల పరిచయ క్రమాన్ని పట్టించుకోకుండా, అడ్డదిడ్డంగా పాత్రల్ని ప్రవేశపెడుతూ, అవసరం లేని సహాయ పాత్రల్ని కూడా ప్రవేశపెడుతూ, కామెడీలతో పాటలతో ఇంటర్వెల్ వరకూ కాలక్షేపం చేస్తారు. ఇందుకే అరగంటకి కథ ఏర్పాటయి ప్లాట్  పాయింట్ వన్ రావాల్సిన స్ట్రక్చర్ చెదిరి కకావికలమవుతూ వుంటుంది. ఫస్టాఫ్ లో ఏమీ లేదన్న ఫీలింగ్ కల్గిస్తుంది.

          ఇందుకే అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకుని సకాలంలో బిగినింగ్ విభాగాన్ని సెటప్ చేయడం ఒక ఆర్టు అన్నారు. ఇందులోని మజా ఇలా సెటప్ చేస్తే గానీ అనుభవమవదు. ఈ వ్యాసకర్త అనుభవంలో ది బెస్ట్ సెటప్ ఓ కామెడీ హీరో కోసం రాసిన కథ బిగినింగ్ విభాగం. అయితే ఆ హీరో ఆ దర్శకుణ్ణి పిలిపించుకోవడం, ఉత్సాహపడడం; మళ్ళీ పిలిపించుకోవడం, ఉత్సాహపడ్డమే తప్ప, ఈ సీరియల్ కి ఒక అంతే లేకపోవడంతో ఆ దర్శకుడు ఏటో పోయాడు, అందమైన సెటప్ చూసుకుని మురిసిపోయిన ఈ వ్యాసకర్త ఇంకెటో పోయాడు రెండేళ్ళ క్రితం. దాంతో ది ఎండ్ దానికి.

ఫోర్ షాడోయింగ్ సీను 
       సిటీ నుంచి వచ్చిన గీతని భైరవ ఇంట్లోచూస్తాడు పక్క సర్దుతూ. అవతలి గదిలో ఆమె తల్లితో మాట్లాడుతూంటే, ఇవతల బెడ్ రూమ్ లో ఆమె పక్క సర్దుతూ కన్నార్పకుండా చూస్తూంటాడు. ఇక్కడొక ప్రశ్నేమిటంటే, ఈ ఇంట్లోవారసత్వ బానిసగా పనిచేస్తున్న భైరవకి,  గీత చిన్నప్పట్నుంచీ తెలిసే వుండాలి. కానీ ఎవరో కొత్తమ్మాయిని ఇప్పుడే చూస్తున్నట్టు చూసి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సీను సృష్టించడమేమిటి? ‘చంటి’ లో పనివాడు వెంకటేష్ పాత్ర ఇలా వుందా?  పైన చెప్పుకున్న ఒక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, దీనికి కేంద్ర బిందువుగా గీతని ప్రవేశపెట్టినప్పుడు- చిన్నప్పట్నించీ తెలిసిన భైరవ తో ఆమె ఎంత యాక్టివ్ గా వుంటూ, ఆ పరిస్థితుల్ని ఇంకోమలుపు తిప్పే విధంగా వుండి ఎక్సైట్ చేయాలి? తండ్రి ఈమె పెళ్లి ఆలోచనలు చేస్తోంటే, దీనికి యాంటీగా ఈమె స్వభావం వుందని 2 + 2 = బేరీజు వేసుకుని, కథనంలో ఈ డైనమిక్స్ కి  ప్రేక్షకులెంత అప్రమత్తమవుతారు...ఎందుకని కమర్షియల్ సినిమాల్లో ఇలా చప్పగా పాసివ్ క్యారెక్టర్లుంటాయి పనిలేక? 

