రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, జులై 2017, బుధవారం

డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -5

     
హాలీవుడ్ స్క్రిప్టుల్లో డైలాగులు, వాటితో తీసిన సినిమాల్లో డైలాగులూ మారకుండా ఒకలాగే వుంటాయి. స్క్రిప్టుల్లో వున్నదే అక్షరం ముక్క మార్చకుండా  ఆర్టిస్టులు పలుకుతారు. అందుకే ఎంత పురాతనమైనా సరే ఆ స్క్రిప్టుల్ని  డౌన్ లోడ్స్ కి అందుబాటులో వుంచ గల్గుతున్నారు. 1942  లో తీసిన ‘కాసాబ్లాంకా’ స్క్రిప్టు కూడా అచ్చంగా తీసిన సినిమాకి ట్రూ కాపీ అన్న నమ్మకంతో చదువుకోగల్గుతున్నాం. అరుదుగా  స్క్రిప్టుల్లో వున్న భాగం సినిమాలో వుండకపోవచ్చు. దాన్ని ఎడిటింగ్ లో తొలగించి వుండ వచ్చు. అయినా స్క్రిప్టులో ముందు వెనుకల డైలాగులు మ్యాచ్ అయ్యేలా ఎడిట్ చేయడాన్నిగమనించవచ్చు. ఇండియన్ స్క్రిప్టులతో ఇలా వుండదు. రాయడం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ షూటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ ల వరకూ డైలాగులతో  స్ట్రగుల్ చేస్తూనే వుంటారు. ఇంత స్ట్రగుల్ చేస్తున్నా 90 శాతం ఫ్లాప్సే వస్తున్నాయంటే ఆ స్ట్రగుల్ కరక్టేనా అని ప్రశ్నించుకోవడం జరగడం లేదు.
         
         లొకేషన్లో తిరగరాయడం, మార్చడం, కొట్టేయడం, మళ్ళీ ఆర్టిస్టుల  దగ్గరి కెళ్ళే సరికి వాళ్ళు పలకడానికి అనువుగా మార్చుకోవడం, తీరా డబ్బింగులో డబ్బింగ్ ఆర్టిస్టులకి  ఇబ్బంది కలిగి పదాలు ఇలా మారుస్తామనడం...ఇలా ఇంత చేసిన డైలాగులు ఎడిటింగ్ లో  కట్ అయిపోవడం...ఇదీ ఇండియన్ స్క్రిప్టుల సీన్. ఇందుకే ఇవి చదువుకోవడానికి అందుబాటులో వుండవు. ఆ ‘చిత్తు’ కాగితాలన్నీ ఎటుపోతాయో తెలీదు. ‘సార్, మీరు సూపర్ హిట్ సినిమా తీశారు కదా, ఆ డైలాగ్ వెర్షన్ నేను చదవాలనుకుంటున్నానండీ, కాస్త ఇస్తారా?’  అంటే తెల్లమొహం వేస్తారు. ‘పోనీ ట్రీట్ మెంట్ కాపీ ఇస్తారా?’ అంటే కూడా తెల్లమొహమే. ‘వన్ లైన్ ఆర్డర్?’ సేం టు సేం సెల్ఫీ. 

