రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 19, 2018

715 : స్క్రీన్ ప్లే సంగతులు


    ఉపకథ ప్రధాన కథ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ప్రధాన కథ రొటీన్ గా, విషయం తక్కువగా అన్పిస్తే ఉపకథలతో కవర్ చేయవచ్చని ఇటీవల ‘ఈక్వలైజర్ 2’ లో తెలిసింది. అంతేగానీ ఫస్టాఫ్ ఓ కథ ప్రధానంగా చెప్పుకొస్తూ, దాన్ని వదిలేసి సెకండాఫ్ లో ఇంకేదో కథని అతికించే ప్రయత్నం చేస్తే సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండం ఏర్పడుతుంది. చెబుతున్న విషయాన్ని పక్కకి నెట్టి ఇంకో విషయం ఎత్తుకోవడమే సెకండాఫ్ సిండ్రోం. సాధారణంగా ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇలా జరుగుతుంది. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ ఇంకో కథ. సైజ్ జీరో, జ్యోతి లక్ష్మి వంటి ఫ్లాప్స్ ఇందుకుదాహరణగా వున్నాయి. ఇంకా ముందు దొంగోడు, దమ్ లు కూడా ఇలాటివే. హవా, తేరే నామ్ లు కూడా ఇలాటివే. ఇవన్నీ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఈ వరసలో భైరవ గీత చేరింది. ఫస్టాఫ్ మధ్యలో ఆపేసిన ప్రేమ కథ, సెకండాఫ్ లో అందుకున్న బానిసల ఉపకథ. ఇదెలా జరిగిందో చూద్దాం. 

మిడిల్ – 1 
        *గీత ఈ పెళ్లి చేసుకోనని, భైరవనే చేసుకుంటానని తండ్రి సుబ్బారెడ్డికి చెప్పేయడం, ఎక్కడున్నా భైరవని వెతికి చంపెయ్యమని సుబ్బారెడ్డి ఆదేశాలివ్వడం.
          *సుబ్బారెడ్డి అనుచరులు భైరవని వెతకడం.
          *గీత పారిపోయి వచ్చి భైరవని కలుసుకోవడం. పెళ్లి చేసుకోమంటే భైరవ నిరాకరించడం.
          *ముఠా బారి నుంచి భైరవ, గీత తప్పించుకుని పారిపోవడం, వరస ఛేజింగులు.
          *ఇదంతా సుబ్బారెడ్డి మానిటరింగ్ చేయడం.
          *తనని కొట్టినందుకు గీత మీద పగతో వున్న కట్టారెడ్డితో కలిసి వాళ్ళని పట్టుకుందామని సుబ్బారెడ్డి అనడం, కట్టారెడ్డి  సుబ్బారెడ్డితో చేతులు కలపడం.
          *భైరవ, గీతల ఎరోటిక్ పాట. 
          *పాటయ్యాక ఇంకో ఎటాక్, ఇంకోసారి పారిపోవడం.
          *పారిపోతున్న గీత భైరవకి కిస్ పెట్టి, తన ప్రేమని ఎస్టాబ్లిష్ చేసేయడం ముఠాకి. ఇంటర్వెల్.

          ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ లో పై మిడిల్ వన్ కథని చూసే ముందు, ఈ కథ ఎలా పుట్టిందో ఇంకోసారి చూద్దాం. ‘ఉపకథ ప్రధాన కథవుతుందా?’ వ్యాసం మొదటి భాగంలో చెప్పుకున్నట్టు, ఆ బిగినింగ్ విభాగపు ముగింపులో ప్లాట్ పాయింట్ లో, కట్టారెడ్డిని గీత కొట్టడంతో ఎంగేజిమెంటు అభాసు అయి - ఈ కథ పుట్టింది. 

