రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, అక్టోబర్ 2015, శనివారం

బ్రూస్ శ్రీ!






కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శ్రీను వైట్ల
తారాగణం : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతీ కర్బందా, సంపత్ రాజ్, రావు రమేష్, అరుణ్ విజయ్,నదియా, అమితాష్ ప్రధాన్, బ్రహ్మానందం, అలీ,
పోసాని, సప్తగిరి, ముఖేష్ రుషి, సాయాజీ షిండే  తదితరులు
సంగీతం : ఎస్ ఎస్ థమన్, ఛాయాగ్రహణం ;  మనోజ్ పరమహంస,
మాటలు :  కోన వెంకట్,  ఎడిటింగ్ : ఎం ఆర్ వర్మ ,
బ్యానర్ : డివివి ఎంటర్ ప్రైజెస్ , నిర్మాత : డివివి దానయ్య
విడుదల : 16 అక్టోబర్, 2015,  సెన్సార్ : U/A
***
          ఒక్క ‘ఆగడు’ అనే పరాజయ అనుభవంతో ప్రతిష్ట  అమాంతం నేలకు దిగిన అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల తిరిగి కోలుకుని, మెగా వారసుడు రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’ కి శ్రీకారం చుడుతూ,  ఇప్పుడు సరికొత్త శ్రీను వైట్ల ప్రేక్షకుల ముందు కొస్తున్నాడన్న అంచనాలని, ఆశల్నీ అంతే అమాంతంగా పెంచేసుకుంటూ,  ఈ వారం బాక్సాఫీసు పరీక్షకి సిద్ధపడ్డారు. రామ్ చరణ్ కూడా ‘గోవిందుడు అందరివాడేలే’ కల్గించిన నిరాశని దృష్టిలో పెట్టుకుని, ఈసారి శ్రీను వైట్లతోనే తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. ‘ఆగడు’ కంటే ముందే శ్రీను వైట్లతో మనస్పర్ధ లొచ్చి విడిపోయిన ఆయన ఆస్థాన రచయితలు, టాలీవుడ్ సలీం -జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్ లు, రామ్ చరణ్ మధ్యవర్తిత్వంతో తిరిగి కలిసి ఈ సినిమాకి పనిచేశారు. ఈ మూడు ప్రత్యేకతలతో బాటు, సుమారు ఎనిమిదేళ్ళ  గ్యాప్ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఈ  సినిమాలో అతిధి పాత్ర పోషిస్తూ ప్రేక్షక లోకంలోకి రావడం ఈ సినిమాకి కావలసినంత ప్రచారాన్ని ఇచ్చేసింది. ఇన్ని ప్రత్యేకతలు గల  ‘బ్రూస్ లీ’  అసలెలా వుంది-ఆ ప్రత్యేకతల విలువని  కాపాడుతూ ప్రేక్షకులకి మన్నికైన  వినోద కాలక్షేపాన్ని పంచిచ్చిందా, లేక ఇంకేమైనా జరిగిందా, జరిగితే ఇన్ని వుండగా ఇంకెందుకు జరిగిందీ  వంటి అవసరమైన సమాచారాన్ని శ్రమించి తెలుసుకుందాం.

అసలేమిటి కథ
    చిన్నప్పటి కథ : కార్తీక్, కావ్యాలు రామచంద్రరావు ( రావురమేష్) అనే సగటు ఉద్యోగి పిల్లలు. కార్తీక్ కి చదువుకుని కలెక్టర్ అవ్వాలని వుంటుంది. (ఎప్పటి కథో! ఏనాటి పాత్రోరా నాయనా!)  అతన్ని మంచి స్కూల్లో చేర్పించి, కావ్యాని మామూలు స్కూల్లో వేస్తాడు రామచంద్రరావు. అదేంటని భార్య ప్రశ్నిస్తే,  ఇద్దర్నీ మంచి స్కూల్లో వేసి పెద్ద చదువులు చదివించే స్థోమత లేదంటాడు. దీంతో అక్క  కోసం కార్తీక్ త్యాగం చేస్తాడు. మార్కులు తక్కువ తెచ్చుకుని ఫెయిలై తండ్రి చేత చివాట్లు తిని, అక్క ఐఏఎస్ చదువుకోవడానికి రూటు క్లియర్ చేస్తాడు.

        పెద్దయ్యాక కథ :  ఇప్పుడు ఇంటర్ ఫెయిలైన కార్తీక్ ( తెలుగు కమర్షియల్ హీరో అనేవాడు విద్యకి వ్యతిరేకి కాబట్టి ఇలా మనకి రామ్ చరణ్ ఇమేజిని కాపాడుకుంటూ ఒక రోల్ మోడల్ లా, అవిద్యకి అంబాసిడర్ లా సగర్వంగా కన్పిస్తాడు)  సినిమా ఫీల్డులో స్టంట్ మాస్టర్ గా పనిచేస్తూంటాడు. తనకి బ్రూస్ లీ అంటే ఇష్టం కాబట్టి ఆ పేరుతో  చెలామణీ అవుతూంటాడు. అక్క కావ్య ( కృతీ కర్బందా) ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ వుంటుంది. ఈ నేపధ్యంలో కార్తీక్ కి రియా ( నార్త్ ఇండియన్ పాత్ర పేరుతో నార్త్  ఇండియన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్- పాపం ఈమె తెలుగు చక్కగా నేర్చుకుని మాట్లాడేస్తూంటే పాత్రకి తెలుగమ్మాయి పేరు పెట్టి తెలుగు వాళ్ళల్లో కలిపేసుకోవడం మనస్కరించనట్టుంది)  అనే యానిమేటర్ పరిచయమై,  అది ప్రేమగా మారుతుంది. ఒక యాక్షన్ సీన్లో కార్తీక్ ని నిజ పోలీస్ అధికారిగా భ్రమించి అతడి వెంటపడుతూ- అతణ్ణే ఆదర్శంగా తీసుకుని ఒక వీడియో గేమ్ రూపొందించేందుకు పాటుపడుతూంటుంది.  

        దారిలో పడ్డాక కథ: రామచంద్రరావు పని చేస్తున్న వసుంధరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జైరాజ్ ( సంపత్ రాజ్ ) సడెన్ గా వచ్చి, రామచంద్ర రావు కూతురు కావ్యాని తన కొడుకు (అమితాష్ ప్రధాన్) కి ఇవ్వాలని కోరతాడు. రామచంద్రరావు ఉబ్బి తబ్బిబ్బు అయి సంబంధం ఒప్పేసుకుంటాడు. ఎంగేజి మెంట్ చేసుకుంటారు.