           ఒక డైలాగు అనేది బయటి నుంచి పుట్టదు. ఎవరో వచ్చి ఈ డైలాగు ఇలా మారుస్తానంటేనో, అసలు లేకుండా తీసేస్తానంటేనో కుదరదు. డైలాగులు కథలోంచి పుడతాయి. కథల్ని పుట్టించిన వాళ్ళే డైలాగుల్ని పుట్టించగలరు. ఉదాహరణకి నిన్న వివరించుకున్న ‘బ్లడ్ సింపుల్’ 7 వ సీనులో,  ‘నో, ఆమె చాలా కాస్ట్లీ గుంట...’ అనుకుని, ‘నేను రీఫండ్ ఇస్తా, అదింకెవర్ని పిండుకుంటోందో చెప్పు’ – అని మార్టీ అనడం వుంది. పిండుకోవడ మనేది స్క్రిప్టులో రాసిన  sluicing కి బూతు అర్ధం వచ్చే మాట. ఇక్కడ ఇంత బూతు వద్దు, కొంచెం తగ్గించి, ‘ఇంకెవరితో తిరుగుతోందో చెప్పు’ అని ఇంకెవరో మార్చేస్తే ఈ డైలాగు విలువ లేకుండా, టెన్షన్ పుట్టించకుండా, జానర్ లోలేకుండా, సాదాగా మారిపోయి, పాత్ర కిల్ అయిపోతుంది. మార్టీ  ఈ సీనుకొచ్చేసరికి స్ట్రాంగ్ ఎమోషన్ తో వున్నాడు (క్యారక్టర్ ఆర్క్), కాబట్టి ఇంకా పచ్చి బూతులు కూడా మాట్లాడి అక్కసు వెళ్ళగక్కుకోగలడు. ఎవరూ ఆపలేరు. కథ ప్రోగ్రెస్ అవుతూ అందులోంచి కథకుడికి పాత్రతో వచ్చేసిన డైలాగు అది. 

      రెండో దేమిటంటే, డార్క్ మూవీస్ జానర్ లో డైలాగులు పచ్చిగానే వుంటాయి. ‘ఇంకెవరితో తిరుగుతోందో చెప్పు’ గా  మార్చాలనుకున్నప్పుడు, ఈ కథని ప్రేమ కథగానో, ఫ్యామిలీ కథగానో మార్చుకుని, తమ సంతృప్తికోసం సంసారపక్షంగా రాసుకోవచ్చు. 

            అలాగే,  ఆమె కాస్ట్లీ గుంట అని ఎందుకనుకున్నాడూ...అర్ధం లేదు అని ఇంకెవరో కొట్టేస్తే, మొత్తం సీన్ అంతా కుప్పకూలుతుంది!  మార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటూ పలికిన ఈ చిన్న డైలాగే భార్య ఎబ్బీ ని నెగెటివ్ నుంచి పాజిటివ్ గా ఎస్టాబ్లిష్ చేసే దిశగా డ్రైవ్ చేస్తోంది. ఈ అంతర్నిర్మాణం బయటికి వ్యక్తులకి అర్ధం గాదు. వెండి తెర మీద ఫీలయ్యాకే అర్ధమవుతుంది.  అయితే సినిమాలు చూసే ఏ రచయితైనా, దర్శకుడైనా అంతర్నిర్మాణమే చూడాలి. సామాన్య ప్రేక్షకుల్లాగా చూస్తే  సినిమాలు రాయనవసరంలేదు, తీయనవసరం లేదు...

            కనీసం డార్క్ మూవీస్ విషయంలో కథలోంచి పుట్టిన సీన్స్ ని, డైలాగ్స్ నీ మార్చకుండా చివరివరకూ కాపాడాలనుకుంటేనే డార్క్ మూవీస్ తీయాలి. స్క్రిప్టుతో స్ట్రగుల్ చేయడం మానెయ్యాలి. దాదాపు డార్క్ మూవీస్ చిత్రీకరణ అంతా స్క్రిప్టు లోనే నిర్ణయమై పోతుంది. ఒక ఎలిమెంట్ నేపధ్యంగా చూపిస్తూ సెట్లో డైలాగుల్ని ఇంకోలా మార్చేయడం మూర్ఖత్వ మవుతుంది. డైలాగులతో పాత్ర, ఎలిమెంట్స్  సంతృప్తి పడాలేగానీ మరొకరు / మరొకటి కాదు.  తెలుగులో అన్ని రకాల జానర్స్ నీ ఒకే గాటన కట్టి ఒకే రకమైన టెంప్లెట్ డైలాగులు అలవాటు చొప్పున రాసేయడం కూడా వుంది. ఈ సోమరితనం, కళా విహీనత ఇక్కడ పనిచెయ్యవు. డార్క్ మూవీ అనేది ఒక కళ. ఆర్టు సినిమాలు వసూలు చేయని కలెక్షన్స్ ని రాబట్టుకునే కమర్షియలార్ట్! 

