రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, మే 2021, గురువారం

1037 : రివ్యూ

ఒన్ (మలయాళం)
దర్శకత్వం: సంతోష్ విశ్వనాథ్
తారాగణం :  మమ్ముట్టి, మాథ్యీవ్ థామస్, గాయత్రీ అరుణ్, సలీం కుమార్, మురళీ గోపి, జోజు జార్జ్ తదితరులు
రచన : బాబీ - సంజయ్, సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : వైదీ సోమసుందరం
బ్యానర్ : ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్
నిర్మాత : ఆర్ శ్రీ లక్ష్మి
విడుదల మార్చి 26, 2021
***

       దేశంలో  అనేక సమస్యలుంటాయి. సినిమాల్లో   సమస్యలకి సినిమాటిక్ గా పరిష్కారాలు చూపించడం దగ్గరే ఆగి పోతే సరిపోతుందా? సమస్యల పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించే కొత్త ఆలోచనకి తెర తీయకూడదా? కళ్ళ ముందున్న సమస్యని కాక, దాంతో రేపటి కలని చూడగల్గినప్పుడు సినిమాల్ని కొత్త రూపంలో అందించే అవకాశం లభిస్తుంది. లేదంటే ఇలాగే సమస్యల్ని పరిష్కరించే అదే టెంప్లెట్ తో, ప్రయోజనం లేని అవే సోకాల్డ్ కథలతో, రొటీన్ సినిమాలు తీసుకుంటూ అనుద్పాదకంగా గడపాల్సిందే.

          లయాళంలో మమ్ముట్టి నటించిన ఒన్ కోవకే చెందేలా తీశాడు దర్శకుడు సంతోష్ విశ్వనాథ్. తెలుగులో నాంది లో సెక్షన్ 211 చట్టం గురించిన కథని ఎలా చెప్పాల్సిన కథ చెప్పకుండా తీశారో, అలా ఒన్ లో రైట్ టూ రీకాల్ చట్టంతో చేశాడు దర్శకుడు. ప్రజలు తామెన్నుకున్న ప్రజా ప్రతినిధి పనితీరు నచ్చకపోతే, వెనక్కి పిలిచే 'రైట్ టు రీకాల్'‌ చట్టం ఇంకా పార్లమెంటులో ఆమోదం పొందకుండానే వుంది. పొందదు కూడా. దీని మీద మమ్ముట్టితో రాజకీయ డ్రామాగా తీశారు. ఇదిలా వుంది...

        సనల్ (మాథ్యీవ్ థామస్) ఒక స్టూడెంట్. ఇతడి అక్క సీనా (గాయత్రీ అరుణ్) పార్కింగ్ లాట్ లో వర్కర్. వీళ్ళ తండ్రి దాసప్పన్ (సలీం కుమార్) హోటల్లో వెయిటర్. ఇతను ఒక రోజు అనారోగ్యం పాలైతే ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఆస్పత్రికి సనల్ వెళ్తే అప్పుడే ముఖ్యమంతి కడక్కల్ చంద్రన్ (మమ్ముట్టి) ఆరోగ్య పరీక్షల కోసం రావడంతో, పోలీసులు సనల్ ని పక్కకు తోసేస్తారు. కొడతారు.

