రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జులై 2016, గురువారం

సాంకేతికం!     ఎనభై  శాతం మేకప్, 20 శాతం మేమూ కలిస్తే ఒక నటుడు పుడతాడు- అని దిలీప్ కుమార్ కామెంట్. మహా నటులెప్పుడడూ  మేకప్ లాంటి ప్రాచీన కళని చిన్న చూపు చూడరు. అయితే ఒకప్పుడు వేసుకున్న మేకప్ ని సెట్లో అనుక్షణం కాపాడుకుంటూ రావడం ఎంత కష్టంగా వుండేదో  అనుభవిస్తే గానీ తెలీదు. మేకప్ మెటీరియల్ నానాటికీ పరిస్థితులకి తట్టుకునే పటుత్వంతో అందుబాటు లోకి రావడం మేకప్ మాన్ పనిని సులువు చేస్తోందన్నది నిజమే. ఇప్పుడు ప్రాస్మెటిక్ మేకప్ లేదా మేకప్ ఎఫెక్స్ గా కొత్త పుంతలు తొక్కుతున్న మేకప్ కళతో నటీనటుల రూపురేఖల్ని ఏకంగా మార్చేసే మాస్కులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో వేసుకున్న మేకప్ ని  సెట్లో కాపాడుకోవడం పెద్ద సమస్య కావడం లేదు. రెయిన్ ఎఫెక్ట్ లోనే మేకప్ ని చెక్కు చెదరకుండా వుంచగల మెటీరియల్ ఇప్పడు మరింత అభివృద్ధి  చెందినపుడు,  మేకప్ ఆర్టిస్టులకి అంత శ్రమగా  లేదని అంటున్నారు మేకప్  చీఫ్ మల్లెమూడి ఈశ్వర్. 


          యాక్షన్ దృశ్యాల్లో ముష్టి ఘాతాలు, రక్తసిక్త గాయాలూ ఇప్పుడు ఇట్టే సృష్టించెయ్యగలమని చెబుతూ, అండర్ వాటర్ దృశ్యాల విషయానికొస్తే  పెద్దగా మేకప్ అవసరం లేదనీ, అదెవరూ పట్టించుకోరనీ వివరించారు. పౌరాణిక, జానపద, చారిత్రక సినిమాల నాటికంటే ఇప్పుడొస్తున్న సినిమాల్లో మేకప్ నామ మాత్రంగా వుంటోందనీ, అయితే ఈ సినిమాలతో కూడా పేరు తెచ్చుకోవాలంటే యాక్షన్ దృశ్యాల్లో బాగా కష్టపడి పని చేయడమే మార్గమన్నారు ఈశ్వర్. 

          ‘పేరెందుకొస్తుంది? అసలు మేకప్ మాన్ ని ఎవరు గుర్తిస్తున్నారు? టెర్రిఫిక్ గా ఎంత ఫాంటసీ రూపాల సృష్టి చేసినా మేకప్ అదిరింది అనే ప్రేక్షకులే లేరు- గ్రాఫిక్స్ అదరగొట్టాయి  గురూ అనే ప్రేక్షకులు తప్ప!’ అని  బాధపడ్డారు.   
మేకప్ మాన్ ని ఎవరు గుర్తించినా గుర్తించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. ప్రతీ ఏటా టీవీ- నాటక- సినిమా రంగాలకి చెందిన మేకప్ ఆర్టిస్టులని ప్రభుత్వం నంది అవార్డులతో సత్కరించడం అపూర్వ విషయమన్నారు. తెర వెనుక వుండిపోతున్న మేకప్ ఆర్టిస్టులని ప్రముఖుల సమక్షంలో స్టేజి ఎక్కించి సన్మానించడం గొప్ప విషయమన్నారు. 

