రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, నవంబర్ 2015, శనివారం

స్ట్రక్చర్-7


స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం విలువని గుర్తించకపోతే చాలా నష్టం కథకి. నూటికి 90 శాతం మంది ఇది తెలుసుకోకుండానే రాసేస్తున్నారు. స్క్రీన్ ప్లేకి బిగినింగ్ ముఖ చిత్రమైతే మిడిల్ దేహం. దేహం లేకుండా, ఒకవేళ వున్నా సగానికి కుదించి, ఇంకా  ఆ సగంలో సగానికి కూడా  కుదించి రాసే స్క్రీన్ ప్లేలు నిజానికి స్క్రీన్ ప్లేలు కావు. స్క్రీన్ ప్లేలో సగ భాగం అంటే 50 శాతం నిడివితో  మిడిల్ విభాగం వుంటే అది ఉత్తమ స్ట్రక్చర్. 25 శాతం వుంటే బలహీన స్ట్రక్చర్, 25 శాతం కన్నా తక్కువ వుంటే అది స్క్రీన్ ప్లేనే కాదు. మిడిల్ విభాగం బిజినెస్ లోకి వెళ్ళే ముందు మిడిల్ భౌతిక స్వరూపం గురించి లోతుగా తెలుసుకోవడం అవసరం.  ఓ రెండు గంటల స్క్రీన్ ప్లే వుందంటే అందులో అరగంట సేపు బిగినింగ్, ఓ  గంటసేపు  మిడిల్, ఇంకో అరగంట సేపూ ఎండ్ విభాగాలుండాలన్న మాట - శాతాల్లో చూస్తే  స్ట్రక్చర్   25%- 50%- 25% గా ఉండాలన్న మాట. అంటే 1 : 2 : 3 నిష్పత్తులన్న మాట. ఎటొచ్చీ మిడిల్ అనేది బిగినింగ్, ఎండ్ విభాగాల కంటే రెట్టింపు సైజులో ఉండాలన్న మాట.

        ఎందుకు రెట్టింపు సైజులో వుండాలి? అసలు కథంతా ఇక్కడే వుంటుంది కాబట్టి. బిగింగ్ అనేది కథకాదు. అది కథని పరిచయం చేసే ప్రవేశ ద్వారం మాత్రమే.  అలాగే ఎండ్ కూడా కథ కాదు. అది కథకి ముగింపు పలికే నిష్క్రమణ మార్గం మాత్రమే. మిడిల్ లో వున్న కథని పరిచయం చేసేది బిగినింగ్ అయితే, మిడిల్లో  లో నడిచిన కథకి ముగింపుకి  తెచ్చేది ఎండ్. ఎక్కడైతే కథా పరిచయ విభాగం ‘బిగినింగ్’ అనేది ముగింపు కొస్తూ  సమస్యని ఏర్పాటు చేస్తుందో,  ఆ బిందువుని ప్లాట్ పాయింట్ -1 అంటున్నాం. ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర నుంచీ ప్రారంభమయ్యేది మిడిల్. ఇది ఇంటర్వెల్ మీదుగా కొనసాగి అవతల ప్లాట్ పాయిట్ -2 అనే మరో బిందువు దగ్గర అంతమవుతుంది. ఈ బిందువు ప్లాట్ పాయిట్ - 1 దగ్గర ఏర్పాటు చేసే సమస్యకి పరిష్కార మార్గాన్ని సూచించే బిందువు. అంటే బిగినింగ్ అందించే  సమస్యని తీసుకుని మిడిల్  తనదైన బిజినెస్ తో సాధించి ఓ పరిష్కారమార్గాన్ని కనుగొని ఎండ్ కి అందిస్తుందన్న మాట. బిగినింగ్  అందించే సమస్యని పరిష్కరిస్తూ ఎండ్ కి అందించడం మిడిల్ నిర్వర్తించే కార్యకలాపమన్న మాట. పిండి మర నోటి దగ్గర గోధుమలు పోస్తే,  ఆ మర గోధుమల్ని ఆడించి పిండిగా మార్చి బయటికి ఎలా పంపుతుందో,   స్క్రీన్ ప్లేలో మిడిల్ చేసే పని కూడా ఇలాటిదే :  తన నోటికి బిగినింగ్ అందించే  సమస్యని మరాడించి, పరిష్కార మార్గాన్ని ఎండ్ కి అందించడం.

