రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఆగస్టు 2017, ఆదివారం

503 : రివ్యూ!


దర్శకత్వం : కుషాన్ నంది
తారాగణం : నవాజుద్దీన్ సిద్దిఖీ, బిదితా బాగ్, దివ్యా దత్తా, జతిన్ గోస్వామి, మురళీ శర్మ, అనిల్ జార్జి తదితరులు
రచన : గాలిబ్ అసద్ భోపాలీ – కుషాన్ నంది, సంగీతం : గౌరవ్ దగావోంకర్, ఛాయాగ్రహణం : విశాల్  విఠల్, బ్యానర్ : మూవీస్ బై ది  మాబ్
నిర్మాతలు : కిరణ్ శ్యాం ష్రాఫ్, అస్మిత్ కుందర్, కుషాన్ నంది
విడుదల : ఆగస్టు 25, 2017

***
         
విజయవంతమైన ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ -  1, 2 భాగాల తర్వాత మూడో భాగం కూడా రాబోతున్న సమయంలో, మధ్యలో కలగజేసుకుని అందినంత  సొమ్ము లాగేసు కునేందుకా అన్నట్టు ‘బాబూ మోషాయ్ బందూక్ బాజ్’  (తుపాకీ వీరుడు బాబూ మోషాయ్) వచ్చి వాలింది. ఇందులో కూడా ‘వసేపూర్’  ఫేమ్ నవాజుద్దీన్ నటించాడు. ఈ గ్యాప్ లో  మాకో  చిన్న వసేపూర్ లాంటిది చేసి పెడుదూ రావయ్యా అని నిర్మాతలు  బతిలాడేరో  ఏమో,  పేదవాడి ఆపిల్ లాగా పేదవాడి  చిన్న వసేపూర్ లో నటించేశాడు నవాజ్ ఐదుకోట్ల బడ్జెట్ కి కుదించి. 

        కొత్త దర్శకుడు కుషాన్ నంది తన వసేపూర్ ని రియలిస్టిక్ గానే తీసే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్ లో లొకేషన్స్ పరంగా అనేక అడ్డంకుల్ని ఎదుర్కొని ఎలాగో పూర్తి చేశాక, విడుదల వాయిదాలు పడుతూ, మరో పక్క ఏకంగా 48 కట్స్ తో సెన్సార్ తో గొడవపడుతూ,  తనకి తాను ఇంకో  వసేపూర్ నే సృష్టించుకున్నాడు. రియలిస్టిక్ అనగానే పచ్చి బూతులు ఫ్యాషన్ అయిపోయాక – రియలిస్టిక్  సినిమాలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లినట్టుగాక, బ్రోతల్ కెళ్ళి నట్టు చక్కగా. ‘హోమ్లీ’ గా వుంటోంది. ఆడామగా అని లేకుండా నటులు కెలికి కెలికి ఎన్ని  పచ్చి బూతులు మాట్లాడితే అంత బ్రోతలీయంగా, ‘హోమ్లీ’ గా  వాస్తవిక సినిమా తయారవుతుందన్న క్రేజ్ వచ్చింది. ప్రాణసమానమైన బూతుల కోసం సెన్సార్ తో పోరాడితే రోల్ మోడల్స్  కూడా అయ్యే ఛాన్సు వచ్చింది.  పాపం పహ్లాజ్ నిహ్లానీ – రోల్ మోడల్స్ కి దారిచ్చి తప్పుకోవాల్సి వచ్చింది. 

      ఉత్తరప్రదేశ్  గ్రామాలు పాత హిందీ సినిమాల్లో కూడా కన్పించేవి. బందిపోట్ల కథలతో తీసిన సినిమాల్లో కూడా గ్రామాలు పచ్చటి పొలాలూ చెరువులతో, పాడిపశువులతో,  పరిశుభ్రమైన ఇళ్ళతో కన్పించేవి. వసేపూర్ సిరీస్ కొచ్చేసరికి దారిద్ర్యం జీరాడుతూ, పాడుబడ్డ గ్రామాల్లో మురికి వాడల్ని చూపించే పరిస్థితి వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ యూపీ ‘అభివృద్ది’ కి నిదర్శన మిదేనేమో  తెలీదుగానీ, ‘దంగల్’ లో కూడా ఇలాగే చూపించారు. ఇప్పుడు ‘బాబూ మోషాయ్’ లో కూడా.  ‘స్లమ్ డాగ్ మిలియనీర్’  లో డానీ బాయల్  ఇలాగే పచ్చి మురికి వాడల్ని చూపిస్తే, ఇండియా పరువు తీశాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు స్వయంగా పరువు తీసుకునే క్రతువు మొదలెట్టారు తామే.

