రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

1152 : రివ్యూ!


రచన - దర్శకత్వం : స్వరూప్ ఆర్ ఎస్ జె
తారాగణం : తాప్సీ పన్నూ, హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్ధ, రిషబ్ శెట్టి, హరీష్ పి, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం : మార్క్ జె రాబిన్, ఛాయాగ్రహణం : వై దీపక్
బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, పీఏ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు ; ఎన్ ఎం పాషా, అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
విడుదల : ఏప్రెల్ 1, 2022
***

        తెలుగు సినిమాల నుంచి దూరంగా వెళ్ళి బాలీవుడ్ లో రియలిస్టిక్ సినిమాలతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న తార తాప్సీ పన్నూ, మూడేళ్ళ తర్వాత తెలుగుకి తిరిగి వచ్చి మిషాన్ ఇంపాసిబుల్ నటించింది. 2019 లో నవీన్ పొలిశెట్టితో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే హిట్ తీసిన దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె, మలి ప్రయత్నంగా చైల్డ్ ఆర్టిస్టుల కాంబినేషన్లో మార్కెట్ వేల్యూ కోసం తాప్సీ తో మిషాన్ ఇంపాసిబుల్ తీస్తూ దేశవ్యాప్త దృష్టి నాకర్షించాడు. తాప్సీ కూడా తనకి జన్మనిచ్చిన తెలుగు సినిమాకి తిరిగి రావడం రుణం తీర్చుకోవడమేనని భావావేశానికి లోనైంది. మరి దర్శకుడు ఆమెని తిరిగి తెలుగుకి తీసుకొస్తూ రుణం తీర్చుకునేలా చేశాడా? లేక రుణం తీర్చుకోవడం ఇంపాసిబుల్ అనేలా చేశాడా? ఇది తెలుసుకుందాం...

కథ

    శైలజ (తాప్సీ పన్నూ) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. తన జర్నలిజంతో ఒక రాజకీయ నాయకుడ్ని పదవిలోంచి దింపేసి, బాలల అక్రమ రవాణా మాఫియాని పట్టుకోవడానికి కొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ (రఘుపతి రాఘవ రాజారాం) అనే ముగ్గురు 10-12 ఏళ్ల స్కూలు కుర్రాళ్ళు చదువు పట్ల శ్రద్ధ లేక, ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూంటారు. ఈ ముగ్గురికీ ఒక అయిడియా వస్తుంది. రఘుపతి (హర్ష్ రోషన్), రాఘవ (భాను ప్రకాశన్), రాజారాం (జయతీర్ధ) ముగ్గురూ కలిసి  మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీం ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్పి 50 లక్షల బహుమానం సంపాదించుకోవాలని బయల్దేరతారు. ముగ్గురూ శైలజకి తారసపడతారు. ఈ ముగ్గురూ తన మిషన్ కి ఉపయోగపడతారనుకుని చేరదీస్తుంది. చైల్డ్ ట్రాఫిక్కింగ్  మాఫియా రామ్ శెట్టి (హరీష్ పి) ని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడానికి ఈ ముగ్గురి సాయం తీసుకుంటుంది. ఇందులో సఫలమైందా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    2014 లో పాట్నాలో ముగ్గురు స్కూలు పిల్లలు మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీంని పట్టుకుని అప్పగిస్తే 50 లక్షల బహుమానమన్న ప్రభుత్వ ప్రకటనకి ఉత్తేజితులై బయల్దేరి వెళ్ళి పోలీసులకి దొరికిపోయారు. ఈ సంఘటన దర్శకుణ్ణి ఆకర్షించింది. దీని ఆధారంగా కథ తయారు చేసి, దానికి పిల్లల అక్రమ రవాణా (చైల్డ్ ట్రాఫిక్కింగ్) అంశం జోడిస్తూ, తాప్సీ పన్నూకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్ర రూప కల్పన చేశాడు. జానర్ వచ్చేసి కామిక్ థ్రిల్లర్.

