రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, October 26, 2021

      ప్రపంచంలో మొదటి స్క్రీన్ ప్లే పుస్తకాన్ని సినిమా రచయితలు రాయలేదు. దర్శకులు రాయలేదు. ఎడిటర్లూ సినిమాటోగ్రాఫర్లూ రాయలేదు. నిర్మాతలు కూడా రాయలేదు. వీళ్ళెవరూ తర్వాతెప్పుడూ రాయలేదు. మొదటి స్క్రీన్ ప్లే పుస్తకాలని సినిమాల్ని అధ్యయనం చేసే పండితులు రాశారు. సినిమా పుస్తకాలకి సంబంధించి దీనికి మార్కెట్ వుంటుందని కనిపెట్టి స్క్రీన్ ప్లే పుస్తకాలు రాయడం ప్రారంభించారు. అప్పుడు కనిపెట్టిందే  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని. నాటక రచన పుస్తకాల్లోంచి, అరిస్టాటిల్ పోయెటిక్స్ నుంచీ విషయాన్ని తెలుసుకుని, సినిమా కథా రచనకి అంటే స్క్రీన్ ప్లేకి, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అనే దాన్ని అలా ఏర్పర్చారు. అలా వాడుకలోకి వచ్చిందే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. అంటే స్క్రీన్ ప్లే ని నాటక రచయితల్లాగా రాయాలన్న భావాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారన్న మాట. ఇక్కడే సమస్య వచ్చి పడింది.  

        ర్వాత ఆధునిక స్క్రీన్ ప్లే పండితులు ఎవరొచ్చినా స్క్రీన్ ప్లేలని త్రీ యాక్ట్స్  స్ట్రక్చర్ అనే చట్రంలో పెట్టేసి, అందులోనే కథ చెప్పాలని చెబుతూ వస్తున్నారు. రచయిత రాసే స్క్రీన్ ప్లే రచన వరకూ ఇది ఓకే. స్క్రీన్ ప్లేలు రాసి నిర్మాతలకి పంపేది కొత్తా పాతా రచయితలే కాబట్టి, రచయితలుగా స్క్రీన్ ప్లేలని అలాగే రాయగలరు. నాటక రచయితల్లానూ రాయొచ్చు. కాబట్టి రచయితలకి అలాగే భోదిస్తూ వస్తున్నారు. తర్వాత ఆ స్క్రీన్ ప్లేలకి దర్శకులు నియమితులయ్యాక, వాళ్ళు చిత్రీకరించడానికి ఎలా వుండాలో అలా మార్చుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా సమస్య లేదు. సమస్య ఎక్కడొచ్చిందంటే, తెలుగులో దర్శకులవ్వా లనుకుంటున్న వాళ్ళూ, దర్శకులై పోయిన వాళ్ళూ ఎవరి స్క్రిప్టులు వాళ్ళే రాసుకుంటున్నప్పుడు - వచ్చిపడింది సమస్య!

        రాసేవాడు తీయలేడు, తీసేవాడు రాయలేడని ఒకప్పుడుండేది. ఈ తీసేవాడు రాయలేడనే దాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నారేమో. కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వాలు చూస్తూంటే ఇది స్పష్టమవుతోంది. చదవడం కోసం రాస్తున్నామనుకుని రాసేసి తీస్తున్నారు. కానీ సినిమా స్క్రిప్టు అచ్చేసి చదువుకోవడానికి కాదు, సినిమా తీసి చూసుకోవడానికి. అంటే సినిమా స్క్రిప్టు రైటింగ్ గురించి కాదు. రైటింగ్ గురించి అయితే కేవలం రచయిత చూసుకోగలడు. రాసి దాన్ని సినిమాగా తీసుకునే దర్శకుడికి సినిమా స్క్రిప్టు మేకింగ్ గురించి వుంటుంది. కథ మాటలు స్క్రీన్ ప్లే అని వేసుకోవచ్చుగాక, రచయితగా ఫీలవకుండా మేకర్ గా ఫీలై రాయాల్సి వుంటుంది. మేకర్ గా ఫీలైనప్పుడు సీన్లు తీసే విధంగా రాస్తారు. ప్రేక్షకులు చూసే విధంగా మేకింగ్ చేస్తారు.

