రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, February 17, 2017

రివ్యూ!


రచన- దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

తారాగణం :  రానా గ్గుబాటి, తాప్సీ, కె.కె.మీనన్, రాహుల్ సింగ్, ఓంపురి, అతుల్ కులర్ణి, నాజర్, ఓంపురి, రాహుల్ సింగ్, త్యదేవ్, వి ర్మదితరులు
మాటలు : గుణ్ణం గంగరాజు, సంగీతం : కె, కెమెరా : మాధి, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విజువల్ స్టంట్స్ : జాషువా, ఎఫెక్ట్స్ః ఈవా మోషన్ స్టూడియోస్
బ్యానర్ః మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పివిపి సినిమా
నిర్మాతలుః పివిపి సినిమా-పెరల్ వి.పొట్లూరి, మ్ వి.పొట్లూరి, విన్ అన్నె, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్-అన్వేష్ రెడ్డి, న్మోహన్ వంచ, వెంక ణా రెడ్డి
విడుదల : ఫిబ్రవరి 17, 2017
***
         యుద్ధ సినిమాలు తెలుగు నేటివిటీకి దూరమే. ఎక్కడో దేశ సరిహద్దు వుంటే అక్కడి హిందీ వాళ్ళకే యుద్ధ సినిమాలు నేటివిటీతో కలుస్తున్నాయి. వాళ్ళు ‘బోర్డర్’ తీస్తారు, ‘హకీఖత్’ తీస్తారు. అలాంటిది ‘కంచె’ తో యుద్ధ సినిమా తెలుగు గడప తొక్కింది. ‘శాతకర్ణి’  టైపు రాజుల యుద్ధాలు తెలుగు జీవితమే. కానీ  ‘కంచె’ యుద్ధాన్ని యూరప్ లో చూపించడం సాహసమే. అక్కడ్నించీ యుద్ధాన్ని విశాఖపట్నం తీసుకొస్తే? మావూరికి సర్కస్ వచ్చిం దన్నంత ఆనందం తెలుగు ప్రేక్షకుడనే వాడికి. వాడికీ ఆనందం లేకపోతే తెలియని చరిత్రల్ని   కోల్పోతాడు. శాతకర్ణి తెలియని చరిత్ర తెలుసుకున్నాడు, హథీరాం బాబా తెలియని చరిత్ర కూడా తెలునుకున్నాడు, ఇప్పుడు విశాఖ సైడు ఘాజీ చరిత్రా తిలకిస్తాడు. తెలియని చరిత్రలు బయటికి తీస్తున్న తెలుగు సినిమాలు ఎదిగినట్టేనని ఆనందిస్తాడు. తెలుగు ప్రేక్షకుణ్ణి ‘ఘాజీ’ చూసేందుకు ఇలా సిద్ధం చేద్దాం...
ముందు కథ

      1971లో తూర్పు పాకిస్తాన్ (తర్వాత బంగ్లాదేశ్) లో పశ్చిమ పాకిస్తాన్ సాగిస్తున్న దమనకాండ నేపధ్యంలో భారత నేవీ తన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకని విశాఖపట్నం తూర్పు నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కి   బదిలీ చేయడం పాకిస్తాన్ కి ఆందోళన కల్గిస్తుంది. సముద్ర తీరంలో తూర్పు పాకిస్తాన్ కి చేరువలో ఐఎన్ఎస్ విక్రాంత్ వుండడం ప్రమాదమని, దాన్ని నాశనం చేయడానికి  తన జలాంతర్గామి (సబ్ మెరైన్) పిఎన్ఎస్ ఘాజీని పంపడానికి పథకం వేస్తుంది. తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగాంగ్ కి పంపిన ఒక రహస్య సందేశాన్ని టాప్ చేయడం ద్వారా ఈ పాక్ పథకం తూర్పు నావల్ కమాండర్- ఇన్- చీఫ్ (ఓంపురి) కి తెలుస్తుంది. ఆయన వెంటనే ఐఎన్ఎస్ రాజ్ పుత్ జలాంతర్గామిని రంగంలోకి దింపుతాడు. భారత సముద్ర జలాల్లోకి ఘాజీ వస్తోందా లేదా నిఘావేసి తెలియజేయాల్సిందిగా కెప్టెన్ రణ్ విజయ్ సింగ్ (కెకె మీనన్) ని ఆదేశిస్తాడు. రణ్ విజయ్ సింగ్ ది  ఉడుకు రక్తం. చూసి తెలియజేయడమెందుకు, చూసి పేల్చేస్తామంటాడు. అది యుద్ధానికి దారి తీస్తుందని, కేవలం చెప్పినట్టు చేయమని హెచ్చరిస్తాడు ఛీప్. రణ్ విజయ్ సింగ్ ని కంట్రోలులో వుంచాల్సిందిగా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ(రానా దగ్గుబాటి) ని కోరతాడు. వీళ్లిద్దరితో బాటు  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ (అతుల్ కులకర్ణి) బయల్దేరతాడు.

