రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

877 :


          చివరికి సినిమాలు సేఫ్ అవడానికి ‘అత్యధిక థియేటర్లు –వారాంతపు రోజులు’ అన్న ఫార్ములా కూడా లాభించడంలేదు. డియర్ కామ్రేడ్ తో మొదలైన ఫ్లాపుల పరంపర ఈ ఫార్ములాకి గండి కొడుతోంది. డియర్ కామ్రేడ్ తర్వాత స్టార్ సినిమాలు 5 విడుదలయ్యాయి - మన్మథుడు -2, రణరంగం, సాహో, గ్యాంగ్ లీడర్, గద్దలకొండ గణేష్. వీటిలో మొదటి నాల్గూ వరసగా ఫ్లాపయ్యాయి. గద్దలకొండ గణేష్ బ్రేక్ ఈవెన్ సమస్యలో పడింది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కి ముందు ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్టయ్యింది. మరి అలాటిదే మాస్ యాక్షన్ సినిమా గద్దలకొండ గణేష్ కి సమస్య ఎదురయ్యింది. ఓవర్సీస్ లో ఫ్లాప్ అనుకుని ఆశ వదులుకున్నారు. కనీసం తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో గద్దలకొండ గణేష్ కంటే, నగర బ్యాక్ డ్రాప్ లో ఇస్మార్ట్ శంకర్ ఎక్కువ యూత్ ఫుల్ గా వుంది.

         
దిహేనేళ్ళ క్రితం ఈ ఫార్ములా మొదలయ్యింది... ‘అత్యధిక థియేటర్లు –వారాంతపు రోజులు’ అన్న ఫార్ములా. అప్పట్లో ప్రింట్లు, ఇప్పడు డిజిటల్. అప్పట్లోనే నాల్గు వారాలు, యాభైరోజులు, వందరోజులు, మూడు రకాల జూబ్లీలూ వగైరా ఆడే రోజులు పోయి చాలా కాలమైంది. కనీసం ఒక వారం మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. అందుకని వీలైనన్ని ఎక్కువ  ప్రింట్లతో - థియేటర్లతో – శుక్ర శని ఆదివారం వారాంతపు మూడు రోజుల్లో విడుదల చేసి వీలయినంత వసూళ్లు లాగెయ్యాలన్న ఫార్ములా మొదలయ్యింది. ఇది సక్సెస్ అవుతూ వచ్చింది కూడా సినిమాల క్వాలిటీ ఎలా వున్నా. ఇప్పుడు చూస్తే ఈ మూడు గోల్డెన్ రోజుల మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. మొదటి రోజే ఎండుటాకులా టపటప రాలిపోతున్నాయి. ఒకవేళ వారాంతం ఆశాజనకంగా వున్నా, సోమవారం నుంచి గుండెల్లో గుబులు మొదలవుతోంది. పై 5 సినిమాలూ ఈ సోమవారం సిండ్రోం బాధిత సినిమాలే. అంటే స్టార్ సినిమాల క్వాలిటీ ఎలాగూ పెరగదు కాబట్టి ఇక బడ్జెట్లు సగానికి సగం తగ్గించుకోవడమే సేఫ్ అవడానికి మార్గం.

      తె
లుగు రాష్ట్రాల కంటే హిందీ రాష్ట్రాల మాస్ జనం ఎక్కువ. అయినా అక్కడ హిందీ సినిమాలు పాత మూస మాస్ ఫార్ములా ధోరణికి స్వస్తి చెప్పాయి. సగటు ప్రేక్షకులు సహా ఓవర్సీస్ ప్రేక్షకులవి కూడా నేలబారు అభిరుచులే అని చీప్ గా ట్రీట్ చేస్తూ, ఇంకా పాత మూస మాస్ ఫార్ములా స్టార్ సినిమాలు తీయడం తెలుగులోనే చెల్లింది. కానీ నెట్ యుగపు ప్రేక్షకుల అరచేతిలో కొత్త ప్రపంచాలు ఆవిష్కృత మవుతున్నాయి. ఇది గమనించే హిందీలో మాస్ ప్రేక్షకుల్ని క్లాస్ క్లబ్ లోకి ఆహ్వానిస్తూ విభిన్న స్టార్ సినిమాలు తీస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. నూరు కోట్ల క్లబ్ లో హిందీ సినిమాలు చేరుతున్నాయంటే క్లాస్ క్లబ్ లో మాస్ ప్రేక్షకులు చేరకపోతే సాధ్యం కాదు. తెలుగులో మాస్ వర్గాల్ని క్లాస్ క్లబ్ లోకి చేర్చుకోవడానికి మేకర్లు ససేమిరా అంటున్నారు కల్లెక్షన్లు మొరాయిస్తున్నా. తెలుగు మేకర్ల దృష్టిలో ప్రేక్షకులు ఇంకా మేకలు.

