రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, మార్చి 2019, ఆదివారం

796 : రివ్యూ




రచన - దర్శకత్వం : సుజోయ్ ఘోష్
తారాగణం : అమితాబ్ బచ్చన్, తాప్సీ, అమృతా సింగ్, టోనీ ల్యూక్, తన్వీర్ ఘనీ, మానవ్ కౌల్ తదితరులు
మాటలు : రాజ్ వసంత్, సంగీతం : ఆమాల్ మాలిక్, అనుపమ్ రాయ్, క్లింటన్ సెరేజో, ఛాయాగ్రహణం : అవీక్ ముఖోపాధ్యాయ్
బ్యానర్స్ : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, అజురే ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : గౌరీ ఖాన్, సునీర్, అక్షయ్, గౌరవ్

విడుదల : 8 మార్చి, 2019
***
          ‘పింక్’ జంట మరో క్రైం థ్రిల్లర్ తో వచ్చారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ మరో కోర్ట్ రూమ్ డ్రామాకి తెరలేపారు. కాకపోతే ఈసారి హోటల్ గదిలో. క్రైం థ్రిల్లర్స్ ని ప్రొఫెషనల్ కథా కథనాలతో తీస్తున్న బెంగాలీ దర్శకుల్లో ఒకడైన సుజోయ్ ఘోష్ ఈసారి లొకేషన్ ని యూరప్ కి మార్చేశాడు. ‘పింక్’ తో పాపులరైన అమితాబ్ - తాప్సీల కాంబినేషన్ లో మరో థ్రిల్లర్ అంటే, ‘పింక్’ ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షక సమూహం ‘బద్లా’ కి బదలాయింపు జరగడమే. మరి అలా జరిగిందా? దీని పరిధి ఎంత? అసలీ ప్రతీకార (బద్లా) -  రివెంజి డ్రామా దేని గురించి? ఇవి తెలుసుకుందాం...

కథ
      స్కాట్లాండ్ బిజినెస్ వుమన్ నైనా సేథీ (తాప్సీ - తాపసీ?) బాయ్ ఫ్రెండ్ అర్జున్ (టోనీ ల్యూక్)  హత్యకేసులో నిందితురాలు. ఆమె కంపెనీ లాయర్ జిమ్మీ (మానవ్ కౌల్) ఈ కేసు వాదించడానికి ప్రముఖ సీనియర్ లాయర్ బాదల్ గుప్తా (అమితాబ్ బచ్చన్) ని మాట్లాడి పంపిస్తాడు. నైనాని కలుసుకున్న బాదల్, ప్రాసిక్యూషన్ కి కొత్త సాక్షి దొరికాడనీ, ఆ కీలక సమాచారమున్న సాక్షిని ఇంకో  మూడు గంటల్లో జడ్జి ముందు ప్రవేశ పెట్టబోతున్నారనీ, కనుక  ఏం జరిగిందో త్వరగా చెప్తే కోర్టులో ఆ సాక్షిని ఎదుర్కొంటాననీ అంటాడు. 

          నైనా చెప్పుకొస్తుంది - పెళ్ళయి భర్తా కూతురూ వున్న తను పెళ్ళయిన అర్జున్ తో సంబంధం పెట్టుకోవడం తప్పని తెలుసుకుని కొన్ని నెలల క్రితమే విడిపోయింది. ఐతే ఎవరో బ్లాక్ మెయిలర్ కాల్ చేసి వాళ్ళిద్దర్నీ డబ్బు తీసుకుని హోటల్ కి రమ్మంటే వెళ్లారు. అక్కడ ఎవరో కొడితే నైనా కళ్ళు తిరిగి పడిపోయింది. లేచి చూస్తే అర్జున్ చచ్చి పడున్నాడు. పోలీసులకి అర్ధం గాలేదు. డోర్ లోపలి నుంచి లాక్ చేసి వుంటే, హంతకుడు బయటికి ఎలా వచ్చి వెళ్ళిపోయాడు? అనుమానం నైనా మీదికే వెళ్ళింది. అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలారు. 


