రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, అక్టోబర్ 2021, ఆదివారం

1070 : రైటర్స్ కార్నర్

     సినిమా రచయితలు పాత మూస వాసనలు వెదజల్లకుండా ఎలా వుండాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి వగైరా తెలుసుకోవడానికి కూడా బద్ధకించే రోజులిక లేవు. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాక వారం వారం విడుదలవుతున్న సినిమాలు పాత మూస సుగంధాలతో, రాయడం చేతకాని దుర్గుణాలతో బుకింగ్స్ ని గుల్ల చేస్తున్న పరిస్థితుల్లో, గ్లోబల్ -పానిండియా- ఓటీటీ అంటూ గొప్ప మాటలు మాట్లాడుకోవడం హాస్యాస్పదంగానే వుంటుంది. ముందు పాత మూస వాసనలతో నువ్వెంత గ్లోబల్ -పానిండియా- ఓటీటీయో చెప్పవయ్యా బాబూ అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు. ఇంకా పాత మూస ఫార్ములాల అండతో దబాయిస్తారా? దాంతో లేజీ రైటింగ్ చేసుకుంటూ ఇలాగే కాలం గడిపేస్తారా? ఆత్మపరిశీలన చేసుకోవడం ఉత్తమం.

       సిద్ధార్థ్ సింగ్- గరిమా వాహల్ లు బాలీవుడ్ జంట రచయితలు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు రాస్తారు. బ్రదర్స్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, పల్ పల్ దిల్ కే పాస్, జబరియా జోడీ, టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ, బత్తీ గుల్ మీటర్ చాలూ, రామ్ లీలా, కబీర్ సింగ్, యానిమల్ మొదలైన సినిమాలకి పని చేశారు. దుకాన్, యే సాలీ ఆషిఖీ అనే రెండు సినిమాలకి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి పని విధానంలోకి తొంగి చూస్తే తాజాదనంతో కూడిన రైటింగ్ కి సంబంధించి అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరుకుతాయి. అవేమిటో చూద్దాం....

1. మీరు ఎలా చెప్పి కథల్ని  ఒప్పిస్తారు?  
        ముందు ఒక లైనుగా ఐడియా చెప్పి కన్విన్స్ చేయగల్గాలి. ఒక లైనుగా  కన్విన్స్ చేయకపోతే ఇంకేం చేసీ కన్విన్స్ చేయలేం. ఒక లైనులో ఐడియా చెప్పకలేక పోతే అవతలి వాళ్ళ టైమ్ వేస్ట్ చేసినట్టే. ఒక లైనులో ఐడియా చెప్పగానే అవతలి వాళ్ళు ఎక్సైట్ అయి,ఇంకా ఇంకా చెప్పమనేట్టు వుండాలి. ఇలా జరిగితే స్క్రిప్టు ఓకే అవడానికి దారి పడినట్టే.

2. డైలాగు రచనకి పూర్వమున్నంత ఆదరణ ఇప్పుడున్నట్టు లేదు. దీని గురించి ఏం చెప్తారు?
       అన్ని క్రాఫ్ట్స్ లో కంటే డైలాగు రచనని చాలా తేలిక బావంతో చూస్తున్న రోజులివి. డైలాగులకి రిపీట్ ఆడియెన్స్ తో బాటు, కథని సరళతరం చేసే, స్క్రీన్ ప్లేకి బలాన్ని చేకూర్చే శక్తి వుండేది ఒకప్పుడు. ఇప్పుడా శక్తి అవసరం లేదంటున్నారు. డైలీ చిట్ చాట్ లాగా వుంటే చాలంటున్నారు. డైలాగు డైలాగులా అన్పించకూడదని అంటున్నారు. మరి డైలాగ్స్ కి నిర్వచనమేమిటో చెప్పమంటే చెప్పలేరు. సింపుల్ లైనులాగా వుండేదే డైలాగు అంటున్నారు. కానీ ప్రేక్షకులు సినిమాని డైలాగులతో గుర్తు పెట్టుకుంటారని మేం భావిస్తాం. రిచ్ డైలాగులున్న సినిమాని మర్చిపోలేరు. సింపుల్ లైన్లతో పని జరిగిపోయినా, అవి మెమరబుల్ గా వుండవు. మా ఉద్దేశంలో మెమరబుల్ ఫిలాసఫీని తేలికైన భాషలో చెప్పేదే సింపుల్ లైను.

