రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, మార్చి 2016, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు!

డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఒక సీనియర్ వేసిన ప్రశ్న:  నిన్న మీరు ‘రన్’ బాగా లేదన్నారు, ఇవ్వాళ ‘ఊపిరి’ బావుందని రాశారు. మాకు ‘ఊపిరి’ కూడా నచ్చలేదు...అని. ఎందుకు నచ్చలేదంటే, అందులో ‘కాన్ ఫ్లిక్ట్’ (సంఘర్షణ) లేదు గనుక నచ్చ లేదని సమాధానం.  
       
లాటి అభిప్రాయమే ఇంకో ఇద్దరు దర్శకత్వ ప్రయత్నాల్లో వున్న వాళ్ళు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఛోటా రచయితలూ వ్యక్తం చేశారు. కానీ ‘రన్’ షార్ట్ రివ్యూ లోనే రాశాం ఏ దేమిటో. అయినా వివరించాల్సి వచ్చింది- ‘రన్’ ఒక ఇండీ ఫిలిం అని. దాన్ని బుద్ధిజీవులెవరూ రీమేక్
చేయరని. అందుకే అదలా తయారయ్యిందని. 


            ‘ఊపిరి’ షార్ట్ రివ్యూలో కూడా రాశాం : ఒక వరల్డ్ మూవీకి ఇది రీమేక్ అనీ, వరల్డ్ మూవీస్ కథల్లో  కాన్ ఫ్లిక్ట్అనేది  వుండదనీ, కనుక ఆ వరల్డ్ మూవీస్  మూసలోనే  ‘ఊపిరి’ నీ చూడాలనీ...ఇది కూడా మళ్ళీ వివరించాల్సి వచ్చింది.  
           అసలు ఇంత రాశాక కూడా ఈ ప్రశ్నలెందు కొస్తున్నాయంటే, రాసిన దాన్ని విశ్వసించలేక, కేవలం ప్రపంచంలో సినిమాలన్నీ తెలుగు మసాలా సినిమాల మూసలోనే  వుంటాయని గట్టిగా నమ్మడం వల్లనేమో! అలా వుండకపోతే  అది సినిమాయే కాదనుకోవడం వల్లనేమో! జానర్లే కాకుండా సినిమాలు వివిధ నమూనాల్లో ఉంటాయన్న పరిశీలన లేకపోవడంవల్ల కూడా కావొచ్చు! సరే, ఇదలా వుంచుదాం.
          తెలుగులో అడపాదడపా ‘మిడిల్ మటాష్’ సినిమాలని  చూస్తూ వచ్చాం. అంటే  కథలో వుండే  బిగినింగ్ విభాగాన్నే క్లయిమాక్స్ దాకా సాగదీసి, అక్కడో  చిన్న ప్రాబ్లమేదో పెట్టేసి, అప్పుడు మిడిల్ లోకొచ్చేసి, ఆ మూడో సీన్లోనే ఓ డైలాగుతో ఆ ప్రాబ్లంని అంతే సులువుగా తీర్చేసి, ఎండ్ కొచ్చేసే స్ట్రక్చర్ అన్న మాట. 
           కథలో 50 శాతంగా  వుండాల్సిన మిడిల్, 5 శాతానికి కుంచించుకు పోవడంవల్ల దాన్ని  ‘మిడిల్ మటాష్’ స్ట్రక్చర్  అన్నాం. ఇలాటి అవగాహన లేని  స్ట్రక్చర్ తో వచ్చిన సినిమాలన్నీ సహజంగానే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా 2000 – 2005 మధ్య యూత్ సినిమాల పేరుతో వెల్లువెత్తినవన్నీ- ఈ మధ్యే వచ్చిన 40 కోట్ల బిగ్ బడ్జెట్  ‘కిక్- 2’ సహా!  మిడిల్ పీక నొక్కేస్తూ ఏం చేస్తున్నారో తెలుసుకోక  చేసిన  స్క్రిప్టుల కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయాలు నిర్మాతలు అన్యాయంగా నష్టపోయారు! మిడిల్ పీక నొక్కితే, అది నిర్మాతల  డబ్బు నొక్కేస్తుందని ఇప్పటికీ తెలుసుకోవడం లేదు. డబ్బు పెట్టేవాడుంటే స్క్రిప్టు రాయడానికి ఏ ఎడ్యుకేషనూ అవసరం లేదన్నట్టు వుంటోంది కల్చర్. ఇది కూడా అలావుంచుదాం. 