     ఇలాటి ఒక యూపీ చెత్తకుప్పలాంటి  ప్రాంతంలో సుపారీకిల్లర్ బాబు బిహారీ (నవాజుద్దీన్ సిద్దిఖీ – టైటిల్ ప్రకారం బాబు మోషాయ్ పేరు సినిమాలో పలకరు. మోషాయ్ అంటే బెంగాలీలో శ్రీయుత అని అర్ధమట) వుంటాడు. ఇతను రాజకీయనాయకుల కోసం, వ్యాపారస్తుల కోసం డబ్బు తీసుకుని హత్యలు చేస్తూంటాడు.  చెప్పులు కుట్టే ఫుల్వా (బిదితా బాగ్) ని చూసి ప్రేమిస్తాడు. ఈమె కళ్ళ ముందే ఒక సుపారీ కిల్లింగ్ చేస్తాడు. ఇంకో ఇద్దరున్నారనీ, వాళ్ళని కూడా చంపితే జీవితాంతం ఉంపుడుగత్తెగా వుంటాననీ షరతు పెడుతుంది. ఈ ముగ్గురూ కలిసి తనని రేప్ చేశారంటుంది. ఆ ఇద్దర్నీ కూడా బాబు చంపేసి ఆమెని ఉంచుకుంటాడు. 

         హత్యలు చేయడంలో బాబు దగ్గర శిష్యరికం చేసిన  బంకే బీహారీ (జతిన్ గోస్వామి- బంకే అంటే బీహారీలో కృష్ణుడట) అని వుంటాడు. ఇతను వొక కిల్లింగ్ కి వచ్చి బాబు కిల్లింగ్ ని డిస్టర్బ్ చేస్తాడు. దరిమిలా బాబు మంచితనంతో వచ్చి బాబు ఇంట్లో చేరతాడు. బాబుకి తెలియకుండా ఫుల్వాతో సరసం మొదలెడతాడు.

          సుమిత్ర (దివ్యాదత్తా), దుబే (అనిల్ జార్జి) అనే రాజకీయ ప్రత్యర్ధులుంటారు. సుమిత్ర కోసం దుబే అనుచరుల్నీ,  దుబే కోసం సుమిత్ర అనుచరుల్నీ చంపుతూంటాడు బాబు. ఒకసారి సుమిత్ర అనుచరులు ముగ్గుర్నీ చంపాల్సి వచ్చి ఆ సంగతి ఆమెకి చెప్తాడు. ఆ ముగ్గుర్లో ఆమె ముఖ్య అనుచరుడు (మురళీ శర్మ ) కూడా వుంటాడు. ఇక్కడ ఆమెతో తేడా వస్తుంది. ఈ తేడాలో బంకేబాబు దూరి గురువుగారైన బాబు  బీహారీని కాల్చేస్తాడు. బాబు బీహారీ ఎనిమిదేళ్ళు కోమాలోకి వెళ్ళిపోతాడు. బంకేబాబు ఫుల్వాని పెళ్లి చేసుకుని కొడుకుని కంటాడు. అప్పుడు  కోమాలోంచి లేచి చూస్తాడు బాబు... కొమాలోంచి లేచిన బాబు ఈ మొత్తం అందరి మీదా ఎలా పగ తీర్చుకున్నాడన్నదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
        నీతీరీతీ లేని నీచ పాత్రలతో డార్క్ మూవీలా అన్పించవచ్చు. కానీ ఇది  డార్క్ మూవీ కాదు. డార్క్ మూవీస్ నగరాల్లో ఉన్నత వర్గాల్లో నీతిలేని వాళ్ళ నేరకథల్ని డిమాండ్ చేస్తాయి. పైగా స్టయిలిష్ గా, రిచ్ గా వుంటాయి. ప్రస్తుత కథ గ్యాంగ్ స్టర్ జానర్. గ్యాంగ్ స్టర్ జానర్ ప్రేక్షకుల మీద చూపని ప్రభావం డార్క్ మూవీస్ ఎలా చూపిస్తాయంటే, ఇవి ఉన్నతవర్గాల స్వయంకృతాపరాధాల్ని, శిక్షల్ని చూపిస్తూ అందరికీ కనెక్ట్ అవుతాయి. గ్యాంగ్ స్టర్ మూవీస్ అథోఃజగత్ నేరగాళ్ళ చావుల్ని చూపించడం వల్ల ఎవరూ ఫీల్ కారు. ఫీలవ్వాలంటే హీరో మంచివాడై వుండాలి, మంచి వాడు నేరగాడై అనుభవించాలి (‘సత్య’ లో లాగా).
          