3. యానిమల్ లో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ లు నటిస్తున్నారు. కబీర్ సింగ్ తీసిన సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. కబీర్ సింగ్ కి మీరే డైలాగులు రాశారు. ఇప్పుడు యానిమల్ కి మీరెలా డిఫరెంట్ గా రాస్తున్నారు?
       సినిమాటిక్ డైలాగుల్నిఆదరించే దర్శకులు కొందరైనా వున్నారని మా నమ్మకం. ఆ వర్గంలో సందీప్ తప్పకుండా ఒకరు. యానిమల్ కథ ఆయన చెప్పగానే ఉద్వేగానికి లోనయ్యాం. ఇందులో డైలాగుల ద్వారానే కథ చెప్పాలి. మేం రాసిన సినిమాలకి డిఫరెంట్ టోన్స్ నీ, డిఫరెంట్ లోకాల్నీ సృష్టించాం. బ్రదర్స్ లో కేథలిక్ కుటుంబాన్ని, జెర్సీలో పంజాబీ సామాజిక వాతావరణాన్ని. అలా యానిమల్లో సింపుల్ లైన్లతో బాటు స్పెషల్ లైన్లు కలిసిపోయిన ప్యాకేజీగా ఇచ్చాం. సినిమాటిక్ టోన్ నీ, సింప్లిసిటీనీ సవాలుగా తీసుకుని బ్యాలెన్స్ చేశాం. డైలాగుల్లో ప్రత్యేక మానసిక స్థితి కనబడాలన్నారు సందీవ్. ఆ మేరకు నిగూఢ మానసిక స్థితిని ప్రతిబింబించాం.

4. మీరు వివిధ జానర్లకి రాశారు. మీ వర్కింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి?
       నిజానికి మా ప్రతీ స్క్రిప్టు డిఫరెంట్ ప్రాసెస్సే. రామ్ లీలాలో షేక్స్ పియర్ రాసిన రోమియో జూలియెట్ ప్రేమ కథని వయోలెంట్ గా మార్చి రాశాం. ఆ ప్రకారం స్క్రీన్ ప్లేని, డైలాగుల్నీ, పాటల్నీ ప్రాసెస్ చేశాం. స్క్రిప్టు ప్రతీ లెవెల్లో దాని టోన్, కథాలోకం, పాత్రలు మొదలైనవి చాలా రీసెర్చిని డిమాండ్ చేశాయి. ఈ ప్రాసెస్ లో బాగంగా నిజ జీవిత వ్యక్తుల్నీ, వాళ్ళ మ్యానరిజమ్స్ నీ తెలుసుకోవడం నిత్య కార్యక్రమమై పోయింది. ఈ ప్రాసెస్ నే ఆయా కథలు డిమాండ్ చేసే వాటికీ అమలు చేస్తాం. మేం రాసే పాటలూ  స్క్రీన్ ప్లేల్లోంచే పుడతాయి కాబట్టి, ఆ లిరిక్స్ సిట్యూయేషనల్ గా, యూనివర్సల్ గా వుండేట్టు చూస్తాం.

5. రచయితలుగా సినిమా నిర్మాణంలో మీరెంత వరకు భాగం పంచుకుంటారు?
       మేం రాసిన ప్రతీ స్క్రిప్టు షూటింగులో మేమున్నాం. టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ మా ఐడియానే  కాబట్టి, రీసెర్చిలో, రైటింగ్ లో కూలీల్లాగా శ్రమించాం. షూటింగులో, ఎడిటింగులో వున్నాం. ఇదంతా మేం దర్శకత్వం వహించడానికి తోడ్పడింది. దుకాన్ సబ్జెక్టు గుజరాత్ నేపధ్యంలో అద్దె గర్భాలతో వ్యాపారం గురించి. యే సాలీ  ఆషిఖీ  ఉత్తరప్రదేశ్ లో ఆనర్ కిల్లింగ్స్ గురించి. ఇండియాని కథల గనిగా మేం భావిస్తాం. తవ్వి చూస్తే ఆణిముత్యాలే దొరుకుతాయి. ఈ కథల్ని కనుగొనడం, రీసెర్చి చేయడం, వెండితెర మీద ప్రాణం పోయడం - ఇదంతా మాకు అమితానందాన్నిచ్చే ప్రాసెస్.   