       మరలో గోధుమలు ఎంత సేపు పోస్తారు?  అది క్షణాల్లో పని. ఆ గోధుమలు పిండిగా మారడానికి నిమిషాలు పడుతుంది. చివరికి బయటికి రావడం మళ్ళీ క్షణాల్లో పనే. అలాగే  స్క్రీన్ ప్లే ప్రారంభంలో బిగినింగ్ విభాగం  మిడిల్ విభాగానికి సమస్యని అందించడం అంత చప్పున జరగాలి. ఆ సమస్యని మిడిల్ మరాడించడానికి ఎంత సమయమైనా తీసుకోవచ్చు. సమస్యని అందించడానికే బిగినింగ్ చాలా సమయం తీసుకుంటే, మరాడించడానికి మిడిల్ కి చాలినంత సమయం దొరకదు. ఎందుకంటే దాని టైము ప్రకారం అది అవతల ఎండ్ కి పరిష్కారం అందించాలి. 
ఎండ్ సమయాన్ని తను తినేయ్యడానికి లేదు. ఎంత మిడిల్ సమయాన్ని బిగినింగ్ తినేసి పంక్చువాలిటీ లేకుండా ప్రవర్తించినా, మిడిల్ మాత్రం ఎండ్ తో పంక్చువాలిటీ తోనే వుంటుంది.  మిడిల్ మరాదించే సమయాన్ని బిగినింగ్ సమస్యని అందించడానికి తాత్సారం చేస్తూ  ఎంత తినేస్తే అంత మిడిల్ సమయం తగ్గి- ఆ మేరకు కథ కూడా తగ్గిపోతుంది...
contd..
కథంటే మిడిలే!
ఈ కింది పటం చూడండి : 

     ఇందులో  బిగినింగే  ఇంటర్వెల్ వరకూ సాగుతోంది. భారతీయ సినిమాల్లో సర్వసాధారణంగా వుండే స్ట్రక్చర్ ఇది. రెండు గంటల సినిమా వుందంటే సమస్యని స్థాపించడానికి ఇంటర్వెల్ వరకూ గంట సేపు సమయం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. సమస్య స్థాపించే వరకూ కథ ప్రారంభమేకావడం జరగదని ప్రధానంగా గమనించాలి. రెండు గంటల సినిమాలో సగభాగం సమయం, అంటే స్క్రీన్ ప్లే లో 50% నిడివి అంతా ఇలా 25 % ఉండాల్సిన బిగినింగే తీసుకుంటే అంకాలు స్థానభ్రంశం చెందినట్టే. మొదటి అంకం అంటే బిగినింగ్ వెళ్లి- రెండో అంకం మిడిల్ లోకి జొరబడి ఇంటర్వెల్ వరకూ చోటుని ఆక్రమిస్తే, మిడిల్ వెళ్లి ఇంటర్వెల్ తర్వాత సర్దుకుంటోంది పై పటంలో.  దీంతో ఫస్టాఫ్ లో ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ కొచ్చి 50% ఉండాల్సిన మిడిల్ సైజు,  ఇంటర్వెల్ తర్వాత మాత్రమే సగానికి, అంటే 25 % కుంచించుకు పోతోంది. ఐదవ తరగతి చదివే  కుర్రాడు  ఐదవ తరగతి లోనే కూర్చోవాలి. వాడు వెళ్లి ఆరో తరగతిలో జొరబడితే అక్కడ కలకలం రేగుతుంది. వాడు ఇరికిరికి కూర్చునే సరికి ఆరో తరగతి కుర్రాళ్ళు కూడా వాడికి చోటు వదిలి తామూ ఇరికిరికి  కూర్చోవాల్సి వస్తుంది. తిక్కరేగితే వాణ్ణి తన్ని వెళ్ళ  గొట్ట వచ్చు. కానీ మిడిల్ చోటుని దర్జాగా కబ్జా చేసే బిగినింగ్ ని  మెడబట్టి  గెంటేసేందుకు మనసొప్పదు భారతీయ  స్క్రీన్ ప్లే కళాకారులకి. తమ సొమ్మేం పోయింది- కొంప లంటుకునేది నిర్మాతలకే కదా.  వెరసి మెజారిటీ భారతీయ సినిమాల స్క్రీన్ ప్లే స్ట్రక్చర్= 50% బిగినింగ్, 25% మిడిల్, 25% ఎండ్ = 2 : 1 : 1 = బిగినింగ్ గంట + మిడిల్ అరగంట + ఎండ్ అరగంట = ఫస్టాఫ్/సెకండాఫ్ స్క్రీన్ ప్లే మోడల్ అన్నమాట!

         బిగినింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్సు. ఆ బిగినింగ్ సాగే ఇంటర్వెల్ వరకూ కథ వుండదు మళ్ళీ.  కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్, పాటల కార్యక్రమం వీటితోనే గడిచిపోయి- ఇంటర్వెల్ వచ్చేసరికి అక్కడో పాయింటు తో సమస్యా స్థాపన. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లోనే మిడిల్ ప్రారంభం. అంటే ఇక్కడే కథ ప్రారంభమవుతుంది ఇంటర్వెల్లో  ఏర్పాటు చేసిన ఆ సమస్యని పట్టుకుని. సెకండాఫ్ లో వుండే ఆ గంట సమయంలోనే మిడిల్ నీ, ఎండ్ నీ సర్దాలి కాబట్టి- మిడిల్ కోఅరగంట, ఎండ్ కో అరగంటా దక్కుతాయి. ఎండ్ కి ఇబ్బంది లేదు. దాని సైజు మారదు.  ఇలా మొత్తం రెండు గంటల నిడివిగల సినిమాలో కథ ( మిడిల్) నడిచేది అరగంట సేపే నన్న మాట. అరగంట కథ కోసం గంటన్నర సినిమా భరించాలి ప్రేక్షకులు. ఇదొక శ్రమ తప్పించుకునే స్కామ్  కాకపోతే ఏమిటి?

      ఇంతేనా? ఇంకో పెద్ద స్కామ్ కూడా వుంది. స్క్రీన్ ప్లే రైటింగ్ పేరుతో జరుగుతున్న అతి పెద్ద స్కామ్ లో అసలు శ్రమించడమే వుండదు. పై రెండో పటం చూస్తే ఇదేమిటో తెలుస్తుంది. ఈ స్కామ్  దెబ్బకి ఏ సినిమా కూడా ఒక్క పూట ఆడే ప్రసక్తే లేదు. ‘అఖిల్’ అయినా సరే,  ‘కిక్-2’  అయినా సరే. మిడిల్ ని గౌరవించక పోతే ఆ మిడిల్ నిర్మాతల్ని లెక్క చెయ్యదు. ఈ పటంలో మిడిల్ ని కూడా మింగేస్తూ బిగినింగే ఎండ్ దాకా సాగుతోంది.. ఎప్పుడో ఫస్టాఫ్ లోనే ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ లోకి ఎంటరై 50% ఉండాల్సిన మిడిల్, ఇక్కడ 12.5% శాతానికి చిక్కిశల్యమై,  వెళ్ళేసి ఎండ్ విభాగపు చోటులో ఇరుక్కుంటోంది. ఎండ్ కూడా 12.5% శాతానికి చిక్కిపోతోంది. అంటే ఇలా క్లైమాక్స్ దగ్గర మాత్రమే  ప్రారంభమయ్యే కథ,  అప్పుడే మొదలై అప్పుడే ముగిసిపోయే అగత్య మన్నమాట. ఈ కింది పటంలో కూడా చూడండి మిడిల్ పరిస్థితి. అందుకే మిడిలే ( కథే) వుండని  ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే! 

ఇలా జరగడానికి సినిమా మొత్తంగా  నడిచేది కథే అనే దురభిప్రాయంతో ఉండడమే కారణం.  సినిమా మొత్తం నడిచేది కథే కాదు, మిడిల్ లో వుండేది మాత్రమే  అసలు కథ, ప్రాణం, బలిమి, సింహాసనం, కథాపాలనా వగైరా. బిగినింగ్ లో వుండేది కేవలం ఉపోద్ఘాతమే ననీ, అలాగే ఎండ్ లో వుండేది కూడా కేవలం ఉపసంహారమే ననీ సాంకేతిక దృక్కోణంలో స్క్రీన్  ప్లే ని చూడకపోతే మిగిలేది రోదనే. 