        నగరంలో దీపక్ రాజ్ ( అరుణ్ విజయ్) అనే మాఫియా పాల్పడుతున్న ఆగడాలకి అనుకోకుండా రియా యానిమేషన్ కోసం అడ్డు తగిలి అతడ్ని గాయపరుస్తాడు కార్తీక్. ఈ దీపక్ రాజ్ ఎవరో కాదు, జైరాజ్ మొదటి భార్య (టిస్కా చోప్రా) కొడుకే. ఈ మొదటి పెళ్లి విషయం భార్య వసుంధర (నదియా) కి తెలీకుండా దాస్తాడు జైరాజ్. కార్తీక్ చేతిలో తన్నులు తిని చావుబతుకుల్లో వున్న దీపక్ రాజ్ ని చూసిన  మొదటి  భార్య, ఈ పని చేసిన వాడెవడో వాడి శవం చూడాలని భర్త మీద  ఒత్తిడి తెస్తుంది. జైరాజ్ కూడా వాడెవడో వాణ్ణి పట్టుకుని చంపాలని గ్యాంగ్ ని పురమాయిస్తాడు.

        తేలాల్సిన కథ :  ఇలా అసలు జైరాజ్ నిజ స్వరూపం  ఏమిటో, ఎందుకు తన అక్కతో కొడుక్కి పెళ్లి సంబంధం కోరుకున్నాడో, ఎందుకు తన మీద పగబట్టాడో- దీనికి విరుగుడుగా కార్తీక్ ఏం చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో అన్నది ఇక్కడ్నించీ సాగే మిగతా కథ.




ఎలా వుంది కథ
        సీనియర్ స్టార్లు ఏనాడో వాడేసిన కథలే ఇంకా సినిమా కథలనుకుంటూ, వాటినే మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులకి అందిస్తున్న, విసుగులేని  హైటెక్ జూనియర్ స్టార్ల గిరిగీసుకున్న పరిధిలోనే వుంది కథ. కాకపోతే ఈసారి ఈ వయసు మళ్ళిన కథ జూనియర్ స్టార్ ని ముసలి వాణ్ణి చేయడానికే పోటీపడింది. అంటే నమ్మిన పాత కథలోనూ దమ్ము కూడా లేదన్నమాట.

ఎవరెలా చేశారు
      మాస్ సినిమాలంటూ అవే పాత మూస సినిమాలతో  రాజీపడిపోయిన రామ్ చరణ్ కి ఈ సారి గట్టి షాకే తగిలింది- మొన్నే ‘శివమ్’ తో మరో వూర మాస్ సినిమాల అమర ప్రేమికుడైన ఎనర్జిటిక్ స్టార్  రామ్ షాక్ తిన్నట్టు.  రామ్ చరణ్ ఇంగ్లీషు పత్రికలకిస్తున్న ఇంటర్వ్యూ లలో ఎంతైనా తన ‘బ్రూస్ లీ’ ని  ‘భజరంగీ భాయిజాన్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ల వంటి హై క్వాలిటీ సినిమాలతో పోల్చనీగాక, ‘ఇది నా దసరా కానుక’ అనికూడా పొగుడుకోవచ్చుగాక, అవే ఇంటర్వ్యూల కిందే ప్రేక్షకులు వాళ్ళ కామెంట్స్ తో ఎలా విరుచుకు పడుతున్నారో చూస్తే- తనెంతగా ప్రేక్షకులతో కనెక్ట్ కోల్పోయి గుడ్డిగా సినిమాలు చేసుకుపోతున్నాడో  తెలుస్తుంది. వేకప్ చరణ్, వేకప్ మాన్! గ్రో అప్! ఇతర వ్యాపారాల లాగే సినిమాలు కూడా విషయపరంగా మోడర్నైజ్ అయ్యాయి. 

        డాన్సుల్లో, ఫైట్సుల్లో రామ్ చరణ్ చూపిస్తున్న టాలెంట్ కి గుర్తింపు రావాలంటే మొత్తంగా సినిమా బావుండాలి. ఆ సినిమాలో నటన కన్పించాలి. సినిమానీ నటననీ వదిలేసి, కేవలం డాన్సులూ ఫైట్లూ చూసి తననెవరూ స్టార్ గా గుర్తించరు. నటన కన్పించాలంటే నటించడానికి ఓ పాత్ర వుండాలి. అసలు పాత్రే లేనప్పుడు - కామెడీ బాగా చేశాను నా కంఫర్ట్ జోన్ లోంచి బయటి కొచ్చి, సెంటి మెంట్ ఎమోషన్ సీన్లు బాగా చేశాను-  అని చెప్పుకోవడంలో అర్ధం లేదు. ఈ సినిమా చూస్తే అలాటి సీను ఒక్కటయినా గుర్తుంటుందా? సినిమా ఫైటర్ గా, హీరోయిన్ కి లవర్ గా, అక్కకి తమ్ముడుగా, తండ్రికి కొడుకుగా, విలన్ కి హీరోగా..  ఇలా ఎన్నో షేడ్స్ పెట్టుకున్నారు. ఒక్కటైనా పాత్రకి పనికొచ్చిందా? వీటితో ఒక్క సీనైనా పండిందా? ఏ పూర్వరంగమూ వుండని  బలహీన సన్నివేశాల్లో కన్విన్స్ కాని కృత్రిమ కన్నీళ్లు, కృత్రిమ ఆలింగానాలు, కృత్రిమ డైలాగులూ..మొదలైన వాటితో ఒక్క చోటయినా తన క్యారక్టర్ సరీగ్గా రిజిస్టర్ అయిందా? చివర్లో తండ్రీ కొడుకుల త్యాగాల కథలు, ఆ డైలాగులు ఎంత కాలం చెల్లినవో చెప్పనవసరంలేదు. కూతుర్ని కలెక్టర్ని  చేయడం కోసం కొడుకు చదువుకోలేదన్న గొప్ప నిజం ఎప్పుడో పాతికేళ్ళకి తెలిసి, ఆ తండ్రి కొడుకు త్యాగాన్ని కీర్తిస్తూ కన్నీళ్లు పెట్టడం ఏమైనా కదిలించిందా? అదొక త్యాగంగా కన్విన్స్  చేయగల్గారా? ఆ త్యాగం అనే ఎలిమెంట్ కి ఏమైనా అర్ధముందా? ఒక బడా కంపెనీలో మేనేజర్ గా పనిచేసే తండ్రి ఉన్న తన ఇద్దరు పిల్లల్ని సమానంగా చదివించుకోలేడా!