            నిన్న 7వ సీను ప్రారంభ ముగింపులు ఏమర్ధమయ్యాయి? డార్క్ మూవీస్ సామాన్య ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూనే, అభిజ్ఞుల్ని పారవశ్యుల్ని చేస్తాయి. రెండంచుల కత్తి. ఈ విరుపులు ప్రతీ సీనులో చూస్తున్నాం. అలాగే ప్రారంభమైన ఏడవ సీను ముగింపుకొచ్చేసరికి ఉల్టాపల్టా అయిపోయింది!

            ప్రారంభంలో సీనులోకి వస్తున్న రే ని చూస్తే ఎవగిపు కలుగుతుంది- ఇంకా సిగ్గులేకుండా వస్తున్నాడని. అలాగే ఈ నేపధ్యంలో ఎబ్బీ పట్లకూడా ఏవగింపే మనకి. మార్టీ పట్ల సానుభూతి. సీను ముగింపు కొచ్చేసరికి రే, ఎబ్బీలకి సానుభూతి దక్కుతూ, మార్టీ ఏవగింపుగా మిగిలాడు! కథలో కథకి కావాల్సిన హీరో హీరోయిన్లు ఎస్టాబ్లిష్ అయిపోయారు. కథలో ప్రత్యర్ధి ఎవరో స్పష్టత వచ్చేసింది. ఈ ప్రత్యర్ధికి (మార్టీకి) ఇంకో ప్రత్యర్ధి (విస్సర్) వున్నాడు ఎక్కడో. ఈ ముగింపు కథ ముందుకు  సాగేందుకు ఇంధనాన్నికూడా  సమకూర్చేసింది.
***
            సీన్ 8. మార్టీ ఇంటి కెళ్ళకుండా బార్లోనే వుండి పోవడం, రే ని రానివ్వద్దని బార్ టెండర్ కి చెప్పడం.
         సీలింగ్ ఫ్యాన్ క్లోజ్ షాట్ వేస్తూ సీను రాశారు కోయెన్ బ్రదర్స్. ఈ ఫ్యాను గాలి శబ్దం మాత్రమే వస్తున్నట్టు  రాశారు. సీలింగ్ ఫ్యాన్ దగ్గర్నుంచి టిల్ట్ డౌన్ చేసి ఫ్రేమ్  చేస్తే, డెస్క్ చెయిర్ లో టిల్ట్ బ్యాక్ అయివుండి  సీలింగ్ ఫ్యానుకేసే చూస్తున్న మార్టీ కన్పిస్తాడని వివరం రాశారు.

            సీను చిత్రీకరణ ఇలాగే  వుంది. ఇందాక వెనక సీన్లో మార్టీ మనసులో చెత్త అనుకున్న దంతా భగభగ మండుతున్న ఫర్నేస్ లో వేసిన అర్ధంలో చూపించారు. ఇప్పుడు గాలి ఆడే ఫ్యానుకింద కూర్చుని దాన్నే చూస్తున్నాడు. రే మీద కూడా కేక లేయడంతో గుండె మంట చల్లారుతోంది. 

            ఇప్పుడు వెనక డోర్ దగ్గర బార్ టెండర్ మారీస్ వచ్చి పలకరిస్తాడు. ఇప్పుడు ఈ రూం వైడ్ షాట్ రాశారు. డోర్ దగ్గర నిలబడి వుంటాడు మారీస్, అవతల బార్లో జనం లేకపోవడం, దెబ్రా ఒక్కతే  కూర్చుని వుండడం కన్పిస్తూంటాయి. ఇలా ఎందుకు రాసి, ఇలాగే  ఎందుకు తీశారు? చూద్దాం. 