          ఇలా మిడిల్ మటాష్  స్ట్రక్చరే  ఒక భస్మాసుర హస్తమనుకుంటే, ఇపుడసలు స్ట్రక్చరే  లేకుండా ‘ఊపిరి’ సవాలు విసురుతోంది! ఇదెలా సాధ్యం?  సాధ్యమే. మిడిల్ మటాష్ కి సమాధానమే. తీసిన మిడిల్ మటాష్ సినిమాల్ని, ఇంకా ఎవరైనా తీస్తూంటే ఆ  మిడిల్ మటాష్ సినిమాలన్నిటినీ,  వరల్డ్ మూవీస్ విజన్ లో పెట్టి తీస్తే స్ట్రక్చర్ తో పనే లేదు. తెలియాల్సింది  స్ట్రక్చర్ లేకుండా ఎలా తీయాలన్నదే.
          ‘ఊపిరి’ తెలుగు సినిమాలకి సంబంధించి ఇది మొట్టమొదటి తేడాగల అనుభవం- స్ట్రక్చరే  లేకుండా స్క్రీన్ ప్లే హిట్టవడం!
          ఇంగ్లీషు భాషేతర సినిమాలు ‘వరల్డ్ సినిమా’ అయినప్పుడు, ఇవన్నీ స్ట్రక్చర్ దగ్గర హాలీవుడ్ తో విభేదిస్తూ- వెక్కిరిస్తూ కూడా  వుంటాయి. హాలీవుడ్ ఒక్కటే ఒక వైపు, మిగతా వరల్డ్ సినిమాలన్నీ ఒక వైపు. ఎంటర్ టైన్మెంటే పరమావధిగా  హాలీవుడ్  స్ట్రక్చర్ కి కాన్ ఫ్లిక్టే (సంఘర్షణే) ప్రధానమనుకుంటే, ఈ ‘కాన్ ఫ్లిక్ట్’ (conflict) తోనే బిగ్ కమర్షియల్ సినిమాలు వసూళ్లు సాధిస్తాయని నమ్మితే, వరల్డ్ సినిమాలు వచ్చేసి స్ట్రక్చరే, కాన్ ఫ్లిక్టే   అవసరం లేని వాస్తవికతా ధోరణులతో కూడిన ఆర్ట్ సినిమాల నుంచి పరిణామం చెందుతూ చెందుతూ  వస్తున్న కళా రూపాలై వున్నాయి. అలాటి కళారూపాల్లో ఒకటి ‘ఊపిరి’ 
బజారు మనిషితో బిలియనీర్
    ‘ఇంటచబుల్స్’  2011 లో విడుదలై కనకవర్షం కురిపించిన ఫ్రెంచి మూవీ. ఇది ఫిలిప్ పోజో డీ బోర్గో అనే ఒక బిలియనీర్ నిజ కథ. ఇతను సరదాగా భార్యతో పారా గ్లయిడింగ్ కి వెళ్లి ప్రమాదం పాలయ్యాడు, భార్య చనిపోయింది, తను శరీరం చలనం కోల్పోయాడు. ఆ భార్యతో పిల్లలు కూడా లేరు. కాలక్రమంలో ఇతడికి అబ్దెల్ సెలో అనే అల్జీరియన్ సంతతికి చెందిన ఫ్రెంచి ముస్లిం సేవకుడుగా కుదిరాడు. యజమానిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. వీళ్ళిద్దరి ఆసక్తికర అనుబంధం మీద తీసిన డాక్యుమెంటరీని చూసిన జంట దర్శకులు ఆలివర్ నకషే, ఎరిక్ టోల్డెనో  ఇద్దరూ కలిసి, ‘ఇంటచబుల్స్’  సినిమా తలపెట్టారు. ఇది ఫ్రాన్స్ లో అతి పెద్ద హిట్టయ్యింది. ప్రపంచ వ్యాప్తంగానూ విజయం సాధించింది. పోతే, ఫిలిప్ కి సేవకుడుగా అబ్దెల్ సెలో ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాడు.
        సినిమాలో ఫిలిప్ పాత్రని  44 సినిమాల సీనియర్ ఫ్రెంచి నటుడు ఫ్రాంకోయిస్ క్లజెట్  పోషిస్తే, అబ్దెల్ సెలో  పాత్రని 70 ఫ్రెంచి సినిమాల్లో నటించిన నల్లజాతి ముస్లిం కమెడియన్ ఒమర్ సై పోషించాడు. 
 1]
         
