రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఫిబ్రవరి 2019, సోమవారం

786 : రివ్యూ




దర్శకత్వం : రాబర్ట్ రోడ్రిగ్స్ 

తారాగణం : రోసా సలాజర్, క్రిస్టాఫ్ వాల్జ్, కీన్ జాన్సన్, జెన్నిఫర్ కనెల్లీ, మహెర్షలా అలీ తదితరులు
రచన:  జేమ్స్ కెమెరాన్, లీటా కలోగ్రిడిస్
సంగీతం : టామ్ హల్కెన్ బోర్గ్, ఛాయాగ్రహణం : బిల్ పోప్  
నిర్మాతలు :  జేమ్స్ కెమెరాన్, జాన్ లాండ్యూ
విడుదల : 8 ఫిబ్రవరి, 82019
***
          టెర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి బ్లాక్ బస్టర్స్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ నిర్మాతగా సంకల్పించిన ‘అలీటా’ మొత్తానికి ఇరవై ఏళ్ల సుదీర్ఘ కల నిజం చేసుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘సిన్ సిటీ’ ఫేమ్ దర్శకుడు రాబర్ట్ రోడ్రిగ్స్ దీన్ని రూపొందించాడు. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ అంటేనే సైన్స్ ఫిక్షన్ హంగామాలుగా మారిపోయి- రొటీన్ అయిపోయాయి. ఈ రొటీన్ లో మళ్ళీ జేమ్స్ కెమెరాన్ ఏ ప్రత్యేకతో వచ్చాడో తెలుసుకోవాలంటే దీని వివరాల్లోకి వెళ్ళాల్సిందే...

కథ
          మహాయుద్ధం తర్వాత 2563 లో, భూమ్మీద శిథిలావస్థలోంచి పునర్నిర్మాణమవుతుంది గజిబిజి ఐరన్ సిటీ. ఇక్కడ డాక్టర్ ఇడో (క్రిస్టాఫ్ వాల్జ్) అనే సైబర్ సైంటిస్టు వుంటాడు. ఇతను రాత్రిపూట నేరస్థుల్ని పట్టుకునే హంటర్ వారియర్ గా కూడా వుంటాడు. ఇతడికి జంక్ యార్డ్ లో మొండెం లేని తలతో వున్న సైబోర్గ్ దొరుకుతుంది. దాని మెదడు సజీవంగా వుందని తెలుసుకున్న అతను, సైబర్ బాడీని అతికిస్తాడు. అప్పుడా అమ్మాయికి చనిపోయిన తన కూతురు అలీటా పేరు పెడతాడు. అలీటా (రోసా సలాజర్) కళ్ళు తెరచి కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. కానీ తానెవరో గుర్తుకు రాదు. డాక్టర్ ఇడో సంరక్షణలో వుంటుంది. ఆమె హ్యూగో (కీన్ జాన్సన్) అనే మోటార్ బాల్ ఆటగాడితో ప్రేమలో పడుతుంది. ఆమెకి అతను నగరం పైన వేలాడుతున్న ఊర్ధ్వ లోకం సాలెం సిటీని చూపిస్తాడు. అక్కడికి చేరుకోవడం ఎవరి వల్లా కాదంటాడు. ఆమెకి అక్కడికి చేరుకోవాలన్న కోరిక పుడుతుంది. మరి అలీటా అక్కడికి చేరుకుందా? అందుకు ఏ ప్రయత్నాలు చేసింది? ఎవరామెని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు? అసలు పైన సాలెం సిటీలో ఏముంది? ఆమెకి తన గతమేంటో తెలిసిందా? అసలు తనెవరు? ...ఇవన్నీ ప్రశ్నలు. వీటికి సమాధానాలే మిగతా కథ.

ఎలావుంది కథ 
      ఇంకెలా వుంటుంది -  ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రాంబో సినిమాల ట్రెండ్ తర్వాత,  అణుయుద్ధానంతర పరిస్థితి అంటూ కల్పించుకున్న సైన్స్ ఫిక్షన్ ట్రెండ్ లాగే వుంది. ఒక మహాయుద్ధం జరగడం, ప్రపంచం శిథిలమవడం, ఆ శిథిలాల మధ్య మిగిలిన మనుషులు జీవన పోరాటం చేయడం. ఇవే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకి టెంప్లెట్ గా వుంటున్నాయి. ఎంతసేపూ యుద్ధంతో నాశనమైన ప్రపంచం ఓ రెండు మూడొందల ఏళ్ల తర్వాత ఎలా వుంటుందో చూపెట్టే నెగెటివ్ ఫిక్షనే. ఇప్పుడున్న గ్లోబల్ ప్రపంచమే అభివృద్ధితో వెయ్యేళ్ళ తర్వాత కూడా ఎంత బావుంటుందన్న పాజిటివ్ ఫిక్షనే లేదు. దేశాలు చూస్తే అణుయుద్ధాలు పక్కనబెట్టి, ఆర్ధిక యుద్ధాలు చేసుకుంటున్నాయి. అణు యుద్ధంతో ప్రపంచ నాశనాన్నిగాక, ఆర్ధిక యుద్ధంతో ప్రపంచాన్ని జయించాలని చూస్తున్నాయి.

