రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, నవంబర్ 2019, శుక్రవారం

888 : స్క్రీన్ ప్లే అప్డేట్స్





          ఎంత ఆఫ్ బీట్ మూవీ హద్దులైనా ఒక పరిధిలో వుంటాయి. ఎంత ఆఫ్ బీట్ మూవీ అయినా కమర్షియల్ విలువలనే భద్రత లేకుండా వుండదు. ఆఫ్ బీట్  మూవీసే కాదు, డార్క్ మూవీస్ సైతం డ్రైగా వుండవు. కమర్షియల్ విలువలనే సురక్షిత హద్దుల్ని కూడా చెరిపేసుకుంటే ఇక మిగిలేది అంధకారమే. ఆ అంధకారమనే జోన్లోకి అడుగుపెట్టి నప్పుడు ఏదో వొక ఆశాకిరణం కన్పించకపోదు. ఆ ఆశాకిరణం దారి చూపే ధృవ నక్షత్ర మవుతుంది. అలా కాకుండా అది చెదిరిపోయి రెండుగా మూడుగా కన్పిస్తే, లేదా దాన్నలా కెలిడియో స్కోప్ లో ఛిన్నాభిన్నంగా చూసే చిలిపి ప్రయత్నం చేస్తే, అప్పుడది ఆశాకిరణం గానీ ధృవ నక్షత్రంగానీ అవదు. అప్పుడా వెళ్ళాలనుకున్న అంధకార జోన్ కాస్తా అయోమయమైపోతుంది. అప్పుడా హద్దులు చెరిపేసుకున్న ఆఫ్ బీట్ అట్టర్ ఫ్లాపవుతుంది.
         
‘ఖైదీ’ యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్) వచ్చేసి కేవలం యాక్షన్. దీని ఆఫ్ బీట్ హద్దుల్ని కూడా చెరిపేసి క్రియేటివ్ అంధకారమనే జోన్లోకి వెళ్ళాలన్పించినప్పుడు ఆశాకిరణంగా కన్పించింది ఒక్క యాక్షన్ అనే ఏకసూత్రతే. మళ్ళీ ఇంకేదీ కన్పించలేదు మేకర్ కి. హీరోయిన్, లవ్, కామెడీ, సాంగ్స్, హీరో ఫ్లాష్ బ్యాక్ అనే ఎంటర్టయినింగ్ పార్టు ఆ యాక్షన్ అనే ఆశాకిరణం చుట్టూ కన్పించి మేకర్ దృష్టి మళ్ళించ లేదు. ఈ మధ్య మనకి విపరీతంగా దొలుస్తున్నపాయింటు - త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో, అదే సిడ్ ఫీల్డ్ పారడైంతో, ఇంకెంత కాలం సినిమాలు ఒకే నమూనాలో ఇలా వస్తూ వుంటాయని. చూసి చూసి బోరు కొట్టేశాయని. కానీ దీనికి ప్రత్యామ్నాయం చూస్తే  స్ట్రక్చర్ వుండని ఆర్టు సినిమాలే, వరల్డ్ మూవీసే కన్పిస్తాయి. మళ్ళీ వీటి మేకింగ్ కి కమర్షియల్ భరోసా లేదు. మేధావులు తప్ప ఇతరులు చూడరు. అయితే ఈ ఆర్ట్ మూవీస్ క్రియేటివిటీనే, వరల్డ్ మూవీస్ కంటెంట్ నే ఇదే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో, సిడ్ ఫీల్డ్ పారడైం లోకి తెస్తే, మొనాటనీగా మారిపోయి విసుగెత్తిస్తున్న కమర్షియల్ సినిమాల నమూనా కొత్తగా మారిపోవచ్చు కదా అన్నపురుగు ఒకటే దొలుస్తూంటే - అప్పుడు ఉన్నట్టుండి  ఆశాకిరణంలా కన్పించింది సత్యజిత్ రే క్లాసిక్ ‘నాయక్’. అడుగుపెట్టా లనుకుంటున్న స్ట్రక్చరల్ అంధకార జోన్లో ఇదో ఆశాకిరణం లాంటిది.

