రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, సెప్టెంబర్ 2017, మంగళవారం

507 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -15

            ప్రతీ పదహారేళ్ళ కోసారి  భూమి గుండ్రంగా తిరిగి అక్కడికే వస్తుంది : ‘బ్లడ్ సింపుల్’ రీ - రిలీజ్ అవుతుంది. 1984 లో తీసిన ‘బ్లడ్ ‘సింపుల్’ ని  కోయెన్ బ్రదర్స్ 2000 లో ఒకసారి, 2016 లో మరోసారి రీ - రిలీజ్ చేశారు. మొదటిసారి డైరెక్టర్స్ కట్ పేర రీ - రిలీజ్ చేశారు. అప్పటికి పదహారేళ్ళ క్రితం 1984 లో తీసిన ఈ నియో నోయర్ థ్రిల్లర్ లో ఇప్పుడు చూస్తే తమకే సిల్లీగా అన్పించిన కొన్ని షాట్స్ ని  తొలగించి, మూడు నిమిషాల నిడివి తగ్గించారు. గత సంవత్సరం రెండోసారి  రీ - రిలీజ్ చేసినప్పుడు 4 కె రిజల్యూషన్ కి అప్ గ్రేడ్ చేశారు. దీని ట్రైలర్ ని ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు

           
విషయానికొస్తే సీనులో డ్రామా అంటే  ఘర్షణ పడడమే కాదు, ఏడ్పులే కాదు, మౌనం వహించడం కూడా. అది వ్యూహాత్మక మౌనమైనా, అమాయకత్వపు మౌనమైనా మౌనం మౌనమే -  సంఘర్షణ పుట్టిస్తుంది.  డ్రామా అంటే సంఘర్షణే.  సంఘర్షణ కాబట్టి మౌనంకూడా టెన్షన్ పుట్టిస్తుంది. డ్రామా అంటే మాటకు మాట పెద్ద పెద్ద డైలాగులే కాదు, ఆలోచనాత్మకమైన తక్కువ మాటలు కూడా డ్రామా క్రియేట్ చేస్తాయి. సీనులో బలమైన డ్రామా పుట్టడానికి వెనుకటి సీన్లలో పోగుపడుతూ వచ్చిన  పూర్వ డ్రామాయే తోడ్పడుతుంది. ఇక డ్రామాలో కూడా కథని ముందుకు నడిపించే పరిణామమేదో చోటు చేసుకోవాలి తప్పక. ఈ దృష్ట్యా ‘బ్లడ్ సింపుల్’ లో ఒక కీలక దృశ్యాన్ని పరిశీలిద్దాం..

27. అమాయకంగా మాట్లాడే ఎబ్బీతో రే తికమక పడడం 
     ఎబ్బీ నిద్రలో వుంటుంది. ఆఫ్ స్క్రీన్ లో తలుపు తీసి మూసిన శబ్దమవుతుంది. ఓ క్షణం తర్వాత మైలగా వున్న చెయ్యి ఫ్రేములో కొచ్చి, నుదురు మీద వాలుతున్న ఆమె శిరోజాల్ని సున్నితంగా తప్పిస్తుంది. 

       ఎబ్బీ ఇటు వొత్తిగిలి ఆఫ్ స్క్రీన్ లో చూస్తుంది. లాంగ్ షాట్ లో బాత్రూం దగ్గర నిలబడి కన్పిస్తాడు రే, టవల్ తో చేతులు తుడుచుకుంటూ.  ఆమె ‘హాయ్ రే’ అని పలకరిస్తుంది. పలకడు. అటు పక్కనున్న చైర్ దగ్గరకెళ్ళి కూర్చుంటాడు. ఫేడవుట్.   

            ఇంతే. ఈ చిన్న సీనులో పైకి చూస్తే రే ఎబ్బీ దగ్గరి కొచ్చాడు, ఇక ఆమెతో విషయం చర్చించడానికి కూర్చున్నాడు అన్నట్టు మాత్రమే వుంది. కానీ సీనులో ప్రతీ షాటూ లోతైన ఎన్నో సంగతులు చెప్తోంది.
 సీనులో సంఘర్షణేమీ లేదు. కానీ తుఫాను ముందటి ప్రశాంతత వుంది. సీను  ప్రేమగా ప్రారంభమై సంఘర్షణకి సిద్ధం చేస్తూ ముగిసింది. ముగింపు ఫేడవుట్ అయింది. దాదాపు ఇంకే సీనులోనూ  ఫేడవుట్- బ్లాకవుట్ కన్పించదు. ఇక్కడ  వాళ్ళిద్దర్నీ చూపించి బ్లాకవుట్ చేయడంలో ఉద్దేశం బోధపడుతూనే వుంది. వాళ్ళ సంబంధం  ఇక మరోమారు వికటించబోతోందని.  ఈ బ్లాకవుట్  దీనితర్వాతి సీనుకి స్మూత్ ట్రాన్సిషన్ గా కూడా వుంది. 

            ప్రస్తుత సీను ప్రారంభంలో నిద్రలో వుంటుంది ఎబ్బీ. ఇలావున్నప్పుడు తలుపు తీసి మూసిన చప్పుడు, తర్వాత ఫ్రేములోకి రే చెయ్యి వచ్చి ఆమె ముంగురులు సవరించడమూ జరుగుతాయి. ఎందుకు సవరించాడు? ఇంతకి ముందే ఫోన్ బూత్  నుంచి మాట్లాడితే,  ఆమె కేర్లెస్ గా పొడిపొడిగా మాట్లాడడం,  ఓకే సీయూ అని కట్ చేయడం, అప్పుడు తనొక బకరా అయ్యాడా అన్న ఫీలింగ్ కలగడమూ అన్న ఎమోషనల్ బ్యాగేజీ తో వున్నాడు కదా రే?  కానీ ఇదొక ఫీలింగు మాత్రమే. రుజువులేదు.  ప్రేమలో అపోహలకి తావు లేదు. 

