రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, మార్చి 2018, శుక్రవారం

630 : సందేహాలు - సమాధానాలు




Q :    కథ ప్రారంభిస్తూ విలన్ చేసే నేరాన్నిచూపించి టైటిల్స్ వేశాక, హీరో ని ప్రవేశ పెట్టి,  వెంటనే ఆ విలన్ మీదికి హీరోని  ప్రయోగిస్తే తప్పవుతుందా? ఎలా తప్పవుతుందో వివరించగలరు.
పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు
 
A :   ఇది క్రియేటివ్ స్కూలుతో వచ్చే సమస్య. ఇది కథనంలో వుండే డైనమిక్స్ ని చూడదు. సస్పెన్స్,  థ్రిల్, ఫోర్ షాడోయింగ్ మొదలైన ఎన్నో టెక్నిక్స్ ని  పట్టించుకోదు. అసలు ప్రేక్షకుల్నే పట్టించుకోదు. పట్టించుకోదనడం కంటే పట్టించుకోవాలని తెలీదనడం కరెక్టు. ఇప్పుడు కథలు చేస్తున్నవాళ్లు తమ టీనేజీలో,  అంటే గడచిన పది పదిహేనేళ్ళ కాలంలో, తెలుగులో చూస్తూ వస్తున్నవి కేవలం ప్రేమ సినిమాలు, లేదా స్టార్ ఫార్ములా యాక్షన్ సినిమాలు, ఇంకా వుంటే ఈ మధ్య హార్రర్ కామెడీలే. వీటి ప్రభావంలో పెరిగిన వాళ్లకి మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలు చేయడం రావడం లేదు. వీటిని ప్రేమ సినిమాల ధోరణిలో తమ క్రియేటివిటీని  జోడించి తోచినట్టూ చేసేస్తున్నారు. క్రియేటివ్ స్కూల్లో స్ట్రక్చర్ ఆలోచన వుండదు. తోచింది చేసుకుపోవడమే. అది రాణించదు. స్ట్రక్చర్ స్కూల్లో స్ట్రక్చర్ తో బాటు క్రియేటివిటీకూడా వుంటుంది. ఇది రాణిస్తుంది. ఇక్కడ ఫ్లాపవడానికి స్క్రిప్టేతర కారణాలేమైనా వుంటే వుండచ్చేమో గానీ, స్ట్రక్చర్ స్కూల్ వల్ల ఫ్లాపయితే కావు. 

          ఇంకో ఇద్దరితో ఇదే సమస్య వుంది. మీరన్నట్టు, కథ ప్రారంభిస్తూ విలన్ చేసే నేరాన్నిచూపించి టైటిల్స్ వేశాక, హీరో ని ప్రవేశ పెట్టి,  వెంటనే ఆ విలన్ మీదికి హీరోని  ప్రయోగించడం.  ఇది  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడబోయే సమస్యకి వెంటనే కథనాన్ని ప్రారంభించడమన్న మాట. చాలాసార్లు ‘శివ’ని ప్రస్తావిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ‘శివ’  ఓపెనింగ్ లో భవానీ అనుచరుడు కాలేజీ కొచ్చి ఒక విద్యార్థిని చంపుతాడు. టైటిల్స్ పడతాయి. ఆతర్వాత శివ పాత్ర ఎంటరవుతుంది. అప్పుడు – ‘ఎవడ్రా కాలేజీ కొచ్చి స్టూడెంట్ ని చంపిందీ?’ అని శివ అరుపులు అరిచి, వెంటనే  విలన్ వేటలో పడితే ఎలా వుండేది? దాన్ని ‘శివ’ కాదుకదా, అసలు సినిమా అంటారా? ఇలాటి సినిమాలు తీయాలని స్ట్రక్చర్ స్పృహ లేని క్రియేటివ్ బుద్ధి మాత్రమే ఆలోచిస్తుంది.

          అంటే అప్పుడే ప్లాట్ పాయింట్ వన్ కొచ్చేయడమన్న మాట కథనం. అసలు ప్లాట్ పాయింట్ వన్ కి ఎప్పుడు చేరుకుంటుంది కథనం?  ఈ బిగినింగ్ విభాగం బిజినెస్ ఏమిటి? ముందు పాత్రల పరిచయం చేయాలి, కథా నేపధ్యమేమిటో సృష్టించాలి,  ప్లాట్ వన్ దగ్గర తలెత్తబోయే సమస్యకి పరిస్థితుల కల్పన చేసుకుంటూ పోవాలి, అప్పుడు కథనాన్ని సమస్యలో పడేసి,  హీరో గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేయాలి కదా? అప్పుడు అదొక కథలా,  కథనంలా వుంటుంది కదా? ఇలా స్ట్రక్చర్ ని కాదనుకున్నప్పుడే సమస్య వస్తోంది. ఐతే సమస్యేమిటంటే అది తప్పని తెలుసుకోలేకపోవడమే. మీ కథ బిగినింగ్ విభాగాన్ని స్ట్రక్చర్ రీత్యా మార్చి చూస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయి.  

