రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 30, 2022

1279 : స్పెషల్ న్యూస్!

    2022 లో హిందీలో విడుదలైన 102 సినిమాల్లో ఐదే హిట్ కాగా మిగిలిన 97 ఫ్లాప్ అయ్యాయి. వీటిలో పేరున్న హీరోలవి 15. చిన్నాచితక 82. అమీర్ ఖాన్ నుంచీ ఆయుష్మాన్ ఖురానా వరకూ పేరున్న హీరోల బిగ్ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. 2022 లో బాలీవుడ్ నష్టం 3 వేల కోట్ల రూపాయలుగా తేలింది! పీవీఆర్ మల్టీప్లెక్స్ గ్రూపు సైతం సెప్టెంబర్ 30 త్రైమాసికానికి 53 కోట్లు నష్టాలు ప్రకటించింది. 2020 నుంచీ 2022 వరకూ మూడేళ్ళూ బాలీవుడ్ నావ నష్టాల నదిలో మునకలేస్తూనే వుంది. మొదటి రెండేళ్ళూ కరోనా లాక్ డౌన్ తో, ఈ యేడు తెరుచుకున్న మార్కెట్లో భారీ ఫ్లాపులతో.

        చాలా వరకూ లాక్ డౌన్ల పూర్వం ప్లాన్ చేసిన సినిమాలివి. మూడేళ్ళ తర్వాత ఈ కంటెంట్ రుచించలేదు ప్రేక్షకులకి. లాక్ డౌన్లలో వాళ్ళు ప్రపంచ సినిమాలు చూసి అభిరుచులు మార్చుకోవడంతో రెగ్యులర్ కమర్షియల్ హంగామాలు బోల్తా కొట్టాయి. వాటి వివరాలు చూద్దాం.

1. లాల్ సింగ్ చద్దా :  ఇది 2022లో అత్యధికంగా ఆశలు పెట్టుకున్న ప్రతిష్టాత్మకాల్లో ఒకటి. అమీర్ ఖాన్, కరీనా కపూర్ లు నటించిన ఈ మూవీ హాలీవుడ్ క్లాసిక్, ఫారెస్ట్ గంప్ కి రీమేక్. బడ్జెట్ 180 కోట్లు, బాక్సాఫీసు 59.58 కోట్లు. దీని ఫ్లాప్ కి ప్రధానంగా బాయ్ కాట్ కాటు కారణమయింది.

2. సామ్రాట్ పృథ్వీరాజ్ : అక్షయ్ కుమార్ తో 175 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన చారిత్రకం సామ్రాట్ పృథ్వీరాజ్ 68.06 కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాపయ్యింది. పృథ్వీరాజ్ పాత్రకి మీసాలు తీసేయమంటే అక్షయ్ తీసేయలేదని ఫ్లాప్ కి కారణం చెబుతూ వాపోయాడు దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది.

3. రక్షా బంధన్ :  అక్షయ్ కుమార్ ఖాతాలో రెండో ఫ్లాప్. బడ్జెట్ 100 కోట్లు, బాక్సాఫీసు 45.23 కోట్లు. ఇది రాఖీ పండగతో సిస్టర్ సెంటి మెంటు సినిమా. ఈ కాలంలో ఔట్ డెటెడ్ అయిపోయింది.

4. బచ్చన్ పాండే :
అక్షయ్ కుమార్ మూడో ఫ్లాప్. కృతీ సానన్ హీరోయిన్ గా నటించిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ 165 కోట్లతో తీస్తే 49 కోట్లు ఆర్జించి పెట్టింది.

5. రామ్ సేతు :
అక్షయ్ కుమార్ ఖాతాలో నాలుగో ఫ్లాప్. రామసేతు కాల్పనిక కథతో యాక్షన్ అడ్వెంచర్ గా తీసి రామ సేతు నిజమని నిరూపించారు. బడ్జెట్ 150 కోట్లు, బాక్సాఫీసు 92.94 కోట్లు. మొన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం రామ సేతు లేదని కొట్టి పారేసి, గౌతమ్ అదానికి శ్రీలంకకి సముద్ర మార్గం వేయడానికి కాంట్రాక్టు ఇచ్చేశామని ప్రకటించేసింది. దీనిమీద సోషల్ మీడియా భగ్గుమనలేదు. తమ ప్రభుత్వం కదా.  