            ఇప్పుడు రే చేయి ఫ్రేములోకి క్లోజప్ లో వచ్చి ఆమె ముంగురులు సవరించడమనే షాట్ - వెనక్కి వెళితే బిగినింగ్ విభాగం 11 వ సీనులోని  షాటుని బలపరుస్తోంది.  బిగినింగ్ విభాగం 9 వ సీనులో ఇద్దరికీ మాటా మాటా పెరిగి విడిపోయే పరిస్థితిని గమనించాం.  అప్పుడామె సరెండరైపోయి 11 వ సీనులో నిద్రపోతున్న రే దగ్గరి కెళ్ళి నిలబడినప్పుడు,  ఇలాగే రే చెయ్యి ఫ్రేములో క్లోజప్ లోకొచ్చి ఆమెని అందుకోవడాన్నీ చూశాం. అప్పుడు దీనర్ధం ఆమెకి అభయ హస్తమివ్వడంగా చెప్పుకున్నాం. ఇక విడిపోబోమని చేస్తున్న వాగ్దానం.

            ఇప్పుడు చూస్తే  హత్యానేరంతో మైలపడిన అతడి చేయి సరీగ్గా 11 వ సీను షాటు లాగే ఫ్రేములో క్లోజప్ లోకొచ్చి,  ఆమె కేశాలు తప్పించడం,   11 వ సీను లోని ‘అభయహస్తం’ షాటుని బలపరుస్తున్నట్టుంది. ప్రేమ పట్ల అప్పటి కమిట్ మెంట్ ఇప్పుడు కూడా చెక్కుచెదరడం లేదని చెబుతున్నట్టుంది. గత 11 వ సీనులోని  షాటులో ఆమెని అందుకున్న చేయి మైల పడలేదు.  హత్య తో చేయి ఇప్పుడు మైలపడినా,  అదే మారని ప్రేమతో అతను తాకుతున్నాడు. అతను రావడం రావడం నిలదీయాలనుకుని  రాలేదు. అలా వస్తే ఆ నీలదీతతో అప్పుడే గొడవ మొదలయ్యేది.  సీను ప్రారంభం గొడవతోనే మొదలై,  ముగింపు కూడా గొడవతోనే వుంటే అది మంచి సీను కాదు, స్ట్రక్చర్ కాదు. ఎలాగంటే, ఇందులో మిడిల్ - ఎండ్ మాత్రమే కన్పిస్తాయి, బిగినింగ్ వుండదు.

            పైగా వాళ్ళ రిలేషన్ షిప్ పరంగా చూసినా అర్ధవంతంగా వుండదు. అందుకని రిలేషన్ షిప్ లో తొందరపాటు తనం తగదన్న ఉద్దేశంతో ఈ సీను ప్రశాంతంగా మొదలయ్యింది. దీంతోబిగినింగ్ సమకూరింది. ఒక హాలీవుడ్ స్క్రీన్ ప్లే ట్యూటర్ అంటాడు - ఒక్కో సీను రెండొందలసార్లు తిరగరాయాలని!  ఒక సీను అనాటమీ ఎలా  వుంటుందంటే లక్ష కోణాల్లో ఆలోచించాల్సి వుంటుంది. అప్పుడుగానీ రక్త మాంసాలేర్పడవు. కథాత్మ పరివ్యాప్తం కాదు.

            మగత నిద్రలో వున్న ఆమె పట్ల ప్రేమని రే ఇలా ప్రకటించాక, ఆమె స్పందన కూడా చూపించారు. సీనులో ఈ బిగినింగ్ విభాగంలో ఇరువైపులా పూర్తి సమాచారమివ్వకపోతే  మిడిల్ నడవదు. అతను ఆమె పట్ల ఇంకా చెరగని ప్రేమని ప్రకటిస్తే,  ఆమె స్పందనేమిటో కూడా వ్యక్తమవాలి. ఆమె మనసేమిటో మనకి తెలియజేయకుండా (సమాచారమివ్వ కుండా) ఇద్దరి మధ్యా సంఘర్షణ మొదలెడితే అతను అర్ధమవుతాడుగానీ, ఆమె అర్ధంగాక  సీనులో ఇన్వాల్వ్ కాలేం, డ్రామాని ఫీలవలేం. 

            ఆమె స్పందన గురించి  కోయెన్ బ్రదర్స్ స్క్రిప్టులో రాయలేదు గానీ, షాటులో చిత్రీకరించారు. కేవలం ఒకేవొక్క భంగిమతో ఆమె మనసు అద్భుతంగా చెప్పేశారు. ముంగురులు సవరిస్తూంటే అతనొచ్చాడని గ్రహించి,  ఆమె బోర్లా తిరిగి తలెత్తి బాత్రూం వంక చూస్తూండే ఒక్క షాట్ తో  అంతా చెప్పేశారు. ఈ షాట్లో ఆమె చాలా ముద్దుగా సంతోషంగా కన్పిస్తుంది - సరీగ్గా ఇంటికొచ్చిన యజమాని కేసి వొళ్ళు పులకించిపోతూ పెంపుడు కుక్క మెడ చాచి ఎలా చూస్తుందో అలా. చాలా మైండ్ బ్లోయింగ్ షాట్ ఇది! 

