రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, August 17, 2017

498 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -11




‘బ్లడ్ సింపుల్’  1984లో తీశారు. ‘టర్మినేటర్’ కూడా 1984 లోనే తీశారు. ‘టర్మినేటర్’ కీ ‘బ్లడ్ సింపుల్’ కీ తేడా ఏమిటంటే, పేసింగ్. అప్పటికి ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ లో పెను మార్పు వచ్చింది.  అటెన్షన్ స్పాన్ (ఏఎస్) అంటే, ఒక దృశ్యంపై ప్రేక్షకులు దృష్టి నిలపగలిగే ఏకాగ్రతావధి. 1980 ల నాటికే ప్రేక్షకుల ఏఎస్ పది సెకన్లకి పడిపోయిందని తేల్చాడు సిడ్  ఫీల్డ్. అంటే నిదానంగా, బారుగా నడిచే సన్నివేశాల్ని తీరిగ్గా కూర్చుని చూసే ఓపిక ఇక ప్రేక్షకులకి లేదన్న మాట. ఈ మార్పు  టీవీ ఛానెల్స్ పైన కూడా ప్రభావం చూపిందని  అన్నాడు. ఒకే ప్రోగ్రాంని ఓపికగా చూడలేక, చేతిలో వున్న రిమోట్ తో ఛానెల్స్ మార్చేసుకుంటూ అక్కడక్కడ  అదో కాసేపు, ఇదో కాసేపూ చూసుకుంటూ పోతున్నారని చెప్పాడు. బిజీ లైఫ్ ఇందుకు కారణమని మనం భావించవచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ లేజీగా వుండేది. పదకొండు గంటలకి ఆవులిస్తూ నిద్రలేచేవారు. తీరుబడిగా, మొక్కుబడిగా  ఈ పనులేంటిరా భగవంతుడా అన్నట్టు ఏడుస్తూ పనులు చేసుకునేవారు. యధారాజా తథాప్రజ- నవాబుల బుద్ధులు జనాలకీ నచ్చాయి, వచ్చాయి. 1983లో బ్రహ్మ ముహూర్తం లో నిద్రలేచే ఎన్టీఆర్ వల్ల, సడెన్ గా హైదరాబాద్ బద్ధకం వదిలించుకుని బిజీగా మారడం మొదలెట్టింది. కాబట్టి ఈ బిజీతో పోటీపడుతూ సినిమాల్లో పేసింగ్ కూడా స్పీడందుకుంది. పేసింగ్ అంటే సీన్ల నడక. ‘టర్మినేటర్’  ఈ పేసింగ్ నీ, ఏఎస్ నీ సీజీతో  సాధించిందని  సిడ్ ఫీల్డ్ వివరించాడు. ‘టర్మినేటర్’  సీజీ తో సినిమాల కథ చెప్పే విధానమే మారిపోయిందనీ, ప్రేక్షకుల ఏకాగ్రతావధిని దృష్టిలో పెట్టుకుని సీన్ల నిడివి తగ్గి, అవి  వేగవంతంగా సాగిపోయే పద్ధతి వచ్చిందనీ చెప్పాడు. 


          బ్లడ్ సింపుల్’  దీనికి విరుద్ధం. ఇదింకా తీరుబడి సీన్ల సాంప్రదాయాన్నే పాటించింది. అదే ‘ఫార్గో’, ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్’ ల నాటి కొచ్చేసరికి కాలాన్ని బట్టి పేసింగ్ ని  పెంచి ప్రేక్షకుల ఏఎస్ కి న్యాయం చేశారు  కోయెన్ బ్రదర్స్. ఇప్పుడు మనం ‘బ్లడ్ సింపుల్’ ని డార్క్ మూవీస్ కి దృష్టాంతంగా పెట్టుకుని చర్చిస్తున్నాం. కొందరికి సందేహాలున్నాయి – అంత  స్లో మూవీ కాబట్టి డార్క్ మూవీ ఎలిమెంట్స్ ని,  వివిధ నిగూఢార్ధాలనీ  ప్లే చేయడం దాంతో సాధ్యమైంది; కానీ నేటి స్పీడ్ పేసింగ్ ల  కాలంలో ‘బ్లడ్ సింపుల్’ శైలిలో  స్లో మూవీ తీయలేం కదాని.