6. సర్కస్ : డిసెంబర్ చివరి వారంలో విడుదలైన సర్కస్ రణవీర్ సింగ్ తో రోహిత్ శెట్టి తీసిన ఫ్లాప్. 115 కోట్లు బడ్జెట్. నష్టం ఇంకా తేలలేదు. మొదటి రోజు 6.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సోమవారానికి 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసి అతి పెద్ద ఫ్లాప్ గా తేలింది. రోహిత్ శెట్టి  గరిష్ట సినిమాలు బ్లాక్ బస్టర్స్. గోల్ మాల్ సిరీస్ నుంచీ సింగం వగైరా. పాత కథల్నే ఎవ్వరూ వూహించని కమర్షియల్ గిమ్మిక్కులు చేసి హిట్ చేస్తాడు. సర్కస్  1960 ల నాటి పీరియడ్ కథతో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంతో తీశాడు. ఈసారి ఎందుకో గిమ్మిక్కులు తగ్గాయి.

7. జయేష్‌భాయ్ జోర్దార్ : రణ్‌వీర్ సింగ్ రెండో ఫ్లాప్. 86 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే 16.59 కోట్లు వసూలు చేయగలిగింది.

8. రన్ వే 34 : అజయ్ దేవగన్ దర్శకత్వం వహించిన ఈ విమానయాన థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చాన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 65 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం 33.51 కోట్లు ఆర్జించారు.

9. షంషేరా :  నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రణబీర్ కపూర్ తిరిగి వస్తూ  నటించిన ఈ పీరియాడికల్ డ్రామా బడ్జెట్ 150 కోట్లు. అయితే కేవలం 41.5 కోట్ల రూపాయలు వసూలు చేసి 2022లో అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా తేలింది.

10. ఏన్ యాక్షన్ హీరో :  వెరైటీ సినిమాలతో ఆయుష్మాన్ ఖురానా పాపులర్ అయ్యాడు. అయితే ఏన్ యాక్షన్ హీరో తో రొటీన్ మసాలా నటించేసరికి 30 కోట్ల బడ్జెట్ కి 15.8 కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాపయ్యింది.

11. హీరో పంతి : అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన హీరోపంతి లో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా నటించారు. దీని బాక్సాఫీసు 24.91 కోట్లు మాత్రమే నమోదైంది. బడ్జెట్ వచ్చేసి 70 కోట్లు.

12. ఢాకడ్ :  ఇక వివాదాల రాణి కంగనా రణవత్ నటించిన ఢాకడ్ విషయం మరీ దారుణం. తన ట్విట్టర్ ఫాలోవర్స్ అయినా అందరూ చూడలేదని రుజువయింది. 85 కోట్లతో అట్టహాసంగా తీస్తే, రెండంటే 2.3 కోట్లు మాత్రమే జేబులో వేసుకుని దండం పెట్టారు నిర్మాతలు!

ఇంకా జాన్ అబ్రహాం ఎటాక్’, రాజ్ కుమార్ రావ్ హిట్’, వరుణ్ ధావన్ భేడియా ఫ్లాప్స్ లిస్టులో వున్నాయి. మొత్తం 15 సినిమాలు పేరున్న హీరోలకి అప్రదిష్ట మిగిల్చాయి. టాప్ ఫ్లాప్ మాస్టర్ అవార్డు అక్షయ్ కుమార్ కివ్వొచ్చు అంటున్నారు. ఇంకా లాక్ డౌన్ పూర్వపు బ్యాక్ లాగ్ తో వస్తాడేమోనని భయపడుతున్నారు. అమీర్ ఖాన్ ప్రస్తుతానికి రాడు. జనవరిలో కొత్త సంవత్సరాన్ని పఠాన్ తో ప్రారంభిస్తాడు షారూఖ్ ఖాన్. దీనికి బాయ్ కాట్ గ్యాంగ్ కాటు వేయడానికి కాచుకుని వున్నారు. వీళ్ళ కోరికలు తీర్చడానికే బాలీవుడ్  సినిమాలు తీస్తున్నట్టుంది. 2023 ఎలా వుండబోతోందన్నది చూస్తేగానీ తెలియదు.
***

 

Wednesday, December 28, 2022

1278 : స్పెషల్ న్యూస్!