        అన్నట్టు ఈశ్వర్ నాటకాలతో మొదలై టీవీ సీరియళ్ళ మీదుగా సినిమాల్లో కొచ్చారు.  ‘పల్నాటి భారతం’ అనే నాటకానికి నంది అవార్డు  కూడా తీసుకున్నారు. తెలుగులో మొట్ట మొదటి డైలీ సీరియల్ ‘రుతురాగాలు’ కి మేకప్ మాన్ గా తనే పనిచేశారు. ఇప్పటికీ ‘నీలంపాటి అమ్మవారి చరిత్ర’, ‘చంద్ర వంశం’, ‘ఆకాశ గంగ’ లాంటి పౌరాణిక సీరియల్స్ కి పని చేస్తున్నారు. తమిళ దర్శకుడు కన్మణి  సినిమాలన్నిటికీ ఈయనే  మేకప్ మాన్. ఐతే తన  కెరీర్ లో మొట్ట మొదట సినిమాకి పనిచేసింది 2003లో నగేష్ కుకునూర్ హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో తీసిన ‘తీన్ దీవారే’  అనే హిందీకి. ఇందులో నసీరుద్దీన్ షాకి, గుల్షన్ గ్రోవర్ కీ మేకప్ చేశారు ఈశ్వర్. నాటి నుంచి మొత్తం వందకి పైగా సినిమాలకి పనిచేసిన ఈశ్వర్,  అల్లు  అర్జున్ నటించిన ‘బద్రీనాథ్’ కి మేకప్ మాన్ గైర్హాజరీలో తను వెళ్లి పని చేశారు. 1988 నాటి నుంచీ మేకప్ వృత్తినే నమ్ముకుని కొనసాగుతున్నారు 

       ఎక్కువగా స్పెషల్  గెటప్స్ వేయాలని తనకి ఆసక్తి అన్నారు.  కానీ తెలుగులో అలాటి మేకప్ కి అవకాశమిచ్చే సినిమాలు రావడం లేదనీ, హాలీవుడ్ నుంచి వారానికొకటి చొప్పున దిగుమతి అవుతున్నాయనీ, అలాగే బాలీవుడ్ నుంచీ మేకప్ ఆర్టిస్టులు మన దగ్గర కొచ్చి హడావిడి చేస్తున్నారనీ వివరించారు. మళ్ళీ బాలీవుడ్ లో హాలీవుడ్ మేకప్ నిపుణుల బెడద కూడా వుందనీ, వీళ్ళకి రెండు మూడు కోట్లు ఇచ్చి రప్పించుకుంటున్న నిర్మాతలు – మన మేకప్ మాన్ లకి అందులో పదో వంతు కూడా ఇవ్వరనీ  విచారం వ్యక్తం చేశారు. ఏడాదంతా కష్టపడితే ఒక బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు 18 – 20 లక్షలకి మించి సంపాదించ లేడనీ, అదే తెలుగు మేకప్ మాన్ లైతే  ఇది కూడా సంపాదించలేరనీ  బాధగా అన్నారు.
          గుంటూరుకి చెందిన ఈశ్వర్,  ఈటీవీ మురళి దగ్గర శిష్యరికం చేసి అటుపైన మేకప్ చీఫ్ గా ఎదిగారు. పౌరాణిక సీరియల్స్ కి ఎక్కువ పని  చేసిన అనుభవంతో ఒకటే చెప్పారు- ఇందులో గుర్తింపు ఎక్కువ వస్తుందని. అయితే పురాణ పాత్రల్లో  నటించే వాళ్ళకి కళ్ళు పెద్దవిగా వుండాలన్నారు. కళ్ళని ఎక్కువ  హైలైట్ చేస్తామనీ, కనురెప్పలకి హెవీ మేకప్ వేస్తామనీ వివరించారు. సీరియల్స్ కీ, సినిమాలకీ  ముఖ్యంగా బడ్జెట్స్  ని దృష్టిలో పెట్టుకుని వేర్వేరుగా మేకప్ చేస్తామన్నారు. ఇప్పుడు సినిమాలకి డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, రెడ్ కెమెరా  వాడుతున్నారు- దీనితోనూ, సాంప్రదాయ ఎనలాగ్ కెమెరాలతోనూ మేకప్ పరంగా మార్పులేవీ లేవనీ, ఒకే మెటీరియల్ ని వాడుతున్నమనీ చెప్పారు ఈశ్వర్.


-సికిందర్
(మే 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక)