రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, నవంబర్ 2021, మంగళవారం

1098 : స్పెషల్ ఆర్టికల్


 కోవిడ్ - 1, 2 లాక్ డౌన్లలో కేరళలో ఉప్పొంగిన ఓటీటీ బూమ్ తగ్గుముఖం పడుతోందా? చిన్న సినిమాల విషయంలో నిజమే. ప్రేక్షకుల్లో వచ్చిన మార్పు ఇందుకు కారణం. కోవిడ్  లాక్ డౌన్స్ లో కేరళ సినిమా థియేటర్లు మరోసారి మూతపడడంతో అందరి దృష్టి ఆన్‌లైన్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ వైపు మళ్ళింది. వాస్తవానికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ సంస్థలతో బాటు, దాదాపు ఎనిమిది ఇతర మూవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్స్ కేరళలో ప్రారంభమయ్యాయి. చిన్న సినిమాలైనా క్వాలిటీతో సినిమా లందిస్తూ, దేశంలో ఇతర ప్రాంతాలకీ మలయాళ సినిమాలు విస్తరించడానికి ఈ ప్లాట్ ఫామ్స్ తోడ్పడ్డాయి.

        
    కానీ రాను రాను ప్రధాన ఓటీటీల్లో  ప్రీమియర్ అవుతున్న కొత్త మలయాళ చిన్న సినిమాల సంఖ్య తగ్గు ముఖం పట్టేసింది. కారణం పాపులర్ తారలు నటించే భారీ రీచ్ వుండే సినిమాల వైపే ఓటీటీలు మొగ్గు చూపడం. మరో వైపు చిన్న సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసుకుందామంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళడం మానేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఓటీటీల్లో వస్తాయి కదాని. ఇలా ఇటు థియేటర్లకి ప్రేక్షకులు రాక, అటు ఓటీటీలూ సినిమాలు తీసుకోక అడకత్తెరలో పోక చెక్కలా తయారవుతోంది చిన్న సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి!

        చిన్న సినిమాల పట్ల ఓటీటీలకి ఆసక్తి లేదు. వుంటే కఠిన నిబంధనలు పెడుతున్నారు. ‘పే-పర్-వ్యూ’ పద్ధతిన కంటెంట్‌ని స్క్రీన్ చేస్తామంటున్నారు. దీనికి నిమిషాల/గంటల లెక్కలు కడుతున్నారు. ఒక ప్రేక్షకుడు ఒక సినిమాపై ఆసక్తితో క్లిక్ చేసి, స్ట్రీమ్ చేయడం ప్రారంభించి, 10 నిమిషాల తర్వాత మనసు మార్చుకుని, దాన్ని మూసేసి, లేదా మార్చేసి, వేరే సినిమా క్లిక్ చేస్తే, చెల్లింపు ఆ కొద్ది నిమిషాలకి మాత్రమే వుంటుందనేది ఈ కొత్త పద్ధతి. దీంతో లభించే ఆదాయంలో భారీ కోత పడుతుంది. దీంతో నిర్మాతలకి ఏం చేయాలో తోచడం లేదు.

        ఇదిలా వుంటే పాపులర్  హీరోలతో పెద్ద బ్యానర్లు నిర్మించే పెద్ద సినిమాల ప్రసార హక్కుల్ని ఓటీటీలు పోటీలు పడడం కొత్త ట్రెండ్‌గా మారింది. మలయాళ స్టార్ మోహన్‌ లాల్ తో 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న మరక్కర్ అనే సినిమా హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో 60-70 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

        అమెజాన్ ప్రైమ్ ఇలా కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంలో ఆశ్చర్యం లేదు.  స్టార్ సినిమాల్ని స్ట్రీమింగ్ చేస్తే సబ్ స్క్రైబర్లు పెరుగుతారని వ్యూహం. అదే చిన్న సినిమాలకి సబ్ స్క్రైబర్లు ఏమీ పెరగడం లేదు. దీంతో ఓటీటీలు స్టార్ సినిమాలవైపు పరుగులు తీయడం మొదలు పెట్టాయి. మోహన్ లాల్ నటించిన ‘లూసివర్’ ని అమెజాన్ స్ట్రీమింగ్ చేసినప్పుడు భారీ సంఖ్యలో సబ్ స్క్రైబర్లు చేరినట్టు సంస్థ వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన తమిళ స్టార్ సూర్య నటించిన ‘జై భీమ్’ చూడడానికి కొత్త సబ్‌స్క్రైబర్‌లు పెరిగారు.

