రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, మార్చి 2015, సోమవారం

సాంకేతికం ...మాన్యువల్  ఎఫెక్ట్స్ ఉండవా?
సాదిరెడ్డి రామారావు - యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ 

జీవా నటించిన సూపర్ హిట్ ‘రంగం’ సినిమా క్లైమాక్స్ లో గన్ ఫైర్ దృశ్యాలు ఎంత బీభత్స భయానంగా వున్నాయో తెలిసిందే. రెప్పపాటు కాలంలో కొన్ని వందల బుల్లెట్స్ గోడల్లోకి చొచ్చుకు పోతూంటాయి. క్రిమినల్స్ గల్లంతై పోతారు. ఇదంతా యాక్షన్ కొరియోగ్రాఫర్ సుప్రసిద్ధ పీటర్ హెయిన్స్ ప్రతిభాపాటవంగా నమోదవుతుంది బ్రహ్మాండంగా. ఇక్కడే వుంది తిరకాసు. ఈ సీను జాగ్రత్తగా చూస్తే, ఆ బుల్లెట్ రంధ్రాల్లోంచి సహజంగా రావాల్సిన పొగ రావడం కన్పించదు.  నిప్పులేనిదే పొగ ఎలా వస్తుంది? ఈ పొగ వెలువడి సీను సహజంగా కన్పించడం కోసం యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆపరేటర్ క్రాకర్స్ (మేకుల్లాంటి టపాసులు) ఆ రంధ్రాల్లో అమర్చి పేల్చాలి నిజానికి. కానీ దీనికి బదులు కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (సిజిఐ) లో ఈ సీను సృష్టించడం వల్ల ఈ అసహజత్వం వచ్చేసింది...మాన్యువల్ ఎఫెక్ట్స్ ని కాదని సిజిఐ కి పాల్పడ్డం తో ఈ కృత్రిమత్వమంతా అన్నమాట!

     ఇది ప్రేక్షకులు పసిగట్టేస్తున్నారని అంటున్నారు సాదిరెడ్డి రామారావు అలియాస్ రాము. గ్రాఫిక్స్ చేశార్రోయ్ అని అరిచేస్తున్నారు ప్రేక్షక షెర్లాక్ హోములు! రాము వంటి సీనియర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆపరేటర్లకి సైతం ఈ సిజిఐ మాయ వచ్చేసి పని తగ్గించేస్తోంది. ఓ జీపుని నిజంగా పేల్చేయడానికి ఇరవై లీటర్ల పెట్రోలు అవసరమైతే, అర లీటరుతో కొద్దిగా పెల్చేద్దురూ,  మిగతాది గ్రాఫిక్స్ లో చూసుకుంటామని అనేస్తున్నారు నిర్మాతలు సైతం. నిజానికి మాన్యువల్ ఖర్చు కంటే గ్రాఫిక్ కయ్యే ఖర్చే ఎక్కువని రాము స్పష్తం చేస్తున్నారు.

     మూడు దశాబ్దాల సుదీర్ఘానుభావంతో రాము గన్ ఫైరింగ్, బాంబ్  బ్లాస్టింగ్, క్యానన్ బ్లాస్టింగ్, కౌంటర్ బ్లాస్టింగ్, మినియేచర్ బ్లాస్టింగ్, వాటర్ బ్లాస్టింగ్, పేపర్ బ్లాస్టింగ్, గ్లాస్ బ్రేకింగ్, కత్తి పోరాటాల్లో మెరుపులు, గదలు కొట్టుకున్నప్పుడు రవ్వలు వంటి అనేక ధ్వంస రచనల్లో ఆరితేరారు. వీటి ఆపరేటింగ్ లో చాలా ఏకాగ్రత అవసరం. టైమింగ్ తప్పితే ప్రమాదాలే జరిగిపోవచ్చు. అయితే ఇంతవరకూ ఏ చిన్న ప్రమాదమూ జరగనివ్వని క్లీన్ చిట్ తో, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీ కాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లే కాకుండా, ఇంకా వందలాది నటులు రాము చేతుల్లో సురక్షితంగా వున్నారు.

    ‘సినిమాటెక్’ శీర్షికకు ఈ ఇంటర్వ్యూల కోసం ఈ యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని వెపన్స్, బ్లాస్టింగ్స్, క్యానన్ బ్లాస్టింగ్ అని మూడు తరగతులుగా విభజించుకుని, మొదటగా వెపన్స్ గురించి రాముని కలుసుకుంటే, ఆయన సొంత నివాస భవనంలోని ‘ఆయుధాగారం’ చూపించారు. అక్కడ డబుల్ బ్యారెల్, ట్రిపుల్ బ్యారెల్, 302 రైఫిల్స్, ఎస్ ఎల్ ఆర్, ఏకే- 47, ఎం.పి- 5, పంప్ యాక్షన్ హెవీ గన్స్  మొదలైనవి అనేకం వున్నాయి. మరి రివాల్వర్స్, పిస్టల్స్, 9 ఎం.ఎం. గన్స్ సంగతి? వాటిని ఓల్డ్ సిటీ నుంచి మహ్మద్ మారూఫ్ అనే అతను సరఫరా చేస్తాడన్నారు. గత పాతికేళ్ళుగా ఈయనే వాటికి అధీకృత సప్లయర్.