          అలీటాలో మహా యుద్ధం జరిగిన 300 ఏళ్ల తర్వాత, 26 వ శతాబ్దంలో జరిగే కథ అంటూ చూపెట్టారు. ఈ కథ మూడు  కోణాల్లో కన్పిస్తుంది : వాస్తవ ప్రపంచంలో సామాన్య ప్రజల ఉన్నత స్థితికి ఎగబ్రాకే కలలు (కమ్యూనిజం) గా వుంటూనే , ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వర్గం లేదా మోక్షం పొందే ఆరాటాలు (స్పిరిచ్యువాలిటీ) గా అన్పిస్తూ - ఇలా భౌతికంగా, ఆత్మికంగా ఎలా అర్ధం జేసుకుంటే అలా కన్పిస్తూనే,  మరోవైపు ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ - మహమ్మదీయ నాగరికతల యుద్ధం నేపధ్యంలో సెట్టింగ్స్ కన్పిస్తాయి. పైన సాలెం సిటీ అత్యాధునికంగా వుంటే, కింద ఐరన్ సిటీ సిరియా, ఇరాక్ ల దెబ్బతిన్న ప్రాంతాల్ని తలపించే ఇరుకు గల్లీల, అడ్డదిడ్డ భవనాలతో ఇస్లామిక్ ప్రాంతంలా వుంటుంది. చెప్పకనే చాలా తెలివిగా ఈ మూడు కోణాల రూపకాలంకారాలు (మెటఫర్స్) చేశారు ఆధిపత్య భావజాలంతో. 

          ఆ స్వర్గం లేదా ఉన్నత స్థితికి, లేదా సూపర్ పవర్ కి  ప్రతీకగా నగరం మీద వేలాడే ఊర్ధ్వ లోకం అన్నట్టుగా సాలెం (జెరూసలెం?) సిటీ వుంటుంది. ఇక్కడ నోవా అనే ‘దేవుడు’ అన్నట్టుగా శ్వేతజాతీయుడు కన్పిస్తాడు. ఇతడి ఏజెంటుగా భూమ్మీద నల్లజాతీయుడు కన్పిస్తాడు. తన ఊర్ధ్వ లోకంలోకి ఎంట్రీకి కొన్ని అర్హతలు పెడతాడు నోవా. ఈ అర్హతలు సాధిస్తే ఎంట్రీకి టికెట్. అలీటమ్మ ఈ ఎంట్రీ టికెట్ ఎలా కొట్టిందన్నదే కథ. అయితే ఆ మోక్షం - ఆర్ధికంగా కావొచ్చు, ఆధ్యాత్మికంగా కావొచ్చు -  పొందడానికి అలీటా అనుసరించే మార్గాలే అర్ధంపర్ధం లేకుండా వుంటూ, ఎగుడుదిగుడు కథనంతో కాన్సెప్ట్ ఉద్దేశాన్నే దెబ్బతీశాయి.

ఎవరెలా చేశారు
       రోసా సలాజర్ ది పూర్తిగా సీజీఐ చేసిన పాత్ర. ‘కొచ్చాడయన్’ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి సృష్టించిన పూర్తిస్థాయి కంప్యూటర్ యానిమేటెడ్ క్యారెక్టర్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన ఫోటో రియలిస్టిక్ పాత్ర. సజీవంగా కళ్ళెదుట వున్నట్టే వుంటుంది. ఎమోషనల్, రోమాంటిక్, సెంటిమెంటల్ డ్రామాల ముఖ కవళికల క్రియేషన్ కట్టిపడేస్తుంది. మొదట్లో వీధుల్లో మోటార్ బాల్ క్రీడకి, క్లయిమాక్స్ లో స్టేడియంలో ఇదే క్రీడతో అంతిమ పోరాటానికీ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ సిజిఐ గుండెల్ని జలదరింపజేస్తుంది. తన కంటే బలశాలి పాత్రలతో ఆమె చేసే పోరాటాలకి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే పాత్రకి నిలకడలేని ఎమోషనల్, ఫిజికల్ గోల్స్ వల్ల ఒక బలమైన పాత్రగా నిలబడదు. అంటే పాసివ్ పాత్ర. 