          భైరవ, గీత ఇద్దరూ అపరిచితులవడానికి వీల్లేదు చెబుతున్న కథ ప్రకారం. ఈ పాత్రోచితానుచితాలు లేని వీళ్ళిద్దరూ ఇక ముందుకూడా కొత్తమ్మాయి - కొత్తబ్బాయి ఫీల్ నే కల్గిస్తూ అన్ని సీన్లలో బిహేవ్ చేస్తూంటారు. సరే, భైరవ ఆ పక్క సర్దే సీను- దాసరి
నారాయణరావు ‘జీవితమే ఒక నాటకం’ లో నారాయణ మూర్తి ఎప్పుడూ బోరు పంపు కొడుతూ అమ్మాయి కేసే చూసే ఐకానిక్ సీను లాంటిది ఈ భైరవ పక్క సర్దే సీను. ఇది కాకతాళీయంగా జరిగిందో, కావాలని చేశారో తెలీదు. కానీ ఈ ఒక్క సీనులో ప్రేమ కథకి ముగింపు పరోక్షంగా వుంది. గీతని చూసిన ఈ మొదటి సీనులోనే భైరవ ఆమె పక్క సర్దుతూ ఆమెకేసే చూస్తున్నాడంటే – వీళ్ళ రాబోయే ప్రేమ కథ ఎన్ని అడ్డంకులెదురైనా, పెళ్ళితో పడక మీద సుఖాంతమవుతుందని ఖాయం చేసేయడమే. ఫోర్ షాడోయింగ్ – అంటే జరగబోయేది ముందే పరోక్షంగా చూపించడం. అయితే ఇందులో ప్రేక్షకులకి ఆందోళన కల్గించే కోణం కూడా వుండాలి, అదే లేదు. కానీ చూపిస్తున్న కథలోనే వుంది ఆ కోణం – అదేమిటంటే, బానిసగా భైరవ స్టేటస్. గీత తండ్రి సుబ్బారెడ్డి తో ఈ బానిసత్వం తాలూకు వివక్షాపూరిత సీన్లు, హింసా భైరవకి లేవు. వుంటే ఈ నేపధ్యం ఇప్పుడు పక్క సర్డుతున్నప్పుడు ప్రేక్షకులకి ఆందోళన పర్చేది. కుక్కలా బతుకుతున్న ఈ ఇంట్లో పక్కమీదికి నిచ్చెన లేస్తున్నాడే అని...

          పాత్రలే కథ పుట్టిస్తున్నా, వాటిలో పరకాయప్రవేశం చేసి వాటి మైండ్ సెట్ పూర్తిగా తెలుసుకోవడం లేదు కథకుడు. ఆ సంపూర్ణ, సమగ్ర మైండ్ సెట్ తో అవి ఇంకింత అర్థవంతమైన కథని పుట్టించేలా చేయడం లేదు కథకుడు. ముఖ్యంగా క్యారక్టర్ బయోగ్రఫీలు రాసుకోలేదు. 

          దీని తర్వాత గీతకి భైరవతో ప్రేమని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు వేశారు. ఆమె పెళ్లి గురించి ఆమె తండ్రి చేస్తున్న ఆలోచనల నేపధ్యంలో, యాంటీగా ఈ సీన్లు వేయాలన్న ఆలోచన మంచిదే కథనంలో డైనమిక్స్ కోసం, కథ ముందు కెళ్ళడం కోసమూ. కానీ...గీత భైరవకే కొత్తని కాకుండా,  పుట్టి పెరిగిన వూరికి కూడా కొత్త అన్నట్టు రాంగ్ సీన్లు వేశారు. వూరు తిరిగి వస్తానని ఆమె తండ్రి అనుమతి కోరడం కూడా రాంగ్ సీనే. వొంటరిగా వెళ్లొద్దు, శత్రువులున్నారంటాడు తండ్రి సుబ్బారెడ్డి. శత్రువు లెవరున్నారు, ఉన్న ప్రత్యర్ధి కేశవ రెడ్డితో వియ్యమొందుతున్నాక? సిటీ లో వొంటరిగా వుంటున్నాను కదాని ఆమె అంటే కూడా, సిటీలో కంటే ఇక్కడే ఎక్కువ ప్రమాదమంటాడు తండ్రి. నిజంగా శత్రువులే వుంటే సిటీలో కూడా ఆమెకి ప్రమాదమే. ఇక ఈ నేపధ్యంలో ఓ అజ్ఞాత శత్రువు వుంటాడు. ఈ అజ్ఞాత శత్రువు గురించి సుబ్బారెడ్డికి తెలీదు. కాబట్టి అతడి దృష్టిలో ఇప్పుడు శత్రువులు లేనట్టే. ఇలా లేని డేంజర్ ని గీతకి నూరిపోస్తూ, ఆడియెన్స్ కి టెన్షన్ పుట్టించాలన్న కథకుడి ప్రయత్నం విఫలమైంది. ఈ సీను తొలగించేయవచ్చు. 

