రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 24, 2017

     డార్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ఫిలిం నోయర్సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలేనని కూడా చెప్పుకున్నాం. 1930 లలో అమెరికాలో ఆర్ధిక మాంద్యం రేపిన కల్లోల నేపధ్యంలో ఈ రకమైన నేరపూరిత కథలతో ఫిలిం నోయర్ అనే జానర్ ప్రారంభమయిందని కూడా గుర్తు చేసుకున్నాం. సమాజంతో- ఆ సమాజంలో వుండే ప్రేక్షకులతో  ముడిపెట్టకుండా హాలీవుడ్ కూడా మనం అనుకరిస్తున్న కమర్షియల్  సినిమాలు తీయలేదని  తెలుసుకున్నాం. ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో ఆర్ధిక రంగ పురోభివృద్ధి నేపధ్యంలో  పెరిగిపోతున్న నేర మనస్తత్వాల్ని బయట పెట్టే  డార్క్ మూవీస్ జానర్ వైపు తెలుగు మేకర్లు కన్నెత్తి చూడ్డం లేదనికూడా విచారపడ్డాం. ఇంకే సీరియస్ సినిమాకీ లేని  ప్రేక్షకుల్నికూర్చోబెట్టగలిగే శక్తి ఒక్క డార్క్ మూవీస్ కే  వుందని సోదాహరణంగా అర్ధం జేసుకున్నాం.  ఈ పని తెలుగులోకి వచ్చేసి తమిళ, మలయాళ డబ్బింగులు పూర్తి చేస్తున్నాయని కూడా చెప్పుకున్నాం. తెలుగు మేకర్లు మాత్రం ఇంకా వారం వారం అవే ప్రేమపురాణాలు, అవే దెయ్యాల అరుపులూ  చూపిస్తూ  కాలక్షేపం చేస్తున్నారని కూడా బాధపడ్డాం. ఇప్పుడొక వేళ తమిళులు తీస్తే నేను తీయలేనా అని తెలుగు మేకర్ ఎవరైనా డార్క్ మూవీకి సమకట్టి ప్రేమలూ దెయ్యాల ముచ్చట్లకి తెర దించే ప్రయత్నం చేశాడే అనుకుందాం- అప్పుడతను ఏం తీయవచ్చు? బ్రహ్మాండంగా  డార్క్ మూవీ తీస్తున్నాననుకుని భీకర యాక్షన్ మూవీ తీసి పడేస్తే?  రోమాంటిక్ కామెడీలు తీస్తున్నాననుకుంటూ రోమాంటిక్ డ్రామాలు తీసి దెబ్బతిన్న రక్తమే కదా? అలాగే ఇదీ!

          ఇందుకే డార్క్ మూవీ జానర్ మర్యాదలేంటో  తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. తీసే సినిమాల కోసం స్క్రీన్ ప్లే సూత్రాలు అక్కర్లేదనుకున్నా అభ్యంతరం లేదు-  ఎవరికెలా తోస్తే అలా తీసి ఫ్లాప్ చేసుకోవచ్చు - కనీసం జానర్ తేడాలేమిటో కూడా తెలీక సినిమాలు తీయడానికి సాహసించడం మాత్రం తెలివితక్కువ తనమే. ఇడ్లీ, వడ రెండిటి తయారీ విధానం ఒకటి కాదు. ఇడ్లీ పిండిని  సలసల కాగే నూనెలో వేసి వడ తయారు చేయరు. యాక్షన్ మూవీ నూనెలో డార్క్ మూవీ కథ వేస్తే కూడా మిగిలేది మసే. ఆ మసి డార్క్ గానే వుంటుంది. అప్పుడది మసైన డార్క్ మూవీ అయి థియేటర్ల దగ్గర ప్రేక్షకులకి మసి పూసి పంపుతుంది. తమిళ, మలయాళ డార్క్ మూవీసేమో  అత్తరు పూస్తూ ఆనందింప జేస్తూంటాయి. 

