రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, డిసెంబర్ 2021, సోమవారం

1107 : సంక్షిప్త స్క్రీన్ ప్లే సంగతులు

       పుష్ప -1 లో అల్లు అర్జున్ మైనర్ విలన్ సునీల్ ఠారెత్తేలా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివాఫైర్! అని రెండు సార్లు ధనా ధన్ మని నాటు రైఫిల్ని ఫైర్ చేసిసి గట్టి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చేస్తాడు. బెస్ట్ డైలాగ్ క్యారక్టర్ పరంగా. బెస్ట్ డ్రామా క్యారెక్టర్ గ్రోత్ పరంగా. బెస్ట్ కథనం క్యారక్టర్ ఆర్క్ పరంగా. బెస్ట్ బ్యాంగ్ క్యారక్టర్ లో దట్టించిన ఫైర్ పరంగా. ఫ్లవర్లో ఫైర్. ఫైర్ ఇన్ ది బ్లడ్. బర్నింగ్ ఫైర్. వైల్డ్ ఫైర్. మ్యాడ్ ఫైర్. ఇంటిపేరు లేని అవమాన భారంతో పుష్పరాజ్ ది యూత్ ఆన్ రైజింగ్ ఫైర్ ఎట్సెట్రా ఎట్సెట్రా.

        తే క్యారక్టర్లో ఇంత ఫైర్ వుండి కూడా కథలో ఫైర్ మిస్సయ్యిందని అసంతృప్త టాక్ చక్కర్లు కొట్టింది. క్యారక్టర్లో వున్న ఫైర్ ఏమిటి? ఎక్కడ్నుంచి పుట్టింది? క్యారక్టర్ జర్నీచూస్తే మూడు  పాయలుగా వుంది. ఒక పాయ ఇంటి పేరు పెట్టుకోనివ్వని అన్యాయాన్ని ఫీలయ్యే పర్సనల్ పాయ; ఇంకో పాయ హీరోయిన్ తో ప్రేమతో రోమాంటిక్ పాయ; మరింకో పాయ ఎర్ర చందనం స్మగ్లింగ్ తో ప్రొఫెషనల్ పాయ. ఈ త్రీవే క్యారక్టర్ జర్నీలో ప్రధాన జర్నీ అయిన ప్రొఫెషనల్ పాయ, కూలీవాడు అయినప్పటికీ బిజినెస్ మైండ్ తో ఒక గ్రోత్ ని చూపిస్తూ, పవర్ఫుల్ గా వుంది.

        అయితే క్యారక్టర్లో ఫైర్ పుట్టడానికీ, దాంతో ఇలా ప్రొఫెషనల్ గోల్ తీసుకోవడానికీ  కారణమైన ఇంటి పేరు సమస్య సమస్యేనా అంటే అలా అన్పించదు. తన తండ్రి మొదటి భార్యకి పుట్టిన వాడు-  అంటే పుష్పకి అన్న అయిన వాడు - ఇంటి పేరు పెట్టుకోకూడదని బెదిరిస్తూంటే, తగ్గేదేలే ...అని ఇంటిపేరే కాదు, కులం పేరు కూడా గ్రాండ్ గా పెట్టుకు తిరగొచ్చు పుష్ప. ఎవరూ అడ్డుకోవడానికి లేదు. పైగా అన్న కూడా వూళ్ళో పెద్ద మోతుబరేం కాదు పుష్ప లొంగి వుండడానికి. అతను ఓ మధ్యతరగతి జీవి మాత్రమే.       

కనుక ఇదో సమస్యే అన్పించదు కుంగి పోవడానికీ, యాంగ్రీ యంగ్ మాన్ అవడానికీ. ఒక వేళ ఎవరికి పుట్టాడో తెలియక పోతే, ఆ సూటిపోటి మాటలకి కుంగి పోవచ్చు, యాంగ్రీ యంగ్ మాన్ అవతారం దాల్చ వచ్చు. కసితో రిచ్ గా ఎదగాలని అనుకున్న గోల్ కూడా తీసుకోవచ్చు. ఎవరికి పుట్టాడో తెలిసింతర్వాత త్రిశూల్ లో అమితాబ్ బచ్చన్ లాగా, మొదటా తల్లికా భార్య స్థానం కల్పించడానికి భూమ్యాకాశాలు ఏకం చేయాల్సిందే.