         
సెప్టెంబర్ వరకూ హిందీ బాక్సాఫీసు పనితనం మెరుగ్గా వుంది. 9 సూపర్ హిట్లు, 4 హిట్లు, 4 ప్లస్ లు, 22 ఫ్లాపులు. హిందీలో సూపర్ హిట్ అంటే బడ్జెట్ కి రెట్టింపుపై ఇంకో 50 శాతం అదనంగా వసూళ్లు సాధించడం. డ్రీం గర్ల్ (114.20 కోట్లు), మిషన్ మంగళ్ (200.16), ఆర్టికల్ -15 (65. 05), కబీర్ సింగ్ (278.24), ది తాష్కెంట్ ఫైల్స్ (16.75), బద్లా (88.02), లుకా చుప్పీ (95.14), గల్లీ బాయ్ (139.98), యురీ – ది సర్జికల్ స్ట్రైక్ (244.06) సూపర్ హిట్లుగా నమోదయ్యాయి. వందకోట్లతో తీసి రెండొందల యాభై కోట్లు గడిస్తే సూపర్ హిట్టే, ఐదు కోట్లతో తీసి పన్నెండున్నర కోట్లు గడించినా సూపర్ హిట్టే. ఈ రెండో దానితో పోల్చుకుంటే వందకోట్లతో తీసి రెండొందల కోట్లు గడిస్తే హిట్టే, సూపర్ హిట్ కాదు. పన్నెండున్నర కోట్లు గడించిన 5 కోట్ల సినిమానే సూపర్ హిట్.

         
హిట్ అంటే బడ్జెట్ కి రెట్టింపు రావడం. తెలుగులో బడ్జెట్ మీద పదిశాతం వచ్చినా హిట్టే హిట్టూ అంటూ గంతులు. హిందీలో ఛిచోరే (136.00 కోట్లు), సాహో (148.00), బాట్లా హౌస్ (97.18), కేసరి (153.00) హిట్లుగా నమోదయ్యాయి. ప్లస్ అంటే బడ్జెట్ సేఫ్ అయి కొద్ది శాతం అదనంగా గడించడం. సూపర్-30 (146.10 కోట్లు), భారత్ (209.36), దేదే ప్యార్ దే (102.40), టోటల్ ఢమాల్ (154.10) ఈ కేటగిరిలో వున్నాయి. ఇక ప్లాప్ అంటే, బడ్జెట్ లో 50 శాతానికి పైగా కోల్పోవడం. జబరియా జోడీ, ఖాందానీ షఫాఖానా,అర్జున్ పాటియాలా, జడ్జ్ మెంటల్ హైక్యా, గేమ్ ఓవర్, ఖామోషీ, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, పిఎం నరేంద్రమోడీ, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, థాకరే, బ్లాంక్, సెట్టర్స్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2, జంగ్లీ, నోట్ బుక్, సంచరియా, వై చీట్ ఇండియా- ఇవన్నీ స్టార్లు లేని లో- మీడియం బడ్జెట్ ఫ్లాపులు. స్టార్స్ తో పెద్ద బడ్జెట్ ఫ్లాపులు నాల్గున్నాయి : కళంక్, మణికర్ణిక, ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లాగా, రాబర్ట్ అక్బర్ వాల్టర్.  ఈ మొత్తం అన్ని కేటగిరీల్లో కళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 తప్ప ఇంకేవీ పాత మూస ఫార్ములాలు కావు.

            
స్టోరీ అయిడియాలు, సినాప్సిస్ లు వాట్సాప్ లో పంపవద్దని మనవి. ఈ మెయిల్ చేస్తే బావుంటుంది. ఈ బ్లాగులో ఇంత రాస్తున్నా ఇంకా పాత మూస ఫార్ములా కథలు పంపే మహనీయులున్నారు. కనీసం తెలుగు సినిమాల ట్రెండ్ ఏమిటో మార్కెట్ వైపు తమ విలువైన, అరుదైన చూపు సారించి- బద్ధకం వదిలించుకుని, సినిమాలు చూడకపోయినా కనీసం రివ్యూలైనా చదివి, ఏ సినిమా ఏమిటో లోకజ్ఞానం పెంచుకుంటే మంచిదని మరోసారి మనవి. అలాటి కథలు చెత్త బుట్టలో పారేసి ఇంటికెళ్ళిపోవడం మంచిది. జీవించడానికి అనేక వృత్తులున్నాయి.