  2022లో హిందీ సినిమాలు 102 విడుదలైతే ఐదే హిట్టయ్యాయి. పేరున్న హీరోల సినిమాలు 20 విడుదలైతే అందులో 15 ఫ్లాపులు, 5 హిట్లుగా నిలిచాయి. మిగిలిన ఫ్లాపయిన 82 సినిమాలు చిన్న సినిమాలు. 2020-21 కోవిడ్ మహమ్మారి ప్రభావాల నుంచి కాస్త వూపిరి పీల్చుకున్న బాలీవుడ్ కి 2022 లో కొత్త సమస్యలు చుట్టు  ముట్టాయి. లాక్ డౌన్లు ఎత్తేసినా ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడం, అల్లరి మూకలు బాయ్ కాట్ ట్రెండ్ లు నడపడం, ఓటీటీ గట్టి పోటీ నివ్వడం మొదలైన పరిణామాలు హిందీ సినిమాల్ని నష్టాల బాట పట్టించాయి. అయితే దక్షిణాది నుంచి వచ్చిన పానిండియా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

          గ్ర హీరోలు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాపయ్యాయి. 2022 కి వీడ్కోలు చెబుతూ విడుదలైన రణవీర్ సింగ్ భారీ మూవీ సర్కస్ దారుణంగా పరాజయం పాలయ్యింది. ఫ్లాప్స్ కారణాల్లో కంటెంట్ వైఫల్యం కూడా ఒకటి. 100 కోట్లు దాటిన క్లబ్ లో చేరిన 5 సినిమాల కంటెంట్ చూస్తే, ఐదుకి ఐదూ వేర్వేరు రుచుల కంటెంట్ ని థియేటర్లకి వచ్చి ఆరగించారు ప్రేక్షకులు. ఈ ఐదింటిని శాంపిల్స్ గా తీసుకుని 2023 కి కంటెంట్ ప్లాన్ చేస్తే హిట్టవుతాయా అన్నది చెప్పలేని మాట. ఒకసారి హిట్టయిన సినిమాలేమిటో చూద్దాం...
          
1. దృశ్యం 2 : అజయ్ దేవగణ్, టబు నటించిన దృశ్యం 2' మిస్టరీ థ్రిల్లర్ మొదటి వారంలోనే 100+ కోట్ల క్లబ్ లో చేరింది. నవంబర్ 18న విడుదలై డిసెంబర్ లో కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికి దేశీయ బాక్సాఫీసులో 200 కోట్ల రూపాయల వసూళ్ళు నమోదు చేసింది.
        
2. బ్రహ్మాస్త్ర- పార్ట్ 1 : సైన్స్ ఫిక్షన్ బ్రహ్మాస్త్ర- పార్ట్ వన్: శి ఈ సంవత్సరం మరో బ్లాక్ బస్టర్. సెప్టెంబర్ 9 న విడుదలైంది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున నటించిన భారీ-బడ్జెట్ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్ మొదటి మూవీ మొదటి రోజున 75 కోట్లు వసూలు చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్ విడుదలైన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్లలో 150 కోట్ల రూపాయల మార్కుని దాటేసింది.
        
3. భూల్ భులయ్యా -2 : అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భులయ్యా- 2’ మే 20న విడుదలైన హార్రర్ కామెడీ. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీని లైఫ్ టైమ్ కలెక్షన్స్ 250 కోట్లు దాటింది.
        
4. కాశ్మీర్ ఫైల్స్ : వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్  1990లో కాశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా తీసిన డాక్యూ డ్రామా. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. ఇది మొదటి వారంలో  100+ కోట్ల క్లబ్' లోకి ప్రవేశించింది. దేశీయ బాక్సాఫీసులో 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది మార్చి 11విడుదలైంది.
        