            అలా చెయిర్ లో పడి వున్న మార్టీ ని చూసి- చచ్చి పోయా వనుకున్నా, ఇంటి కెళ్తావా? – అంటాడు బార్ టెండర్ మారీస్.  ఇక్కడే ఈ నరకంలోనే వుంటానంటాడు మార్టీ.  చాలా శ్యాడ్ పాయింటాఫ్ వ్యూ నీది – అంటాడు మారీస్. అతను వెళ్ళబోతూంటే, మార్టీ అంటాడు- వాడు బార్ కి రాకూడదనీ, తన డబ్బు ముట్టుకో కూడదనీ. 

            ఇంకోలా ఈ సీనుని ఎలా తీస్తారు? మార్టీ ఒంటరిగా కూర్చుని వుంటాడు. సమయమెంతో తెలియడం లేదు. బార్ మూసే వేళయిపోయి కూడా అతనలాగే కూర్చున్నాడని తెలియాలంటే ఏం చేయాలి? మార్టీ వచ్చి, ‘బాస్, బార్ క్లోజ్ చేసే టైం అయింది’ అని చెప్పాలా?  అలా ఈ గది వరకూ ఇద్దర్ని మాత్రమే సీను చూపించి, అదీ ఒకే షాట్ లో  చుట్టేస్తే సరిపోతుందా? 

            అప్పుడిది నాటకం అవుతుంది. నాటకంలో చెప్తేనే విషయం  అర్ధమవుతుంది. సినిమాలో చూపిస్తే అర్ధమైపోతుంది. చెప్పినంత సమయం కూడా పట్టదు. మారీస్ వచ్చి డోర్ దగ్గర నిలబడతాడు. డోర్ లోంచి అవతల బార్ కూడా మూతబడి, దెబ్రా ఒక్కతే ఎదురు చూస్తున్నట్టు ఒక షాట్ వేసి తీసేశారు- అంతే, ఎంత రాత్రి గడిచిపోయిందో తెలిసిపోతోంది! 

            ఇక మారీస్ తో మార్టీ రేని రానివ్వద్దని మళ్ళీ ఎందుకన్నాడు? కిందటి సీన్లోనే వస్తే షూట్ చేస్తానని రే కి వార్నింగ్ ఇచ్చాడే? అది ప్రేలాపనలా మనకి అన్పించిందే?

            అది ప్రేలాపనే అని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే,  గత సీన్లో మార్టీ మాటల్ని బట్టి అతడి టార్గెట్  రే కాదని అర్ధమైంది. అందుకే,  నువ్వు కాకపోతే ఇంకోడితో పడుకుంటుంది- అన్నాడు. ఆమెతో ఎవరు పడుకుందన్నది ముఖ్యం కాదు, ఆమె పడుకోవడమే ఇష్యూ, బాధ, సమస్య, కసీ. కాబట్టి తన టార్గెట్ ఆమె తప్ప ఆమె ప్రియుళ్ళు కాదు. ఆమేనేం చేయాలో అది చేస్తే ప్రియుళ్ళే వుండరు కదా?  అందుకే షూట్ చేస్తానన్న రే కి సడలింపు ఇచ్చి వాణ్ణి  బార్ కి రానివ్వద్దన్నాడు ఇప్పుడు. తన డబ్బు ముట్టుకోనివ్వద్దన్నాడు-వాడు ముట్టుకుంటే అది భార్యకి పోయినట్టే కాబట్టి.

