రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, జనవరి 2019, బుధవారం

732 / 1 : రివ్యూ


(రివ్యూ మిగతా భాగం)
        బాబరీ మసీదు కూల్చివేత, దాంతో ముంబాయి మతకల్లోలాలు  - వీటికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఠాకరే పై కోర్టు విచారణతో, 2000 సంవత్సరంలో ప్రారంభమవుతుంది బయోపిక్. ఈ విచారణ మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాకులు 1950 ల నాటి నుంచీ వస్తూంటాయి. ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల్లో క్రొనలాజికల్ ఆర్డర్ లో ఠాకరే జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన దృశ్యాలు రన్ అవుతూంటాయి. కోర్టులో ప్రశ్నోత్తరాలకీ, ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమే వుండదు. కేవలం ఈ డాక్యుమెంటరీ మాత్రంగా చూపిస్తున్న బయోపిక్ ని ఏంతో కొంత సినిమాలా అన్పించేట్టు చేసే ప్రయత్నంలో భాగంగానే కోర్టు విచారణని కథగా చేసి జోడించినట్టు తెలుస్తుంది. ‘మహానటి’ లో సావిత్రి జీవితంలో పాత్ర - ఒకే సమస్య -దాంతో సంఘర్షణా అనే సినిమా కథా రూపం సాధ్యం కాక, ఆమె జీవితాన్ని ఫ్లాష్ బ్యాకుల్లో డ్రీమ్  టైము కింద సర్దేసి, రియల్ టైంలో ఆ జీవితాన్ని తెలుసుకునే జర్నలిస్టుల సంఘర్షణ అనే సినిమా కథా రూపంతో గోడ చేర్పు నిచ్చినట్టు - ఠాకరే బయోపిక్ విషయంలో కూడా కోర్టు విచారణ అనే రియల్ టైం లైవ్ కథతో, ఠాకరే జీవితాన్ని డ్రీమ్ టైం కింద డాక్యుమెంటరీ చేశారు. అయితే ఈ కోర్టు విచారణ కథేనా అంటే కాదు. కోర్టు అడిగేది అడుగుతుంది, ఠాకరే చెప్పేది చెప్పేసి వెళ్ళిపోతాడంతే. అయితే ప్రచార సాధనంగా తప్పనిసరిగా డాక్యుమెంటరీ చేయాల్సి వచ్చిన బయోపిక్  డ్రీమ్ టైమ్ కి, గంతకి తగ్గ బొంత అన్నట్టు, ఏదోవొక రియల్ టైమ్ ని  జోడించి తీయలాన్న తెలివితేటలైనా ప్రదర్శించినందుకు సంతోషించాలి. కంటెంట్ ఎలా వస్తోందో  తెలుసుకోకుండా పైపైన టెక్నికల్  ఆర్భాటాలు చేసి వూదరగొడితే ఏం లాభం.

         
కోర్టు విచారణ ఒక్కో దృశ్యంలో ఒక్కో డైలాగు పేలుస్తూంటాడు ఠాకరే. బాబరీ మసీదుని కూల్చలేదని, అక్కడ శుభ్రం చేశామనీ అంటాడు. తనది ప్రజాతంత్ర కాదని, ఠోక్ తంత్ర (చావబాదుడు సిద్ధాంతం) అనీ అంటాడు. మతకల్లోలాలు తాను జరిపించలేదనీ, వెంటనే ప్రజల్లోకి వెళ్ళాననీ అంటాడు ( ఏఏ ప్రజల్లోకి వెళ్ళాడో చెప్పడు. ఫ్లాష్ బ్యాకు దృశ్యాల్లో ముస్లింల నుద్దేశించి, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళ తోనే పోరాటమనీ అంటాడు. అలాంటప్పుడు హిందూ ముస్లిం ప్రజలందర్లోకి వెళ్లానని చెప్పాలి, చెప్పడు). 

       చివరికి మీకే శిక్ష వేయాలని జడ్జి అడిగితే, తను న్యాయవ్యవస్థని నమ్మనంటాడు. ప్రజాతీర్పునే గౌరవిస్తానని వెళ్లిపోతూంటాడు ప్రజల్లోకి. ఇదే ముగింపు. నమ్మనప్పుడు కోర్టు కెందుకొచ్చాడో, రాజకీయ నాయకుడిగా ఎందుకున్నాడో తెలీదు. తమ నాయకుడి అడ్డగోలు తనాన్ని గర్వంగా చూపించుకోవడానికి ఎక్కడా వెనుకాడలేదు ఈ బయోపిక్ రూపకర్తలు. అడ్డగోలు తనాన్ని గ్లామరైజ్ చేసి చూపించారు.  

          కానీ వాస్తవంగా కోర్టులో ఇదంతా జరగలేదు. కేసు దాఖలు చేయడంలో జాప్యం వల్ల, లిమిటేషన్ చట్టం కింద అనర్హంగా ప్రకటించి కొట్టేసింది కోర్టు. 

          ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలు ఫస్టాఫ్ లో మహారాష్ట్ర మణూస్ పాయింటుతో నడుస్తాయి. ఈ ప్రారంభంలో కాస్త ఎంటర్ టైన్ చేస్తాడు దర్శకుడు. కార్టూనిస్టుగా రాజీనామా చేసి బొంబాయిలో మరాఠీల పరిస్థితి చూస్తూ తిరుగుతున్నప్పుడు ఒక సినిమా చూస్తాడు ఠాకరే. అది మరాఠీలని బకరాలని చేసి ఆడుకునే కార్టూన్ ఫిలిం. థియేటర్లో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఒకటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. కార్టూన్ ఫిలింలో సర్దార్జీ, గుజరాతీ, మద్రాసీ, ఆఖరికి కాబూలీ వాలా కూడా బక్క మరాఠీలని పీకి అవతల పడేస్తూంటారు. వెనకనుంచి వికటాట్టహాసం చేస్తూ ఒక్క కిక్ ఇస్తే వెళ్లి అంత దూరంలో పడతాడు మరాఠీ. ఠాకరే
సీరియస్ గా చూస్తాడు కార్టూన్ ఫిలింని. 

      ఇక్కడ్నుంచి మొదలు పెడతాడు మరాఠా ఆత్మగౌరవ పోరాటం. పత్రిక పెట్టి భావవ్యాప్తి  చేస్తాడు. మొదటి కార్యక్రమంగా కర్ణాటకలో కలిపిన బెల్గాంని తిరిగి మహారాష్ట్రలో కలపాలని ఆందోళన చేస్తాడు. ప్రధాని మొరార్జీ దేశాయ్ కాన్వాయ్ కి ఆందోళనాకారులు అడ్డంపడతారు, గాయపడతారు, చనిపోతారు. అక్కడే నిలబడి చూస్తూంటాడు. అరెస్టయి జైలు కెళ్తే భగ్గుమంటుంది నగరం. కాల్పుల్లో మరికొందరు చనిపోతారు. అల్లర్లు ఆపడానికి ప్రభుత్వం మళ్ళీ అతన్నే వేడుకుంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించే బలమైన నాయకుడవుతాడు పార్టీ పెట్టి. తను హిట్లర్ నని ప్రకటించుకుంటాడు.ఇక మరాఠీల అవకాశాల కోసం ప్రవాసుల్ని తరిమే కార్యక్రమం ఇంకోవైపు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తూ ఠాకరేకి నోటీసిస్తుంది - ఎమర్జెన్సీని సమర్ధించకపోతే పార్టీని బ్యాన్ చేస్తామని. దేశంలో క్రమశిక్షణకి ఎమర్జెన్సీ ఎంతో మంచిదని సమర్ధిస్తాడు. తనకి ముందు దేశం, ఆ తర్వాతే రాష్ట్రమని ఇందిరతో చెప్తాడు. ఇందిర బ్యాన్ లిస్టు లోంచి ఠాకరే పార్టీ పేరు కొట్టేస్తుంది. 

          రాష్ట్రంలో మణూస్ ఉద్యమం తలనొప్పులు తెస్తుంది ప్రభుత్వానికి (ఇంత మణూస్ అంటున్న బయోపిక్ లో నవాజుద్దీన్ సహా నటీనటులు, సాంకేతికులు 90 శాతం బయటి రాష్ట్రాల వాళ్ళే). కొన్నేళ్ళ తర్వాత అప్పుడు ఆలోచించి, “మన పిల్లలు చదువుల్లో రాణించాలి. పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగాల్లో పోటీ పడవచ్చు. బయటి వాళ్ళని ఇలా దెబ్బ కొట్టాలి. ఇడ్లీ సాంబార్ కి పోటీగా వడ పావ్ ప్రారంభించండి. ఎందరికో ఉపాధి లభిస్తుంది ...” ఇలా అనడం మొదలెడతాడు. దీంతో ప్రజలు ఈ మార్గం పడతారు. ఇదేదో ముందే చెప్పొచ్చుగా? అనవసర హైరానా. 

          ఇక ఇంటర్వెల్ ముందు కమ్యూనిస్టు ఎమ్మెల్యేని చంపాక, ఠాకరే మొక్కని కత్తి రిస్తున్నప్పుడు పువ్వు కాషాయంగా మారుతుంది. ఇక  హిందూత్వ నాయకుడిగా మొదలు.

***
      ఒక మొహర్రం వేడుకలో పాల్గొని ప్రసంగించినప్పుడు, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటమనీ అంటాడు. అందుకని మీరంతా శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొనాలని అంటాడు. ఇప్పుడే కాదు, మణూస్ ఉద్యమంలో కూడా మరాఠా ముస్లిములు కనిపిస్తారు. ఇప్పుడీ శివాజీ జయంత్యుత్సవాల్లో ఉత్సాహంగా ఆడిపాడతారు. ఇంతలో వేడుకల్లో అల్లర్లు జరుగుతాయి. దుండగులు హింసకి పాల్పడతారు.