           స్క్రీన్ ప్లేలో కథ ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ లో పుడుతుందని తెలిసిందే. దీనికి ముందు బిగినింగ్ విభాగంలో వుండేదంతా కథ కాదనీ, ప్లాట్ పాయింట్ వన్ లో పుట్టబోయేది మాత్రమే కథ అనీ, అంతవరకూ బిగినింగ్ విభాగంలో చూపించేదంతా ఆ పుట్టబోయే కథకి కేవలం ఉపోద్ఘాతమేననీ కూడా తెలిసిందే. ఇదంతా మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకోవడమంటే, ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ఉపోద్ఘాతం వచ్చేసి కథని కలుషితం చేసేసే ప్రమాదముంది గనుక. 

          కథ ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పుట్టిందంటే, ఇంటర్వెల్ మీదుగా వెళ్లి సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర ముగుస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ లో కథ పుడుతూ ఏ సమస్యని ఎత్తుకుందో, ఆ సమస్యకి ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఒక పరిష్కార మార్గం దొరుకడం ఆ కథకి ముగింపు అన్నమాట. స్క్రీన్ ప్లేలో ఇది మిడిల్ విభాగం. ఇది రెండుగా విభజించి వుంటుంది. ఇంటర్వెల్ ముందు మిడిల్ వన్, ఇంటర్వెల్ తర్వాత మిడిల్ టూ అని. 

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యతో కథ పుట్టి, ప్లాట్ పాయింట్ టూ దగ్గర సమస్యకి పరిష్కార మార్గంతో కథ గిట్టినప్పుడు (ప్రేక్షకులు సమర్పించుకున్నకష్టార్జితం గిట్టు బాటయినప్పుడు), అక్కడ్నించీ వుండే ఎండ్ విభాగం (క్లయిమాక్స్) అంతా కథకి ఉపసంహారమే అవుతుంది. అంటే బిగినింగ్ విభాగంలో కథనం ఎలాగైతే ఉపోద్ఘాతమవుతూ కథ అవదో, అలా ఎండ్ విభాగంలో కూడా కథనం ఉపసంహారమవుతూ కథ అవదు. కాబట్టి ఉపోద్ఘాత ఉపసంహారాలతో జాగ్రత్తగా వుండాలి. లేకపోతే  ఇవి కథలో పడి కలుషితం చేస్తాయి. కథలో కేవలం కథే పడాలి. కేవలం రెండు ప్లాట్ పాయింట్ల మధ్య మిడిల్లో వుండేదే కథ. సినిమా మొత్తం మీద ఆడియెన్స్ ని ఇన్వాల్వ్ చేసేది మిడిల్ విభాగంలో ఈ గంట పాటు నడిచే కల్తీ లేని కథే.
***
స్పీడ్ బ్రేకర్ సీను 
      ఇప్పుడు భైరవ గీత మిడిల్ -1 కొద్దాం. ఇది - గీత ఈ పెళ్లి (కట్టా రెడ్డిని) చేసుకోనని, భైరవనే చేసుకుంటానని తండ్రి సుబ్బారెడ్డికి చెప్పేయడంతో, భైరవ ఎక్కడున్నా వెతికి చంపెయ్యమని సుబ్బారెడ్డి ఆదేశాలివ్వడంతో  - మొదలయ్యింది. ఇక్కడే దెబ్బ పడింది.

          పైన చెప్పుకున్నట్టు, ప్లాట్ పాయింట్ వన్ లో ఒక సమస్యతో కథ పుడుతున్నప్పుడు, ఉపోద్ఘాతంలోని కథనమంతా కొలిక్కి వచ్చేయాలి. ఇంకా ప్లాట్ పాయింట్ వన్ తర్వాత ఉపోద్ఘాతం తాలూకు ఏ సీనూ బ్యాలెన్స్ వుండి మిడిల్లోకి, అంటే కథలోకి అడ్డురాకూడదు. 
వస్తే ఇక్కడ ఫ్రెష్ గా పుట్టిన కథ కలుషిత మవుతుంది. కథ పుట్టి ముందుకెళ్ళిపోయాక,ఇంకా వెనుక సీను ముచ్చట్లే చెప్పుకుంటూ కూర్చోవడమేమిటి? 