5. గంగూబాయి ఖాటియావాడి : సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో గంగూబాయి ఖాటియావాడి ఈ సంవత్సరం మరో పెద్ద బాక్సాఫీస్ హిట్ గా నమోదైంది. ఫిబ్రవరి 25న విడుదలైంది. మొదటి వారంలో 68.93 కోట్లు వసూలు చేసింది. రచయిత ఎస్ హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై లోని ఒక అధ్యాయం ఆధారంగా దీన్ని రూపొందించాడు భంసాలీ. ఇందులో అలియా భట్ 'గంగూబాయి' గా నటించింది. ఇది బయోపిక్. 1960ల నాటి కమాటీ పురాలో వేశ్య పాత్ర.  ఇందులో అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్ర. దీని లైఫ్ టైమ్ బాక్సాఫీసు 125 కోట్లు.
        
ఇలా పై విధంగా మిస్టరీ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ –ఫాంటసీ, హార్రర్ కామెడీ, డాక్యు డ్రామా, బయోపిక్ వంటి ఐదు విభిన్న జానర్స్ ని హిట్ చేశారు ప్రేక్షకులు. మాస్ మసాలా  యాక్షన్ సినిమాలు, రోమాంటిక్ కామెడీలు, చారిత్రికాలూ మొదలైన వాటన్నిటినీ తీసి అవతల పెట్టారు. ప్రేక్షకులు ఎదిగారు, అభిరుచుల్లో మార్పు వచ్చింది. ఇంకో అభిరుచి ఏమిటంటే సౌతిండియన్ పానిండియా సినిమాలు. విక్రమ్, పుష్ప, కేజీఫ్2, కార్తికేయ వంటి సినిమాలకి పట్టం గట్టారు.
        
దక్షిణాది సినిమాలు బాలీవుడ్ మీద దాడి చేస్తున్నాయని వాపోతున్న హిందీ నిర్మాతలు ఒక పని చేయ వచ్చు- దక్షిణాదికి వచ్చి పానిండియా సినిమాలు తీయడం! బాలీవుడ్ ని టాలీవుడ్ లో విలీనం చేస్తే ఇంకా బావుంటుంది.
(రేపు ఫ్లాపయిన 15 సినిమాలు)

—సికిందర్

Tuesday, December 27, 2022

1277 : స్పెషల్ న్యూస్!

    ఫారెస్ట్ గంప్ స్టార్ టామ్ హాంక్స్ లేటెస్ట్ కామెడీ- డ్రామా ఏ మాన్ కాల్డ్ ఒట్టో ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇది దశల వారీ విడుదల. సోనీ పిక్చర్స్ కొత్త పంపిణీ వ్యూహానికి తెర తీసింది. సినిమాని ఒకేసారి గ్లోబల్ విడుదలకి కాదు కదా లోకల్ విడుదలకి కూడా పూనుకోవడం లేదు. లోకల్ గా రెండంచెల్లో, గ్లోబల్ గా మూడో అంచెలో దశల వారీ విడుదలకి ప్లాన్ చేసింది. ఇది మంచి ఫలితాలు అందిస్తే ఇతర స్టూడియోలకి, పంపిణీదారులకీ మార్గ దర్శకంగా వుంటుందని భావిస్తున్నారు.

         మాన్ కాల్డ్ ఒట్టో క్రిస్మస్ మూవీగా విడుదల చేయలేదు. దీని విడుదలని కొత్త సంవత్సరపు ఆనందోత్సాహాల్ని  క్యాష్ చేసుకునేదుకు ఉద్దేశించారు. ఎంత లేదన్నా కొత్త సంవత్సరం ఫీల్ ని ఓ 15 రోజులైనా అనుభవిస్తారు మనుషులనే వాళ్ళు. ఆ తర్వాత ఆ సంవత్సరానికి తీసుకున్న నిర్ణయాలు, చేసిన బాసలు అవతల పారేసి ముందుకెళ్ళి పోతారు. ఆ 15 రోజుల ఉత్సాహాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ మూవీని అందిస్తున్నారు. ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒకరోజు అన్ని ఏరియాల్లో విడుదల చేసేస్తే దాని శోభ అన్ని రోజులూ వుండకపోవచ్చు. దశల వారీగా అందిస్తూపోతే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫ్రెష్ నెస్ తో వ్యాపిస్తూ పోతూంటుంది. అందుకని డిసెంబర్ 30, జనవరి 6, జనవరి 13 మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు.
        