          అప్పుడు వెంటనే ఠాకరే ముస్లిం వ్యతిరేకిగా మారిపోతాడు- “ఎప్పుడెప్పుడు వీళ్ళని మనం దగ్గరికి తీసినా వీళ్ళు మన గొంతులు కోస్తున్నారు. వీళ్ళు మారరు. మీరింకా పిరికి పందల్లా బ్రతకకండి. ఓట్ల కోసం ఇంత దిగజారుడా? ఇవాళ్టి నుంచి హిందువుల గురించి మాట్లాడేవాడే హిందూస్తాన్ రాజ్యమేలుతాడు” అని ప్రసంగించి హిందూత్వ వాదిగా, ‘హిందూ హృదయ సామ్రాట్’ గా మారిపోతాడు. నాయకత్వం లేని ముస్లిములనీ, మణూస్ నీ వదిలేస్తాడు. 

          తర్వాత బాబరీని కూల్చితే కూల్చాడు, శివాజీ వేడుకల్లో ముస్లిం దుండగులెవరో అల్లర్లు జరిపారని ముస్లిములనే వదిలేయకుండా వుంటే, బాబరీ కూల్చివేతకి వాళ్ళు తనకి వ్యతిరేకంగా మారి, ముంబాయిలో ప్రతీకార దాడులు జరిపే వాళ్ళు కాదు. దీనికి ప్రతీకారంగా తనూ మత కల్లోలాలు జరిపించేవాడు కాదు. మళ్ళీ దీనికి ప్రతీకారంగా దావూద్ ఇబ్రహీం  ముంబాయిలో పేలుళ్లు జరిపే వాడు కాదు. ఈ మొత్తాన్నీ తీసుకుని దేశంలో టెర్రరిజం ప్రబలేది కాదు. 

          విచిత్రమేమిటంటే, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటమనీ  అన్నవాడే, శివాజీ వేడుకల్లో అల్లర్ల సాకుతో అవతలి మతానికి పూర్తి వ్యతిరేకంగా మారిపోవడం. తన అతివాదానికి, అవతలి మతంలోని అతివాదులు రియాక్టయినప్పుడు అలాటి – ‘మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటం’  మొదలెట్టాలి తను అన్న మాట ప్రకారం. ప్రజలకేం సంబంధం. ముస్లిములు తన వెంటే వున్నారు. వాళ్ళెప్పుడు గొంతులు కోశారు. (
ఠాకరే చనిపోయేవరకూ వైద్యుడు ముస్లిమే, గొంతు కోయలేదు. యోగి ఆదిత్యా నాథ్ వూళ్ళో గోవుల్నిచూసుకునేదీ, ఆయనకి వండి పెట్టేదీ, ఆలయం నిర్మించిందీ, దాన్ని నిర్వహిస్తున్నదీ ముస్లిములే. గొంతు కోయలేదు.  అదే ముస్లిములని ప్రభుత్వ స్థానాల్లో వుండనివ్వడు. బయటికి మాత్రం తను ముస్లిం వ్యతిరేకి హిందూ ఫ్యాన్స్ కోసం. సూడో సెక్యూలరిజం సరే, ఇటు వైపు సూడో హిందూత్వం కూడా).

      గొంతులు అతివాదులు కోస్తారేమో. అదికూడా వాళ్ళతో చెలిమి చేసినప్పుడు. అతివాదులు వర్సెస్ అతివాదుల క్రీడలో పరస్పరం ఎన్నైనా గొంతులు కోసుకోవచ్చు. ఈ క్రీడతో ప్రజలకేం సంబంధం. చేతకాని అతివాదం పెట్టుకుని, ఒక వర్గం మొత్తాన్నీ జనరలైజ్ చేసి ముద్ర కొట్టడం. ప్రజాస్వామాన్ని, సెక్యులరిజాన్ని నమ్మని ఠాకరే, నమ్మిన అతి వాదంతో కూడా సవ్యంగా లేనట్టు, మణూస్ నీ, హిందూత్వానీ ఓట్ల కోసం వాడుకున్నట్టూ ఓపెన్ గానే  చూపించారు. 

          ఈ ప్రచార బయోపిక్ ని స్ట్రక్చర్ పరంగా సినిమా రచనా దృష్టితో చూడకూదనుకున్నాం. ఇది స్ట్రక్చర్ తో సంబంధంలేని పాత్ర చిత్రణ సమస్య. మళ్ళీ చివర్లో బాంబు పేలుళ్ళ తర్వాత
ఠాకరే ఇంకో డ్రామా చేస్తాడు. అన్నీ పోగొట్టుకున్న ఒక ముస్లిం కుటుంబం రక్షణ కోసం తన దగ్గరికి వస్తుంది. వాళ్ళని ఇంట్లో కూర్చో బెట్టుకుని అభయమిస్తాడు. నమాజ్ చేసుకోనిస్తాడు. అప్పుడు  “మతాలతో నాకు పేచీ లేదు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే నా పోరాటం”  - అదే రికార్డు ప్లే!

          పరస్పర విరుద్ధ భావాలతో, హింసతో, అడుగడుగునా ధిక్కారంతో,  గొప్ప నాయకుడుగా దిగ్విజయంగా హైలైట్ చేశారు.

సికిందర్
Watched at PVR, Irrum manzil
11pm, 28.1.19

telugurajyam.com