        ఇలా ఈ సినిమాలో ఎక్కాడా దేనికీ సరైన  ‘బేస్’ అంటూ కన్పించదు. గాలిమేడలు కట్టినట్టు వుంటుంది - ఒక్క విషయంలో తప్ప, అది కాపీ చేయడం కోసం ఒక ఫ్రెంచి హిట్ సినిమాని ఫ్రీగా  ‘బేస్’ చేసుకునే విషయంలో మాత్రమే. దీని వివరాల్లోకి తర్వాత వెళ్దాం. 

       హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పుకోవాలంటే, ఈమె టాలెంటెడ్ నటి. ఠికానా లేని గ్లామర్ పాత్రలతో వృధా అయిపోతోంది. ఆ ఒడ్డూ పొడవుతో, వెండి తెరంతా వెలిగిపోయే చిరునవ్వుతో, నటనలో అంత ఈజ్ తో- ఆథర్ బ్యాక్డ్ పాత్రలు చేస్తే, ఇండిపెండెంట్ హీరోయిన్ గా తనదంటూ ఒక స్లాట్ ని క్రియేట్ చేసుకోగలదు అనూష్కా లాగా. ‘కిక్-2’ లో బీహార్ ఎపిసోడ్ లో ఆ చీరకట్టుతో పల్లెటూరి పాత్రలో చేయవలసినదంతా చేసింది. ‘బ్రూస్ లీ’ లో చేయడానికేమీ లేదు. వూరికే హీరోని పోలీసాఫీసర్ గా నమ్మేసి వెంటపడ్డం తప్ప. తన యానిమేషన్  పిచ్చి వల్లే  హీరో విలన్ తో సమస్య తెచ్చుకున్నాడని కనీసం తెలుసుకోలేని పాత్రచిత్రణలతో, పాటలకీ ప్రేమలకీ పరమితం చేస్తూంటే, ఎందరో రకుల్ ప్రీత్ సింగ్ లు ఇలా అపహాస్యం పాలై కనుమరుగవుతూనే వుంటారు.

        ఇక బ్రహ్మానందం సహా డజన్ల సంఖ్యలో వున్న కమెడియన్లూ, క్యారక్టర్ ఆర్టిస్టులూ  వున్న ‘కథ’ కి ఏ ప్రయోజనం కోసం వున్నారో తెలీదు. నానా గందరగోళం సృష్టించి, ఏదో నవ్వించామనుకుని వెళ్ళిపోతారు. శ్రీను వైట్ల ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకా ఎందరో ఆర్టిస్టుల సమూహం లేకపోతే డైరెక్టర్ గా తను నిలబడలేననుకోవడం చాలా విచారకరం. తాను చేరుకున్న ఈ పొజిషన్ కి ఆరేడుగురు ఆర్టిస్టులతో బలమైన కమర్షియల్ సినిమా తీసి ప్రేక్షకులకి కొత్త అనుభవ మివ్వొలేకపోతే చేరుకున్న ఈ టాప్ పొజిషన్ కి అర్ధం లేదు. నిజానికి ‘బ్రూస్ లీ’ ని కేవలం ఆరేడుగురు నటీనటులతో బలంగా, కొత్తగా, ఆశ్చర్య కరంగా తీసి క్రేజ్ సృష్టించవచ్చు. ‘ఆగడు’ పరాజయంతో తప్పులు తెలుసుకుని తాను  మారిపోయానని చెప్పుకున్న వైట్ల ‘బ్రూస్ లీ’ తో ఏం మారినట్టో అర్ధంగాదు. అదే ఆర్టిస్టుల గుంపు, అదే కథా స్కీము, అదే కామెడీ గోల, అదే మూస రైటింగ్, అదే టేకింగూ డైరెక్షన్!

       ఇక ఈ ‘సీ’ గ్రేడ్ అనిపించే కథాకథనాలతో కూడిన  సినిమాకి కొసమెరుపుగా చివర్లో చిరంజీవి రావడమే శ్రీరామ రక్ష . ‘రుద్రమ దేవి’ ని అల్లు అర్జున్ కాపాడినట్టు, ‘బ్రూస్ లీ’ కి ఈమాత్రమైనా కలెక్షన్లు వస్తున్నాయంటే చిరంజీవిని చూడ్డానికి జనం ఎగబడ్డం వల్లే. ఈ ధోరణి చూస్తూంటే, ఇక సరుకులేని ఇలాటి సినిమాలకి క్రేజ్ వున్న స్టార్లతో అప్పీయరెన్సులు  ఇప్పించుకునే సాంప్రదాయానికి తెరతీస్తారేమో. ఈ సినిమాలోనే మొహమాటపడకుండా మాటల రచయిత తన మీద తనే సెటైర్ వేసుకుంటున్నట్టు -  ‘సీన్ లో కంటెంట్ లేని సినిమాల్లో క్లయిమాక్స్ లో హడావిడి ఎక్కువ’ - అని డైలాగు రాయడం, దాన్ని పాటిస్తూ క్లయిమాక్స్ లో చిరంజీవిని రప్పించి హడావిడీ చేయడం అంతా మసిపూసి మారేడు కాయ. కానీ చిరంజీవి రాకతో అంతసేపూ నరకం అనుభవించే ప్రేక్షకులకి హుషారు వచ్చేస్తుంది. చిరంజీవి కూడా జీవితంలో 150 వ సినిమా అంటూ తీస్తే,  దానికి ప్రేక్షకుల రెస్పాన్స్ ఏమేరకు ఉంటుందనే  దానికి ఓ చిన్న ట్రయల్ వేసి చూసుకున్నట్టయ్యింది.  ఆ నూటయాభయ్యోవది తప్పకుండా ఓ చరిత్రే అయ్యేట్టు చూస్తామని ప్రేక్షుకులు కూడా ఇలా హామీ ఇచ్చేస్తున్నారు-  ‘జస్ట్ టైం గ్యాప్, టైమింగ్ లో గ్యాప్ వుండదు’  అన్న మెగాస్టార్ డైలాగ్ కి డంగై పోతూ. 

        మెగా స్టార్ తో బాటు ఎస్ఎస్ తమన్, మనోజ్ పరమహంస, రామ్- లక్ష్మణ్ లు ఈ  సినిమాని నిబెట్టేందుకు చాలా కృషిచేశారు. కానీ కంటెంట్ లేకపోతే  ఎవరు మాత్రమేం చేయగలరు. కంటెంటే లేనప్పుడు వచ్చే పాటలూ ఎంత బావున్నా బోర్ కొడతాయి. ఫైట్లూ సహనపరీక్ష పెడతాయి. కెమెరా వర్కూ వృధా అయిపోతుంది. దేంట్లోనూ ఇన్వాల్వ్ కాలేరు ప్రేక్షకులు. వీటితో కంటెంట్ అయినా కలిసిపోవాలి, లేదా కంటెంట్ తో ఇవైనా కలిసి సాగాలి- ఇలా కాక భిన్నధృవాలైనప్పుడు, ఎవరికివారే యమునా తీరేగా కాశీలో కలుసుకోవడమే అన్నీ కలిసి.


