రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, నవంబర్ 2021, గురువారం

1080 : సాంకేతికం


       రాజ రాజ చోర లో చూద్దాం : 1. ఇందులో ప్రారంభ దృశ్యాల్లో జెరాక్స్ సెంటర్లో పనిచేసే శ్రీవిష్ణు, 2. గర్ల్ ఫ్రెండ్ మేఘా ఆకాష్ ల మధ్య ఫోన్ సంభాషణ ముగిశాక, 3. శ్రీవిష్ణు ఒక గ్యారేజ్ కెళ్ళి, ఐటీ ప్రొఫెషనల్ లా డ్రెస్ మార్చుకుని, ఐటీ జాబ్ చేసే మేఘా ఆకాష్ ని కలుసుకోవడానికి బయల్దేరతాడు. అంటే జెరాక్స్ సెంటర్లో పని చేసే శ్రీ విష్ణు, మేఘా ఆకాష్ ని ఐటీ ప్రొఫెషనల్ గా నమ్మిస్తూ, అందుకు గ్యారేజీలో దాచి పెట్టిన డ్రెస్ వేసుకుని ఆమెని కలవడానికి వెళ్తున్నాడనీ ఈ మూడు సీన్లలో అర్ధం జేసుకోవాలి. వీటిలో ఏ సీను వ్యర్ధంగా వుంటూ బడ్జెట్ ని పెంచింది? వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్సు ని  డల్ గా మార్చింది?

        శ్రీవిష్ణు మేఘా ఆకాష్ తో ఫోన్లో మాట్లాడే 2వ సీను బడ్జెట్ కి, వ్యూయింగు ఎక్స్ పీరియెన్సుకీ భారంగా వుంది. ఈ సీన్ని స్క్రిప్టు ఆడిట్ లోనే కట్ చేసేయ్యొచ్చు. ఈ సీను, దీని తర్వాతి గ్యారేజి సీను చూస్తే ఎలాటి ఫీలింగు నిస్తున్నాయంటే, శ్రీవిష్ణు మేఘాతో ఫోన్లో మాట్లాడి వస్తున్నట్టు చెప్పి, గ్యారేజీకి వెళ్ళి, అక్కడ తాను ఐటీ ప్రొఫెషనల్ అన్నట్టు మేఘా ముందు నటించేందుకు, డ్రెస్ మార్చుకుని వెళ్తున్నాడు... అన్న స్పూన్ ఫీడింగ్ టైపులో డల్ ఫీలింగు నిస్తోంది.

        ఇది కూడా స్థలకాలాల ఐక్యతా సూత్రాన్నుపయోగించుకుని క్రాఫ్టింగ్ తో స్టోరీ మేకింగ్ చేయాల్సిన సందర్భం. కానీ స్టోరీ రైటింగే చేస్తూ ట్రీట్మెంట్ లో రాసుకున్నది ఎత్తి రాసిన డైలాగ్ వెర్షన్లా వుందిది. ఫైనల్ గా డైలాగు వెర్షనే షూటింగు స్క్రిప్ట్ అవుతుంది. తానొక రైటర్ గా ఫీలవకుండా, స్టోరీ మేకింగ్ చేసుకోవాల్సిన మేకర్, రైటర్ గానే  ఫీలవుతూ డైలాగు వెర్షన్ (షూటింగ్ స్క్రిప్టు) ఎలా రాసుకుంటే అలాగే షూటవుతుంది. తెరకెక్కుతుంది. ఎడిటింగులో కూడా సరిదిద్దడం కుదరదు.

        సాధారణంగా రివ్యూల్లో ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా వుండాల్సిందంటూ రాస్తూంటారు. మనం చెప్పుకుంటున్న మంచి రోజులొచ్చాయి’, రాజరాజ చోర లకి సంబంధించిన సీన్లలో వంటి ల్యాగ్ ని ఎడిటింగ్ లో సరిదిద్దడం కుదరదు. స్క్రిప్టుల్లోనే సరిదిద్దుకోవాలి. ఈ చిన్న విషయం ఎడిటర్లకి తెలీక కాదు. అసలు ఎడిటింగ్ లో సినిమా రన్ నే మార్చేసి, రెండు మూడు వెర్షన్లు దర్శకులకి చూపిస్తామంటారు మార్తాండ్ వెంకటేష్ వంటి ఎడిటర్లు. రాస్తున్నప్పుడు మేకర్ మేకర్ గా ఫీలైతే, విజువల్ సెన్స్ తో స్టోరీ మేకింగ్ చేసి, సంక్షిప్తీకరించి, ముచ్చటైన డైలాగు వెర్షన్ రాస్తాడు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ట్రీట్మెంట్లో ఓ మూడు సీన్లూ కలిపి రెండు సీన్లుగానో, ఒకే సీనుగానో మారిపోవడం యాదృచ్ఛికంగా జరిగిపోయే తంతుగా వుంటుంది.