        కాబట్టి ఇంటి పేరు గురించి ఫైర్ పుట్టడం ఇంటలెక్ట్ గా పాత్ర కన్ఫ్యూజన్నేతెలుపు తోంది. ఇప్పుడొచ్చే కమర్షియల్ సినిమాల్లో పాత్ర చిత్రణల్ని లోతుగా పరికిస్తే ఏ పాత్రా నిలబడదు. కనుక రివ్యూలో కన్విన్స్ చేయని మిగతా రెండు పాయల్ని వదిలేసి, ప్రొఫెషనల్ పాయనే పైపైన తీసుకుని పవర్ఫుల్ క్యారక్టర్ అనాల్సి వచ్చింది - కూలీ అయినప్పటికీ తనకున్న సమస్ఫూర్తితో కూడిన బిజినెస్ మైండ్ సెట్ దృష్ట్యా.

        అయితే పాత్ర చిత్రణ కాదు పుష్ప లో ప్రధాన సమస్య. అది సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే, అసలు సినిమాని రెండు భాగాలు చేసినప్పుడు మొదటి భాగం ఇలా తీయడమే. కథలో మిస్సింగ్ ఫైర్ మిస్టరీ అంతా ఇక్కడే వుంది...

రెండు భాగాల రౌండప్

ఏమిటా మిస్టరీ? కథలో ఫైర్ వుండాలంటే అసలంటూ కథ వుండాలి కదా? మొదటి భాగంలో కథ వుందా? లేనప్పుడు ఫైర్ వుండే అవకాశమే లేదు. పుష్ప లాగే రెండు భాగాల సినిమాలున్నాయి. వాటిలో మొదటి భాగంలో కథ తప్పకుండా వుంటుంది. రెండో భాగంలో ఎలాగూ వుంటుంది. అవి ఫ్లాప్ కాలేదు. ఎందుకంటే మొదటి భాగంలో కూడా కథ వుంది కాబట్టి. అసలు రెండు భాగాలుగా ఎందుకు, ఒకే బారెడు సినిమాగా విడుదల చేద్దామని చేసిన ప్రయోగాలూ వున్నాయి. మన దేశం లో అలాటివి రెండే వచ్చాయి. రెండూ హిందీలో  షో మాన్ రాజ్ కపూర్ నుంచే వచ్చాయి. సంగం (1964), మేరా నామ్ జోకర్ (1970). సంగం నిడివి మూడు గంటల 58 నిమిషాలు. దీనికి రెండు ఇంటర్వెల్స్ ఇచ్చారు. మేరా నామ్ జోకర్ నిడివి నాలుగు గంటల 14 నిమిషాలు. దీనికీ రెండు ఇంటర్వెల్స్ ఇచ్చారు. రెండూ మ్యూజికల్ హిట్సే, క్లాసిక్స్ కూడా. అన్నేసి గంటలు కూర్చుని చూశారు అప్పటి ప్రేక్షకులు రెండు ఇంటర్వెల్స్ ఎంజాయ్ చేస్తూ.