ఈ మూడంచెల ప్లాట్ ఫామ్ విడుదల వ్యూహాన్ని మౌత్ టాక్ కి ముడిపెట్టి రచించారు. మొదటి విడుదల మౌత్ టాక్ రెండో విడుదలని విస్తృత పర్చడానికి, రెండో విడుదల మౌత్ టాక్ మూడో విడుదలని మరింత విస్తృత పర్చడానికీ దోహదం చేస్తాయి. డిసెంబర్ 30 న కేవలం న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ నగరాల్లో పరిమిత థియేట్రికల్ రిలీజ్ చేస్తారు. 2023 జనవరి 6అమెరికా వ్యాప్తంగా విడుదల చేసి, జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠని పెంచే ఈ వ్యూహం విజయవంతమైతే ఈ గ్లోబల్ యుగంలో తిరిగి వెనక్కి వెళ్ళినట్టే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ.
        
పాతరోజుల్లో ఇలాగే విడుదలయ్యేవి సినిమాలు. మన దగ్గర కూడా ముందు ఏ సెంటర్స్ లో, కొన్ని బి సెంటర్స్ లో విడుదలయ్యాక, మిగిలిన బి సెంటర్స్ కి వచ్చేవి. బి సెంటర్స్ నుంచి సి సెంటర్స్ కి వచ్చేవి. ఏ, బి సెంటర్స్ ని చూసి మిగిలిన బి సెంటర్స్ ప్రేక్రకులు మా వూరి కెప్పుడొస్తుందా అని చూసే వాళ్ళు, చిట్ట చివరికి బి సెంటర్స్ ని చూసి మా పల్లెటూరి కెప్పుడొస్తుందాని లొట్టలేసుకుంటూ ఎదురు చూసేవాళ్ళు పాపం సి సెంటర్స్ అభాగ్యులు. ఇదే ఇప్పుడు ఇంకో కోణంలో సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్.

నష్టనివారణ వ్యూహమే ఇది

    ప్లాట్‌ఫామ్ రిలీజ్ ప్లాన్ అనేది ఒక రకమైన పరిమిత విడుదల. అంటే  విస్తృత విడుదల కంటే తక్కువ థియేటర్‌లలో (సాధారణంగా 599 లేదా అంతకంటే తక్కువ) మొదట రిలీజ్ చేస్తారు. సానుకూల మౌత్ టాక్ అందుకుంటే, మార్కెటింగ్ ప్రచారాన్ని పెంచి మరిన్ని థియేటర్లకి విస్తరిస్తారు. ఈ వ్యూహంతో ప్రయోజనం ఏమిటంటే, మూవీ మార్కెట్ లో నిలబడే వరకు మార్కెటింగ్ ఖర్చులు అదుపులో వుంటాయి. మౌత్ టాక్ ని బట్టి ప్రచారం, థియేటర్లూ పెంచుకుంటూ పోతారు. మొదట్లోనే ఫ్లాప్ టాక్ వస్తే, పంపిణీదారు ప్రచారాన్ని విరమించుకోవచ్చు. తద్వారా ప్రకటనల, ప్రమోషన్ల ఖర్చులు తగ్గుతాయి. థియేటర్ల హైరింగ్ వ్యయం నుంచి కూడా తప్పించుకోవచ్చు.
        
మన దగ్గర ఒకేసారి వెయ్యి థియేటర్లలో విడుదల చేసి, ఒకేసారి పదుల కోట్లు ప్రమోషన్ల ఖర్చు భరించాక, తీరా ఫ్లాపయితే ఆ యెత్తున రిలీజ్ కైన వ్యయమంతా అదనపు నష్టంగా తేలుతుంది. బయ్యర్లు రోడ్డున పడతారు.