          నిజమే. కానీ పాత సినిమాల్ని చూడాల్సింది పేసింగ్ నే దృష్టిలో పెట్టుకుని కాదు. పేసింగ్ కాలం చెల్లినా  కళాత్మక విలువలు మాసిపోవు.  ఎన్టీఆర్ ‘పాండురంగ మహాత్మ్యం’ని అలాగే ఇప్పడు తీయలేం. కానీ అందులో హాలీవుడ్ స్క్రీన్ ప్లే సంగతులెన్నో వున్నాయి. ఎన్టీఆర్ పాత్ర మారక ముందు అతిగొప్ప డార్క్ మూవీ పాత్ర.  మరి పేసింగ్, ఏఎస్ లని దృష్టిలో పెట్టుకునే నిగూఢార్ధాలతో 1985 లో ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’  అనే ఫాస్ట్ పేసింగ్ గల ఫాంటసీ కూడా తీశారు. కాబట్టి ఇవాళ్టికి మారేది పేసింగే.  మిగతా ఎలిమెంట్స్- నిగూఢార్ధాలు వగైరాలు నేర్చుకోవడానికి ‘బ్లడ్ సింపుల్’ కి కాలంతో సంబంధంలేదు.

          పేసింగ్ గురించి మాట్లాడేప్పుడు తెలుగు సినిమాల్లో వుంటున్న స్పీడుగా సీన్లు కదిలే  పేసింగ్ దేనికి పనికొస్తోంది? గంటన్నరకి ఇంటర్వెల్ వరకూ కథలోకే వెళ్ళదు బిగినింగ్ ఉపోద్ఘాతం.  బిగినింగ్ తో అంతసేపు కాలక్షేపం చేయడం పేసింగ్ అన్పించుకుంటుందా? తెలుగు సినిమాలు ఆడే  థియేటర్లలో ప్రేక్షకుల మొహాలు వెలిగిపోతూంటాయి. అదేమిటంటే స్మార్ట్ ఫోన్ల లైటింగ్. తెరమీద ఓపికని పరీక్షించే ఫస్టాఫ్ ని కట్ చేసి సెకండాఫ్ చూసుకునే రిమోట్ లేదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ అందులో ఏవేవో మార్చుకుని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిర్మాతలకి దర్శకులకీ ఇదేం పట్టదు. ఫస్టాఫ్ బ్రహ్మాండంగా తీసి మెప్పించామనుకుంటారు. తీయడమే తప్ప థియేటర్లలో ఎవరి పరిస్థితేమిటో తొంగి చూడ్డం వుండదు.
          ఇక ‘బ్లడ్ సింపుల్’ మిడిల్ వన్ లో 20వ సీను దగ్గర్నుంచి చూద్దాం...

***
20. రే బార్ కొచ్చి మార్టీ శవాన్నీరివాల్వర్నీ చూసి  హత్య ఎబ్బీ చేసిందనుకోవడం.
    గత సీన్లో విస్సర్ మార్టీ ని చంపి, ప్లాట్ పాయింట్ వన్ కి ఒక ఝలక్ ఇచ్చి వెళ్ళిపోవడం చూశాం. ఇప్పుడు ఈ 20వ సీను ఇలా రాశారు కోయెన్ బ్రదర్స్ :  అదే రాత్రి బార్ లోంచి బయటి  దృశ్యం ఇలా వుంటుంది- పూర్తిగా నిశ్శబ్దం. ఆవరణ ఖాళీగా వుంటుంది. విండోస్ మీద వీధి లైట్ల బ్లూ కాంతి పడుతూంటుంది. అంతలో విండో గ్లాస్ మీద హెడ్ లైట్లు పడతాయి. ఆ వెలుగు ప్రకాశవంతమవుతుంది. కారు ఆగిన శబ్దమవుతుంది. కారు డోర్ తీసినట్టు, వేసినట్టూ శబ్దమవుతుంది. నడిచివస్తున్న బూట్ల శబ్దం. ఒక ఆకారం హెడ్ లైట్స్ ని క్రాస్ చేస్తూంటే, పెద్ద నీడ విండో గ్లాస్ మీద పడుతుంది. అతను ఆ విండో గ్లాస్ తో వున్న డోర్ ని తెరవబోతాడు. అది లాక్ చేసి వుంటుంది. బలవంతంగా లాక్ తీస్తాడు. డోర్ ఓపెనవుతుంది. డోర్ ఫ్రేములో అతడి సిల్హౌట్ కన్పిస్తుంది. 


     

          కెమెరా అతణ్ణి ట్రాక్ చేస్తుంది. బార్ టేబుల్ పైనుంచి అవతలికి వెళ్తాడు.  క్యాష్ రిజిస్టర్ దగ్గర లైటు వేస్తాడు. ఆ వెలుగులో అతను రే అని రివీల్ అవుతుంది. బాక్సు ఓపెన్ చేసి చూస్తాడు. అందులో డబ్బుండదు. తిట్టుకుంటాడు. చుట్టూ చూస్తాడు. మార్టీ ఆఫీసు తలుపు కింద సందులోంచి లైటు వెలుతురు ప్రసరిస్తూంటుంది. తలుపు దగ్గరి కెళ్ళి కొట్టి మార్టీని పిలుస్తాడు. సమాధానం వుండదు. డోర్ నెట్టుకుని లోపలి కెళ్ళిపోతాడు. 

          రే సజెషన్ లో టేబుల్ ముందు అటు తిరిగి కూర్చున్న మార్టీ వుంటాడు. ఒక కాలు టేబుల్ మీద జాపి వుంటుంది. మార్టీనే  చూస్తాడు - పలకవే? చెవుడా? – అంటాడు. అప్పుడు ముందుకు అడుగులేస్తూంటే, కాలికేదో తగిలి ఒక్కసారి పెద్దగా పేలుతుంది. తూలి పడబోతాడు. నేల మీద విసురుగా ఏదో మెటల్ వస్తువు అవతలికి దూసుకెళ్తుంది. 

          తేరుకుని మార్టీ వైపు చూస్తాడు. కదలకుండా అలాగే వుంటాడు మార్టీ. నెమ్మదిగా గోడ పక్కకెళ్ళి స్విచ్ బాక్స్ ఓపెన్ చేసి లైటేస్తాడు రే.  గదిలో వెలుగు పర్చుకుంటుంది.  మార్టీని అలా ఓ చూపు చూస్తూంటే, చెయిర్ కింద మడుగుకట్టిన రక్తం మీదకి  దృష్టి మళ్ళుతుంది. మార్టీ కుడి చెయ్యి జార విడిచి  అలాగే కూర్చుని వుంటాడు. రే ముందుకు కదుల్తాడు. సేఫ్ దగ్గర కింద కూర్చుని, దాని కిందికి తొంగి చూస్తాడు. తెల్లగా మెరుస్తూ గొట్టం లాగా కన్పిస్తుంది. అతి కష్టంగా  దాన్ని బయటికి తీస్తాడు. అది రివాల్వర్.  ఇందాక కాలికి తగిలి పేలిన ఎబ్బీ రివాల్వర్. 

          కొద్ది క్షణాలు విస్మయంగా దాన్నే చూస్తాడు. నెమ్మదిగా లేచి నిలబడతాడు.
వైడ్ షాట్ తీసుకుంటే, టేబుల్ దగ్గర మార్టీ  దృశ్యం. రివాల్వర్ మీంచి మార్టీ మీదికి చూపులు మళ్ళిస్తాడు. నెమ్మదిగా రివాల్వర్ని టేబుల్ మీద పెడతాడు. మార్టీ వెనక్కి వెళ్లి మార్టీని లేపడం మొదలెడతాడు.

          అవతల బార్ లో ఏదో శబ్దమవుతుంది, ఎవరో వచ్చినట్టు. చటుక్కున అటు తిరిగి చూస్తాడు. గబగబా వెళ్లి ఓరగా వేసివున్న డోర్ మూసేసి లాక్ చేసేస్తాడు. లైట్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. కాచుంటాడు. మార్టీ, ఇంటికెళ్ళి పోయావా - అని బార్ టెండర్ మారిస్ గొంతు విన్పిస్తుంది. అడుగులు  సమీపిస్తాయి. సైలెంట్ గా  వుంటాడు. అడుగులు దూరమవుతాయి. తేరుకుని, ఓవర్ కోటు తీసి కుర్చీ కింద రక్తాన్ని తుడవడం ప్రారంభిస్తాడు. 

          బాత్రూం లో కెళ్ళి సింక్ లో ఆ రక్తాన్ని పిండుతాడు. అవతల బార్ లో మారిస్ గర్ల్ ఫ్రెండ్ తో వున్నట్టు నవ్వులు విన్పిస్తూంటాయి. జ్యూక్ బాక్స్ ప్లే అవుతూంటుంది. సింక్ లో రక్తాన్ని పిండేశాక, నేలమీద రక్తం మరకల్ని తుడుచుంటూ మార్టీ వున్న కుర్చీ దాకా పోతాడు. 

          మార్టీ క్లోజ్ షాట్. వెనక్కొచ్చి అతణ్ణి పట్టుకుని లేపుతాడు. అప్పుడు టేబుల్ మీద రివాల్వర్  కనబడుతుంది. ఆగిపోతాడు. దాన్నందుకుంటాడు. క్లోజ్ షాట్ లో మార్టీ జేబులోకి దాన్ని తోస్తాడు. మార్టీని పైకి లేపుతాడు.
          ఇదీ సీను.