          గీత ఈ పెళ్లి చేసుకోనని, భైరవనే చేసుకుంటానని తండ్రి సుబ్బారెడ్డికి చెప్పేయడం – ఇది వెనుక సీసులో వుండాల్సిన  ముచ్చట. అంటే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో వుండాల్సిన ముక్క. ప్లాట్ పాయింట్ వరకూ వుండేది బిగినింగ్ విభాగమే. అంటే ఉపోద్ఘాతమే. అందులో వుండాల్సిన సీను ఇది.

          ప్లాట్ పాయింట్ వన్ సీను ఎలా వుందో చూద్దాం - ఎంగేజి మెంట్ కి కట్టారెడ్డి అట్టహాసంగా మందీ మార్బలంతో వస్తాడు. గతి లేక గీత తలవంచుతుంది. అప్పుడేదో పొరపాటు జరిగితే  భైరవని కట్టారెడ్డి కొడతాడు. దీంతో గీత కట్టారెడ్డి చెంప మీద కొడుతుంది. ఆవేశపడ్డ కట్టారెడ్డిని సుబ్బారెడ్డి శాంతపర్చి పంపిస్తాడు... 

       గత వ్యాసంలో, ప్లాట్ పాయింట్ వన్ సీనుని పాత్ర పరంగా పోస్ట్ మార్టం చేసినప్పుడు, అందులో హీరో భైరవ తాలూకు గోల్ ఎలిమెంట్స్ లేవని గమనించాం. ఇవి లేకపోగా, ప్లాట్ పాయింట్ వన్ లోని విషయం అక్కడే పూర్తవకుండా ఇప్పుడు తర్వాతి సీన్లోకి, అంటే మిడిల్ లోకి – అంటే కథలోకి చొరబడింది. ఆ విషయమే - గీత ఈ పెళ్లి (కట్టా రెడ్డిని) చేసుకోనని, భైరవనే చేసుకుంటానని తండ్రి సుబ్బారెడ్డికి చెప్పేయడంతో, భైరవ ఎక్కడున్నా వెతికి చంపెయ్యమని సుబ్బారెడ్డి ఆదేశాలివ్వడం. 

         
ప్లాట్ పాయింట్ వన్ ని విషయ పరంగా పోస్ట్ మార్టం చేస్తే - గీత కట్టాని కొట్టింది. అతను ఆవేశ పడ్డాడు. సుబ్బారెడ్డి శాంతపర్చి పంపాడు...ఇలా వుంటుందా విషయపరంగా ప్లాట్ పాయింట్ వన్? ప్లాట్ పాయింట్ వన్ అంటేనే వేడివేడిగా సమస్య పుట్టి అశాంతి రేగడం, శాంతి చేకూరడం కాదు. శాంతి చేకూరితే ఇక సమస్యే ముంది? కథెలా పుడుతుంది? కాబట్టి ఇది అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్లాట్ పాయింట్ వన్. దీని తర్వాతి సీన్లో, అంటే మిడిల్ అనే వేరే అధ్యాయంలో ఇది పూర్తయింది. అదే - గీత ఈ పెళ్లి (కట్టా రెడ్డిని) చేసుకోనని, భైరవనే చేసుకుంటానని తండ్రి సుబ్బారెడ్డికి చెప్పేయడం, భైరవ ఎక్కడున్నా వెతికి చంపెయ్యమని సుబ్బారెడ్డి ఆదేశాలివ్వడం...