        ఇది విన్న బాదల్, ఆమెని కాపాడడానికి ఇది సరిపోదనీ, సరీగ్గా పూర్తి నిజం చెప్పమనీ వొత్తిడి చేస్తాడు. అప్పుడు నైనా చెప్తుంది - ఆమే, అర్జున్ ఒక రిసార్ట్స్ లో గడిపి వస్తూ ఈ రిలేషన్ షిప్ ని ముగిద్దామని మాట్లాడుకుంటు ప్పుడు, కారు కంట్రోలు తప్పడంతో అవతలి కారు ప్రమాదానికి గురైంది. ఆ కారులో సన్నీ అనే యువకుడు చనిపోయాడు. అతడి సెల్ ఫోన్ చూస్తే డ్రైవింగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నట్టు వుంది. ఇందులో తన తప్పేం లేదనీ, ఇతనే మెసేజీలు పెడుతూ కంట్రోలు తప్పాడనీ, పోలీసులకి కాల్ చేద్దామని ఆమె చెప్పినా అర్జున్ వినలేదు. అలాచేస్తే తమ సంబంధం తెలిసిపోతుందనీ, వీడి కారు సహా నీట్లోకి తోసెయ్యమనీ చెప్తే తోసేసింది తను. 

          ఆ సన్నీ తల్లి రాణి (అమృతా సింగ్) ఎలాగో తెలుసుకుని తనని పట్టుకుని, కొడుకు శవం ఎక్కడుందో చెప్పకపోతే అంతు చూస్తానని బెదిరించింది... ఇదీ సమస్య. ఇప్పుడు ఒకటి కాదు, రెండు హత్యల్లోంచి నైనాని బాదల్ ఎలా కాపాడేడు? కాపాడేడా లేక...


ఎలావుంది కథ
      ఇది ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ అనే స్వీడిష్ క్రైం థ్రిల్లర్ కి అధికారిక రీమేక్. ఇలాటి క్రైం థ్రిల్లర్స్ లో, ఇంకా ఫిలిం నోయర్ జానర్ క్రైం థ్రిల్లర్స్ లో, కథలు కర్మ ఫలాన్ని అనుభవించేలా చేస్తాయి. చట్టానిదే పై చేయిగా వుంటాయి. కర్మ ఫలం, విధి, నైతిక విలువలు అనే ఫిలాసఫీల్ని బేస్ చేసుకుని చట్ట కథలు చెప్తాయి. నైనా, అర్జున్ లు రహస్య సంబంధాన్ని ముగించుకుని జీవిత భాగస్వాములతో వుందామనుకున్నారు. అది కూడా జీవిత భాగస్వాముల్ని మోసం చేయడమే. తప్పు చేశామని వాళ్లకి చెప్పేస్తే అది వేరు. అందుకని విధి కారు ప్రమాదం రూపంలో ముంచుకొచ్చి వాళ్ళని ఇరుక్కునేలా చేసింది. అలా జీవిత భాగస్వాములకి తెలిసిపోయేలా చేసి కర్మ ఫలాన్నిఅనుభవించమంది. మరి ఇందుకు అన్యాయంగా ఒకణ్ణి బలి తీసుకుందే అంటే, కాదు. అవతలి కారులో చనిపోయిన వాడు తక్కువేమీ కాదు, బ్యాంకులో అవినీతి చేస్తున్నాడు. 

          అయితే ఈ కథని రీమేక్ చేస్తూ రోల్ రివర్సల్ చేశాడు దర్శకుడు. ఒరిజినల్ లో లాయర్ గా ఫిమేల్ ఆర్టిస్టు వుంటుంది, నిందితుడుగా  మేల్ ఆర్టిస్టు వుంటాడు. ఈ రీమేక్ లో లాయర్ గా అమితాబ్ వుంటే, నిందితురాలిగా తాప్సీ వుంటుంది. అయితే కహానీ, కహానీ - 2 ల వంటి రెండు హిట్ క్రైం జానర్లు తీసిన దర్శకుడు సుజోయ్ ఘోష్, ఈసారి రీమేక్ కి వెళ్ళాడు. తనదైన మరో వొరిజినల్ కంటెంట్ తో రావాల్సింది.
ఎవరెలా చేశారు 
      ఇది అమితాబ్ కి పింక్’ లాంటి పవర్ఫుల్ పాత్ర. ‘పింక్’ లో తాప్సీని కాపాడే క్రిమినల్ లాయర్ గా ఆవేశంతో దృశ్యాల్ని జ్వలింప జేసినట్టు గాక, చాలా కూల్ గా వ్యవహరించే పాత్ర. ఒక గదిలోనే  డైలాగ్ ఓరియెంటెడ్ గా సాగే ఈ డ్రామాలో నిజాన్ని బయటికి తీయడానికి ఎత్తుకి పై ఎత్తులేసే, ఎనలైటికల్ స్కిల్స్ వున్న పాత్ర. కేసు వివరాలతో,  క్లూస్ విశ్లేషణలతో అమితాబ్ వాక్ప్రవాహం కట్టి పడేస్తుంది. ఒక్క కేసూ ఓడిపోని నలభై ఏళ్ల ట్రాక్ రికార్డ్ వున్న క్రిమినల్ లాయర్ పాత్రగా ఓ గదిలో అంతసేపూ నటించి మెప్పించడానికి వయస్సు అడ్డురాలేదు. పైగా స్టామినా పెరిగిపోయింది. అమితాబ్ కాకుండా మరొకరు ఈ డ్రామాతో ఆకట్టుకోవడం కష్టమే. 

