రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, జూన్ 2017, శనివారం

రివ్యూ!

రచనదర్శకత్వం : వంశీ
తారాగణం :  సుమంత్అశ్విన్, అనీషా అంబ్రోస్, మనాలీ రాథోడ్, మానస, వంశీరాజ్, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర తదితరులు
సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం :నగేష్బనెల్లా
నిర్మాణ సంస్థ: మధుర ఎంటర్టైన్మెంట్
నిర్మాత: మధుర శ్రీధర్రెడ్డి
విడుదల : 2 జూన్,2017
***
     
వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటలు. ఇది గతం.
        వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటల్లాంటి పాటలు. ఇది ప్రస్తుతం.
          గతం 1980 ల నాటి కాలం, ప్రస్తుతం ముప్ఫయ్యేళ్ళు గడిచిపోయిన టైం లాప్స్.
          సినిమాల్లో టైం లాప్స్ తో సీను మారుతుంది. వంశీతో మారలేదు. ఆయన టైం లైన్ లో సీను 1980 ల దగ్గరే ఫ్రీజ్ అయిపోయి వుంటుంది. ఈ సీసులో మన ప్రతిబింబాలెక్కడా అని మారుతున్న తరాల ప్రేక్షకులు వెతుక్కునే పరిస్థితి. 

          లేడీస్ టైలర్ కొడుకు టైలరింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకోవడానికి  మధ్య ఒక దశ వుంది- అది రెడీమేడ్ దుస్తులొచ్చేసి- యారో, పార్క్ ఎవెన్యూ,  లెవీస్ లాంటి గ్లోబల్ సంస్థల షోరూములు అసంఖ్యాకంగా వెలసి, ఆడవాళ్ళకి బొథిక్స్ తెర్చుకుని, చేతి వృత్తి టైలరింగ్  తెల్లారిపోయిన దశ.  ఈ దశ  సినిమా ఫీల్డులో కాస్ట్యూమ్స్  కుట్టే టైలర్స్ కి కూడా వచ్చింది. సినిమా ఫీల్డులో టైలర్స్ ఫ్యాషన్ డిజైనర్ల ధాటికి తట్టుకోలేకపోతే, వూళ్ళల్లో  రెడీ మేడ్ దుస్తుల ట్రెండ్ కి  దెబ్బతిన్నారు.   అంటే లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాలంకి ఇప్పుడు పాతికేళ్ళనుకుంటే, అతడికి పదేళ్ళొచ్చేటప్పటికే  వూళ్ళో టైలరింగ్ వృత్తే వుండి వుండకూడదు. అంటే అతడికి టైలరింగే తెలిసివుండకూడదు. ఈ దశని రికార్డు చేయలేదు వంశీ. 

          చేసి వుంటే ఇంకో స్థాయిలో వుండేది  సినిమా!  రియలిస్టిక్ గా,  పోనీ సెమీ రియలిస్టిక్ గా  వున్నప్పుడే బడ్జెట్ సినిమాకి బలం. రాజేంద్ర ప్రసాద్  1986 లో నటించిన లేడీస్ టైలర్ ఒక కల్ట్ క్యారక్టర్. అలాటి దానికి నేటి సీక్వెల్ లో స్థానం లేకుండా చేశారు. ప్రారంభంలో జనాభా లెక్కల అతను వచ్చి నప్పుడు ( జనాభా లెక్కల వాడి సీను చూసి చూసి వున్న  పాత మూస ఫార్ములా సీను) గోపాలం తండ్రిగా సుందరం పేరు చెప్పి వదిలేశారు తప్పితే- అసలు లేడీస్ టైలర్ సుందరంని ఒక లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేసింది లేదు.  అతడి నిలువెత్తు చిత్ర పటం  ముందు గోపాలం, ఇతడి మేనమామ పాపారావూ నిలబడి ఒక శపధం చేసి వుంటే కథ ఎత్తుగడ ఎంతో ఉత్సుకత రేపేది, కాన్సెప్ట్ మెచ్యూర్డ్ గా వుండేది. కానీ వంశీ తన కాన్సెప్ట్ ని కేవలం లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే మెచ్యూరిటీ కన్పించని  ఉత్త కామెడీకి సరిపుచ్చేశారు.  సామాజిక నేపధ్యాలతో ముడిపడిన వృత్తుల్ని సమాజానికి దూరం చేసి ఫార్ములా కథలు వండితే అది ఇలాటి సినిమాకి బలం కాదు. ఇందుకే ఇది కామెడీగా వుంటూనే శంకరాభరణం, దంగల్ లలాంటి విలువల పరిరక్షణా ధ్యేయం గల బలమైన కాన్సెప్ట్ కాలేకపోయింది. 

       టైలర్లు కుట్టుమిషన్ని కనుగొన్న ఎలియాస్ హోవ్ చిత్రపటం పెట్టుకుని పూజిస్తారు. పుట్టిన రోజు వేడుక కూడా జరుపుకుంటారు. ఆ కుట్టుమిషన్ కార్పొరేటీకరణతో పొట్టకి పనికి రాకుండా పోయింది. చేతివృత్తుల్ని అల్లకల్లోలం చేస్తున్నకార్పొరేటీకరణ ప్రభంజనం మీద ‘కుబుసం’ లో ‘పల్లె కన్నీరు పెడుతుందో’  పాట గుర్తుండే వుంటుంది. దీనికి టైలరింగ్ అతీతం కాదు. 

          పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ ఎప్పుడూ వుంటుంది. ఈ ట్రాప్ లో రచయితలు, దర్శకులు పడితే ముందుకు పోలేరు. సంఘర్షణ పాత్రల మధ్య పెట్టడం వరకే గానీ, వ్యక్తిగతంగా కొత్తా పాతా ఇగోలు  పెట్టుకుంటే పాత దగ్గరే ఆగిపోతారు. కళాకారుడికి కొత్తా పాతా లేదు. ఒక్కటే వుంది-  న్యూట్రాలిటీ. దీంతో  అతను రెండిటినీ మేనేజ్ చేస్తూంటాడు. లేకపోతే  శంకరాభరణం, దంగల్ ల లాంటివి క్రియేట్ చేయలేరు. ఈ రెండూ పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ పెట్టి ఖ్యాతి కెక్కాయి. ఈ సంఘర్షణే లేడీస్ టైలర్ సుందరం, కొడుకు గోపాలం, మేనమామ పాపారావు ఎదుర్కోవాలి నిజానికి. 

          ఏ కుట్టు మిషన్ తో సుందరం ఆనాడు లేడీస్ టైలర్ గా పాపులరయ్యాడో, ఆ వృత్తి ప్రతిపత్తిని నిలబెట్టాలన్న  పట్టుదల పెరగాలి నిజానికి  వారసులకి. ఈ పట్టుదల (గోల్) లేకుండా ఈసురోమని అదే అరుగుల మీద అలాగే కూర్చుని (బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా) కుట్టుకుంటూంటే, దీన్ని వదిలేసి నరసాపురంలో ఫ్యాషన్ డిజైనింగ్ షాపు పెట్టాలనుకుంటే వారసత్వానికీ, లెజెండ్ సుందరం విలువలకీ నిలువునా పాతరేసినట్టే!