     ఇక్కడున్న ఆయుధాలు మాత్రం స్వయంగా రాము తయారు చేసుకున్నవే. వీటిలో రెండు రకాలు : పేల్చకుండా పట్టుకు తిరిగేవి, పేల్చేవి. పేల్చడానికి ఉపయోగించే వాటిలో లోపలి ఎలక్ట్రిక్ సర్క్యూట్ రూపకల్పన కూడా  ఈయనదే. గన్ బట్ కుండే స్లయిడ్ ని పక్కకు జరిపితే, లోపల సర్క్యూట్, దానికి అనుసంధానించిన పది పెన్ టార్చి బ్యాటరీలు, 10 ఫ్యూజులూ కన్పిస్తాయి. ఈ ఫ్యూజులకే  క్రాకర్స్ ని అమరుస్తారు. దాంతో ట్రిగర్ లాగగానే పెద్ద చప్పుడుతో క్రాకర్స్ పేలి, బ్యారెల్లోంచి నిప్పు రవ్వలు చిమ్ముతాయి. నిజ తుపాకుల్లోంచి వెలువడే తూటా ఎలాగూ దాని పలాయన వేగంతో కంటికి కనపడదు కాబట్టి, ఈ తుపాకుల్లో బుల్లెట్స్ ని లోడ్ చేసే అవసరం రాదు.

      తూటా వెళ్లి ఓ వ్యక్తికి తాకడాన్ని ఇలా వివరించారు రాము : ఆ దేహ భాగానికి ప్యాడింగ్ చేసి, ఓ కండోమ్ లో రక్తం ( అంటే గ్లిజరిన్ + రంగు) నింపి, క్రాకర్స్ తో ఒక సర్క్యూట్ ని ఏర్పాటు చేస్తారు. ఆ తీగెల్ని దూరంగా స్విచ్ బోర్డుకి బిగించుకుని ఆపరేటర్ కూర్చుంటాడు. షాట్ తీసేటప్పుడు  టైమింగ్ తో ఈ స్విచ్ ని నొక్కితే, క్రాకర్స్ పేలి, కాలిన బట్టల్లోంచి పోగరావడం, అదే క్షణంలో కండోమ్ కూడా పగిలి,  బ్లడ్ ని  విరజిమ్మడమూ జరిగిపోతాయి. వెండి తెర మీద ఈ ప్రక్రియ సహజత్వానికి అత్యంత దగ్గరగా వుంటుందన్నారు రాము.

పాత రోజుల్లో తుపాకీ పేలిన సౌండ్ ఎఫెక్ట్  మీద, క్షతగాత్రుడు గుండె పట్టుకుని అక్కడున్న రక్తపు తిత్తిని నొక్కుకుంటే, బొటబొటా రక్తం కారేది కానీ, గాయం కన్పించేది కాదన్నారు రాము.

     1982 లో చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమాకి ఏకనాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేరిన రాము, 1987 లో కమల్ హాసన్ ‘విక్రమ్’ కి ఆపరేటర్ అయ్యారు. నాటి నుంచీ నేటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలు కలిపి వందలాది చేశారు. జేపీ దత్తా  తీసిన మెగా హిట్ ‘ బోర్డర్’ అనే యుద్ధ చిత్రానికి బికనీర్ వెళ్లి 40 రోజులు పని చేసి వచ్చారు. బాలకృష్ణ నటించిన బంపర్ హిట్ ‘సమరసింహా రెడ్డి’  లో మొట్ట మొదటిసారిగా తెలుగు సినిమా కంటూ టాటా సుమోల్ని పేల్చేసి గాల్లోకి ఎగేరేసిన క్యానన్ బ్లాస్టర్స్  మోహన్- కృష్ణ లకి  పెట్రో బ్లాస్టింగ్ లో సహకరించారు రాము. ఈయన స్వస్థలం కాకినాడ.


    రజనీ కాంత్ జంబోజెట్  ‘రోబో’ కోసం రాము అత్యంత  కష్టపడి ఒక భారీ యాక్షన్ సెట్ నే సిద్ధం చేశారు. గన్ షాట్స్ తో క్షణాల్లో గోడ జల్లెడయ్యే సీన్ అది. 60 మంది టీం తో 20 రోజులూ  శ్రమించి,  గోడలో 10 వేల రంధ్రాలతో క్రాకర్స్ ని ఫిక్స్ చేసి, సర్క్యూట్ ని కంప్లీట్ చేశారు. టెస్ట్ షూట్ చేసి కూడా చూపించారు. అప్పుడా రంధ్రాల్లోంచి పొగ చిమ్మడం కూడా చూశాడు ఆ సినిమా యాక్షన్ డైరెక్టర్. ఐనా ఇలా పొగ వచ్చే బుల్లెట్ రంధ్రాలు తనకవసరం లేదని, వెళ్ళిపోయి గ్రాఫిక్స్ చేయించుకున్నాడు. రాము పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

    ‘రంగం’ అయినా , ‘రోబో’ అయినా ఇస్తున్న సంకేతం ఒకటే...ప్రపంచీకరణ వల్ల కుల వృత్తులు / చేతివృత్తులు  మటు మాయమై పోతున్నాయంటూ ‘కుబుసం’ లో శ్రీహరి పాడే పాట ఒకటి వుంది... ‘పల్లె కన్నీరు పెడుతుందో తెలియని కుట్రల’ అని గోరటి వెంకన్న రాసిన పాట. యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ అనే చేతి వృత్తి గతి కూడా ఇంతే నేమోనని ఆ సంకేతం! 


సికిందర్
( మే 2011, ‘ఆంధ్రజ్యోతి’ కోసం)