        2014 వార్తా కథనం ప్రకారం ఆ ముగ్గురు స్కూలు పిల్లలు డాన్ దావూద్ మీద తీసిన డీ-డే అన్న బాలీవుడ్ థ్రిల్లర్ చూసి, అందులో దావూద్ ని పట్టుకుంటే 50 లక్షలు అన్న ప్రభుత్వ ప్రకటన నిజమే అనుకుని పట్టుకోవడానికి బయల్దేరారు. ఈ పిల్లలతో కామెడీ ఇంకా వుంది... ఈ పిల్లల్లో ఒకడి అమ్మమ్మ పాకిస్తాన్ లోని కరాచీలో వుంటోంది. దావూద్ కూడా కరాచీలోనే దాక్కున్నాడు. ఇంకేం, అమ్మమ్మ దగ్గరకెళ్ళి పోయి వుంటే, వాణ్ణి పట్టుకోవచ్చని ప్లానేసుకున్నారు. కరాచీ వెళ్ళాలంటే వీసా, పాస్ పోర్టులుండాలని కూడా వాళ్ళకి తెలీదు.

        ఇంటర్నెట్ లో కరాచీలోని దావూద్ ఇంటి ఫోటోని కూడా డౌన్ లోడ్ చేసుకున్నారు. దాని మ్యాపుని స్టడీ చేసి, కాంపౌండ్ లోకి ఎలా ప్రవేశించాలి, ప్రవేశించి దావూద్ మీద పడి ఎలా పట్టుకోవాలీ మొత్తం స్కెచ్ వేసుకున్నారు. తీరా తేలిందేమిటంటే, మ్యాపులో అది దావూద్ ఇల్లు కాదు. పాక్ లోనే అబ్బొటా బాద్ లో అప్పట్లో దాక్కుని అమెరికన్ కమెండోల చేతిలో చచ్చిన బిన్ లాడెన్ ఇల్లు అది! ఉదంతానికి ఇది కొసమెరుపు.

    ఈ పిల్లలు కలకత్తాలో డబ్బులైపోయి తిరుగుముఖం పట్టారనేది వేరే సంగతి. వీళ్ళ  ఉదంతంలో కొట్టొచ్చేట్టు కన్పించేదేమిటంటే, చైల్డ్ స్పిరిట్. ఇలాటి స్పిరిట్ వున్న పిల్లల్ని నిజానికి గ్రూమింగ్ చేస్తే భవిష్యత్తులో ఎక్కడో వుంటారు. వీళ్ళేమీ తప్పుడు పనికి పాల్పడలేదు. దేశానికుపయోగ పడే మంచి పనికే బయల్దేరారు. ఆ వయసులోనే అంత ప్లానింగ్ చేశారు. అది అవుతుందనే నమ్మారు. తెలిస్తే ఏదీ చేయలేరు, తెలియకపోతే ఏదైనా చేసేస్తారు.

        రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చిన్నతనంలో గూఢచార కార్యాలయానికి వెళ్ళిపోయి నన్ను గూఢచారిగా చేర్చుకోండి అనేశాడు. నువ్వింకా పెద్ద వాడివి అవ్వాలి, ట్రైనింగు పొందాలీ అని అక్కడి అధికారి అనేసరికి, పట్టువదలకుండా అవన్నీ చేసి, ఆ కార్యాలయానికే పెద్దవాడై గూఢచారిగా వచ్చాడు. తర్వాత్తర్వాత ఇంకెన్నో మజిలీలు దాటుకుని దేశాధ్యక్షుడయ్యాడు.

        ఛైల్డ్ స్పిరిట్ ని చంపవచ్చా? ఈ పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లిదండ్రులతో, మీ పిల్లలు మళ్ళీ ఇలాటి పనులు  చేయకుండా అదుపులో పెట్టుకోండి అన్నారంటే ఏమనాలి. ఈ సినిమా కథ రాసిన దర్శకుడు కూడా ఈ చైల్డ్ స్పిరిట్ లోని  స్పార్క్ ని, ఇందులో ఇన్ని డైనమిక్స్ నీ  సినిమాకి పట్టుకో లేక పోవడం విచారకరం.

        పిల్లల్ని పాకిస్తాన్ పంపేసి, మ్యాపు ప్రకారం అబ్బొటాబాద్ లోని అదే బిన్ లాడెన్ ఇంటికే పోతే, ఇండియన్ గూఢచారుల కన్నుగప్పడానికి తెలివిగా అక్కడే దాక్కుని దావూద్ ఇబ్రహీమే ఎదురైతే ఏం జరుగుతుంది? - అన్న కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథ చేయకుండా, దావూద్ ఇబ్రహీం అనుకుని మొదలెట్టిన కథని కూడా, తాప్సీతో పిల్లల అక్రమ రవాణాని కథగా చేసి పాత మూస కథలోకి కలిపేయడంతో, చైల్డ్ స్పిరిట్ తో వున్న  కొత్త కథ కిల్ అయిపోయింది. మెయిన్ కథ తలనొప్పిగా తయారయ్యింది.

