రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, అక్టోబర్ 2019, శుక్రవారం

885 : స్క్రీన్ ప్లే అప్డేట్స్



      స్టోరీ అయిడియాలు అనేక ప్రాప్తి స్థానాల నుంచి లభిస్తూంటాయి. చదివిన వార్తో, చూసిన సంఘటనో, విన్న సంభాషణో... ఏదైనా కావొచ్చు. ఆర్ట్ గ్యాలరీలలో పెయింటింగ్స్ ని తదేకంగా చూస్తూ దీని అర్ధమేమిటాని దీర్ఘంగా ఆలోచిస్తూంటాం. ఏదో అర్ధమవచ్చు, ఏదో అర్ధమవక పోవచ్చు. అంతటితో వదిలేస్తాం. కానీ వీటిని కూడా స్టోరీ ఐడియాల కోసం పరికిస్తే? వీటి ఆధారంగా కథ చెప్పాలన్పిస్తే? అప్పుడు వొరిజినల్ ఐడియాలు తట్ట వచ్చు. ప్రతీ పెయింటింగ్ ఒక కథ చెప్తుంది. ఆ పెయింటింగ్ లో వుండే డిటెయిల్స్ ని కలుపుకుని కథ అల్లుకోవచ్చు. ఏ పెయింటింగైనా కొన్ని జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది. ఆ జ్ఞాపకాల్లో డామినేటింగ్ ఫీలింగ్ ఏదైతే వుంటుందో దాంతో కనెక్ట్ అయి పెయింటింగ్ ని ఆస్వాదిస్తాం. జ్ఞాపకాల్లో బాధాకరమో, సంతోషకరమో, స్ఫూర్తి దాయకమో, ఏదో ఒక ఫీలింగ్ నిచ్చిన సన్నివేశముండొచ్చు. వీటిలో ఏది డామినేటింగ్ గా వుంటే  ఆ ఫీలింగ్ తో పెయింటింగ్ తో కనెక్ట్ అవుతాం. పక్క పెయింటింగ్ చూస్తే, మనం గడిపిన ఎన్నో రైల్వే స్టేషన్లు జ్ఞాపకాల పొరల్ని దొల్చుకుని రావొచ్చు. ఎన్నో అనుభవాలు మెదలొచ్చు. వీటిలో ఒక స్టేషన్లో అయిన బాధాకర అనుభవమే మిగతా స్టేషన్లలో అయిన అనుభవాల్ని మరిపించే డామినేటింగ్ ఫీలింగ్ గా వుంటే, ఈ బాధాకరమైన ఫీలింగ్ తో పెయింటింగ్ ని చూస్తాం. సంతోషకరమైన  ఫీలింగ్ డామినేటింగ్ గా  వుంటే దాంతో చూస్తాం. ఈ డామినేటింగ్ ఫీలింగ్సే పెయింటింగ్స్ లో స్టోరీ ఐడియాలని నిర్ణయిస్తాయి.

        పై పెయింటింగ్ చూడగానే ఆహ్లాదకర ఫీలింగ్ తో కనెక్ట్ అయ్యామనుకుందాం, అప్పుడీ పెయింటింగ్ చెబుతున్న కథేమిటా ఆలోచిస్తాం. ఇది ఎప్పుడో అప్పటి ‘బొంబాయి’ స్టేషన్ దృశ్యం. పొగలు గ్రక్కుతూ ఆగిన రైలు. అది ప్లాట్ ఫాంలా లేదు. జనం తిరిగే రోడ్డులా వుంది. డిటెయిల్స్ లోకెళ్తే, ముందుగా మెయిన్ ఫిగర్. ఇదొచ్చేసి సైకిలు పట్టుకుని ఆగిన వ్యక్తి.  ఇతను ఆఫీసులకి లంచ్ బాక్సులు మోసే డబ్బావాలా. బొమ్మలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది నీడలు. ఇవే ఆ డబ్బా వాలా కథ చెప్తున్నాయి. నీడలు ఇటు ఫోర్ గ్రౌండ్ లో పడుతున్నాయి. అంటే సూర్యుడు అటు వెనకాల వున్నాడు నీడల్ని బట్టి. ఆ వెనుక భవనం కన్పిస్తోంది. ఆ భవనం వెనకాల సూర్యుడు కన్పించకపోయినా, సూర్యుడు అటువైపే వున్నాడు. అది ఉదయించే సూర్యుడా, అస్తమించే సూర్యుడా? ఎందుకంటే నీడలు పొడవుగా పడుతున్నాయి, మధ్యాహ్నపు సూర్యుడై వుండడు. ఇక ఉదయం వేళ కూడా అయి వుండదు. ఎందుకంటే డబ్బావాలాలు లంచ్ అవర్ కల్లా బాక్సులు ఆఫీసులకి చేరేస్తారు. అందుకు ఇంత ఎర్లీగా బయలేదేరరు. కనుక ఇది సాయం వేళ. అయితే సాయం వేళ తిరిగి ఖాళీ బాక్సులు ఇళ్ళకి చేరేయరు డబ్బావాలాలు. ఉద్యోగులే తీసికెళ్ళిపోతారు. అంటే ఈ డబ్బావాలా  లంచ్ బాక్సులతో ఎప్పుడో బయల్దేరినా, సాయంత్రమవుతున్నా ఇంకా ఆఫీసులకి చేరుకోలేదన్నమాట!