***
పై సీనులో ఓపెనింగ్  నిజానికి మూసి వున్న బార్ బయటి వైపు నుంచి చూస్తున్నామన్నట్టు వుంటుంది. రే డోర్ తీసుకుని లోపలి కొస్తే గానీ లోపలి నుంచి చూస్తున్నట్టు అన్పించదు. డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ లో ఒకటైన అద్దాలతో మరోసారి ట్రిక్ చేశారు కోయెన్ బ్రదర్స్. రే బార్ కి రావడం లాంటి ఓ మామూలు షాట్ ని కూడా మనం ఉలిక్కిపడి చూసేలా చేశారు అద్దాలతో. మనం ఎక్కడా లేజీగా షాట్లు చూసేటట్టు చేయడం లేదు. సాధారణమనుకున్న షాట్స్ ని కూడా ఉలిక్కిపడి చూసేట్టు చేస్తున్నారు. ఒక సినిమా తీస్తూ ఇన్ని చేయవచ్చన్న మాట. ఇంకోటేమిటంటే, వెనక సీన్లో బార్ లో యజమాని మార్టీ హత్య జరిగిన తర్వాత,  ఈ సీన్ ఓపెనింగ్ చూస్తే, మూతబడిన బార్ క్లోజైన అతడి చాప్టర్ కి సింబాలిక్ గా, విషాదంగా వున్నట్టు అన్పించడం. కథనాన్ని ఎంతగా తవ్వితీసి వాడుకుంటున్నారో 
దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి చేసేనాటికి ఆలోచనలతో బుర్ర చితికి, చిక్కి శల్యమయ్యారు కోయెన్ బ్రదర్స్. పిచ్చి షాట్లు తీస్తూ పోజులు కొడుతూ తిరగలేదు. 

          ఈ సీనులో దర్శకుల ఉద్దేశం మార్టీని ఎబ్బీ చంపినట్టు రేకి అర్ధమవాలని. కానీ రే ఇలా వస్తాడని మార్టీని చంపిన విస్సర్ వూహించి వుండడు. ఇంకెవరో చూసి, పోలీసులూ వచ్చి, రివాల్వర్ని చూసి, ఎబ్బీ - రే లిద్దర్నీ పట్టుకోవాలని అతడి కుతంత్రం. కానీ దర్శకులు ఇలా రే ని పంపించి అతడి కుతంత్రాన్ని దెబ్బ తీశారు. పాత్రలు పక్క పక్క సీన్లలో పైకి లేవడం, కింద పడ్డం జరిగిపోతున్న స్క్రీన్ ప్లే ఇది. మన సినిమాల మిడిల్లో పైకి లేచిన పాత్ర,  మళ్ళీ ఎప్పుడో పది సీన్ల తర్వాత గుర్తు చేసుకుని, కింద పడ్డం వుంటుంది. 

          ప్రేమకి ఒకసారి కమిటయ్యాక ఆ కమిట్ మెంట్ నే ఇక్కడ చూపిస్తున్నారు. కమిట్ మెంట్ కి ముందు ఇద్దరి అపార్ధాలతో విడిపోయేదాకా వచ్చింది. ఇక కమిటయ్యాక ఇంకేం జరిగినా ప్రేమకే కట్టు బడాలనుకున్నారు. అపార్ధాలొచ్చినా,  అరమరికలొచ్చినా కమిటైన  ప్రేమ డిస్టర్బ్ కాకూడదన్న అంతరార్ధం ఇక్కడ తొంగి చూస్తోంది. 

          ఇందుకే బాబోయ్ ఎబ్బీ హత్య చేసిందని రే పారిపోలేదు. ఎబ్బీ చేసిందనుకుంటున్న హత్యకి ఆమెని తిట్టాలని కూడా ఫోన్ చేయలేదు. తనకి విషయం తెలిసిపోయిందని ఆమెకి తెలీకూడదన్న తపన కూడా వుంది. ఏమీ ఎరగనట్టు తను వుండి,  ఆమెని కాపాడాలను కుంటున్నాడు. నిజంగా గొప్ప ప్రేమే. ఆమె మీద సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి శవాన్ని కూడా మాయం చేసేందుకు  సిద్ధపడ్డాడు. ఇలాటి అతడికి ఆమె ఏమిస్తుందో చూడాలి. 