నటనలు - సాంకేతికాలు

    తాప్సీది పూర్తి నిడివి పాత్ర కాదు. ఓ పెద్ద సైజు అతిధి పాత్ర అనుకోవాలి.  ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రకూడా ఇప్పుడు అసహజ పాత్రే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంతరించి పోయింది. స్టింగ్ ఆపరేషన్లు చేయడం, స్కాములు బయట పెట్టడం ఇవన్నీ ఒకప్పటి మాట. ఇప్పుడు ఫ్రెండ్లీ జర్నలిజం. రోజువారీ నేర వార్తలు రాసే క్రైమ్ రిపోర్టర్లు. కాబట్టి జర్నలిజం గురించి తెలిసిన వాళ్ళకి తాప్సీ పాత్ర అసహజంగా అనిపిస్తుంది. దర్శకుడు రీసెర్చి చేసుకోవాల్సింది.

        ఈ పాత్రలో తాప్సీ చేయడానికి కూడా ఏమీ లేదు. పాత్రకి మోటివ్ వుంటే, ఆ పరమైన పట్టుదల, భావోద్వేగాలూ వుండి, నటించడానికీ మెప్పించడానికీ  అవకాశముండేది. అన్ని బాలీవుడ్ రియలిస్టిక్ సినిమాలు సోలో క్యారక్టర్ గా చేస్తున్న తను ఈ చిన్న విషయం ఎందుకు తెలుసుకోలేదో తెలీదు. చైల్డ్ ట్రాఫిక్కింగ్ ని అడ్డుకోవాలన్న ఆమె మిషన్ కి ఏ డ్రమెటిక్ కారణం లేదు. పోనీ కథలో తనకి పరిచయమైన ఆ ముగ్గురు పిల్లల్ని చైల్డ్ మాఫియా కిడ్నాప్ చేసివుంటే, అప్పుడు ఓ బలమైన మోటివ్ ఏర్పడి వుండేది. ఇది కూడా జరగలేదు.

        పిల్లల సాయంతో చైల్డ్ మాఫియాని పట్టుకోవడానికి ఆమె చేసే ఇన్వెస్టిగేషన్, ప్లానింగ్, యాక్షన్ అన్నీ చైల్డిష్ గా, సిల్లీగా, చిరాకు పెట్టేవిగా వున్నాయి. తెలుగు రుణం తీర్చుకోవాలనుకున్న తాప్సీ రేపు ఉగాదికి కూడా తెలుగు వాళ్ళని ఇలా టార్చర్ పెట్టొచ్చా అన్పించేలా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, దర్శకుడు ఇలా పాత్ర రూప కల్పన చేశాడు. ఇందుకు ఎంతో అభినందనీయుడు.

        ఇక ముగ్గురు పిల్లలు. ఇలాటి బాలల పాత్రలకి ప్రాధాన్యమున్న సినిమాలో తెలుగు బాల నటుల్నైనా ప్రోత్సహిద్దామనే ఆలోచన మేకర్ కి రాలేదు. పరాయి వాళ్ళనే బాగా నటించారు, నవ్వించారు- అని మనం పొగడాలి. బాగానే నటించారు, బాగానే నవ్వించారు కాదనలేం. కామెడీ పేరుతో పిల్ల చేష్టలు మితిమీరి పోయాయి కూడా. కొన్ని చోట్ల నవ్వించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇదంతా ఫస్టాఫ్ 40 నిమిషాల సేపే. కథలోకి ప్రవేశించక  మునుపే. కథలోకి వచ్చాక ఆ కామెడీలు లేవు, ఫన్ లేదు సెకండాఫ్ లో కూడా.

        ఇక రామ్ శెట్టి అనే విలన్ పాత్ర వేసిన హరీష్ పి ఇంకో సిల్లీ పాత్ర. అంత పెద్ద పలుకుబడి గల మహా విలన్, అనుచరులు చేసే చిన్న చిన్న పనులు కూడా వీధిలోకొచ్చి తానే చేస్తూంటాడు. ఎందుకంటే తాప్సీ అతడ్ని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడానికి అనుకూలంగా వుండాలిగా? ఈ సినిమాలో ఏ పాత్రా ఆయా పరిస్థితుల్లో అదెదుర్కొనే  మానసిక స్థితిని బట్టి నడుచుకోదు. పాత్రలకి దర్శకుడే తన మానసిక స్థితినాపాదించి కథ నడిపిస్తూంటాడు. ఇందుకే ఈ కథ ఇలా వుంది. ఈ సినిమాని చూడడం దర్శకుడి మానసిక స్థితిని గ్రహించడమే.