        ప్రేక్షకుల సమయం విలువైనది.  ఆ విలువైన  సమయాన్ని సమాదరిస్తే వాళ్ళుకూడా సినిమాని ఆదరించే అవకాశం వుంటుంది. కథ చెప్పాలనుకుంటే చప్పున ఫస్టాఫ్ లోనే ప్రారంభించాలి మిడిల్ ని. ఉపోద్ఘాతాల చాపల్యం, ఉపసంహారాల ప్రకోపం అదుపులో వుంచుకోవాలి. కింద చూపిన పటాల్లో విధంగా కథని సకాలంలో ప్రారంభిస్తే స్ట్రక్చర్ అర్ధవంతంగా వుంటుంది : 

      ఈ సార్వజనీన, ప్రామాణిక త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వున్న ‘దేవదాసు’ ని చూస్తారా, ‘పాండురంగ మహాత్మ్యం’ ని చూస్తారా, ‘అల్లూరి సీతారామ రాజు’ ని చూస్తారా- ఇంకా వందల్లోవున్న-
      ఆనాటి ఎన్నో సినిమాల్ని చూస్తారా మీ ఇష్టం. ఏమైపోయింది ఆనాటి నమ్మక మైన స్ట్రక్చర్? ఏమైపోయింది మిడిల్ కి అంతటి గౌరవం? ఫస్టాఫ్/సెకండాఫ్ స్ట్రక్చర్ తో మిడిల్ విలువని తగ్గించింది గాక, అసలు మిడిలే వుండని మిడిల్ మటాష్ స్ట్రక్చర్ అనే కొత్త వైకల్యాన్ని ఎందుకు  సంతరించుకుని భారీ సినిమాల్ని సైతం మట్టి కరిపించుకునే దాకా వచ్చింది?
contd..          
   
       

    


రీమేక్ @ నేటివిటీ

దర్శకత్వం : రాజేష్ ఎం. సెల్వ 

తారాగణం :  కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ కుమార్, కిషోర్, మధుశాలిని, అమన్ అబ్దుల్లా, ఆశా శరత్, సంతాన భారతి తదితరులు
కథ : ఫ్రెడరిక్ జార్డిన్
, నికోలస్ సాదా,  స్క్రీన్ ప్లే : కమల్ హాసన్, మాటలు : అబ్బూరి రవి
 
సంగీతం
; జిబ్రాన్, ఛాయాగ్రహణం : సానూ జాన్ వర్గీస్ 
బ్యానర్ : రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్ నేషనల్
నిర్మాతలు :
 కమల్ హాసన్, ఎస్. చంద్రహాసన్, గోకులం గోపాలన్, విసి ప్రవీణ్, బిజు గోపాలన్ 
విడుదల : 20 నవంబర్ 2015 

 ***

       కమల్ హాసన్ నటించాలంటే ఏ భేషజాలూ వుండవు. సాధారణ క్రైం  థ్రిల్లర్స్ కూడా అవి ఇంటరెస్టింగ్ గా వుంటే నటించేస్తారు. 2011 లో విడుదలైన ఫ్రెంచి థ్రిల్లర్ స్లీప్ లెస్ నైట్ని రీమేక్ చేస్తూ తను నటించిన చీకటి రాజ్యంఈ కోవలోనిదే. తెలుగు తమిళ ద్విభాషా చిత్రం గా నిర్మించిన దీన్ని తమిళంలో తూంగవనంగా మొన్న దీపావళికి విడుదల చేశారు. తెలుగులో ఈ వారం విడుదల చేశారు. ఇదొక సాధారణ థ్రిల్లరే  అయినా పకడ్బందీగా ఉండడానికి తారాగణ బలం కూడా సమకూర్చుకున్నారు. త్రిష, మధుశాలిని, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ల వంటి పాపులర్ నటీనటుల్ని తీసుకుని, కొత్త దర్శకుడు రాజేష్ ఎం. సెల్వ దర్శకత్వంలో విజయవంతంగా నిర్మించిన ఈ సినిమాలో అసలేముందో చూద్దాం..