            మార్టీ పక్కనే టేబుల్ మీద కంప్యూటర్ వుంటుంది. దాని స్క్రీన్ మీద గ్రీన్ కలర్ లో లెటర్స్ కదులుతూంటాయి. రే గురించి అతను  చివరి డైలాగు చెప్తున్నప్పుడు కూడా కంప్యూటర్ వ్యూలో వుంటుంది. రే కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టే వుంటుంది. ఇది స్క్రిప్టులో రాయలేదు. చిత్రీకరణలో వుంది. పైన చెప్పిన చివరి డైలాగు తర్వత సీనుని ఇంకా పొడిగించి రాశారు గానీ అది చిత్రీకరణలో లేదు.
***
9. రే తో వుంటున్న ఎబ్బీ  అతను మూడీగా వుండడం చూసి వేరే పడుకోవడం   రే కారాపుకుని జారగిలబడి కూర్చుని తన ఇంటి కేసే చూస్తూంటాడు. ఇంట్లో ఓ రెండు లైట్లు వెలుగుతూంటాయి. ఇంట్లో ఫోన్ రింగవుతున్న శబ్దం లీలగా విన్పిస్తూంటుంది. చాలా సేపు రింగవుతూనే వుంటుంది... అని రాశారు.                     చిత్రీకరణ మరింత అర్ధవంతంగా మారింది. కార్లో కూర్చుని ఎదురుగా చూస్తూంటాడు రే. అద్దంలోంచి అవతల దృశ్యం బ్లర్ చేసి వుంటుంది. ఒక యాంబర్ కలర్ లైటు హైలైట్ గా వుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ లో వుండే యాంబర్ లైటులాగా అన్నమాట. ఫోన్ రింగవుతుంది. కట్ చేస్తే ఇంట్లో ఎబ్బీ సందేహిస్తూ ఫోన్ తీస్తుంది. 

            అంటే ఇది రే ఇల్లన్న మాట. మార్టీ తో క్లాసు పీకించుకుని వచ్చేసిన రే ఇంట్లోకి వెళ్ళ బుద్ధి గాక బయటే కూర్చున్నాడు. మార్టీ మామూలు అనుమానపు  బీజాలు నాట లేదు ఎబ్బీ గురించి...రే డౌట్ లో పడ్డాడు, ఈమెతో వుండాలా వద్దా అని. సిగ్నల్ లో యాంబర్ తర్వాత రెడ్ అయినా పడుతుంది, గ్రీన్ అయినా పడుతుంది. అవతల మార్టీ గ్రీన్ సిగ్నలిచ్చేసినా, ఎబ్బీతో ఏ సిగ్నలో తేల్చుకోలేక పోతున్నాడు రే.

            ఇంట్లో రింగవుతున్న ఫోన్ ని చూపిస్తూ క్లోజ్ షాట్ రాశారు. ఇంపార్టెంట్ కాల్ అయితేనే, లేదా అపాయకర పరిస్థితి వుంటనే, రింగవుతున్న ఫోన్ ని క్లోజ్ షాట్ లో చూపిస్తారు. అదింకా విజువల్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. సందేహిస్తూ ఎబ్బీ తీసి పలుకుతుంది. ఆన్సర్ వుండదు. కానీ ఫ్యాను తిరుగుతున్న శబ్దం వస్తూంటుందని రాశారు.

            ఈ స్క్రీన్ ప్లేలో ఒక సీన్లోంచి ఇంకో సీన్లోకి ట్రాన్సిషన్స్ ఎలా వున్నాయంటే, ఇక్కడీమే ఫోనెత్తి పలికితే ఆన్సర్ లేదు, కట్ చేశాం,  ఇంటర్ కట్ లో అక్కడ బార్ లో ఓపెన్ చేస్తే మార్టీ గారు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని వున్నారు - అన్న పద్ధతిలో లేవు. దిసీజ్ నాట్ ఆర్ట్. అల్లిక కాదు, అతుకులేయడం. ఇక్కడో ముక్క చూపించి కట్ చేసి, అక్కడో ముక్క చూపించడం లేదు. రెండు దృశ్యాల్నీ కలిపివుంచే బ్రిడ్జింగ్ టూల్స్ ని వాడుతున్నారు. వెనక సీన్లలో చూశాం : భగభగ ఫర్నేస్ తో సీను ముగిస్తే, గిరగిర ఫ్యానుతో తర్వాతి ఓపెన్ చేశారు. ఈ ట్రాన్సిషన్స్ తో సీన్లు ముక్కలై నట్టు వుండవు, ముక్కల్ని అతికించి నట్టుండదు, ఒక సీను తర్వాతి సీన్లోకి అల్లుకుపోతూ, సహజంగా స్మూత్ గా ఫ్లో అయినట్టు అందంగా వుంటుంది.