స్క్రీన్ ప్లే సంగతులు 
         విజయవంతంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అనేది లేదు, ‘ఐస్ స్క్రీమ్ ప్లే’ అంటూ కొత్తది కనిపెట్టారు.  దీనితర్వాత ‘లాలిపాప్ ప్లే’ రావొచ్చు. ‘చూయింగమ్ ప్లే’ రావొచ్చు. ఆఖరికి ఇంకా కాలం కలిసివస్తూ వుంటే,   ‘పాన్ మసాలా ప్లే’, ‘మాణిక్ చంద్ గుట్కా ప్లే’ లు కూడా వచ్చేస్తాయి. బిగ్ బడ్జెట్ సినిమాలకి కావలసిందల్లా అతి బీదతనంతో కూడిన తెల్ల రేషన్ కార్డు  ‘ప్లే’ మాత్రమే. సబ్సిడీ బియ్యం మాత్రమే. సబ్సిడీ బియ్యంతో బిర్యానీ వంటకం  మాత్రమే. నాణ్యమైన బాస్మతీ బియ్యంతో ప్రేక్షకులకి మంచి బిర్యానీ  పెట్టలేని పేదరికంతో  వుంది టాలీవుడ్ రైటింగ్ డిపార్ట్ మెంట్. సబ్సిడీ బియ్యం మాత్రమే తెలుగు బిగ్ బడ్జెట్ సినిమాల్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జోకుగా ( స్కామ్ గా కూడా!)  పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టగలదు కాబట్టి ఆ రేషన్ ని వదులుకోరు. టాలీవుడ్ సలీం-  జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్లు ఆల్రెడీ సింగిల్ విండో స్కీము అనబడు జారుడుబల్ల స్క్రీన్ ప్లేని  కనిపెట్టారు. అది సినిమా తర్వాత సినిమాగా ఏకసూత్ర కార్యక్రమంగా అమలవుతూ  ‘పండగ చేస్కో’ తో పరాకాష్టకి చేరింది. ఈ స్కీము కింద ఏ స్టార్ అయినా, ఎంతటి వాడైనా; ఏ కథైనా, కథే కాకపోయినా, అదే సింగిల్ విండో లోంచి దూకి, అదే జారుడు బల్లమీదుగా రయ్యిన జారుకుంటూ వెళ్లి బాక్సాఫీసులో పడాల్సిందే. అదంతా ఒక సెట్ చేసిన ప్రోగ్రామింగ్, ఒక టెంప్లెట్, ఒక ఆటోమేషన్, అంతే. మీటలు నొక్కడమే పని. స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ లు అంటూ వున్నాయి. ఈ సింగిల్ విండో స్కీము గురించి ప్రపంచానికి తెలిసిపోతే,  వందల కోట్ల డాలర్ల ఆ స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ రంగం మొత్తంగా మూతబడి పోవాల్సిందే. 

        ఈ సినిమాలో కూడా హీరో వెళ్లి విలన్ ఇంట్లో పడి, మరో పది మందిని తెచ్చుకుని, అదే కన్ఫ్యూ జ్ కామెడీ అనే అదే డ్రామా ఇందుకే మొదలెట్టాడు. పాపం రామ్ చరణ్ కీ తప్పలేదు ఈ జారుడు బల్ల పిల్లలాట!

        ఒక హిట్ దర్శకుడు ఆఫ్ ది  రికార్డ్ గా ఇలా డిసైడ్ చేశారు : ‘సినిమాలు  డిజిటలైజ్ అయ్యాక ‘ఏ’ సెంటర్ నుంచీ ‘సీ’ సెంటర్ దాకా, పక్క స్టేట్స్ నుంచీ  ఓవర్సీస్ దాకా, ఒకేసారి వెయ్యి థియేటర్లలో విడుదల చేసుకుని, శుక్ర- శని- ఆదివారాల్లో పెట్టుబడులూ లాభాలూ లాగేసుకునే సులువు ఏర్పడ్డాక,  ఇంకా క్వాలిటీ, క్రియేటివిటీ లెందుకండీ, కథా కాకరకాయ లేంటండీ - స్టార్ నీ డైరెక్టర్ నీ చూసి పొలోమని జనాలు వచ్చి పడుతోంటే- మూడ్రోజుల్లో దులుపుకు పోయే దానికి!’ 

        ‘ఐతే జనాలు కూడా దులుపుకు పోయేవాళ్ళలాగా తయారైపోయారంటారా డబ్బులిచ్చుకుని?’’ అనడిగితే,  ‘తీసేవాళ్ళూ చూసేవాళ్ళూ అందరూ ఎవరి గేములు వాళ్ళు ఆడుకుంటున్నారండీ.. మీరే రివ్యూలు రాసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు’  అన్నారు. నిజమే, నూటికి 90 శాతం ఫ్లాపయ్యే సినిమాలకీ అంతే కష్టపడి రివ్యూలు రాయాల్సిన సంగతలా వుంచి, మూడ్రోజుల్లో వాటికి జనం అలా నిలువు దోపిడీలు ఇచ్చేస్తూంటే, ఇంకా వాటి మంచి చెడ్డలు విశ్లేషిస్తూ బ్లాగులో పోస్టులు పెట్టడం శుద్ధ తెలివితక్కువ పనే. చాలా లో-క్లాస్ యాక్టివిటీ! వెయ్యి థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్షన్ల ఇన్ స్టెంట్ కాలంలో రివ్యూలు అవుటాఫ్ ఫోకస్ అయిపోక తప్పదు. సినిమాలు చూడని వాళ్ళే ఎక్కువ మంది రివ్యూలు చదువుతారు. దీంతో ఫటాఫట్ నిర్మాతలకీ నష్ట మేమీ లేదు, పనిగట్టుకుని రాస్తున్న వాళ్ళకీ ఒరిగేదేమీ లేదు.  

***
     ఐనా టైపు చేసే చెయ్యి వూరుకోదు కదా.చదివే వాళ్ళు వున్నా లేకపోయినా టైపింగ్ జరిగి పోతూ  వుంటుంది. కనీసం ఈ టైపు చేస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలు బయటపడుతోంటే, ఈ జ్ఞానధార కోసమైనా అర్రులు చాస్తూ టైపు చేయాల్సిందే. There's no wastage in God's grand economy’ అని కదా కొటేషన్? 
      