       సముద్ర అంతర్భాగంలో రహస్యప్రయాణం మొదలెడుతుంది రాజ్ పుత్; అట్నుంచి ఘాజీ సముద్రం లోపల్నుంచి గుట్టుగా వస్తూంటుంది. అప్పుడు ఈ రెండిటి మధ్య యుద్ధం ఎలా  జరిగింది, ఈ యుద్ధంలో  బద్ధ వ్యతిరేకులైన కెప్టెన్ రణ్ విజయ్ సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మల మధ్య  ఏం ఘర్షణ జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ ఎలా నలిగాడు, డ్యూటీ విషయంలో అదుపుతప్పే రణ్ విజయ్ ఆవేశాన్ని అర్జున్ ఎలా కంట్రోలు చేశాడు, మధ్యలో ఘాజీ ఒక మర్చంట్ నౌక ని పేల్చేస్తే అందులోంచి అర్జున్ రక్షించిన ఆ యువతి, బాలిక ఎవరు; చివరికి ఘాజీ మీద ఇండియన్ బృందం ఎలా విజయం సాధించిందీ... ఇవన్నీ తెలుసుకోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.
ఎలావుంది కథ 
        ఇది 1971 నాటి యుద్ధ చరిత్ర. అయితే సినిమా కథ చేసినట్టుగా చరిత్ర జరగలేదు. ఇందుకు ఆధారాల్లేవు. 2003, 2010, 2011 వరకూ కూడా నావికాదళాధికారులు పదేపదే ఘాజీ మునకతో రాజ్ పుత్ కి  ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు (ఇదే పాక్ అధికారులైతే మేమే ముంచేశామని  గొప్పలు చెప్పుకునే వారు). ఆ సమయంలో రాజ్ పుత్ పోర్టులోనే వుందని అంటున్నారు. ఘాజీ లోపల ప్రమాద వశాత్తూ టార్పెడోలూ మందు పాతరలూ పేలి మునిగిపోయిందనీ; బ్యాటరీలని ఛార్జి చేసేటప్పుడు హైడ్రోజన్ వాయువులు  వెలువడ్డమే ఈ పేలుళ్ళకి కారణమనీ భారత నావికాదళాధికారులు ధృవీకరించారు. అయితే ఘాజీ మునక ఎప్పటికీ తేలని మిస్టరీగానే  మిగిలిపోయిందనే నిపుణులూ లేకపోలేదు.

           అయితే ఈ ‘చరిత్ర’ మరుగున పడిపోయిందనీ, ఇందులో పాల్గొన్న మన నావికా దళ సభ్యుల విజయం కూడా ప్రపంచానికి తెలియకుండా పోయిందనీ ఈ కథ చేసిన దర్శకుడు అభిప్రాయపడ్డాడు. కానీ సినిమాకోసం చరిత్రని ఇలా మార్చెయ్యడం విచిత్రమే. దీన్ని దర్శకుడి విజ్ఞతకే వదిలేద్దాం. 

          ఘాజీ సబ్ మెరైన్ నిజానికి అమెరికానుంచి లీజుకి తీసుకుంది పాక్. దాన్ని నిర్వహించుకోలేక మంటగలుపుకుంది. లీజుకి తీసుకున్నపుడు  దాని అమెరికన్ పేరు యూఎస్ ఎస్ డయాబ్లో. చాలా శక్తిమంతమైన జలాంతర్గామి అది. సముద్రం లోపల మందు పాతరలని కూడా పెడుతుంది. భారత సబ్ మెరైన్స్  కి అప్పట్లో ఈ ఏర్పాటు లేదు.

          సినిమా కోసం ఈ కథ చేసినప్పుడు ఇందులో దేశభక్తిని బాగా దట్టించారు. రొటీన్ గా ఒక మాటనేస్తూంటారు- దేశం కోసం ప్రాణాలివ్వాలని. దర్శకుడు మాత్రం ఈ మూస డైలాగుని తిప్పి కొడుతూ- దేశం కోసం ప్రాణాలివ్వడం కాదు, శత్రువుని చంపి గెలవాలని, కామన్ సెన్స్ తో డైలాగు పలికిస్తాడు. 

