రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, July 27, 2021

1051 : సందేహాలు- సమాధానాలు

 Q : ఈ రోజుల్లో సినిమా కథ ముగింపు ఎలా వుండాలి? ఈ మధ్య మొదలైన రియలిస్టిక్ సినిమాల ట్రెండ్ లో రియలిస్టిక్ ముగింపుల పేరుతో శాడ్ ముగింపులు ఇవ్వడం రొటీన్ అయినట్టు అన్పిస్తోంది. మారిన కాలాన్ని బట్టి  ప్రేక్షకులు దీన్ని ఇష్టపడుతున్నారంటారా?
నాగరాజు, అసోసియేట్

A : బ్యాక్ టు బ్యాక్ రెండు కోవిడ్ అనుభవాలతో ప్రజలు తీవ్ర ఆరోగ్య, ఆర్ధిక ఉద్రిక్తతల నడుమ జీవిస్తున్నారు. కాబట్టి నిర్మొహమాటంగా చెప్పాలంటే హేపీ ఎండింగు లిచ్చుకోవడం బెటర్. సినిమా అంతా రియలిస్టిక్ వాస్తవికతలతో గంభీరంగా నడిచాక, ముగింపు కూడా భారంగా వుంటే ద్వంద్వాల పోషణ (డైనమిక్స్) దెబ్బతింటుంది. గంభీర కథ చివరికి రిలీఫ్ నివ్వాలి. అలాగని డైనమిక్స్ కోసమని కామెడీలు, రోమాంటిక్ కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలు, ఫాంటసీలు, సస్పెన్సు, మిస్టరీ, థ్రిల్లర్స్ మొదలైన హాస్య, అద్భుత రస ప్రధాన జానర్స్ కి శాడ్ ముగింపులిస్తే బెడిసికొడుతుంది.

        రియలిస్టిక్ సినిమాలకి శాడ్ ముగింపులిచ్చినా, పాత్ర అనుభవించే ఆ పరిస్థితి, మనకెక్కడో మన జీవితంలో అనుభవమైనట్టు వున్నట్టయితే, అది వర్కౌట్ అవుతుంది. ఆ ముగింపు మనల్ని సంస్కరించ వచ్చు. మన అవగాహనని విశాలం చేయవచ్చు. ఉదాహరణకి, హాలాహల్ లో క్రిమినల్సే గెలుస్తారు. పోలీసు అయిన హీరో బలై పోతాడు. ఫార్ములా సినిమాలు చూపించే వాటికి భిన్నంగా వాస్తవంలో వ్యవస్థ ఎలా పని చేస్తుందో చూపించి మన అవగాహనని పెంచడానికిది తోడ్పడుతుంది. పోతే, హేపీ ఎండింగ్స్, శాడ్ ముగింపులు – అనే చట్రంలోనే ఆలోచించకుండా, రాడికల్ ముగింపు అనే సజాతి ముగింపు అనేదొకటి కూడా రియలిస్టిక్స్ కుంటుందని గమనించాలి.

        ముగింపు చూస్తే అది మనసుని దొలిచేసేలా వుండాలంటే, ముగింపు రాశాక, దాన్ని బట్టి ప్రారంభాన్ని మార్చుకోవాలి. ముగింపు చూసిన ప్రేక్షకులు వెనక్కి వెళ్ళి ప్రారంభాన్ని మళ్ళీ చూసేలా వుండాలి. అలా చూసినప్పుడు ముగింపు ఫ్రేములు, ప్రారంభ ఫ్రేములు మ్యాచింగ్ ఫ్రేములుగా వుంటే, ప్రేక్షకులు లోనయ్యే కిక్కే వేరు. ఈ కింది వీడియో చూడండి.

సికిందర్