రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 8, 2016

రివ్యూ!

రచన-  దర్శకత్వం : ఆనంద్ శంకర్

తారాగణం :   విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్, తంబిరామయ్య, బాలు, కరుణాకరన్, రిత్విక తదితరులు.
మాటలు : శశాంక్ వెన్నెల కంటి, సంగీతం
: హరీష్ జైరాజ్, ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్,
బ్యానర్ : ఎన్
.కె.ఆర్.ఫిలింస్,  నిర్మాత : శింబు తమీన్స్,  తెలుగు నిర్మాత : నీలం కృష్ణారెడ్డి విడుదల  : సెప్టెంబర్ 8, 2016
***
          ‘పరిచితుడు’ సూపర్ సక్సెస్ తర్వాత విక్రం గెటప్స్ మీద మమకారం పెంచుకుని మల్లన్న, రావణ్, ఐ లాంటి అంతగా ప్రేక్షకులు మెచ్చని సినిమాలు చేస్తూ, తాజాగా మరో గెటప్ తో ‘ఇంకొక్కడు’ అంటూ వచ్చాడు. ఇంకెన్ని గె ‘తప్పులు’ భవిష్యత్తులో ఉంటాయో తెలీదు- తనకి మాత్రం గెటప్స్ తో  పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్నట్టుంది- ఈసారి ఆడా మగా కాని విలన్ గా ద్విపాత్రాభినయం చేస్తూ ‘అరిమా నంబి’ ( తెలుగులో ‘డైనమైట్’)  దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విచ్చేశాడు. 

       
తెలుగులో చూడాలంటే ఈ రోజుల్లో స్పై థ్రిల్లర్స్ లేవు. తమిళ డబ్బింగుతో ఈ లోటు తీరుతుందేమో అనుకుంటూ ఈ సినిమా కెళ్తే నిజంగా ఎలాటి అనుభవం ఎదురవుతుంది, కొత్త గెటప్ తో విక్రం ఈసారి ఎంత రంజింపజేస్తాడూ అన్నవి ఓసారి చూద్దాం. 

కథ 

        దేశంలో మలేషియా రాయబార కార్యాలయం మీద జరిగిన దాడిని పురస్కరించుకుని ఇండియన్ గూఢచార సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) దర్యాప్తు చేపడుతుంది. దీని చీఫ్ గా మల్లిక్ (నాజర్), ఏజెంట్ గా ఆరుషి (నిత్యా మీనన్) వుంటారు. దాడి దృశ్యాల విజువల్స్ లో దాడి జరిపిన వృద్ధుడి మెడ మీద ఒక పచ్చబొట్టు కీలక సాక్ష్యంగా మారుతుంది. అది పూర్వం ‘లవ్’ (విక్రం డబుల్) అనే క్రిమినల్ గ్యాంగ్ గుర్తు అని చెప్తుంది ఆరుషి. అయితే నాల్గేళ్ళ  క్రితం ఒక ఆపరేషన్లో ‘లవ్’ ని చంపిన మాజీ ‘రా’ ఏజెంట్ అఖిల్ (విక్రం) ని పిలవమంటాడు మల్లిక్. అఖిల్ వచ్చేసి అరుషి తోడుగా కేసు చేపడతాడు- ఈ కేసు మలేషియా ప్రయాణానికి దారి తీస్తుంది. నాల్గేళ్ళ క్రితం అఖిల్ భార్య మీరా (నయనతార) ని ‘లవ్’ చంపేశాడు. ఈమె కూడా ‘రా’ ఏజెంటే. భార్య హత్యకి మొత్తం గ్యాంగు నంతా అప్పట్లోనే హతమార్చాడు అఖిల్. మరిప్పుడు ఈ ‘లవ్’ అంటూ ఇంకెవడు వచ్చాడో అర్ధంగాదు అఖిల్ కి. 