       రమ్య (ఇషానీ కృష్ణ) తోటి స్టూడెంట్. ఈమె ఈ సంఘటన గురించి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టమని చెప్తుంది. ఫేక్ ఎక్కౌంట్ సృష్టించి సీఎం కి వ్యతిరేకంగా పోస్టు పెడతాడు సనల్. ఆస్పత్రికి సీఎం రాకపోకల వల్ల తను దౌర్జన్యానికి గురయ్యానని సీఎం ని విమర్శిస్తూ రాస్తాడు. ఇది వైరల్ అవుతుంది. దీంతో ప్రతిపక్ష నాయకుడు జయనందన్ (మురళీ గోపీ) పౌరులకి ఇబ్బంది కల్గించిన సీఎం చర్యకి వ్యతిరేకంగా ఆందోళనకి దిగుతాడు. పోలీసులు సనల్ ని పట్టుకుని సీఎం చంద్రన్ ముందు హాజరు పరుస్తారు. సీఎం సనల్ కి సారీ చెప్తాడు. తనకి ఇలాటి యూతే కావాలని చెప్పి, ఒక టాస్క్ అప్పజెప్తాడు. అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల గురించి ప్రజలేమనుకుంటున్నారో సర్వే చేసి, రిపోర్టు అందించమంటాడు. తన ధ్యేయం రైట్ టు రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడమని వెల్లడిస్తాడు...

***
        ఇదీ విషయం. రైట్ టు రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడం లక్ష్యం. చివరికి పార్లమెంటులో పాస్ అయినట్టు చూపించారు. అసెంబ్లీలో కాలేదని ముగించారు. దీంతో రాజీనామా చేసిన సీఎం చంద్రన్ మళ్ళీ ఎన్నికలు గెలిచి వస్తాడు. ఈ చట్టానికి ప్రజా మద్దతుందని నిరూపిస్తూ. ఇలా ఈ కథ రైట్ టు రీకాల్ ఐడియాతో చెప్పాల్సిన కథగా  కాకుండా పోయింది. రైట్ టు రీకాల్ చట్టం ఆపరేటివ్ పార్టు చూపించక పోవవడంతో, కథగా చెలామణిలోకి రాకుండా వుండి పోయింది. చట్టమెలా మూబడిందో, కథ కూడా అలా మూలబడింది. చట్టం మూలబడ్డ విషయం ఎలాగూ తెలిసిందే, అది మళ్ళీ చూపించడమెందుకు. దర్శకుడు పత్రికలో ఓ ఉత్తరం రాసి గుర్తు చేస్తే పోయే దానికి ఇంత సినిమా తీయాల్సిన అవసరం కన్పించదు.



        చట్టం పాస్ అయినట్టో కానట్టో చూపించడం ఆసక్తికర కథవుతుందా? పాస్ అయితే మనకేంటి, కాకపోతే మనకేంటి. ఉల్లి పెసరట్టు వేస్తానన్నాడు, వేశాడు. అయితే ఏంటి. తినిపించి దాని రుచి చూపించాలి గాని. రుచి చూపించకుండా ఉల్లి పెసరట్టు వేస్తే ఎవరిక్కావాలి, వేయకపోతే ఎవరిక్కావాలి. చట్టం పాసయ్యే ఆసక్తి లేని  కథ ఎవరిక్కావాలి. ఒకవేళ పాసైతే ఆ చట్టం ఎలా అమలయ్యేదో, ఎలాటి పరిణామా లుంటాయో ఆ ఆసక్తికర కథ కావాలి గాని (The big reason so many writers fail here is that they don’t know how to develop the idea, how to dig out the gold that’s buried within it. They don’t realize that the great value of a premise is that it allows you to explore the full story, and the many forms it might take, before you actually write it John Truby). నాంది లో 211 చట్టం తో ఇలాగే చెప్పాల్సిన కథ చెప్పేలేదు. రైట్ టు రీకాల్ చట్టంతో ఒన్ లోనూ చెప్పాల్సిన కథ చెప్పలేదు. ఇదీ సృజనాత్మకంగా ఇంకా కొనసాగుతున్న సినిమా కథల పరిస్థితి. తీసుకున్న ఐడియా లో అవసరమున్న కథని గుర్తించలేని దుస్థితి. ఇలాటి ఐడియాలతో కథలనేవి పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించడంలో వుంటాయని గుర్తించక పోతే, జస్ట్ లైక్ ముందు కాలాన్ని చూపించే సైన్స్ ఫిక్షన్ కథల్లాగా వుండకపోతే, ఇక ఇంతే.