        తెలుగులోనే దానవీర శూర కర్ణ నిడివి చూసినా మూడు గంటల 46 నిమిషాలు! ఎన్టీఆర్ దీన్ని రెండు భాగాలు చేసి విడుదల చేయలేదు. తమిళంలో 2005 లోనే వచ్చిన తవమాయి తవమిరిందు మూడు గంటల 40 నిమిషాలుంది. హిందీలో లగాన్ తెలిసిందే- మూడు గంటల 44 నిమిషాలు, ఒక రొటీన్ మసాలా  ఖతర్నాక్ కూడా మూడు గంటల 43 నిమిషాలకి గానీ తెమలలేదు. మొహబ్బతే మూడు గంటల 36 నిమిషాలు, సలామే ఇష్క్ మూడు గంటల 35 నిమిషాలు, జోధా అక్బర్ మూడు గంటల 34 నిమిషాలూ చూడాల్సిందేననీ ఆర్డరేశాయి. ఇవన్నీ ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన కొత్త సినిమాలే.

        పుష్ప ని కూడా ఒకే పెద్ద కథగా చేసి రెండు ఇంటర్వెల్స్ తోనో లేదా, ఒకే పూర్తి నిడివి తోనో విడుదల చేయడం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. అయితే రెండు భాగాలుగా చేసినప్పుడు హాలీవుడ్ లో ఎలా చేశారో తెలుసుకోవాలి. సీక్వెల్స్ వేరు. వాటిలో దేనికా పూర్తి కథ వుంటుంది. పెద్ద కథ వేరు. పెద్ద కథ వుంటే దాన్ని సగానికి విరిచి రెండుగా విడుదల చేయాల్సిందే. పెద్ద నవలలతో తీసినప్పుడు రెండుగానే విడగొట్టారు హాలీవుడ్ లో. హారీ పోటర్ గానీ, గాన్ విత్ ది విండ్ గానీ రెండు భాగాలుగానే విడుదల చేశారు. మరి  నవలలు కాకుండా తీసినప్పుడు ఏం చేశారు?

        దీనికి సింపుల్ గా అర్ధమయ్యేందుకు క్వెంటిన్ టరాంటినో తీసిన కిల్ బిల్ రెండు భాగాలు (2003, 2004) తీసుకుందాం. దీని ఎడిటింగ్ లో నిడివి చూసి రెండుగా విడగొట్ట మన్నాడు నిర్మాత హార్వే వీన్ స్టీన్ (ఇతను 2018 మీటూ వివాదాల్లో శిక్షపడి జైలు పాలయ్యాడు పాపం). అలాగే టరాంటినో కిల్ బిల్ ని రెండు భాగాలుగా విడగొట్టాడు. మొదటి భాగం గంటా 51 నిమిషాలు, రెండో భాగం రెండు గంటల 17 నిమిషాలు (రెండు భాగాలు కలిపి నిడివి నాలుగు గంటల 8 నిమిషాలు).

        మొదటి భాగం విడగొట్టినప్పుడు అందులో కథ వుంది. కథంటే స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం. అంటే సెకండ్ యాక్ట్. అంటే ప్రధాన పాత్రకి ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణ మొదలై పోవడమన్న మాట. అంటే కథ మొదలై పోవడమన్న మాట.

        ఇది హీరోయిన్ ఉమా థర్మాన్ ప్రతీకార కథ. ఒక కిల్లింగ్ స్క్వాడ్ లో పని చేస్తున్న ఈమె ఆ స్క్వాడ్ బాస్ బిల్ అనే వాడి చేత గర్భం ధరిస్తుంది. దాంతో బిడ్డ కోసం తానీ వృత్తి మానేయా లనుకుంటుంది. ఇది చెప్తే బిల్  చంపేస్తాడు గనుక పారిపోయి వేరే నగరంలో ఇంకొకర్ని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతూంటుంది. అప్పుడు బిల్ గ్యాంగ్ తో సహా ఊడిపడి ఆ పెళ్ళి  వేడుకలో మారణ కాండ సృష్టిస్తాడు.  చావుబతుకుల్లో వున్న ఉమా ని వదిలేసి వెళ్ళిపోతాడు. నాల్గేళ్ళూ  కోమాలో వున్న ఉమా కోలుకున్నాక- గర్భంలో వున్న తన బిడ్డ ఏమయ్యిందో అర్ధంగాక తల్లడిల్లుతుంది. పెళ్ళి వేడుకలో పెళ్ళి  కొడుకు సహా తన వాళ్ళందర్నీ చంపేసిన బిల్ మీద - అతడి గ్యాంగ్ మీదా పగ పెంచుకుని ఒకొక్కర్నీ చంపడం మొదలెడుతుంది.

