రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 14, 2022

1264 : న్యూస్


  సూపర్ స్టార్ రజనీకాంత్  72వ పుట్టిన రోజు సందర్భంగా రెండు సంబరాలు జరిగాయి. డిసెంబర్ 10 న బాబా రీ రిలీజ్, డిసెంబర్ 12 న జైలర్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్. రెండూ ఫ్యాన్స్ ని నిరాశపర్చాయి. తలైవా కేమైంది, ఇలా చప్పగా రెండు సంబరాలు కా నిచ్చేశారని కుమిలిపోతున్నారు. బాబా ఇదివరకే ఫ్లాప్ అయినా, దీని రీరిలీజ్ కల్లా ఎదిగివచ్చిన కొత్త తరం ప్రేక్షకులు హిట్ చేస్తారులే అనుకుంటే అది జరగలేదు. 2002 లో విడుదలైన బాబా విశేషమేమిటంటే ఇది టీవీల్లో సీడీల్లో ఓటీటీల్లో ఎక్కడా విడుదల కాలేదు. కాబట్టి 2002 తర్వాత ఎవ్వరూ చూసే అవకాశం లేదు. అయినా  ఇన్నాళ్ళకి తిరిగి థియేటర్లకే వస్తే ఏ మాత్రం క్రేజ్ లేదు. ఈ పుండు మీద కారం జల్లినట్టు జైలర్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా తుస్సుమనడంతో బెంబేలెత్తి పోయారు.

        రీ తుస్సుమనలేదుగానీ, మిశ్రమ స్పందన వస్తోందని సర్ది చెప్పుకుని డిప్రెషన్ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ గా జైలర్ లో నటిస్తున్న రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తొలిసారి ఈ పరిస్థితి ఎదురైంది. రజనీ గెటప్ బావుంది, కాదనలేం, కానీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజనీని  ప్రెజెంట్ చేసిన విధానం ఏమాత్రం బాగా లేదు.
        
యాక్షన్ లేదు, పైగా రజనీ స్లో మూమెంట్స్, కత్తిని తీసినప్పుడు కూడా చప్పట్లు పడే హీరోయిజం లేదు, ముగింపు కూడా చప్పగానే వుంది, బిజీఎం అయితే పూర్తిగా ఫ్లాపయ్యింది. సినిమా విడుదలకి ఇంకా చాలా సమయముంది గాబట్టి, ఇతర ప్రోమోలు, ట్రైలర్స్ ఈ మైనస్ పాయింట్స్ ని కవర్ చేస్తాయేమో చూడాలని ఫ్యాన్స్ ఆశ. గత సినిమాల్ని  పరిశీలిస్తే, రజనీ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ నీ ఎప్పుడూ మంత్రముగ్దుల్నే చేశాయి.
        
కథ చూస్తే బిగ్ బడ్జెట్ యాక్షన్ హంగామా, టీజర్ చూస్తే లో గ్రేడ్ సరంజామా. టీజర్ లో మందుగుండు పేలితేనే కదా జైలర్ కి జోష్ వచ్చేది? ఒక కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి తప్పించుకోవడానికి పన్నిన పన్నాగాన్ని రజనీ తిప్పికొట్టే జైలర్ గా బోలెడు యాక్షన్ కి స్కోపున్న కథ. ఈ ఎనర్జిటిక్ పాత్రలో రజనీని చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిద్రపుచ్చే విధంగా టీజర్ రావడంతో లబోదిబో మంటున్నారు. కొరియా, జపాన్ వంటి దేశాల్లో కూడా రజనీ ఫ్యాన్స్ వున్నారు. వారి పరిస్థితేంటో తెలీదు.
        
మొత్తానికి బాబా రీరిలీజ్ తో, జైలర్టీజర్‌తో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు వన్నె తగ్గాయి. రజనీ గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో జైలర్ ఏమవుతుందోనని ఆందోళన ఓ పక్క. శివకార్తికేయన్ తో డాక్టర్, విజయ్ తో బీస్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న జైలర్  పై భారీ అంచనాలే వున్నాయి.

ఇందులో రజనీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2023 ఏప్రెల్ లో విడుదల కావచ్చు. రజనీ, నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు  అనిరుధ్ రవిచందర్‌ల కాంబినేషన్ ఇది మొదటిది. రజనీకాంత్ చివరిసారిగా 2021లో  అన్నాత్తే’, దీనికి ముందు  2020 లో దర్బార్‌ లో కనిపించారు. ఈ రెండూ బాక్సాఫీస్ డిజాస్టర్స్ గా నిలిచాయి.
        
ఇప్పుడు ఏ స్టార్ అయినా పాన్ ఇండియా ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ రజనీకాంత్ ఆ ఇమేజ్‌ని అందుకోలేదు. బాలీవుడ్ స్టార్స్ కూడా రజనీకాంత్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఆయన రేంజ్ ఏ స్థాయిలో వుందో తెలుస్తోంది. అయితే పానిండియా లెవెల్ ని ఆయన అందుకోవాలి. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్ అనేది పానిండియా లెవెల్లో శంకర్ తీసిన రోబో’, రోబో2 లతోనే వర్కౌట్ అయింది.
        
పాన్ ఇండియా మార్కెట్‌తో పాటు జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ రెండు బ్లాక్ బస్టర్స్ సత్తా చాటాయి. అలాంటిది  ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ సినిమాలు రాకపోవడంతో తలైవా అభిమానులు నిరాశకి గురవుతున్నారు.
        
ఇకపోతే, బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, జైలర్ కామెడీ థ్రిల్లర్‌గా వుండొచ్చట. దర్శకుడు నెల్సన్ డాక్టర్ ని కామెడీ థ్రిల్లర్ గానే తీశాడు. జైలర్ కూడా ఇదే టైపులో వుంటుందని తెలుస్తోంది. రజనీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగిన ప్రేక్షకులకి ఆయన అద్భుతమైన కామిక్ టైమింగ్ గురించి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ ఆయన గత సినిమాల్లోని క్వాలిటీ ఇటీవలి  సినిమాల్లో కానరావడం లేదు. రజనీతో సినిమాలు తీస్తున్న కొత్త తరం దర్శకులతో వచ్చిన మార్పు ఇది.

పోతే, జైలర్ ఒక్కడే కాదు, ఇంకో ఇద్దరు జైలర్లు వున్నారని బైట పడింది. జైలర్ అనే ఒక మలయాళ సినిమా, జైలర్ అనే విదేశీ సినిమా ఒకేసారి రెడీ అవుతున్నాయి. ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

—సికిందర్