***

        తమిళ మండేలా ని ప్రజా నాయకులు అవసరం లేని ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించుకునే ఆదర్శ ఆలోచనతో తీశాడు ఆ దర్శకుడు. ఒన్ ని ఇలాటి ఆదర్శంతో తీయవచ్చు. ఇందుకు ఐడియాని రీసెర్చి చేయాలి. రైట్ టు రీకాల్ చట్టం పాసై అమల్లోకి వస్తే ఎలాటి పరిణామాలుంటాయో వివరిస్తూ ఇప్సితా మిశ్రా రాసిన ఆర్టికల్లో ఒక సినిమా తీయడానికి పనికొచ్చే పాయింట్లున్నాయి. ఈ పాయింట్లు తీసుకుని చాలా హిలేరియస్ పొలిటికల్ ఎంటర్ టైనర్ తీయవచ్చు మండేలా లాగా. కథ ఇక్కడుంది. కేవలం చట్టాన్ని పాస్ చేయించడమనే లక్ష్యంలో లేదు.


        రైట్ టు రీకాల్ ని ఉత్తరాది నాల్గైదు రాష్ట్రాల్లో పంచాయితీ స్థాయిలో చట్టం చేసి అమలు చేస్తున్నారు కూడా. పంచాయితీ స్థాయిలో సర్పంచులుంటారు కాబట్టి ఎదుర్కొలేరు. అదే ఎమ్మెల్యేలకి, ఎంపీలకీ వర్తించే మౌలిక చట్టాన్ని పాస్ చేయగలరా?  చేయలేరు. ఓటర్ల చేతిలో నోటా అనే లోటా ఒకటి తప్ప, రైట్ టు రీకాల్ కొరడా పెట్టలేరు.


        మరి స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన లింకన్ కథ చట్టాన్ని పాస్ చేయించడం గురించే కదా అనొచ్చు. అది అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ బయోపిక్. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం, 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాగా తీశాడు. బానిసత్వాన్ని నిషేధించే ఈ రాజ్యాంగ సవరణ గురించిన హైడ్రామా ఒక చరిత్ర. కథకి ఈ పరిస్థితుల చిత్రణ అవసరం. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాక ఎలా అమలయ్యిందో తెలిసిన చరిత్రే. అది చూపించనవసరం లేదు. కానీ రైట్ టు రీకాల్ చట్టం పాస్ కాలేదు, అమలే కాలేదు. అమలైతే ఎలా వుంటుందన్న ప్రేక్షకాసక్తితో చెప్పాల్సిన కథే అసలు కథవుతుంది ఐడియాకి.


***

        రైట్ టూ రీకాల్ కథ చెప్పడానికి కూడా అంత కథ లేదు. మొదటి అరగంట స్టూడెంట్ సనల్ తోనే గడిచిపోతుంది. సీఎం కి వ్యతిరేకంగా అతను పెట్టిన పోస్టుకి సంబంధించిన పరిణామాలు ఈ అరగంటని మింగేస్తాయి. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం, అరెస్ట్ కాకుండా అతను లాయర్ని ఆశ్రయించడం, అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు వేధించడం, అతను వూరు విడిచి పారిపోయే ప్రయత్నం చేయడం, ప్రతిపక్ష నాయకుడి హంగామా వగైరా మొదటి అరగంట సాగుతుంది. ఆస్పత్రిలో వున్న తన తండ్రి కోసం పోతే, సీఎం వచ్చాడని అడ్డుకుని పోలీసులు కొట్టారని పోస్టు పెడితే, అదెలా నేరమవుతుందో చెప్పక పోవడంతో ఈ ఎపిసోడ్ నమ్మశక్యంగా వుండదు.

