రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, మే 2018, బుధవారం

648 : స్క్రీన్ ప్లే సంగతులు!

      సీన్ :   టీసూ ఇచ్చిన ఫోటోలో అమ్మాయి కేసే జూన్ హా చూస్తున్నప్పుడు, అతడి జ్ఞాపకాలతో ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంది. పల్లెటూళ్ళో వాగులో ఇద్దరు ఫ్రెండ్స్ తో వలేసి షికారు చేస్తూంటాడు జూన్ హా. అల్లరల్లరి చేస్తూంటారు. ఇంతలో ఇటు గట్టు మీద ఎడ్ల బండి వస్తూంటుంది. ఆ బండి మీద ఒకమ్మాయి కూర్చుని ఇటే చూస్తూంటుంది. అల్లరాపి ఇటు కేసి చూస్తారు ఫ్రెండ్స్. ‘ఇటు చూడు బే, ఇటు చూడు!’ అని జూన్ హా కి చూపిస్తారు. 

          
బండి మీద పోతున్న అమ్మాయినే చూస్తాడు జూన్ హా. ఆమె సువాంగ్ నుంచి వచ్చిందనీ, ఇక్కడామె తాత వున్నాడనీ అంటారు ఫ్రెండ్స్. ‘నువ్వు కూడా సువాంగ్ నుంచే వచ్చావ్ కదూ?’ అంటారు. తలూపుతాడు. వాళ్ళ నాన్న పొలీటీషియన్ అని అంటారు ఫ్రెండ్స్. జూన్ హా ఆమెనే  చూస్తూ చెయ్యూపుతాడు. బదులుగా ఆమే చెయ్యూపుతుంది. ఫ్రెండ్స్ పరమానందభరితులైపోయి, చెయ్యూపిందిర్రోయ్, మనం కూడా వూపుదామని అల్లరల్లరిగా చెయ్యూపుతారు. బండి అలా సాగిపోతూంటే, కేరింతలతో గంతులేస్తారు.

పాయింట్ :   
      ఈ సీను మన చెదలంటిన తెలుగాలోచనకి ఎలావుంటుందో చెప్పుకుంటే అన్యాయంగా  వుంటుంది. పోకిరీ, వెకిలి వేషాలెయ్యాలిగా అమ్మాయిని చూడగానే కామెడీ పేరుతో? కానీ ఇక్కడ పల్లెటూరోళ్ళ అమాయకత్వాలే, ఆనందాలే కన్పిస్తాయి. ఈ సీనుని కేవలం హీరోయిన్ ని ప్రత్యక్షంగా పరిచయం చేయడానికే  వేశాడు దర్శకుడు. ఇందులో భాగంగా ఆమె సువాంగ్ నుంచి ఇక్కడ తాతగారి  దగ్గరికి వచ్చిందని చెప్పించాడు. అంటే తాతగారు ఎప్పుడో సీన్లోకి వస్తాడన్న మాట. 

          ఈ హీరోయిన్ ప్రధాన కథలో హీరోయిన్ పాత్ర పోషిస్తున్న నటియే. ప్రధాన కథలో కూతురుగానూ, ఈ ఫ్లాష్ బ్యాకులో  టీనేజిలో వున్నప్పటి తన తల్లిగానూ  తానే నటిస్తోంది. కాకపోతే రెండు జడల అమ్మాయిగా కన్పిస్తోంది. 

         ఈ సీన్లో ఒక థీమ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు ప్రేమ కథకి. జల దృశ్యాల్ని చూపిస్తున్నాడు.  ఇక్కడ వాగులో అల్లరి, తర్వాతి సీన్లో నదిలో ఆమెతో ప్రయాణం, ఆ తర్వాత వర్షంలో ప్రణయంగా ఈ వాటర్ థీమ్ సాగుతుంది. ఈ వాటర్ థీమే ప్రధాన కథలో కూతురికి అనుభవమై ఆమె ప్రేమ సుఖాంతమవుతుంది. ఇవి కథనాల్ని ఉత్తేజపర్చే డైనమిక్స్.

సీన్ : 
     అడవిలో రెండు పశువులుం
టాయి. పశువుల పేడని కెలుకుతూంటాడు జూన్ హా. అటు పశువుల దగ్గర ఫ్రెండ్స్ ఒకడు నిలబడి, ఒకడు కూర్చునీ వుంటారు పేడ ఎప్పుడేస్తాయా అని కాచుకుని. ఇంతలో ఇటు జూన్ హా అరుస్తాడు పేడ పురుగుని పట్టుకుని చూపిస్తూ. ఫ్రెండ్స్ కి ఆ పేడ పురుగుని చూపిస్తూంటే, వెనుక గట్టు మీద ఫ్రెండ్ తో నిలబడి ఇటే చూస్తున్న హీరోయిన్ రివీలవుతుంది. 

