రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, జులై 2017, ఆదివారం

డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -3





   ర్వసాధారణంగా ఒక కంగారు వుంటుంది. తక్కువ పాత్రలతో సీన్ టు సీన్ ఎత్తుకున్న అదే పాయింటుతో సూటిగా సాగుతూంటే కథ సాదాగా వుందని, ఫ్లాటై పోతోందనీ. అందుకని సబ్ ప్లాట్స్ కలపాలని నిర్ణయించుకుంటారు.  కథకి ఉపకథల మణిహారం వేస్తారు. ఇలా కాక ఉన్న కథని ఎలా చెబుతున్నామని కాదు, ఎలా చూపిస్తున్నామని పునరాలోచించుకుని ‘బ్లడ్ సింపుల్’ లాంటి నోయర్ మూవీస్ కుండే పంథాని  అనుసరిస్తే? నిగూఢార్ధాలు చూపిస్తున్నప్పుడు ఇంకా ఉపకథలు అవసరపడతాయా? చిన్న కథే అయినా క్షణం క్షణం ఆలోచింపజేయకుండా, జీవం నింపకుండా వెండితెర మీద తీసికెళ్ళి పడేస్తే,  ఎన్ని ఉపకథలైనా దాన్ని కాపాడుతూ కూర్చుంటాయా?  కథనంలో నాటుతున్న నిగూఢార్ధాలు, బలమైన పాత్ర చిత్రణలు, సైకలాజికల్ ట్రాక్ లు  ‘బ్లడ్ సింపుల్’ ఒక్కోసీనుని ఎంత సార్ధకం చేస్తున్నాయో గమనిస్తూ వస్తున్నాం. సబ్ ప్లాట్స్ లేకపోయినా  ఈ చిన్న కథ కళాత్మక విలువలతో కూడిన ఎలిమెంట్స్ తోనే ఎంత బలంగా, వ్యాపారాత్మకంగా మారిందో  ఇంకా గమనిద్దాం...      

          నిన్నటి నాల్గవ సీనులో డిటెక్టివ్ విస్సర్ తన ఫిలాసఫీని ఎలా వర్కౌట్ చేసుకుని బాగుపడుతున్నాడో గమనించాం. ప్రారంభంలో అతడి స్వగతమే అతడి ఫిలాసఫీ. అవసరం కొద్దీ నిన్ను ఆశ్రయించిన వాళ్ళని నీ అవసరాలకి వాడుకుని విసిరిపారేయ్ -అనే ఫిలాసఫీని  చక్కగా వర్కౌట్ చేసుకుంటూ, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఆ ఫోటోలతో మార్టీని తన అవసరాలకి వాడుకోవాలని ఉద్దేశం. మార్టీ ఇల్లు కాలి ఏడుస్తూంటే దానికి ఫ్రేము కట్టి చూపిస్తున్నాడు విస్సర్. నిజానికి ఆ ఫోటోలకి భయపడకూడదు మార్టీ. భార్య మీద సాక్ష్యాలు సంపాదించి విడాకులకి పోవాలనుకుంటే,  ఈ ఫోటోలు బాగానే  పనికొస్తాయి. కానీ అతను భార్య గురించి మనసు మార్చుకున్నాడు, కనుక ఈ ఎఫైర్ బయటపడకూడదని విస్సర్ కి లొంగి డబ్బిచ్చాడు. మళ్ళీ రావద్దన్నాడు. ఇక్కడ దర్శకులు ఒక పాయింటుని ఉపేక్షించారు. మార్టీ నెగెటివ్ లు అడగలేదు. మళ్ళీ ప్రింట్లు తీసి బ్లాక్ మెయిల్ చేయవచ్చు విస్సర్. 

          కానీ భార్య చేస్తున్న తప్పుకంటే మార్టీ చాలా పెద్ద తప్పే చేశాడు విస్సర్ ని ఆశ్రయించి. విస్సర్ ప్రొఫెషనల్ డిటెక్టివ్ అయితే, ప్రొఫెషనల్ గానే  మార్టీ కి రిపోర్టిచ్చి ఫీజు తీసుకుని వెళ్ళిపోతాడు. అంతేగానీ డబుల్ క్రాస్ చెయ్యడు. కానీ విస్సర్ అసాంఘీక శక్తిగా మారాడు వృత్తిని ఉపయోగించుకుని. డబుల్ క్రాస్ మరిగాడు. అసాంఘీక శక్తుల సాయం కోరడం ఎంత తప్పో, మధ్యలో మనసు మార్చుకుని తప్పుకోవాలనుకోవడం అంతకంటే పెద్ద తప్పే అవుతుంది.  ఏ అసాంఘీక శక్తి వూరుకోదు మధ్యలో తప్పుకుంటానంటే. అయితే ఇప్పుడు భార్య గురించి మనసు మార్చుకుని, తను చేసుకున్న రొష్టు లోంచి బయటపడాలనుకుని మార్టీ ఇలాగే వుంటే విస్సర్ ఏం చేసేవాడో గానీ, వెళ్లి వెళ్లి మళ్ళీ మార్టీ ఇంకో అవసరానికి విస్సర్ నే ఆశ్రయించడం అతి ఘోరమైన తప్పు....ఇదెలా జరుగుతుందో ఇక ముందుముందు చూద్దాం...