      కాకతాళీయంగా గత వారమే సుప్రీం కోర్టు పోలీసుల్ని హెచ్చరించింది. ఆక్సిజన్ కొరత నెదుర్కొంటున్న ప్రజలు ఆందోళనతో సోషల్ మీడియా పోస్టులు పెడితే అరెస్టు చేయరాదని. ఈ సినిమాలో సనల్ ని అరెస్ట్ చేసే హంగామా లాజికల్ గా లేకపోగా, సీఎం పాత్ర ఔచిత్యాన్ని కూడా దెబ్బతీసింది. తన మీద పోస్టు పెట్టిన సనల్ నిజానికి తన లక్ష్యానికి కావాల్సిన యూత్ అన్పించినప్పుడు, అతన్ని ప్రశాంతంగా పిలిపించుకోవచ్చు. ఇంత టెర్రర్ దేనికి? మిస్ లీడింగ్ గా ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలన్న చిలిపి ఆలోచన కాకపోతే? ఈ సీఎం ప్రజలకి టెర్రర్ కూడా కాదు, ఫ్రెండ్లీ లీడర్.

***

        ఇలా సీఎం తన లక్ష్యం కోసం సనల్ ని రప్పించుకోవడం ప్లాట్ పాయిట్ వన్ అయింది. ఇక్కడ తన లక్ష్యం అయిన రైట్ టు రీకాల్ చట్టం కోసం, ఎమ్మెల్యేల గురించి ప్రజల అభిప్రాయాలు సేకరించమని, సనల్ కి సర్వే అప్పజెప్తాడు సీఎం. ఇది పాత్రల స్వభావానికి వ్యతిరేకంగా వుంది. సీఎం గా తన మీద వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వాడికే ఈ సర్వే పని ఎలా అప్పజెప్తాడు. అప్పుడు, సార్, నేనిచ్చే సర్వేలో రీకాల్ చేయాల్సిన మొదటి నాయకుడు మీరే అవుతారు అని సనల్ అనెయ్యవచ్చు ఆస్పత్రి సంఘటన దృష్ట్యా. అనకుండా ఎలా వుంటాడు. కథ కోసం అన్లేదులా వుంది. ఇలా ఇద్దరి మధ్యా ఒప్పందంతో ఈ ప్లాట్ పాయింట్ వన్ అర్ధరహితంగా వుంది. ఆస్పత్రి సీనులో సీఎం కాక వేరే నాయకుడు వుండుంటే ఈ ప్లాట్ పాయింట్ వన్ అర్ధవంతంగా వుండేదేమో.


***


       ఇలా ఏర్పాటైన ఈ రైట్ టు రీకాల్ లక్ష్యంతో తర్వాతి  కథ ఇంకెప్పుడో వుంటుంది. ఈ లోగా సంబంధం లేని ఎపిసోడ్లు 8 మొదలవుతాయి. ప్రతిపక్షం సమ్మె, సనల్ అక్క సీనా దొంగతనం కేసులో ఇరుక్కుంటే సీఎం విడిపించడం, ఫ్లై ఓవర్ కూలిపోతే సీఎం వెళ్ళి చర్య తీసుకోవడం. వేరే ఒక అవినీతి కేసులో ఒక మంత్రిని అరెస్టు చేయించడం, కాలేజీకి వెళ్ళే మార్గంలో ఒక కంపెనీ ముందు కార్మికులు ఆందోళన చేస్తూ రోడ్డు బ్లాక్ చేస్తే, సీఎం కాన్వాయ్ వదిలి ఆటో ఎక్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళి సామాన్య బార్బర్ గా (మండేలా కూడా బార్బరే) రాజకీయాల్లో తను ఎదిగిన విధం గురించి విద్యార్థుల ముందు ప్రసంగించడం, వంట వాడికి తన తండ్రి గొప్పదనం గురించి వినరించడం... ఇలా కథతో సంబంధం లేని 8 ఎపిసోడ్లు పాయింటు వదిలేసి సినిమాని ఎటో తీసికెళ్ళి పోతాయి. ఇంకా సినిమాల్లో ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బాపతు డాక్యుమెంటరీ కథనాలు తప్పవేమో.