          ‘బ్రూస్ లీ’ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జడివాన వెలసిన వెనుకా జరిగింది  తెలియునులేరా- అనీ ఇప్పుడు ఒకటొకటే  విషయాలు బయటపడుతున్నాయి. శ్రీను వైట్ల అనుకున్న కథ ఇది కాదనీ, ఆయన  కథని కోన- మోహన్ లు కలిసి మార్చేశారనీ, టైటిల్ కూడా ఆయననుకున్నది కాదనీ, వాళ్ళతో మళ్ళీ కలిసి పనిచేయడం వైట్లకి ఇష్టం లేకపోయినా, రాం చరణ్ బలవంతంతో తప్పలేదనీ, చివరికి ఒక ఫ్రెంచి సినిమా  కథని తెచ్చి సెకండాఫ్ లో పెట్టి నడిపారనీ..కథని విస్తరించి డైలాగులు రాయడానికి  పారితోషికం రెండు  కోట్ల రూపాయలకి తగ్గకుండా తీసుకున్నారనీ ...ఇలా ఫిలిం నగర్లో లీకవుతున్నాయి వార్తలు. 

        ఎన్ని కోట్లు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు, తిరిగి ఏమిచ్చారన్నదే ముఖ్యం. ఒరిజనల్ గా ఏం సృష్టించారన్నదే ముఖ్యం. ఒరిజినాలిటీ లేనప్పుడు, మౌలిక అవగాహన లేనప్పుడు, వున్నా మనకెందుకని ఉపెక్షించినప్పుడు మాత్రమే ఇచ్చి పుచ్చుకోవడాలు ప్రశ్నార్ధక మవుతాయి.  ముందుగా కాన్సెప్ట్ పరంగా చూస్తేనే ఇది సినిమాకి పనికి రాదనీ ఇట్టే తెలిసిపోతుంది. ఈ శతాబ్దం లో ఇప్పటివరకూ మహేష్ బాబు నటించిన, గుణశేఖర్ తీసిన  ‘అర్జున్’  దగ్గర్నుంచీ సిస్టర్ సెంటి మెంట్ తో వచ్చిన సినిమా ఏదీ ఆడలేదు. అలాంటప్పుడు శ్రీను వైట్ల కూడా కలెక్టర్ అక్కగార్ని పెట్టుకుని ఇంత పురాతన కథ అనుకోవడమే పొరపాటు. సిస్టర్ సెంటి మెంట్సుని పండించడానికి జ్యూనియర్ స్టార్లు చిరంజీవీ నాగార్జునలు కాదు. ఆ గ్రేస్ వీళ్ళకింకా  రాలేదు. అయినా వర్కౌట్ చెయ్యక తప్పదనుకుంటే, ఈ కాలానికి కనెక్ట్ అయ్యేట్టు చాలా బలంగా సృష్టించాలే తప్ప, ఆషామాషీగా నాల్గు కృత్రిమ సీన్లతో కాదు. మొన్న ఆగస్టులోనే అక్షయ్ కుమార్- సిద్ధార్థ్ మల్హోత్రాలతో కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ‘ బ్రదర్స్’ లో అన్నదమ్ముల సెంటిమెంట్ ఎంత బలంగా,  ఒక సందేశం లాగా వర్కౌట్ అయ్యిందో చూశాం. ఆ సినిమా చూసి చివర్లో ఏడవకుండా ఎవరైనా బయటికి రాగలరా? ఏడ్పించడం  ఎప్పుడో మర్చిపోయిన బిగ్ బడ్జెట్ సినిమాలకి ఈ సెంటి మెంట్ల కథలు అవసరం లేదు.

        అక్క అనేదే కాస్త ఉన్నతంగా వుండే పాత్ర. అప్పుడామె  ప్రవర్తన తనకోసం తమ్ముడు చేసిన త్యాగ మూల్లాల్లోంచి వుండాలి. మూలాల్లేని  ప్రవర్తనతో సెంటిమెంట్లెలా పెల్లుబుకుతాయి. ఇందుకే ఈ సినిమాలో దేనికీ ‘బేస్’ లేదనేది. ఐయ్యేఎస్ చదివే అమ్మాయి అప్పుడే పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఆ ఒప్పుకోవడం కూడా ఎవరో పెళ్ళికొడుకుని చూసీచూడగానే తనకి నచ్చేశాడని సగటు అమ్మాయిలా సిగ్గులు పోతుందా? రేపు ఈ పర్సనాలిటీతో గనుక ఈమె ఐయ్యే ఎస్ రాసి ఇంటర్వూ కెళ్తే,  వెంటనే డిస్ క్వాలిఫై అయిపోతుంది. ఇలాటి చిత్రణలు ‘సీ’ గ్రేడ్ సినిమాల్లో కన్పిస్తాయి. నిర్మాత డివివి దానయ్య దయతో దానం చేసిన రెండు కోట్ల కథల్లో కాదు.

        రెండోది- హీరో పాత్ర. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ పేరు పెట్టుకుని హీరో ఏం చేస్తున్నాడు. స్టంట్ మాన్ వృత్తిలో ఏ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇవి కూడా వదిలేద్దాం. ఆ వృత్తి కారణంగా కథనంలో సహజసిద్ధంగా ప్రధాన కథతో  ఏర్పడాల్సిన సంబంధం ఎక్కడుంది? తెలీక ఆ వృత్తికి పోలీసు ముసుగేసి హీరోయిన్ ఆడుకోవడం ప్రధాన కథా, లవ్ ట్రాక్ లో భాగమా? ప్రధాన కథ విలన్ తో కదా వుంది. మారా విలన్ హీరో వృత్తిని ఎక్కడ ఎక్స్ ప్లాయిట్ చేశాడు. ఎక్స్ ప్లాయిట్ చేయకపోతే హీరోకి అలాటి స్పెషలైజ్డ్ వృత్తి దేనికి, ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని నీరు గార్చెయ్యడానికి కాకపోతే.

        ఒరిజినల్ సలీం- జావేద్ లు ఇలా కాదు- వాళ్ళు రాసిన  ‘డాన్’ ( 1978) లో ప్రాణ్ నటించిన పాపులర్ పాత్ర సర్కస్ కళాకారుడు. అతడి సర్కస్ విద్యని విలన్ ఎక్స్ ప్లాయిట్ చేస్తాడు. అతడి పిల్లల్నికిడ్నాప్ చేసి,  ఒక సర్కస్ కళాకారుడికి మాత్రమే సాధ్యమయ్యే సాహసంతో కూడిన నేరం చేయిస్తాడు. అదీ పాత్రప్రయోజనమంటే. మరి బ్రూస్ లీకి ఏం జరిగినట్టు, అతడెందుకు ఫైటర్ గా వున్నట్టు? అతడి అసిస్టెంట్లు కమెడియన్లు ఎందుకయిన్నట్టు. కమెడియన్లు స్టంట్ కళాకారులుగా కన్విన్స్ చేస్తారా?  

