రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఫిబ్రవరి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!

దర్శకత్వం : ఆర్ ఆర్ మదన్
తారాగణం : ఆది, అదా శర్మ, బ్రహ్మానందం, పోసాని, జయప్రకాష్ రెడ్డి, శకలక శంకర్, మధు నందన్, కబీర్ సింగ్, తదితరులు
సంగీతం : అగస్త్య , ఛాయాగ్రహణం : విజయ్ సి చక్రవర్తి
బ్యానర్ : ఆర్కే స్టూడియోస్, నిర్మాత : పి సురేఖ
విడుదల : 12 ఫిబ్రవరి, 2016
***
‘లవ్లీ రాకీ స్టార్’ ఆది వెళ్లి వెళ్లి  చాలా మ్యాడ్ మ్యాడ్ గా మాస్ స్టార్ అయిపోవాలనీ, లేకపోతే జీవితమే వృధా అనీ డిసైడ్ అయిపోయి, ఇంకో వీర మాస్ సినిమాతో ఇరగదీయాలనుకుని ప్రేక్షకుల మాడు పగులగొట్టాడు. హిందీలో అప్పట్లో లవర్ బాయ్ గా వచ్చిన సన్నీ డియోల్,  కష్టపడి ఐదు కిలోల బరువున్న రెండు హస్తాలు బాగా డెవలప్ చేసుకుని,  విరగ బాదుతూంటే ప్రేక్షకులు పెట్టిన కేకలకి అమాంతం మాస్ స్టార్ అయిపోయినట్టు- అలాటి ట్రిక్ ఏదో ఆదికి పట్టు బడ్డం లేదు పాపం.  
ది సరే, మామూలు సాఫ్ట్ సినిమాలు తీస్తూ వుండిన దర్శకుడు మదన్ కూడా తను గట్టిగా హార్డ్ అవకపోతే  లోకం లెక్కపెట్టదని, తద్వారా గిట్టుబాటు కాదనీ డిక్లేర్ చేసుకున్నట్టు-  ఈ వీర మాస్ తో సిగపట్లకి దిగడం విచిత్రం. ఏమంటే తన అసిస్టెంట్  చెప్పిన కథకి ఫిదా అయిపోయినట్టు చెప్పుకోవడం...ఏమిటా అసిస్టెంట్ చెప్పిన అంత ఫిదా అయిపోయేట్టు చేసిన కథ దాని కమామిషు?

మరో ఆవారా వరాల బాబు
        వరాల బాబు ( ఆది) వూళ్ళో చదువు పట్టక ఆవారాగా తిరిగే కొడుకు. తన ప్రవర్తనతో ఇంట్లో తల్లిదండ్రుల్ని ఏడ్పించడం హీరోయిజం అనుకుంటాడు. పక్కింటి ఫ్రెండ్ రవి ( చైతన్య కృష్ణ) బుద్ధిగా చదువుకుంటూ పైకొస్తూంటాడు. చిన్నపట్నుంచీ ఇద్దరూ బద్ధ శత్రువులు.  రవి ఉద్యోగమొచ్చి  హైదరాబాద్ వెళ్ళిపోయినా వరాలబాబు  వూళ్ళోనే అదే ఆవారాతనంతో తిరుగు తూంటాడు. ఒకానొకరోజు ఇగో తన్నుకొచ్చి గొప్పవాడవ్వాలని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. బస్సు దిగగానే ఓ అమ్మాయిని చూసి మళ్ళీ ఆవారాగా మారిపోతాడు. ఆ సమీరా ( అదా శర్మ) అనే ముస్లిం అమ్మాయి వెంట పడి ప్రేమించ మంటూంటాడు. ఓ ముఠా  ఓ ఫోటో పట్టుకుని ఒకణ్ణి గాలిస్తూంటారు. గాలిస్తున్నవాడు ఇంకా చావకుండా హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని  వచ్చేసి చంప బోతారు- ఆ బాధితుడు రవి. అప్పుడు  వరాలబాబు రివ్వున వచ్చేసి తనకి బద్ధ శత్రువైన రవిని కాపాడుకుని,  తను మాయమై పోయిన రవి కోసమే హైదరాబాద్ వచ్చాడు  తప్ప మరొకందుకు కాదని గొప్ప రహస్యం విప్పుతాడు.

        ఇంతకీ రవిని ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారు, వాళ్ళే  సమీరా వెంట కూడా ఎందుకు పడుతున్నారూ అన్నవి తెలుసుకోవాలంటే ఓపిగ్గా ఈ సినిమా పూర్తిగా చూడగలగాలి.  

ఎలావుంది కథ
        ఏదో కొత్త పాయింటుని పట్టుకున్నామనుకుని దానికి పాత చింతకాయ కథనం చేస్తే చల్లారిన చద్దన్నం లా తయారయ్యింది. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు చిరుద్యోగాలు చేస్తూ, అరకొరగా చదివిన వాళ్ళు మంచి జాబులు కొట్టేస్తున్నారని, దీన్ని సరిదిద్దేందుకు ఒక ఎన్నారై ఓ సంస్థని స్థాపిస్తే  దాన్ని అతడి భాగస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తే ఏం జరిగిందనేది ఈ కథ. 