     నువ్వు చేసిన దారుణాలు ఒకరోజు వూహించని విధంగా నీకే ఎదురవుతాయన్న నీతితో  ఈ కథ చెప్పారు. నేరగాళ్ళ మీద పెట్టి ఈ నీతి చెప్తే నేరగాళ్ళు నేర్చుకోవడానికేమోగానీ, మనకి కాదని ప్రేక్షకులు డుమ్మా కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీని మార్కెట్ యాస్పెక్ట్  నేరగాళ్ళు  చూసేందు
కన్నట్టే  వుంది. నేరగాళ్ళ గురించి తీసే సినిమాలు నేరగాళ్ళు చూస్తే,  రిక్షావాడి మీద రాసే కవిత్వం రిక్షావాళ్ళు చదివితే ఈ దేశమెప్పుడో బాగుపడేది. 

         కిల్లర్ గా పాత్రకి గ్లామర్ కోసం ఎంత నవాజుద్దీన్ ని వాడుకున్నా, ఇది వ్యవస్థ బాధిత పాత్ర అన్పించే పూర్వ కథ లేకపోవడంతో, అంతా నీచంగానే వుండి – కథలో ఎంత డ్రామా వున్నా- నవాజ్ గ్లామర్ కాపాడే ప్రసక్తే లేకుండా పోయింది. క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా ఇలా లోపించింది. 

        మంచివాడ
న్పించే పూర్వ కథ లేకపోయినా, శిష్యుడి హత్యాప్రయత్నంతో కోమాలోకెళ్ళి  ఎనిమిదేళ్ళకి లేచి పగబట్టినా -  అది బాధితుడి పగలా కూడా అన్పించదు. హంతకుడి పాత్ర తనకి తాను బాధితుడిగా ఫీలవ్వచ్చు, కానీ ఎంత శిష్యుడు ద్రోహం చేసినా,  హంతక పాత్ర  పట్ల ప్రేక్షకులకి సానుభూతి వుంటుందా?  గ్యాంగ్ స్టర్  సినిమాకి ముందుగా ముఖ్యమైన ఈ క్రియేటివ్ యాస్పెక్ట్ నీ, మార్కెట్ యాస్పెక్ట్ నీ సరిచూసుకోక పోవడంతో కథ తూటాల్లేని తుపాకీ గొట్టంలా తయారైంది. 

ఎవరెలా చేశారు   
     నవాజుద్దీన్ వృధా చేశాడు. నవాజ్ షరీఫ్ పనామా పేపర్స్ కి దొరికిపోయినట్టు, నవాజుద్దీన్ ఈసారి ఫ్లాప్ కి దొరికిపోయాడు. రొటీన్ గా నీచ పాత్రల్ని రిపీట్ చేస్తున్నాడు. రియలిస్టిక్ సినిమా పాత్రలు పశుప్రవృత్తితోనే వుండాలన్న నియమం పెట్టుకున్నట్టుంది. దీనికి నటీమణులిద్దరూ కూడా తోడయ్యారు. బిదితా బాగ్ పాత్ర ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో దానికే తెలీదు. పైగా తను రేప్ బాధితురాలంటుంది. రేపిస్టుల్ని చంపితే ఉంపుడుగత్తెగా వుంటానంటుంది. ఉంపుడుగత్తెగా వుంటాననడమేమిటి – ఒక ఆడది ఇలా అంటుందా - రేప్ కి ముందు అలాటి తిరుగుబోతా ఈమె?  నన్ను పెళ్లి చేసుకోవాలంటే రేపిస్టుల్ని చంపాలనొచ్చుగా? శీలమంటే లెక్కలేని ఈమె దృష్టిలో జరిగింది రేప్ ఎందుకవుతుంది? పైగా చెప్పులు కుట్టించుకునే మగాళ్ళ దగ్గర ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ అడుగుతుంది. ఎందుకంటే తన ముందు లొట్టలేస్తూ కూర్చున్నందుకట. ఇరవై రూపాయలిచ్చి లొట్టలేస్తూ కూర్చోవడానికి చాలామందే వస్తారు హీరో సహా. ఇలా వుంది ఈమె పాత్రచిత్రణ. ఇలా ధోరణితో వున్న ఈమెకి  రేప్ జరిగిందని హీరో ఎలా నమ్మి వాళ్ళని చంపాడో అర్ధంగాదు.