 Q :   మేంపని చేసే దర్శకుల దగ్గర గానీ, కథలు చేసుకునే మా స్నేహితుల దగ్గర గానీ, స్ట్రక్చర్ గురించి మాట్లాడితే గొడవలవుతున్నాయి. అందరి కథల్లో మిడిల్ మటాష్, పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ , సెకండాఫ్ సిండ్రోము లుంటున్నాయి, వాటి గురించి చెప్పినా విన్పించుకోవడం లేదు. పైగా మమ్మల్ని దూరం పెడుతున్నారు.
విడివిడిగా ముగ్గురు అసోషియేట్ల ప్రశ్న
          మీ ముగ్గురికీ ఎప్పట్నించో చెప్తున్నాం. అయినా మీరలాగే చేస్తూంటే మిమ్మల్ని బ్యాన్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒకరు ప్రొడక్షన్ సమయంలో  స్థానం గల్లంతు చేసుకుని మళ్ళీ ఇంకో చోటా ఇలాగే  చేస్తున్నారంటే  మీరు మారరు.  మీరు స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నది దర్శకులకో, స్నేహితులకో నేర్పడానికి కాదు. మీరెప్పుడైనా  సినిమా చేస్తేగీస్తే స్వయంగా అమలు పర్చుకోవడానికి. కాబట్టి ఇప్పుడు సినిమాలకి పనిచేస్తే మేకింగ్ నేర్చుకోవడానికి మాత్రమే పని చేసుకోవాలి. దర్శకుల ఆలోచనాధారల్లోకి వెళిపోయి ఆ మేరకు కథల్లోమీకు తోచిన బెటర్ మెంట్లు వుంటే చెప్పుకోవాలి.  మీ స్ట్రక్చర్ ఆలోచనాధార తెచ్చి అడ్డం పెట్ట కూడదు. వాదించ కూడదు. మీ స్థానాలు గల్లంతై పోతాయి. మీరు దర్శకులకి శిష్యులేగానీ పాఠాలు చెప్పే గురువులు కారు. ఇక స్నేహితులే కదాని వాళ్ళమీద అధికారం చెలాయించవచ్చని కూడా అనుకోవద్దు. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, తీసుకుంటారు. ఒకవేళ స్నేహితులకి దర్శకులయ్యే  అవకాశం వచ్చి వాళ్లకి  మీరు పనిచేసినా, అప్పుడు కూడా నేర్పుడు కార్యక్రమం పెట్టుకోవద్దు. వాళ్ళ ఆలోచనాధారలోనే  పనిచేసి సేదదీరండి. స్ట్రక్చర్ ని ఇంటిదగ్గర పెట్టుకుని మీరు చేయాల్సి వచ్చినప్పుడు బయటికి తీయండి. ఇంకెప్పుడూ రాత్రిళ్ళు ఫోన్లు చేసి, పనిచేసే చోట స్క్రిప్టుల్లో ఘోరాలు జరిపోతున్నాయని నెత్తీనోరూ కొట్టుకోకండి. మీకంత అవసరం లేదు. మీ సీను మీరు సినిమా చేస్తున్నప్పుడు మొదలవుతుంది.

 Q :   నందమూరి బాలకృష్ణ ఇంకా టెంప్లెట్ సినిమాలే చేయక తప్పదంటారా? మార్చి తీస్తే ఆయనకు నప్పదంటారా?
పి. తిరుపతి రాజు, అసోషియేట్
 A :   ఇప్పుడు ‘భారతీయుడు’ లాంటి సినిమా వుంది. దాన్ని టెంప్లెట్ లో పెట్టి తీయలేరుగా? అయినా పెద్ద హిట్టయిందిగా? మరి అలాటి మేకింగ్ లో కాల్పనిక కథలు, పాత్రలు చేయడానికి బాలకృష్ణ ముందుకు రావాలిగా?  గత రెండు దశబ్దాలుగా మారని అవే బాషా – ఫ్యాక్షన్ ఫార్ములా టెంప్లెట్ లోనే వుండిపోయారు. మారిందేమిటంటే,  అప్పటికీ ఇప్పటికీ బడ్జెట్లే. అప్పటి కాలం చెల్లిన టెంప్లెట్ లని కూడా ఇప్పటి భారీ బడ్జెట్లతో తీస్తున్నారు. ఆయన ఆలోచించుకుని మార్చమని చెప్తే తప్ప ఆయన సినిమాలు మారే అవకాశం లేదు.  ‘శాతకర్ణి’ లాంటి చారిత్రికాలతో, ఇప్పుడు ‘ఎన్టీఆర్’ లాంటి బయో పిక్ లతో వేరు.  ఇలాటివి కనీసం ఏడాదికొకటి చేసినా మూస టెంప్లెట్ ల బాధ వదుల్తుంది.