గంటా 45 నిమిషాల నిడివి గల ఈ ఒరిజినల్ సినిమా కథ ఇలా వుంటుంది...పారా గ్లయిడింగ్ లో గాయపడి చక్రాల కుర్చీలో  బందీ అయిపోయిన ఫిలిప్ తనకి సపర్యలు చేసేందుకు పనివాడి కోసం ఇంటర్వ్యూలు తీసుకుంటాడు. ఎందరో వస్తారు, ఒక్కరూ నచ్చరు. తన స్థితికి  జాలిపడి పలకరించే వాళ్ళని చూసీ చూసీ విసిగిపోయాడు. ఈ పనివాళ్ళు కూడా జాలి చూపిస్తే భరించలేడు. ఐతే ఇంటర్వ్యూ లో పిలవని పేరంటంలా వచ్చి జొరబడిపోయిన  షోకిల్లా రాయుడు డ్రిస్ అనే నల్లజాతీయుడ్ని చూసి ముచ్చట పడ్డాడు. ఇతగాడికి జాలీదయా మన్నూ మశానంలాంటి సెంటిమెంట్లు ఏవీ లేవు, అలాగని ఈ ఉద్యోగం కోరుకునీ రాలేదు. కేర్ లెస్ గా ఇంటర్వ్యూ ఇస్తే రిజెక్ట్ చేస్తారని, ఈ రిజెక్షన్  చూపించుకుని మరికొన్నాళ్ళు ప్రభుత్వమిచ్చే నిరుద్యోగ భృతిని నొక్కచ్చని ప్లానేసుకుని వచ్చాడు. బుక్కై పోయాడు ఫిలిప్ కి తెగ నచ్చేసి. 

          డ్రిస్ ది పేద కుటుంబం. తల్లి పోషిస్తోంటే ఆవారా తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. దొంగతనం చేసి ఆర్నెల్లు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. తమ్ముడు వేరే క్రిమినల్స్ తో తిరుగుతున్నాడు. ఈ నేపధ్యంలో ఇప్పుడు తల్లి ఇంట్లోంచి వెళ్లిపొమ్మనే సరికి, పెట్టే బేడా సర్దుకుని ఫిలిప్ దగ్గరికి వచ్చేశాడు.
2]
         
డ్రిస్ ది  దేనికీ బాధపడే మనస్తత్వం కాదు. ఎంత కష్టకాలంలోనూ  ఇతడి నవ్వొ చ్చే చేష్టలు చూస్తే వీడొక మనిషేనా అన్పించేలా వుంటాడు. లోకంలో తన పట్ల కోపం, వ్యతిరేకత, ఛీత్కారం అన్నీ వున్నా, లేవనే భావించుకుంటాడు. లోకమంతా తనతో బాగానే వుందను
కుంటాడు. ఆత్మాభిమానం దెబ్బతింటే, తనని తాను ప్రేమించుకోవడం ఎక్కువ చేసుకుని, ఆ గాయం చేసే ఎమోషనల్ బ్లీడింగ్ ని సత్వరం నివారించుకుంటాడు. ఎమోషన్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకుని ఫ్రెష్ గా ఉంటాడు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు. కథలో ఇతడి పాత్ర చిత్రణ ఒక క్యారక్టర్ స్టడీ...మనం ఎలా జీవించాలో  మనకి మతిపోయేలా నేర్పుతూంటాడు.