          ఎదుటి పాత్రగా తాప్సీ ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆలోచనాత్మకంగా ఆచితూచి తూకం వేసి విషయాలు వెల్లడిస్తుంది. ఈ సైకలాజికల్ గేమ్ లో అవకాశం దొరికినప్పుడల్లా అమితాబ్ ని ఔట్ చేసేస్తూంటుంది. ఈ మానసిక చదరంగపు ఆటలో థ్రిల్లింగ్ గా పావులు కదపడం- అదీ నలబై ఏళ్ల అనుభవమున్న మహా క్రిమినల్ లాయర్ తో - ఆమెకెలా సాధ్యమంటే,  అప్పటికే ఆమె కొమ్ములు తిరిగిన బిజినెస్ వుమన్. ఈ పాత్రలో తాప్సీ ఓ మెట్టు పైకెక్కింది. 



          మూడో పాత్ర నాటి పాపులర్  హీరోయిన్ అమృతా సింగ్ పోషించిన రాణి పాత్ర. ‘కలియుగ్’ లో పోర్న్ వెబ్ సైట్ ఓనర్ గా నెగెటివ్ పాత్రని గుర్తుకు తెచ్చే నటన. కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకునే టైటిల్ రోల్ పోషించింది. ప్రతీకారం తీర్చుకునే టెక్నిక్ తో క్లాస్ నటన. భర్త నిర్మల్ గా తన్వీర్ ఘనీ ముగింపు ట్విస్టుకి పనికొచ్చే కీలక పాత్ర. 

          ఇందులో ఐదు పాటలు సందర్భానుసారంగా వచ్చేవే. టైటిల్ సాంగ్ ‘బద్లా’ రెండర్ధాలతో ఇలా సాగుతుంది - ఏయ్ పిల్లోడా లోకం మారింది జాగ్రత్త. కురుల స్టయిల్, నకిలీ నవ్వు, అబద్ధపు ప్రొఫైల్ మారాయి జాగ్రత్త. కథలో ఎప్పుడు కర్త మారతాడో ఎవరికీ తెలీదు జాగ్రత్త. పెట్రోలు ఎనభై అయింది, పాకెట్ సైజు మారింది జాగ్రత్త. ఆధునిక ప్రేమలు,  సూపర్ స్టార్ బజార్లు మారాయి జాగ్రత్త. పాత కల్చర్ ఇంటింటా రావాలి, లోకం మారింది జాగ్రత్త.... కళ్ళని కళ్ళతో తీర్చుకో పగ. కలల్ని కలలతో తీర్చుకో పగ. మాటల్ని మాటలతో తీర్చుకో పగ. స్నేహాన్ని స్నేహంతో తీర్చుకో పగ...డాలర్ ధర, వడపావ్ ఆకారం మారాయి జాగ్రత్త. వార్తలు, పేపర్లు మారాయి జాగ్రత్త. చావు బతుకులు డైలీ చూస్తూ దేవుడు మారలేదు రోయ్...