5. బార్ లో మార్టీ బార్ టెండర్  ఫ్రెండ్ తో విచిత్రంగా ప్రవర్తించడం. 
      నాల్గవ సీను ఫ్లాష్ బ్యాకుగా చూశాం,  దాని  కొనసాగింపే ఈ ఐదో సీను. నాల్గో సీను చివర్లో మార్టీ అద్దంలోంచి బార్ లోకి చూస్తాడు. ఒకతను బల్లలెక్కి  పోతున్న దృశ్యం కనపడుతుంది. ఇప్పుడు ఐదో సీనుకి కట్ చేస్తే, ఆ బల్లలెక్కిపోతున్న అతను  ఇటు అదే అద్దంలో కన్పిస్తూంటాడు. మార్టీ ఆఫీసులోంచి చూస్తే  ఇది ప్లెయిన్ గ్లాస్,  బార్లోంచి చూస్తే మిర్రర్. నోయర్ మూవీస్ లో మిర్రర్స్ కూడా ఒక ఎలిమేంటే అని తెలుసుకున్నాం. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, పాత్ర స్ప్లిట్ పర్సనాలిటీ అయితే అది చెప్పడానికీ మిర్రర్స్ ని వాడతారు. 

          ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికే వాడారు. ఈ సీనులో పెద్దగా ఆశ్చర్యాలు లేవు. కాబట్టి మిర్రర్ తో ఒక ఝలక్ ఇస్తూ సీను ఓపెన్ చేశారు. ప్రేక్షకులు అవులించేట్టు సీన్లు వుండ  కూడదని ఉద్దేశం. ఆ జంప్ చేస్తూ తిరుగుతున్న అతను బార్ టెండర్ మారీస్. అతను ఎవరెవరికి ఏం కావాలో చూసి, హడావిడి చేసి, జ్యూక్ బాక్సులో సాంగ్ వేసి, ఒంటరిగా కూర్చుని బ్రాందీ సిప్ చేస్తున్న ఒకమ్మాయి దగ్గర కొస్తాడు. వచ్చి కూర్చుని, ‘ఎక్కడిదాకా వచ్చాను?’ అంటాడు. 

          రింగ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్తున్నావ్ –అంటుంది. అందుకుని చెప్పడం మొదలెడతాడు మారీస్. అంటే ఇంతకి ముందు నుంచే వీళ్ళు మాట్లాడుకుంటూ వున్నారన్నమాట. ఇలాకాక ఇప్పుడే ఆమెని చూసినట్టు పలకరించడం, బొట్టు పెట్టి కబుర్లకి కూర్చోబెట్టడం లాంటి ఇంట్రడక్షన్ అంతా కథనం మీద పట్టులేని తనం కింది కొస్తుంది. ఆల్రెడీ వాళ్ళు కబుర్లలో వున్నారని హాల్ఫ్ వేలో సీను నడిపిస్తే,  ఏ విషయం మాట్లాడుతున్నారో ఆ విషయం మీదికే నేరుగా వెళ్ళిపోయి ఆసక్తి రేపవచ్చు- టైం సేవ్ చేయవచ్చు. 

          రింగ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్తున్నావ్ – అని ఆమె అనేసరికి అతను  కొనసాగించడం మొదలెడతాడు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయం కూడా పరోక్షంగా  కథనే తెలియ జేస్తోందని గమనించాలి. ఏదీ కాలక్షేప బఠానీగా లేదు ఈ కథనంలో. మారీస్ చెప్పుకుపోతున్నప్పుడు ఆమె జియాలజిస్టు అని తెలుస్తుంది. కాబట్టి ఒక జియాలజిస్టుగా అగ్నిపర్వతాలు పేలితే ఎంత శక్తిని విడుదల చేస్తాయో చెప్పమంటున్నాడు. ఆ శక్తితో లాస్ వెగాస్ నగరంలో ఎన్నేళ్ళ పాటు విద్యుదీపాలు వెలిగించుకోవచ్చు? 

