రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, డిసెంబర్ 2017, బుధవారం

574 : సందేహాలు - సమాధానాలు        Q :    ఎప్పటి నుంచో నన్నొక ప్రశ్న వేధిస్తోంది. రైటింగ్ ఈజ్ రీ రీరైటింగ్ అని, ఫస్ట్ డ్రాఫ్ట్ ఈజ్ షిట్ అని,  నేను కొన్నిచోట్ల చదివాను. బ్లాగులో కూడా మీరు ఇదే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. నా అనుమానం ఏంటంటే, కథ ( సినిమాలోని ముఖ్యమైన పోర్షన్ అంతా) మొత్తం భావతరంగంలా ఒకేసారి పుట్టడం జరగదా?  మనం అనుమానంతో దాన్ని మళ్లీ మళ్లీ రాస్తూనే వుండాలా? ఇళయ రాజా గారు చాలా హిట్ ఆల్బమ్ లన్నీ ఒక రోజులోనే ట్యూన్ చేశారు. వేటూరి గారు శంకరాభరణం సహా చాలా హిట్ పాటలు అలవోకగా డిక్టేట్ చేసినవే. బాపూగారి బొమ్మలు కొన్ని అలాంటివే. పరచూరి గోపాలకృష్ణ కూడా అసెంబ్లీ రౌడీ సహా చాలా సినిమాలు ఒకరోజులో రాశానని స్వయంగా చెప్పారు. పూరీ వన్ వీక్ వర్కింగ్ స్టైల్ మీరు వినే వుంటారు. సంగీతంలా, కవిత్వంలా,  సినిమా రచన కూడా కళే కదా? మరి అలవోకగా పుట్టడం అనే దాన్నుంచి సినిమాకు ఏవిధంగా మినహాయింపు? ఫస్ట్ డ్రాఫ్ట్ పనికిరాదని ఎలా సూత్రీకరిస్తారు? ఒక ఎమోషన్లో సింగిల్ సిట్టింగ్ లో కథ పూర్తయితే అది అసమగ్రమా? గ్రామర్ అనుకుంటే సంగీతానికి, కవిత్వానికి కూడా గ్రామర్ వుంది కదా?
- అశోక్
, దర్శకత్వ శాఖ

        A :   రోడ్డు మీద ఒకేసారి ఒక బొమ్మ వేయవచ్చు, ఒక రాయిని  తీసుకుని ఒకేసారి శిల్పాన్ని చెక్కగలరా? ఒక్కో కళకి ఒక్కో సౌలభ్యం వుంటుంది. సంగీతానికుండే సౌలభ్యం సినిమా స్క్రిప్టు కుండదు. ఉంటే బీఎన్ రెడ్డిలు, నాగిరెడ్డి – చక్రపాణీలు ఆనాడే ఆ సులువు చెప్పిపోయేవాళ్ళు. ఆరునెలల పాటు కథల మీద కూర్చునే వారు కాదు. సినిమా కథ సంగ్రహంగా మెదడులో ఒక భావతరంగంలా పుట్ట వచ్చు. అది సమగ్ర కథ అవదు. అది సాఫ్ట్ వేర్. ఆ సాఫ్ట్ వేర్ కి రూపంకోసం, సమగ్రత కోసం దాన్ని పెంచుకుంటూ హార్డ్ వేర్ ని సృష్టించాల్సిందే. ఆలోచన వరకూ (సాఫ్ట్ వేర్ వరకూ) భావతరంగం సంగ్రహమే. దాన్నలాగే పట్టుకోగల్గి, సమగ్రంగా విస్తరించుకోగల్గితే, ఆ పూర్తి నిడివి కథ సాంతం ఆ భావతరంగం ప్రవహించే అవకాశముంది.  

          ఇంతా చేసి, స్క్రిప్టులో ఇంత సమగ్రంగా పొందుపర్చుకున్న భావతరంగాన్ని చిత్రీకరణలో పట్టుకుని కొనసాగగల్గాలి. చిత్రీకరించినప్పుడల్లా భావతరంగానికి అడ్డొచ్చే రీటేకుల బాధ వుంటుంది. తీరా నలభై రోజులు చిత్రీకరించుకుని చూసుకున్నాక, పేపర్ మీదున్న భావతరంగం ప్రొజెక్షన్ లో కూడా కనపడాలి. కాబట్టి మెదడులో ముందు పుట్టిన భావతరంగం వుంటుందే, అది ఒట్టి రాయి లాంటిది. అది తెరమీది కెక్కాలంటే  ఇంత చెక్కాలి. ఇప్పడు ముప్ఫై క్రాఫ్టులున్నాయా, ఈ 30 నీ సమన్వయం  చేసుకుంటూ చెక్కాలి. ఒక భావావేశానికి లోనై ఓ గంటలో రాసేస్తే అయిపోదు, ఆ 30 క్రాఫ్టుల తర్వాతే తేలేది భావతరంగాల సంగతి, భావావేశాల సంగతీ. కాబట్టి ఎందుకొచ్చిన బాధ! ఈ రోజుల్లో ‘హలో’ లోలాగా ఎవరిక్కావాలి భావతరంగాలు. ఫటాఫట్ తీశామా, ఛటాఛట్ చూశారా – ఇంతే సినిమాల సంగతులు. బయట ఇంకా మాధ్యమాలున్నాయి ప్రేక్షకులకి - చాలా సేపూ ఫేస్ బుక్ కూడా చూసుకోవాలి, టైం లేదు. 