కానీ ఎలా రాస్తున్నారో చూద్దాం- తండ్రీ కొడుకుల సంభాషణ :   
        కొడుకు : నాన్నా, మళ్ళీ నన్ను కొట్టి లంచ్ బాక్స్ లాక్కున్నారు నాన్నా!
        తండ్రి : ప్రిన్సిపాల్ తో మాట్లాడతాన్లేరా.
        కొడుకు : ఒకసారి మాట్లాడావ్ ఏం జరిగింది? ఏం జరగలేదు. నన్ను మళ్ళీ కొట్టి లంచ్       బాక్స్ లాక్కున్నారు పోరగాళ్ళు!
        తండ్రి : ప్రిన్సిపాల్ వాళ్ళని పనిష్ చేస్తానన్నాడుగా, చూద్దాంలే.
        కొడుకు :  మేం కొట్టలేదంటే ప్రిన్సిపాల్ నమ్మాడు నాన్నా!

        వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధమవుతూనే వుంది. అయితే అవసరానికి మించి మాట్లాడేసుకుంటున్నారు. ఎందుకు అవసరానికి మించి మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగిందో ప్రేక్షకులకి తెలియాలని. ఇది అసహజంగా లేదూ? పాత్రలు ఒకరి బ్యాక్ గ్రౌండ్ గురించి ఇంకొకరికి తెలిసి వున్నట్టయితే అంత పూస గుచ్చినట్టు, మరొకరికి తెలియాలనుకున్నట్టు  మాట్లాడుకోరు. ఇక్కడ స్కూల్లో దెబ్బలు తింటున్న కొడుకు బ్యాక్ గ్రౌండ్ గురించి తండ్రికి ఆల్రెడీ తెలుసు. అలాగే ప్రిన్సిపాల్ తో మాట్లాడానంటున్న తండ్రి బ్యాక్ గ్రౌండ్ గురించి కొడుక్కీ తెలుసు.  

ఈ నేపథ్యంలో ఎలా మాట్లాడు కుంటారు?
        కొడుకు : మళ్ళీ కొట్టేశారు నాన్నా!
        తండ్రి : ప్రిన్సిపాల్ తో మాట్లాడతాలేరా!
        కొడుకు : మొన్న మాట్లాడేవుగా ఏమైంది? ఇదా!  

        ఇప్పుడు అసలేం జరిగిందో పాత్రలకి తెలుసు, మనకి తెలీదు. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో మనకి తెలీదు. మరి తెలిసేలా ఎలా చేయాలి? స్కూలు నుంచి వచ్చిన కొడుకు బట్టలు చిరిగి, ముక్కు రక్తం కారుతూ వుంటే, చేతిలో సొట్టలు పడ్డ ఖాళీ లంచ్ బాక్స్ కూడా వుంటే, చూడగానే అర్ధమైపోతుంది ఏం జరిగిందో, దేని గురించి మాట్లాడుకుంటున్నారో.

        ఇది స్టోరీ రేటింగ్ కాదు, సినిమాకి కావాల్సిన స్టోరీ మేకింగ్. అంటే విజువల్ రైటింగ్. కారుతున్న రక్తం, చిరిగిన బట్టలు, సొట్టలు పడ్డ లంచ్ బాక్స్ చూపిస్తూ, పరస్పరం వాళ్ళ బ్యాక్ గ్రౌండ్స్ తెలిసిన నేపథ్యంలోంచి మాట్లాడిస్తూ విజువల్ గా రాస్తే, అది స్టోరీ మేకింగ్ అవుతుంది. సినిమా స్క్రిప్టుకి కావాల్సింది స్టోరీ మేకింగే. స్టోరీ మేకింగ్ విజువల్ రైటింగ్ కళ మీద ఆధారపడి వుంటుంది.

స్టోరీ మేకింగ్ చేస్తే త్రీయాక్ట్ స్ట్రక్చర్ ఎలా వుంటుందో చూద్దాం...
        (బిగినింగ్) : ఆనందంగా గడుపుతున్న కుటుంబాలు, బిజీగా వున్న వ్యాపార కేంద్రాలు, ఆడుకుంటున్న పిల్లలూ, పని చేసుకుంటున్న ఉద్యోగులూ.  
        (ప్లాట్ పాయింట్ వన్, మిడిల్) :  వరద ముంచుకొచ్చి అల్లకల్లోలం, కుటుంబాలు కొట్టుపోవడం, వ్యాపారాలు మునిగిపోవడం...
        (ప్లాట్ పాయింట్ టూ, ఎండ్) : హృదయ విదారక దృశ్యాలు, నిరాశ్రయులైన కుటుంబాలు, ఏడుస్తున్న పిల్లలూ, ఆకలీ...
        ఉపసంహారం : ప్రభుత్వ సహాయం, బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, నస్జ్టపరిహారాలు ప్రకటించడం...    