            ఇలాగే ప్రస్తుత ఒపెనింగుకీ, వెనుక మార్టీ సీను క్లోజింగ్ కీ బ్రిడ్జింగ్ టూల్స్ వాడారు. అక్కడ కంప్యూటర్లో గ్రీన్ లెటర్స్ తో క్లోజ్ చేస్తే,  ఇక్కడ యాంబర్ లైటుతో ఓపెన్ చేశారు. 

            ఇలా ఇప్పుడు ఎబ్బీకి అన్సర్ విన్పించక, కట్ చేసి ఇంటర్ కట్ లో అవతల మార్టీ ని చూపించేందుకు, రెండిటికీ మధ్య బ్రిడ్జింగ్ టూలుగా (వారధిగా) మార్టీ ఆఫీసులో ఫ్యాను శబ్దాన్ని వాడారు. ఆమెకి ఫ్యాను శబ్దం మాత్రమే విన్పిస్తోంటే,  ఆ శబ్దం ద్వారా సీను మార్టీ ఆఫీసులోకి ఫ్లో అయింది సీను ...

            ఈ ఇంటర్ కట్ లో మార్టీ ఫోను చెవి దగ్గర పెట్టుకుని సైలెంట్ గా వుంటాడు. మొదటిసారి మనకు ఈ భార్యాభర్తల మధ్య కాంటాక్టు ని చూపిస్తున్నారు. మళ్ళీ ఈ సీన్లోకి ఫ్లో చేయడానికి అదే ఫ్యాను సౌండుని వారధిగా వాడుతూ, ఇటు ఎబ్బీ పరిస్థిని ఇలా రాశారు  : ఆమె వింటూనే వుంటుంది. ఫోన్ని రెండో చెవికి మార్చి ఫ్యాను శబ్దాన్ని బాగా వింటుంది. కొన్ని క్షణాలాగి,  మార్టీ? - అంటుంది. ఫోన్ డెడ్ అయి తలుపు తీసిన చప్పుడవుతుంది. ఎబ్బీ అటు చూసి ఫోన్ ని పెట్టేస్తుంది...

            అయితే చిత్రీకరణలో ఆమె, మార్టీ?-  అన్నాక వెనుక ఏదో చప్పుడవడంతో గిరుక్కున తిరుగుతుంది. తలుపు దగ్గర రే కన్పిస్తాడు. నెమ్మదిస్తుంది. ఫోన్ పెట్టేసినట్టు చూపించరు.

            ఇప్పుడు రేని చూస్తే, రెడ్డా గ్రీనా అనుకుంటూ కార్లో  కూర్చున్న అతను, ఇంట్లో ఫోన్ రింగవడంతో సిగ్నల్ జంప్ చేసి వచ్చేసి నట్టున్నాడు.

            ఇప్పుడతను ఎబ్బీ ని నమ్మని స్థితిలోనే వున్నాడు. అతను ఇలా తలుపు దగ్గరున్నప్పుడు,  అవతలి లైటు వెలుగు తలుపు రెక్క మీదా, పక్కన గోడ మీదా అతడి నీడని సృష్టిస్తుంది. డార్క్ మూవీ ఎలిమెంట్స్ లో పాత్ర ముందు ఏర్పడే నీడ పాత్రకి ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇది రాయకపోయినా చిత్రీకరణలో వుంది. 

            ఇప్పుడు తనకి  అనుమానాస్పదంగా తోస్తున్న ఎబ్బీతో రే ప్రవర్తన ఏంటనేదే ఈ సీను ఉద్దేశం. పాపం ఎబ్బీకి రేలో మార్టీ నాటిన అనుమానపు బీజాల సంగతి తెలీదు. రే ఎందుకిలా అంటున్నాడో అర్ధంగాక, అదే సమయంలో దుఖాన్ని దాచుకుంటూ బ్రేకప్ చెప్పడానికి కూడా సిద్ధపడిపోతుంది. ఇద్దరి మధ్యా ఇది వూహించని ఉద్రిక్త పరిస్థితేం కాదు. ఉద్రిక్తత ఏర్పడుతుందని  తెలిసిందే. తెలిసిందాన్నే మళ్ళీ ఎందుకు చూపించాలి. జడివాన వెలసిన వెనుక కూలేటి ఇళ్ళని చూపించాలి, విరిగేటి చెట్లనీ చూపించాలి. విషాదాన్ని చూపించాలి. ఎడారిని చూపించాలి. 