        గతంలో ‘లవ్’ భారీ కుట్రకి తెర తీశాడు. తన ప్రయోగశాలలో ‘స్పీడ్’ అనే ఒక మందు తయారు చేశాడు. దీన్ని ఇన్ హేలర్ లాంటి సాధనంలో పెట్టుకుని పీల్చితే శరీరంలో అమాంతం ఎడ్రెనలిన్ హార్మోన్ పెరిగిపోయి విపరీతమైన బలం వచ్చేస్తుంది. ఆ బలంతో ఎవరికైనా సాధ్యం కానిదేమీ వుండదు. దీన్ని టెర్రరిస్టుల కోసం ఉత్పత్తి చేశాడు ‘లవ్’. అయితే ఇప్పుడు మలేషియా రాయబార కార్యాలయం మీద దాడిలో వాడింది కూడా ఈ ఇన్ హేలరే. ఇప్పుడు దీన్ని ఇంకెవరు తయారు చేస్తున్నారు? ఎక్కడ తయారు చేస్తున్నారు? తాజాగా ఇంకే కుట్ర పన్నుతున్నారు?... ఇవన్నీ కనుగొని అఖిల్ ఎలా అడ్డు కున్నాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
          కథ స్పై థ్రిల్లరే, కానీ స్పై థ్రిల్లర్ కీ రొటీన్ గా వచ్చే యాక్షన్ థ్రిల్లర్స్ కీ తేడా లేనట్టు వుంది. జేమ్స్ బాండ్ స్పై థ్రిల్లర్స్ రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్స్ లా వుండవు కదా? స్పై థ్రిల్లర్స్ అంతర్జాతీయ గూఢచర్యానికి సంబంధించినవి. ‘లవ్’ ఒక్కడే అంత పెద్ద అంతర్జాతీయ కుట్ర చేసుకుంటున్నట్టు గాకుండా, మరి కొందరు గ్లోబల్ విలన్స్ కూడా వుండాల్సింది;  కథ ఇంకో రెండు మూడు దేశాలకి తిరగాల్సింది. హీరో కూడా మాస్ లుక్ తో గడ్డం పెంచుకుని గాక, హీరోయిన్స్ లాగే  ఇంటర్నేషనల్ స్పైలా,  స్టయిలిష్ గా వుండాల్సింది. కథని స్పై థ్రిల్లర్ లా విస్తరించివుంటే సెకండాఫ్ బోరుకోట్టేది కాదు. ఎంతసేపూ మూడు నాల్గు పాత్రలతో విషయం అక్కడక్కడే తిరుగడంతో ఒక దశలో శూన్య స్థితికి కూడా చేరుకుంది కథ. స్పై థ్రిల్లర్స్ లో యాక్షన్ కూడా సీరియస్ గా, హింసతో కూడుకుని వుండదు. లైటర్ వీన్ యాక్షన్ తో జాకీ చాన్ లా నవ్విస్తూ, ఎంటర్ టైన్ చేస్తూ  సాగిపోతాడు స్పై హీరో. ఇవన్నీ ఇందులో లోపించాయి- స్పై థ్రిల్లర్ ఫీల్ కి న్యాయం చేయకుండా. 

ఎవరెలా చేశారు
       పాపం ట్రైలర్స్ లో ‘ఇంకొక్కడు’ మాస్ టైటిల్ కి, విక్రం ఆడ లుక్ కీ ఆకర్షితులై మాస్ లేడీస్ కూడా వచ్చారు ఉదయాన్నే సినిమాకి. వాళ్ళందరూ బుక్కైపోయారు. ఆడ లుక్ తో విక్రం ఈ క్లాస్ మ్యనరిజమ్స్ తో వాళ్ళని అలరించలేక పోయాడు. క్లాస్ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారా అంటే ఏదో చూస్తున్నమంటే చూస్తున్నామన్నట్టు పాసివ్ గా చూశారు తప్ప, ‘అపరిచితుడు’ లో చూసినట్టు కిర్రెక్కి పోలేదు. అంత క్రేజీ క్యారక్టర్ గా లేకపోవడంతో ఈ కష్టం. కానీ ఈ గెటప్ లో  సభ్యతగా చాలా కంట్రోల్లో వుండి  నటించాడు విక్రం. మూతి విరుపులు, కంటి చూపులు ఈ రెండిటి తోనే పాత్రని ఆ మేరకు సాఫ్ట్ గా నటించాడు.
        స్పై పాత్రలో విక్రం దంతా సీరియస్ నటనే. ఇదంతా రొటీన్ గానే  వుంది. గుర్తుండిపోయే సన్నివేశాలేవీ లేవు. ఇక నయనతార షరామామూలుగా తన డల్  నటనతో చాలాసేపు ఇబ్బంది పెట్టి, సెకండాఫ్ సగంలో యాక్షన్ లోకి వస్తుంది. అయితే ఈ యాక్షన్ కూడా ఫాస్ట్ గా ఏమీ వుండదు. ఇకపోతే నిత్యా మీనన్ సంగతి- ఈమె సినిమాల్లో ఎందుకు నటిస్తోందో అర్ధంకాదు. ఇప్పుడుకూడా ఏమీ చేయని పాత్రలో ఫ్రేములు నింపడానికే అన్నట్టు వుంటుంది. ఒక ‘రా’ ఏజెంట్ గా ఒక్క యాక్షన్ సీనూ లేదు. తోటి ఏజెంట్ అయిన హీరో పోరాడుతూంటే, ఫార్ములా  యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ లాగా ఆ పక్కన నించుని చూస్తూంటుంది. పైగా ఒక ఫైట్ సీనులో హీరో ఆమెని కారెక్కి కూర్చోమంటాడు! ఆమె డ్యూటీ చేయాల్సిన స్పై ఎజెంట్ అనుకున్నాడా లేకపోతే, ఇది మూస యాక్షన్ సినిమా అనుకుంటూ తన లవర్ అనుకున్నాడా? ఒకవేళ ఆమె లేడీ పోలీస్ అయివుంటే ఆ మాట అంటాడా?  