          ఇక హీరోకి ఉంపుడుగత్తెగా వుంటూనే అతడి శిష్యుడితో సరసాలాడుతుంది. ఇదింకో ఘోరం. సరే, ఈమె శిష్యుడితో లేచిపోయిందని పగబడతాడు హీరో కోమాలోంచి వచ్చి. తను చనిపోయాడని తెలుసుకునే శిష్యుణ్ణి పెళ్లి చేసుకుందని గ్రహించవచ్చు. దీనికామె మీద ఎందుకు పగబట్టి చంపాలి? 

          కథ అంటేనే ఆర్గ్యుమెంట్. మంచీ చెడుల మధ్య ఆర్గ్యుమెంట్. పాత్రలన్నీ చెడ్డవే అయితే ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుంటుంది? ఆర్గ్యుమెంట్ లేక సినిమా ఎలా అవుతుంది? అందుకే ఇది సినిమాకి పనికి రాని గాథ అయింది. గాథకి  స్టేట్ మెంటే వుంటుంది, ఆర్గ్యుమెంట్ వుండదు. 

          మొన్నటి వరకూ హీరోయిన్ గా నటిస్తూ వున్న దివ్యాదత్తాది  కూడా,  రాజకీయ నాయకురాలి చెడ్డ పాత్ర. ‘బేగం జాన్’ లో పురుషద్వేషి అయిన విద్యాబాలన్ పాత్ర ఎలా ఆడవాళ్లకే తగిలే తిట్లు తిడుతుందో, అలాటి తిట్లు ఈమే తిడుతుంది. రహస్యాంగాలు మగాళ్ళకి కూడా వుంటాయి కదా – మగాళ్ళని తిట్టడానికి వాటినే  వాడుకునే ఆడపాత్రల రియాలిజాన్ని ఇంకా ప్రయత్నించాల్సి వుంది సోకాల్డ్ రియలిస్టిక్ మేకర్లు. ఆడపాత్రలు వాటి రహస్యాంగాల్నే తిట్లకి వాడుకుని ఎందుకు పరువు తీసుకుంటున్నాయి. హిందీ సినిమాల్లో మొట్టమొదటి సారి 2000 లో ‘బిచ్చూ’ అనే థ్రిల్లర్ లో  ఇలాటి తిట్టు వినపడి షాకయ్యారు. తిట్టింది హీరోయిన్ రాణీ ముఖర్జీ. ఆ తర్వాత మరే సినిమాలోనూ లేదు, ఈ మధ్య రియలిస్టిక్ సినిమాల్లోనే చూస్తున్నాం. 

          ఇక సెకండ్  హీరో జతిన్ గోస్వామితో కూడా హీరోయిన్ తో సెక్స్ సీన్లు – పెదవుల్ని ఆమె రహస్యాంగాలతో పోల్చి చేసే పోర్న్ కామెంట్లూ దివ్యంగా వున్నాయి. విజువల్ పోర్న్ కంటే వెర్బల్ పోర్న్ ఎంత ఘోరమో ఈ వొక్క ఉదాహరణ చాలు. వెర్బల్ పోర్నే ప్రమాదకరమైనది. రేపుల దేశంగా మారిన ఉత్తర దేశంలో ఇలాటి సినిమాలు, సెన్సార్ తో పోరాటాలూ. పాపం పహ్లాజ్ నిహ్లానీ బలి! 

          చివరికి ఇద్దరు హీరోల మధ్య మెక్సికన్ స్టాండాఫ్ లాంటి సీనుంటుంది.  పరస్పరం గన్స్ గురిపెట్టుకుని కాల్చుకోబోయే ఇలాటి సీన్లు తగినంత టైం అండ్ టెన్షన్ తో వుంటాయి. ఎవరు ముందు పేలిస్తే వాళ్ళు బతికిపోతారు. కానీ ఇక్కడ ఈ టైం అండ్ టెన్షన్ ధ్యాసే వుండదు. పైగా హీరో బతికిపోతాడని మనకి తెలుసు. హీరో బతకడు - అన్న నేపధ్యాన్ని ముందు సీన్లలో కల్పించి వుంటే - ఈ సీను హీరో బతుకుతాడా - సెకండ్ హీరో బతుకుతాడా అన్న సందిగ్ధాన్ని క్రియేట్ చేసేది. నేపధ్యబలం కూడా లేకపోవడంతో పేలవంగా ముగుస్తుంది ఈ సీను. 

          పాటల గురించి, ఇతర సాంకేతికాల గురించీ చెప్పుకోవడానికేమీ లేదు. చూపించిన మురికి, దుర్గంధ పరిసరాలు ఎలాటి విజువల్ అప్పీల్ని ఇవ్వవు. 