        సంగీత దర్శకుడు మార్క్ రాబిన్ థ్రిల్లర్ జానర్ మ్యూజిక్కిచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఏం దమ్ముందో బాణీలు కూర్చే సంగీత దర్శకులకి ముందే తెలిసి పోతూంటుంది. నిర్జీవ సన్నివేశాలకి స్వరాలతో ప్రాణం పోస్తే లేస్తాయా అన్న ఆశతో లేపడానికి ప్రయత్నిస్తారు. ఆ పైన దేవుడి దయ. ఇందుకే చాలా సినిమాలు సంగీతం గొప్ప, సినిమాలు దిబ్బలా వుంటాయి.

        కెమెరా మాన్ దీపక్ కూడా కళాకాంతులు లేని వ్యవహారాన్ని ఎలా తేజోవంతం చేయాలో అంతా చేశాడు. ఆ పైన దేవుడి దయ. ఇక ఎడిటింగ్ సహా ఇతర విభాగాలు సమయాను కూలంగానే పని చేశాయి. నిడివి రెండు గంటలకి లాక్ చేశారు.

చివరికేమిటి

        సినిమా టైటిల్లో 'మిషన్' బదులు 'మిషాన్' అని ఎందుకంటే, సినిమాలో చూపించిన పల్లెటూళ్ళో 'బార్బర్' బోర్డు 'బార్బార్' అయింది కదాని జస్టిఫికేషన్. సరే,  ఈ మధ్య వరసగా చిన్నా పెద్దా సినిమాలు సెకండాఫ్ కథ చేసుకోలేక ఫ్లాపవుతున్న వైనాన్ని రిపీట్ చేశాడు ఈ దర్శకుడు కూడా.

          ఫస్టాఫ్ కామెడీల కాలక్షేపాలు తీయడంలో అందరూ నిపుణులే. తీరా కథ ప్రారంభిస్తే అదెలా నడపాలో తెలియని అమాయకులైపోతారు. సెకండాఫ్ టార్చర్ పెట్టేస్తారు. ఈ సెకండాఫ్ టార్చర్లు ఇప్పట్లో తప్పేలా లేవు. దీనికి కారణాలు, నివారణలు కనుగొనాలన్న ఆలోచన కూడా చేయడం లేదు.

        చైల్డ్ ఆర్టిస్టుల్ని ఉపయోగించుకుని ఫస్టాఫ్ కామెడీలు లాగేశాక, తాప్సీతో పిల్లల్ని కలుపుతూ కథ ప్రారంభించేసరికి, సెకండాఫ్ ఈ చైల్డ్ మాఫియా కథ అగాథంలో పడిపోయింది. అర్ధం పర్ధం లేని దృశ్యాలతో నిండిపోయింది. చైల్డ్ ట్రాఫిక్కింగ్ తో చాలా సినిమాలొచ్చాయి. ఇంకా దీనికి మార్కెటబిలిటీ వుంటుందా. లేక దావూద్ కథతో కొత్త  మార్కెట్స్ ఇండియా వ్యాప్తంగా ఓపెనవుతాయా అన్న వివేచన లేకుండా సింపుల్ గా ఈ సినిమాని చుట్టేశారు తాప్సీ పేరు నుపయోగించుకుని.

        చివరి అరగంట, దాని తర్వాత ముగింపూ అయితే చెప్పక్కర్లేదు. 'ఏజెంట్ ఆత్రేయ' తీసిన దర్శకుడితో ఇలా ఎవరూ ఆశించరు. ఇప్పటికైనా అసలు కథంటే ఏమిటో పునరాలోచించుకుని సినిమాలు తీస్తే క్షేమం. ఎవరైనా సరే, సినిమాని సినిమాలాగా చూడాలన్న పడికట్టు పదాన్ని వల్లెవేయడం మాని, కథని కథ లాగా చూపించాలని గ్రహిస్తే మంచిది. పెరిగి పోయిన టికెట్ల ధరలకి ఇంకా సిల్లీ సినిమాలు తీస్తామంటే కుదిరే పరిస్థితి లేదు.
—సికిందర్