కోపిష్టి వర్సెస్ సరదా కుటుంబం

    ఫారెస్ట్ గంప్ లో లాంటి వినోదాత్మకమైన, హత్తుకునే కథలో టామ్ హాంక్స్ ని చూపించే ఏ మాన్ కాల్డ్ ఒట్టో 60 ఏళ్ళ వ్యక్తి కథ. ఇతడి పేరు ఒట్టో ఆండర్సన్. ఇతను కోపిష్టి. భార్య చనిపోవడం, ఉద్యోగంలోంచి రిటైర్ అవడం, అతడిలో విరక్తిని పెంచి చచ్చిపోవాలన్న కోరికని పుట్టిస్తాయి. ఇంతలో పక్కింట్లో ఒక కుటుంబం దిగుతుంది ఇద్దరు పి‌ల్లలు, పిల్లి సహా. ఉల్లాసంగా గడిపే ఈ కుటుంబం, ఒంటరి కోపిష్టి ఒట్టోని చూసి, అతడి జీవితాన్ని తలకిందులు చేసి చూపించాలని, అందర్నీ విమర్శించే, జడ్జి చేసే అతడి దృక్పథాన్ని సవాలు చేయాలనీ నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో కోపిష్టి వర్సెస్ సరదా కుటుంబం కథ వినోదభరితంగా సాగుతుంది.
        
ఏ మాన్ కాల్డ్ ఒట్టో స్వీడిష్ మూవీ ఏ మాన్ కాల్డ్ ఓవ్ కి రీమేక్. స్వీడిష్ రచయిత ఫ్రెడ్రిక్ బ్యాక్‌మన్ రాసిన నవల వీటికి ఆధారం. టామ్ హాంక్స్ తో బాటు మరియానా ట్రెవినో, రాచెల్ కెల్లర్, మాన్యువల్ గార్సియా-రుల్ఫో, కామెరూన్ బ్రిటన్ తదితరులు నటించారు. మార్క్ ఫార్స్టర్ దర్శకత్వం వహించాడు. 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ 60 మిలియన్ డాలర్లకి పంపిణీ హక్కులు పొందింది.
***

 

Monday, December 26, 2022

1276 : రివ్యూ!


రచన - దర్శకత్వం: అశ్విన్ శరవణన్
తారాగణం: నయనతార, హనియా నఫీసా, వినయ్ రాయ్, సత్య రాజ్, అనుపమ్ ఖేర్, తదితరులు
సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం : మణికంఠన్ కృష్ణమాచారి
బ్యానర్స్ : రౌడీ పిక్చర్స్, యూవీ కాన్సెప్ట్స్
నిర్మాత   : విఘ్నేష్ శివన్

        లేడీ సూపర్ స్టార్ (అని టైటిల్స్ లో వేశారు) నయనతార 2019 నుంచి మూడే తెలుగు సినిమాల్లో నటించింది- సైరా నరసింహా రెడ్డి, ఆరడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్. తమిళంలో అడపాదడపా నటిస్తోంది. ప్రయోగాత్మకాలు కూడా నటించింది. అయితే 2015 లో ఆమె నటించిన హార్రర్ మాయ దేశవ్యాప్తంగా చర్చకి దారి తీసింది. ఇది తెలుగులో మయూరి గా విడుదలైంది. దీని కథాకథనాలు, మేకింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించాయి. హార్రర్ అంత కళాత్మకంగా తీయడం మన దేశంలో జరగలేదు. 10 కోట్ల బడ్జెట్ కి రెండు భాషల్లో 45 కోట్లు వసూలు చేసింది. ఇది 24 ఏళ్ళ దర్శకుడు అశ్విన్ శరవణన్ సాధించిన అపూర్వ విజయం. తర్వాత తాప్సీతో గేమ్ ఓవర్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తీశాడు. తిరిగి ఇప్పుడు నయనతారతో కనెక్ట్ అనే హార్రర్. ఇది హాలీవుడ్ క్లాసిక్ ఎక్సార్సిస్ట్ నుంచి స్పూర్తి పొందిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, దీనికి కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యాన్ని జోడించినట్టు చెప్పాడు. మరి ఇది తను తీసిన మయూరికి కనీసం దగ్గరి ప్రమాణాలతో వుందా లేదా చూద్దాం...