       యాక్షన్ మూవీస్ తో,  సస్పెన్స్ థ్రిల్లర్స్ తో పూర్తిగా విభేదిస్తుంది డార్క్ మూవీ జానర్.  1930 ల నుంచీ 50 ల వరకూ తెలుపు నలుపు సినిమాల కాలంలో వచ్చిన ఫిలిం నోయర్ సినిమాల్ని క్లాసిక్ నోయర్ అంటారు. అది వాటికి  స్వర్ణయుగం. కలర్ ఫిలిం తో 1960 లనుంచి ఇదే క్లాసిక్ నోయర్ నియో నోయర్ గా ఆధునికీకరణ చెంది, ఇప్పటి దాకా ఇదే  కొనసాగుతోంది. మనకు దక్షిణ భాషల్లో ‘నోయర్’ సినిమాలు పెద్దగా లేవు. తమిళంలో మొదటి పక్కా నియో నోయర్ సినిమాగా ‘అరణ్యకాండం’ 2011లో చరిత్ర కెక్కింది. దీనికి ఐదు కోట్లు పెడితే ఏడు  కోట్లు వచ్చాయి. దీని దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజాకి ఉత్తమ కొత్త దర్శకుడుగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఉత్తమ ఎడిటింగ్ కి కూడా దీనికి జాతీయ అవార్డు లభించింది. తెలుగులో యాక్షన్ – సస్పెన్స్ థ్రిల్లర్స్ తప్ప నోయర్ సినిమాల జాడ ఇప్పటికీ లేదు.  

          అయితే 1971 లో కృష్ణ- గుమ్మడిలు నటించిన ‘నేనూ మనిషినే’ వుంది బ్లాక్ అండ్ వైట్ లో. దీని దర్శకుడు జివిఆర్ శేషగిరిరావు. దీంట్లో  కనీసం ‘కథాపరంగా’ నోయర్ సినిమా లక్షణాలన్నీ కన్పిస్తాయి (నోయర్ సినిమాలకి   కథాపరమైన హంగులు, చిత్రీకరణ పరమైన హంగులు అని రెండుంటాయి) గుమ్మడి పాత్ర, వస్త్రధారణ, ధూమపానం మొదలైనవి క్లాసిక్ నోయర్ సినిమాల రీతుల్ని పట్టిస్తాయి. జడ్జి పాత్రలో ఆయన హత్య చేయడం, పోలీసు అధికారి పాత్రలో కృష్ణ నేరపరిశోధన చేయడం- ఆ నేర పరిశోధనలో అప్పట్లోనే తుపాకీ గుళ్ళ బాలస్టిక్స్  శాస్త్రాన్ని చర్చించడం వగైరా వుంటాయి. 

          ఇది 1971 లో  తమిళంలో మేజర్ సౌందర రాజన్- రవిచంద్రన్ లతో వచ్చిన  ‘జస్టిస్ విశ్వనాథన్’ కి రీమేక్. ‘జస్టిస్ విశ్వనాథన్’ 1980 లో రజనీకాంత్ తో ‘పొల్లదవన్’ గా మళ్ళీ రీమేక్ అయింది. 1976 లో  కన్నడలో రాజ్ కుమార్ తో ‘ప్రేమద కణికే’ గా రీమేక్ అయింది. వీటన్నిటికీ మూలాధారం 1969 లో అశోక్ కుమార్- జీతేంద్రలతో హిందీలో వచ్చిన ‘దో భాయ్’ అని సలీమ్-  జావేద్ లు రచన చేసిన సినిమా. అయితే హిందీలో దీనికంటే ముందు 1951 లో సాక్షాత్తూ గురుదత్ ‘బాజీ’ (గేమ్) అనే నోయర్ మూవీ దేవానంద్ తో తీశారు. దీనికి అమెరికన్ నోయర్ మూవీ ‘గిల్డా’  స్ఫూర్తి. 