          గొప్ప ఆశావాది. అప్పుడు వస్తూంటాడు అగ్నిపర్వతం లాంటి మార్టీ. ఇది డైనమిక్స్. డైలాగుతో మ్యాచయ్యే డైనమిక్స్. తెలుగులోనైతే- ఒకడున్నాడు, వస్తాడు, వచ్చేస్తున్నాడు- అని రాస్తారు టెంప్లెట్ ముందు పెట్టుకుని. వచ్చి, రే ఇంకా రాలేదా?- అంటాడు మార్టీ.

          ఇదేమిటి, రే మోటెల్ లో ఎబ్బీతో వున్నాడని తెలుసుగా?  అంటే సంధి చేసుకుంటున్నాడా సమస్యతో... రే గురించి ప్రశ్నోత్తరాలు అయ్యాక, ఆ అమ్మాయికేసి చూస్తాడు. ఆమె తన ఫ్రెండ్ దెబ్రా అని పరిచయం చేస్తాడు మారీస్. కౌంటర్ లో ఎవరో ఎదురు చూస్తున్నారు వెళ్ళమంటాడు మార్టీ. మారీస్ వెళ్ళిపోయాక, దెబ్రాతో మాటలు కలుపుతాడు. మారీస్ ఎప్పట్నించీ తెలుసు?- అంటాడు. పదేళ్లుగా తెలుసంటుంది.

          అప్పుడు మార్టీ ఏటో దిక్కులు చూస్తున్నట్టుగా రాశారు కోయెన్ బ్రదర్స్. దిక్కులు చూసి,  ప్రత్యేకంగా దేని గురించీ అని కాకుండా ఓ రెండు సార్లు తలూపి- ఆమెతో అంటాడని రాశారు- ఈ నైట్ నీ ప్రోగ్రాం ఏమిటి? 

          మారీస్ తో ఔటింగ్  కెళ్తున్నానని అంటుంది. తలనొప్పిగా వుందని చెప్పమంటాడు. సరేనంటుంది. అప్పుడు మొహం దగ్గరగా పెడుతూ, మనం సరీగ్గా కమ్యూనికేట్ అవడం లేదంటాడు. ఆమె రియాక్ట వుతుంది. చీవాట్లు పెట్టి, ఇప్పుడు కమ్యూనికేటయ్యాను పొమ్మంటుంది. మారిస్ రావడంతో, మార్టీ వెళ్ళిపోతూ- రే వస్తే తను లేడని చెప్ప
మంటాడు...

          ఈ ప్రవర్తనకి అర్ధమేమిటి? మనిషి స్థిమితంగా లేడు. క్షణం క్షణం మారిపోతున్నాడు. ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. భార్య పరాయి మగాడితో వుంటే ఏ మగాడైనా స్థిమితంగా వుండలేడు. ప్రేమకొద్దీ ఆమెతో రాజీపడితే చులకనై పోతాడేమో తెలీదు. లోలోపల మార్టీ నలిగిపోతున్నాడు- ఆ  నలుగుడులోంచే ఈ  సైకో లాంటి ప్రవర్తన. అక్కడ బార్ టెండర్ తన భార్యతో సరసాలడుతూంటే, ఇక్కడ ఈ బార్ టెండర్ ఫ్రెండ్ తో తను ఫ్లర్ట్ చేసి కచ్చి తీర్చుకోబోవడం...  ఇలాటి పరిస్థితుల్లో సైకో కిల్లర్స్ అయితే బార్ టెండర్స్ భార్యల్నీ, గర్ల్ ఫ్రెండ్స్ నీ చంపుకుంటూ పోతారు. తానెదుర్కొంటున్న పరిస్థితిలో పాత్ర నిండా సింక్ అయినప్పుడే ఇలాటి బలమైన సన్నివేశాలొస్తాయి.
          ఈ సీను మార్టీ సైకలాజికల్ ట్రాకు ప్రోగ్రెస్ చూపించడానికి రాశారు.
***
6. ఎబ్బీ  రివాల్వర్ తీసుకుని మార్టీ ఇంటినుంచి రే తో వెళ్ళిపోవడం 
         మార్టీ ఇంట్లో సీను వివరం ఇలా రాశారు- 

