రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జూన్ 2018, మంగళవారం

657 : స్క్రీన్ ప్లే సంగతులు


     ఇంతవరకూ రోమాంటిక్ డ్రామా ‘ది క్లాసిక్’ లో,  ‘ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్’ అనే సృజనాత్మక కథనాన్ని చూశాం.  ప్రధాన కథలో డైరీ ఆధారంగా హీరోయిన్ తెలుసుకుంటున్న ఆమె తల్లి ప్రేమకథ ఫ్లాష్ బ్యాకుగా ఓపెనైతే, ఈ ఫ్లాష్ బ్యాకు ఆ తల్లిని ప్రేమిస్తున్న జూన్ హా దృక్కోణంలో అతడి ఫ్లాష్ బ్యాకుగా ప్రారంభమవడాన్ని గమనించాం. ఈ ‘ఫ్లాష్ బ్యాకులో ఫాష్ బ్యాకు’ కథనాన్ని ‘ఇన్సెప్షన్ ఫ్లాష్ బ్యాక్’ అంటున్నారు. ఐతే విడివిడిగా చూస్తే, ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ ‘ఇల్లస్ట్రేషన్ ఫ్లాష్ బ్యాక్’ వర్గానికి చెందినవే. అంటే బొమ్మల కథగా సింపుల్ గా, లీనియర్ గా చెప్పేవే. జూన్ హా కి చెందిన ఈ ‘లోపలి ఫ్లాష్ బ్యాకు’ త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో వుండడాన్ని గమనించవచ్చు. ఇది 16  నిమిషాల నిడివి వుంది. ఈ నిడివిలో బిగినింగ్ – మిడిల్ – ఎండ్ వున్నాయి. బిగినింగ్ విభాగం వచ్చేసి, 1) పాత్రల పరిచయం – 2) కథా నేపధ్య వాతావరణ ఏర్పాటు, 3) సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన – 4) సమస్యా స్థాపనా కాబట్టి, ఇప్పుడు చూస్తే ఇవన్నీ మొదటి రెండు సీన్లలోనే  సర్దుకున్నాయి. 

          1) పాత్రల పరిచయం : మొదటి సీన్లో పల్లెటూళ్ళో జూన్ హా నేస్తాలతో అల్లరి చేస్తున్నప్పుడు ఎడ్ల బండిమీద హీరోయిన్ వెళ్ళడం, ఆమె ఫలానా తాతగారి మనవరాలని నేస్తాలు జూన్ హాకి చెప్పడం, అలాగే జూన్ హా పట్టణం నుంచి సెలవుల్లో వచ్చినట్టు చెప్పడమూతో, అవసరం మేరకు ఈ మూడు పాత్రల పరిచయాలూ అయ్యాయి. ఇక్కడ జూన్ హాతో వున్న నేస్తాలెవరో కనీసం పేర్లు కూడా చెప్పలేదు. ఇతర పాత్రల్ని పరిచయం చేస్తే, ఇక్కడ  హీరో హీరోయిన్ల మీది ప్రేక్షకుల ఫోకస్ చెదిరిపోతుందన్న ఉద్దేశమై వుండొచ్చు. ఈ ఫోకస్ వల్ల ఏమవుతుందంటే, ప్రేక్షకుల ఏకాగ్రత పెరుగుతుంది సీన్లమీద. 

          2) కథా నేపధ్య వాతావరణ  ఏర్పాటు : జూన్ హా, జూహీ పాత్రల పరిచయాలతో వెంటనే ఈ మొదటి సీను మొత్తం ఈ ఫ్లాష్ బ్యాకుకి సంబంధించి జానర్ ఏమిటో ప్రకటించేసింది : ఇది ప్రేమకథ అవుతుందని. ఈ సీనులో ప్రేమ కథకి తగ్గ వాతావరణ ఏర్పాటూ జరిగిపోయింది. మొదటి సీన్లోనే హీరో హీరోయిన్లు పరస్పరం చూసుకోవడంలోనే ఈ ఫీల్ మనకి అనుభవమవుతోంది.  దీన్ని చెడగొట్టే ఇంకే ప్రస్తావనలూ చిత్రణలూ చేయలేదు. ఇదే నేపధ్య వాతావరణం సీను తర్వాత సీనుగా  ఫ్లాష్ బ్యాక్ అంతటా  ( బిగినింగ్ – మిడిల్- ఎండ్ అంతా) ఏకధాటిగా ప్రతిఫలిస్తూంటుంది. దీన్ని భంగపర్చే వాతావరణమెక్కడా కన్పించదు. ఇందులో భాగంగా మొదటి సీనులో కనీసం హీరో నేస్తాలని పరిచయం కూడా చేయలేదు. కథని ప్రభావితం చేయని పాత్రల పరిచయాలవసరం లేదని దీన్ని బట్టి అర్ధం జేసుకోవాలి.
 