        బిల్ ని చేరుకోవాలంటే అనుచరుల్ని అడ్డు తొలగించుకుంటూ పోవాలి. అలా చేసుకుంటూ పోతూ, బిల్ సమాచారం గురించి సోఫీ అనే అనుచరురాల్ని హింసించి  వెళ్ళి పోతుంది. అప్పుడు  గాయపడ్డ సోఫీని బాస్ బిల్ వచ్చి అడుగుతాడు - దాని కూతురు బతికుందని దానికి తెలుసా?- అని. ఈ క్లిఫ్ హేంగర్ సీనుతో, లేదా ట్రిగ్గర్ పాయింటుతో మొదటి భాగం ఎండ్ అవుతుంది.

        కిల్ బిల్ హీరోయిన్ గా నటించిన ఉమా థర్మాన్ ఉత్తమ నటిగా ఆస్కార్ కి నామినేట్ అయింది. అంతే గాకుండా ఎంపైర్ మ్యాగజైన్ 100 గొప్ప సినిమా పాత్రలు జాబితాలో ఒకటిగా ఆమె నటించిన ఈ  బ్రైడ్ పాత్రని నమోదు చేసింది. ఇది మామూలు విషయం కాదు- ఒక యాక్షన్ మూవీ పాత్రకి టరాంటినో ఈ స్థాయి పాత్ర చిత్రణ చేయడం.

        విషయానికొస్తే, మొదటి భాగం ముగింపు వూహించని మలుపుతో వుంది. కథా ప్రారంభంలో హీరోయిన్ కోమాలోకి జారుకున్నప్పుడు అండ విచ్ఛిత్తి జరిగి వుంటుందని నమ్మించిన పాయింటు కాస్తా తిరగబెట్టి - కూతురు పుట్టి విలన్ అయిన తండ్రి దగ్గరే పెరుగుతున్నట్టు వెల్లడి కావడం రెండో భాగానికి అంతులేని ఆసక్తిని దోచి పెట్టింది. మొదటి భాగం ముగింపుగా గుండెల్ని కెలికే హ్యూమన్ ఇంట్రెస్ట్ క్రియేటయ్యింది. హ్యూమన్ ఇంటరెస్ట్ ని మించిన యూనివర్సల్ ఎమోషన్ లేదు. ఈ ముగింపు వెంటాడుతూనే వుంటుంది రెండో భాగం వచ్చేవరకూ. మనం అప్పట్లో సికిందరాబాద్ సంగీత్ థియేటర్లో చూసినప్పుడు అక్కడే బయట కూర్చుండి పోయాం - టరాంటినో విసిరిన తురుపు ముక్కకి తెప్పరిల్ల లేక.

గొయ్యి కాదు, గో ఎహెడ్ మాత్రమే
ఇప్పుడు హీరోయిన్ పాత్ర పట్ల ఎంత సానుభూతి ఏర్పడింది....కూతురు పుట్టి బతికే వుందన్న విషయం ఆమెకి తెలియదు! ఆ కూతురు తను చంపబోయే తండ్రి దగ్గరే వుంది. ఇక రేపు తండ్రి ఆడబోయే గేమ్ ఏమిటి? ఇలా రెండో భాగంలో రంగానికి - రణానికి ఎంత క్యూరియాసిటీ క్రియేటయ్యింది...ఇలా కథలో హిడెన్ ట్రూత్ ని బయటికి లాగి రెండు భాగాలుగా విభజించాడు టరాంటినో. కూతురు పుట్టడమే గాక బతికుందనేది కథలో హిడెన్ ట్రూత్. గొప్ప కథల్లో హిడెన్ ట్రూత్ మహిమ గురించి స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ ఓ చాప్టరే రాశాడు. టరాంటినో మొదటి భాగం ముగింపులో క్లిఫ్ హేంగర్ మూమెంట్ ని, లేదా ట్రిగ్గర్ పాయింటునెలా సృష్టించాడు? హిడెన్ ట్రూత్ నుపయోగించుకునే!