        ఇప్పుడు ఇంటర్ కట్స్ తో శ్రీవిష్ణు మేఘాతో ఫోన్లో మాట్లాడే రెండో సీను, గ్యారేజీలో డ్రెస్ మార్చుకునే మూడో సీనూ విడివిడిగా వుండడం వల్ల, ఈ రెండు సీన్లలో కలిపి వున్న  విషయంలోని పంచ్ పంచ్ కాకుండా పోయింది. జోకుని రెండుగా విడదీసి ఇక్కడో ముక్క, అక్కడో ముక్క చెప్తే ఎలా వుంటుంది?

        సీన్ 2 లో మేఘాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ గా మనకి రివీలైంది. ఇలా రివీల్ చేసి ఏమీ జరక్కుండానే సీను ముగించేసి, సీన్ 3 లో అతను గ్యారేజీలో డ్రెస్ మార్చుకుంటున్నప్పడు, ఐటీ ప్రొఫెషనల్ గా మేఘాని నమ్మిస్తున్నాడని అర్ధమైనప్పుడు కూడా ఫన్ లేదు, పంచ్ లేదు. డ్రెస్ మార్చుకుని వెళ్ళాడంతే.

        సీన్ 2 ఎత్తేసి, జెరాక్స్ సెంటర్లో వున్న వాడు టైము చూసుకుని గ్యారేజీకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ వుంటే, ఎందుకా అని మనకి ఆసక్తి రేగుతుంది. ఇంతలో మేఘా నుంచి కాల్ వచ్చిందనుకుందాం, ఇప్పుడు ఇంటర్ కట్స్ లో ఆమె గర్ల్ ఫ్రెండ్ అని రివీలై, వాళ్ళ మాటల్లో ఆమె అమాయకత్వం, అతడి మోసం తెలుస్తూ, ఆమెని ఇటీ ఫ్రొఫెషనల్ లా నమ్మించడానికే డ్రెస్ మార్చుకుంటున్నాడని మనకి ఇప్పుడు అర్ధమవడంలో వున్న డ్రామా, డైనమిక్స్, థ్రిల్, ఫన్, పంచ్, చైతన్యం - విడివిడిగా వున్న రెండు సీన్లతో వున్నాయా? ఈ విడివిడి సీన్లు తగిన వీక్షణానుభవాన్నివ్వక పోగా, సీన్ 2 మీద అనవసర వ్యయాన్ని పట్టివ్వడం లేదూ?

2.   

స్టోరీ మేకింగ్ ట్రయాంగులర్ ఆట. స్టోరీ- మేకర్- ఆడియెన్స్ అనే ట్రయాంగిల్లో ఆట. ఇలా కాకుండా మేకర్ ఒక్కడే కూర్చుని స్టోరీయే ఆలోచిస్తూ, స్టోరీ చేసుకుపోతూంటే, అది సరళ రేఖ మీద సులభ ప్రయాణం. ఆ సరళ రేఖ మీద ఇటు చివర తను, అటు చివర స్టోరీ మాత్రమే వుంటాయి. సరళ రేఖ మీద తన కెదురుగా వున్న స్టోరీనే చూస్తూ, తన లోకంలో తోచినట్టూ స్టోరీ మేకింగ్ చేసుకుంటూ పోయీ బోరు కొట్టించే అవకాశముంటుంది.

                 ఎప్పుడైతే ఈ సరళ రేఖని వంచి త్రికోణంగా చేస్తామో, అప్పుడు మూడు మూల లేర్పడతాయి., మేకర్, స్టోరీ, ఆడియెన్స్. ఇప్పుడు మేకర్, స్టోరీ, ఆడియెన్స్  మూడు వైపులా వుంటారు. మేకర్ స్టోరీ వైపు చూసి తను ఫీలైంది ఆడియెన్స్ వైపూ చూసి ఆలోచిస్తాడు. దీనికి ఆడియెన్స్ రెస్పాన్స్, రియాక్షన్ ఎలా వుంటాయి, బుర్రకి పని చెప్పి బిజీగా ఈ సీన్ని చూస్తారా, ఎలా ఫీలౌతారు- మొదలైనవి. అంటే ఆడియెన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసే ఇంటరాక్టివ్ స్టోరీ మేకింగ్ అన్నమాట.    