          కాన్సెప్ట్ ఇలా వుండదు- ముందు స్ట్రగుల్ వుండాలి, ఆ తర్వాత రియలైజేషన్ వుండాలి.  ఈ వృత్తిలో పరిణామ  దశలున్నాయి. వీటిలోంచే కాన్సెప్ట్ పుట్టాలి. సీక్వెల్  అన్నాక మొదటి దాని పాత్ర లోంచే కథ పుట్టాలి. అప్పుడు ట్రాన్సిషన్ బలంగా వుంటుంది (ఇలా జరక్కపోవడం వల్ల  జరిగిన ఇంకో అనర్ధమేమిటో కూడా  తర్వాత చూద్దాం). గోపాలం తండ్రితో కటాఫ్ అయిపోయి తాడూబొంగరం లేని పాత్రగా ఫ్యాషన్ డిజైనర్ నంటూ  పక్కదారి పట్టాడు. కానీ బాధ్యతగల కొడుకుగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనుకుంటే, ఫ్యాషన్ డిజైనింగ్ తో సంఘర్షించే వాడు. తన పాత విలువల్ని ప్రశ్నార్ధకం చేస్తున్న   అభివృద్ధితో  సంఘర్షించేవాడు. తర్వాత పాత విలువలు అభివృద్ధి నుంచి వేర్పడకుండా కలిసి కొనసాగితే రెండూ మనుగడలో బలంగా,  పరిపుష్టంగా వుంటాయని తెలుసుకునే వాడు.  శంకరాభరణం, దంగల్ ల లోనిది రొటీన్ గా పాత విలువల విజయమే. కానీ ప్రాక్టికల్ గా అభివృద్ధి మీద పాత  విలువలు విజయం సాధించడం సాధ్యంకాదు. పాతవిలువల్ని కాదని అభివృద్ధి ముందుకెళ్ళి పోతుంది, ఆగదు. పాతవిలువలు అభివృద్ధికి చేయందిస్తే అభివృద్ధి విలువలుగల అభివృద్ధి అవుతుంది. ఒంటరి అయిపోకుండా పాతవిలువల పరువుకూడా దక్కుతుంది. విన్ స్టన్ చర్చిల్ చెప్పిందిదే- గొర్రెల మంద అనే నూతన  పోకడల్ని పాత  విలువలనే ములుగర్రతో పొడుస్తూ వుండకపోతే ఆ గొర్రెలమంద కుదురుగా వుండక చెల్లా చెదురై పోతుందని!  కొత్తని తిట్టుకుంటూ ములుగర్రని దాచుకుంటే, ఆ కొత్త అనే గొర్రెలు లారీల కిందా, బస్సుల కిందా పడి చచ్చిపోతాయి! ఇక పాతతరం ఉత్పత్తి చేయలేకా, కొత్త తరం మార్గనిర్దేశం లేక చచ్చిపోయీ ప్రపంచం ఆగిపోతుంది. 

         ఇలా ఈ స్ట్రగుల్ కీ రియలైజేషన్ కీ మధ్య గోపాలం కథ నడవాలి. అది కామెడీగానూ కావొచ్చు,  సెటైరికల్  గానూ కావొచ్చు. 

          ఇక లేడీస్ టైలర్ పాత్రలోంచి దాని సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్ కథ పుట్టకపోవడంతో  జరిగిన ఇంకో అనర్ధం  ఏమిటంటే, దర్శకుడు లేడీస్ టైలర్ నుంచే ఏమీ నేర్చుకోనట్టే అన్నట్టు తయారయ్యింది. దీంతో సుందరం, గోపాలం ఇద్దరి కథలూ ఒకేలా తయారయ్యాయి.

లేడీస్ టైలర్ కథ :
          సుందరం (రాజేంద్రప్రసాద్) మంచి డిమాండ్ లో వున్న లేడీస్ టైలర్. కానీ ఆ పని మీద శ్రద్ధ పెట్టడు. ఏదో అదృష్టం తగిలి ధనవంతుణ్ణి అవుతానని కలలు గంటూంటాడు.  ఒక జ్యోతిష్కుడు తగిలి తొడ మీద పుట్టు మచ్చ వున్న  అమ్మాయిని చేసుకుంటే బాగా కలిసి వస్తుందని చెప్పేసరికి,  అలాటి పుట్టుమచ్చ వున్న అమ్మాయి వేటలో పడతాడు సుందరం. పుట్టు మచ్చ చూడ్డం కోసం ఎందరో  అమ్మాయిల్ని మభ్యపెడతాడు. పెళ్ళికోసం వెంట బడుతున్న  అమ్మాయిల మధ్య ఇరుక్కుని అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. వాళ్ళకి  నిజం చెప్పేసి క్షమాపణ వేడుకుంటాడు. తను నిజంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. 