            వెనుక  11 వ సీనులో ఇద్దరికీ గొడవయ్యాక, ఆమె సరెండర్ అయిందనే భావంతో  ఎలా టిల్ట్ డౌన్ షాట్ లో అతడి బానిసలా కూర్చున్నట్టు కనిపిస్తుందో, అలా ఇక్కడ ఈ షాట్ లో విశ్వాసంగల కుక్క అన్నట్టు  భంగిమ పెట్టి కన్పిస్తుంది. ఇప్పటికొచ్చి కూడా అతడి ప్రేమ తగ్గలేదు, ఆమె విధేయతా మాసిపోలేదు. 

            ఇదీ రెండు పాత్రల గురించి సీను బిగినింగ్ లో ఇస్తున్న ఇన్ఫర్మేషన్. అతడిది అదే ప్రేమ, ఆమెది అదే విశ్వాసం. ఆమెకి భర్త మార్టీ చనిపోయాడని తెలీదు, మార్టీని ఆమే చంపడానికి ప్రయత్నించిందని  అతను అనుకుంటున్నాడు. ఉపరితల పరిస్థితి ఇది. దీని ఆధారంగా వాళ్ళ ప్రేమలు, విశ్వాసాలూ పరీక్షనెదుర్కోబోతున్నాయి...

            ఇంకొక ముఖ్యమైన ఎలిమెంట్ స్క్రిప్టులో రాయలేదు. చిత్రీకరణలో వుంది. అది నీడ. ఆమె ఆ భంగిమలో అతడి కోసం బాత్రూం వైపు విశ్వాసంగా  చూస్తున్నప్పుడు, ఎదురుగా  అటు పక్క ఓ ఖాళీ కుర్చీ, టేబుల్ వుంటాయి. ఆ ఖాళీ కుర్చీ నీడ గోడమీద పడుతూంటుంది. టేబుల్ ముందు  ఆ ఖాళీ కుర్చీ చనిపోయిన ఆమె భర్త మార్టీ సింబాలిజం. 

            అంటే – నువ్వు ఆశగా రే కోసం ఇలా చూస్తున్నావ్ గానీ, నీ భర్త ఇక లేడన్న సంగతి ఆ ఖాళీ కుర్చీని చూసి తెలుసుకో! నీ భర్త ఇప్పుడు నీడలా మారిపోయాడని కూడా ఆ నీడని చూసి తెలుసుకో! నిన్ను వెంటాడే నీడ! – అని చెప్పడమన్నమాట. ఈ నీడని ఇక్కడి వరకే ఎస్టాబ్లిష్ చేసి వదిలెయ్యలేదు. ఈ వెంటాడే నీడగా మార్టీ,  తర్వాత ఆమెకి పీడ కలలో కన్పించబోతున్నాడు. పీడ కలలు కూడా నోయర్ సినిమాల ఎలిమెంట్స్ లో భాగం.  

            ఇక రే బాత్రూం లోంచి రాగానే పలకరిస్తుంది. అతను  మాటాడకుండా వెళ్లి అదే మార్టీకి సింబాలిజమైన కుర్చీలో కూర్చుంటాడు మాస్టర్ లా. ఇప్పుడు తనే ఆమెకి మాస్టర్ అన్నట్టుగా. ఆమెకింకా తెలీదు పాపం మార్టీ చనిపోయాడని!
            దీంతో ఫేడ్ అవుట్ అవుతుంది. చీకటి. సంబంధం వికటించడానికి వాతావరణం సిద్ధం.  

28 డే / ఇం. విస్సర్ ఫ్లాట్  - ఫేడ్ ఇన్ 
       ఇలా రాశారు :  తీగ క్లిక్ మన్నశబ్దంతో  కెమెరా డ్రాప్ అవుతున్నపుడు, ఆరెంజి కలర్ సేఫ్ లైటు వ్యూలో కొస్తుంది. ఇంకా డ్రాప్ అవుతున్నపుడు,  మెటల్ డార్క్ రూమ్ ట్రేలో మంటల్లో నెగెటివ్ లు తగలబడుతూంటాయి. 

            అదే ఎల్లో సూటుతో వున్న విస్సర్ చేయి ఫ్రేములోకొస్తుంది. చేతిలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ వుంటుంది. అది ట్రే మంటల్లో పడుతుంది. ఆ ఫోటో మార్టీకి విస్సర్ చూపించిన ఎబ్బీ -  రేల మర్డర్ ఫోటో మరో కాపీయే. అయితే ఇందులో సృష్టించిన బుల్లెట్ రంధ్రాలు, రక్తం సరీగ్గా కుదరలేదు. ఇంకో కాపీ మంటల్లో వేస్తాడు. దీంట్లో ఎబ్బీ - రేల మీద బుల్లెట్ రంధ్రాలుంటాయి గానీ, రక్తం వుండదు. ఇంకో ప్రింటు వేస్తాడు. ఇది ఎబ్బే - రేలు నిద్రపోతూండగా తీసిన ఒరిజినల్ ఫోటో. 

            ఫ్రేములోకి విస్సర్ చేయి వస్తుంది. ఆ చేతిలో మార్టీని ‘చంపి’  ఆఫీసులోంచి పట్టుకొచ్చిన కవరుంటుంది. అందులోంచి ఫోటోఅనుకుని లాగితే ప్లకార్డు బయటపడుతుంది. దాని మీద -“
All Employees Must Wash Hands Before Resuming Work." అని అక్షరా లుంటాయి. 