చివరికేమిటి 

      హీరో కోమా లోంచి లేచే మంచి మలుపు వున్నా కథ ఫ్లాష్ బ్యాక్స్ తో లేదు, లీనియర్ గానే చెప్పు కొచ్చారు. ఈ లీనియర్ కథనమే కోమా మలుపుకి బలాన్నిచ్చింది. ఫస్టాఫ్ లో కిరాయి హంతకుడిగాహీరో పరిచయం, హీరోయిన్నిఉంచుకోవడం,శిష్యుడు రావడం, ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ లో అడ్డుపడి  హీరోని ‘చంపడం’, దీంతో ఇంటర్వెల్. ఇంతవరకూ కథనంలో విషయం కనపడదు. కథనంలో విషయం  పాత్రలో విషయముంటేనే కనపడుతుంది. అంటే పాత్రకి పూర్వ  జీవితంతో కూడిన సర్కిల్ ఆఫ్ బీయింగ్ వుండాలి. ఇది లేక ఫస్టాఫ్ డొల్లగా తయారైంది. 


          ఇంటర్వెల్ తర్వాత హీరో హాస్పిటల్లో ఆపరేషన్లూ  అవీ జరిగి కోలుకున్నట్టు – పేలవంగా రొటీన్ గా చూపించకుండా, టైం లాప్స్ తో ఎనిమిదేళ్ళు  కోమాలోకి వెళ్లపోయినట్టు చూపడం ఆసక్తి కల్గించే క్రియేటివిటీయే. ఇప్పుడతను కోమాలోంచి లేస్తే, సెకండాఫ్ లోనైనా డెప్త్ కోసం, ఇప్పటి క్యారక్టర్ కి ఫస్టాఫ్ కథంతా పూర్వ కథలా సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని ఏర్పరుస్తున్నట్టు కనిపించవచ్చు. కానీ ఏర్పర్చదు. కారణం, ఫస్టాఫ్ కథలో అతడి మీద జాలిపడాల్సిన విషయమేమీ లేదు. హంతకుడుగానే మనకి తెలుసుగానీ ఎందుకు హంతకుడయ్యాడో తెలీదు. 

          కానీ కోమా లోంచి లేచిన హీరోకి మాత్రం ఫస్టాఫ్ లో జరిగింది తన పూర్వకథ - సర్కిల్  ఆఫ్ బీయింగ్ - ఇప్పుడు పగ దీర్చుకోవడానికి ప్రేరణా  అనీ తెలుసు. ఇలా క్యారక్టర్ కి తెలిసిం దొకటైతే, మనకి తెలియాల్సింది ఇంకొకటి వుంది. అది ఫస్టాఫ్ కథ కంటే ముందు జీవితం. అసిలతను ఎవరు, ఎక్కడ్నించి వచ్చాడు, ఎందుకు కిల్లర్ అయ్యాడనేది. ఇది లేకనే కదా వర్మ తీయించిన  ‘జేమ్స్’ జామ్ అయింది. 

          కాబట్టి అతను కోమా లోంచి  లేచాక ఫస్టాఫ్ కథ గుర్తు చేసుకోకుండా - అదసలు గుర్తుకే రాకుండా - ఫస్టాఫ్ కథకంటే తనపూర్వ జీవితమే గుర్తు కొచ్చి – ఫస్టాఫ్ కథే పూర్తిగా మర్చిపోతే, తనని ఎవరు చంపబోయారో, ఎందుకు చంపబోయారో అస్సలు తెలీక పోతే – సెకండాఫ్ కథ పెద్ద దుమారం లేపి ప్రకంపనాలు సృష్టించేది. ఇలా పూర్వ జీవితంతో కూడిన సర్కిల్ ఆఫ్ బీయింగ్ భర్తీ అయి, ఆతర్వాత  - ఇంకో టర్నింగ్ తో అతడికి ఫస్టాఫ్ జీవితం గుర్తుకొచ్చినప్పుడు పగా ప్రతీకారాలనే యాక్షన్ ని ఎత్తుకుంటే,  సమగ్రంగా వుండేది కథ. పాత్ర కథ చెప్పకుండా కథ చెప్పడం సాధ్యంకాదు. ఈ బేసిక్సే మర్చిపోతే పేదవాడి వసీపూర్ కాస్తా ఆకలి చావుతో శ్రద్ధాంజలి ఘటించుకునే పరిస్థితి వుంటుంది.

- సికిందర్
cinemabazaar.in