          ఆమెని చూసి ఇటు తిరుగుతారు. అది పేడ పురుగని హీరోయిన్ కి చెప్తుంది ఫ్రెండ్. ‘పేడ పురుగా... నేనెప్పుడూ చూడలేదే...’  అంటుంది హీరోయిన్. ‘నీక్కావాలా?’ అంటాడు జూన్ హా. తీసుకోవడానికి ఆమె గట్టు దిగుతుతూంటే, అతను ఎక్కుతూంటాడు. ఇద్దరూ దగ్గ రవుతారు. ఆమెకి పురుగుని ఇవ్వబోతాడు. పేడని చూసి తీసుకోదు. చిరునవ్వుతో చూసి ఒకటి అడుగుతుంది – ‘నీకు నది అవతల భూత్ బంగ్లా తెల్సా?’ అని.
           

       తికమకగా చూసి ‘ఎందుకూ?’ అంటాడు. ‘నన్నక్కడికి తీసికెళ్తావా?’ అంటుంది. అతనేమీ అనలేకపోతూంటే, ‘నీకు పడవ నడపడం వచ్చా?’ అంటుంది. వచ్చంటాడు. అయితే రేపు పన్నెండింటికి కలుద్దామనేసి వెళ్లి పోతూంటుంది. ఇంకా అయోమయంలోనే వుంటాడు జూన్ హా.  తేరుకుని  చిన్నగా నవ్వుకుంటాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ‘ఏమన్నావ్ రా ఆమెతో?’ అంటారు. ‘ఆమే ఏదో అంది’ అంటాడు. ‘మీ సిటీ బాయ్సే డిఫరెంట్రా!’అని అతడి మొహానికి పేడ పూసేస్తారు. వాళ్ళ మొహలకీ పేడ పూసేస్తూ, తనకి పడవ నేర్పమంటాడు జూన్ హా. 

పాయింట్ :  
      స్ట్రక్చర్ పరంగా ఫ్లాష్ బ్యాక్ గత రెండు సీన్లతో హీరోయిన్, ఇద్దరు హీరోల పాత్రల పరిచయాలూ ఐపోయాయి. ఇది ముక్కోణ ప్రేమ కథ అని తెలియడానికి కథకి అలాటి బ్యాక్ డ్రాప్ కూడా ఏర్పాటై పోయింది. ఇక ఈ బిగినింగ్ విభాగాన్ని ప్లాట్ పాయింట్ వన్ కి డ్రైవ్ చేయడం మిగిలింది. డ్రైవ్ చేయాలంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడబోయే సమస్య కి దారి తీసే పరిస్థితుల కల్పన  చేసుకు రావాలి. ఈ సీన్లో ఇదే జరుగుతోంది. 

          ఈ సీనుని హీరోయిన్ డ్రైవ్ చేసింది. డ్రైవ్ చేయడానికే వచ్చింది. తెలుగాలోచన ప్రకారం ఏదో ఆమె అక్కడికి రావాలి కాబట్టి రొటీన్ గా, రోతగా రాలేదు. కొరియన్ ఆలోచన ప్రకారం ఆమె నిన్ననే నిర్ణయించుకుంది జూన్ హా ని వెతుక్కుంటూ రావాలని. నిన్న – అంటే వెనుక సీన్లో – బండి మీద వస్తూ హీరోని చూశాక,  ఆమెకి ఆలోచన మెరిసి వుండాలి. అంటే నది అవతల భూత్ బంగ్లా చూసి రావాలన్న కోర్కె ఆమెకి ఆల్రెడీ వుండి వుంటుంది. తీసికెళ్ళే మొనగాడి కోసం చూస్తూండాలి. నిన్న జూన్ హా కన్పించగానే ఇతన్నే అడగాలని వెతుక్కుంటూ వచ్చి ఈ సీన్లోకి ఎంటరై వుంటుంది... ఈ నేపధ్యమంతా, ‘నీకు నది అవతల భూత్ బంగ్లా తెల్సా?’ అని నేరుగా ఆమె అడిగెయ్యడంలోనే మనకి అర్ధమై పోతోంది. 

          సీన్స్ లో ఎంటరైన పాత్రలు వాటి గోల్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాయి. దీంతో ఆ గోల్స్ ప్రకారం సీన్లు చకచకా ఆసక్తికరంగా ముందు కెళ్తున్నాయి. జూన్ హా చేత టీసూ ఉత్తరం రాయించాలని  గోల్ పెట్టుకుని రావడం కూడా ఇలాంటిదే -  హీరోయినూ భూత్  బంగ్లా గోల్ పెట్టుకుని వచ్చినట్టు. దీనివల్ల సీన్స్ ఒక పాయింటుతో షార్ప్ గా, క్రిస్ప్ గా వుంటున్నాయి. 

          ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రధాన పాత్ర హీరోయినే. కథ ఈమెదే. ఎలాగంటే, ఇప్పటికి మనకి అర్ధమైన ప్రకారం ఈమెకి సెకెండ్ హీరోతో పెళ్లి నిశ్చయమైన నేపధ్యంలో, హీరోతో కలిసి సీన్ డ్రైవ్ చేస్తోంది. అంటే సమస్యలో పడబోతోంది. సమస్యలో పడేదే ప్రధాన పాత్ర. ఆ సమస్య జూన్ హాతో ప్రేమే కావచ్చు. 

          కథలోకి వెళ్ళడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సీన్లు ఎత్తుకోవడమంటేనే నేరుగా కథ కేసి  దూసుకెళ్ళడమనే ఈ లైనార్డర్ ని ఒకటికి నాల్గు సార్లు పరిశీలించుకోవాలి. ఈ సీను ముగింపులో తీసిన షాట్లు టెక్నికల్ గా పాత్రల కదలికలతో ఒక బ్యూటిఫుల్ కోరియోగ్రఫీ. హీరోయిన్ రేపు పన్నెండింటికి కలుద్దామని వెళ్ళిపోవడం టాపిక్కి ముగింపు. హీరోయిన్ ఈ  షాట్ లోంచి ఔటవుతున్నప్పుడు,  బ్యాక్ గ్రౌండ్ లో ఎవరో వెళ్తున్నట్టు బ్లర్ అయి డిస్టర్బింగ్ గా అన్పిస్తుంది మనకి. అది  రైట్ నుంచి లెఫ్ట్ కి క్రాస్ చేస్తున్న హీరోయిన్ ఫ్రెండ్ గా రివీల్ అవుతుంది. హీరో దగ్గర్నుంచి హీరోయిన్ కదిలినప్పుడు, ఆమె కూడా అటు కదిలిందన్నమాట. అలా ఈ షాట్ లోనే ఇద్దర్నీ కలుపుతూ వెళ్ళిపోతున్నట్టు ఫ్లో చేశాడన్న మాట. కదలికల్ని ఏముక్కకా ముక్కగా షాట్లు తీసి ఎడిటింగ్ లో కలపకుండా. అది అతుకుల బొంతవుతుందే తప్ప సీన్ల, షాట్ల అల్లిక అవదు. ఎడిటింగ్ కూడా షూటింగ్ స్క్రిప్టు లోనే జరిగిపోతుందన్న మాట ఇలా. 

       తర్వాత, షాట్ల క్రమంతో సన్నివేశం ఇలా కొరియోగ్రఫీని తలపిస్తుంది...ఫ్రెండ్ తో చేయీ చేయీ పట్టుకుని సన్నిహితంగా హీరోయిన్ వెళ్ళిపోతున్న షాట్. 

          ఇటు చూస్తే, నిలబడి వున్న జూన్ హా  వెనుక వారగా ఫ్రెండ్స్ ఇద్దరూ వచ్చి సన్నిహితంగా నిలబడ్డం. మ్యాచింగ్ షాట్. 

          అటు చూస్తే, క్లోజ్ గా వెళ్తున్న హీరోయిన్నీ ఫ్రెండ్ నీ విడదీస్తూ ఎడ్ల బండి వాడు బండిని వాళ్ళ మధ్యకి నడపడం. 

          ఇటు చూస్తే, ఈ  ముగ్గురూ పేడ పూసుకుని అల్లరి చేసుకుంటూ విడిపోవడం. మ్యాచింగ్ షాట్.

          అటు చూస్తే, బండి మీదికి హీరోయిన్, ఆమె ఫ్రెండ్ ఎగిరి కూర్చుని ముగ్గురూ ఒకటవడం. ప్రారంభంలో ఫ్రెండ్ తో చేయీ చేయీ పట్టుకుని సన్నిహితంగా హీరోయిన్ వెళ్ళిపోతున్న షాట్ తో, వాళ్ళు విడిపోయి మళ్ళీ ఒకటైన మ్యాచింగ్ షాట్. 

          ఇటు చూస్తే, హీరో అతడి ఫ్రెండ్స్  ముగ్గురూ.
          అటు చూస్తే, హీరోయిన్, ఆమె ఫ్రెండ్, బండి వాడూ ముగ్గురూ.
          మ్యాచింగ్ షాట్స్.
          వాళ్ళు ముగ్గురూ బండి మీద వెళ్లిపోతూంటే,
          ఈ ముగ్గురూ అల్లరల్లరిగా అడవిలోకి పరుగెత్తడం.
          మ్యాచింగ్ షాట్స్.
          ఒక లయగా విజువల్ కథనమంటే ఇది కదా?

సికిందర్
          (నోట్ : నిన్న ఒక ఫోన్ కాల్ లో ఒకరికి ఒక సందేహం : ఇలా స్క్రిప్టు రాసుకుని హీరోలకి విన్పిస్తే వాళ్ళకే మర్ధవుతుందనీ. దీనికి సమాధానం : అసలు ముందు ఇలా రాసుకోవడానికి ప్రయత్నించగలరా?)