        ఇక రెండో భాగం కథేమిటో దాని జోలికి పోనవసరం లేదు. అందులో ఎలాగూ మొదటి భాగంలో హిడెన్ ట్రూత్ తో ఉత్సుకత రేపుతూ ఆపిన కథే వుంటుంది. అసలు మొదటి భాగంలో వున్నది  కథెలా అయిందన్నదే పుష్ప గురించి చెప్పుకోవడాని కవసరం. కిల్ బిల్ మొదటి భాగం ప్రారంభంలో పాత్రల పరిచయాలతో, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనతో, సమస్య ఏర్పాటుతో - ఈ మూడు ప్లాటింగ్ టూల్స్ తో బిగినింగ్ - అంటే ఫస్ట్ యాక్ట్ లో జరగాల్సిన బిజినెస్ అంతా కూడా వుంది.

        ఇక హీరోయిన్ కోమాలోంచి తేరుకుని బిల్ ని చంపాలని గోల్ ని తీసుకోవడంతో, నాల్గో ప్లాటింగ్ టూల్ నుపయోగించుకుని ప్లాట్ పాయింట్ వన్ కూడా ఏర్పడింది. అంటే ప్రధాన పాత్రయిన హీరోయిన్ కి యాంటీగా, ప్రత్యర్ధి పాత్రయిన బిల్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు మొదటే. ఇదంతా ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతంతో ఇక మిడిల్ - అంటే సెకండ్ యాక్ట్ తో బిల్ ని చంపే గోల్ తో కథ ప్రారంభమై పోయింది...కథ అనేది గోల్ తోనే పుట్టి సెకండ్ యాక్ట్ లోనే వుంటుంది. ఫస్ట్ యాక్ట్ లో వుండేది కథ కాదు, ఉపోద్ఘాతం మాత్రమే. కథకి తయారీ మాత్రమే. కథ వుండేది సెకండ్ యాక్ట్ లోనే. థర్డ్ యాక్ట్ అంటే ఎండ్ విభాగంలో వుండేది కూడా కథ కాదు. అది సెకండ్ యాక్ట్ లో వున్న కథకి ముగింపు మాత్రమే. ఈ తేడాలు గుర్తించ గల్గితేనే ఏ యాక్ట్ తాలూకా యాక్ట్ బిజినెస్ ని వేర్వేరుగా రాసి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి న్యాయం చేయగలం.

        ఇక మిడిల్లో హీరోయిన్ బిల్ అనుచరుల్ని చంపే వేట సోఫీ అనే అనుచరురాలి దగ్గరాగుతుంది. సోఫీని హింసించి బిల్ గురించిన సమాచారం తీసుకుని వెళ్ళిపోతుంది హీరోయిన్. అప్పుడు గాయాలతో వున్న సోఫీని బిల్ అడుగుతాడు- దాని కూతురు బతికుందని దానికి తెలుసాని. దీంతో మొదటి భాగం ముగుస్తుంది. అంటే హీరోయిన్ సోఫీని హింసించి బిల్ సమాచారం తీసుకోవడం ప్లాట్ పాయింట్ టూ అనీ, దీంతో సెకండ్ యాక్ట్ అంటే మిడిల్  ముగిసిందనీ, బిల్ వచ్చి కూతురు బతికుందని దానికి తెలుసాని అడగడం థర్డ్ యాక్ట్ అంటే ఎండ్ విభాగమనీ అనిపిస్తుంది. దీంతో మొదటి భాగంలో త్రీ యాక్ట్స్ తో సమగ్ర స్ట్రక్చర్ లో కథ వున్నట్టు తేలిందనీ అనిపిస్తుంది.