          ఐతే ఇతడి వ్యక్తిత్వ ప్రభావం బిలియనీర్ ఫిలిప్ మీద పడదు. ఫిలిప్ వ్యక్తిత్వం ఫిలిప్  దే. ఎలాగైతే తనపట్ల జాలి చూపిస్తే సహించడో, అలా తనని తాను చూసుకునీ కుంగిపోడు. చక్రాల కుర్చీలోనూ రాజసంగా ఉంటాడు. తనక్కావల్సింది మానసిక ఆసరా కాదు, భౌతిక సహాయం. దీన్ని  డ్రిస్ నానా కంగాళీతనంతో సరఫరా  చేస్తున్నాడు. ఫిలిప్ ఎవరైతే నాకేంటి, నేను తాగే సిగరెట్ ఇతనూ తాగాలి అని ఎంగిలి సిగరెట్ నోట్లో పెట్టేసే గడుసుతనం డ్రిస్ ది. ఇతడి చేష్టల్ని స్పోర్టివ్ గా తీసుకుని ఎంజాయ్ చేస్తూంటాడు కాళ్ళు చేతులు పనిచేయని ఫిలిప్ కూడా. 

          ఈ సెటప్ లో ఫిలిప్ తనపనులు తాను చేసుకోలేని ఎంత నిస్సహాయుడో తెలిసిన తర్వాత డ్రిస్ అనుక్షణం అంటిపెట్టుకుని వుండడం ప్రారంభిస్తాడు. వ్యక్తిగత జీవితంలో కూడా జోక్యం చేసుకుని ఫిలిప్ దత్త పుత్రికని అదుపులో పెట్టేలా చూస్తాడు. ఫిలిప్ బిజినెస్ ఉత్తరాలే గాకుండా, ఒకమ్మాయి రాసే వ్యక్తిగత లేఖల్ని కూడా చదివి విన్పిస్తాడు. ఫిలిప్ కొన్ని లక్షలు పోసి ఒక అర్ధం కాని మోడరన్ ఆర్ట్ పెయింటింగ్ కొనడం చూసి,  తనూ అలాటి పిచ్చి పెయింటింగ్ ఒకటి వేసి పారేసి అమ్మి పెట్టమంటాడు. ఫిలిప్ దాన్ని తన మిత్రుడికి అంట గడతాడు. ఫిలిప్ ని బయట షికార్లకి కూడా తీసుకుపోతాడు డ్రిస్. అతడి బర్త్ డేకి  హోటల్లో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు ఆడి పాడేసి.  

          ఇక  ఫిలిప్ ని ఆ ఉత్తరాలు రాసే అదృశ్య ప్రేమికురాలితో  కలపాలని బలవంతంగా ఒప్పించి తీసుకుపోతాడు డ్రిస్. తన స్థితికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయంతో ఆమెని  చూడకుండానే, కలవకుండానే వచ్చేస్తాడు ఫిలిప్.

3]
         
క మనం ఈ వీకెండ్ పారా గ్లయిడింగ్ కి వెళ్దామని తన సొంత విమానంలో డ్రిస్ ని తీ సుకుపోతాడు ఫిలిప్. ఇద్దరూ ఆ పారా గ్లయిడింగ్ ని ఎంజాయ్ చేశాక, డ్రిస్ తమ్ముడు వచ్చేసి, డ్రిస్ ని రహస్యంగా కలుసుకుని ఏదో చెప్పుకోవడాన్ని పసిగట్టిన ఫిలిప్, ఇక నువ్వింటి కెళ్ళి నీ ఇంటి సమస్యలు తీర్చుకో, ఎల్లకాలం నా చక్రాల కుర్చీని లాగుతూ వుండిపోతావా అనేసరికి- మొదటిసారిగా డ్రిస్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతను వెళ్లిపోతూంటే ఫిలిప్  పరివారమంతా ఎంతో బాధపడతారు.