       ఆర్ట్ సినిమాల సత్యజిత్ రే, ‘నాయక్’ అనే ఆర్ట్ సినిమా కథని కమర్షియల్ సినిమా స్ట్రక్చర్ (సిడ్ ఫీల్డ్ పారడైం) లో పెట్టేశారు. నిజానికి ఆర్ట్ సినిమాల్లో కమర్షియల్ సినిమాల కతీతమైన మంచి మంచి కథా కథనాలు, సహజత్వం, తేటదనం. తాజాదనం, కొత్త ప్రపంచాల పరిచయమూ, అనితరసాధ్యమైన క్రియేటివిటీ వుంటాయి. వీటిని జనసామాన్యంలోకి తీసికెళ్ళి మార్కెట్ ని కొత్త పుంతలు తొక్కించాలంటే, కమర్షియల్ సినిమాలకి కొత్త జవజీవాలు పోయాలంటే, ఆర్ట్ సినిమా తరహా కథా కథనాలతో స్ట్రక్చర్ సహిత సినిమాలు తీయాల్సి రావొచ్చు. అప్పుడవి కమర్షియలార్టు సినిమాలవుతాయి. ‘ఖైదీ’ ఇలాగే కమర్షియలార్టు సినిమా అయింది.

          ‘ఖైదీ’ లో వున్నది గ్లామర్ లేని ఆర్ట్ సినిమా కథే. అందువల్ల కమర్షియల్ సినిమా హంగులు లేవు. ఈ ఆర్ట్ సినిమా కథని త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టినప్పుడు కమర్షియలార్టు సినిమా అయిపోయింది. దీంతో ఈ కొత్తదనం తమిళంలో మొదటివారంలోనే గూబమీద కొట్టినట్టు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది - పాతిక కోట్ల బడ్జెట్ తో తీశాక!

          ప్రేక్షకుల దృషిలో ఇటీవల సినిమా అర్ధం మారిపోయింది. రొటీన్ కమర్షియల్ హంగులు చైల్డిష్ గా కన్పిస్తున్నాయి. నవ్వేవాళ్ళు నవ్వుకుంటున్నారు. కమర్షియల్  హంగుల్లేని రియలిస్టిక్ సినిమాల్ని చూసే కొత్తాసక్తిని పెంచుకుంటున్నారు. ఈ శతాబ్దం ఆరంభంలో మొదలైన ప్రపంచీకరణ ప్రభావంలో- ప్రజలు తమ లోపలి జీవితాలెలావున్నా- పైకి మాత్రం గ్లోబలైజేషన్ ఆకర్షణల్ని ఎంజాయ్ చేస్తూ హాయిగా గడిపేయడం నేర్చుకున్నారు. ప్రపంచాన్ని కంట్రోలు చేస్తున్న పన్నెండు వ్యాపార కుటుంబాలు ఆడుతున్న తోలుబొమ్మ లాట ఇది. ఈ ఆటలో ఎంటర్ టైన్మెంటే ధ్యేయంగా వస్తున్న సినిమాల్ని రెండు దశాబ్దాలుగా ఎంజాయ్ చేస్తూ వచ్చిన ప్రేక్షకులు, ఇక ఈ ఫార్ములా కాల్పనిక సినిమాలకి దూరమవుతున్న పరిస్థితి కన్పిస్తోంది.



       కారణం, ఇప్పుడు ప్రపంచం వయొలెంట్ గా మారింది. చుట్టూ నిత్యం చాలా వయోలెన్స్ జరుగుతోంది. ఎన్నడూ లేనంత వయోలెన్స్ కొత్త కొత్త పద్ధతుల్లో జరుగుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, ఫేక్ న్యూస్ సరఫరా చేయడం కూడా వయోలెన్సే. వివిధ దృశ్య మాధ్యమాలు ఈ వయోలెన్స్ ని – నేరమయ ప్రపంచాన్ని కళ్ళకి కడుతున్నాయి. చుట్టూ ఇంత నేరమయ ప్రపంచం మధ్యలో జీవిస్తున్నప్పుడు - ఈ నేరాల కథాకమామిషేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం సహజంగానే రేకెత్తుతుంది. దీంతో ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా వచ్చినా క్రిక్కిరిసి పోతున్నారు మాస్ ప్రేక్షకులు సైతం.