సికిందర్                                                                                                               

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

876 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ సంగతులు


నిన్నటి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ వ్యాసంతో కొంత కదలిక వచ్చినట్టుంది, ఇక నిర్మాతలూ కదిల్తే మేకర్లకి రిలీఫ్. నిర్మాతల్లో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ తో కదలిక వుంది. ఎంత మైక్రో బడ్జెట్ లో వుంటే అంత ముందు కొచ్చే పరిస్థితి. చిక్కల్లా మేకర్లు ఇంకా రోమాంటిక్ కామెడీల మేకింగ్ ఆలోచనలతో వుండడమే. థ్రిల్లర్స్ రాత, తీత వేరే టెక్నిక్స్ ని కోరుకుంటాయని  తెలుసుకోక పోవడమే. ఇదలా వుంచితే, అసలు కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీస్ రాయాలంటే ఎన్ని పద్ధతులున్నాయో చూద్దాం. ఈ విషయ సమాచారానికి కేరాఫ్ అడ్రస్ హాలీవు   డ్. సినిమా రాతకి, తీతకి సంబంధించి సాంకేతిక సమాచారమంతా హాలీవుడ్ లో నిక్షిప్తమై వుంది. అక్కడ్నించి అసంఖ్యాక నిపుణులు అందించే సమాచారానికి స్ట్రక్చరే మూలం. స్ట్రక్చరాస్యులు కాని సొంత క్రియేటివ్ స్కూలు మేకర్లకి ఈ సమాచారం  అర్ధంగాక పోవచ్చు. కానీ ఇలా తీసే సినిమాలు ప్రేక్షకులకి అర్ధమవుతాయి, అర్ధవంతంగా వుంటాయి. ఇలా వివిధ ప్రాప్తి స్థానాలనుంచి సేకరించిన ఈ సమాచారమేమిటో ఓసారి పరికిద్దాం...           

           కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో బాటు అమెరికాలో కమింగ్ ఆఫ్ ఏజ్ నవలలకీ పెద్ద మార్కెట్ వుంది. ఈ మార్కెట్లో ఒకప్పుడు మిల్స్ అండ్ బూన్ టీనేజి చాక్లెట్ ప్రేమ నవలలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ లో రియలిస్టిక్ నవలలు రాజ్యమేలుతున్నాయి. ఇవి రాయడంలో అమెరికన్ రచయితలు, రచయిత్రులు ఆరితేరి పోయారని ‘ది గార్డియన్’  పత్రిక పేర్కొంది. కనుక ఈ జానర్ సినిమాలతో బాటు, నవలలకి కూడా ఏం మెళకువలు ప్రదర్శిస్తున్నారో గమనిద్దాం.

          టీనేజి పాత్రల
ఎదుగుదలచిత్రణలకి స్క్రీన్ ప్లే త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో నాల్గు పద్ధతులున్నాయి. మూమెంట్ ఇన్ టైం పద్ధతి, లాంగ్ హాల్ పద్ధతి, బిగ్ ఈవెంట్ పద్ధతి, పెట్రి డిష్ పద్ధతి. మూమెంట్ ఇన్ టైం పద్ధతిలో - పాత్ర దినచర్యల్నిఆ పాత్ర భవిష్య ప్రయాణానికి సింబాలిక్ గా చూపిస్తారు. దీన్ని ఒక రోజుకో, అతి కొద్ది రోజులకో పరిమితం చేస్తారు. ‘లేడీ బర్డ్’ (2017) లో టీనేజీ హీరోయిన్ రోజువారీ జీవితంలో ఇమడడానికి చేసే స్ట్రగుల్ లో, అవకాశాల్లేని ఆ చిన్నవూరు దాటేసి ఎదగాలన్న తాపత్రయం సింబాలిక్ గా ప్రతిబింబిస్తుంది.