ఫ్యాషన్ డిజైనర్ కథ:
          గోపాలం నరసాపురంలో షాపు పెట్టుకుని ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటాడు. పెట్టుబడికి డబ్బులేదు. డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడొక జ్యోతిష్కుడు అతడి చేయి చూసి మన్మధ రేఖ వుందనీ, దీంతో ఏ అమ్మాయినైనా లోబర్చుకోవచ్చనీ చెప్తాడు. దీంతో గోపాలం ముందొక అమ్మయిని  ప్రేమలో పడేసుకుని, ఆమెకంటే డబ్బున్న అమ్మాయి కన్పించడంతో ఆమె వెంట పడి, ఈమె కంటే ఇంకా ఆస్తి వున్న అమ్మాయి కన్పించేసరికి ఆమె వెంటాపడి అల్లరై, తప్పు తెలుసుకుని నిజంగా ఫీలైన అమ్మాయిని చేసుకుంటాడు. 

          ఈ రెండు కథలకీ తేడా ఏముంది?  లేడీస్ టైలర్ దాని సీక్వెల్ ల్ రెండిటి కథలూ ఒకేలా ఎలా వుంటాయి. తండ్రి చేసిన తప్పే కొడుకు కూడా చేస్తే, తండ్రి నుంచి కొడుకేం నేర్చుకోలేదా? లేక తండ్రెవరో తెలీదా? ఇది సీక్వెల్ లా లేదు. కొన్ని మార్పులతో లేడీస్ టైలర్ కి రీమేక్ లా వుంది. లేడీస్ టైలర్ పాత్రలోంచి సీక్వెల్ కథ పుడితే ఫ్యాషన్ డిజైనర్ వ్యవహారం వేరేగా వుండేది.  కథ ముందుకెళ్ళేది. కానీ 30 ఏళ్లుగా ఎక్కడేసిన గొంగళి లాగే వున్నాయి తండ్రీ కొడుకుల కథలు. 

          మేకింగ్ ని లేడీస్ టైలర్ తో పోల్చలేం. ఆ రోజులు, అప్పుడు వంశీతో కలిసిన ప్రేక్షకుల అభిరుచులూ వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు వంశీ ఎవరో తెలీదు. మళ్ళీ ఒక కొత్త దర్శకుడుగా కొత్త  వాళ్ళతో పోటీ పడుతూ, కొత్త ప్రేక్షకుల ముందుకు  రావాలే  తప్ప, అవే  పాత  అభిరుచులు కొనసాగిస్తే కుదురుతుందా? సంజయ్ గుప్తా ఒక తరానికి వర్కౌట్ అయిన తన అభిరుచులతో తీసీ తీసీ, కొంతకాలానికి తన సమయం ఐపోయి, మళ్ళీ లేచి కొత్త తరం అభిరుచులు తనవిగా చేసుకుని, ఇటీవల ‘కాబిల్’ తీసి  ఆశ్చర్య పర్చాడు. ఆనాటి తన మేకింగ్ కీ, దర్శకత్వానికీ నేటికీ పోలికే లేదు.

          డేవిడ్ ధావన్ కూడా కామెడీలు తీసీ తీసీ,  తన కాలం ఐపోయిందన్పించి కనుమరుగై,  ఐదేళ్ళ తర్వాత  స్టయిలిష్ ‘పార్టనర్’ తో వచ్చి ఒక వూపు వూపాడు. 

          ప్రకృతి నటించదు.అది మారదు. దాని ముందు నర్తించే మనుషులే మారుతూంటారు. ఒక్కో కాలంలో ఒక్కోలా నర్తిస్తారు. కానీ కోనసీమ, పాపికొండలు, గోదావరీ తీరాల్లో వంశీ పాత్రలు ఇంకా అవే లేడీస్ టైలర్ నాటి నటనలతో, మాటలతో, పాటలతో అడిపాడి అలరించాలనుకుంటాయి. పాత్రలు మామూలుగా నిలబడి మాట్లాడవు, అవి నాట్య భంగిమల్ని ప్రదర్శిస్తూ వెటకారంగా మాట్లాడతాయి. ఈ పాత్రల బృహన్నల సిండ్రోంని ఆనాటి వంశీ అభిమానులైతే అర్ధం జేసుకోగలరుగానీ, కొత్త ప్రేక్షకుడు అర్ధంగాక ఇదేం  సినిమారా బాబూ అని సింక్ అవక పక్క సీట్లో నలుగుతూంటాడు. 