          ఇక ఈ శతాబ్దం లోనే తీసుకుంటే హిందీలో షైతాన్, మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దార్, పాంచ్, కహానీ, కహానీ -2, పింక్  వంటి అనేక డార్క్ మూవీస్ వచ్చాయి. తమిళంలో జిగర్తండా, 16-డి, నగరం, మెట్రో మొదలైనవి వచ్చాయి. మలయాళంలో ‘దృశ్యం’ వచ్చింది. హాలీవుడ్ నుంచి క్రిమ్సన్  రివర్స్, మోమెంటో, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, గాన్ బేబీ గాన్...వంటివి ఎన్నో వచ్చాయి. తెలుగులో రాలేదు. ‘కీచక’ నోయర్ మూవీ అన్నారు గానీ, అదలా వుండదు. 

          నోయర్ మూవీ లేదా డార్క్ మూవీ అంటే మనిషిలోని, లేదా సమాజంలోని నేరపూరితమైన చీకటి కోణాల్ని వెలుగులోకి తెచ్చేది. దీని కథాంశం పోలీస్ ప్రోసీజురల్ (నేరపరిశోధన) అయివుండాలి, లేదా గ్యాంగ్ స్టర్ కథైనా అయివుండాలి. ఈ రెండు ప్రక్తియలు తప్ప ఇంకో  కథా ప్రపంచంలో డార్క్ మూవీస్ ని స్థాపించే సాంప్రదాయం లేదు. మనం వచ్చిందే పండగ అనుకుని జిగర్తండా, 16-డి, నగరం, మెట్రో మొదలైన వాటిని డార్క్ మూవీస్ గా కీర్తిస్తున్నాం గానీ ఇవి పూర్తిగా డార్క్ మూవీస్ నిర్వచనానికి సరిపోవు. రచన మాత్రమే డార్క్ మూవీ నిర్వచనానికి సరిపోయి, చిత్రీకరణకి సరిపోకపోతే అది పాక్షిక డార్క్ మూవీయే అవుతుంది. 

          హిందీలో వచ్చిన పింక్ తప్ప షైతాన్, మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దార్, పాంచ్, కహానీ, కహానీ -2 ఇవన్నీ రచనా పరంగానూ చిత్రీకరణపరంగానూ డార్క్ మూవీస్ నిర్వచనానికి దగ్గరగా వుంటాయి. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే,  ఇప్పుడు విజువల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రతీదీ చూసేసి తెలుకున్న జ్ఞానంతో వ్యవహరిస్తున్నాం. పూర్వంలాగా చదివి అర్ధం చేసుకున్న శాస్త్రీయ అవగాహనతో పనిచేయలేకపోతున్నాం. నాల్గు నోయర్ సినిమాలు చూసేసి ఓహో ఇంతేకదా అని తీసేస్తున్నారు. కానీ నోయర్ సినిమాల గురించి చదివితే వీటికి పాత్రలే కాదు, కెమెరా కూడా ఫలానా ఫలానా అర్ధాలతో యాంగిల్స్ పెడుతుందనీ, లైటింగ్ చూపిస్తుందనీ, నీడల్ని సృష్టిస్తుందనీ వీటికున్న ప్రత్యేక శాస్త్రాన్ని అర్ధం జేసుకోగల్గుతారు. అప్పుడు నిర్దుష్టమైన నోయర్ మూవీని తీయగల్గుతారు.   హాలీవుడ్ ని నమ్మి చెడిన వాడు లేడు. ఇంకా యూరోపియన్ మూవీస్ ని, కొరియన్ మూవీస్ నీ కాపీ చేసి చెడిపోయిన వాళ్ళున్నారు. ఏ జానర్ నైనా హాలీవుడ్ ప్రధాన స్రవంతి వ్యాపార సినిమా కింద  మార్చుకుని ప్రపంచం మీదికి వదుల్తుంది. హాలీవుడ్ అంటేనే పక్కా వ్యాపారస్తుల అడ్డా. కాబట్టి హాలీవుడ్ నుంచి ఏవో అర్ధంకాని ఫిలిం నోయర్, నియో నోయర్ పదాల్ని చూసి ఇదేదో మన జాతి వ్యవహారం కాదని, వ్యాపారం కూడా కాదని  భయపడి పారిపోనవసరం లేదు. ముఖ్యంగా నిర్మాతలు. నిర్మాతలు సరీగ్గా సినిమా వ్యాపారం గురించి తెలుసుకుంటే మేకర్ల ఆటలు సాగకుండా వుంటాయి. అమ్మో నోయర్ వద్దని నిర్మాతలు ఎంతగా భయపడుతూ కూర్చుంటే,  అంతగా మేకర్లు ప్రేమల్ని, దెయ్యాల్నీ తెచ్చి అంటగట్టి పోతూంటారు. అప్పుడు అంతే జోరుగా పక్క రాష్ట్రాల సినిమాల వాళ్ళూ తెలుగు రాష్ట్రాల్లో ఈస్టిండియా కంపెనీ లైపోతారు.