       బడ్జెట్ ఆదాతో బాటు ఆడియెన్స్ కి గుర్తుండి పోయే వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్స్ నివ్వడం స్టోరీ మేకింగ్ ప్రధాన లక్ష్యంగా వుంటాయి. ట్రీట్మెంట్ నుంచి డైలాగ్ వెర్షన్ కెళ్ళే కీలక దశ దీనికి ప్రారంభం. ఓ కారు వచ్చి వచ్చి ఇంటి ముందాగింది - అని ట్రీట్మెంట్ లో మేకరే రాసుకున్నా, దీన్ని జల్లెడ పట్టి డైలాగు వెర్షన్ సవ్యంగా రాసుకోవాల్సి వుంటుంది. ఈ రోజు కొందరు మేకర్లు, కాబోయే మేకర్లు, అసిస్టెంట్లు నిన్నటి వ్యాసానికి రెస్పాండ్ అవుతూ ఫోన్లు చేశారు. తామూహించని స్క్రిప్టు రైటింగ్ టెక్నిక్స్ కొత్తగా చెప్పినందుకు బ్లాగుకి కృతజ్ఞతలు తెలుపుతూ. వీలైనంత నాలెడ్జిని వైరల్ చేయడమే ఈ బ్లాగు పని. ఇది ఎన్నాళ్ళుగానో రాయాలనుకుంటున్న వ్యాసం. అయితే సిట్టింగ్స్ లో ఈ కాన్సెప్ట్ ని అమలు పర్చడం జరుగుతూనే వుంది- స్క్రీన్ ప్లే సెట్టింగ్ వర్క్స్ లో.

3.
       
          ఓ కారు వచ్చి వచ్చి ఇంటి ముందాగింది - అని ట్రీట్మెంట్ లో మేకర్ రాసుకున్నాడనుకుందాం. అంత సెటప్ కి, షూట్ కీ డబ్బు పెట్టుకోలేను... దీంతో కథకీ, క్యారక్టర్ కీ ఉపయోగం లేదని నాలెడ్జి వున్న నిర్మాత అన్నాడనుకుందాం. అప్పుడు సమయస్ఫూర్తి గల మేకర్ ఏం చేస్తాడు? కారుని ఇంటి ముందే పెట్టి, క్యారక్టర్ని కారులోంచి దింపుతాడు. సరిపోతుంది. దీనివల్ల కథకీ, క్యారక్టర్ కీ, నిర్మాతకీ నష్టమేం లేదు. పైగా స్క్రిప్టు స్పీడు పెరుగుతుంది. ఎక్కడ్నించో దిక్కుమాలిన కారు వచ్చీ వచ్చీ, వస్తూనే.... వున్న ల్యాగ్ - సాగతీత వుండదు.

        ఒక కోళ్ళ వ్యాను వెళ్ళీ వెళ్ళీ స్తంభానికి ఓ గుద్ది, కోళ్ళు చెల్లాచెదురైన, రక్తసిక్తమైన సీనుకి బడ్జెట్ కోత వేసి ఏం చేయవచ్చు? ఇక్కడ బిగ్  బడ్జెట్ స్టార్ సినిమాల గురించి కాదు మాట్లాడుకోవడం. వాటిలో కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీను ఎంత బీభత్సంగా నైనా తీయొచ్చు. ఈ సినిమాలెన్ని వుంటాయి - ఇవి ఏడాదికి పది వుంటే మిగిలిన మీడియం, స్మాల్ వంద పైనే వుంటాయి. వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. వీటికి బడ్జెట్ సేవింగ్ చాలా అవసరం. ఇక్కడ కోళ్ళ వ్యాను సీనుకి క్రాఫ్టింగ్ చేసి- వస్తున్న వ్యాను స్తంభానికి గుద్దింది చూపించి కట్ చేసేస్తే సస్పెన్స్ కూడా వుంటుంది. కట్ చేశాక, రోడ్డు పక్క కూర్చుని మూల్గుతున్న డ్రైవర్ కి, సెల్ ఫోన్లో యాక్సిడెంట్ ఫోటో చూపిస్తూంటాడు ఒకడు. వాడి చేతిలో రెండు చచ్చిన కోళ్ళుంటాయి రక్తం కారుతూ. ఇలా అంచెలంచెలుగా యాక్సిడెంట్ సీన్ ని రివీల్ చేస్తూ పోతే, టెన్షన్ కూడా పెరుగుతుంది.