దుకాన్ కోసం ఎన్నోసార్లు గుజరాత్ లోని ఆనంద్ కెళ్ళాం. అక్కడి ఫీల్ ని పట్టుకోవడం కోసం. అక్కడి సామాజికార్ధిక పరిస్థితుల అవగాహన కోసం. దుకాన్ స్క్రిప్టు నాల్గేళ్ళుగా ప్రాసెస్ లో వుంది. గుజరాత్ లో నవరాత్రి సందర్భంగా పాడుకునే పాటల్ని, సంగీతాన్నీ రీసెర్చి చేశాం. ఇలాటి కథ సినిమాగా రాలేదు గనుక, శూన్యం లోంచి సృష్టించాలీ గనుక, ఈ మాత్రం కాలం తీసుకుంటుంది.

       అలాగే ఉత్తరప్రదేశ్ లో ఆనర్ కిల్లింగ్స్ గురించి యే సాలీ ఆషిఖీ కి రీసెర్చి చేశాం.  కొన్నేళ్ళుగా దేశంలో ఆనర్ కిల్లింగ్స్ 700 శాతం పెరిగి పోయాయి. నిజ జీవితంలో ప్రేమికు లెదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని చూపించ దల్చుకున్నాం. అసలు ఆనర్ కిల్లింగ్ పద బంధమే ఎంత వరకు కరెక్టో ప్రశ్నిస్తున్నాం. ఆనర్ కిల్లింగ్స్ అంటే పరువు హత్యలనే అర్ధం వస్తుంది. పరువునా హత్య చేస్తున్నది? ఇది అర్ధవంతంగా వుందా? పరువుని హత్య చేయడమేమిటి?

6. రచయితలకి గుర్తింపు లభించే దిశగా పరిస్థితులు మారతాయంటారా? అప్పట్లో సలీం -జావేద్ ల రాకతో రచయితలకి గుర్తింపూ పారితోషికాలూ పెరిగాయి. ఆ కాలం మళ్ళీ తిరిగొస్తుందా?
        ఇప్పుడు ఫర్వా లేదు. అయితే ఇంకా లభించాల్సిన స్థాయిలో గుర్తింపు లభించాలని అనుకుంటున్నాం. మేం ట్రైలర్స్ లో కూడా మా పేర్లు వేసేలా పోరాడేం. చాలా తక్కువ మంది నిర్మాతలే ఎలాగో  పోస్టర్స్ లో, ఫస్ట్ లుక్స్ లో పేర్లు వేస్తున్నారు. సలీం -  జావేద్ లు ప్రారంభంలో పెయింటర్స్ కి డబ్బులిచ్చి, తాము రాసిన సినిమాల వాల్ పోస్టర్ల మీద తమ పేర్లు రాయించుకునే వాళ్ళట ముంబాయి వీధులన్నీ తిప్పి. రచయితలకి గుర్తింపు కోసం పోరాడినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు సినిమా తీయాలంటేనే మొదట నియమించుకునేది రచయితని. రచయిత అడుగు పెట్టే వరకూ తెల్ల కాగితాలు తెల్ల కాయితాల్లాగే వుంటాయి.