        ముందుగా ఈ జానర్ కి రచనా పరమైన హంగులేమిటో చూద్దాం : ఈ హంగులని హాలీవుడ్ నుంచి యధాతధంగా కాపీ కొట్టి ఇక్కడ చెప్పడంలేదు. ఇది హాలీవుడ్ టెంప్లెట్ కాదు. హాలీవుడ్  టెంప్లెట్ ని తెలుగు నేటివిటీకి  ఎలా మల్చుకోవచ్చో  కస్టమైజ్ చేసి చూపిస్తున్నాం, అంతే. 

          1. కాలనేపధ్యం :  దేశీయ సినిమా మార్కెట్ లో ఇవాళ్ళ బీదల పాట్ల కథలకి చోటు లేదు. బస్తీ ప్రజలు కూడా నిరంతర  గ్లోబలైజేషన్ ఫలాలు ఆరగిస్తూ  బీదలపాట్లు, ఆకలి పోరాటాలు, ఈతిబాధలు మర్చిపోయారు. స్మార్ట్ ఫోన్, డిష్ యాంటెన్నా, ఏర్ కూలర్ సుఖాలు మరుగుతున్నాక, మళ్ళీ వాళ్ళ కథలే వెండి తెర మీద చూడ్డానికి ఇష్ట పడ్డం లేదు. 

          పైగా మునుపెన్నడూ కనీ వినీ ఎరుగనంత  వందల వేల  కోట్లు వెనకేసుకుంటున్న  నయా సంపన్నుల సమాజం పట్ల కుతూహలాన్ని పెంచుకుంటున్నారు. ఇదివరకు సంపన్నులని  చూసి వొళ్ళు మండి  యాంగ్రీ యంగ్ మేన్లు  పుట్టుకొచ్చే వాళ్ళు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ లవుతున్నారు. ఇంతేసి సంపాదించుకుంటున్న నయా  సంపన్నులు ఎలా జీవిస్తూంటారన్న కుతూహలంతో వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడా లనుకుంటున్నారు. ఇక్కడ గమ్మత్తేమిటంటే,  ఇదివరకు కామన్ మాన్ యాంగ్రీ యంగ్ మాన్ అయ్యే వాడు, ఇప్పుడు నయా సంపన్నులే యాంగ్రీ యంగ్ మాన్ లవుతున్నారు, కామన్ మాన్ ప్రశాంతంగా వుంటున్నాడు. ఒక ఎంపీ కొడుకు డబ్బు మదంతో టోల్ గేట్ ని ధ్వంసం చేస్తాడు, ఇంకో మంత్రి కొడుకు డబ్బు మదంతో ఒకమ్మాయితో స్టాకింగ్ కి పాల్పడతాడు. ఇంకో ఎంపీయే అధికార మదంతో విమాన  సిబ్బందిని చెప్పుతో కొడతాడు. కామన్ మాన్ తగినంత ఆర్ధిక భద్రతతో రిగ్రెసివ్ గా వుంటే, సంపన్నుడు అవసరానికి మించిన డబ్బుతో ఎగ్రెసివ్ అవుతున్నాడు. ఇలా రివర్స్ రోల్స్  పోషిస్తున్న కొత్త కాలం నడుస్తోంది.