        జాగ్రత్తగా ఆలోచించాలి. కన్ఫ్యూజ్ అవకూడదు. ప్లాట్ పాయింట్ టూ అనేది ప్లాట్ పాయింట్ వన్ కి విలోమంగా వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ కీ, ప్లాట్ పాయింట్ టూకీ మధ్య సెకండ్ యాక్ట్ లోనే కథ వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ తీసుకుని కథ ప్రారంభించిన ప్రధాన పాత్ర, ప్లాట్ పాయింట్ టూ దగ్గర కథని గల్లంతు చేసుకుంటూ గొయ్యిలో పడుతుంది. మళ్ళీ కోలుకుని పరిష్కారాన్ని దొరక బుచ్చుకుని థర్డ్ యాక్ట్ లోకి- అంటే ఎండ్ లోకి వెళ్ళిపోతుంది విజయ పతాక నెగరేస్తూ. ఇదీ మొత్తం స్క్రీన్ ప్లేకీ వుండే యూనివర్సల్ స్ట్రక్చర్.

        ఇప్పుడు పైన హీరోయిన్ సోఫీని పట్టుకుని గొయ్యిలో పడలేదు. కుయ్యోమంటోన్న సోఫీ దగ్గర బిల్ సమాచారం లాక్కుంది. అంటే ఇది ప్లాట్ పాయింట్ టూ కాదు. ఇంటర్వెల్ కి దారితీసే పించ్ వన్ సన్నివేశం. అప్పుడు బిల్ వచ్చి - దాని కూతురు బతికుందని దానికి తెలుసా అనడం ఇంటర్వెల్ అయింది.

భాగాల అసమ తూకం - పుష్ప కి శరాఘాతం  

'కిల్ బిల్ రెండు భాగాలు కలిపి మొత్తం ఒకే పెద్ద కథగా వూహించి చూద్దాం. చూసి నప్పుడు రెండు భాగాలూ కలిపిన పూర్తి కథ స్క్రీన్ ప్లేలో ఇంటర్వెల్ దగ్గర మార్క్ చేసి మొదటి భాగాన్ని కట్ చేశాడని అర్ధమవుతుంది. అంటే ఫస్ట్ యాక్ట్ పూర్తి చేసేసి సెకండ్ యాక్ట్ నడి మధ్య కథని ఆపాడన్న మాట. ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ఈ ఇంటర్వెల్ వరకూ మిడిల్ వన్ అంటారు. ఇక రెండో భాగంలో ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండ్ యాక్ట్ మిడిల్ టూ, థర్డ్ యాక్ట్ తో ఎండ్ వుంటాయన్న మాట.

        అంటే ఫస్ట్ యాక్ట్ + మిడిల్ వన్ కలిపి మొదటి భాగంగానూ, మిడిల్ టూ + థర్డ్ యాక్ట్ కలిపి రెండో భాగంగానూ సమతూకంతో బ్యాలెన్స్ చేశాడు. ఇందువల్ల మొదటి భాగం చూసినప్పుడు కథే చూసినట్టు వుంటుంది. కథని సస్పెన్సుతో (హిడెన్ ట్రూత్) తో మధ్యలో ఆపినట్టుంటుంది. కథ లేని ఉపోద్ఘాతమే (ఫస్ట్ యాక్ట్) చూసినట్టుండదు.