       భైరవతో, మరికొందరు అనుచరులతో (బానిసలతో) కారులో షికారుకి బయల్దేరుతుంది గీత. కారులో భైరవకీ, గీతకీ ఇది మొదటి సీను. ఈ సీన్లో ఇద్దరూ అపరిచితుల్లాగే వుంటారు. ఇక వూరి పరిసరాల్లో ప్రకృతిని చూసి ఆశ్చర్యపోతూంటుంది గీత-  కొత్తమ్మాయి కొత్తగా పరిసరాలు చూస్తున్నట్టూ. నిజానికి వూళ్లోనే పుట్టి పెరిగిన ఈమెకి ఇవన్నీకొట్టిన పిండే అన్నట్టుండాలి. కొండ మీద చిన్న గుడి వున్న సంగతి కూడా ఆమెకి తెలీదు. దాని గురించి చెప్తూంటే కూడా ఆమెకి థ్రిల్!!
          ఇదంతా కాకుండా, వూళ్ళో పుట్టి పెరిగిన అమ్మాయిగా, ఈ వూరి అడ్రసుతో ఆధార్ కార్డు వుండే అవకాశమున్న చట్టబద్ధ పౌరురాలిగా, ‘నాన్నా – ఇప్పుడు నేను నా ఫేవరేట్ స్పాట్ కొండ మీద గుడికెళ్ళి పిక్నిక్ చేసుకొస్తా, బీ హేపీ అండ్ రిలాక్స్డ్’ అని తండ్రికి చెప్పిపారేసి, బానిసల్ని లీడ్ చేస్తూ తనే అడ్వెంచరస్ గా వెళ్తే అర్ధంపర్ధం వుండేది. ఈ డైనమిక్స్ తో సీన్లు మరింత హుషారెక్కేవి. స్వగ్రామానికొచ్చిన అమ్మాయి వింతలు చూడ్డమేమిటి. 

          ఆ వింతలు చూస్తున్న షికారులో ఓ పాట పాడుతుంది. పాటకాగానే అజ్ఞాత శత్రువు దాడి. దాడిలో ప్రాణాలకు తెగించి భైరవ కాపాడ్డంతో ప్రేమలో పడుతుంది. ఇవన్నీ టెంప్లెట్ సీన్లే. వూళ్ళోకి వచ్చిన హీరోయిన్ ప్రకృతి విహారం చేయడం, పాట పాడుకోవడం ఎన్ని సినిమాల్లో చూడలేదు. శత్రువుల బారి నుంచి కాపాడిన హీరోతో ప్రేమలో పడ్డం ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇవి కృత్రిమ టెంప్లెట్ సీన్లే. ఫ్రెష్ గా ఆలోచించిందేమీ లేదు. 

          ఇద్దరి క్యారక్టర్ బయోగ్రఫీలో కెళ్తే, ఇన్నేళ్ళ జీవితంలో అతడామెని గతంలో ఎన్నోసార్లు కాపాడి వుండాలి. సుబ్బారెడ్డికి కంటే ఎక్కువ ఈమెకి బానిసలా వుండాలి. ఈ మూలాల్నుంచీ ప్రేమకి బీజాలు పడుతూ రావాలి. ఎందుకు నాకోసం ఇంత ప్రాణాలకు తెగిస్తావని ఆమె అంటే - ఆడపడుచులు సాఫ్ట్ టార్గెట్స్, ఆడపడుచుల క్షేమం యజమాని క్షేమమని డైలాగులేవో అతను చెప్పి వుండాలి. చాలా ఇంటరాక్షన్ వుండాలి ఇన్నేళ్ళ జీవితంలో. ఈ ఎమోషనల్ బాండింగ్ నేపధ్యంలో ఇప్పుడు ఇంకో దాడి జరిగితే, ఇప్పుడు కూడా ఆమె ప్రేమలో పడ్డానికి ఇంకా బలమైన కారణం ఈ దాడి సందర్భంగా పుట్టాలి. 