          జర్మన్ షెపర్డ్ హాల్లో నడుచుకుంటూ హాలు చివర వార్మ్ లైటింగ్ వున్న రూము వైపు వెళ్తూంటుంది. దాని అడుగుల చప్పుడు, లీలగా బిలియర్డ్ బాల్స్ చప్పుడూ వినపడుతూంటాయి.
          బిలియర్డ్ రూం లో ఓపెన్ చేస్తే- ఇది గోడలకి పానెల్స్ తో, కింద కార్పెట్ తో, బ్లాక్ లెదర్ ఫర్నీచర్ తో, ఒక తొమ్మిదడుగుల బిలియర్డ్ టేబుల్ తోనూ  వుంటుంది. రూంలో రకరకాల జంతు కళేబరాల ట్రోఫీలుంటాయి. వాటిలో ఒక దుప్పి కూడా వుంటుంది. రే ఒంటరిగా బిలియర్డ్స్ ఆడుతూంటాడు. ఒక వెలిగించని సిగరెట్ అతడి నోట్లో వుంటుంది. రూం చాలా నిశ్శబ్దంగా వుంటుంది. డోర్లోంచి జర్మన్ షెపర్డ్ రావడాన్ని నిశ్శబ్దంగా చూస్తాడు.
 


         పై రెండు పేరాలకి అర్ధం  ఒకసారి చూస్తే, పెంపుడుకుక్క (జర్మన్ షెపర్డ్) హాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నోయర్ ఎలిమెంట్ కమ్మేసి వుంటుంది. పక్కన కిటికీలకి అమర్చిన వెనీషియన్ బ్లయిండ్స్ లోంచి వెలుతురు కిరణాలు  ఇటు గోడల నిండా కటకటాల్లాంటి నీడల్ని ఏర్పరుస్తూంటాయి. మోటెల్ లో సీను తర్వాత ఇది మళ్ళీ ఒకసారి బార్స్, డయాగోనల్ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్ షాట్స్ ఎలిమెంట్ లోని ‘బార్స్’ భాగం. ఈ వర్ణన స్క్రిప్టులో ఇవ్వలేదు గానీ చిత్రీకరణలో వుంది. కటకటాల నీడల్ని ఏర్పర్చే వెనీషియన్ బ్లయిండ్స్ నోయర్ మూవీస్ లో కామన్. అంటే ఒక విపత్తులో ట్రాప్ అవబోతున్నారనేం సూచన.  

          పెంపుడు కుక్క ఇలా కటకటాల్లాంటి నీడల మధ్య నడుచుకుంటూ పోతోందంటే దానికి  విపత్తా? కథలో ఇది కొత్త సంగతి కదూ? ఎవరి వల్ల విపత్తు? లవర్స్  రే - ఎబ్బీలతోనా?  మరి  ఈ పెంపుడు కుక్క ఈ కటకటాల్లాంటి వాతావరణంలోంచి అటు ‘
వార్మ్ లైటింగ్’ వున్న రూము వైపు పోతోందని రాశారే? అంత నులి వెచ్చని గాఢ పరిష్వంగ మాధుర్యాన్ని అనుభవించడానికి అది పోతున్నట్టు రాస్తే, అక్కడ రే ఎబ్బీలే కదా వున్నారు? అంటే వాళ్లతో అది అంత వార్మ్ గా, సేఫ్ గా వుండగలదన్న మాట. మరెవరితో నాట్ సేఫ్? ఆ బద్మాష్ డిటెక్టివ్ గాడితోనేనా?  మొదటి షాట్ లోనే ఇంత కథ, ఇంత సస్పెన్స్  పెట్టి చంపారే! ఒకే ఒక్క షాట్ ఇంత కథని, సస్పెన్స్ నీ సృష్టిస్తుందా? వేకప్ టాలీవుడ్ మేకర్స్, వేకప్! కోటి రూపాయలతో బంగారాన్ని ఇవ్వచ్చు జీఎస్టీ బాధిత ప్రేక్షకులకిక,   గిల్టుతో ఇంకా మోసాలు చేయడం కాదు. 

          ఇక ఇక్కడొకసారి 4 వ సీనుని గుర్తు చేసుకుంటే, బార్ లో మార్టీ టేబుల్ మీద కాళ్ళు జాపుకుని కూర్చున్నప్పుడు, కాళ్ళకి హంటర్ బూట్లు వుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో చూస్తే ఇన్ని జంతు ట్రోఫీలున్నాయి- అంటే మాంచి వేటగాడే నన్న మాట- వేటగాడికి ఆడదాని విషయంలో మాత్రం గురి లేని బలహీనత,  ఇదీ క్యారక్టరైజేషన్ అంటే.

          ఆ డాగ్ తోకూపుకుంటూ విశ్వాసం ప్రకటిస్తుంది రేకి. రే దాన్ని సున్నితంగా తాకి, ‘ఓపల్’ అని పిలుస్తాడు. ఐరనీ ఏమిటంటే, తన యజమానికి  ఈ రే అనే పనివాడు విశ్వాస ఘాతకుడిగా మారేడని దానికి తెలీదు. 