        పుష్ప లో  జరిగిందిదే... అసమ తూకంతో కథే లేని ఉపోద్ఘాతం. ఫస్ట్ యాక్ట్ మాత్రమే చూపి ముగించడం. ఇందుకే కథ లో ఫైర్ మిస్సయ్యిందన్న టాక్ వ్యాపించింది. చివరి 20 నిమిషాల్లో మాత్రమే పుష్పకి ప్రధాన ప్రత్యర్ధిగా ఫవాద్ ఫాజిల్ దిగుతాడు. అంతవరకూ ఇద్దరు మైనర్ విలన్లతో (అజయ్ ఘోష్, సునీల్) సుదీర్ఘంగా సినిమా నడుస్తూ వుంటుంది. అదంతా ఫస్ట్ యాక్టే. ప్రధాన ప్రత్యర్ధి ఫవాద్ తో పుష్పకి కాన్ఫ్లిక్ట్ ఏర్పడి గోల్ తీసుకునే వరకూ చూపించిందంతా ఫస్ట్ యాక్ట్ ఉపోద్ఘాతమే, కథ కాదు. కథంటే ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య సిగపట్లే, మరోటి కాదు.

        పుష్ప లో అసలు విలన్ గా చివరి 20 నిమిషాల్లో ఫవాద్ ఎంటరవడం ప్లాట్ పాయింట్ వన్ కాదు, కథా ప్రారంభమూ కాదు. ఇంకా అతడి పాత్ర పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలతో కూడిన ఫస్ట్ యాక్ట్ పూర్తి కానే లేదు. పుష్పకి గోల్ ఏర్పాటూ కాలేదు. ఫవాద్ తో ముగింపులో మాత్రమే సంఘర్షణకి బీజం వేసే సమస్యా స్థాపన జరిగి, పుష్పకి గోల్ ఏర్పాటయ్యింది. అంటే ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందన్న మాట. అంటే మొత్తంగా ఫస్ట్ యాక్ట్ మాత్రమే చూపించి మొదటి భాగం ముగింఛారన్న మాట. మిస్సింగ్ ఫైర్ మిస్టరీ అంతా ఇక్కడుందన్న మాట! విషయం సెకండ్ యాక్ట్ లోనే పడకపోతే కథ లేదు, ఫైరూ లేదు. ప్రేక్షకులు చూసిందంతా కథలేని ఫస్ట్ యాక్ట్ మాత్రమే.  

        ముగింపు కూడా ఇద్దరి సవాళ్ళూ ప్రతి సవాళ్ళు అన్నట్టు రొటీన్ గా, ఫ్లాట్ గా బలహీనంగా- హోప్ లెస్ గా వుంది. పుష్పకి బ్రాండింగ్ (ఇంటి పేరు) లేకపోవడాన్ని పెద్ద ఇష్యూ చేస్తూ ఫవాద్ అవమానించడం, దీనికి అహం దెబ్బతిని పోయి పుష్ప గోల్ తీసుకోవడం, ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పుకున్న కారణాలతో ఒప్పించేదిగా మాత్రం లేదు. హ్యూమన్ ఇంట్రెస్ట్ వున్న ఏదైనా హిడెన్ ట్రూత్ తో శక్తివంతమైన క్లిఫ్ హేంగర్ మూమెంటూ, ట్రిగ్గర్ పాయింటూ ఏర్పాటు చేసి వుంటే, మొదటి భాగం సర్ప్రైజ్ చేయడమే గాక - రెండో భాగం కోసం ప్రేక్షకులు థియేటర్లోనే ధర్నా చేసేటట్టుండేది! ఇలాగే జరుగుతుంది... 'కిల్ బిల్' మొదటి భాగం ముగింపు చూసి ప్రేక్షకులకి ఎంత పిచ్చెక్కిందంటే, రెండో భాగం చూడాలి- కొత్త కథతో రెండోభాగం వెంటనే చూడాలి- అంటూ  టరాంటినోని ఫోన్ కాల్స్ తో ఉక్కిరి బిక్కిరి చేసేశారు!

        ఐతే పైన చెప్పిన హిడెన్ ట్రూత్ ట్విస్టు పుష్ప ఫస్ట్ యాక్ట్ ముగింపు కివ్వకూడదు.  
కిల్ బిల్ లో లాగా ట్విస్ట్ అనేది కథకి (మిడిల్ విభాగానికి) ఇవ్వాలే గానీ ఉపోద్ఘాతానికి
కాదు.

—సికిందర్