         
ఈ విషయం ప్లాట్ పాయింట్ వన్ సీనులోనే వుంటే ఈ గజిబిజి వుండదు. ఇప్పుడు సమగ్రంగా ప్లాట్ పాయింట్ వన్ ఎలా వుంటుందంటే - ఎంగేజి మెంట్ కి కట్టారెడ్డి అట్టహాసంగా మందీ మార్బలంతో వస్తాడు. గతి లేక గీత తలవంచుతుంది. అప్పుడేదో పొరపాటు జరిగిందని భైరవని కట్టారెడ్డి కొడతాడు. దీంతో గీత కట్టారెడ్డి చెంప మీద కొడుతుంది...ఇక గీత ఈ పెళ్లి (కట్టా రెడ్డిని) చేసుకోనని, భైరవనే చేసుకుంటానని తండ్రి సుబ్బారెడ్డికి చెప్పేస్తుంది, భైరవ చంపెయ్యమని అక్కడే సుబ్బారెడ్డి ఆదేశాలిస్తాడు. భైరవ గీతని తీసుకుని పారిపోతాడు!

       ఇదీ సమగ్ర ప్లాట్ పాయింట్ వన్ సీను నిర్మాణం ఇంకేం బ్యాలెన్స్ లేకుండా. సమస్య పుట్టి బ్లాస్ట్ అవడనికి సమకూర్చుకున్న పూర్తిస్థాయి మందుగుండు. కథ పుట్టి ఇంకేం స్పీడ్ బ్రేకర్లు లేకుండా శరవేగంగా టేకాఫ్ తీసుకుని మిడిల్ వన్ వినువీధుల్లోకి ఎగరడానికి రాకెట్ ఇంధనం.

          ఐదో తరగతి పాసయిన పిల్లాడు, ఆరో తరగతి క్లాసులో కూర్చుని ఐదో తరగతి పుస్తకాలు గబగబా తిరగేస్తాడా? ఇలాగే వుంది గీత పాత్రతో వ్యవహారం. బిగినింగ్ ముగిసిపోయిన అధ్యాయం, ఉపోద్ఘాతం. మిడిల్ కొత్త అధ్యాయం, కథామృతం. ఉపోద్ఘాతంలో చెప్పాల్సిన విషయం ఉపోద్ఘాతంలో చెప్పి పూర్తి చేయకుండా కథామృతంలో పడేస్తే, కరివేపాకులా తీసి పడెయ్యాలన్నా కుదరదు. ఎందుకంటే దీని విషప్రభావం మిడిల్ వన్ సాంతం వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ తర్వాత మిడిల్ ప్రారంభంలో అక్రమంగా వేసిన ఈ సీను తీయడానికి బాగానే ఖర్చయి వుంటుంది. ఈ ఖర్చు వృధాయే కదా? స్ట్రక్చర్ వుంటే ఈ వృధా వుండదు కదా? 

          ఇలా ప్రారంభమైన మిడిల్ వన్ కథ సుబ్బారెడ్డి భైరవని చంపమని ఆదేశాలివ్వడంతో భైరవ మీద ఏకధాటి దాడులుగా కొనసాగుతుంది. మిడిల్ అంటే సమస్యతో సంఘర్షణ. యాక్షన్ రియాక్షన్ల సమాహారం. విలన్ ఒక ఎత్తుగడ వేస్తే, హీరో దానికి ఇంకో పై ఎత్తుగడ వేస్తాడు. దీనికి విలన్ ఇంకో ఎత్తుగడతో దెబ్బ తీస్తే, హీరో ఇంకో పై ఎత్తుగడతో దెబ్బ తీస్తాడు. ఈ పరస్పరం దెబ్బ తీసుకోవడమే యాక్షన్ రియక్షన్లతో కూడిన మిడిల్ వన్ బిజినెస్. 