కథ

    డాక్టర్ జోసెఫ్ (వినయ్ రాయ్), సుసాన్ (నయనతార), అమ్ము (హనియా నఫీసా) ఒక కుటుంబం. అమ్ముకి సంగీతం పట్ల ఆసక్తి. ఆమెకి లండన్ హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్లో సీటు వస్తుంది. కానీ ఇంత చిన్న వయసులో పంపడానికి సుసాన్ ఒప్పుకోదు. ఇది జరిగిన మర్నాడే కోవిడ్ 19 దృష్ట్యా లాక్ డౌన్ విధిస్తుంది ప్రభుత్వం. దీంతో సుసాన్, అమ్ము ఇంట్లో బందీలైపోతారు. నగరంలో వేరే చోట సుసాన్ తండ్రి ఆర్థర్ (సత్యరాజ్) వుంటాడు. డాక్టర్ జోసెఫ్ కోవిడ్ డ్యూటీతో హాస్పిటల్లో బిజీ అయిపోతాడు. అతను కోవిడ్ సోకి మరణిస్తాడు. సుసాన్ దుఖంతో వుంటుంది. అమ్ము తట్టుకోలేక పోతుంది. అయితే ఇద్దరికీ కోవిడ్ సోకి క్వారంటైన్ లో వుంటారు. అమ్ముకి తండ్రి ఆత్మతో మాట్లాడాలన్పించి ఆన్ లైన్లో వూయిజా బోర్డు ని ఆశ్రయిస్తుంది. దాంతో దుష్టాత్మ ఆమెనావహిస్తుంది. దీంతో భయపడిపోయిన సుసాన్ లాక్ డౌన్ సమయంలో కూతుర్ని ఎలా కాపాడుకుందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఓ బాలికకి దుష్టాత్మ ఆవహించడం, దాన్ని భూత వైద్యుడు వదిలించడం వంటి ఎక్సార్సిస్ట్ కోవలోనే వుంది కథ. ఇలాటి కథతోనే గత నెల తెలుగులో  మసూద చూశాం. ప్రస్తుత కథ కి లాక్ డౌన్ నేపథ్యం. దీంతో ఎక్కడున్న పాత్రలు అక్కడుండి పోయి- ఆన్ లైన్లో (వీడియో కాల్స్) ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వుంటారు. ఇలాగే సాగుతుంది మొత్తం కథ, ముంబాయి నుంచి ఆల్ లైన్లో భూత వైద్యం సహా. ఇదొక కొత్త క్రియేటివ్ ఐడియా కథనానికి. అయితే దీని నిర్మాణం లాక్ డౌన్ కాలంలో జరగలేదు.
        
2020 లాక్ డౌన్ సమయంలో మొత్తం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ అన్నీ రిమోట్ గానే, ఆన్ లైన్ లో జరిపి మలయాళంలో సీయూ సూన్ అనే థ్రిల్లర్ని చాలా ప్రయోగాత్మకంగా తీశాడు దర్శకుడు మహేష్ నారాయణన్. తీసి ఓటీటీలో విడుదల చేసి- లాక్ డౌన్ ఏదీ సినిమాల్ని ఆపలేదని రుజువు చేశాడు.
        
సీయూ సూన్’ చేతిలో వున్న స్మార్ట్ ఫోన్స్లాప్ టాప్స్డెస్క్ టాప్స్ వంటి అప్లికేషన్సే  కథలు చెప్పేందుకు మాధ్యమాలు కావచ్చని చెప్పింది. ఇంత కాలం కథల్ని వీటి స్క్రీన్స్ పై చూసేందుకు’ ఇవి మాధ్యమాలుగా వున్నాయిఇప్పుడు కథల్ని చెప్పేందుకు’ ఈ స్క్రీన్స్ మాధ్యమాలవుతాయి. ఆనాడు మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రేమికుల మధ్య కేవలం ఉత్తరాలతో ప్రయోగాత్మకంగా ‘దూరం’ అనే నవల విజయవంతంగా నడిపారు. ఉత్తరాల్లోనే ఆ కథ ప్రవహిస్తూంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లోలాప్ టాప్స్ లోడెస్క్ టాప్స్ లోఇంకా సీసీ కెమెరాల్లోటీవీలో కథ పరుగెత్తుతూంటే ఎలా వుంటుంది? ఈ అనుభవమే సీయూ సూన్ ఇన్నోవేటివ్ అయిడియా.
        