       కామెడీ కూడా ఒక పంచ్ డైలాగుకి  కిందపడి గిల గిలా కొట్టుకోవడం, లాగి కొట్టినప్పుడల్లా ఎక్కడో వెళ్లి పడ్డమనే ట్రెండ్ ఇంకా వుందా?  ఒకతరానికి సమకాలీనత కారణంగా  తన అభిరుచులతో సక్సెస్ ఫుల్ గా కనెక్ట్ అవగల్గిన వంశీ, ఇప్పుడు వచ్చేసి సక్సెస్ కోసం నేటి తరం అభిరుచులతో తను కనెక్ట్ అవ్వాలన్న విషయం మర్చిపోయారు. ఇంకా నేనే ఇస్తాను నువ్వే తీసుకోవాలని తలంటు పోస్తే ఎలా? పాటలకి గోదారి తీరాన అవే వెదురు పాకలు, రకరకాల జెండాలు ఇంకానా? పాటలకి అవుట్ డోర్ లో సెట్స్ ఎవరేస్తున్నారిప్పుడు? వెనుక సీట్లో కూర్చున్న నడివయసు ప్రేక్షులకి కూడా నచ్చలేదిది. సినిమా సాంతం దేనికో ఒకదానికి కామెంట్లు  చేస్తూనే వున్నారు. 

          హీరో సుమంత్ అశ్విన్ నటించింది ఇప్పుడు బాక్సాఫీస్ అప్పీలు గానీ, యూత్ అప్పీలు గానీ ఏమాత్రం లేని వెనుకబడిన పల్లెటూరి పాత్ర. ఇలాటి పాత్రల కాలం ఎప్పుడో తీరింది. గోపాలం అనే పాతకాలం పేరు కూడా యూత్ కి కనెక్ట్ కాదు.  సుమంత్ అశ్విన్ గత మూవీ ‘రైట్ రైట్’ లో కూడా ఇదే తప్పు జరిగింది. యూత్ అప్పీల్ లేని పల్లెటూరి బస్సు కండక్టర్ పాత్ర వేశాడు. 

          ఫ్యాషన్ డిజైనర్ లో  ఈ పాత  వెనుకబడిన వెలసిపోయిన పాత్రే,  సంఘర్షణతో కూడి వుంటే పాత వాసనేయకుండా ఆసక్తికరంగా వుండేది-  ఎందుకంటే ఆధునికత్వంతో సంఘర్షిస్తూంటాడు కాబట్టి. ఈ రోజుల్లో ఒక బడ్జెట్ మూవీని సక్సెస్ చేయాలంటే లక్ష కోణాల్లో ఆలోచించాలి. పాత  రోజుల్లో సినిమాలకి ఇతర దృశ్య మాధ్యమాల పోటీ  లేదు కాబట్టి ఎలా తీసినా నడిచిపోయేది.

          సుమంత్ సంఘర్షించడానికి ఎదుటి పాత్ర కూడా లేదు. అమ్మాయిలతో కష్టా లొచ్చేసరికి తనే సమస్యలో పడి తనే మారడంతో తీరిపోతుంది సమస్య. ఇదంతా ప్రేమల గురించి. కానీ ఇటీవల కాలంలో ప్రేమ సినిమాలే ఆడడం లేదు. మార్కెట్ యాస్పెక్ట్ లో చూస్తే దీనికి సేలబిలిటీ లేదు, క్రియేటివ్ యాస్పెక్ట్ చూస్తే పైన చెప్పుకున్న విధంగా వుంది. ఈ రెండు యాస్పెక్ట్స్ ని కాదని ఏ సినిమా నిలబడుతుంది?

- సికిందర్
http://www.cinemabazaar.in