            లో- యాంగిల్ క్లోజ్ షాట్ లో విస్సర్. దాన్ని విస్తుపోయి చూస్తూ. క్షణం తర్వాత  ఫ్రేములో అతడి చేయి పైకి లేచి పెదాల మధ్య సిగరెట్ పెడుతుంది. చేయి కిందికి వెళ్లి జేబులో వెతుకుతుంది. చేయి ఫ్రేములోకి జంప్ బ్యాక్ అవుతుంది. చేతిలో లైటర్ వుండదు. ఆందోళనగా కోటు జేబులు వెతుకుతాడు. లైటర్ వుండదు. ఫ్రేములోంచి తప్పుకుంటాడు. 

            ఈ సీనుకి గత సీనుకీ ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్ లని ట్రాన్సిషన్ కి బ్రిడ్జింగ్ టూల్ గా వాడుకున్నారు. రెండు సీన్లకీ జంప్ లేకుండా స్మూత్ ట్రాన్సిషన్. ఎలాగంటే,  గత సీనులో ఎబ్బీ - రే ల మధ్య చీకట్లు అలుముకోబోతున్న అర్ధంలో బ్లాకవుట్ (ఫేడ్ అవుట్ ) అయి, ఈ సీనులో ఫేడ్ ఇన్ అవడాన్ని చూస్తే ఇక్కడ ఇది డార్క్ రూమ్. ఆ రోజుల్లో నెగెటివ్ లని కడిగే డార్క్ రూమ్. రెండు సీన్లకీ ఈ ట్రాన్సిషన్ అబ్బింది.

            ఇక ఈ సీనులో విస్సర్  భాగోతమంతా బయట పడింది. ఫేక్  ఫోటోలు సృష్టించిన భాగోతం. ఇప్పుడు ఈ ఆధారాల్ని నిర్మూలిస్తున్నాడు మంటల్లో. మార్టీని ‘చంపి’ అతడి దగ్గర్నుంచి ఎత్తుకొచ్చిన ఫోటో అనుకుని కవరు తెరిస్తే – వెక్కిరిస్తూ మార్టీ పెట్టిన ప్లకార్డు బయట పడింది. మార్టీ ఆ ఫోటోని సేఫ్ లో దాచేసి ఈ మాయ చేశాడని మనకి తెలుసు. ఇప్పుడు తను ఫూలయ్యాడని విస్సర్ కి తెలిసి వచ్చింది. ఆందోళనతో సిగరెట్ వెలిగించుకోబోతే లైటర్ లేదు. ఇదింకో బ్యాంగ్. దీంతో పరిగెత్తాడు.

            వెనుక విస్సర్ మార్టీ ని చంపే సీనులో,  మార్టీ విస్సర్ కివ్వాల్సిన డబ్బు కట్ట ముందు పెట్టినప్పుడు, విస్సర్ దానికేసి చూసే విధానం జవాబు దొరకని ప్రశ్నలా వుండిపోయింది. కళ్ళల్లో మెరుపుతో కాక, చాలా ఉదాసీనంగా చూస్తాడు డబ్బుకేసి. ఎందుకలా చూశాడబ్బా అని ఈ వ్యాసం రాస్తున్నప్పుడు కూడా వెంటాడుతూనే వుంది. విస్సర్ పాత్ర పోషించిన మైకేల్ ఎమ్మెట్ వాల్ష్ గురించి ఇప్పుడు చదివాక ఆ చూపులకర్ధం తెలిసివచ్చింది. 

          ‘బ్లడ్ సింపుల్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతీవారం మొదటి రోజు తన పేమెంట్ ఇస్తూండాలని  కోరాడట వాల్ష్. ఆ నోట్ల కట్టలు వారమంతా జేబుల్లో పెట్టుకుని నటించేవాడట. అలా నోట్ల కట్టలు జేబుల్లో పెట్టుకుని  నటిస్తూంటే, విస్సర్ పాత్రకుండే డాబు దర్పం ఆటోమేటిగ్గా తన కొచ్చేసేవట. దీంతో మార్టీ ఇచ్చిన డబ్బుకేసి అలా ఎందుకు ఉదాసీనంగా చూశాడో మనకి అర్ధమైంది. కోయెన్ బ్రదర్స్ ఇచ్చిన నోట్ల కట్టలు జేబుల్లో నిండుగా వుండగా  కడుపు నిండిన వాడు అలా కాక ఇంకెలా చూస్తాడు.

            ఇప్పుడు 82 ఏళ్ల  వాల్ష్  మొత్తం 114 సినిమాల్లో,  ఓ వంద టీవీ సిరీస్ లో నటించాడు. ‘బ్లడ్ సింపుల్’ కి పూర్వమే 38 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘ఛేంజ్ ఇన్ ది ఏర్’ లో నటిస్తున్నాడు.

29.  మార్టీ శవాన్ని తొలగించానని, ఇక ఫర్వాలేదనీ రే అంటూంటే ఎబ్బీకి అర్ధంగాకపోవడం
       ఇలా రాశారు : క్లోజ్ షాట్ లో రే కునికి పాట్లు పడుతూ వుంటాడు.  ఆఫ్ స్క్రీన్ లో డోర్ వేసిన శబ్దానికి కళ్ళు తెరుస్తాడు. బాత్రూం లోంచి ఎబ్బీ వస్తూ అంటుంది, బెడ్ మీద నిద్ర పోకూడదా అని. నిద్ర పట్టేలా లేదంటాడు. నీకెలా నిద్ర పట్టిందో ఆశ్చర్యంగా వుందంటాడు. నువ్వు ఓకేనా అంటాడు. తను ఓకే అంటుంది. బెడ్ దగ్గరి కెళ్ళి కూర్చుంటూ, మార్నింగ్ నువ్వు కాల్ చేశావుగా అంటుంది. ఔనంటాడు. ఇంకేమైనా అంటాడేమోనని  చూస్తుంది. ఫైనల్ గా అంటాడు, అంతా ఓకేనని నీకు చెప్పేందుకే  కాల్ చేశానని. అన్నీ చక్కబెట్టేశానని. ఇప్పుడిక  రిలాక్స్ అవచ్చనీ.