          అయితే ఈ సీన్లో ఒక లోపం వుంది. రే బార్ బయట కారు దిగి వస్తున్నప్పుడు కారు హెడ్ లైట్లు వేసే వుంటాయి. అలా ఎవరూ హెడ్ లైట్లు వదిలేసి రారు కదా. సీనిక్ ఎఫెక్ట్ కోసం లాజిక్ ని వదిలేశారనుకుందాం, మరి తర్వాత బార్లోకి మారీస్ వచ్చినప్పుడు ఇది చూడడా? రే బార్లోనే వున్నాడని తెలుసుకోడా? రే హెడ్ లైట్స్ ఆఫ్ చేసినా కూడా బయటే  వున్న అతడి కారు మారిస్ చూస్తాడుగా? అసలు ఆ సమయంలో మారిస్ రావడమెందుకు, ఆడియెన్స్ కి ఫేక్ టెన్షన్ పుట్టించడానికి కాకపోతే?

          మొత్తానికి ఈ సీనులోంచి రే శవాన్నిలా  బయటికి తీసికెళ్ళిపోయాడు. ఇది విస్సర్ కి యాంటీ సీను. శవం జేబులో ఎబ్బీ రివల్వర్ని పెట్టేసి మాయం చేయాలనుకున్నాడు.
***
21. కారులో శవంతో రే బార్ లోంచి బయట పడడం.
    ఈ సీనులో బార్ వెనుక పార్కింగ్ వైపు చెక్క మెట్ల మీంచి శవాన్ని లాక్కుపోతూంటాడు రే. దూరంగా మండుతున్న కొలిమి కన్పిస్తూంటుంది.  శవాన్ని కారు బ్యాక్ సీట్లో పడేసి,  కారు పోనిస్తూ రక్తపు గుడ్డల్ని కొలిమిలో విసిరేసి పోతాడు.
22. హైవేమీద ప్రయాణంలో మార్టీ ఇంకా బతికే వున్నాడని రే తెలుసుకుని పారిపోవడం.
           ఈ సీను ఇలా వుంటుంది :  నిర్మానుష్యంగా వున్న  హైవే మీద కారుపోతూంటే రే డియోలోంచి ఇవాంజలిస్టు ప్రవచనం వస్తూంటుంది. రానున్న మూడు ఉపద్రవాల గురించి హెచ్చరిస్తూంటాడు.  ఆఫ్రికాలోనూ, భారత ఉపఖండంలోనూ కరువుకాటకాల గురించి. భూకంపాల గురించి. గ్రహాలన్నీ ఏకమై కల్లోలం సృష్టించడం గురించి. ఇంకా బైబిల్లో చెప్పిన పొంచి వున్న దుష్టుడి గురించి. 

          మార్టీ టెన్షన్ తో డ్రైవ్ చేస్తూంటాడు, మొహం చెమటలు పడుతూంటుంది. అప్పుడప్పుడు వెనక సీట్లోకి చూస్తూంటాడు. మార్టీ శవం అలాగే పడుంటుంది. ఒక కారు పక్కనుంచి దూసుకుపోతుంది. రేడియో కట్టేస్తాడు. అప్పుడు రేకి ఎగశ్వాశ దిగశ్వాశ తీసుకుంటున్న శబ్దం విన్పిస్తుంది. టైట్ క్లోజప్ లో రే – ఉన్నట్టుండి అతడి దవడ ఎముకలు బిగుసుకుంటాయి- గిరుక్కున తల తిప్పి వెనుక  సీట్లో చూస్తాడు. గబుక్కున ముందుకు తిరిగి  సడెన్ బ్రేకేస్తాడు.

  ఈ సీనులో రేడియో ప్రవచనమంతా రానున్న సీన్ల గురించే. దుష్టుడు పొంచి వున్నాడని రే కి హెచ్చరిక వెళ్తోంది. కరువుకాటకాలు,  భూకంపాలు సంభవిస్తాయని భవిష్యవాణి. గ్రహాలన్నీ ఏకమై విధ్వంసక శక్తిని విడుదల చేస్తాయని కూడా మత పెద్ద హెచ్చరిస్తున్నాడు. పొంచివున్న దుష్టుడు విస్సర్ కావచ్చు. భూకంపం ఈ తర్వాతి సీన్లో శవంతో రే చూడబోతాడు. విధ్వంసక శక్తి విడుదల అన్నది క్లయిమాక్సే.

          ఇక్కడ ఊహించని ట్విస్టు మార్టీ బతికే వున్నాడని తెలిసి రే ఠారెత్తిపోవడం...
          మార్టీ హత్య తర్వాత యాక్షన్ ఓరియెంటెడ్ గా వెళ్తున్నాయి మిడిల్ వన్ సీన్లు.
రేపు మిడిల్ వన్ చివరి సీను చూద్దాం

-సికిందర్
ఒరిజినల్ సీన్స్ కాపీ కోసం
 ఇక్కడ క్లిక్ చేయండి