రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఏప్రిల్ 2019, మంగళవారం

807 : సందేహాలు - సమాధానాలు


Q : మీరు ‘సూర్యకాంతం’ స్క్రీన్ ప్లే సంగతులు రాశారు. కానీ మజిలీ, జెర్సీ, చిత్రలహరి స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు. ఇలా అయితే మాకు కష్టంగా వుంది.  
సుధీర్, టాలీవుడ్
         
A : తెలుగు రాజ్యం డాట్ కాంలో ప్రతీవారం రివ్యూల వరకూ రాస్తూనే వున్నాం. మళ్ళీ విడిగా వాటికి  స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే సమయం చిక్కడం లేదు. ఆలస్యమైపోయాక రాయడంలో అర్ధం కూడా వుండదు. ఓ రెండు వెబ్ సైట్లకి, ఓ పత్రిక్కి, బ్లాగుకి తెలుగు, హిందీ, ప్రాంతీయ సినిమాలు నాల్గైదు చూసి రాసేసరికల్లా వారం గడిచిపోయి మళ్ళీ కొత్త వారం కొత్త సినిమాలు ముందుంటున్నాయి. ఈ పరిస్థితిలో స్క్రీన్ ప్లే సంగతులు దైవాధీనంగా తయారయ్యాయి. ప్రయత్నిద్దాం. మజిలీ, జెర్సీ, చిత్రలహరిల గురించి కొన్ని అభిప్రాయాలు  వచ్చాయి. వాటిని ఈ కింద తెలుసుకుందాం. 

         
Q : వరుసగా విడుదలైన మజిలీ, జెర్సీ, చిత్రలహరి మూడూ పరాజితుల కథలేనని మీరు ‘జెర్సీ’ రివ్యూలో రాశారు. కానీ జెర్సీ పరాజితుడి కథ అనుకోను. అతను జబ్బు వున్న క్యారక్టర్ కదా? నాకు ముగింపులో తేల్చిన విషయం రొటీన్ క్యాన్సర్ ఫార్ములా కథలా అన్పించింది.
రామ్ కే, టాలీవుడ్ 

      A : వాస్తవానికి అతను జబ్బు కారణంగా క్రికెట్ కి దూరమైన క్యారెక్టర్. కానీ ధూమపానానికి, మద్యపానానికీ జబ్బు అడ్డు కాదన్నట్టు చిత్రణ వుంది. జబ్బు అనేది ముగింపులో బయట పెట్టిన రహస్యం. అంతవరకూ అతన్ని చూపించింది క్రీడా రంగంలో రాజకీయాల వల్ల క్రికెట్ కి దూరమై, పదేళ్ళ తర్వాత పరిస్థితుల వల్ల తప్పని సరై లేటు వయసులో క్రికెట్ కి పూనుకున్నాడనే. దీంతో జీవితంలో ఏదైనా సాధించడానికి వయసు అడ్డు కాదనే పరాజితుడి కథ ఉపరితలంలో కన్పిస్తోంది. అంతరంగంలో దాచిన కారణం మాత్రం జబ్బు. దీని వల్ల ఒక కాన్సెప్ట్ కి సెటిలై ఒక రియలిస్టిక్ గా నడుస్తున్న మూవీ చూస్తున్నప్పుడు, ముగింపులో ఈ కాన్సెప్ట్ క్యాన్సిలై రియలిస్టిక్ జానర్ కాస్తా జబ్బు అనే ఫార్ములా ట్విస్టుతో ముగింపు కొచ్చినప్పుడు,  సహజంగానే మింగుడుపడదు మీలాటి ఆలోచనాపరులకి. కానీ మెజారిటీ ప్రేక్షకులకి నచ్చిందిది. ఇదే కథ అంతగా ఫాలోయింగ్ లేని హీరోతో తీస్తే ఛీఛీ అంటారు మెజారిటీ ప్రేక్షకులే. కాబట్టి ‘జెర్సీ’ లో ప్రేక్షకులు తమ అభిమాన నేచురల్ స్టార్ ని నానిని చూస్తున్నారు కొత్తగా, కథని కాదు. ఉపరితలంలో ఒక కథ నడుస్తూ,  చివర అంతరంగంలో దాచిపెట్టిన అసలు కథ బయటపడే కాన్సెప్టులు మర్డర్ మిస్టరీలతో, సస్పన్స్ థ్రిల్లర్స్ తో వుంటాయి. ఇలాటి కాన్సెప్ట్స్ తో ‘ఎండ్ సస్పెన్స్’  అనే సినిమా విజయావకాశాల్ని దెబ్బతీసే కథా ప్రక్రియని కవర్ చేయడానికి ఈ టెక్నిక్ ని వాడతారు. ఈ టెక్నిక్ ని కనిపెట్టింది 1958 లో ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ తో. దీని గురించి బ్లాగులో అనేక సార్లు రాశాం. 