దీనికి ఇంకో రూపం కనెక్ట్. దీని కథ కోసం ఎక్సార్సిస్ట్ ఐడియా తీసుకుని, వూయిజా బోర్డు గేమ్ ని జోడించాడు దర్శకుడు. ఆత్మలతో మాట్లాడే ఈ గేమ్ వికటించి దుష్టాత్మ పట్టుకునే కథ. వూయిజా బోర్డు గేమ్ కథలతో హాలీవుడ్ నంచి 2014 లో, 2016 లో రెండు సినిమా లొచ్చాయి.
        
అయితే ఐడియా, టెక్నికల్ అంశాలు రెండూ బావుండి, కథ విషయంలోనే కుంటుపడింది. మయూరి ప్రమాణాలు మృగ్యమయ్యాయి. హార్రర్ సినిమా హార్రర్ లా వుండక ఏడ్పులతో వుంటే ట్రాజడీ సినిమా అన్పించుకుంటుంది. నయనతార పాత్ర ఏడుస్తూనే వుంటే, హార్రర్ తో థ్రిల్ ఏముంటుంది. కూతురికి పట్టిన హార్రర్ ని ఎదుర్కోవడానికి థ్రిల్స్ కి పాల్పడితేనే హార్రర్- థ్రిల్ నువ్వా నేనా అన్నట్టుంటాయి. దీనికి బదులు పాసివ్ క్యారక్టర్ గా ఏడ్పులతో మదర్ సెంటిమెంటుని రగిలించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. భూతవైద్యుడు దుష్టాత్మని వదిలించే క్లయిమాక్స్ హార్రర్ లో కూడా నయనతార ఏడ్పులు మనల్ని హార్రర్ని అనుభవించకుండా చేశాయి. ఇలా కథ వొక శోక సాగరంలా మారింది.

నటనలు – సాంకేతికాలు

    నటనలు భావోద్వేగ రహితంగా వుండడం ఇంకో లోపం. నయన తార సహా అందరూ ఫ్లాట్ క్యారక్టర్స్ ని ఏ ఫీలూ ప్రదర్శించకుండా పొడిపొడిగా నటించేశారు. నయనతార ఏడ్పు ఒక ఫీలే. కథకి అవసరం లేని ఆమె ఫీలు అది. హార్రర్ తో భయం, సస్పెన్స్ ఫీలై, కూతుర్ని కాపాడుకునే  థ్రిల్స్  కి పాల్పడి వుంటే అప్పుడామెలో భావోద్వేగాలు పలికేవి. ఆమెకో గోల్, ఆ గోల్ కోసం పోరాటమనే సరైన దారిలో నటన వుండేది.
        
కూతురి పాత్ర వేసిన హనియా నఫీసాలో మంచి టాలెంటే వుంది. దుష్టాత్మ పీడితురాలిగా బాధ, ఆక్రోశం బాగా నటించింది. మంచం వూగిపోతున్న ఎక్సార్సిస్ట్ ఐకానిక్ సీను దర్శకుడు క్లయిమాక్స్ లో వాడుకున్నాడు. ఇక్కడ నఫీసాకి  నయనతార (ఏడ్పు) అడ్డుపడక పోతే, తన మీదున్న సీనుతో బలంగా ఆకట్టుకునేది. ఇక నయనతార తండ్రి పాత్ర వేసిన సత్యరాజ్, ముంబాయి భూత వైద్యుడు ఫాదర్ ఆగస్టీన్ పాత్ర వేసిన అనుపమ్ ఖేర్ వీడియో కాల్స్ లో నటన కనబర్చారు.
        
సినిమాలో చెప్పుకోదగ్గవి రెండున్నాయి- సంగీతం, ఛాయాగ్రహణం. రెండూ టాప్ సౌండ్ ఎఫెక్ట్స్ సహా. రెండు మూడు హార్రర్ బిట్స్ నిజంగానే భయపెడతాయి. థియేటర్లకి  దూరమవుతున్న ప్రేక్షకులకి థియేటర్ అనుభవాన్నివడానికే ఎఫెక్ట్స్ ని సాధ్యమైనంత బలంగా వాడుకున్నట్టు చెప్పాడు దర్శకుడు. అయితే ఎఫెక్ట్స్ తో బాటు కథ కూడా కనెక్ట్ అయితేనే థియేటర్స్ కి వెళ్ళడం గురించి ఆలోచిస్తారు ప్రేక్షకులు.

—సికిందర్