          లాంగ్ హాల్ - అంటే సాగలాగే పద్ధతిలో – టీనేజి పాత్ర పరిణతి చెందే దిశగా చేసే ప్రయాణాన్ని సాగలాగుతూ, కొన్నేళ్ళ స్పాన్ లో చూపిస్తూ పోతారు. బాల్యం నుంచీ టీనేజీ మీదుగా ఇరవయ్యో పడిలోకి.  ‘లయన్’ (2019) లో ఈ పద్ధతి చూడొచ్చు. బిగ్ ఈవెంట్ పద్ధతిలో – ఒకే ఒక్క పెద్ద సంఘటనతో మార్పు చూపిస్తారు. ఈ సంఘటన తోటి పాత్రల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక్కో పాత్ర ఈ సంఘటన వల్ల ఒక్కో విధంగా మార్పు చెందుతాయి. ‘అమెరికన్ పై’ (1999) అనే కాలేజీ కామెడీలో టీనేజీ పాత్రలు వర్జినిటీ కోల్పోవడానికి పడే పోటీలో కొన్నిటికి ఆ అవకాశం లభిస్తుంది, కొన్నిటికి లభించదు. అయితే అన్ని పాత్రలూ ఈ వర్జినిటీ  కోల్పోవడమనే బిగ్ ఈవెంట్ నుంచి ఏదోవొకటి నేర్చుకుంటాయి.  పెట్రి డిష్ పద్ధతి - పెట్రి డిష్ అంటే బాక్టీరియాల్ని పెంచడానికి శాస్త్రవేత్తలు వాడే వెడల్పాటి గాజు పాత్ర. ఈ పెట్రి డిష్ లాంటి సిట్యుయేషన్ లోకి టీనేజి పాత్రల్నిఇరికిస్తారన్న మాట. ఇరికించి పెంచి పోషిస్తారు. హాలీవుడ్ హై స్కూల్ సినిమాల్లో ఈ ప్లే కన్పిస్తుంది. ఒక సృష్టించుకున్న విషమ పరిస్థితిలో పాత్రలు అనుకోకుండా ఒకదానికొకటి తగుల్కొని, పీక్కోలేక అందులోనే పడి ఎదగడం నేర్చుకుంటాయి.

మర్యాద జానర్ మర్యాద!

        ఈ నాల్గు పద్ధతుల్నీ ఏ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కథలకైనా వాడొచ్చు. ఈ నాల్గు పద్ధతుల్లోనే కమర్షియాలిటీ వుంటుంది. కాదని సొంతంగా పద్ధతి కాని పద్ధతికి పోతే కమర్షియాలిటీ కాకుండా పరిపూర్ణ క్షవరం వుంటుంది షాంపూతో.
 
          ఈ నాల్గు నమూనాలకీ స్ట్రక్చర్ ఒకటే. కమర్షియాలిటీకి వున్నదొకే వొక్క స్ట్రక్చర్ – త్రీయా క్ట్ స్ట్రక్చర్. పౌరాణికాల నుంచీ పాప్ కార్న్ సినిమాల వరకూ నాల్గు డబ్బులు రావడానికిదే స్ట్రక్చర్. బిగినింగ్, మిడిల్ ఎండ్- వీటిలో వీటికి సంబంధించిన నిర్ణీత కార్యకలాపాలు. ఈ యూనివర్సల్ స్ట్రక్చర్ లో స్క్రీన్ ప్లేలు రాస్తూంటే పాసివ్ పాత్రలు, మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు,  సెకండాఫ్ సిండ్రోములు వగైరా అనేక బాక్సాఫీసు వ్యతిరేక విన్యాసాలు చొరబడే అవకాశమే వుండదు. త్రీయా క్ట్ స్ట్రక్చర్ డీఫాల్ట్ గా అలా వుంటుంది ఫైర్ వాల్ తో. బాక్సాఫీసు వ్యతిరేక విన్యాసాలు క్రియేటివ్ స్కూలిష్టులే చేస్తూంటారు. ఒకవేళ తెలుగులో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రావడమంటూ జరిగితే తెలుగుకి అది తొలకరి. దీన్ని కూడా  క్రియేటివ్ ఎలిమెంటరీ స్కూలు గానుగ మరాడించి దుంప నాశనం పట్టించకుండా వుంటే బావుంటుంది. క్రియేటివ్ వీధి బడితో ఇప్పటికే  వున్న అన్ని జానర్లూ కలిసి 90 శాతం అట్టర్ ఫ్లాపులతో కిటకిట లాడుతున్నాయి. 90% హౌస్ ఫుల్!