           
Q : జెర్సీ, మజిలీ, చిత్రలహరి సినిమాలు ఇంచుమించు ఒకే రకమైన పాత్రలతో, కథలతో రావడాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రేక్షకులు సహజత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో దీన్ని బట్టి అర్ధంజేసుకోవాలేమో. అలాగని అన్నీ ఇలాటి సినిమాలే వచ్చి పడితే చూస్తారనుకోను. తెలుగు సినిమా ప్రైమరీగా యూత్ ఓరియెంటెడ్. వాళ్ళు కోరుకునేది ఎంటర్ టైన్మెంట్. తామేం చేయాలో మెసేజీలు కాదేమో అన్పిస్తోంది.
దర్శకుడు, టాలీవుడ్ 

      A : సినిమా పని పరిస్థితిని ఏకరువు పెట్టడం తప్ప, అంటే రిపోర్టింగ్ చేయడం తప్ప,  మెసేజి లివ్వడం కాదనేది అందరూ ఒప్పుకునే మాటే. ఆ చేసిన రిపోర్టింగ్ లో ఏదైనా మెసేజి ఫీలైతే ప్రీక్షకులే తీసుకుంటారు, లేకపోతే లేదు. కొన్ని ప్రాంతీయ సినిమాలు చూస్తే ఈ కళనే ఒడిసి పట్టినట్టు కన్పిస్తాయి. ‘ఆదిమ్ విచార్’ అనే కోసలీ గిరిజన కథా చిత్రంగానీ, ‘లోక్టాక్ లైరేంబీ’ అనే మణిపురి మత్య్సకారుల కథా చిత్రం గానీ... ఇలా ప్రాంతీయ సినిమాలు పనిగట్టుకుని మెసేజి లివ్వడం లేదు. పరిస్థితిని ఏకరువు పెట్టి వదిలేస్తున్నాయి. ప్రేక్షకులే ఆలోచించుకుంటారు. మన తెలుగులోకి వచ్చేసరికి బల్లగుద్ది ఏదో మెసేజి ఇచ్చేయాలన్న పెద్దరికం వచ్చేస్తోంది. దర్శకుడు పెద్దోడు కాదు, ప్రేక్షకులకంటే చిన్నోడే. బల్ల మీద విషయం పెట్టాలి, ప్రేక్షకులు చూసి ఏమనుకోవాలో అనుకుంటారు. మీరన్నట్టు ఇలా సీరియస్ రియలిస్టిక్ ధోరణుల్లో తీస్తూపోతే ఎవరూ చూడరు. కొత్తగా అన్పించి ఇప్పుడు రెండు మూడు చూశారేమో. సినిమా అనేది ప్రధానంగా వినోద సాధనమే. లేకపోతే డబ్బులు రావు, ఇంత వందేళ్ళ చరిత్రా వుండదు. కాబట్టి ఏదైనా పరిస్థితిని ఏకరువు పెట్టాలన్నా, పరిస్థితులు ఇలా వుండకూడదని చెప్పాలన్నా అది వినోదాత్మకంగానే చేయాలి. ఇలాటివి తెలుగులో పాతవి చాలా వున్నాయి. ఎంటర్ టైనర్స్  అనేవి సమాజంలో పరిస్థితులుగానీ, వ్యక్తులుగానీ అలాకాదు, ఇలా వుండాలని చిత్రిస్తూ ఎంటర్ టైన్ చేస్తాయి. అదే ఆర్ట్ సినిమాలు లేదా రియలిస్టిక్ సినిమాలు ఉన్నదున్నట్టు మాత్రమే పరిస్థితిని చూపిస్తాయి. ఈ మాట – ఈ తేడా ఫేమస్ క్రిటిక్ రోజర్ ఎబర్ట్ చెప్పాడు. కాబట్టి ఎంటర్ టైనర్స్ ని ఈ చెప్పిన విధానంలో తీసే ప్రయత్నం చేస్తే, విశేష ప్రజాదరణ పొందే అవకాశముంది. 