ఒక రాత్రి - ఓ సంఘర్షణ 
        దివాకర్ ( కమల్ హాసన్ ) నార్కోటిక్ (మాదక ద్రవ్యాల) కంట్రోల్ బ్యూరో అధికారి.  ఓ తెల్లారి పొద్దున్నే తన అసిస్టెంట్ మణి (యుగి సేతు) తో కలిసి నగరంలో జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ని విచ్చిన్నం చేస్తాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో గాయపడతాడు.  విఠల్ రావ్ ( ప్రకాష్ రాజ్ ) అనే నైట్ క్లబ్ బాస్ డ్రగ్స్  రాకెట్ నడుపుతూంటాడు. దివాకర్ పట్టుకున్న పది కోట్ల విలువ జేసే డ్రగ్స్ విఠల్  రావ్ కి చెందినవే. దీంతో అతను కొడుకు వాసూ ( అమన్ అబ్దుల్లా) ని కిడ్నాప్ చేసి ఆ డ్రగ్స్ తెచ్చివ్వ మని బెదిరిస్తాడు. దివాకర్ కి డాక్టర్ అయిన భార్య ( ఆశా శరత్) తో విడాకులై వుంటాయి. కానీ అనునిత్యం ఆమె దివాకర్ దగ్గర వుండి  చదువుకుంటున్న కొడుకు యోగ క్షేమాల గురించే దివాకర్ కి ఫోన్లు ప్రాణం తీస్తూంటుంది.  కొడుకు కిడ్నాప్ అయ్యేసరికి భార్యతో ఇరకాటంలో పడ్డ దివాకర్ విధిలేక ఆ డ్రగ్స్ ని విఠల్ రావ్ కి అందించడానికి బయల్దేరతాడు. ఆ నైట్ క్లబ్ లోనే వుంటుంది మల్లికా ( త్రిష) అనే ఇంకో నార్కోటిక్స్ ఉద్యోగి. ఈమె దివాకర్ అక్కడికి బ్యాగుతో రావడాన్ని చూసి, విఠల్ రావ్ తో ఇతను కుమ్మక్కయ్యాడనుకుని ఆ బ్యాగు కొట్టేసి తన అధికారి ( కిషోర్) ని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి దివాకర్ చర్యల మీద కన్నేస్తారు. కొడుకుని విడిపించుకోవడానికి వచ్చిన దివాకర్ తన బ్యాగు పోయినట్టు గుర్తించి ఇరకాటంలో పడతాడు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ కోసం పెదబాబు ( సంపత్ రాజ్)  అనే ఇంకో స్మగ్లర్ వచ్చి విఠల్ రావ్ దగ్గర కూర్చుంటాడు. దివాకర్ తెలివిగా ఆలోచించి మైదా పిండిని తీసికెళ్ళి డ్రగ్స్ గా వాళ్లకి అంట గట్టడంతో అది బయటపడి మొత్తం అభాసవుతుంది- దివాకర్ ని పట్టుకోవడానికి గ్యాన్స్  వెంట పడతారు. కొడుకుని కాపాడు కోవడానికి నైట్ క్లబ్ లోనే దివాకర్ దాగుడు మూతలాడతాడు. ఇక నైట్ క్లబ్ లోనే ఎక్కడో బందీగా వున్న కొడుకుని దివాకర్ ఎలా విడిపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ 
        థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టే ఉంది. ఒరిజినల్ ఫ్రెంచి సినిమాకి పూర్తి అనుసరణ కాకపోయినా కమల్ హసన్ తన స్క్రీన్ ప్లే నేర్పుతో నేటివిటీ ని దృష్టిలో పెట్టుకుని పకడ్బందే కథనం చేశారు. కేవలం ఒక రాత్రి నైట్ క్లబ్ లో జరిగే యాక్షన్ కథ ఇది. చప్పున ముగిసిపోయే రెండుగంటల పది నిమిషాల నిడివితో, అక్కడక్కడా ఫన్నీ డైలాగులతో టైం  పాస్ గ్యారంటీ  థ్రిల్లర్ ఇది. ఎలాటి పాటలూ, ప్రత్యేకంగా కామెడీ ట్రాకులూ వంటి పక్క చూపులు చూడకుండా ఏక సూత్ర కార్యక్రమం అన్నట్టు ఈ థ్రిల్లర్ని రక్తి కట్టించారు.