 స్వేచ్ఛ వర్సెస్ ఎదుగుదల  

         ఇక్కడొకటి గమనిద్దాం. ఎదుగుదల, స్వేచ్ఛ టీనేజీ సమస్యలు. టీనేజర్ ఎదుగుదల దృక్పథంతో వుంటే స్వేచ్ఛ వుండదు గానీ ఎదుగుదల ‘లాంగ్ హాల్’ గా నిరంతరం వుంటుంది. స్వేచ్ఛా దృక్పథముంటే ఎదుగుదల వుంటుంది గానీ ‘పెట్రి డిష్’ గా వుంటుంది. అంటే ఎదుగుదలని కోరుకుంటే స్వేచ్ఛ ని వదులుకోవాలి. ఇది పాజిటివిజం. స్వేచ్ఛని కోరుకుంటే ఎదుగుదలని కోల్పోవాలి. ఇది నెగెటివిజం. 

          వీటికి రెండు ఉదాహరణలు చూద్దాం : సత్యజిత్ రే తీసిన ‘అపరాజితో’ (1956) లో, అతను చిన్నప్పుడు గ్రామంలోనే చదువుకుంటాడు. తల్లితోనే వుంటాడు. స్కూలు చదువయ్యాక కాలేజీలో చేరడానికి నగరం వెళ్ళాలనుకుంటాడు. అప్పుడొస్తుంది సమస్య. అతణ్ణి విడిచి తల్లి వుండలేదు. తల్లిని విడిచి అతను నగరం వెళ్ళలేడు. కొడుకు అభివృద్ధిని తల్లి కోరుకునేదే గానీ దూరంగా వుంటే భరించలేదు. ఈ ద్వైదీ భావాన్ని దిద్దుకునేంత మనసు లేదు. చివరికెలాగో నగరం వెళ్తాడుగానీ, మనసంతా తల్లి మీదే వుండి స్ట్రగుల్ చేస్తాడు. తనవల్ల ఆమెకి కలిగిన లోటుని ఉన్నత చదువుతో తీర్చాలనే పట్టుదలతో వుంటాడు. కానీ అప్పటికామె సజీవంగా వుండదు.


          అంటే అతను కోరుకుంటే చదువు మానేసి వూళ్ళో తల్లితోనే వుంటూ, బాధ్యతల్లేకుండా స్వేచ్ఛగా  బ్రతకవచ్చు. ఆ స్వేచ్ఛ వదులుకున్నాడు ఎదగాలనుకుని. ఈ ఎదుగుదల బాధాకరంగా వున్నా వదులుకోలేదు. ఇది ‘లాంగ్ హాల్’ ఎదుగుదల. 


          నాగభూషణం నటించిన ‘నాటకాల రాయుడు’ (1969) టీనేజీ మూవీ కాకపోయినా స్వేచ్ఛ కోసం ఎదుగుదలని వదులుకునే పాత్రగా నాగభూషణం పాత్ర వుంటుంది. నాటకాల పిచ్చితో తన స్వేచ్ఛ తను కోరుకుని ఇంట్లోంచి పారిపోతాడు. తల్లిదండ్రులు, చెల్లెలూ నానా కష్టాలు పడతారు. నగరంలో మహానటుడుగా ఎదిగి ఫుల్ రేంజిలో ఎంజాయ్ చేస్తూంటాడు. ఇటు వూళ్ళో కుటుంబం పేదరికంతో నానాటికీ దిగజారుతూవుంటుంది. ఆఖరికి తల్లి మరణించిన విషయం కూడా అతడికి తెలీదు. అంటే తప్పు చివర్లో ఒక విషమ పరిస్థితిలో తెలుసుకుని మారడం. ఇది పెట్రి డిష్ ఎదుగుదల. 


          ఎదుగుదల అనే ఒకే ట్రాకులో వున్న పాత్రలు ఏ మాత్రమైనా స్వేచ్ఛ కోరుకోవా - అంటే, విసిగినప్పుడు కోరుకోవచ్చు. అపాత్ర దానాలతో  ఈ ఎదుగుదల, మెచ్యూరిటీ అవసరంలేదనుకున్నప్పుడు ప్లేటు ఫిరాయించ వచ్చు. ‘అంతులేని కథ’ (1976) లో జయప్రద పాత్ర ఇలాటిదే. పాజిటివ్ పాత్ర నెగెటివ్ గా మారడం. 