***
       ఈ స్క్రీన్ ప్లే కి ఒక స్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు. చాలా క్లమ్సీగా వుంటుంది కథనం. ఏ సంఘటన ఎందుకు జరుగుతోందో, ఏ యాక్ట్ లో భాగంగా వస్తోందో అర్ధంగానంత గజిబిజిగా వుంటుంది. ఇందాక చెప్పుకున్న ‘బ్రదర్స్’ ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమయ్యాక- మళ్ళీ బిగినింగ్ తాలూకు సీన్లు ఎలా వచ్చి గందరగోళం సృష్టిస్తాయో- శాండ్ విచ్ స్క్రీన్ ప్లే అన్పిస్తాయో- అలాటి గందర గోళం ఇక్కడ మొత్తం సినిమా అంతా కన్పిస్తుంది. చాలా నిర్లక్ష్యంగా రాసుకుపోయిన  విధానమే కన్పిస్తుంది. ప్రారంభించడమే ఇంకా పాతకాలంలో వున్నట్టు-  అనగనగా.. అంటూ చిన్నపిల్లల కథ ఎత్తుకుంటారు. 

        హీరో పెద్దయ్యాక ఓ ఫైట్ ఓ పాటా రొటీన్ గా వచ్చేశాక, హీరోయిన్ తో వచ్చేసి లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఇంకోవైపు జయప్రకాష్ రెడ్డి డబుల్ యాక్షన్ తో హీరోకి కన్ఫ్యూజ్ కామెడీ. మధ్యమధ్యలో జెర్కు లిస్తూ చిన్న విలన్  వస్తూంటాడు. ఇతను టెర్రరిజం చేస్తాడు, డ్రగ్ స్మగ్లింగ్ చేస్తాడు, ఇంకేవేవో చేస్తాడు. ఒక్కటీ రిజిస్టర్ కాదు. రొటీన్ గా అతడికి దండాలు పెట్టే  పోలీసు అధికారులు వచ్చేస్తూంటారు. ఏమిటో లీడ్ సరిగ్గా వుండని యాక్టివిటీస్ తో ఔటాఫ్ పేజ్ క్యారక్టర్లై పోతారు. ఎవరూ సరిగ్గా రిజిస్టర్ కారు, ఏదీ సరిగ్గా ముద్రించుకోదు. ఇది చాలనట్టు సడెన్ గా ఒకసారి హీరో అక్క కిడ్నాప్ అవుతుంది. డ్రగ్ కేసులో పోలీస్ స్టేషన్లో వుంటుంది. మరోసారి హీరోయినే కిడ్నాప్ అవుతుంది. ఇలా కిడ్నాపులు కూడా అర్ధం పర్ధం లేకుండా రిపీట్ అవుతూంటాయి. అప్పుడు సడెన్ గా పెళ్లి సంబంధం అంటూ పెద్ద విలన్ వచ్చేస్తాడు. రోగానికి టైముకి టాబ్లెట్ వేసుకోవాలన్నట్టు, పాటలూ ఫైట్లూ ఠంచనుగా వచ్చేస్తూంటాయి. ముందు అక్క కిడ్నాప్ లాంటి మేజర్  సంఘటనని చూసి, హమ్మయ్య ఇక్కడ ఈ గజిబిజి బిగినింగ్ విభాగం ముగించి చక్కగా ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేస్తున్నారు కాబోలనుకుంటాం. ఆ సంఘటన కాస్తా నీరుగారిపోయి, ఇది కాదు మరేదో జరుగుతుంది కాబోలని మళ్ళీ చూస్తూంటాం. ఇంకేవేవో జరిగి, ఈసారి హీరోయిన్ కిడ్నాపై పోతుంది. ఇలా రిపీటీషన్స్ తో రచనకి ఒక ధ్యేయం, గమ్యం, కథా పథకమంటూ కన్పించక- స్టార్ట్ అండ్ స్టాప్ అనే డాక్యుమెంటరీ లకి వాడే టెక్నిక్ ని విరివిగా వాడేస్తూంటారు. 

        చివరికి ఇంటర్వెల్ ముందు హీరో వెళ్లి ఎలాగో చిన్న విలన్ గాయపర్చి  కోమాలోకి పంపిస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఆ చిన్న విలన్ బడా వ్యాపార వేత్త మెయిన్ విలన్  పెద్ద కొడుకే  అని. చిన్న కొడుక్కి హీరో అక్కతో  సంబంధం మాటాడు కున్నాడు. హీరో తండ్రి ఈ బడా వ్యాపార వేత్త కంపెనీలో మేనేజరే. నిజానికి ఇప్పుడు ఇన్నేళ్ళకి ఇంకా పెద్ద హోదాలో వుండాలి. ఎకాఎకీన బడా వ్యాపారి ఈ సంబంధం ఎందుకు కోరుకున్నాడంటే, ఇతను రాజ్యసభ సీటు మీద కన్నేశాడు. టికెట్టు కోసం తనది ఎంత సామ్యవాదమో మంచి మార్కులు కొట్టెయ్యడానికి ఈ సంబంధమట. హీరోగానీ, అతడి తండ్రిగానీ ఈ కుయుక్తి గ్రహించకుండానే ఎంగేజిమెంటుకి కూడా సిద్ధపడి పోతారు. వీళ్ళ అమాయకత్వమే  వీళ్ళ కొంపముంచింది. 

        ఎప్పుడైతే బడా వ్యాపారి మొదటి భార్యకి పుట్టిన పెద్ద కొడకు కోమాలోకి వెళ్ళాడో,  ఆ మొదటి భార్య అల్టిమేటం ఇస్తుంది- తన కొడుకుని ఇలా కొట్టిన  వాడిని చంపాలని. బడా వ్యాపారి ఒప్పుకుని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. ఇటు ఏదో సందర్భంగా హీరో అక్క ఏదో ప్రమాదాన్ని శంకిస్తే, మన ఫ్యామిలీ జోలి కెవరొచ్చినా సెంటీ మీటర్ దూరంలో చావు చూపిస్తానంటాడు హీరో. ఇలా ఇక్కడ విడివిడి బిల్డప్స్  తో ఇంటర్వెల్ పడుతుంది. గత్యంతరం లేదు కాబట్టి ఇదే ప్లాట్ పాయింట్ -1 అనుకోవాలి. దీని నిర్వహణ ఎలా వుంది? ఈ కింద చూద్దాం..