Q :    ‘రంగస్థలం’ మూవీ స్టోరీ ఎనాలిసిస్ (ఒక వారం తర్వాతైనను) మీ వీలుని బట్టి మీ బ్లాగ్ లోమా వంటి ఔత్సాహికుల కోసం అందించగలరా?
ఆనంద్ త్రివేది, రచయిత
 
A :   రివ్యూలు, ఎనాలిసిస్ లు ఇకపైన వుండబోవని తేల్చి చెప్పేశాక కూడా మీ లాంటి వారు ఇంకా అడుగుతూనే వున్నారు. కొందరైతే అల్లాడిపోతున్నారు. ఒకవైపు స్క్రిప్టులు చేయడం వైపు లాగుతారు, ఇంకో వైపు రివ్యూలు రాయాలంటారు. రెండూ ఎలా కుదురుతాయి? ఏదో ఒకటే చేయాలి. ఒకవైపు స్క్రిప్టులు చేస్తూ, ఇంకో దర్శకుడి సినిమా చూసి వరస్ట్ గా వుందని ఎలా రివ్యూ రాయగలం. గొడవలవకుండా వుంటాయా? ఇన్నాళ్ళకి వచ్చి కొత్తగా గొడవలు పెట్టుకోవడం అవసరమా? మీరే వున్నారు. ఒక సినిమాకి రచన  చేస్తూ, ఇంకో సినిమా చూసి వరస్ట్ గా వుందని పోస్టు పెట్టగలరా?  ఒక దర్శకుడెవరైనా ఇంకో దర్శకుడి సినిమా చూసి, వరస్ట్ గా వుందబ్బా అని స్టేట్ మెంట్ ఇస్తారా?  కాబట్టి ఒకవేళ స్క్రిప్టులు చేస్తూ రివ్యూలు రాయాల్సి వస్తే, అవి ఆహా ఓహో అని ఆకాశానికెత్తేసేలానే వుంటాయి తప్ప విమర్శనాత్మకంగా (మనవరకూ నిర్మాణాత్మకంగా) వుండవు, కాబట్టి మీకుపయోగపడవు. 

          అసలు అన్నేసి సినిమాలకి రివ్యూలు రాసి రాసి వున్నాకా, అన్నేసి తప్పొప్పులు చెప్పేశాక,  ఇంకా రివ్యూలు అవసరమా? తప్పొప్పులేమిటో, అవెలా వుంటాయో  ఈపాటికి తెలిసిపోయే వుండాలిగా? ఇప్పుడు ‘రంగ స్థలం’ చూస్తే  మీబోటి వారు అందులో తప్పొప్పులేమిటో చెప్పేయగల్గాలిగా? మళ్ళీ ప్రత్యేకంగా ఎవరో రివ్యూరాస్తేనే తెలుసుకోగలమనుకుంటే, ఇన్నాళ్ళూ చదివి తెలుసుకున్న దేమిటి?  సినిమాలు తీసే సంగతి తర్వాత, సినిమాలు చూసే విషయంలో కూడా ఇంకా ఎక్స్ పర్ట్ లవకపోతే ఎలా? 

          కాబట్టి ఇక తెలుగు, హిందీ సినిమాల రివ్యూలు పక్కన బెట్టి, స్ట్రక్చర్ కి పేర్గాంచిన హాలీవుడ్ సినిమాలని విశ్లేషిద్దాం. కొన్ని స్ట్రక్చర్ లో వున్న పాత మంచి తెలుగు సినిమా లుంటే (బ్లాక్ అండ్ వైట్ అయినా సరే) వాటి ఎనాలిసిస్ చేద్దాం. కొత్త తెలుగు, హిందీ సినిమాల విషయం ఇక మర్చిపోదాం.

సికిందర్