       కానీ ఇక్కడ దీనికి వ్యతిరేకంగా బిజినెస్ వుంటుంది. దెబ్బ తీయడమంతా సుబ్బారెడ్డియే చేస్తూంటే, పారిపోవడమంతా భైరవ చేస్తూంటాడు. ఇంటర్వెల్ వరకూ ఇదే బిజినెస్. కబడ్డీ అంతా సుబ్బారెడ్డి ఆడేస్తూంటే, తప్పించుకుని బరిలోంచి పారిపోవడ మంతా భైరవ చేస్తూంటాడు. ఒక్క క్షణం ఆలోచించి ఎత్తుకు పైఎత్తు వేసే ప్రయత్నం చేయడు. సుబ్బారెడ్డి దాడులు చేయిస్తూంటే భైరవ వాటిని తిప్పికొట్టి పారిపోతూ వుంటాడు. ఇది యాక్షన్ రియక్షన్ల ప్లే అవదు. తిప్పి కొట్టడం యాక్షన్ అవదు. తిప్పికొడుతూ సుబ్బారెడ్డికి ఇంకేదో మంట పెట్టడం యాక్షన్ అవుతుంది. అప్పుడు యాక్టివ్ క్యారెక్టర్ అన్పించుకుంటుంది. లేకపోతే రియాక్టివ్ క్యారెక్టర్ అవుతుంది. బిగినింగ్ అంతా – ప్లాట్ పాయింట్ వన్ సహా,  పాసివ్ గానే వున్నాడు కాబట్టి, పాసివ్ రియాక్టివ్ క్యారెక్టర్ అవుతుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో సమస్య తను పుట్టించక, గీత పుట్టించడంతో ఇలా జరిగింది. ఇది గీత సమస్య అయింది. కనుక భైరవకి  గోల్ లేదు. గోల్ లేకపోవడంతో వ్యూహం లేదు. గీతని పట్టుకుని కొనసాగడమే. సుబ్బారెడ్డి భైరవని చంపించడానికి ముఠాని ఎగదోశాడని గీత పారిపోయి వచ్చి చెప్తేగానీ భైరవకి తన పరిస్థితి తెలీదు! ప్లాట్ పాయింట్ వన్ పరిణామాలు కథానాయకుడిగా భైరవకే తెలీదు!

          దేవదాసులో పార్వతి అర్ధరాత్రి దేవదాసు దగ్గరికి వచ్చేసి పెళ్లి చేసుకోమంటే పిరికివాడిలా నిరాకరించే దేవదాసులాగే భైరవ చేస్తాడు. గీత ఇంట్లోంచి పారిపోయి వచ్చి పరిస్థితి చెప్పి, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తాడు. ఎలా నిరాకరిస్తాడు తను ప్రేమించి? ప్రేమించానుగానీ, కులం తక్కువ వాడినని ఆగిపోయానని తర్వాత సెకండాఫ్ లో అంటాడు. అప్పుడు అంటే ఏం లాభం? గీత ఎప్పుడో ప్రేమించింది. ప్రేమించినందుకే కట్టారెడ్డిని కొట్టి వచ్చేసింది. ఇంకేం కావాలి? ఇంకా కులం గిలం వుంటాయా? అంటే ప్రేమలో కూడా ఆమే యాక్టివ్ గా వుంది. ఇంకెందుకు కథానాయకుడి పదవిలో భైరవ వున్నట్టు? 

          ప్రేమ పట్ల, సుబ్బారెడ్డితో ఎదురైన ప్రమాదం పట్లా ఒక దృక్పథం లేదు. ఇలాటి పాత్రతో కథేం నడుస్తుంది. దృక్పథం పాత్ర ప్రథమ లక్షణం. బిగినింగ్ ఉపోద్ఘాతంలో దృక్పథం లేక పాసివ్ గా వున్నా, ప్లాట్ పాయింట్ వన్ లో పుట్టే సమస్యకి ఒక దృక్పథాన్నేర్పర్చుకుని పాత్ర ఎదుగుదల కనబర్చాల్సిందే. ఇక యాక్టివ్ గా మారిపోవాలి. యాక్టివ్ గా మారితే సుబ్బారెడ్డికి చెక్ పెట్టాలన్న మైండ్ సెట్ తో అలాటి వ్యూహాలే పన్నుతాడు. ఎందుకని కనీసం గీతతో వెళ్లి పోలీసుల్ని ఆశ్రయించడు? పోనీ గీత చదువుకుంటున్న సిటీకి పారిపోడు? ఎందుకని ఇక్కడిక్కడే చోట్లు మారుస్తూ ప్రమాదంలోనే వుంటాడు?