            అంటే హై పాయింటు దగ్గరే సీను ఎత్తుకోవాలి. అంటే పాత్రలు అడ్వాన్సుడుగా ప్రవర్తించాలి. చిన్న చిన్న సూటి మాటలతో,  కొన్ని సెకన్లలో చాలాపెద్ద విషాదమే ఏర్పడు తుందిక్కడ.

            తలుపు నీడ నేర్పర్చు కుంటూ నిలబడి, ఎవరది?  – అంటాడు రే. ఏంటీ?- అంటుంది. కాల్- నీకేనా? -  అంటాడు. క్షణమలా చూసి, తెలీదు అతనేం మాట్లాడలేదు- అంటుంది. మరి అతనే అని ఎలా తెల్సింది?- అంటాడు (అతడి అనుమానం వేరే ప్రియుడితో మాట్లాడిందని). పాలిపోయిన మొహంతో చూస్తుంది. ఇలా మాట్లాడుతున్నాడంటే తనకి చెల్లుచీటీ  ఇచ్చేస్తున్నాడని డిసైడ్ అయిపోయి, చిరునవ్వుతో చూస్తుంది- ఇంకో సెటప్ చూసుకున్నావా?  నేనిక్కడ వుండి  ఇబ్బందిగా వున్నానా? – అనేస్తుంది. మరిలేక పోతే తననిలా అనుమానిస్తున్నపుడు ఇంకేం చేస్తుంది. తనకి ప్రియుడున్నాడన్న అర్ధంలో అతను హర్ట్ చేస్తే,  అతడికి సెటప్ ని అంటగట్టి గుండెల్లో బాకు దింపింది. మాటకు మాట-దెబ్బకు దెబ్బ! పీడా వదిలింది రిలేషన్ షిప్!

        ఆమె మాటలకి - నో, నేనలా వున్నానా?- అంటాడు. తికమకగా చూస్తుంది. కొన్నిక్షణాలు అనీజీ ఫీలయి- రేపు వేరే ప్లేస్ చూసుకుని వెళ్లి పోతాలే, నీకు బర్డెన్ గా వుండను – అంటుంది. నువ్వలా డిసైడ్ అయితే అలాగే చెయ్ - అని తలుపు మూసి లోపలి కొస్తూ- బెడ్ మీద పడుకుంటావా, సోఫాలోనా?- అంటాడు. సోఫా ఓకేలే  – అని విరక్తిగా అంటుంది. బెడ్ మీద పడుకోవాలనుటే పడుకో- అంటాడు. ఆమె సోఫాలో కూర్చుండి పోతూ, టిల్ట్ అప్ షాట్ లో అతణ్ణి చూస్తూ- బెడ్ నుంచి నిన్ను దూరం చెయ్యనులే -  అంటుంది. చెయ్యకూడదు- అంటాడు. నాకిక్కడ ఓకే  -అంటుంది. రే బెడ్ రూమ్ వైపు వెళ్ళిపోతూ, సరే  – అంటాడు.   

            విడిపోయారు! అతను వెళ్లిపోతూంటే ఇంతేనా అన్నట్టు చూస్తూంటుంది...ప్రతీ సీనులో ఓ మినీ కథ అన్నట్టు సాగుతోంది. ఈ సీను బయట కార్లో డైలెమాతో గడిపిన రే ఇంట్లోకి వచ్చేసి, ఈ ఇంట్లో సెటిలవుదామని వచ్చిన ఎబ్బీ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితితో ముగిసింది. గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ఈ సీన్లు త్వరలో ఏర్పాటు కానున్న ప్లాట్ పాయింట్ -1 దగ్గర, సమస్యకి దారి తీయించే పరిస్థితుల కల్పన చేసుకుంటూనే సాగుతున్నాయి.


-సికిందర్