           
Q : ‘జెర్సీ’ సినిమా ప్రయత్నిస్తూ ఓడిపోయిన 99 మందిలో ఒకడి కథ అన్నారు చివర్లో. కానీ జబ్బు కారణంగా ఆటను వదిలి, కొడుకు కోసం ఆడి చనిపోయిన ఒక తండ్రి కథ అన్పించింది. ఇటీవల విడుదలైన జెర్సీ, మజిలీ, చిత్రలహరి మూడూ లూజర్స్ కథలే ఏ కారణం వల్ల విజయం సాధించాయో. ‘జెర్సీ’ బావుందనిపించినా, అసమర్ధుని జీవ యాత్రలా వుందనిపించింది నాకైతే.
మహేష్ ఆర్,  టాలీవుడ్ 

     A : మీరు చెప్పినవన్నీ కరెక్టు. అది ఆ పాత్రవరకూ దాని పర్సనల్ కథ మాత్రమే. దీంట్లోంచి ప్రేక్షకులు తీసుకోవాల్సినంత మెసేజీ ఏమీ లేదు. ఎందుకంటే ప్రేక్షకులందరూ అలాటి జబ్బున్నవాళ్ళయి వుండరు. అతడికి గనుక డయాబెటిస్ వుంటే, దాని కారణంగా ఆడలేకపోతే, ఆ డయాబెటిస్ ని జయించి - బ్యాటు పట్టుకుని సిక్సర్లు కొట్టిన కథగా అప్పుడు జనరలైజ్ అవుతుంది. అతడి పర్సనల్ కథగా వుండిపోదు. నేడు కామనై పోయిన డయాబెటిస్ వ్యాధిని జీవితాంతం మందులు వాడే  అవసరం లేకుండా క్యూర్ చేసుకున్న విజయగాథలు ఫారిన్లో వున్నాయి. వీటిలో మార్షల్ ఆర్ట్స్ ప్రముఖులూ వున్నారు. మార్షల్ ఆర్ట్స్ తో శరీరంలో ఇన్సులిన్ ప్రేరేరింప జేసుకుని డయాబెటిస్ ని జయించిన క్రీడాకారులున్నారు. ఇలాటి కథలు డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకి కొత్త ఉత్సాహాన్నీ, డయాబెటిస్ ని జయించవచ్చన్న కొత్త ఎవేర్ నెస్ ని కల్గిస్తూ ప్రయోజనాత్మకంగా వుంటాయి. వినోదాత్మకంగా చూపించవచ్చు. ‘జెర్సీ’ లాగా రియలిస్టిక్ కథకి ఓల్డ్ ఫార్ములా ట్విస్టు ఇచ్చే అగత్యమే ఏర్పడదు. కాన్సెప్ట్ ని సాధారణ స్థాయికి కుదించే, ప్రయోజన రహిత పర్సనల్ డ్రామాగా మార్చే అవసరమే రాదు. 

         ఇక ఈ లూజర్స్ కథలతో సినిమాలు మూడూ ఎందుకు ఆడాయంటే అగ్రతారలకి ఎట్రాక్ట్ అయి కావచ్చు. ఆ అగ్రతారలు ప్రేక్షకులు విసిగిపోయిన మూస రొటీన్ మాస్ హీరోయిజాల, పంచ్ డైలాగుల, ఫైటింగుల జోలికిపోకుండా,  కామన్ మ్యాన్ పాత్రలకి ఒదిగి కాస్త కొత్తగా కన్పించడం వల్ల కావచ్చు. ప్రేక్షకులకి పరమ బోరెత్తిపోయిన టెంప్లెట్ కథలనుంచి ఉపశమనం లభించడం వల్ల కావచ్చు. ఇలా పర్యావరణ సంగతులు ఫ్రెష్ గా కలిసివచ్చుంటాయి.
 
సికిందర్