            ఏంటీ నువ్వనేదని  అంటుంది. తనకి  అంతా తెల్సనీ, నైట్  బార్ కెళ్ళాననీ అంటాడు.  ఎలర్ట్ అయి చూస్తుంది. ఏం జరిగింది, మారీస్ వున్నాడా అంటుంది. ఉన్నాడు గానీ తనని చూడలేదంటాడు, ఎవరూ చూడ లేదంటాడు. చైర్ లోంచి లేచి అనీజీగా అటూ ఇటూ తిరుగుతాడు. చలిగా వుందేమిటని అంటాడు. నెర్వస్ గా అతణ్ణి చూస్తూంటుంది. ఏం జరిగిందని మళ్ళీ అంటుంది. మొత్తం క్లీన్ చేశా,  కానీ అది కాదు ఇప్పుడు ఇంపార్టెంట్ అంటాడు. దేనికోసమో చూస్తూ నెర్వస్ గా తిరుగుతూంటాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామనేది ఇంపార్టెంట్ అంటాడు. కల్లబొల్లి కబుర్లు చెబుతూ వుండలేమంటాడు. బాగా ఆలోచించుకోవడానికి కొంత టైం  తీసుకోవాలంటాడు. ఏదో అనబోతుంది. అతనే అంటాడు, నీకు షూట్ చేయాలని లేకపోతే   ఎవరికీ గన్ గురి పెట్టవద్దని,  షూట్ చేస్తే పూర్తిగా చచ్చేలా షూట్ చెయ్యాలనీ. 

            ఇది చెప్పి ఇంకింత అసహనంగా తిరుగుతూంటాడు దేని కోసమో. చంపాల్సిన వాణ్ణి పూర్తిగా చంపక పోతే వాడు లేచి చంపే ప్రయత్నం చేస్తాడని అంటాడు. బాగా డస్సి పోయి ఆగిపోతాడు. చలికోటు ఎక్కడుందని అడుగుతాడు. అసలేం జరిగిందని గట్టిగా అడుగుతుంది. కిటికీ వైపు నడుస్తాడు. సూర్య కిరణాలు అతణ్ణి చుట్టు  ముడతాయి. అది ఇంపార్టెంట్ కాదనీ, మనిద్దరం  చేశామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అనీ అంటాడు. నాకోసం నువ్వూ,  నీకోసం నేనూ చేసుకున్నా మంటాడు. వంగి  కిటికీ వారగా పడేసి వున్న పాత బట్టల్ని చూస్తూంటాడు. అదీ ఇంపార్టెంటు అంటాడు. నువ్వేమంటున్నావో ఏమీ తెలీడం లేదని అంటుంది. గిరుక్కున తలతిప్పి చూస్తాడు. మౌనంగా  వుండిపోతాడు. దేని గురించి నువ్వంటున్నావ్ రే,  ఫన్నీగా నేనేమీ చేయలేదే అంటుంది. 

            ఏంటీ ఏంటన్నావ్? అంటాడు తీవ్ర స్వరంతో. ఆమె సహనం కోల్పోతుంది. తెల్లారి ఐదింటికి కాల్ చేస్తావ్, ఏదో అంటావ్, ఇక్కడి కొచ్చి జొరబడిపోయి ఏంటో చెప్పకుండా భయపెట్టేస్తావ్, ఇక చాలు నీ దబాయిపు,  అనేస్తుంది కోపం పెరిగిపోయి. 

            రే కేసి కెమెరా ట్రాక్ చేసి విండో బ్యాక్ డ్రాప్ లో అతణ్ణి ట్రాప్ చేస్తే, స్తబ్దుగా నిలబడి పోయి వుంటాడు. చాలా సేపటిదాకా మాటల్లేకుండా వుండిపోతాడు. అప్పుడు, నాతో  అబద్దం చెప్పకు  ఎబ్బీ అంటాడు. 

            పూర్తిగా ఆమెకి ఓర్పు నశించిపోయి, అబద్ధమెలా చెప్తాను అసలు విషయమేంటో తెలీకపోతే అని కసురుతుంది. ఫోన్ రింగవడంతో ఆమె ఆగిపోతుంది.  మోగుతున్న ఫోను వంకే చూస్తుంది. క్షణమాగి,  నా ఉద్దేశం మీరూ మీరూ కొట్లాడుకుంటే నాకవసరమని...
అంటూ మళ్ళీ ఆగిపోతుంది.

            ఫోను మోగుతూనే వుంటుంది. ఒకర్నొకరు చూసుకుంటారు. ఫోనెత్తమంటాడు. క్లోజ్ షాట్ లో టెలిఫోన్. ఫ్రేములోకి ఎబ్బీ చేయి వచ్చి దాన్నందుకుంటుంది. పలుకుతుంది. రెస్పాన్స్ వుండదు.  ఫ్యాను తిరుగుతున్న శబ్దం ఒకటి విన్పిస్తూంటుంది. చెవి మార్చి బాగా వినడానికి ప్రయత్నిస్తుంది. అప్పట్లో రే ఇంట్లో ఆమె ఫోనెత్తినప్పుడు వచ్చిన ఫ్యాను శబ్దం లాంటిదే ఇప్పుడూ వస్తూంటుంది. అప్పట్లాగే ఇప్పుడూ ఫోన్ కట్ అవుతుంది. 