        పై గదిలో ఎబ్బీ ఏమిటో వెతుకుతూంటుంది. ఒక డబ్బీని తలకిందులు చేస్తే బుల్లెట్లు పడతాయి అరచేతిలో. రెండవ సీనులో మా ఆయన రివాల్వర్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పిందానికి, ఇక్కడ వస్తు రూప సాక్ష్యం. ఏకంగా రివాల్వర్ చూపించలేదు టాలీవుడ్ స్టయిల్లో. సస్పెన్స్ ని సస్టెయిన్ చేస్తున్నారు ముందు బుల్లెట్లు మాత్రమే బయట పెట్టి. బుల్లెట్లు వుంటే రివాల్వర్ కూడా వుండాలి కదా? అది వుందా లేదా? ఇక ఒకటే వెతకడం మొదలెడుతుంది. ఒకవేళ మార్టీ తీసికెళ్ళి పోయి వుంటే!

          కింద హాల్లో రే గోడకున్న పెద్ద పెద్ద ఫోటోలని చూస్తూంటాడు. పైన ఎడాపెడా హేండ్ బ్యాగులు వెతికేస్తూంటుంది ఎబ్బీ ఒకటే నెర్వస్ గా. కింద హాల్లో గోడకి పైన పెంపుడు కుక్క ఓపల్  ఫోటో ఫ్రేము వుంటుంది. కింద ఎబ్బీ, మార్టీల ఫోటోలుంటాయి. తమ జీవితాల్లో ఓపల్ కిస్తున్న స్థానమేమిటో దీన్ని బట్టి తెలుస్తోంది. కెమెరా పాన్ చేస్తూంటే,  కింది వరసలో  ముందుగా  ఎబ్బీ ఫోటో ఫ్రేములో కొస్తుంది, తర్వాత ఎబ్బీ మార్టీ లు కలిసున్న ఫోటో...చివర్లో ఇంకో పాత  ఫోటో వుంటుంది-  ఇద్దరూ బీచిలో దిగిన ఫోటో...ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో స్విమ్మింగ్ సూటులో వున్న ఎబ్బీని ని సున్నితంగా తాకుతాడు రే. 4 వ సీనులో మార్టీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఎబ్బీని తాకాడు. ఎబ్బీని మార్టీ కేవలం అలా తాకి వూరుకున్నాడు. ఇక్కడ రే మాత్రం పాదాల దాకా తాకుతూ వెళ్లి- ఈమె నాకే సొంతం అని సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ చర్యతో కథలో టెన్షన్ పెరిగింది. ఈ ఆటలో మార్టిన్ ఓడిపోబోతున్నాడా? 




        రే  సిగరెట్టే ముట్టించకుండా నోట్లోనే  పెట్టుకుని  వుంటాడు. సైకలాజికల్ మీనింగ్ : ఏం జరిగినా ఈ  కొంపలో  నిప్పులు పోయదల్చుకోవడం లేదా తను? మరి ఎబ్బీని ఎలా గెల్చుకుంటాడు?  

          చిట్టచివరికి ఒక బ్యాగులో రివాల్వర్ని దొరికించుకుంటుంది ఎబ్బీ. ఆమె గదిలో ఇరవై ముప్ఫై హేండ్ బ్యాగులు పడుంటాయి. ఈ బ్యాగుల హాబీతో ఈమె ఇంటిపట్టున వుండే మనిషి కాదని ఈమె క్యారక్టర్ని ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు. 

          ఎబ్బీ వచ్చేసి ఇక పోదామంటుంది. మోటెల్ కి పోదామంటే, లేదు నా యింటికి పోదాం, అక్కడ వుండమంటాడు. తను ఒకచోటికి వెళ్లి వస్తానంటే, బార్ కి మాత్రం వెళ్ళ వద్దంటుంది. మార్టీ ఎలాంటి వాడో నాకు తెలుసు, వెళ్ళ వద్దంటుంది. ఇంకొకర్ని కలవడానికి వెళ్తున్నానంటాడు. దీంతో ఈ సీను ముగుస్తుంది. ఈ రే మార్టీ దగ్గరకి వెళ్తున్నాడన్న సీరియస్ విషయంతో టెన్షన్ పుట్టించే ముగింపు ఇది. ఇలాటి సీన్లు వుంటే ఇంకా సబ్ ప్లాట్స్ అవసరమా?


 (ఇంకా వుంది)
- సికిందర్