        ఈ ఎపిసోడ్లని గమనిస్తే ఘోరమైన పాత్ర చిత్రణ బయటపడుతుంది. ఒక వైపు రైట్ టు రీకాల్ కి సర్వే అప్పజెప్పిన సీఎం, మరో వైపు ఈ ఎపిసోడ్లతో తను నీతిగల నాయకుణ్ణని ఇమేజి బిల్డప్ చేసుకుంటున్న అర్ధం కన్పిస్తోంది- సర్వేలో ప్రజలు తనకి వ్యతిరేకంగా చెప్పకూడదన్న భావంతో అన్నట్టు. రచన చేస్తున్నప్పుడు ఈ పొరపాటు తెలుసుకోకుండా ఇంత ఘోరమైన పాత్ర చిత్రణకి ఈ ఎపిసోడ్లతో తెరతీశారు దర్శకుడూ రచయితల జంట. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయాలనుకుంటారేమో – మలయాళ తప్పిదం తెలుగులో దిగుమతి ఐపోగలదు!


***
        ఈ ఎపిసోడ్ల వల్ల సనల్ కథలో కనిపించకుండా పోతాడు. మొదటి అరగంట అంతా కీలక పాత్రగా స్పేస్ తీసుకున్న వాడు అప్రధాన పాత్రాయి పోతాడు. ఎక్కడా సీఎం అప్పజెప్పిన సర్వే చేస్తున్నట్టు కూడా కనపడడు. ఎపిసోడ్లు పూర్తయ్యాక వచ్చి ఏకంగా సర్వే సబ్మిట్ చేసేస్తాడు. ఇది సెకండాఫ్ లో. సర్వే కథ, ఇలా రైట్ టు రీకాల్ కొనసాగింపు కథ చెప్పలేకే అన్నట్టు వేరే ఎపిసోడ్లతో కాలక్షేపం చేశారు. ఇక ఇప్పుడు సెకండాఫ్ లో మర్చిపోయిన ప్రధాన కథ మొదలవుతుంది. సీఎం ఒక ఎంపీతో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్ వేయించడం, అది ఇట్టే పాసవడం, పాసైన చట్టాన్ని అసెంబ్లీలో ఓటింగ్ కి పెట్టడం, ఓడిపోవడం మొదలైనవి.

      ప్రధాన కథ రైట్ టు రీకాల్ కి సంబంధించి పూర్తి స్థాయి కథ లేకపోవడం, సంఘటనలు లేక థ్రిల్, సస్పెన్స్ వంటివి లోపించడం, డైలాగులతోనే సీన్లు నడవడం, మొదలైన బలహీనతలతో రెండున్నర గంటల పాటూ చాంతాడులా సాగుతుంది.

***

        మమ్ముట్టి వైట్ డ్రెస్ లో సీఎం హూందాతనంతో బాగానే నటించాడు. కానీ ఆ హూందాతనం మాటున తప్పుడు పాత్రచిత్రణ ఇబ్బందిగా వుంటుంది చూడడానికి. సీఎం అంటే అతి భక్తి అమాయక టీనేజీ స్టూడెంట్ గా సనల్ పాత్రకి మాథ్యీవ్ థామస్ సరిపోయాడు. ప్రతిపక్ష నాయకుడుగా మురళీ గోపి మమ్ముట్టి కి దీటుగానే కన్పిస్తాడు. అయితే పూర్తి నిడివి పాత్ర కాదు. ఇక తక్కువ కంపించినా ఎక్కువ ప్రభావం చూపే నటి సనల్ అక్క పాత్రలో గాయత్రీ అరుణ్. ఈమెని తెలుగులోకి ఎవరైనా తీసుకోవచ్చు.గోపీ సుందర్ సంగీతంలో మమ్ముట్టి మీద ఒక పాట వుంటుంది. వైదీ సోమసుందరం ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వున్నాయి.


సికిందర్