            రే వైపు చూసి, అతనే అని అంటుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. ఎవరు? అంటాడు రే. మార్టీ అని అంటుంది. మళ్ళీ ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

            లాంగ్ షాట్. రే ఏడ్వలేక నవ్వుతాడు. ఉన్నట్టుండి నవ్వాపేస్తాడు. ఏంటి మీ ఇద్దరి గొడవా అంటుంది. ఓకే,  నువ్వు మళ్ళీ కాల్ చేసుకో అదెవరైనా,  అని డోర్  వైపు కదుల్తాడు. నీకు నేను అడ్డుండనంటాడు. జేబులోంచి ఎబ్బీ రివాల్వర్ తీసి అక్కడ పెడతాడు. అతన్నే చూస్తూంటుంది విభ్రమంగా.  రివాల్వర్  మర్చిపోయావ్, అని డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు.

***

       ఇదీ సీను.  ఈ సీను కూడా మామూలుగా – బిగినింగ్ - మొదలై సంఘర్షణ జరిగి – మిడిల్ - దానికి పరిష్కారంతో – ఎండ్ - ముగిసింది. గత సీన్లో ఏర్పాటయిన ఇద్దరి ప్రేమలూవిశ్వాసాల గురించిన సమాచారం మనచేతిలో వుంది. ఇప్పుడు ఇద్దరూ తమతమ దృక్పథాల నుంచి సీను ఎలా నడిపారో చూస్తున్నాం. సీను రే ఒక్కడే నడిపాడు. అతనే ముగించుకుని వెళ్ళిపోయాడు. పంతాలకి పోయి ఇద్దరూ నడిపితే గజిబిజి అవుతుంది.


            ఈ సీను ప్రధానోద్దేశం,  టెలిఫోన్ బూత్ లో ఎబ్బీ మీద రేకి కలిగిన అనుమానం చుట్టూకథ  నడిపి నిగ్గు తేల్చడం. రేకి సంబంధించినంత వరకూ ఇది ముందు తేలాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు. కాబట్టి ఈ అనుమానం  నిగ్గు తేలే వైపే  సీను డ్రైవ్ కన్పిస్తోంది. 

             ఈ సీనులోకి ఇద్దరూ రావడానికి ముందున్న పరిస్థితి గమనిస్తే, మార్టీ కి ఏం జరిగిందో, రే ఏం చేశాడో ఎబ్బీకి తెలీదు. రే కి తెల్సు. మార్టీ ని ఆమే సగం చంపి వదిలేసిందని అనుకుంటున్నాడు. అసలేం జరిగిందన్న సమాచారం ఎబ్బీ దగ్గర లేదు. రే చేతిలో వుంది. అందుకని అతనేమంటున్నాడో అర్ధంగాక నోట మాట రాక వుండిపోతోంది. దీన్ని ఆమె మౌనంగా తీసుకుంటున్నాడతను. పైగా ఫోన్ బూత్ బకరా ఫీలింగ్ కూడా పనిచేస్తోంది. ఆమె మౌనం, ఏమీ తెలీనట్టు వుండడం అతణ్ణి ఉద్రేకానికి లోనుజేస్తున్నాయి. దీంతో సంఘర్షణ పుడుతోంది. ఒకరి మౌనం పుట్టిస్తున్న సంఘర్షణ. మౌనంతో ఇలా అర్ధవంతమైన సంఘర్షణ పుడుతూంటే,  ఇద్దరి ఆరోపణలు ప్రత్యారోపణలతో భారీ గొడవ సృష్టించనవసరం లేదు. 

            ఆమె బెడ్ మీద నిద్రపోకూడదా అంది. ఈ మాట ఎందుకు అనిపించాలి? ఆమెతో ప్రేమకొద్దీ అన్పించినట్టే వుండొచ్చు. కానీ ఈ డైలాగు ఉద్దేశం  ప్రేక్షకులకి అతడి మారిన మనసుని తెలియజేయడం కోసమని సంకల్పించారు దర్శకులు.  అవును, అంత అలసిపోయి వచ్చి బెడ్ మీద ఎందుకు నిద్రపోకూడదు? ఎందుకంటే, ఫోన్ బూత్ ఎఫెక్ట్ అతడి మీద పనిచేస్తోంది. అది కాదనుకుని ఎంత ప్రేమగా ఆమె శిరోజాలు సవరించినా సమాధాన పడలేకపోతున్నాడు. ఆమె బెడ్ ని పంచుకోలేక చైర్ లో ఇలా కునికిపాట్లు పడుతున్నాడు.

            ఈ ఓపెనింగ్ షాట్ లో అతను కూర్చున్న విధానం గమనిస్తే, మార్టీ గుర్తుకొస్తాడు. ఈ టేబుల్ - చైర్, గోడమీద చైర్ నీడా  గురించి అర్ధాలు వెనక సీనులో చెప్పుకున్నాం. ఇప్పుడు చూస్తే  ఆమె జీవితంలోఖాళీ అయిన మార్టీ స్థానంలో కూర్చున్నట్టుంటాడు రే. ఈ కూర్చోవడం కూర్చోవడం కూడా - స్క్రిప్టులో రాయలేదు గానీ  - కాలెత్తి టేబుల్ మీద  పెట్టి కూర్చుంటాడు. ఇది మార్టీ అలవాటే.