ఎవరెలా చేశారు
        మల్ హాసన్ చాలా రియలిస్టిక్ గా వున్న ఫైటింగ్  సీన్లలో ఈ వయసులోనూ చాలా సాహసించి నటించారు. కొడుకు కోసం ఫిజుకల్ యాక్షన్, భార్య కారణంగా ఎమోషనల్ యాక్షన్ - ఈ రెండిటి మధ్య నలిగే పాత్రగా నటించడమెలాగో ఆయనకి వేరే నేర్పక్కర్లేదు. బయట యాక్షన్ లో వుండే హీరోకి ఇంటి దగ్గర భార్య తోనో, ప్రియురాలితోనో ఒక సమస్య వుండడమనే  హాలీవుడ్ సినిమాల్లో కన్పించే  ఫార్ములా ని ఇక్కడా వర్కౌట్ చేశారు. త్రిష తో కమల్ చేసిన ఫైట్ ఇంకో ఎత్తు. ఈ రియలిస్టిక్ ఫైట్ లో త్రిష  కొత్త కోణాన్ని ప్రదర్శిస్తుంది.  కమల్ ని అపార్ధం జేసుకున్న పాత్రగా త్రిష ని నెగెటివ్ షేడ్స లో బాగా చూపించారు. ఆమె కెరీర్ లో ఇదొక విభిన్న పాత్ర. ఇక ప్రకాష్ రాజ్,  సంపత్ రాజ్ ల విలనీ సున్నిత హాస్యంతో ఎంటర్ టైన్ చేస్తుంది. మొత్తం నైట్ క్లబ్ లో డ్రగ్స్ కోసం జరుగుతున్న ముసుగులో గుద్దులాట స్టాఫ్ కి అర్ధం గాక- మైదా పిండి కోసం కొట్టేసుకుంటున్నారు’ - అనుకోవడం పెద్ద కామెడీ.  ఇలాటి ఫన్నీ డైలాగ్స్ చాలా వున్నాయి ఎంటర్ టైన్ మెంట్ పార్టు మిస్సవ్వకుండా.

        జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ  సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అంతర్జాతీయ  స్థాయిలో వున్నాయి. ఇక  సానూ జాన్ వర్గీస్ కెమెరా పనితనం క్లాస్ గా వుంది. ఎంత సేపూ నైట్ క్లబ్ లోనే  జరిగే కథ బోరు కొట్టకుండా, ఎప్పటికప్పుడు బ్లాకులు మార్చేస్తూ కొత్త ఫీల్ కలిగేట్టు చిత్రీకరణని ప్లాన్ చేయడం గొప్ప విషయం. అబ్బూరి రవి మాటలు తమిళ డైలాగులకి అనుసరణే  అయినా వాటిని కూర్చడంలో మంచి ఈజ్ చూపించారు.

చివరికేమిటి
        మంచు విష్ణు నటించిన తమిళ రీమేక్ డైన మైట్’  అనే థ్రిల్లర్ కంటే చాలా బెటరే చీకటి రాజ్యం’. నసపెట్ట కుండా థ్రిల్లర్ ని కూడా సరదాగా తీసే విధానం తో ఇది సక్సెస్ అయింది. లాజికల్ గా, ఎమోషనల్ గా పకడ్బందీగా వున్న దీన్ని ఓసారి చూసేసి ఎంజాయ్ చేయవచ్చు. 


-సికిందర్


సు'కుమారీయం' !దర్శకత్వం :  పల్నాటి  సూర్య ప్రతాప్ 

కథ-  స్క్రీన్ ప్లే : సుకుమార్ 
తారాగణం : రాజ్ తరుణ్
, హెబ్బా పటేల్, హేమ తదితరులు 
మాటలు : పొట్లూరి వెంకటేశ్వర రావు
, 
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు 
బ్యానర్ : పి ఎ మోషన్ పిక్చర్స్
 
నిర్మాతలు :
  విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి
విడుదల :  20 నవంబర్ 2015 

                     ***


         ప్రేమ కథల్ని సైకలాజికల్ గా ఏదో మలుపు తిప్పి కొత్తగా చెప్పాలన్న తపన గల దర్శకుడు సుకుమార్ ఈసారి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తను ఒక న్యూ ఏజ్ - మెట్రో లవ్ స్టోరీ లాంటి దాన్ని స్క్రీన్ ప్లే చేసి అందించారు. ఓ రెండు సినిమాలు- ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్తా మావాలతో యూత్ లో పాపులరైన హీరో రాజ్ తరుణ్ - తమిళ నటి హెబ్బా పటేల్ ల కాంబినేషన్ లో మొహమాట పడకుండా అడల్ట్ కంటెంట్ ని దట్టిస్తూ రియలిస్టిక్ ప్రేమకథ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం  దర్శకుడు మారుతీ తీసిన ఓ రెండు మూడు అడల్ట్  కామెడీలకీ, లేదా మొన్న వచ్చిన తమిళ ‘త్రిష లేదా నయనతార’ అనే  అల్ట్రా అడల్ట్ కామెడీకీ తేడాగా ఏమైనా ఉందా- లేక ఏదో డేరింగ్ ప్రయత్నం  పేరుతో పర్వెర్టెడ్ సెక్స్ గా తయారయ్యిందా ఈ కింద చూద్దాం..