          ఇంతవరకూ భూమ్మీద, సముద్రం మీద, గాల్లో జరిగే యుద్ధాలతోనే దేశంలో సినిమాలు వచ్చాయి. సముద్రం లోపల జరిగే పోరాటంతో ఒక పకడ్బందీ కథ ఇలా తొలిసారిగా వచ్చింది. దీన్ని తెలుగు – హిందీ భాషల్లో నిర్మించారు. టామ్ క్లేన్సీ  నవల ఆధారంగా హాలీవుడ్ లో తీసిన ‘ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్’ జలాంతర్గాముల  యుద్ధం ఈ సందర్భంగా గుర్తుకొస్తే రావొచ్చు.

ఎవరెలా చేశారు 
      ఇలాటి రియలిస్టిక్, ఇంటలిజెంట్ సినిమాల్లో నటనలు మారిపోతాయి : ఫార్ములా  నటనల బెడద తప్పిపోతుంది. పైగా ప్రధానపాత్రలో రానా,  ఏ కమర్షియల్ సినిమాలోనైనా మొదట్నించీ హీరోకుండే డామినేటింగ్ స్థానాన్ని తీసుకోకుండా, క్రమక్రమంగా పూర్తి  యాక్షన్ లోకొస్తాడు. దాదాపు ఫస్టాఫ్ అంతా  అతను ప్రధాన పాత్ర కాదేమో అన్నట్టుంటాడు. ఉడుకురక్తం కెప్టెన్ ని కంట్రోల్ చేసే సీన్లే అతడికి ఇన్నర్ స్ట్రగుల్ (ఎమోషనల్ యాక్షన్) ని కల్పించి, ఔటర్ స్ట్రగుల్ (ఫిజికల్ యాక్షన్) గా శత్రువుతో పోరాటాన్ని పెట్టి  పాత్ర చిత్రణ చేశారు. దీనివల్ల ఇదొక సమగ్ర పాత్రయింది. ఈ పాత్రలో అతడి నటన అత్యంత నిజమైన నేవీ అధికారి అన్పించేట్టే వుంది- ‘రుస్తుం’ లో నావల్ ఆఫీసర్ గా నటించిన అక్షయ్  కుమార్ కి లాగే. కొత్త దర్శకుడు సంకల్ప్  రెడ్డి ఇంత పకడ్బందీగా పాత్ర చిత్రణ చేయడం ఆశ్చర్య పరచే విషయమే. రానా గుర్తుండి పోతాడు.

          ఇక ఇంకో గుర్తుండిపోయే పాత్ర కెకె మీనన్ నటించిన రణ్ విజయ్. అత్యంత ప్రతిభావంతమైన- క్లాసిక్  ముఖభావాలతో స్టన్నింగ్ క్లోజప్స్ ఇచ్చాడు. రణరంగంలో అప్పటి పరిస్థితిని బట్టి రియాక్ట్ అవ్వాలే గానీ, ఎక్కడ్నించో వచ్చే రాజకీయ నిర్ణయాల్ని పాటించడం పట్ల అసహనం ప్రదర్శించే తన  పర్సనాలిటీ ట్రెయిట్ ని స్వయంగా తాననుభవిస్తున్నట్టే ప్రదర్శించాడు. అతడికి ఈ లక్షణం ఎందుకుందో ఆలోచింపజేసే గత జీవితం కూడా వుంది. 

       శరణార్ధిగా అవతలి దేశం దాటుకుని వచ్చే పాత్రలో తాప్సీ కి పెద్దగా పనిలేకపోయినా- మరీ సినిమా మొత్తంలో ఆడమనిషే కన్పించకపోతే వరస్ట్ గా వుంటుంది కాబట్టి,  ఆ లోటుని భర్తీ చేస్తున్నట్టు ఏకైక ఆడ పాత్రగా- గ్లామర్ లెస్ గా  వుంటుంది ( ‘పింక్’ లో తాప్సీ కోసం ఎగబడ్డ అమ్మాయిలే ఇప్పుడూ భారీగా తరలివచ్చి నిరుత్సాహ పడివుంటారు). అతుల్ కులకర్ణి కూడా ఎక్సెలెంటే. ‘మనవూరి రామాయణం’లో  ప్రకాష్ రాజ్ ని ఇరుకున పెట్టేసే ఆటో వాడి పాత్రలో అలరించిన సత్యదేవ్ మరోసారి ఆకట్టుకుంటాడు. తెలిసిన మొహం రవివర్మకి కూడా నిడివి గల పాత్రే దొరికింది. పాక్ కెప్టెన్ రజాక్ గా ( రాహుల్ సింగ్) మరో ఆకర్షణ.

          ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విధంగా పనిచేశారు. ‘శాతకర్ణి’ ని అలా పెడితే, ‘కంచె’ తర్వాత ఇంత క్వాలిటీ యుద్ధ సినిమా తెలుగులో ఇదే. ఇక గుణ్ణం గంగరాజు రాసిన మాటలూ సహజంగా వున్నాయి – ‘పైకీ కిందకీ... పైకీ కిందకీ ...ఎవడ్రా వాడు కమాండరా?  లిఫ్ట్ మానా?’ అని రజాక్ 
పాత్ర అర్చినప్పుడు, ఆ  డైలాగు బాగా పేలి హాలంతా నవ్వులతో దద్దరిల్లింది. 

చివరికేమిటి         కొత్త దర్శకులు  ఇంకా పాత మూస సినిమాలతోనే నానా గడ్డి కర్చి నిర్మాతల్ని ఒప్పించుకుంటున్న కాలంలో,  ఓ కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి- మూసకి మూడులోకాల  అందనంత దూరంలో, ఎక్కువ బడ్జెట్ ని కోరే  ఇలాటి డిఫరెంట్ సినిమాని ఒప్పించుకోవడం, దీన్ని చేపట్టేందుకు పొట్లూరి వరప్రసాద్, అన్వేష రెడ్డిల  లాంటి నిర్మాతలూ ముందుకు రావడం ఈవారం హిందీ తెలుగు ప్రేక్షకులకి –ఓవర్సీస్ ప్రేక్షకులకి కూడా- రిలీఫ్.
          సంకల్ప్ రెడ్డి సబ్ మెరైన్స్ గురించి చాలా రీసెర్చి చేసే ఒక అథారిటీ లాగా ఘాజీని నడుపుతున్నట్టు కన్పిస్తాడు. స్పీల్ బెర్గ్ జాస్ తీసినప్పుడు ఆ మోడల్ లోపల ఇంజనీర్లు కూర్చుని ఆ ‘సొరచేప’ ని ఆపరేట్ చేశారేమోగానీ,  ఇక్కడ సంకల్ప్  రెడ్డి స్వయంగా సబ్ మెరైన్స్ లో కూర్చుని తను నడుపుతున్నట్టే, మొత్తం మెకానిజమూ, ఇంజనీరింగ్ సాంకేతికాలూ సహా –ఆయా ప్రమాదాల్లో తీసుకోనే జాగ్రత్తలు సహా – క్షుణ్ణమైన అవగాహనతో వున్నట్టు కన్పిస్తాడు.

          నీటిలోపల రాజ్ పుత్  వర్సెస్ ఘాజీ వేసుకునే ఎత్తుగడలూ, చేసుకునే టార్పెడో దాడులూ, క్షణ క్షణం టెన్షన్ ని బిల్డప్ చేసే యాక్షనూ, మెలోడ్రామా తప్పుపట్టలేని విధంగా వున్నాయి. ఇంతే ‘ఇంజనీరింగ్’ స్క్రీన్ ప్లేకీ చేశాడు. స్క్రీన్ ప్లే అంటే పాత్ర చిత్రణలు సహా మొత్తం కథా నడకా. మొదటి ఇరవై అయిదు నిమిషాల్లో ఘాజీని ప్రవేశపెడుతూ (ప్లాట్ పాయింట్ వన్) బిగినింగ్ ని ముగించాడు. ఇక్కడ్నించీ ఈ మిడిల్ ఇంటర్వెల్ కి ముందు అరగంటా చూపించి, ఇంటర్వెల్ కి తర్వాత ఇంకో అరగంటా చూపిస్తూ ముగించాడు. ఇక్కడ కెప్టెన్ రణ్ వీర్ మరణం తర్వాత శపథం చేయడమే ప్లాట్ పాయింట్ టూ. ప్లాట్ పాయింట్ వన్ కీ, టూకీ మధ్య గంట పాటు మిడిల్ విభాగమంతా సమస్యతో సంఘర్షణనే పెంచుకుంటూ పోయాడు నియమాల ప్రకారం. ఇక ప్లాట్ పాయింట్ టూ నుంచీ అరగంట పాటూ క్లయిమాక్స్ కి కేటాయించాడు. ఈ మొత్తం స్ట్రక్చర్ కీ రాజ్ పుత్ కి మందు పాతర (మైన్) పెట్టడంతో ఇంటర్వెల్ ఇచ్చాడు. 

          స్ట్రక్చర్ ని కోరుకోని ఇంకా పాత స్కూలు యువ వృద్ధులు తమ కథలతో ఈ సినిమా కథ ఎలా విబేధించి తమ కథలకంటే ఇంత పకడ్బందీగా వుందో విశ్లేషించి చెప్పగల్గితే, వాళ్ళని ఘనంగా సన్మానించ వచ్చు. చిక్కేమిటంటే, వాళ్ళకి ఏ సినిమా చూసీ విశ్లేషించడం చేతగాదు!

-సికిందర్