***
      'యాం ఏ ఫైటర్, టేకప్ చేసిన మిషన్ ఫినిష్ చేసేవరకూ నో ఇంటర్వెల్, జస్ట్ క్లయిమాక్స్!’  రామ్ చరణ్ డైలాగ్. 
        పాత్రలు ఆడియెన్స్ కి అర్ధంకాని సినిమా స్క్రిప్టు లాంగ్వేజీ బాగానే మాట్లాడుతూ కోతలు కోస్తాయి వాటి అర్ధాలే తెలీకపోయినా. 

        ఇంటర్వెల్ దగ్గర ఏం ఎస్టాబ్లిష్ అయింది? హీరో, విలన్ ఇద్దరూ ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఎలా?  అసలు తను ఎవరి కొడుకుని కొట్టాడో హీరోకే తెలీదు, అయినా  వాడు తన కుటుంబం జోలికొస్తే వూరుకోనన్నాడు.  అలాగే తన కొడుకుని కొట్టిందెవరో విలన్ కీ  తెలీదు. అయినా ఆ కొట్టిన వాణ్ణి చంపుతానని అతను కూడా శపథం చేశాడు.

        ఈ కథలో విలన్ ఎవరో హీరోకి తెలీదు, అలాగే తన హీరో ఎవరో విలన్ కీ తెలీదు ఇంటర్వెల్ కి వచ్చాక కూడా. ఇద్దరూ డమ్మీలే, ఇద్దరూ పాసివ్ లే. 

        ‘శివమ్’  లో ఎలాగైతే సిగరెట్ లైటర్ కోసం తను కొట్టింది విలన్ కొడుకునే అని హీరోకి తెలీదో, అలాగే తన కొడుకుని హీరోయే కొట్టాడని కూడా విలన్ కి ఎలా తెలీదో- అదే సిట్యుయేషన్ ఇక్కడా ఏర్పాటు చేశారు. ‘శివమ్’ ఫ్లాప్ అయ్యింది, ఇలాటిదే ‘హోరాహోరీ’  కూడా ఫ్లాపయ్యింది. 

        ‘
మెక్సికన్ స్టాండాఫ్’ ( Mexican stand-off) అనే సిట్యుయేషన్ ఒకటుంటుంది. ఈ సిట్యుయేషన్ లో  ప్రత్యర్థులిద్దరూ తుపాకులు గురిపెట్టుకుని వుంటారు. ఎవరు ముందు పేలుస్తారన్నది సస్పెన్స్. ఇది ముఖీముఖీగా ఏర్పడే టెన్షన్. కానీ పై మూడు ఫ్లాపయిన తెలుగు సినిమాల్లో హీరోలూ విలన్లూ పరస్పరం తెలుసుకోకుండా ఒకడు ఎక్కడో, ఇంకొకడు ఇంకెక్కడో వుండి  బీరాలు పలుకుతారు. సమస్య ఏంటో తెలీదు, శత్రువెవరో తెలీదు. అలాటి ఆ ఇద్దరి సౌండ్ పొల్యూషన్ ని ఒక దగ్గర చేర్చి, కాంట్రాస్ట్ చూపిస్తూ- ఫిలిం నగర్ స్టాండాఫ్’ (Film nagar stand-off) అనే ఒక వింత గారడీ చూపించి ప్రేక్షుకులు తెల్లబోయేలా చేస్తారు.

***
         ‘వేట ఎలా ఉంటదో నేను చూపిస్తాను. మొదలు పెట్టాకా పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్ లు వినపడవ్, రియాక్షన్ లు కనపడవ్, ఓన్లీ రీసౌండ్’ - రామ్ చరణ్ మరో డైలాగ్ డీటీఎస్ టెక్నాలజీని కూడా లాగి. ఈ ‘రీసౌండ్లు’-  ‘స్క్రీన్ ప్లే’ లో తాటాకు చప్పుళ్ళు. 

        పాసివ్ పాత్రకి ఇన్నేసి డైలాగులా. సరే, ఇంటర్వెల్ దగ్గర వేసిందే ప్లాట్ పాయింట్ -1 అనుకుందాం. ఈ ప్లాట్ పాయింట్- 1 లో-  a) హీరోకి గోల్,  b) ఆ గోలో ఎమోషన్, c) తను తీసుకోబోయే చర్యల తాలూకు పరిణామాల హెచ్చరికా - ఉన్నాయా? ఏవీ లేవు. వాడెవడో తెలీదు, వాడు తన ఫ్యామిలీ జోలికొస్తే అంతు చూస్తానన్నాడు. వచ్చినప్పుడు కదా. రాకపోతే ఏమీ లేదు. కాబట్టి హీరోకి గోల్ లేదు. గోల్ లేకపోయాక మిగిలిన రెండు అంశాలూ లేవు. ప్లాట్ పాయింట్ -1 దగ్గర కూడా హీరోకి గోల్ ఏర్పడక పోతే అది కథెలా అవుతుంది. ప్లాట్ పాయింట్ -1 అనే మొదటి మూలస్థంభంలో ఏ బలమూ లేకపోతే, 40 కోట్ల సినిమాకి ఆధారభూతమయ్యే స్క్రీన్ ప్లే అనే మహా సౌధాన్ని అదెలా నిలబెడుతుంది? యథా ప్లాట్ పాయింట్- 1 తథా ప్లాట్ పాయింట్- 2  అని కదా? మొదటి మూలస్థంభం బలంగా లేకపోతే, రెండో మూలస్థంభమూ అంటే- క్లయిమాక్సూ ముగింపూ కూడా తేలిపోతాయని కదా జనరల్ రూలు? ఈ సినిమాలో ఇదే జరిగింది కదా?  

        కథ నడపాల్సిన  కథానాయకుడు, ఓ అక్క ఊహాజనిత భయాలకి ఊహాగానాలు చేస్తూ వున్నాడు. మరి కథెవరు నడపాలి?