          చాలా క్రేజీ పాట. పగా ప్రతీకారాలకీ, ఏదైనా మారిందనడానికీ బద్లా అనే ఒకే పదం వుంది హిందీలో. మారిందనడానికి లేదా మారాడనడానికీ బదల్ గయా అని కూడా అనొచ్చు. అదన్న మాట. ఇలా ఒక చరణం బద్లా అంటూ మారిన సంగతులు చెప్తూ, ఇంకో చరణం బద్లా అంటూ ప్రతీకారాల గురించి చెప్పడం. నిజానికి ఈకథ ప్రతీకారం గురించే నడిచినా, ముగింపులో కథంతా ఎలా మారిపోయిందో కూడా చూపిస్తుంది. ఇలా ‘బద్లా’ టైటిల్ ని చాలా క్రియేటివ్ గా రెండంచుల కత్తిలా కథకి రెండర్దాలతో వాడారు. మనోజ్ యాదవ్, అనుపమ్ రాయ్ లు రాశారీ పాట. అనుపమ్ రాయ్ పాడేడు.  

          నేపధ్య సంగీతంలో కూడా క్రియేటివిటీ వుంది. ప్రారంభం నుంచీ ముగింపు దాకా ఒకటే రేంజిలో ట్యూన్ చేయకుండా, సన్నివేశాలు మామూలుగా వున్నప్పుడు రేంజి తగ్గిస్తూ, సన్నివేశం విషమించినప్పుడు సడెన్ గా పెంచి షాకిస్తూ -  నేపధ్య సంగీతంతో కూడా కథ చెప్పారు. కారు ప్రమాదం జరిగి నైనా, అర్జున్ లిద్దరూ మంతనాలడుకుంటున్నప్పుడు, ఇంకో కారు వచ్చేస్తూంటే, ప్రమాదంలో పడ్డామనుకుని  అర్జున్ తమ కారు కేసి కంగారుగా నడిచి వస్తున్న  సీనుకి ఆర్ ఆర్ టెర్రిఫిక్. 

          మంచు కురిసిన స్కాట్ లాండ్ లొకేషన్స్ -  మర్డర్ మిస్టరీలకిచ్చే లేత బ్లూ మసక వెలుతురులో మిస్టీరియస్ వాతావరణాన్ని సృష్టిస్తూ వుంటుంది. ఈ క్రైం థ్రిల్లర్ యాక్షన్ సీన్స్ లేకుండానే బోలెడు వెర్బల్ యాక్షన్ తో వుంది.


చివరికేమిటి 
       మెదడుకి మేత. పొరలు పొరలుగా వీడే సస్పెన్స్. ఒక సస్పెన్స్ పొర విప్పగానే అందులోంచి ఇంకో సస్పెన్స్  పొర. గదిలో అమితాబ్ తాప్సీల వెర్బల్ యాక్షన్, ఫ్లాష్ బ్యాక్స్ లో ఆమె  చెప్పే జరిగిన సంఘటనలు.  వాటిని ఇంకోలా సరిచేసే  అమితాబ్ వూహాగానాల మాంటేజెస్. రెండు మిస్టరీలున్నాయి : లోపలినుంచి లాక్ చేసిన హోటల్ గదిలో హంతకుడు హత్య చేసి ఎలా వెళ్ళాడు? రెండోది, నైనా యువకుడి శవం సహా కారుని నీట్లోకి తోసినప్పుడు నిజంగానే చచ్చి పోయి వున్నాడా? అసలు గదిలో హంతకుడి వేలిముద్రలే లేకపోవడం నైనా కథనాన్ని అబద్ధం చేసేసే ఫోరెన్సిక్ సాక్ష్యం. నైనా కారుని నీట్లోకి తోసినప్పటికే యువకుడు చనిపోయి వుంటే ఇలాకూడా  నైనా ని పట్టించే అటాప్సీ సాక్ష్యం.

          అయితే హోటల్ గది క్రైం సీన్లో పోలీసులు చేతులకి గ్లవ్స్ లేకుండా అన్నీ ముట్టుకోవడం, అలాగే నైనా పాయింటాఫ్ వ్యూలో హంతకుడు ఆ గదిలో చేతులకి గ్లవ్స్ లేకుండా అన్నీ ముట్టుకోవడం వంటివి బావుండవు. హోటల్ గదిలో ఎవరో తనని కొడితే కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పిన నైనాకి వైద్యపరీక్షలు నిర్వహిస్తే నిజమో అబద్ధమో తెలిసిపోతుంది. ఈ పని చేయకుండా,  లాక్ చేసిన గదిలో అర్జున్ తో పాటు ఆమె ఒక్కతే  వుందన్న బలహీన సర్కమ్ స్టేన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు ఆమె మీద కేసు పెడతారు. 