          ఇంటి కొచ్చి డ్రిస్ క్రిమినల్స్ తో తమ్ముడి సమస్య తీరుస్తాడు, తమ్ముడు ఇక మారిపోతాడు. డ్రిస్ ఉద్యోగ ప్రయత్నంలో వుంటాడు. కానీ అటు చూస్తే డ్రిస్ లేని లోటు ఫిలిప్ ని బాధించడం మొదలెడుతుంది. ఇంకే సేవకుడు వచ్చినా నచ్చడు. గడ్డం మీసాలు పెరిగిపోయి విరాగిలా తయారవుతాడు. అతడింట్లో పనిచేసే ఒకావిడ డ్రిస్ ని  కలుసుకుని, మళ్ళీ నువ్వు రావాల్సిందే నంటుంది. డ్రిస్ వచ్చి ఫిలిప్ అవతారం చూసి పకపకా నవ్వేసి - ‘ఇదేంటి మీరు అబ్రహాం లింకన్ అయిపోయరా? ఫ్రాయిడ్ లా అయిపోయారా? విక్టర్ హ్యూగోలా తయారయ్యారే?’ అని తన సహజ ధోరణిలో ఆటలు పట్టిస్తాడు అడ్డంగా గడ్డమూ మీసాలూ చూసి.

4]
         
రాత్రి ఫిలిప్ ని తీసుకుని రిలీఫ్ కోసం స్పీడ్ డ్రైవింగ్ చేసి పోలీసులకి పట్టుబడి, తెలివిగా బయటపడి- తెల్లారే సరికి సముద్ర తీరాన ఒక హోటల్ కి తీసుకుపోతాడు. అక్కడ ఫిలిప్ గడ్డం రకరకాలుగా గీసి ఆడుకుంటూ, తిరిగి పూర్వస్థితికి నీటుగా షేవింగ్ చేసి, సీటులో కూర్చోబెట్టి,  బై చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒకమ్మాయి వచ్చి ఫిలిప్ ఎదురుగా కూర్చుంటుంది- ఈ అమ్మాయి మరెవరో కాదు, ఆ అదృశ్య ప్రేమికురాలే. బయట్నించి అద్దంలోంచి ఈ దృశ్యం చూస్తూ, మరోసారి ఫిలిప్ కి బై చెప్పేసి,  వెళ్లి పోతూంటాడు తన భవిష్యత్తులోకి డ్రిస్ ..?
          తనకేం భవిష్యత్తు వుందని? కానీ లెక్క చెయ్యడు, బతికేయగలడు.

కథా? గాథా? 
నిజజీవితంలో ఫిలిప్, అబ్దెల్ సెలో 
       దీ కథ. ఈ కథలో స్ట్రక్చర్ ఏముంది?  స్ట్రక్చర్ అంటే కథకి ఓ  బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలూ, ప్లాట్ పాయింట్సూ, ప్రధాన పాత్రా, దానికో సమస్యా, ఆ సమస్యతో సంఘర్షణా, ఆ సమస్యని సాధించాలన్న లక్ష్యమూ...ఇవీ.

          ఇవేవీ లేని కథ ఇదని పైన చదువుకుంటూ వస్తే తెలిసిపోతోంది. ఆర్టు సినిమాల్లో ఇవేవీ వుండవు, అంటే స్ట్రక్చర్ వుండదు. అసలు ఆర్టు సినిమాల్లో వుండే వాటిని కథలని కూడా అనకూడదేమో?  కథ అంటే ఒక పాయింటు పట్టుకుని ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించేది. పాయింటే వుండనప్పుడు ఆర్గ్యుమెంటే తలెత్తదు గనుక, ఆర్ట్ సినిమాల్లో వుండేవి కథలనుకోనవసరం లేదు. కథలు కావు కాబట్టే స్ట్రక్చర్ కూడా వుండడంలేదు వీటిలో. కేవలం ‘కథ’ లకే స్ట్రక్చర్ వుంటుంది. ‘గాథ’ లకి వుండదు గనుక ఆర్ట్ సినిమాల్లో వుండేవి ‘గాథ’ లే అనుకోవాలి. ‘గాథ’ ల్లో ఆర్గ్యుమెంట్ వుండదు, స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. ‘నేనిలా వుంటే నాకిలా జరిగి, ఇలా ముగిసిందీ’ అన్న చందాన ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసి ముగుస్తాయవి. ‘నేనిలా వుంటే ఇలా  పోరాడి ఇలా ప్రూవ్ చేసుకున్నానూ’- అన్న పద్ధతిలో  గాథలుండవు. ‘పోరాడాను’ అనేసరికే ఆర్గ్యుమెంట్ వచ్చి జొరబడిపోతుంది. అది కథై కూర్చుంటుంది. వాడుక సౌలభ్యం కోసం గాథని కథ అనుకోవాలేగానీ, నిజానికివి కథలు కావు.