          ఈ దాడీ, ప్రేమా తర్వాత సుబ్బారెడ్డి ఒక బానిసని కాల్చి చంపే సీను వస్తుంది. కూతురి మీద దాడిచేసిన అజ్ఞాత శత్రువెవరో తెలీక, వూళ్ళో ప్రతిష్ట కోసం ఈ బానిసని బాధ్యుడ్ని చేసి చంపడం. ఇది గీత భైరవతో ప్రేమలో పడ్డ సీనుకి యాంటీగా, ఆమె ప్రేమకి ఇలాటి తండ్రితో ఎలాటి థ్రెట్ వుంటుందో ప్రేక్షకులకి తెలియజేయడం. కూతురు ప్రేమలో పడ్డాకే  తండ్రి క్రూరత్వం చూపించడంతో కథకూడా ముందు కెళ్తోంది. సర్వసాధారణంగా ఏం చేస్తారంటే - విలన్ ని చూపిస్తే, అతడు చేసే ఒక దారుణంతో ఎంట్రీ ఇచ్చేస్తారు. కేవలం అది పాత్ర ఎలాటిదో చెప్పడానికే ఉపయోగపడుతుంది తప్ప కథ కెలాటి ఉపయోగమూ వుండదు. సుబ్బారెడ్డిని ప్రారంభంలో మూడో సీన్లోనే పరిచయం చేసినప్పటికీ అతడి చేత ఏ దారుణమూ చేయించి పరిచయం చేయలేదు. కేవలం నిమ్నకులాల శత్రువనే డైలాగుల్లో తెలియజేశారు. అతడి దారుణం కథకి ఉపయోగ పడాలంటే, కథని ముందుకు నడిపించాలంటే, కూతురు ప్రేమలో పడ్డాకే వుండాలి. ఇలా ఇప్పుడు కూతురు ప్రేమలో పడ్డాక, బానిసతో అతడి పైశాచికత్వం చూపించడంతో ఉభయప్రయోజనాలూ నెరవేరాయి- పాత్ర స్వభావంతో పాటు, ఆ స్వభావం టెర్రిఫిక్ గా కథని ముందుకు నడిపించడం. డైనమిక్స్ అంటే ఇదే. 

        తండ్రి దగ్గర బానిసలతో ఎడ్యుకేటెడ్ కూతురు గీత దృక్పథమేమిటో చిత్రించలేదు. బానిసల కథకూడా చెప్తున్నప్పుడు ఇది కూడా అవసరమే. ఫార్ములా హీరోయిన్ లాగా వుండడం కుదరదు గీతకి.  
          ఇక గీత మీద దాడి గురించి భైరవ తల్లికి చెప్పే సీను. ఈ సీను వీళ్ళిద్దరి మధ్య కేవలం సమాచార వినిమయం కోసమే వుంది. తర్వాత గీత పడగ్గదిలో ప్రేమ కలల్లో విహరించడం. ఒక్క రోజు విహారంలోనే భైరవతో ప్రేమలో పడిపోవడం. ఆ విహారంలో అతడితో ఆనందించిన తాలూకు మాంటేజెస్. ఈ మాంటేజెస్ చిన్నప్పట్నించీ కూడా వుండవా? వీళ్ళు ఈ రోజే ఒకరికొకరు పరిచయయ్యారని వీళ్ళ నేపధ్యాలు దాచి ఎలా చూపిస్తారు. టెంప్లెట్ లో పడి ముఖ్యమైన లాజిక్ ని మర్చిపోయినట్టున్నారు. ఇందుకే సినిమా సాంతం వీళ్ళ ఎరోటిక్ లిప్ లాక్స్ ప్రేమకథ బోలుగా వుంది. ఇలా గీత ప్రేమ కలల్లో వున్నప్పుడు దీనికి యాంటీగా ఆమె తల్లి వచ్చి ఎంగేజి మెంట్ గురించి చెప్పడం మంచి డైనమిక్సే. కథని ముందుకు నడిపిస్తోంది. గీత నో చెప్పడంతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన అనే బిగినింగ్ బిజినెస్ టూల్,  షోడవున్ కేసి – అంటే ప్లాట్ పాయింట్ వన్ కేసి దారి తీయిస్తోంది. 

          ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ ఎంగేజి మెంట్ సీను. ఈ సీను ఇంతవరకూ జరిగిన బిగింగ్ బిజినెస్ ని సమప్ చేస్తుంది. చేసి కథని ప్రారంభిస్తూ ఒక నిర్దిష్ట దిశని సూచిస్తుంది. ఈ కథకి ప్రధాన పాత్ర బానిస భైరవే. అంటే ఈ ప్లాట్ పాయింట్ వన్ సీను అతణ్ణి ప్రభావితం చేసి – ఇక్కడ పుట్టే సమస్యకి పరిష్కారం కోసం అతణ్ణి ఉద్యుక్తుణ్ణి చేస్తుంది. అంటే అతడికో గోల్ ని అందిస్తుంది. ఈ వివరణతో ఎవరికీ ఎలాటి అభ్యంతరముండదు కదా? క్రియేటివ్ స్కూలు వాళ్ళు కూడా కొట్టి పారెయ్యలేరు కదా? ఇప్పుడు కథంతా భైరవ మీద కేంద్రీకృతమవుతుంది. అతనే ఈ కథకి బాణం, అతనే ఈ కథకి శక్తి. 

       అయితే కథ నడిపే కథానాయకుడిగా ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు బిగినింగ్ బిజినెస్ మొత్తంలో అతను సంపాదించుకున్న ‘ఆస్తి’ ఎంత?
          1. ఈ మొత్తం బిగినింగ్ బిజినెస్ అతను కోరుకుంటున్న దేమిటి? ఏమీ లేదు.  
          2. ఈ మొత్తం బిగినింగ్ బిజినెస్ లో బానిసగా అతను అనుభవించిన బాధలేమిటి, పొందిన అవమానా లేమిటి? ఏమీ లేవు.
          3. ఈ మొత్తం బిగినింగ్ బిజినెస్ లో అతడికి తల్లితో వున్న సీన్లలో ఏమైనా కథ కుపయోగపడే అంశముందా? ఏమీ లేదు, సమాచార వినిమయం తప్ప.
          4. ఈ మొత్తం బిగినింగ్ బిజినెస్ లో అతడికి సుబ్బారెడ్డితో ఏమైనా థ్రెట్ ఏర్పడే సీన్లున్నాయా? ఏమీ లేవు.
          ప్లాట్ పాయింట్ వన్ లో హీరోకి గోల్ ఏర్పడాలంటే, ఆ గోల్ అంతర్నిర్మాణం కూడా  జరుగుతూ రావాలి బిగినింగ్ బిజినెస్ సీన్లలోనే.
          గోల్ అంతర్నిర్మాణం ఈ నాల్గు గోల్ ఎలిమెంట్స్ తో జరుగుతుంది  : 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్.       
          1. కోరిక : ఏం కోరికపుట్టింది? ఈ కథకి పుట్టాల్సిన ప్రధాన కోరిక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. దాంతో ఏం చేయాలో తెలీక పాసివ్ గా వుంటున్నాడు. కోరిక లేనట్టే. మొదటి ఎలిమెంట్ మిస్.
           2. పణం: కోరికే లేదు, ఇక పణంగా దేన్ని పెడతాడు. మాట వరసకి కోరిక వుం దనే అనుకుందాం. ఆ కోరిక సాధించుకోవడానికి దేన్ని పణంగా పెడుతున్నాడు? దేన్నీ లేదు. కానీ ఈ ఎలిమెంట్ తల్లి పాత్రకి సంబంధించింది, ‘శివ’ లో అన్న కూతురి పాత్రలాగా. శివ భవానీని నిర్మూలించే గోల్ పెట్టుకుంటూ, అన్నకూతురి ప్రాణాల్ని పణంగా పెడుతున్నాడని ఆమెతో బిగినింగ్ బిజినెస్ సీన్లు హెచ్చరిస్తూనే వుంటాయి. భైరవకి తల్లితో ఇలాటి సీన్లు లేవు. కాబట్టి రెండో ఎలిమెంట్ పణం మిస్. ఐతే ఈ పణం అనే రెండో ఎలిమెంట్ ని సెకండాఫ్ లో రైజ్ చేశారు, భైరవ తల్లికి ప్రమాదముందని చెప్పించి. దాక్కున్న చోటికి ఆమెని తెచ్చుకుందామని అనిపించి. అప్పుడు భైరవ సిల్లీగా అంటాడు –వూళ్ళో ముఠా తిరుగుతోంది, ఆమెని తెచ్చుకోవడం కష్టమని. ఆమె ఇంట్లో వుంటే క్షేమంగా వుంటుందా? ముఠా ఇంటి మీద దాడి చేసి చంపెయ్యదేమిటి? జరిగింది ఇదేగా? తల్లిని వదిలేసి భైరవ ప్రాణభయంతో ఎక్కడో దాక్కుంటే, అతణ్ణి కన్నందుకు ఆమెకి సన్మానం చేస్తారా చంపక?           
         ఇక్కడ కాస్తాగి సిగరెట్ దమ్ముకొడదాం బుర్ర జామ్ అయిపోతోంది...
         ఓకే, పణం అనే రెండో గోల్ ఎలిమెంటుని గోల్ ఏర్పడే ప్లాట్ పాయింట్ వన్ కి జోడించకుండా, ఎక్కడో సెకండాఫ్ లో రైజ్ చేసి, తర్వాత ఆ తల్లిని చంపే సీనుని ప్లాట్ పాయింట్ టూ చేశారు! దీంతో కథే గల్లంతై పోయి ఉపకథ ముందు కొచ్చేసి మొత్తం ముంచేసింది. దీని వివరాలు మిడిల్ విభాగంలో చూద్దాం. 
          3. పరిణామాల హెచ్చరిక : సుబ్బారెడ్డి కాఠిన్యాన్ని భైరవ రుచి చూసే సీన్లు లేవు, కాబట్టి ప్రేమ కోసం అతడితో పెట్టుకుంటే పరిణామాలెలా వుంటాయో హెచ్చరిక లేదు. మూడో ఎలిమెంట్ కూడా మిస్.
          4. ఎమోషన్ : బానిసగా అతను అనుభవించిన బాధలూ అవమానాలూ ఏవీ లేకపోవడంతో దీన్నుంచి విముక్తి పొందాలన్న ఎమోషనేదీ లేదు. పైగా కోరిక అనే మొదటి ఎలిమేంటే లేనప్పుడు ఆ కోరిక సాధించుకునే ఎమోషన్ సహజంగానే లేదు. 