        మన అభిమాన థ్రిల్లర్ నవలా రచయిత లీ చైల్డ్ వున్నాడు. అతను సృష్టించిన జాక్ రీచర్ యాక్షన్ క్యారక్టర్ చాలా పాపులర్. హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. అతను నవలల్లోనే సినిమా చూపిస్తాడు. విజువల్ గా రాస్తాడు. ఒక రకంగా నవలలకి స్టోరీ మేకింగ్ చేస్తాడు. యాక్షన్ని స్లో చేసి డ్రామా పెంచుతాడు. డై ట్రయింగ్ నవల్లో యాక్షన్ని విజువలైజ్ చేస్తూ స్లో యాక్షన్- హై డ్రామా ఎలా క్రియేట్ చేశాడో చూద్దాం...

        జాక్ రీచర్ గురి చూసి గన్ పేల్చాడు. మరుక్షణం గన్ బ్యారెల్లోంచి వేడి వేడి పొగ బయటికి ఎగజిమ్మింది. బుల్లెట్లోని గన్ పౌడర్ సెకనులో మిలియన్ వంతు కంటే తక్కువ కాలంలో విస్ఫోటించడంతో, ఆ మండిపోతున్న పొగ బుడగలా విప్పారింది.   
    
        బుడగలా విప్పారిన పొగని తిరిగి బ్యారెల్ గుంజేసుకుని, బ్యారెల్లోపల గ్రూవ్స్ రాపిడికి గిర్రున తిరుగుతున్న బుల్లెట్ వెనుకా, చుట్టూ పొగ కమ్మేసేలా చేసి, ఆ రాపిడికి బుల్లెట్ ఎగదన్ని బయటి వాతావరణంలోకి దూసుకు పోయేలా చేసింది బ్యారెల్.

        బయటికి వెళ్ళిన పొగ బుడగ వాతావరణాన్నిచర్రున వేడెక్కించేసింది...బుల్లెట్ కి ముందు దూసుకుపోతున్న వేడివేడి పొగ, గాలిలోని ఆక్సిజన్ ని వేడెక్కించేసి మంట రేగే స్థాయికి తీసికెళ్ళింది. ఆ మంటలో మెరుపు. బుల్లెట్ పొగలోంచి బయటికి దూసుకొచ్చేసింది. మండుతున్న గాల్లోంచి గంటకి 1900 మైళ్ళ వేగంతో.

        సెకనులో వెయ్యో వంతు కాలం తర్వాత, బుల్లెట్ ఇంకో మూడు గజాల దూరంలో వుంది. ఇంకో సెకనులో వెయ్యో వంతు కాలంలో, ఆరడుగుల దూరంలో వుంది. ఇక రొద చేసుకుంటూ టార్గెట్ ని తాకబోతోంది బుల్లెట్...  

        ఇదీ లీచైల్డ్ యాక్షన్ విజువలైజేషన్. అతను చెప్పడం లేదు, చూపిస్తున్నాడు. ఇలా సినిమాల్లో చూపించాలంటే సీజీకి సమర్పించుకోవాలిగా లక్షలకి లక్షలు అన్పించొచ్చు. స్టార్ సినిమాలకి సీజీకి సీజీన్నర పెట్టుకోగలరు. ఇతర సినిమాలకి దీన్లోని అర్ధాన్ని చూడాలి. కవి హృదయాన్ని చూడాలి. ఏం తేల్చి చెప్తున్నాడు లీ చైడ్? స్లో యాక్షన్ - హై డ్రామా గా లేదూ పై సీను? ఇంతకీ ఆ బుల్లెట్ ఎవరికైనా తగిలిందా లేదా చెప్పడానికి ఇంత సస్పెన్స్ లో ముంచెత్తడమన్న మాట.

        పైన చెప్పుకున్న కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీనులోనూ ఇంతే. కోళ్ళ వ్యాను స్తంభానికి గుద్దుకున్నాక ఏమైంది? మూల్గుతూ రోడ్డు పక్కన కూర్చుని వున్నాడు డ్రైవర్. వ్యాను కేమైంది? ముందు భాగం నజ్జయినట్టు సెల్ ఫోన్లో  ఫోటోలు చూపిస్తున్నాడొకడు.  మరి కోళ్ళు ఏమయ్యాయి? అవి చచ్చినట్టు మచ్చుకి రెండు చచ్చిన కోళ్ళు చూపిస్తున్నాడు వాడు... లో బడ్జెట్లో స్లో యాక్షన్ -హై డ్రామా!
(ముగింపు శనివారం)

—సికిందర్