          కాబట్టి వరల్డ్ మూవీస్  అన్నీ గాథలతో స్ట్రక్చర్ లేని ఆర్ట్ సినిమాలే. మరి స్ట్రక్చర్ అవసరం లేదని గాథని ఎలా చెప్పాలి? అడ్డగోలుగా చెప్పాలా?లేదు, దీనికీ ఓ విధానముంది. దీన్ని చైనీయులు/జపనీయులు  కనిపెట్టారు. దీని పేరు ‘కిష్టెన్ క్యాచో’ (
Kishotenketsu). ఈ ఇంగ్లీషు అక్షరాలని కూడ బలుక్కుంటూ పలక్కండి- జన్మలో పదం రాదు. ఏ ప్రముఖ డిక్షనరీ వెబ్ సైట్లోనో ఈ అక్షరాలని ప్రొనన్సియేషన్  బాక్సులో కొట్టండి- యూట్యూబ్ ఓపెనై, రికార్డెడ్ వాయిస్ తియ్యగా ‘కిష్టెన్ క్యాచో’ అని పలుకుతుంది. తెలుగులోకి మార్చుకుని  ‘కిష్టన్న క్యాచ్ పట్టాడు’ అనుకుంటే కలకాలం గుర్తుండిపోతుంది. నిజంగా ఇదేదో కొత్త విధానాన్ని క్యాచ్ పట్టడమే కదా  ఇక్కడ నేర్చుకుంటోంది.  

         
Ki : Introduction
          Sho : Development

         
Ten : Twist (complication)
         
Ketsu : Conclusion (reconciliation)
         
ఇంతే!

4 యాక్ట్స్ తో ఫన్ 
       కమర్షియల్ సినిమా కథల్లో త్రీ యాక్ట్స్ ( బిగినింగ్, మిడిల్, ఎండ్) లా కాకుండా,  ఇక్కడ 4 యాక్ట్స్ (అంకాలు)  వుంటాయి. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనైతే బిగినింగ్ లో పాత్రల పరిచయం, సమస్య ఏర్పాటు, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం అనే పద్ధతి వుంటుంది.

          ఇక్కడ 4 యాక్ట్స్ విధానంలో ఇవేవీ వుండవు. ఇందులో ఫస్ట్ యాక్ట్ లో కథా పరిచయం,  పాత్రల పరిచయం, వాటి సామాన్య ప్రపంచమూ వుంటాయి.

          సెకండ్ యాక్ట్ లో  పాత్రలు పరస్పరం సంపర్కంలోకి వస్తాయి. వాటి ప్రపంచం మారుతుంది. ఆయా పాత్రల గురించి మరిన్ని విషయాలు బయటపడతాయి. ఒక కొత్త ఎలిమెంట్ వచ్చి చేరుతుంది. ఇంతేగాక రకరకాల సంఘటనలతో ఆ పాత్రలు మరింత దగ్గరై ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది. 

          థర్డ్ యాక్ట్ లో ఎమోషనల్ కనెక్ట్ తో పాత్రలు  మరింత ముందుకు సాగుతాయి.  చివర్లో ఒక ట్విస్టు వస్తుంది.
          ఫోర్త్ యాక్ట్ లో  సెకండ్ యాక్ట్ లో ప్రవేశపెట్టిన ఎలిమెంట్ తో పరిష్కారం వుంటుంది.
          ఇక్కడ ఆగి ఒకసారి పరిశీలించుకుంటే-

          మిడిల్ మటాష్ లో క్లయిమాక్స్ కి జస్ట్ ముందు- ఓ సమస్య/సంఘర్షణతో పిసరంత మిడిల్ ని పెట్టి దాన్ని పరిష్కరిస్తారని పైన చెప్పుకున్నాం. అంటే క్లయిమాక్స్ దగ్గర  ఏర్పడే ట్విస్టు( సమస్య/సంఘర్షణ)  మాత్రమే పరిష్కరించదగ్గ పాయింటు అవుతుంది.
4 యాక్స్ట్ తో కూడిన వరల్డ్ మూవీస్ లో ఇలాకాకుండా, సెకండ్ యాక్ట్ లో ( ఇంటర్వెల్ కి పూర్వం) ప్రవేశ పెట్టే ఎలిమెంటు నే ముందుకు తెచ్చి ముగించడం వుంటుంది. ఈ తేడా గుర్తించాలి. కనుకనే మిడిల్  మటాష్ కంటే,  కిష్టెన్ క్యాచో స్కీన్ ప్లేలే నయంగా వుంటాయి. 