          ఈ వయోలెంట్ ప్రపంచంలో ప్రేక్షకుల టేస్టుకి  ఇక ఎంటర్ టైన్మెంట్ సినిమాలు కాదు, వయోలెంట్ సినిమాలు కావాలి. ఈ వయోలెన్స్ ఏ స్థాయి అనేది కాదు, అది ‘బ్రోచే వారెవరురా’ లాంట మైనర్ క్రైం కావచ్చు, ‘ఎవరు’  లాంటి మేజర్ క్రైం కావచ్చు. నిజానికి ఈ ట్రెండ్ 16 డి, మలుపు, ధృవ అనే తమిళ డబ్బింగ్ / రీమేకులతో 2016 లోనే ప్రారంభమయింది. ఇదే సంవత్సరం ‘క్షణం’ కూడా విడుదలైంది. ఇప్పుడు 2019 లో చూస్తే, 118, కల్కి, ఏజెంట్ ఆత్రేయ, నిను వీడని నీడను నేనే, నేను లేను, రాక్షసుడు, ఆమె, ఇప్పుడు ఖైదీ... ఇలా సుమారు నెలకొక సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల కొత్త దాహాన్ని తీరుస్తోంది. ఐతే 'ఖైదీ' తప్ప పైవన్నీ రెగ్యులర్ కమర్షియల్ పంథాలో సాగేవైతే 'ఖైదీ' మాత్రం దీన్ని బ్రేక్ చేసి కొత్త జోన్లో కి పడింది.


      ఆ జోన్ కమర్షియలార్టు జోన్. అంధకార జోన్ తో ప్రయోగం. సినిమా అంతా రాత్రి చీకట్లోనే జరగడం చేస్తున్న ప్రయోగానికి సింబాలిక్ స్టేట్ మెంట్ అయింది. ఏ కమర్షియల్ హంగులూ లేని ఈ సీరియస్ ఆర్ట్ సినిమా తరహా కథా కాలాన్ని ఒక్క రాత్రికే పరిమితం చేయడం ఒక సేఫ్ గేమ్. ఈ సేఫ్ గేమ్ లో ఫక్తు యాక్షన్ కథనే, అదీ రోడ్ మూవీ జానర్లో చెప్పడం యూఎస్పీ. ఈ డ్రై కథలో ఎమోషనల్ యాక్షన్ కి హీరో కూతురికి చెందిన సింపుల్ సబ్ ప్లాట్ వుంటే, దీనికి ఫిజికల్ యాక్షన్ తో కూడిన ప్రధాన కథ తోడయ్యింది. ఈ ప్రధాన కథకి పోలీస్ కార్యాలయంలో ఇంకో ఫిజికల్ యాక్షన్ తో కూడిన  సబ్ ప్లాట్ వుంది. యాక్షన్ తో వున్న రోడ్ మూవీ ప్రేక్షకులకి కొత్త థ్రిల్. ఇది యాక్షన్ తో వున్న మూవీ ‘మ్యాడ్ మాక్స్-2’ ని గుర్తుకు తేవచ్చు. ఐతే ఇది పగటి యాక్షన్.
          తమిళ దర్శకుడు లోకేష్ కనక రాజ్ 2017 లో తొలి సినిమాగా ‘మానగరం’ (తెలుగులో ‘నగరం’) తీశాడు ఇది నాల్గు విడివిడి కథల ఒక కథ. కిడ్నాప్ కథతో డార్క్ మూవీ. ఇందులో చాలా బలహీనతలున్నాయి. ఈ బలహీనతల్లోంచి, లోపాల నుంచి రెండో మూవీకి బలంగా ఎదిగాడు. చెప్పొచ్చేదేమిటంటే, కమర్షియల్ సినిమాలకి స్ట్రక్చర్ ఒకటే. ఈ స్ట్రక్చర్ లో నేటి ప్రేక్షకుల అభిరుచుల్ని గౌరవిస్తూ, ఆర్ట్ సినిమా తరహా నేర కథల్ని కమర్షియలార్టు సినిమాలుగా బలంగా తీసినప్పుడు బడ్జెట్ ఎటూ పోదు.

          ఈ అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలుగు సినిమాల పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్నంగా వుంది. తెనాలి రామకృష్ణ, తిప్పరా మీసం, మీకు మాత్రమే చెప్తా, ఆవిరి, రాజుగారి గది, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, ఎవ్వరికీ చెప్పొద్దు, చాణక్య ...అన్నీ ఫ్లాప్సే. ప్రస్తుతం దేశం మొత్తం మీద తెలుగు క్రియేటివిటీయే అత్యంత అధ్వాన్న స్థితికి దిగజారిపోయింది. ఏం సినిమాలు తీస్తున్నారో, సినిమా అంటే ఏం అర్ధమై, ఎందుకు తీస్తున్నారో అంతుపట్టడం లేదు. ఇప్పుడు ‘ఖైదీ ‘ని చూపించి క్రాఫ్ట్ విడమర్చి చెప్పినా అర్థం జేసుకునే స్తోమత లేదు. ఇలాగే లపాకీ సినిమాలు తీస్తూ ఆనందం పొందుతూ 
వుంటారు.
సికిందర్