రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 21, 2015

సు'కుమారీయం' !







దర్శకత్వం :  పల్నాటి  సూర్య ప్రతాప్ 

కథ-  స్క్రీన్ ప్లే : సుకుమార్ 
తారాగణం : రాజ్ తరుణ్
, హెబ్బా పటేల్, హేమ తదితరులు 
మాటలు : పొట్లూరి వెంకటేశ్వర రావు
, 
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు 
బ్యానర్ : పి ఎ మోషన్ పిక్చర్స్
 
నిర్మాతలు :
  విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి
విడుదల :  20 నవంబర్ 2015 

                     ***


         ప్రేమ కథల్ని సైకలాజికల్ గా ఏదో మలుపు తిప్పి కొత్తగా చెప్పాలన్న తపన గల దర్శకుడు సుకుమార్ ఈసారి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తను ఒక న్యూ ఏజ్ - మెట్రో లవ్ స్టోరీ లాంటి దాన్ని స్క్రీన్ ప్లే చేసి అందించారు. ఓ రెండు సినిమాలు- ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్తా మావాలతో యూత్ లో పాపులరైన హీరో రాజ్ తరుణ్ - తమిళ నటి హెబ్బా పటేల్ ల కాంబినేషన్ లో మొహమాట పడకుండా అడల్ట్ కంటెంట్ ని దట్టిస్తూ రియలిస్టిక్ ప్రేమకథ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం  దర్శకుడు మారుతీ తీసిన ఓ రెండు మూడు అడల్ట్  కామెడీలకీ, లేదా మొన్న వచ్చిన తమిళ ‘త్రిష లేదా నయనతార’ అనే  అల్ట్రా అడల్ట్ కామెడీకీ తేడాగా ఏమైనా ఉందా- లేక ఏదో డేరింగ్ ప్రయత్నం  పేరుతో పర్వెర్టెడ్ సెక్స్ గా తయారయ్యిందా ఈ కింద చూద్దాం..

        సిద్దూ (రాజ్ తరుణ్) కేటరింగ్ కోర్సు చదివి ఆవారాగా తిరుగుతూ,  సింగపూర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూంటాడు. అతడి తల్లి (హేమ) ఓ నర్సు. భర్త వేరే సంబంధం పెట్టుకున్నాడని ఇరవై ఏళ్ళ క్రితం అతణ్ణి వదిలేసి ఆమె కొడుకుతో ఉంటోంది. సిద్దూ కి ముగ్గురు ప్రెండ్స్ వుంటారు. చిల్లర దొంగ తనాలు చేసి బతికేస్తూంటారు. తాగుళ్ళు తిరుగుళ్ళూ అన్నీ జరిగిపోతూంటాయి. వాళ్ళు నేరాలు చసి అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయినప్పుడల్లా తను అన్నం తీసికెళ్ళి అందిస్తూ సాయంగా ఉంటాడు. 

        ఇలా వుండగా ఈ కాలనీలోకి ముంబాయి నుంచి కుమారి (హెబ్బా పటేల్) అనే ఒక బి గ్రేడ్ ఛోటా మోడల్ వచ్చి తాత తో కలిసి సెటిలవుతుంది. సిద్దూని చూడగానే క్లోజ్ అవుతుంది. లవ్యూ చెప్పేస్తుంది. ఆమె విపరీత ప్రవర్తన
, హద్దులు మీరిన మాటలూ అతణ్ణి తికమక పెట్టేస్తాయి. చొరవ చేసి ఆమె కిస్ కూడా చేసేసరికి, తన ముందు ఎక్స్ పోజ్ కూడా చేసేసరికి - సిద్దూ ఫ్రెండ్స్ హెచ్చరిస్తారు. ఆమెకి చాలా మంది బాయ్ ఫ్రెండ్ వుండి  ఉంటారనీ, క్యారక్టర్ మంచిది కాదనీ నూరి పోస్తూంటారు. ఇతర అబ్బాయిల్ని జస్ట్ ఫ్రెండ్స్ అని ఆమె తెగ తిరిగేస్తూంటుంది. ఆమె ఎలా కన్పించినా, ఎవరేం చెప్పినా సిద్దూ ఆమెని ప్రేమించేస్తాడు. కానీ అనుమానం తీరక ఆమె క్యారక్టర్ ని పరీక్షించబోయి దొరికిపోతాడు. దీంతో ఆమె ఛీ కొడుతుంది. నన్ను ప్రేమించే మెట్యూరిటీ నీకు లేదని గుడ్ బై కొట్టేస్తుంది.
 