7. మీరు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి పని చేశారు. ఆయన సినిమాలకీ, ఇతర దర్శకుల సినిమాలకీ మీరు స్క్రిప్టులు రాయడంలో చూపించే తేడా ఏమిటి?
        సంజయ్ లీలా భన్సాలీ మాస్టర్ మైండ్. సినిమా మేకింగ్ పట్ల లోతైన అవగాహన ఆయనకుంది. రైటింగ్, ఎడిటింగ్, డిజైన్, ఆర్ట్, కెమెరా వర్క్ వగైరా. రైటింగ్ అంటే ఆయనకి చాలా పిచ్చి. మేం రాసిన ఒక లైన్ నచ్చితే, సింగిల్ స్క్రీన్ థియేటర్లో  ప్రేక్షకులెలా కేరింతలు కొడతారో, అలా గట్టిగా అరిచేస్తారు. ఆయనంత క్యాలిబర్ వున్న దర్శకులతో మేమింకా పని చేయాల్సి వుంది.

8. ఆయనతో వుండే డిఫరెంట్ ప్రాసెస్ ని మీరెలా తీసుకుంటారు? షూటింగ్ సమయాల్లో కూడా ఆయన మార్పు చేర్పులు చేస్తూంటారు కదా?
        ఆయనలా చేస్తారనేది దురభిప్రాయం మాత్రమే. నిజానికి ఆయన పని విధానంతో మా ప్రాసెస్ కలిసిపోయి వుంటుంది. రచయితలుగా మేము మా స్క్రిప్టుల్ని మార్పు చేర్పులకి అనువుగానే వుండేట్టు ఫ్లూయిడ్ గా రాస్తాం. ఆమూలాగ్రం సబ్జెక్టు మీద పట్టు వుంటేనే ఇది సాధ్యమవుతుందని అనుకుంటాం.

9. మీరు కమర్షియల్ స్క్రిప్టు రాస్తున్నప్పుడు జెండర్ రోల్స్ ప్రాధ్యాన్యంతో రాజీ పడకుండా వుండ గల్గుతారా? పురుషాధిక్యతకి , పితృస్వామ్య పంథాకి మీ రచనల్లో అవకాశం లేకుండా చూడగలరా?
        రచయితలు వాళ్ళ దృక్పథంలోంచి, అనుభవాల్లోంచి, పెంపకం లోంచీ, చూస్తున్న కళ్ళద్దాల్లోంచీ రాస్తారు. మేం జెండర్ రోల్స్ ని స్థాపించడానికి ఎప్పుడూ ప్రయత్నించం.సహజంగానే బలమైన, దృఢాభిప్రాయం కల్గిన స్త్రీ పాత్రల వైపే మొగ్గుతాం. ఆధునిక సమాజంలో ఫెమినిజంతో ప్రబలంగా నెలకొన్న దురవగాహన పట్ల పౌరులుగా మాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. పురుషాధిక్యత నిర్వచనం పట్ల కూడా. రామ్ లీలా, టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథాల్లో బలమైన స్త్రీ పాత్రలే ఉదాహరణలు. శతాబ్దాల పితృస్వామ్య పెత్తనం పట్ల స్త్రీల నరనరాల్లో ఇంకిన వ్యతిరేకతనే ఈ పాత్రలు ప్రతిబింబిస్తాయి.

10. పాటల రచయితలకి ఎలాటి గుర్తింపు లభిస్తోందని మీరనుకుంటున్నారు?
        ప్రస్తుత పరిస్థితి అసంతృప్తి కరంగానే వుంది. గీత రచయితల కంటే గాయకులకీ, సంగీత దర్శకులకీ ఎక్కువ గుర్తింపు లభిస్తోంది. గీత రచన కళా కాదు, కవిత్వమూ కాదు. మ్యూజిక్ వేదికల మీద సంగీత దర్శకుడి పేరే వినిపిస్తుంది. గీత రచయితలు, గాయకులు, సంగీత దర్శకులూ కలిస్తేనే పాట పుడుతుందని గుర్తిస్తేనే పరిస్థితి మారుతుంది. గీత రచయిత రాయకుండా ఏం పాట పుట్టిస్తారు. అసలు గీత రచయితల కన్నా స్క్రిప్టుని అర్ధం జేసుకునే వాళ్ళు సమస్త సినిమా నిర్మాణపు శాఖల్లో వుండరని ఈ తరం దర్శకులు మర్చి పోతున్నారు. కుచ్ తో లోగ్ కహేంగే, సందేశే ఆతే హై- వంటి ఆనాటి పాటలే చూడండి- స్క్రిప్టుని అర్ధం జేసుకుంటేనే వాటినలా రాయగలరు కదా. సిట్యూయేషనల్ సాంగ్స్ అంటే ఏమిటో కూడా చరిత్రలోంచి నిర్మాతలు తెలుసుకోవడం లేదు. వాటి స్థానంలో హిట్ నంబర్స్ పెట్టాలనుకుంటారు. సిట్యూయేషనల్ సాంగ్స్ ని కూడా హిట్ నంబర్స్ లా పాటల రచయితలు రాయగలరని తెలుసుకోవడం లేదు. తెలుసుకుని నమ్మాలి మరి.