బ్లూ లాగూన్ భాష్యం

         ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచంలో టీనేజి పాత్రలు ఎదగడానికి స్ట్రగుల్ చేయవచ్చు, స్వేచ్ఛకి పోయి దెబ్బ తిననూ వచ్చు. ‘సిక్స్ టీన్’ (2013) అనే హిందీ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీలో, ఇద్దరమ్మాయిల్లో ఒకమ్మాయి నైతిక విలువలవైపు వుంటే, ఇంకో అమ్మాయి స్వేచ్ఛగా, విశృంఖలంగా  తిరిగే ధైర్యాన్ని కల్పించుకుంటుంది. ఒకబ్బాయి వీడియోలతో అమ్మాయిల్ని బెదిరిస్తూ చెడ్డగా వుంటే, ఇంకో అబ్బాయి పోర్న్ చూస్తూ తండ్రికి దొరికిపోయి, ఆ ఘర్షణలో ప్రమాదవశాత్తూ తండ్రిని చంపేసి, పోలీసులు పట్టుకోబోతే పారిపోయి, టీనేజి క్రిమినల్ గ్యాంగ్ లో చేరిపోతాడు. చివరికి తప్పు తెలుసుకుని ఈ మూడు నెగెటివ్ పాత్రలూ మారతాయి. వందలకొద్దీ టీవీ ఛానెల్స్, పత్రికల్లో పేజ్ త్రీ లో సెలెబ్రిటీల పోకడలూ, ఇంటర్నెట్ మొదలైనవి టీనేజర్లని ఎలా వయోలెంట్ గా ప్రభావితం చేస్తున్నాయో ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ చూపిస్తుంది. 

          ఈ నాణేనికి ఇంకో వైపు చూస్తే, ‘ది బ్లూ లాగూన్’ కన్పిస్తుంది. 1908 లో రాసిన నవల ఆధారంగా హాలీవుడ్ తీసిన ‘ది బ్లూ లాగూన్’ (1980) లో, ఓడ ధ్వంసమై ఒక చిన్నమ్మాయి, చిన్నబ్బాయి దీవిలో చిక్కుకుంటారు. ఆ దీవిలో పెద్దవాళ్ళే కాదు, మానవ మాత్రులూ లేక ఏం చేయాలో తెలీక స్ట్రగుల్ చేస్తూ చనువుగా, అల్లరిగా జీవించడం నేర్చుకుంటారు. కొన్నేళ్ళు పోయాక శరీరాల్లో వస్తున్న మార్పులు చూసుకుని దూరం దూరంగా వెళ్లిపోతూంటారు. ఇంకో శరీరంగా తమ బాల్యం మారడాన్ని అర్ధం జేసుకోలేకపోతారు. సిగ్గు పడాల్సిన విషయంగా తలదించుకుంటారు. సారాంశ మేమిటంటే, వయసురాగానే మన సినిమాల్లో లాగా హైస్కూలు పిల్లలు ఎగిరి లాంగ్ జంప్ చేసి లవ్ లో పడరు. కొత్తగా మారుతున్న ఈ శరీరాలేమిటో, స్వప్న స్ఖలనాలేమిటో, ఋతు క్రమాలేమిటో, మొటిమెలేమిటో, ఇంకేమిటేమిటో మేనేజి చేసుకోవడానికే బిడియంతో తప్పించుకుని తప్పించుకుని నానా తిప్పలూ పడతారు. శరీరం అర్ధం గాకుండా ఆకర్షణలు మొదలుకావు. ఇవన్నీ మనమూ అనుభవించలేదా? జబర్దస్త్ గా అనుభవించాం. అయినా సినిమాలకి టీనేజీ నిజాలు దాచి తియ్య తియ్యటి ప్రేమ పూతలతో  అడ్డంగా మోసం చేస్తేనే తృప్తి. దీనికి విరుద్ధంగా సహజ కథా కథనాలు - ఎదుగుదల- కమింగ్ ఆఫ్ ఏజ్ -  ‘ది బ్లూ లాగూన్’ లో వుంటాయి. 


          ఇక్కడేమైందంటే, వీళ్ళు సిగ్గుతో చిన్నప్పటి స్వేచ్ఛని  కోల్పోయారు. యౌవనం ఒక బందీకానాలా మారింది. వికసించిన అంగాలతో ఏం చేసుకోవాలో కూడా తెలీని అయోమయంలో పడ్డారు. ఇలా ప్రకృతి తప్ప ఇంకో మనిషీ, ఆధునిక సంపత్తీ లేని దీవిలో వాళ్ళిద్దరూ శారీరక, మానసిక సంచలనాలని తమకి తామే ఎలా అవగాహన చేసుకుని జయించారనేదే ఈ కథ. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కి ఇది శాస్త్రీయ భాష్యం. 