        సిద్దూ (రాజ్ తరుణ్) కేటరింగ్ కోర్సు చదివి ఆవారాగా తిరుగుతూ,  సింగపూర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూంటాడు. అతడి తల్లి (హేమ) ఓ నర్సు. భర్త వేరే సంబంధం పెట్టుకున్నాడని ఇరవై ఏళ్ళ క్రితం అతణ్ణి వదిలేసి ఆమె కొడుకుతో ఉంటోంది. సిద్దూ కి ముగ్గురు ప్రెండ్స్ వుంటారు. చిల్లర దొంగ తనాలు చేసి బతికేస్తూంటారు. తాగుళ్ళు తిరుగుళ్ళూ అన్నీ జరిగిపోతూంటాయి. వాళ్ళు నేరాలు చసి అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయినప్పుడల్లా తను అన్నం తీసికెళ్ళి అందిస్తూ సాయంగా ఉంటాడు. 

        ఇలా వుండగా ఈ కాలనీలోకి ముంబాయి నుంచి కుమారి (హెబ్బా పటేల్) అనే ఒక బి గ్రేడ్ ఛోటా మోడల్ వచ్చి తాత తో కలిసి సెటిలవుతుంది. సిద్దూని చూడగానే క్లోజ్ అవుతుంది. లవ్యూ చెప్పేస్తుంది. ఆమె విపరీత ప్రవర్తన
, హద్దులు మీరిన మాటలూ అతణ్ణి తికమక పెట్టేస్తాయి. చొరవ చేసి ఆమె కిస్ కూడా చేసేసరికి, తన ముందు ఎక్స్ పోజ్ కూడా చేసేసరికి - సిద్దూ ఫ్రెండ్స్ హెచ్చరిస్తారు. ఆమెకి చాలా మంది బాయ్ ఫ్రెండ్ వుండి  ఉంటారనీ, క్యారక్టర్ మంచిది కాదనీ నూరి పోస్తూంటారు. ఇతర అబ్బాయిల్ని జస్ట్ ఫ్రెండ్స్ అని ఆమె తెగ తిరిగేస్తూంటుంది. ఆమె ఎలా కన్పించినా, ఎవరేం చెప్పినా సిద్దూ ఆమెని ప్రేమించేస్తాడు. కానీ అనుమానం తీరక ఆమె క్యారక్టర్ ని పరీక్షించబోయి దొరికిపోతాడు. దీంతో ఆమె ఛీ కొడుతుంది. నన్ను ప్రేమించే మెట్యూరిటీ నీకు లేదని గుడ్ బై కొట్టేస్తుంది.
 