        స్టోరీ మేకింగ్ అంటే సంఘటనలతో కథ చెప్పడం. సంఘటనలకి తగ్గ విజువల్స్ తో రైటింగ్ చేయడం. పాత్రల మాటలతో కథ చెప్పడం కాదు. ఇలా రచయిత చెప్తాడు, మేకర్ కాదు. మేకర్ మంచి మేకర్ అవాలంటే తాను రచయితనని మర్చి పోవాలి. యాడ్ ఫిలిమ్ మేకింగ్ లో రచయితలుగా ఫీలవరు. మేకర్ గా ఫీలవుతూ విజువల్స్ తో మేకింగ్ చేస్తారు. విజువల్ మీడియా ఈజ్ నాట్ ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియాని తక్కువ చేయడం కాదు. ఈ వ్యాసం రాయడం ప్రింట్ మీడియానే. ఇది తక్కువ రకం పని అనుకుంటే రాయకుండా పడుకోవడమే.

        నాటకాలు రాయడం, నవలలు రాయడం, కథలు రాయడం పూర్తిగా వేరు. కానీ సినిమా కథ రాయడమంటే ఇదేననుకుని స్క్రిప్టులు రాసేస్తున్నారు. సాహిత్యంలా స్క్రిప్టులు రాసేస్తున్నారు. కొందరి స్క్రిప్టులు వ్యాసాల్లా వుంటున్నాయి. ఇందుకే స్క్రిప్టుల క్వాలిటీ అడుగంటి, బడ్జెట్ వృధా అవుతోంది. డైలాగులతో సాహిత్యంలాగా సీన్లు రాస్తే, ఆ నిడివికి బడ్జెట్ పెరుగుతుంది. అదే విజువల్స్ తో స్టోరీమేకింగ్ చేస్తే సీను నిడివి తగ్గి బడ్జెట్ తగ్గుతుంది. పది డైలాగులు చేసే పనిని ఒక్క విజువల్ షాట్ చేస్తుంది.

        అందుకని మేకర్ రచయితగా అస్సలు ఫీలై రాయకూడదు. మేకర్ మెకానిక్ లాంటి వాడు. రచయితగా ఫీలైతే రాయడంలో పడిపోయి ఇతర క్రాఫ్ట్ ని మర్చిపోతాడు. మేకర్ గా ఫీలైతే రాస్తున్న దాంట్లో ఇతర క్రాఫ్ట్స్ ని కూడా వూహిస్తూ, మెకానిక్ లా వాటిని కథలో బిగించుకు పోతూ, ఎక్కడికక్కడ బడ్జెట్ ని కుదిస్తూ స్టోరీ మేకింగ్ చేస్తాడు. కొండపొలం లో హీరో ఏమవుతాడో ముందే చెప్పేశాక, అలా ఫారెస్ట్ ఆఫీసర్ అవడమే చివర్లో చూపిస్తే, ఈ చివరి సీను బడ్జెట్ వృధాతప్ప కథగా కల్గించిన రసోత్పత్తి ఏమీ లేదు.

        విజువల్స్ బ్రహ్మాండంగా వున్నాయని, కెమెరా వర్క్ అద్భుతమనీ అంటూంటారు. ఇది సినిమా భాష కాదు. అది విజువల్ రైటింగ్ తో కూడిన కెమెరా వర్క్ కాదు, స్టోరీ మేకింగ్ కాదు. కెమెరా షాట్స్ తో కథ చెప్తేనే మంచి కెమెరా వర్క్ అవుతుంది. కేవలం అద్భుత దృశ్యాలు కెమెరా వర్క్-  సినిమాటోగ్రఫీ కాదు. అదొట్టి ఫోటోగ్రఫీ. స్క్రీన్ ప్లే పండితులు రచయితలకి/మేకర్లకి కెమెరాతో కథెలా చెప్పాలో నేర్పకుండా, పెయింటింగ్ ఎలా వేయాలో కష్టపడి నేర్పుతున్నారు. అదే నమ్మి నట్టేట మునుగుతున్నారు మేకర్లు. మేకర్లోంచి మేకల్లాంటి రచయితల్ని బలి ఇస్తే తప్ప మెరికల్లాంటి మూవీ మేకర్స్ అవలేరు.

—సికిందర్