11. గత కొన్ని సంవత్సరాలుగా కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాట బాగా వాడుకలో వుంది. ఇప్పుడు ఓటీటీల యుగంలో దీని ప్రాముఖ్యం ఏమైనా పెరిగిందంటారా?
          మార్పు తప్పకుండా కన్పిస్తోంది. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోలాగా కాకుండా, హిందీలో కంటెంట్ ప్రధాన సినిమాలు గాక, స్టార్ ప్రధాన సినిమాలే వుంటున్నాయి. ఓటీటీ దండయాత్రతో కంటెంట్ ప్రధాన సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నా, దీన్నంది పుచ్చుకుని బాలీవుడ్ లో కంటెంట్ ప్రధాన సినిమాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది.

12. కంటెంట్ కి ప్రాముఖ్యాన్నిచ్చి నిర్మాతలు వివిధ ప్లాట్ ఫామ్స్ ని ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇది లీగల్ సమస్యల్ని తెచ్చి పెడుతోంది. కొన్ని సినిమాలని, వెబ్ సిరీస్ నీ మనోభావాల పేరుతో బ్యాన్ చేయాలంటూ, బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. దీని గురించేమంటారు?
          సృజనాత్మక స్వేచ్ఛనేది ఆఫ్ ది రికార్డుగా హైసొసైటీ సంభాషణల్లోనే వుంటోంది. ప్రతీ క్రియేటర్ వెనుకా సెన్సార్ భూతం కూడా పొంచి వుంటోంది. అధికారంలో వున్న వాళ్ళకి విమర్శని స్వీకరించే మనస్తత్వం లేదు, సెటైర్ ని గౌరవించే సంస్కృతీ లేదు. అసహిష్ణుతే వారి స్వభావంగా మారింది. సినిమాల మీద పెరిగిపోతున్న లీగల్ కేసుల్ని చూస్తే, భావ స్వేచ్ఛ ప్రాథమిక హక్కని కాదు, ప్రాథమిక పోరాటమని పోరాడాల్సిన సమయం వచ్చింది.

13.
ఇటీవల కాలంలో చాలా రీమేకులు, సీక్వెల్సులు, నిజ సంఘటనలతో తీసిన సినిమాలూ  వస్తున్నాయి. ఈ ట్రెండ్ లో కొత్త రచయితలకి తమదైన ఒరిజినల్ కంటెంట్ ఇచ్చుకునే అవకాశాలేమైనా వున్నాయంటారా?
        ఒరిజినల్ కంటెంట్ వైపు మేం గట్టిగా నిలబడతాం. దీనికోసం ఎంతైనా పోరాడతాం, ఎన్ని అడ్డంకులైనా దాటుతాం. రీమేకులతో నిర్మాతలు సేఫ్ గా ఫీలవుతారు. ఒక కొత్త ఐడియాకి ఏదైనా రిఫరెన్సు పాయింటు వున్నా మొగ్గు చూపుతారు. పూర్తిగా ఒరిజినల్ కంటెంట్ అనేసరికి ప్రోత్సాహం అంతగా వుండడం లేదు. ఓటీటీల్లో వుంటోంది. అక్కడ ఒరిజినల్ కంటెంట్ కి అవకాశాలెక్కువ, కొత్త రచయితలకి ప్లాట్ ఫామ్స్ కూడా పెరుగుతున్నాయి. 