        హర్టయిన  సిద్దూ ఆమెకో చాలెంజి విసిరి, ఆ మేరకు వేరే అమ్మాయితో తిరగడం మొదలెడతాడు. మనం ప్రేమించే మనిషి వేరొకరితో తిరిగితే ఎలా వుంటుందో ఆమె తెలుసుకోవాలని ఇలా చేస్తూంటాడు. ఈ పంతాలు పట్టింపులూ రకరకాల మలుపులకి దారితీస్తాయి. పరిస్థితి విషమంగా మారుతుంది. అప్పుడు ఆమె గతం గురించి తెలుసుకున్న సిద్దూ మనసుమార్చుకుంటాడు. ఇంతలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. చివరికి వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
        యూత్ కి కనెక్ట్ చేయాలని తపన పడ్డ కథ. మారుతీ సినిమాలతో ద్వంద్వార్థ, ఏకార్ధ రోమాంటిక్ కామెడీలు యూత్ లో చెడ్డ పేరు తెచ్చుకుని అంతరించిపోయిన నేపధ్యంలో, మొన్నే ‘త్రిష లేదా నయనతార’ అనే మరో అడల్ట్ మూవీనీ మట్టి కరిపించిన పూర్వరంగంలో, సుకుమార్ అనే బ్రాండింగ్ తో వచ్చినందుకు కొంతవరకూ ప్రేక్షకులు ఔదార్యం చూపించగల బోల్డ్- సెక్స్- కండోమ్స్ సహిత అడల్ట్ కథ. ఆధునికత అంటే అవధుల్లేని విశృంఖలత్వమనే ధోరణికి ఎక్కువగా లోబడి సాగే కథ. ఇంటలెక్చువల్ గా దర్శకుడి నుంచి పైస్థాయి వ్యక్తీకరణల్ని డిమాండ్ చేసే కథ. ఎప్పుడైతే మెచ్యూరిటీ అనే పాయింటు హీరో హీరోయిన్లని విడదీసిందో, అది కథకుడి/ దర్శకుడి మెచ్యూరిటీని కూడా సవాలు చేయడంతో, చేతులెత్తేసి ఈజీ సొల్యూషన్ కోసం  రొటీన్ ఫార్ములా బాట పట్టే గాయపడ్డ రియలిస్టిక్  కథ. సమస్యని పరిష్కరించడానికి విధి లేనట్టు అరిగిపోయిన ఫాల్స్ డ్రామాతో- ఒకింత మెల్ షావెనిజంతో-  అకారణంగా హీరోయిన్ని శిక్షించి సంతృప్తి పడే కథ.  హిందీలో క్రేజ్ సంపాదించుకున్న  ప్యార్ కా పంచనామాలాంటి రియలిస్టిక్ రిలేషన్ షిప్స్ తో ఉండాల్సిన కథ మరోవైపు సీరియెస్ నెస్ ఎక్కువైపోయి- రోమాంటిక్ కథలాగాక, డార్క్ మూవీగా  మారిపోయిన హెవీ, స్లో నేరేషన్ కథ. ఇలాటి డార్క్ మూడ్ తో పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ మూవీ ‘పంజా’ ఈ సందర్భంగా గుర్తుకు రాకమానదు.

ఎవరెలా చేశారు.
        రాజ్ తరణ్ కిది భిన్నమైన పాత్రే.. మొదటి రెండు సినిమాలకంటే అర్బన్ ఫ్లేవర్ వున్న పాత్ర పోషించాడు. పాత్రకి తగ్గట్టే నటనని డౌన్ ప్లే చేసినా, సెకండాఫ్ కొచ్చేసరికి మారిపోయిన ఫార్ములా సరళికి తగ్గట్టే తనూ ఫార్ములా హీరో పాత్రగా మారిపోవాల్సి వచ్చింది. కొన్ని ఫీల్, సెంటిమెంట్స్ వున్న సీన్స్ లో ఓవరాక్టింగ్ కి దూరంగా వున్నాడు. రెండు మాస్ పాటలతో ప్రేక్షకులకి హుషారెక్కించాడు. తనకంటే హీరోయినే ఎక్కువ ఫన్నీగా ఉంటూ, తను ప్రేక్షక మాత్రుడిగా వుండి పోవడంతో కామెడీ ఏదైనా వుంటే అది హీరోయిన్ ఖాతాలోనే పడిపోయింది. 

        హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ కి సరీగ్గా సరిపోయేఫిజిక్ నీ, మేనరిజమ్స్ నీ  సంతరించుకుని- కుమారి అనే క్యారక్టర్  గుర్తుండి పోయేలా చేసింది. ఓ పట్టాన అర్ధంగాని సంక్లిష్ట అమ్మాయి పాత్ర  ఇది. ఈ పాత్ర డిమాండ్ చేసే భిన్న మూడ్స్ నీ, విభిన్న షేడ్స్ నీ చాలా అనుభవమున్న నటిలా నటించేసింది.  మంచిదో చెడ్డదో, ఈ రకంగానైనా  తెలుగు సినిమాల్లో కరువైపోయిన బలమైన హీరోయిన్ పాత్ర కొరత తీరిపోయింది. దీనికి సుకుమార్ నీ, ఇందుకు ఒప్పుకున్నా హీరో రాజ్ తరుణ్ నీ అభినందించాలి. 

        దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం ఈ సినిమా కథ డిమాండ్ చేసే డార్క్ మూడ్ నే  క్రియేట్ చేశాయి. కొత్త దర్శకుడి  విషయానికొస్తే, ఈయన వెనుక అన్నిటా సుకుమార్ చేయి వున్నట్టన్పిస్తుంది. సుకుమార్ ముద్రతోనే మూవీ కన్పిస్తుంది. దీంతో కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ పాత్ర ఎంతో తెలిసే అవకాశం లేకుండా పోయింది.


(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)
-సికిందర్