            అంటే, ఫోన్ బూత్ బకరా ఫీలింగు సంగతి తేల్చుకోవాలని ‘బాస్’ లా ఇలా కూర్చున్నాడన్న మాట. కథా ప్రారంభంలో ఎబ్బీ రేతో మోటెల్లో వుండగా, ఆమె సంగతి తేల్చుకోవాలని బార్లో మార్టీ ఇలాగే కూర్చున్నాడని గమనించాం.

            ఈ క్రమంలో నడిచే సంభాషణలో అతను  డైరెక్టుగా అడిగెయ్యకుండా ఎన్ని హింట్స్ ఇస్తున్నా  ఆమె అర్ధం జేసుకోలేకపోతోంది. అతనేదో అపార్ధం జేసుకుని ఇలా అంటున్నాడని కూడా ఆమెకి తెలీదు. కాబట్టి అపార్ధాన్ని  తొలగించాలన్న ఆలోచనే రాదు. పరిస్థితి తల్చుకుంటే అతడికి చలి పుట్టుకొస్తోంది. చలి కోటు అడుగుతాడు. తర్వాత కిటికీలోంచి పడుతున్నఎండలో నించుంటాడు.  అక్కడ పడున్న బట్టల్ని చూస్తాడు. అక్కడే అట్టపెట్టె వుంటే అందుకుంటాడు. మళ్ళీ పడేస్తాడు (స్క్రిప్టులో రాయలేదు).  ఈ పిచ్చి పన్లు ఎందుకు చేస్తున్నట్టు? టెన్షన్ తో చేస్తున్నట్టు అన్పించవచ్చు, కానీ కాదు. టెన్షన్ తో పిచ్చిపన్లు ఎవ్వరూ చెయ్యరు. ఇది సైకాలజీ. టెన్షన్ పుట్టించిన సమస్యకి పరిష్కారంగానే ఏదో చేస్తారు తమకే తెలీకుండా. తర్వాత ఆ  చేసిందే నిజమవుతుంది. ఎవ్విరీ థింగ్ ఈజ్ రిలేటెడ్.

            ఆ బట్టల్ని చూడడం, పెట్టె ఎత్తుకోవడం ఇదంతా సబ్ కాన్షస్  ప్రేరక చర్యలు. ఈమెతో విడిపోబోతున్నావ్, ఇంకో వూరెళ్ళి పోబోతున్నావ్ - అని చెప్తోంది అతడి సబ్ కాన్షస్ మైండ్. తదనుగుణంగా ఈచర్యలకి దారితీయిస్తోంది. అతనే  పసిగట్టడం లేదు. సబ్ కాన్షస్ మైకు పెట్టి మాట్లాడదు. గుసగుసలాడుతుంది.  ఈ గుసగుసలు విన్పించుకునే స్థితిలో దాదాపు ఎవ్వరూ వుండరు. అందుకే సహజాతంతో ప్రవర్తించే జంతువులకన్నా మనుషుల జీవితాలిలా అఘోరిస్తూంటాయి.

            సబ్ కాన్షస్ హెచ్చరించినట్టే ఈ సీన్లో చివరికి  ఆమెకి బై చేప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్వాత వచ్చే సీన్లో ఏం చేశాడూ? తన ఫ్లాట్ లో అట్ట పెట్టెల్లో బట్టలు సర్దుకుంటూ కూర్చున్నాడు! ఆమె వచ్చి అడిగితే వూరెళ్ళి పోతున్నానన్నాడు – ఎవ్విరీ థింగ్ ఈజ్ రిలేటెడ్!  దటీజ్ సబ్ కాన్షస్ మైండ్!

            మనిషి జీవితం ఎన్ని డైమెన్షన్స్ తో వుంటుందో అవన్నీ ఇలా సహజంగా, సజీవం గా, రక్త మాంస - ఆత్మ సహిత కథనంగా  చూపిస్తున్నారు కోయెన్ బ్రదర్స్. కథ  అంటే కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే అని చెప్పాడు జేమ్స్ బానెట్. కథంటే అవసరాన్నిబట్టి సబ్ కాన్షస్ మైండ్ నడిపించే పాత్రలని కూడా ఇలా చెప్తున్నారు కోయెన్ బ్రదర్స్.

            ఇంకా ఆమె వైపు చూస్తే, రే బార్ కెళ్ళానన్నప్పుడు, అక్కడ మారీస్ వున్నాడా అని గబుక్కున అనేస్తుంది ఎబ్బీ. మారీస్ ఎందుకు గుర్తొచ్చాడు? అంటే ఆమె అంత ఎలర్ట్ గా వుంది. వెనకటి ఫస్టాఫ్ ఒక సీన్లో బార్ కెళ్ళి , ఇకముందు రే వస్తే మార్టీ ఇతనూ గొడవపడకుండా చూడమని మారీస్ ని కోరిన విషయం గమనించాం. అందుకే ఇప్పుడు అలా అడిగేసింది.

            ఇక సీను ముగిసే కొద్దీ ఇంకో రెండు ఆమె ఖర్మకొద్దీ జరిగాయి అతడికి చిక్కదానికి. అతనసలే  ఆమె మీద అనుమానంతో వచ్చాడు. ఆ అనుమానాన్ని నిజమయ్యేట్టు ఆమె వైపు నుంచి జరుగుతున్నాయి. మళ్ళీ ఏం చేసింది -
దేని గురించి నువ్వంటున్నావ్ రే,  ఫన్నీగా నేనేమీ చేయలేదే అనేసింది. తెగతెంపుల కిది ఇంకో మెట్టు!