14. రచయితలకి కనీస గౌరవ మివ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఈమధ్య రైటర్స్ కీ, మేకర్స్ కీ మధ్య ఘర్షణలు తలెత్తిన సందర్భాలూ వున్నాయి. దీనిపై మీరేమంటారు?  
        సినిమాకి మొట్ట మొదట నియమించుకునేది రచయితనే. దర్శకుడే రచయిత కూడా కానప్పుడు మేకింగ్ అన్ని దశల్లో మేం తోడ్పాటుగా వుండాలని ఫీలవుతాం. ఎందుకంటే అనుకున్నదొకటి, తీసిందొకటి కాకుండా వుండాలని. కానీ దురదృష్టమేమిటంటే, స్క్రిప్టు పూర్తయి, కాస్టింగ్ ఫైనలయ్యాక, రచయితతో పని లేదని  తలుపు లేసేస్తారు. తమ కోసం పని చేసిన రచయిత విలువని గుర్తించడానికీ, ఇంకేమైనా ఇన్ పుట్స్ తీసుకోవడానికీ, పేరు కూడా వేయడానికీ ఇక మనసొప్పదు. పైసలు తీస్కో, పని చేస్కో, చెక్కేస్కో- ఇదీ వాళ్ళు నమ్మే విధానం. రచయితనే వాడు క్లోజుడు డోర్ హీరో. గది నిండా కూర్చున్న ప్రొడక్షన్ మనుషుల్ని ఒప్పించి చప్పట్లు అందుకుంటాడు. వాణ్ణి గనుక  బయటికి తోసేశాక బయటేమీ వుండదు, చప్పట్లు కొట్టే ప్రేక్షకులూ వుండరు.

        కానీ ఓటీటీ పుణ్యమాని పరిస్థితులు మారుతున్నాయి. వెబ్ సిరీస్ లో రైటరే షో రన్నర్. వెబ్ సిరీస్ నుంచి దర్శకుణ్ణి తీసిపారెయ్యొచ్చు గానీ  రచయితని తొలగించలేరు, పేరు వేయకుండానూ వుండ లేరు.

15. లాబీయింగ్, బంధుప్రీతి, కనెక్షన్స్ వంటి పవర్ డైనమిక్స్ మీ కెరీర్ కి అడ్డు పడలేదా?
        అడ్డుపడ్డాయి. మా సబ్జెక్టులతో నిర్మాతలు సినిమాల్ని ఎనౌన్స్ చేస్తే, పవర్ఫుల్ వ్యక్తులు రంగంలోకి దిగి వాటిని ఆపు చేయించిన అనుభవాలూ మాకున్నాయి. మాకు క్యాంపులూ గాడ్ ఫాదర్లూ లేకపోయినా, మెరిట్ ని, పనిని నమ్మాం. చాలా నిర్మాణ సంస్థలకి స్క్రిప్టు పనులు చేసి వున్న అనుభవంతో, ఏం జరిగినా మంచి రచనకి ఎప్పుడూ తీసివేయలేని విలువ వుంటుందని గ్రహించాం. అయితే మేమెప్పుడైతే దర్శకత్వానికి పూనుకున్నామో, అప్పుడొక కొత్త సినిమా పరిశ్రమ మాకు ఆవిష్కారమైంది. ఐడియా కొనుగోలు దగ్గర్నుంచీ స్క్రిప్టు తీసుకోవడం వరకూ, కాస్టింగ్ నుంచీ మిగతా ప్రొడక్షన్ వరకూ దేనికీ మెరిట్ బేసిస్ గా వుండదని అర్ధమయింది. ఎవరితో ఎక్కువ ర్యాపో వుంటే వాళ్ళే ప్రాజెక్టులోకి వచ్చేస్తారన్న మాట.