Ejoumale Djearamine
       ఇదీ బొమ్మ చెప్పే కథ. ఇంకా డిటెయిల్స్ లో కెళ్దాం. చిత్ర కారుడు వ్యూహాత్మకంగా బొమ్మ వేశాడు. ఎక్కడా డబుల్ డిటెయిల్స్ ఇవ్వలేదు. ఆపరేటింగ్ డిటెయిల్స్ మీంచి దృష్టి చెదిరే ఎలాటి సెకండరీ డిటెయిల్స్ ఇవ్వలేదు. వాటిని ఎడిట్ చేశాడు. చెప్పాలనుకున్న థీమ్ వచ్చేసి, సాయంత్ర మవుతున్నా డబ్బావాలా ఆఫీసులకి చేరుకోలేదని. దీనికి సమయాన్ని సూచించే ఎండ తీవ్రతని, నీడల దిశనీ మాత్రం చూపిస్తే చాలు. ఇంకా భవనం వెనకాల సూర్యుడి జాడ కూడా చూపించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నీడల్ని డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్న వాహనాల్ని చూపించలేదు. ఇటు ఒకవైపే వస్తున్న వాహనాలని చూపించాడు. ఇంకా అటూ ఇటూ తిరిగే మనుషులతో కూడా నీడల్ని డిస్టర్బ్ చేయలేదు. మనుషుల్ని రైలు కటు వైపున్న ఫ్లాట్ ఫాం మీద చిత్రించాడు. ఇద్దరు మనుషుల్ని ఇటు చూపించినా నీడల్ని డిస్టర్బ్ చేయలేదు.  

       వాహనాల మీద మనుషులందరూ డబ్బా వాలాకి ఎదురొస్తున్న వాళ్ళే. వాళ్లకి ఎదురె ళ్తూ డబ్బావాలా ఒక్కడే హైలైట్ అవుతున్నాడు. ఇంకెవరితోనూ థీమ్ ని డిస్టర్బ్ చేయలేదు. అయితే అతను వెళ్తున్న దిశకే రైలింజను పొగ కూడా చూపిస్తూ సెకండరీ డిటెయిల్ ఇచ్చినా ఇది డిస్టర్బ్ చేయడం లేదు. ఇదింకో అర్ధాన్నిస్తోంది. ఇది తర్వాత చెప్పుకుందాం.  

          డబ్బావాలాకి ఎదురొస్తున్న వాళ్ళు బైక్స్ మీద వున్న వాళ్ళే. ఎవరూ సైకిల్ మీద లేరు. సైకిలుతో డబ్బావాలా ఒక్కణ్ణి చూపించినప్పుడే మన మైండ్ కథని పట్టుకుంటుంది. ఆ కథ పరుగులు దీస్తున్న కాలంతో ఇంకా సైకిలు మీద పోటీ పడుతున్నాడని. ఇప్పుడతను సైకిలు తొక్కుతూ ఎదురు వెళ్ళడం లేదు. ఆగిపోయి ఆలోచనలో పడ్డాడు. వీళ్ళందరూ బుర్రుమని మోటారు బళ్ల మీద ఆఫీసుల నుంచి వచ్చేస్తూంటే, ఇప్పుడు తను సైకిలు తొక్కుతూ వెళ్ళి పీకేదేంటని. 