       నియో నోయర్ సినిమా కథకి  ఈ కాలనేపధ్యాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎగ్రెసివ్ సంపన్నుడి జీవన శైలుల్ని రిగ్రెసివ్ కామన్ మాన్ చూడాలని కుతూహల పడుతున్నాడు. నైట్ లైఫ్ పేరుతో నయా సంపన్నులు పాల్పడే విశృంఖలత్వాన్ని చూసే భాగ్యం తనకి కలగాలనుకుంటున్నాడు. ఆ విశృంఖలత్వంతో వాళ్ళు లేనిపోని కేసుల్లో ఇరుక్కుని గింజుకుంటూంటే చూసి ఆనందించాలనుకుంటున్నాడు. షైతాన్, కహానీ-2, పింక్, 16- డి ల విజయ రహస్యమిదే. ఇవి సంపన్నేతరుల కుతూహలాన్ని తీరుస్తూ సంపన్నుల పట్ల వాళ్ళ కచ్చి ని కూడా తీర్చాయి. 1930 లలో అమెరికా ఆర్ధిక సంక్షోభ కాలనేపధ్యంలో పుట్టిన తొలితరం ఫిలిం నోయర్ సినిమాల విజయ రహస్యం కూడా ఇదే : సంపన్నుల డొల్లతనాన్ని రట్టు చెయ్యడం. ఇదే ఇప్పుడు దేశీయంగా ఆర్ధిక పురోభివృద్ధి నేపధ్యంలో మన దగ్గర పునరావృతమవుతోందని గుర్తించాలి.

          కాబట్టి డార్క్ మూవీస్ సినిమాలు తెరమీద సంపన్నుల పాట్లు వర్సెస్ తెరముందు సామాన్యుడి వినోదం ఫ్రేం వర్క్ లో వుండి  తీరాల్సిందే. డార్క్ మూవీస్ కదా అని, మర్డర్స్ కదా అని,  బస్తీ హత్యలు, గుడిసె ఖూనీలూ చూపిస్తే కాలనేపధ్యాన్ని కాల రాసినట్టే. గ్లామరస్ గా కళ్ళు చెదిరేట్టు సంపన్నుల నేర మనస్తత్వాల్ని  చూపడం మినహా డార్క్ మూవీస్ తో ఇంకెలాటి  గిమ్మిక్కులు పనిచెయ్యవు. గ్లోబలైజేషన్ దెబ్బకి రకరకాల సామాజిక, అస్తిత్వ వాదాలన్నీ వెనక్కెళ్ళి పోయాయి. ఆ వాదాలు ఏలిన కాలంలో కూడా రిక్షా వాడి మీద కవిత్వం రాస్తే రిక్షా వాడే చదవలేదు. ఆ రాసిన కవుల ప్రతిభాపాటవాల మీద  చర్చలు పెట్టుకోవడానికే అవి పనికొచ్చాయి. కవికి సామాజిక స్పృహ వుండేది గానీ, రాసిన కవితలే సమాజానికి ఉపయోగ పడేవి కావు. ఇలాకాక డిటెక్టివ్ సాహిత్యం రిక్షావాణ్ణి  పఠితని చేసి ఏంతో  కొంత సామాజిక ప్రయోజనం సాధించింది. ఆ డిటెక్టివ్ సాహిత్యపు వినోదమే ఇప్పుడు డార్క్ మూవీస్ లో సామాన్యుడికి కావాలి. తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని చూసినా వాటిలో బాధితులుగా సంపన్నులే వుండడాన్ని గమనించగలం. 

          అంటే కాల నేపధ్యం కోసం, వాస్తవికత కోసం, హై సొసైటీలో జరిగే సంఘటనల మీద ఓ కన్నేసి వుంచాలి ఈ జానర్ రచయితనే వాడు. అంతేగానీ ఫారిన్ డివిడిలు చూసి ఆ కథలు రాస్తే కాదు. హాలీవుడ్ నియమం ఏమిటంటే, నోయర్ సినిమాలకి రచయిత ఎంత వాస్తవిక కథైనా రాయకూడదు, డిటెక్టివ్ నవలే ఆధారం కావాలి.


(రేపు రెండో సూత్రం : పాత్రల తీరుతెన్నులు)
-సికిందర్