        హర్టయిన  సిద్దూ ఆమెకో చాలెంజి విసిరి, ఆ మేరకు వేరే అమ్మాయితో తిరగడం మొదలెడతాడు. మనం ప్రేమించే మనిషి వేరొకరితో తిరిగితే ఎలా వుంటుందో ఆమె తెలుసుకోవాలని ఇలా చేస్తూంటాడు. ఈ పంతాలు పట్టింపులూ రకరకాల మలుపులకి దారితీస్తాయి. పరిస్థితి విషమంగా మారుతుంది. అప్పుడు ఆమె గతం గురించి తెలుసుకున్న సిద్దూ మనసుమార్చుకుంటాడు. ఇంతలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. చివరికి వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
        యూత్ కి కనెక్ట్ చేయాలని తపన పడ్డ కథ. మారుతీ సినిమాలతో ద్వంద్వార్థ, ఏకార్ధ రోమాంటిక్ కామెడీలు యూత్ లో చెడ్డ పేరు తెచ్చుకుని అంతరించిపోయిన నేపధ్యంలో, మొన్నే ‘త్రిష లేదా నయనతార’ అనే మరో అడల్ట్ మూవీనీ మట్టి కరిపించిన పూర్వరంగంలో, సుకుమార్ అనే బ్రాండింగ్ తో వచ్చినందుకు కొంతవరకూ ప్రేక్షకులు ఔదార్యం చూపించగల బోల్డ్- సెక్స్- కండోమ్స్ సహిత అడల్ట్ కథ. ఆధునికత అంటే అవధుల్లేని విశృంఖలత్వమనే ధోరణికి ఎక్కువగా లోబడి సాగే కథ. ఇంటలెక్చువల్ గా దర్శకుడి నుంచి పైస్థాయి వ్యక్తీకరణల్ని డిమాండ్ చేసే కథ. ఎప్పుడైతే మెచ్యూరిటీ అనే పాయింటు హీరో హీరోయిన్లని విడదీసిందో, అది కథకుడి/ దర్శకుడి మెచ్యూరిటీని కూడా సవాలు చేయడంతో, చేతులెత్తేసి ఈజీ సొల్యూషన్ కోసం  రొటీన్ ఫార్ములా బాట పట్టే గాయపడ్డ రియలిస్టిక్  కథ. సమస్యని పరిష్కరించడానికి విధి లేనట్టు అరిగిపోయిన ఫాల్స్ డ్రామాతో- ఒకింత మెల్ షావెనిజంతో-  అకారణంగా హీరోయిన్ని శిక్షించి సంతృప్తి పడే కథ.  హిందీలో క్రేజ్ సంపాదించుకున్న  ప్యార్ కా పంచనామాలాంటి రియలిస్టిక్ రిలేషన్ షిప్స్ తో ఉండాల్సిన కథ మరోవైపు సీరియెస్ నెస్ ఎక్కువైపోయి- రోమాంటిక్ కథలాగాక, డార్క్ మూవీగా  మారిపోయిన హెవీ, స్లో నేరేషన్ కథ. ఇలాటి డార్క్ మూడ్ తో పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ మూవీ ‘పంజా’ ఈ సందర్భంగా గుర్తుకు రాకమానదు.

ఎవరెలా చేశారు.
        రాజ్ తరణ్ కిది భిన్నమైన పాత్రే.. మొదటి రెండు సినిమాలకంటే అర్బన్ ఫ్లేవర్ వున్న పాత్ర పోషించాడు. పాత్రకి తగ్గట్టే నటనని డౌన్ ప్లే చేసినా, సెకండాఫ్ కొచ్చేసరికి మారిపోయిన ఫార్ములా సరళికి తగ్గట్టే తనూ ఫార్ములా హీరో పాత్రగా మారిపోవాల్సి వచ్చింది. కొన్ని ఫీల్, సెంటిమెంట్స్ వున్న సీన్స్ లో ఓవరాక్టింగ్ కి దూరంగా వున్నాడు. రెండు మాస్ పాటలతో ప్రేక్షకులకి హుషారెక్కించాడు. తనకంటే హీరోయినే ఎక్కువ ఫన్నీగా ఉంటూ, తను ప్రేక్షక మాత్రుడిగా వుండి పోవడంతో కామెడీ ఏదైనా వుంటే అది హీరోయిన్ ఖాతాలోనే పడిపోయింది. 

        హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ కి సరీగ్గా సరిపోయేఫిజిక్ నీ, మేనరిజమ్స్ నీ  సంతరించుకుని- కుమారి అనే క్యారక్టర్  గుర్తుండి పోయేలా చేసింది. ఓ పట్టాన అర్ధంగాని సంక్లిష్ట అమ్మాయి పాత్ర  ఇది. ఈ పాత్ర డిమాండ్ చేసే భిన్న మూడ్స్ నీ, విభిన్న షేడ్స్ నీ చాలా అనుభవమున్న నటిలా నటించేసింది.  మంచిదో చెడ్డదో, ఈ రకంగానైనా  తెలుగు సినిమాల్లో కరువైపోయిన బలమైన హీరోయిన్ పాత్ర కొరత తీరిపోయింది. దీనికి సుకుమార్ నీ, ఇందుకు ఒప్పుకున్నా హీరో రాజ్ తరుణ్ నీ అభినందించాలి. 

        దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం ఈ సినిమా కథ డిమాండ్ చేసే డార్క్ మూడ్ నే  క్రియేట్ చేశాయి. కొత్త దర్శకుడి  విషయానికొస్తే, ఈయన వెనుక అన్నిటా సుకుమార్ చేయి వున్నట్టన్పిస్తుంది. సుకుమార్ ముద్రతోనే మూవీ కన్పిస్తుంది. దీంతో కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ పాత్ర ఎంతో తెలిసే అవకాశం లేకుండా పోయింది.


(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)
-సికిందర్