నాలుగు స్థంభాల ఆట

           ప్పుడొకసారి  ‘ఇంటచబుల్స్’ ని  ‘కిష్టిగాడి’  వలలో ‘క్యాచ్’ పట్టి  చూద్దాం...
          ఇంకోసారి పైన చెప్పుకున్న కథా సంగ్రహంలో కెళ్దాం :  కథా  సంగ్రహాన్ని నాల్గు భాగాలుగా ఇచ్చాం. మొదటి భాగం ఫస్ట్ యాక్ట్ అనుకుంటే, ఫిలిప్ చక్రాలకుర్చీకి బందీ అయినట్టు, చూపించబోతున్న కథ దీని గురించే అన్నట్టు ‘కథాపరిచయం’ చేశారు. ఫిలిప్ పాత్రతో బాటు అతడి పరివారం, డ్రిస్ పాత్రతో పాటు  అతడి కుటుంబం, ఈ మొత్తం పాత్రల సామాన్య ప్రపంచమూ చూపించారు. ఇంటర్వ్యూ డ్రిస్ వచ్చి వెళ్ళడం, ఇంటి దగ్గర తల్లి వెళ్లి పొమ్మనడం, ఇక ఫిలిప్ దగ్గర చేరేందుకు డ్రిస్ బయల్దేరడమూ చూపించి ఫస్ట్ యాక్ట్ ని ముగించారు.

          సెకండ్ యాక్ట్ : కథాసంగ్రహం రెండో భాగంలో కొస్తే,  ఫిలిప్ ఇల్లూ అనే కొత్త ప్రపంచంలోకి డ్రిస్ ని ప్రవేశపెట్టి , పని బాధ్యతలు చేపట్టినట్టు చూపించారు. ఫిలిప్, డ్రిస్ ఇద్దరి స్వభావాల్ని మరికొంత విడమర్చి చూపించారు, ఇద్దరి మధ్యా సాన్నిహిత్యాన్ని పెంచుతూ ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చారు. లెటర్స్ చదివించడం  ద్వారా కొత్త ఎలిమెంట్ ని ప్రవేశ పెట్టారు. ఆ కొత్త ఎలిమెంట్ ‘అదృశ్య ప్రేమికురాలు’. వీళ్ళ సంబంధానికి వాస్తవ  రూపమివ్వాలన్న ఆలోచన డ్రిస్ కి  కల్పించడం ద్వారా ఆ ప్రయత్నం చేయిస్తూ- ఆమెతో కలవడానికి ఫిలిప్ జంకి వెళ్లిపోవడంతో ఈ యాక్ట్ ని ముగింపుకి తెచ్చారు. 


         థర్డ్ యాక్ట్ లో,  కొంత డిస్టర్బ్ అయిన ఫిలిప్ కి  రిలీఫ్ కోసమన్నట్టు,  పారా గ్లయిడింగ్ కి డ్రిస్స్ తో బయల్దేరదీశారు. అక్కడ డ్రిస్ తమ్ముణ్ణి వాడి సమస్యతో ప్రవేశపెడుతూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇంటి సమస్యలు తీర్చుకోమని ఫిలిప్ అనడంతో, అక్కడ్నించి డ్రిస్  నిష్క్రమణతో   ఈ యాక్ట్ ని ముగించారు. 


          ఫోర్త్ యాక్ట్ అనేది సెకండ్ యాక్ట్ లో ఎలిమెంట్ కి సమాధానమనే సూత్రం ప్రకారం, డ్రిస్ ఆ అదృశ్య ప్రేమికురాలిని ఫిలిప్ తో కలపడాన్ని  చూపిస్తూ  సుఖాంతం చేశారు.

(మిగతా రేపు!)
-సికిందర్

http://www.cinemabazaar.in