          ఎదుగుదల నిరంతర ప్రక్రియ, స్వేచ్ఛ పరిమిత వ్యాపకం. ఈ వ్యాసం రాయకుండా స్వేచ్ఛగా బలాదూరు తిరగ వచ్చు, ఎన్నాళ్ళు తిరుగుతాం? తిరగడం ఆపి రాయాల్సిందే. ఏమైనా కాస్త  ఎదుగుతామేమో రాసి తెలుసుకోవాల్సిందే. స్వేచ్ఛ సెల్ఫీ తీసుకుంటూ సింగిల్ టీ లాగించడం, ఎదుగుదల అంతా బాగానే వుందని పిండి రుబ్బడం. 


మైండ్ సెట్ స్టడీ

         రాజ్ కపూర్ తీసిన మేరానాం జోకర్ (1970) లో, రాజ్ కపూర్ 14 ఏళ్ల టీనేజీ పాత్రగా రిషీ కపూర్ నటించాడు. ఇతను టీచర్ (సిమీ గరేవాల్) పట్ల ఎట్రాక్ట్ అవుతాడు. ఆమె నుంచి స్త్రీల ఆంతరంగిక లోకం గురించి, కోర్కెల గురించీ తెలుసుకుంటాడు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే ఏమిటో అర్ధంగాని బాధకి లోనవుతాడు. ఈ అనుభవమే వ్యక్తిగా (రాజ్ కపూర్) ఎదిగాక జీవితాన్ని మార్చేస్తుంది. తను బాధల్ని దాచుకుని, లోకానికి నవ్వుల్ని పంచడానికే ఈ లోకంలోకి వచ్చాడని. ఏదైతే ఆమెతో స్వేచ్ఛగా ఎంజాయ్ చేశాననుకున్నాడో అది తాత్కాలికమే. స్వేచ్ఛ బాధకి కూడా లోనుచేయవచ్చు. కానీ స్వేచ్ఛ కి లేని గమ్యం -దిశా దిక్కూ-  ఎదగడంలో వున్నాయి. 

           వార్నర్ బ్రదర్స్ తీసిన ‘ది వాండరర్స్’ (1979)  కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. కాకపోతే టీనేజీ యాక్షన్ జానర్లో కల్ట్ మూవీగా నిలబడింది. ఇది టీనేజర్స్ గ్యాంగ్ కథ. ఇదే పేరుతో  వచ్చిన నవల దీని కాధారం. సినిమా కంటే ఈ నవలని బాగా ఎంజాయ్ చేయవచ్చు. టీనేజర్ల పాత్రచిత్రణలు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే పనులు మతిపోయేలా వుంటాయి. ఇదికూడా స్వేచ్ఛ వర్సెస్ ఎదుగుదల గురించే. రిచర్డ్ ప్రైస్ రాసిన ఈ నవల మీద చాలా స్టడీస్ జరిగాయి. వయోలెంట్ ప్రపంచంలో టీనేజర్ల మైండ్ సెట్ ఎలా వుంటుందో స్టడీ చేసుకోవడానికి ఈ నవల పనికొస్తుంది. ఇంకా వీలైనన్ని హాలీవుడ్ లేదా కొరియన్ కమింగ్ ఆఫ్ మూవీస్ కొత్తవీ పాతవీ చూస్తూంటే వాటి మేకింగ్ తెలుస్తుంది. కొరియన్ ఎందుకంటే హాలీవుడ్ లాగే కొరియన్ మూవీస్ స్ట్రక్చర్ లో వుండి కమర్షియల్ గా వుంటాయి. వరల్డ్ మూవీస్ జోలికి పోవద్దు.  

next : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్ట్రక్చర్ విభాగాల సంగతులు
సికిందర్