          3) సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన : ‘సమస్య’ ఏమిటి? జూహీ భూత్ బంగ్లా చూడాలన్న చిరకాల కోరిక తీర్చుకోవాలనుకోవడం. అందుకని రెండో సీనులో ఆమె వచ్చి, ‘
నీకు నది అవతల భూత్ బంగ్లా తెల్సా?’ అంది. తనని అక్కడికి తీసికెళ్ళ మంది. పడవ నడపడం వచ్చా అంది. ఇలా సమస్యకి దారి తీసింది. ఇది ఫ్లాష్ బ్యాక్ కాబట్టి, క్లుప్తత దృష్ట్యా, ఇదొక్కటి తప్ప మరిన్ని పరిస్థితుల కల్పన అవసరపడలేదు. 

         
4) సమస్యా స్థాపన :  వెంటనే తర్వాతి సీన్లో ఇద్దరూ పడవెక్కి భూత్ బంగ్లాకి బయల్దేరడం. ఇదే ఫ్లాష్ బ్యాక్ కి ప్లాట్ పాయింట్ వన్. ఇలా బిగినింగ్ విభాగం మూడు సీన్లలో అన్ని బిజినెస్ పరికరాలనీ  కలుపుకుని పూర్తయ్యింది.

          క మిడిల్ కొస్తే, మిడిల్ అంటే సమస్య తో సంఘర్షణ కాబట్టి,  భూత్ బంగ్లాలో దెయ్యాన్ని చూడాలన్న కోరికతో – సమస్యతో – దాని తలూకు అనుభవాల దొంతరగా  -  యాక్షన్ రియక్షన్ల మిడిల్ కుండే బిజినెస్ ఇక్కడ కనిపిస్తోంది. అనుకున్న దెయ్యం లేకపోగా, ఇద్దరూ సన్నిహితులయ్యే సంఘటనలు భూత్ బంగళా వెలుపల సైతం పొలాల్లో,  ప్రకృతిలో చీకటి పడేవరకూ కొనసాగాయి. ఈ మిడిల్ ని మానసిక పరిభాషలో చెప్పుకుంటే, ఇది వాళ్ళ సబ్ కాన్షస్ వరల్డ్ నిజానికి. సమస్యాత్మకంగా వుండే ఈ సబ్ కాన్షస్ వరల్డ్ లో మునకలేసీ లేసీ,  చివరికి సత్యాన్ని కనుగొన్నట్టు అతడి మెడలో ఆమె గొలుసు కట్టడంతో పూర్తయ్యింది....ఇలా ప్లాట్ పాయింట్ టూ కూడా ఏర్పడింది. 

         
ఎండ్ కొస్తే, ప్లాట్ పాయింట్ టూ తర్వాత ముగింపే కాబట్టి, ఎండ్ విభాగం మొదలయ్యింది.  ఆమె గొలుసు కట్టాక పడవెక్కి తిరుగు ప్రయాణమవుతూంటే, ఒడ్డున కాగడాలు. అక్కడ తాత. ఒడ్డుకి చేరగానే హీరోయిన్ని విడదీసి, హీరోకి తాత కొట్టే లెంపకాయ. ఆ తర్వాత సీన్లు వొంట్లో బాగాలేని హీరోయిన్ని ఆస్పత్రికి తరలించడం. ది ఎండ్.

          ఈ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ప్రేమకథని ప్రేక్షకులు ఫీలవుతారు గానీ, హీరోహీరోయిన్లు ఫీలయినట్టు వుండరు. ఇదే గమ్మత్తు!

సికిందర్
         
(ఓ ఇద్దరు ముగ్గురు దర్శకులు ఇక్కడ వివరిస్తున్న ‘ది క్లాసిక్’ లోని కళాసీ పని అర్ధమై ఇన్స్ పైరవు తున్నారు. ఐతే ఇలా తీయాలంటే ముందుగా 10 శాతం పేపర్ వర్క్, 90 దర్శకత్వం మైండ్ సెట్లోంచి బయటికి వచ్చి, 90 శాతం పేపర్ వర్క్, 10 దర్శకత్వం ప్రపంచంలోకి రావాలి తప్ప, కాకుండా ఎన్ని ఆశలుపెట్టుకున్నా ప్రయోజనముండదని వేరే చెప్పనవసరం లేదు) .