        దర్శకుడికి ఈ జానర్ పట్ల ఏమాత్రం స్పష్టత లేదు. రాకరాక ఒక స్పై సినిమా వస్తే ఆ ఫీల్ ని కూడా నోచుకోకుండా చేశాడు. జానర్ స్పష్టత లేని సినిమాలు బోల్తా కొట్టినట్టే,  ఇది కూడా ఆ ప్రమాదపు టంచుల మీదుంది. 

        చాలా రోజుల తర్వాత హేరీస్ జయరాజ్ ఫ్రెష్ మ్యూజిక్ తో వచ్చాడు. పాటలకీ, బ్యాక్ గ్రౌండ్ కీ మంచి ట్యూన్లు ఇచ్చాడు. థీమ్ మ్యూజిక్ కూడా సన్నివేశాల్ని ఎలివేట్ చేస్తూ బాగా పని కొచ్చింది. అలాగే ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఉన్నతంగా వుంది. గ్రాఫిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు లేదు. యాక్షన్ సీన్స్  జానర్ కి తగ్గట్టు లేవు. 

చివరికేమిటి?
       
ఇంకో కొత్త రూపంతో విక్రం రావడం బాగానే వుంది  గానీ విషయం కూడా కొత్తగా, బలంగా  ఉండేట్టు చూసుకోలేదు. పోనీ ఈ గెటప్ అయినా- ‘డార్క్ నైట్’ లో విలన్ జోకర్ లా  విషయాన్ని పైకెత్తిందా అంటే అదీ లేదు. కథలో పాత్రలకి ప్రమాదం పొంచి ఉన్నదీ లేదు. ప్రమాదాన్ని మందు ఉత్పత్తికి, సరఫరాకి మాత్రమే పరిమితం చేయడం స్పై సినిమాకైనా, మామూలు యాక్షన్ సినిమాకైనా దారుణం. ఆ మందుతో విలన్ ఫలానా  నగరంలో బీభత్సం సృష్టించ బోతున్నాడన్న ప్రమాదం పొంచివుంటే, చివరి క్షణాలవరకూ దాన్ని హీరో ప్రాణాలొడ్డి అడ్డుకోబోతూంటే  ఎక్కువ థ్రిల్ వుంటుంది చూడ్డానికి. అలాగాక, విలన్ ఏం ప్రమాదం తలపెడతాడో వూసే లేని థ్రిల్లర్ ఒక థ్రిల్లర్ అవజాలదు. విలన్ ఏం ప్రమాదం తలపెడతాడో చిత్రించకుండా, వూరికే  ఆ మందు సరఫరాని ఆపడమే హీరో లక్ష్యంగా వుంటే అది సినిమాకి చాలని విషయం. విలన్ ఎంత ప్రమాదకారియో చూపనప్పుడు హీరో ఎన్ని తిప్పలు పడ్డా వృధా. 

        ఫస్టాఫ్ ‘లవ్’ ఎవరో తెలుసుకోవడానికి కథ నడిపినా- ఇంటర్వెల్ ఎందుకో ‘సింహాద్రి’ ని గుర్తుకు తెచ్చి బలంగా వుండదు. ఇక సెకండాఫ్ అంతా బలవంతంగా నడిపిన కథలాగా చాలా చోట్లా భారంగా వుంటుంది. కథ పెరగక పోవడం వల్లే ఈ సమస్య. రెండు పత్రాలు పోషిస్తూ విక్రం ఈ మంచి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోవడం విచారకరం.


-సికిందర్