          తల్లులైన నైనా, రాణీ ల మధ్య ఇంటర్వెల్ సీను వస్తుంది. నా కొడుకుని బలిగొన్న నువ్వు  నీకో కూతురుందని మర్చి పోయావ్. నాకు కొడుకే లేకపోయాక నేను పోగొట్టుకునే దేమీ వుండదింకా... బిడ్డకి దూరమవడంలోని నరకమెలా వుంటుందో ఇక నీకు రుచి చూపిస్తా - అన్న రాణి హెచ్చరిక మదర్ సెంటి మెంటుతో ఈ మర్డర్ల కథకి బలమైన ఎమోషనల్ డెప్త్ నిస్తుంది. మహిళా దినోత్సవం నాడు విడుదలైన ఇది నెగెటివ్ కోణంలో చిత్రించినట్టయింది. రోల్ రివర్సల్ వల్ల ఇలా జరిగింది. ఒరిజినల్ లో వున్నట్టుగా అమితాబ్ స్థానంలో తాప్సీ వుంటూ, తాప్సీ స్థానంలో అమితాబ్ వుంటే  మహిళా విజయంగా వుండేది.



       రోల్ రివర్సల్ వల్ల ప్రేక్షకుల్ని పరిమితం చేసుకున్నట్టు కూడా అయింది. ‘పింక్’ అంత ఘన విజయం సాధించడానికి కారణం అది అమ్మాయిల్నీ కుటుంబాల్నీ కూడా ఆకర్షించడం. హైదరాబాద్ లో తెలుగు అమ్మాయిలూ కుటుంబాలూ కూడా విపరీతంగా చూశారు. ఇందులో నైట్ లైఫ్ పేరిట యూత్ పాల్పడుతున్న కార్యకలాపాల్లో తాప్సీ ఇరుక్కుని, లైంగిక దాడిని ప్రతిఘటించి, హత్యా యత్నం కేసులో వుంటుంది. ఆమె లాయర్ గా అమితాబ్ బచ్చన్ కోర్టులో మొత్తం అమ్మాయిలందరి ప్రతినిధిగా వాదిస్తాడు. ఈ రియల్ లైఫ్ డ్రామా అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. ‘బద్లా’ కి ఈ అవకాశం లేకుండా పోయింది. రోల్ రివర్సల్ వల్ల ఇది హీరోయిన్ తాప్సీ వివాహేతర సంబంధం పెట్టుకుని, అకృత్యాలకి పాల్పడ్డ నెగెటివ్ షేడ్ గల కథగా మారిపోయింది. దీంతో ప్రేక్షకుల్లో మగ మహానుభావులకే పరిమితమైంది. 

          మరొకటేమిటంటే, ఇందులో అమితాబ్ లాంటి మహానటుడు కేసులో తాప్సీ ని పట్టుకునే కథ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా వుంది. ‘పింక్’ లో పిచ్చుక లాంటి తాప్సీ ని అమితాబ్ కాపాడడం సరైన డ్రామాగా వుంది. ‘బద్లా’ లో  జరగాల్సింది ఒరిజినల్ లోని పాత్రల్ని మార్చడం కాదు, ‘పింక్’ ని రివర్స్ చేయడం. ‘పింక్’ లో లాయర్ గా అమితాబ్ తాప్సీని కాపాడేడు. ‘బద్లా’ లో లాయర్ గా తాప్సీ  అమితాబ్ ని కిల్లర్ గా పట్టుకుని వుంటే భలే మజా వచ్చేది. ఈ మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోలేదు.  


         
ఈ మర్డర్స్ మిస్టరీతో ఎండ్ సస్పెన్స్ కథ ఎండ్ సస్పెన్స్ కథనపు సుడిగుండంలో పడి గల్లంతవకుండా వున్న ఏకైక ఫార్ములాని అనుసరించారు. ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ ప్రవేశ పెట్టిన ఫార్ములా. దీని రీమేక్ గా హిందీ ‘ధువాఁ’  అనుసరించిన ఫార్ములా -  ముసుగు తొడిగిన కథ!

సికిందర్ 
Watched at : Prasads
 9 pm,  March 8, 2019