       ఇలా బిగినింగ్ బిజినెస్ లో కథానాయకుడు సమకూర్చుకున్న ‘ఆస్తి’ అంటూ ఏమీ లేకపోయాక, ఆస్తి పోవడం ఏముంటుంది? ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ లో డొల్ల అయాడు. అంటే పాసివ్ అయ్యాడు. ఇందుకు ఈ సీనుకూడా ఇతను కేంద్రంగా లేదు. ప్రేక్షక మాత్రంగా వుండిపోయాడు. 

          ఈ ఎంగేజ్ మెంట్ సీనులో కట్టారెడ్డి ఏదో చెయ్యి తగిలిందని భైరవని కొడతాడు. దీంతో గీత కట్టారెడ్డిని కొడుతుంది. ఎంగేజ్ మెంట్ స్మాష్ అవుతుంది. ఇలాగైనా గీత కట్టారెడ్డి కట్టు బానిసగా మారకుండా తప్పించుకుందని ఆడియెన్స్ సంతోషించవచ్చు. కానీ బిగినింగ్ బిజినెస్ ని మలుపు తిప్పే ఈ కీలక ప్లాట్ పాయింట్ వన్ దృశ్యంలో, అసలు కథా నాయకుడైన, కథని నడపవలసిన, భైరవ పాయింటాఫ్ వ్యూ ఏమిటి? ఇదీ ముఖ్యం! 

          అతనేం చేయాలనుకున్నాడు? గీతని లోలోన ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు ఆమెకి ఎంగేజ్ మెంట్ జరిగిపోతోంటే ఏం చేయాలనుకుంటున్నాడు? ఇది చెడగొట్టాలని వచ్చాడా? ఇందుకే కట్టారెడ్డిని రెచ్చగొట్టాడా? ఇలాగేం అన్పించదు. పొరపాటున చేయితగిలి కట్టారెడ్డి కొడితే, ఆ కట్టారెడ్డిని ఆమె కొట్టింది. ఆమే  హీరో. కట్టారెడ్డితో పెళ్లి  ట్రాప్ లో పడకుండా ఈ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుని బయటపడింది. భైరవ వల్ల ఏమీ కాలేదు. ఈ క్రెడిట్ ఆమెని ప్రేమించే భైరవకి పోదు. తర్వాతెప్పుడైనా ఆమెకి తన ప్రేమని వెల్లడిస్తే, ‘ప్రేమించిన వాడివి నా ఎంగేజ్ మెంట్ ఆపడానికి నువ్వేం చేశావ్?’ అని ఆమె ఛీకొట్టే అవకాశముంది. దీనికి నిష్కృతి వుండదు భైరవకి. చచ్చినట్టూ సుబ్బారెడ్డికి మళ్ళీ బానిస భజనే బతుకంతా. 