          మిడిల్ వన్ చూస్తూంటే సగటు ప్రేక్షకులకి భైరవ బోలెడు ఫైట్లు చేసేస్తున్నాడు కదా అన్నట్టే వుంటుంది. కానీ ఎలాటి ఫైట్లు అవి - దాడుల్ని తిప్పి కొట్టి, ఏం చేయాలో తెలీక  పారిపోతూ వుండే పాసివ్ రియాక్టివ్ ఫైట్లు. ఇక చివరికి ఇంటర్వెల్ సీన్లో- ముఠా అంత దూరంలో ఆగిపోతే,  వాళ్ళని రెచ్చగొడుతూ గీత భైరవకి కిస్ పెడుతుంది. వాళ్ళు షాక్ అవుతారు. దట్సాల్, ఇంటర్వెల్.
***

కిస్ లో మిస్ అయిన బ్యాంగ్      
     ఈ ఇంటర్వెల్ సీన్లో ఎవరు ఎవరి ముందు ఎందుకు కిస్ పెట్టాలి? ఇదీ ప్రశ్న.ఇంతకి ముందు సీన్లలో చాలా లిప్ లాక్స్ అయ్యాయి. ఇంటర్వెల్ లో స్పెషాలిటీ ఏమిటి? విధేయులైన ప్రేక్షకులకి కిస్ తో ఈసారి ఇంకా థ్రిల్ చేయడమేగా? ఎవరో ముఠా ముందు కిస్ పెడితే థ్రిల్ వుంటుందా? టెన్షన్ పైకి లేస్తుందా? ప్లాట్ పాయింట్ వన్, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్ టూ-  ఈ మూడూ ఇతర సీన్లలాగా మామూలు సీన్లయి వుండవు. బిగ్ ఈవెంట్స్ గా వుంటూ ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. గుర్తుండి పోతాయి. ఈ కథ గీత, భైరవ, సుబ్బారెడ్డి ల మధ్య ‘వేడి పుట్టిస్తూ’ - వీళ్ళు ముగ్గురూ స్టేక్ హోల్డర్ పాత్రలుగా వున్నారు. ఇంటర్వెల్ తో ముగిసే మిడిల్ వన్ బిజినెస్ లో కాన్ఫ్లిక్ స్టేక్ హోల్డర్ల మధ్య పతాక స్థాయికి చేరుతుందా, లేక ఎవరో కథలో ఊడిగం చేసేవాళ్ళతో చేరుతుందా? 

      గీత భైరవకి కిస్ పెట్టి ముఠాకి షాక్ ఇవ్వడమేమిటి? అలా షాకిస్తే స్టేక్ హోల్డర్ తండ్రి సుబ్బారెడ్డి కివ్వాలి. కానీ ఇదీ ఉపయోగం లేదు. తానేమిటో కట్టారెడ్డిని వాయించి డిక్లేర్ చేసే వచ్చింది. అంత కంటే పెద్ద షాక్ సుబ్బారెడ్డికి లేదు. కాబట్టి ఇంటర్వెల్ సీన్లో స్టేక్ హోల్డర్ గా సుబ్బారెడ్డి వున్నా, అతడి ముందు గీత ఎన్నేసి ముద్దులు వూగిపోతూ పెట్టుకున్నా  వూడబొడిచేదేమీ వుండదు. కానీ భైరవ ఏమిటో సుబ్బారెడ్డి ఇంకా రుచి చూడలేదు. కాబట్టి అతను గీతని లాక్కుని సుబ్బారెడ్డి ముందు ఎడాపెడా కిస్సులు పెట్టేస్తూంటే సుబ్బారెడ్డి లుంగీతో బాటు వెండితెరా చిరిగిపోతుంది.

మిడిల్ టూ రేపు!

సికిందర్