          పరుచూరి గోపాల కృష్ణ గారు ఒక రోజులో రాశారంటే అవి 40 పేజీల సినాప్సిస్ లై వుండొచ్చు. షూటింగుకి సిద్ధం చేసిన పూర్తి స్థాయి స్క్రిప్టు లవకపోవచ్చు. అనుభవజ్ఞులు కాబట్టి రాయగలరు. పూరీ జగన్నాథ్ గారు సాఫ్ట్ వేర్ క్రియేట్ చేయరు. అదే కథనం, అవే సీన్లతో ఒక సాఫ్ట్ వేర్ టెంప్లెట్ గా, పర్మనెంట్ గా పక్కన వుంటుంది. దాంట్లోకి ఆర్టిస్టుల్ని మార్చి,  ఆ మేరకు డైలాగులు రాయడానికి వారం రోజులు చాలు. సారంలో తేలేది ఆయన కేవలం డైలాగులు రాశారనే, ఇది మర్చిపోకూడదు. పేరుంది కాబట్టి ఆయనేమైనా చేయగలరు. మీకు లేదు, మీరలా చేయలేరు. 

          మళ్ళీ భావతరంగాని కొద్దాం. భావతరంగమంటే  ఏమిటి, ఒక ఎమోషనేగా? ఆ  ఎమోషన్ వేటి మీద ఆధారపడితే ప్రభావం చూపుతుంది? పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు, ఫ్లాష్ బ్యాకుల కథనాలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు, సెకండాఫ్ సిండ్రోములు, కథ కాకుండా గాథలు ...వగైరావగైరాల మీద ఆధారపడి భావతరంగాలు వెల్లివిరుస్తాయా? సరిగమలవుతాయా? ఇది ఆలోచించాలి.

          ఇక
సంగీతానికి, కవిత్వానికి, కథలకీ గ్రామర్ కాదుగానీ, స్ట్రక్చర్ అనాలి, లేదా నిర్మాణ మనాలి. బిందువులో వుండే నిర్మాణం సింధువు గా విస్తరించినప్పుడూ వుంటుంది. ఐతే ఆ బిందువే సోల్ లేదా ఆత్మ అవుతుంది. ఒక్కో కళకి ఒక్కో స్థాయిలో ఆత్మని విస్తరించడమే జరుగుతుంది. కళని బట్టి క్షణాలు పట్టే విస్తరణలు, కాలాలు పట్టే విస్తరణలు. అన్నిటినీ ఒకే గాటన కట్టలేం. 

          స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ తన పుస్తకంలో  ‘ఆగా బాబా’  అనే జానపద కథప్రస్తావిస్తాడు. అందులో యంగ్ హీరో ఎక్కడికో పోతూ విశ్రాంతి కోసం మంత్రగత్తె దగ్గరాగుతాడు. అప్పుడా మంత్రగత్తె  కొన్ని ప్రశ్నలేస్తుంది - సత్యమంటే ఏమిటి, ఈ ప్రపంచం ఎప్పటికైనా అంతమవుతుందా అంటూ.  అప్పుడా యంగ్ హీరో ‘షటప్! ముందు తింటానికే మైనా పెట్టు!” అంటాడు. అంటే, వున్నాయో లేవో తెలియని అలౌకిక విషయాలకంటే,  వున్న లౌకిక జీవితాని కేం కావాలో చూసుకోవాలని నీతి.

          నేర్చుకునే దశలో కళాఖండాల సృష్టి గురించి ఆలోచన అవసరం లేదు. ముందు ఒక్కో మెట్టు ఎదగడం కోసం బేసిక్స్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాలి. కాస్త ఇంగ్లీషు పరిజ్ఞానమున్న ఔత్సాహికులు ఒకటే స్క్రీన్ ప్లే పుస్తకాలు  చదివేస్తూంటారు. ముందు సిడ్ ఫీల్డ్ తో ప్రారంభించి ఎంతో బేసిక్స్ నేర్చుకోవాల్సిన వాళ్ళు, అప్పుడే అర్ధం జేసుకోలేని జేమ్స్ బానెట్ కెళ్ళిపోతారు, జోసెఫ్ క్యాంప్ బెల్, రాబర్ట్ మెక్ కీ లకెళ్ళిపోతారు. నల్గురిలో గొప్ప అన్పించుకోవడం కోసం తప్ప మరేమీ కాదు. కూర్చుని ఒక్క లైన్ ఆర్డర్ కూడా వేయలేరు. ఇంటి దగ్గర్నుంచి డబ్బులు తెప్పించుకుని వృధాగా గడిపేస్తూంటారు. దర్శకత్వ శాఖలో వున్న వాళ్ళకి ప్రాక్టికల్ అనుభవం సంపాదించుకునే అవకాశం వుంటుంది. ఆ ప్రాక్టికాలిటీకి ఎంతవరకూ పుస్తకాల్లోంచి తీసుకోవాలో అంతవరకే తెలుసుకోవాలే తప్ప, తెలుసుకుని కస్టమైజ్ చేసుకోవాలే తప్ప, లేనిపోని  మేధస్సు ప్రదర్శించబోతే  లౌకికంగా విఫలమవుతారు. 
***