16. టాలెంట్ కంటే నెట్వర్కింగ్ ముఖ్యమంటారా?
        నెట్వర్కింగ్ చాలా చాలా ముఖ్యం. కొంత కాలం తర్వాత టాలెంట్ అప్రధానమైపోతుంది. ఎంత కాలం వుంటామన్నది టాలెంట్ ని బట్టి వుంటుంది. కానీ నిర్మాతల్ని ఎలా వెళ్ళి కలవ గల మన్నది తెలిసిన వాళ్ళతో నెట్వర్కింగ్ మీద ఆధారపడి వుంటుంది. ఇక్కడ ప్రతి వొక్కరూ స్క్రిప్టు పట్టుకుని తిరుగుతూంటారు, వినిపించాలని. నెట్వర్కింగ్ లేనిది ఎవరూ వినరు. కొందరు బండ మనుషులుంటారు. వాళ్ళు  రోజుల తరబడి ప్రొడక్షన్ ఆఫీసుల ముందుకూర్చునే వుంటారు. ఆఖరికి చూసి చూసి ఎప్పుడో పిలుపొస్తుంది లోపలి నుంచి.

17. ఓ పదేళ్ళుగా పరిశ్రమలో వుంటున్న కళాకారులుగా మీరు ఏఏ సమస్యలకి పరిష్కారాలు కోరుకుంటున్నారు?  
        ఫెమినిజం, సామాజికాంశాలు, రాజకీయ చిత్ర పటం, భావ స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ - వీటిని గురించి బలంగా ఫీలవుతాం. సినిమా పరిశ్రమలోని ప్రతీ శాఖలో లింగ భేదం లేకుండా సమాన చెల్లింపులు, పలుకుబడిని చూసి కాక మెరిట్ తో గుర్తించి ప్రోత్సహించడం, ఒరిజినల్ కంటెంట్ కి సపోర్టుగా వుండడం, తెర వెనుక పనిచేసే వారందరికీ సమానంగా క్రెడిట్స్ ఇవ్వడం, స్త్రీ పురుష పాత్రల్ని దైవాంశ సంభూతులన్నట్టు గాక సహజసిద్ధ వాస్తవిక చిత్రణలతో చూపడం, బయోపిక్స్ లో చీకటి కోణాల్ని కూడా చూపిండం, కొత్త తరహా స్క్రిప్టులకీ, కొత్తగా వచ్చే మేకర్లకీ సమానావకాశా లివ్వడం, లైటింగ్ సిబ్బంది, స్టంట్ మెన్లు, ఇతర టెక్నీషియన్లంలందరికీ మంచి సౌకర్యాలు కల్పించడం, వీటన్నిటితో బాటూ లాబీయింగ్ లేని, బంధు ప్రీతి లేని, స్వేచ్ఛాయుత సినిమా పరిశ్రమని మేం కోరుకుంటున్నాం.   

18. మీరు ప్రారంభించిన ఫాస్టర్ క్లాస్ వీడియోల గురించి చెప్పండి. ఈ ఐడియా వెనుక ఉద్దేశమేమిటి?
        స్క్రిప్టులు రాయడంలో వుండే ఫన్, పిచ్చి తనం, వెర్రి వేషాలు హైలైట్ చేయడం మా ఉద్దేశం. రచనా ప్రక్రియ రోమాన్స్ లాంటిదని చెప్పడమే మా ఫాస్టర్ క్లాస్ ఐడియా వెనకున్న ఉద్దేశం. మామూలుగా రచనలు చేయడం ఒంటరి జీవితాన్ని, అధిక శ్రమనీ డిమాండ్ చేసే శుష్క వ్యవహారమనే భావముంది. మేం దీన్ని ఫన్ గా మార్చి, వీలైనంత మందిని ఇటువైపు ఆకర్షితులయ్యేట్టు చేయాలని ప్రయత్నిస్తున్నాం. రాయడం గురించి కేవలం టిప్స్ ఇచ్చి వూరుకోవడం లేదు.

19. కొత్త రచయితల్లో మీరు కోరుకునే దేమిటి?
        హాస్యప్రియత్వం. కథ రాయడానికి అనేక పద్ధతులుంటాయి. అయితే సీరియస్ సామాజిక సమస్యల్ని కూడా హాస్యాయుతంగా చెప్ప వచ్చన్నది మేం తెలుసుకున్న నిజం. టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథాని డాక్యుమెంటరీగానే తలపోశాం. అది కాస్తా హాస్యంతో సింపుల్ కథగా, ఫన్ రైడ్ గా తయారైంది.

—ఏజెన్సీస్ 
fast class video