            ఫస్టాఫ్ బిగినింగ్ విభాగం 7 వ సీనులో చూద్దాం. ఈసీనులో రే మార్టీ దగ్గరకి జీతం డబ్బుల కోసం వెళ్ళినప్పుడు-మాటా మాటా పెరిగిపోయి మార్టీ ఇలా అంటాడు అక్కస్సుగా-

            “దేనికి నవ్వుతావ్? ఫన్నీ గైలా కన్పిస్తున్నానా? యెదవలా  కన్పిస్తున్నానా? నో నో నో నో- ఫన్నీగా వున్నది నేను కాదు, ఫన్నీగా వున్నది నీ లవర్. నేను మీ ఇద్దరి మీద నిఘా పెట్టించాను చూడూ అదీ ఫన్నీ. ఎందుకంటే నువ్వు కాకపోతే అదింకొకడితో పడుకునేదే,  కాబట్టీ అదీ ఫన్నీ. నీకింకా చాలా ఫన్నీగా ఎప్పుడన్పిస్తుందంటే, ఏంటీ రే నువ్వు మాట్లాడుతున్నదీ... ఫన్నీగా నేనేం  చేశాననీ? అని అమాయకంగా అది మొహం పెట్టి అంటుంది చూడూ, అప్పుడూ!” – అని.

            ఇప్పుడు ఈ విషమ పరిస్థితిలో సరీగ్గా ఎబ్బీ ఇలాగే అనేసింది – దేని గురించి నువ్వంటున్నావ్ రే,  ఫన్నీగా నేనేమీ చేయలేదే!” – అని.

            దొరికిపోయింది! తెగతెంపులకి దొరికిపోయింది!  చేతులారా అనుమానం పూర్తిగా బలపర్చుకుంది - తను ఇంకెవర్నో చూసుకుని రేని బకరా చేస్తోందనుకుంటున్న అనుమానాన్ని!

            ఇక చిట్ట చివరి చరణం కూడా అందుకుంది రిలేషన్ షిప్. ఫోన్ కాల్ వచ్చింది. వెనక 9 వ సీనులో ఫోన్ కాల్ వల్లే పరస్పర అనుమానాలతో చెడింది. అప్పుడు మార్టీ చేశాడు. ఇప్పుడెవరు చేశారు? నీడలా మారిపోయిన మార్టీ దెయ్యమై కాల్ చేస్తున్నాడా అప్పుడే?  ఇది హార్రర్ కథ కాదు కాబట్టి ఇలా వూహించలేం, విస్సర్ చేసి వుంటాడు. మనోడు డిస్టర్బ్ అయి వున్నాడు. లైటర్ లేదు, ఫోటో లేదు. రెండూ బార్లోనే వుండి వుంటాయి. బార్ కెళ్ళి వెతకాలంటే ముందు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. వీళ్ళు బార్లోనే వుంటే, లేదా తను వెళ్ళినప్పుడు వస్తే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఇలా కాల్ చేసి వుంటాడు. ఇదే  ఎబ్బీ కొంప ముంచింది. అప్పుడూ ఇప్పుడూ తనే ఎత్తింది. అప్పుడు మార్టీ మాటలు విన్పించకుండా ఫ్యాను శబ్దమే విన్పించింది. ఇప్పుడు కూడా  ఫ్యాను శబ్దమే విన్పించడంతో ‘మార్టీ’ అనేసింది రే తో!

            ఐపోయింది. ఈమాటతో ఏడ్వలేక నవ్వాడు. అబద్ధం కూడా చెప్పడం రావడం లేదీమెకి. ప్రియుణ్ణి కవర్ చేసుకోవడానికి తను చంపేసిన మార్టీ అంటోంది. ఐపోయింది అనుమానం తీరిపోయింది. తను బకరానే! 

            ఇంతసేపూ వీళ్ళిద్దరి విడివిడి షాట్సే జాగ్రత్తగా మెయింటెయిన్ చేశారు. ఇప్పుడు చరమగీతం పాడేశాక వైడ్ షాట్ లో ఓపెన్ చేశారు.  ఇద్దరూ ఇటు చివర ఒకరు, అటు  చివర ఒకరు నిలబడి వుంటారు. ఇంతసేపూ ఇలాగే  వుండి వుంటారు. మనకి చూపించలేదు. వాళ్ళ మధ్య ఆఖరి ఆశ కూడా హుష్ కాకీ అయిపోవడంతో ఇంకేం లేదన్న అర్ధంతో దూరాలు చూపించే  వైడ్ షాట్ వేశారు. షాట్స్ కథని ఫాలో అవడమంటే ఇదే (పై ఫోటో చూడండి).

            అదెవరో మళ్ళీ కాల్ చేసుకో-  అనేసి వెళ్ళిపోయాడు ఆమె రివాల్వర్ అక్కడ పెట్టేసి. ఆమె కసలిదంతా ఏమిటో ఏమీ తెలీదు. ఈ సీను లో ఇక్కడ వర్ణించడం కుదరలేదు గానీ, క్లోజప్స్ లో వీళ్ళిద్దరి భావప్రకటనలు ఖచ్చితంగా వీడియో చూసి ఫీలవ్వాల్సిందే, స్టడీ చేయాల్సిందే- సృజనాత్మకంగా, సాంకేతికంగా.  


(సశేషం)

-సికిందర్