S Elayaraja 

          ఆ వెనుక ఎత్తైన భవనం ఇంకో సింబాలిజం. సమయానికి ఆఫీసుకి చేరుకోలేకపోయాక అది భూతంలా కన్పించడం సహజమే. రైలు పొగో, పొగ మంచో కూడా ఆ భవనాన్ని ఆవరించి మిస్టీరియస్ లుక్ నిస్తోంది. ఈ డిటెయిల్ చెదరకుండా వుండేందుకు కూడా భవనం వెనకాల సూర్యుడి ఉనికి ఏమీ ఇవ్వలేదు. నీరెండని భవనం మీద వేయకుండా, ఆపరేటింగ్ డిటెయిలుగా రైలు మీద వేసి రైలుని హైలైట్ చేశాడు.
          ఈ రైలేం చెప్తోంది? రైలంటే వేగం, మహా వేగం. అటుపక్క మోటారు వాహనాల వేగం. మధ్యలో వేగం లేని సైకిలుతో డబ్బా వాలా. రైలుని అవిరింజనుతో ఎందుకు చూపించడం? అంటే ఆ కాలంలోనే జీవన వేగం పెరిగిపోయిందని సైకిలుకి సాపేక్షంగా చూపించడానికి. ఇక రోడ్డేమిటి నీళ్ళు పడకపోయినా అద్దంలా తళతళ లాడుతూ స్పష్టమైన నీడల్నిస్తోంది? ఇక్కడ రోడ్డుని కూడా హైలైట్ చేయడం. రైలు పక్కన ప్లాట్ ఫాం వుంటుంది. రోడ్డు వుండదు. అంటే రైలంత వేగంగా ఇప్పుడు రోడ్ల మీద పరుగులు దీస్తున్నారు....మహా యంత్రపు రైలు మార్గాలూ, మోటారు వాహనాల రోడ్లూ ఒక్కటే, మధ్యలో నువ్వేంటి ఇంకా సైకిలు మీదా...అన్న సెన్స్. ఇదీ సంధికాలంలో డబ్బావాలా స్ట్రగుల్.

          ఈ పెయింటింగ్ ఫ్రేం అవతల కూడా కథ వుంటుంది. అటు లంచ్ బాక్సులందక ఇళ్ళకి ఫోన్లు చేసే ఉద్యోగుల ఆకలి కేకలుంటాయి. అక్కడింకెన్ని కథలు నడుస్తున్నాయో తెలీదు. 

          పెయింటింగ్ చెప్పే కథ, దాని ఫ్రేం అవతల వుండే కథలు కలిపి ఆలోచిస్తే స్టోరీ ఐడియాలు రావచ్చు. మనకి డబ్బా వాలాలుండరు. పాల వాడు కావచ్చు, ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి బైసికిల్ రైడ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ అతను కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. ఒక క్యారెక్టర్ పుట్టడానికి కూడలి. 

Raghunath Saaho 
         ఈ పోస్టులో మరికొన్ని పెయింటింగ్స్ ఇచ్చాం ఎక్సర్ సైజుకి. ఈ ఎక్సైర్ సైజులో ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు : పెయింటింగ్ కల్గిస్తున్న ఫీలింగ్ ఏమిటి? ఏ జ్ఞాపకాల్ని తట్టి లేపుతోంది? పెయింటింగ్ ఏదైనా రహస్యం చెబుతోందా? ఫ్రేం అవతల కథలో  ఏం జరుగుతూండొచ్చు? పెయింటింగ్ లో వున్న దృశ్యం కంటే ముందు ఏం జరిగి వుండొచ్చు? ఈ దృశ్యం తర్వాత ఇంకేం జరగొచ్చు? 

          దృశ్యంలో మెయిన్ ఫిగర్ స్థానే క్యారక్టర్నే వూహించుకుంటే?  క్యారక్టర్ కి ఇంతకి ముందే ఏదో జరిగి వుంటే దానికేం ఆలోచిస్తున్నాడు? ఎలా రియాక్ట్ అవబోతున్నాడు? క్యారక్టర్ కి ఈ సన్నివేశం తర్వాత ఏదో జరిగి జీవితం తలకిందులవబోతోందా? క్యారక్టర్ ఇప్పుడేదైనా రహస్యం బట్ట బయలు చేయబోతోందా? లేదా ఈ పెయింటింగ్ లో కన్పిస్తున్న దృశ్యమే క్యారక్టర్ కి ప్రతీ రాత్రి కలలోకి వస్తూ వెన్నాడుతోందా? దీనికేం కథ వుంది?...ఇలా ఎన్ని ప్రశ్నలైనా వేసుకోవచ్చు. ఈ ప్రశ్నల్లోంచి ఒరిజినల్ ఐడియాతో సినిమా కథకి పునాది పడొచ్చు. కావాలంటే ఇంటర్నెట్ లో ఇంకా చాలా పెయింటింగ్స్ వుంటాయి, ప్రాక్టికల్స్ కి  వాడుకోవచ్చు.

సికిందర్