***
      ‘నీ మీటర్ పగిలితే గానీ నా మీటర్ అర్ధంగాదు’ - రామ్  చరణ్ ఇంకో డైలాగ్ బీటెక్ ఎలెక్ట్రానిక్స్ భాషలో. 

        ఏమీ చేయలేని దానికి ఈ డైలాగు లెందుకో. తనకున్న మీటరేంటి-అదెందుకు పనికొచ్చింది? నీ మీటర్ తో నువ్వు సినిమాని ఫ్లాప్ చేశావ్ కదా అని విలన్ అంటే పరిస్థితి ఏంటి? ఎస్, ఇంటర్వెల్ తో అదే ప్లాట్ పాయింట్-1  అనుకుని అలాగే కంటిన్యూ చేద్దాం. సినిమా అంతా నిండిపోయి వున్న నానా వ్యర్ధ పాత్రలన్నిటినీ తీసేద్దాం. కేవలం హీరో, అతడి కుటుంబం, హీరోయిన్, విలన్, అతడి కుటుంబం- ఈ పాత్రలతోనే ఒక ఫ్యామిలీ డ్రామాకి తెర తీద్దాం. విలన్ ప్రస్తుత భార్య - ‘కోడలిని తెచ్చుకునేది మనకున్న స్టేటస్ ని పెంచుకునేందుకు కాదు, మనకి లేని కూతుర్ని తెచ్చుకునేందుకు’  అని అందమైన డైలాగు పలికింది. ఎస్, ఫ్యామిలీ డ్రామాకి తెర తీద్దాం. అక్క పెళ్లి సంబంధం నేపధ్యంలో ఇటు హీరో- అటు విలన్ పరస్పరం ఒకరికొకరు తెలీక ఏం హాని చేసుకున్నారో, ఇంకేం  చేసుకోబోతున్నారో, ఆ పెళ్లి సంబంధం ఏమౌతుందో -ఎవర్ని ఎవరు క్షమించుకోవాలో, ఎవరికి  ఎవరేం నేర్పాలో- తక్కువ పాత్రలతో సిస్టర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ ని మానవ సంబంధాల చట్రంలో సూటిగా బలంగా ఎక్కిస్తూ- ఈ కథని నిలబెట్టొచ్చు.

***
    ‘సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండీ’  రామ్ చరణ్ గోల్డెన్ వర్డ్స్. తనకేం జరుగుతోందో తెలుసుకోవడానికి లోకజ్ఞానం కూడా అక్కర్లేదా? వచ్చిన వాడెవడో తెలుసుకోకుండా అక్కని విలన్ చేతుల్లో పెట్టేశాడు. సెకండాఫ్ ప్రారంభం కాగానే ఒక ఇంటలిజెన్స్ అధికారి వచ్చి ఆ వియ్యమందుకున్న విలన్ గుట్టు చెప్తే గానీ  హీరో తెలుసుకోలేకపోయాడు. ఇదీ హీరోయిజం. ఆ అధికారి- ఆ విలన్ రాజ్యసభ టికెట్ పొందకుండా ఆపడానికి అతడు చేస్తున్న నేరాలపై రుజువులు సంపాదించడం కోసం హీరోని నియమించాడు. హీరోకి పనేలేదు, గోల్ లేదు. రెండూ ఆ అధికారివే. ఆ అధికారి చేతికింద కిరాయి సైనికుడుగా హీరో వెళ్ళిపోయాడు. ఓన్ పవర్ వున్న ఫైటర్ గా కాదు. ఇందులో భాగంగా విలన్ ఇంట్లో చేరాడు కామెడీ కోసం. 

        ఇదీ విషయం. సింగిల్ విండో స్కీము ప్రకారం జర్రున జారుకుంటూ హీరో వెళ్లి విలన్ ఇంట్లో పడాలి కాబట్టి- అక్కడ ఒకర్నొకరు గుర్తుపట్టుకోలేని కన్ఫ్యూజ్ కామెడీతో ప్రేక్షకులకి కితకితలు పెట్టాలి కాబట్టి - అలా ఇంటర్వెల్లో ఇద్దర్నీ అనామకంగా వుంచేశారన్న మాట!

        ఇక ఆ  ఇంట్లో సమయానికి మాత్ర వేసుకోవాలన్నట్టు బ్రహ్మానందం ఎంట్రీ, ఇంకొందరు కమెడియన్ల ఎంట్రీ- ఈ బోలెడు క్యారక్టర్లనీ కలిపి విలన్ ని బకరా చేస్తూ- రచయితలకి, దర్శకుడికీ అలవాటైపోయిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ బ్రాండ్ కామెడీ వెర్షన్ కి శంకు స్థాపన చేయడం. సిస్టర్ సెంటి మెంటుని ఏటో పంపించెయ్యడం. 

        ఇందులోకి మళ్ళీ ఇంకో కథ విలన్ కోసం ఇరికిస్తూ, ఫ్రెంచి హిట్ కామెడీ ‘ది వాలెట్’ ని కాపీ కొట్టి పెట్టేశారు. ఇదే శ్రీను వైట్ల ‘దూకుడు’ లో జర్మన్ సినిమా ‘గుడ్ బై లెనిన్’ ని తెచ్చి ప్రకాష్ రాజ్ కోమా కథకి పెట్టేసుకున్నట్టు.

        కానీ ఒక్క ముక్కా ఈ సెకండాఫ్ కామెడీ అర్ధంగాదు. ప్లాట్ పాయింట్ -2 ఎక్కడుందో గుర్తు పట్టడం కూడా కష్టం. మాటిమాటికీ విలన్ ఏది ఎందుకు మాట్లాడుతున్నాడు, మాటిమాటికీ ఆ పథకాలేంటి బుర్ర కెక్కించుకోవడం చాలా కష్టం. బక్వాస్ తో బుర్ర వాచిపోతుంది. ఇక క్లయిమాక్స్ అంటూ మొదలెట్టిన ప్రహసనం ఫస్టాఫ్ లో కథనం లాగే, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడి-  ఇదిగో ముగిసిందీ అనుకోగానే మళ్ళీ విలన్ బతికి ఏదో చేయడం; అదిగదిగో ముగిసిందీ అనుకోగానే మళ్ళీ విలన్ బతికి, చిరంజీవి రావడం కోసం  హీరోయిన్ ని కిడ్నాప్ చేయడం, చిరంజీవి బుద్ధి చెప్పి వెళ్ళిపోగానే మళ్ళీ హీరోయిన్ ని పిప్పళ్ళ బస్తాలా ఎత్తుకెళ్ళి పోవడం...ఓ గాడ్..ఇంకా చెప్పుకోవడం మనవల్ల కాదు!!

        ఇంత లోపభూయిష్టమైన స్క్రీన్ ప్లే తో సినిమాని కాపాడుకోవడానికి చివర్న ఐస్ క్రీమ్ లా చిరంజీవిని రప్పించుకున్నారు కాబట్టి, ఇది  ‘ఐస్ క్రీమ్ ప్లే’. ఎం.ఆర్.పి : రెండుకోట్లు, ప(త)న్నులు అదనం. ఆల్ ది బెస్ట్.

-సికిందర్