        ఈ కథని చెప్పిన విధానం ముక్కు ఎక్కడుందంటే  చుట్టూ తిప్పి చూపించినట్టుంది. స్క్రీన్ ప్లే తో ఏదో పాండిత్యం ప్రదర్శించబోయారు. ఈ పాండిత్యం ఎలా వుందంటే తాము చేస్తున్న స్క్రీన్ ప్లే ‘ఎండ్ సస్పెన్స్’ అనే కమర్షియల్ సినిమాలకి పనికిరాని మాయదారి  కథనం కోవకి చెందుతుందని, ఈ  కథనంతో చేస్తే సినిమా గోవిందా అవుతుందని తెలియకపోవడం. గతంలో ఎన్నో సినిమాలు ఎండ్ సస్పెన్స్ తో వచ్చి అట్టర్ ఫ్లాపయినా అది పరిశీలించకపోవడం. అసలు స్క్రీన్ ప్లే శాస్త్రం తెలిస్తే కదా దాంతో ఏం చేయాలో తెలిసేది. చేయకూడనిది ఏం చేస్తే వెళ్లి ఫ్లాపు గుండంలో పడతామని తెలిసేది. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు కథతో కనీసావగాహన ఇంకా ఈ కాలంలో కూడా లేకపోతే ఏమనుకోవాలి?

        మొదట్నించీ ఈ సినిమా చూస్తూ పోతూంటే, కథేమిటో మొదటి అరగంటలో తెలియదు, గంటం పావు తర్వాత ఇంటర్వెల్ లోనూ తెలీదు, పోనీ ఇంటర్వెల్ తర్వాత హీరో ఇంకో అరగంట చెప్పే పరమ బోరు పాత సినిమా ఏడ్పుల ఫ్లాష్ బ్యాక్ తర్వాత కూడా తెలీదు. అసలు కథేమిటి, హీరో ఏం సాధించాలను కుంటున్నాడూ అన్నవి- క్లయిమాక్స్ లో హీరోయినమ్మ మరో ఫ్లాష్ బ్యాక్ తో కరుణిస్తే  తప్ప తెలిసిరాదు  మనకి! 

        అంటే మొత్తం కథలో వున్న పాయింటుని, ఆ పాయింటుతో హీరో చేసే సంఘర్షణనీ  చివరాఖరి వరకూ చెప్పకుండా ‘ఎండ్ సస్పెన్స్’ గా పెట్టుకుని- ఇంత సినిమా చూపించారన్న మాట. ఇందుకే  ఇంత  సహన పరీక్ష,  ఇంత బోరు. అసలు కథేమిటో, పాత్రలు ఎందుకోసం అటూ ఇటూ తిరుగుతున్నాయో కూడా చెప్పకుండా,  అంతా మూసిపెట్టడం ఇదేదో బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే అని తమకి  తామే అనుకున్నట్టుంది సిల్లీగా !!!

        గాడ్ సేవ్ దెమ్.

ఎవరెలా చేశారు
        ఆది తన ఫిజిక్ కి, ఫేస్ కట్ కి సూటవని మాస్ పాత్రలంటే పడుతున్న మోజు ఈ సినిమాతో తీరిపోవాలి. ఇక బుద్ధిగా నీటైన పాత్రలతో నీతివంతమైన, నల్గురికి పనికొచ్చే సినిమాల మీద దృష్టి పెడితేనే కెరీర్ వుంటుంది. ఫైట్లు, డైలాగులు, పిచ్చి కామెడీ, ఓవరాక్షన్ లేకపోతే కొంపలేం అంటుకోవు. అద్దె గది కోసం వెళ్ళి ఆవిడతో అంత కంగాళీ గోలగోల గంతులతో ఆ ఓవరాక్షన్ ఏమిటి- దీన్నిఏ  మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని థియేటర్లలో? ఎవడు పక్కనుంటే వాళ్ళని ఎడా పెడా లెంపకాయలు కొట్టడం కామెడియా? యాక్టింగ్ స్కూల్లో ఇలాటివి చెప్పి వుండరేమో? మందు కొట్టి, సిగరెట్లు తాగే చదువు సంధ్యల్లేని  ఆవారా పాత్రలు దాదాపు అందరు హీరోలూ చేస్తున్నవే- లవ్లీ రాకీ స్టార్ ఆది కూడా తనకి సూటవని ఈ మురికి అంటించుకోవాలా?  

        హీరోయిన్ అదా శర్మ బురఖాలోనే వుంటుంది. తీస్తే చూడలేకపోతాం. ఎందుకంటే ఆమె తన పాత్రేమిటో తనకే తెలీకుండా, అయోమయంగా అలా తిరుగుతూంటుంది. కాబట్టి బురఖాలో మొహం దాచుకుని ఉంటేనే బావుంటుంది. 

        సాంకేతికంగా కూడా చెప్పుకోవడానికేమీ లేదు. ఒక నిర్మాత చేతిలో ఆగిపోయిన ఈ సినిమాని ఆది తండ్రి సాయికుమార్ పూనుకుని పూర్తి చేయడం కొసమెరుపు.

చివరికేమిటి?
        దర్శకుడు మదన్ రాక రాక చాలా కాలం  తర్వాత వస్తే, టైటిల్ ని బట్టే ఈయనేదో తప్పు చేస్తున్నాడని తేలిపోయింది. ఆది కున్న మాస్ మేనియాని  తనూ పూసుకుని అన్యాయమై పోవడం తప్ప ఒరిగిందేమీ లేదు.  ఇప్పటికైనా ఈ మాస్ గరం తగ్గిపోతే ఇద్దరూ కలిసి ఇంకో మర్యాదకరమైన క్లాస్ సినిమా చేసుకోవడం మంచిది. మాస్ సినిమా అంటే అదొక మంకీ బిజినెస్సే- అందరికీ పనికొచ్చేది కాదు.


-సికిందర్