          డాక్టర్ ఇడోగా మృదు స్వభావిగా కన్పించే క్రిస్టాఫ్ వాల్జ్ అంతే కఠినంగా హంటర్ వారియర్ గా క్రిమినల్స్ ని వేటాడుతూంటాడు. తన మాట వినని అలీటాతో మానసిక సంఘర్షణ ఒకటుంటుంది. అలీటా కి మోటార్ బాల్ క్రీడ నేర్పే టీనేజర్ బాయ్ ఫ్రెండ్ హ్యూగో పాత్రలో కీన్ జాన్సన్, సైబోర్గుల నుంచి విడిభాగాలు దొంగిలించి డబ్బులు జమచేస్తూంటాడు – పైన వేలాడుతున్న సాలెం సిటీకి వెళ్ళడానికి. కానీ అలాటి సంపాదనతో నీకు స్వర్గ ప్రాప్తి లేదన్నట్టు మధ్యదారిలో ముళ్ళ చక్రంతో చంపేస్తాడు పైలోకంలో వున్న నోవా. అలీటా కూడా కాపాడలేకపోతుంది. ప్రేమకి జయం లేదు. స్క్రిప్టు రాసిన జేమ్స్ కెమెరాన్, ఆమెకి ఇటు తండ్రి లాంటి డాక్టర్ ఇడోతో, అటు బాయ్ ఫ్రెండ్ తో రెండు ప్రేమలుండ కూడదని చెప్తే, దర్శకుడు రోడ్రిగ్స్ తండ్రి ప్రేమని వుంచేసి, బాయ్ ఫ్రెండ్ తో ప్రేమని ముళ్ళ చక్రంలో తిప్పాడు. ఆనర్ కిల్లింగ్ అన్నట్టు. 

       కన్నకూతురు చనిపోయాక భర్త డాక్టర్ ఇడో తో విడిపోయిన షెరాన్ పాత్రలో జెన్నిఫర్ కనెల్లీ కూడా ముఖ్య పాత్రే. ఈమె భర్త పెంచుకుంటున్న అలీటా పట్ల జెలసీతో వుంటుంది.  ఇక తన జీవితానికి మిగిలింది పైన సాలెం సిటీకి చేరుకోవడమేనని - కాశీకి పోయినట్టు -  ఏజెంట్ వెక్టర్ ని కలుస్తూంటుంది. కానీ అలీటా తన హృదయం తీసి బాయ్ ఫ్రెండ్ కివ్వబోయే ఒక ఉద్విగ్నభరిత సన్నివేశం చూశాక, ఆమె ఇక సాలెం సిటీతో తనకి పని లేదని ఏజెంట్ కి చెప్పేసి వెళ్ళిపోతుంది. 

          భూమ్మీద నోవా ఏజెంట్ వెక్టర్ పాత్రలో
మహెర్షలా అలీ, నోవా తరపున భూమ్మీద పాపుల్ని ఏరేసే హంటర్ వారియర్స్ కి నాయకుడుగా కూల్ గా కన్పిస్తాడు. ఇతడి ముఖ్య ఏజెంటు జపాన్ అనే వాడుంటాడు. సాలెం సిటీకి ప్రయాణ ఖర్చుల కోసం హత్య కూడా చేసిన అలీటా బాయ్ ఫ్రెండ్ ని శిక్షించేందుకు యమభటుడిలా సైబర్ స్వోర్డ్ తో వెంటపడి, చివరికి అలీటా చేతిలోనే మొహం చెక్కుకుపోయి కూలబడతాడు. 

          తెల్లగా ధగధగ మెరిసిపోయే నోవా (ఎడ్వర్డ్ నార్టన్), పైన తన సాలెం సిటీ నుంచి భూమ్మీద వ్యవహారాలు చూస్తూ ఆదేశాలిస్తూంటాడు. ఇంకా చాలా సహ పాత్రలున్నాయి. ఎంతకీ చావని భారీ సైబోర్గ్ పాత్రలో, వెక్టర్ ముఖ్య అనుచరుడుగా జాకీ హేలీ వుంటాడు. 

          దృశ్యపరంగా ఒక అద్బుత మాయాలోకాన్నే సృష్టించారు. ఈ మాయాలోకంలో చెప్పాలనుకున్న విషయం చెదిరిపోయి ఆత్మని కోల్పోయిందీ మెగా సైన్స్ ఫిక్షన్ హంగామా.
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు)

సికిందర్  
Watched at Tivoli Cinema, Sec' bad
7.35 pm, 10 Feb, 2019 
Telugurajyam.com