          ఒకవేళ తన ప్రేమ కోసం ఎంగేజ్ మెంట్ చెడగొట్టాలన్న ఉద్దేశంతోనే భైరవ వచ్చి వుంటే, అలా కట్టారెడ్డిని రెచ్చగొట్టి వుంటే, అప్పుడు గీత కట్టారెడ్డిని కొట్టి ఎంగేజ్ మెంట్ ని అభాసు చేస్తుందని ఎలా వూహించగలడు? 

          కాబట్టి ప్రేక్షకులు అడ్జెస్ట్ అయ్యే ఏ పాయింటాఫ్ వ్యూలేదు భైరవకి. పాయింటాఫ్ వ్యూ లేకుండా సీనులో ఎలా పాల్గొంటాడు? ఇలా పైపైన రాసేసి తీసేస్తే బాక్సాఫీసులోకి పోతుందా? పోస్ట్ బాక్సు కాదుకదా? పాత్రలు మనసులో ఏమనుకుంటున్నాయో తెర మీద ప్రత్యక్షం కావాలి. మీరూహించుకు చావండని ప్రేక్షకులకి వదిలేస్తే, వూహించుకు చావడానికి ప్రేక్షకులు సిద్ధంగా వుండరు. వాళ్ళు త్యాగాలు చచ్చినా చేయరు.

          ఈ గోల్ ఏర్పడే ప్లాట్ పాయింట్ వన్ సీనులో, భైరవ అన్నిటికీ సిద్ధపడి (పై నాల్గు గోల్ ఎలిమెంట్స్ సమేతంగా), ఎంగేజి మెంట్ చెడగొట్టాలన్న సీక్రెట్ ఎజెండా పెట్టుకుని వచ్చుంటే, గీతని టెస్ట్ చేస్తాడు, ఆమెకీ తన పట్ల ప్రేమ వుందా అని. ముందు ఆమె చూపుల్ని తన వైపు తిప్పుకుంటాడు. ఆ చూపుల్లో ఎంగేజ్ మెంట్ పట్ల ఇష్టాయిష్టాలు పసిగడతాడు. ఆమె కిష్టం లేదనే ముందు సమాచారం సేకరించుకుంటాడు ఇంట్లో తోటి బానిసల ద్వారా. చిరునవ్వుతో చూస్తాడు. ఆమె రెస్పాండ్ అవుతుంది, తనూ ప్రేమలో వుంది కాబట్టి. ఏదో సైగ చేస్తాడు. అర్ధంగాక చూస్తుంది. ఇప్పుడామె ప్రేమని కన్ఫం చేసుకోవాలనుకుంటాడు. ఇది రిస్కు తీసుకోవడమే. రిస్కు తీసుకోవడమే హీరో లక్షణం. తను కట్టారెడ్డిని గిల్లుకుంటే, కట్టారెడ్డి తనని పీకితే, ఆమె వచ్చేసి పటపటా కట్టారెడ్డిని నాల్గు పీకి పారేసి, బ్రేకింగ్ న్యూస్ డిక్లేర్ చేసే యాలి. చేస్తుందో లేదో తెలీదు, కానీ రిస్కు తీసుకోక తప్పదు. ఆడియెన్స్ కి టెన్షన్. రిస్కు తీసుకుని ట్రిక్ ప్లే చేసేస్తాడు. ఆమె సరీగ్గా అలాగే రియాక్ట్ అయి రక్తి కట్టిస్తుంది. అందరి ముందూ లవ్ డిక్లేర్ అయిపోయాక ఆమెని తీసుకుని అక్కడ్నించే ఫాస్టుగా ఎగిరిపోతాడు భైరవ స్క్రీన్ ప్లే మిడిల్ విభాగం లోకి. ఇలా ప్లాట్ పాయింట్ వన్ లో యూత్ అప్పీల్ వుంది. హీరోయిన్ని హీరో ఎగరేసుకుపోవడం యూత్ అప్పేలే! 

          స్క్రీన్ ప్లే కొటేషన్స్ అన్నీ ఇంగ్లీషు వాళ్ళవే వుంటాయి :
         What is character but the determination of incident. And what is incident but the illumination of character." ― Henry James ( from Syd Field’s book)

          మిడిల్ విభాగం రేపు!

సికిందర్