        ఈ పరిణామాల్లో చిన్న సినిమాలు కనీసం థియేటర్లలో నైనా ఆకర్షించాలంటే క్వాలిటీ కంటెంట్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు నిపుణులు. ఇక్ఫాయ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో వెల్లడైన అంశాలే ఇందుకు నిదర్శనం. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడాలని నిర్ణయించుకునే ముందు సినిమా కంటెంట్‌ పై సానుకూల సమీక్షల కోసం చూస్తున్నారని పరిశోధన వెల్లడించింది. సినిమా కంటెంట్‌ పై రివ్యూలు యావరేజ్ లేదా బ్యాడ్‌గా వుంటే, థియేటర్లలో చూడకూడదని భావిస్తున్నారు. కంటెంటే ప్రధానాంశంగా మారింది.

        ఓటీటీల్లో ఒక భాష కాదు, వందలాది భాషల దేశ దేశాల సినిమాలు విడుదలవుతున్నాయి. చాలా వరకూ ఇవి డిజిటల్ మహా సముద్రంలో మరుగున పడిపోతున్నాయి. వీటిని ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆన్ లైన్లో రికమెండేషన్ ఇంజిన్లు వున్నాయి. ఇవి ప్రేక్షకుల అభిరుచుల ప్రకారం ఎంపిక చేసిన సినిమాల్ని దృష్టికి తెస్తున్నాయి. ఆన్ లైన్లో సెర్చింగ్, స్క్రోలింగ్ చేయడం తప్ప వ్యూయింగ్ చేయని జనరేషన్, రికమెండేషన్ ఇంజిన్లు సూచించే సినిమాలని కూడా చూడాలని ఆసక్తి కనబర్చడం లేదు.

        ఆన్ లైన్లో వ్యూయింగ్ ఆప్షన్లు అసంఖ్యాకంగా పెరిగిపోవడంతో, ప్రేక్షకులు వాటితో పోటీ పడి సమయమంతా సినిమాలకి వెచ్చించలేని పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే ఓటీటీలకి అర్ధంగావడం లేదు. భాష, జానర్, నటులు, దర్శకులు వంటి ప్రేక్షకుల అభిరుచుల్ని బట్టి రికమెండేషన్ ఇంజిన్లు సినిమాల్ని ప్రేక్షకుల దృష్టికి తెస్తాయి. ఇందుకోసం 35 పై బడిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి పది భాషల్లో, 1, 50,000 సినిమాలు, 30,000 షోలు ప్రేక్షకుల ముందుంచుతున్నాయి. ఇంత భారీ కంటెంట్ బజార్లో చిన్న సినిమాలు ఎవరి దృష్టిలో పడతాయి. ఈ పరిస్థితి మలయాళ సినిమా రంగానికి సంకటంగా మారింది.

        ఇటు తెలుగులో చిన్న సినిమాల పరిస్థితీ ఇంతే. నవంబర్ లో 26 సినిమాలు థియేటర్లలో విడుదలైతే అన్నీ ఫ్లాపయ్యాయి. కాస్త గుర్తింపు వున్న రాజ్ తరుణ్, ఆనంద్ దేవరకొండ సినిమాలకి కూడా ప్రేక్షకుల్లేరు. ఓటీటీల్లో చూద్దామనే ఉదాసీనతే. ఓటీటీ దాకా ఎన్ని చిన్న సినిమాలు వెళ్తాయో చెప్పలేని పరిస్థితి. వెళ్తే అక్కడా రెవెన్యూ నమ్మకం లేదు. చిన్న సినిమాలని థియేటర్లలోనే ఆడించుకోవాలంటే అద్భుత కంటెంట్ ని ఆవిష్కరిస్తూ వుండాలి. జీరో కంటెంట్ తో కునారిల్లుతున్న చిన్న సినిమాలు మ్యాజికల్ కంటెంట్ కి ఎదగడమనేది కలలోని మాటే!

***