23, సెప్టెంబర్ 2019, సోమవారం

875 : స్క్రీన్ ప్లే అప్డేట్స్

‘లేడీ బర్డ్’ లో దృశ్యం 

      మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్...హాలీవుడ్ లో విజయవంతమైన టీనేజీ జానర్. కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే వయస్సుకు రావడం. పదహారేళ్ళకూ నీలో నాలో ఆ వయసు చేసే చిలిపి పనులకు కోటి దండాలు - అని పాడుకోవడం. కౌమారపు గొంగళి పురుగు కాస్తా రంగులేసుకుని యవ్వనపు సీతాకోక చిలుకలా ఎగిరే నూనూగు మీసాల, ఎదిగి వచ్చిన ఎదల, వయసొచ్చిన లేలేత టీనేజీ దశ. హై స్కూలైపోయి కాలేజీలో అడుగుపెట్టే బాధ్యతల వల. తల్లి పక్షి రెక్క లొచ్చిన పిల్లలకి ఇక తిండి పెట్టేది లేదని గూట్లోంచి తోసి పారేస్తుంది. ఇక కీచు కీచుమంటూ నట్టనడి లోకంలో పడి, రెప రెప రెక్కలు కొట్టుకుని ఎగరడం నేర్చుకుంటూ, తిండి వెతుక్కునే పనిలో జీవనపోరాటం మొదలెడతాయి పక్షి పిల్లలు. లేత టీనేజర్లదీ ఇదే పరిస్థితి. కుటుంబ సౌఖ్యంలోంచి సంక్లిష్ట ప్రపంచ ప్రాంగణంలోకి...బాధ్యతల బరిలోకి. వ్యక్తిగా పరిణతి చెందే అనుభవాల్లోకి. బాల్యపు దృక్కోణం చెదిరి ప్రాపంచిక దృక్పథంలోకి. పదేళ్ళ బాల్యం నుంచీ పంతొమ్మిదేళ్ళ టీనేజీ  వరకూ కథలు చెప్పే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ని హాలీవుడ్  కమర్షియలైజ్ చేసింది.

          తెలుగులో హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో దాసరి నారాయణ రావు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ‘నీడ’ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ. అప్పుడప్పుడే యవ్వనపు గడప తొక్కిన కుర్రాడు, రతి క్రీడ పట్ల కుతూహలంతో వేశ్యల పాలబడి దారితప్పే కథ. ఈ వయస్సంటేనే వివిధ విషయాల పట్ల కుతూహలం. తెలుసుకోవాలన్న కుతూహలం ఎదుగుదలకి సంకేతం. టీనేజీ సహజాతమైన ఈ జిజ్ఞాసని, కుతూహలాన్నీ చంపేస్తూ ప్రేమించడం, ప్రేమలో పడ్డంగా చూపడం ఎదుగుదలని ఆపేసే అపరిపక్వత. చిత్రం, టెన్త్ క్లాస్ లాంటివి అప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్నికనే ఇలాటి సహజాత వ్యతిరేక సినిమాలుగా వుంటాయి. ఇవి కమర్షియల్ కోణాన్ని మాత్రమే చూస్తాయి. హాలీవుడ్ నుంచి కూడా ఇలాటి సినిమాలొచ్చినా, ఎక్కువ సినిమాలు ఎదుగుదల గురించే వుంటాయి. మనం ఇప్పుడున్న తీరులో వున్నామంటే ఎలా పరిణామం చెంది ఇలా తయారయ్యామో చెప్తాయి ఈ రకం సినిమాలు. మానసిక పునాదిని  వయస్సొచ్చాక అయిన అనుభవాలే వేస్తాయి. ‘బోర్న్ టు విన్’ అనే గ్రంథంలో సైకాలజిస్టులు ఒక మాట అంటారు : కడుపులో వున్నప్పుడు బిడ్డ తలరాత దేవుడు రాస్తాడో లేదో గానీ, పుట్టాక తల్లిదండ్రులు మనసు మీద రాస్తారని. వయస్సొచ్చాక ఈ మనసు మీద రాతతోనే సంఘర్షణ వుంటుంది స్వేచ్ఛకోసం. తమ రాత, తమ చేత తామే నిర్ణయించుకోవాలనుకుంటారు రెబెల్ మనస్తత్వంతో.

          కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది :  అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు.

          ఈ సినిమాలకి ఇతర సినిమాల కథలకి లాగే కాన్ఫ్లిక్టే (సంఘర్షణే ) ఆధారం. ఉన్నట్టుండి యువపాత్రకి ఎదురు చూడని అనుభవం ఎదురవుతుంది. దాంతో సంఘర్షించి రేపటి వ్యక్తిగా ఎదగడమే ఈ కథల స్వభావం.

అదే రూటులో తెలుగు 
           కానీ తెలుగులో దీనికి భిన్నంగా, హైస్కూలు - ఇంటర్ పిల్లల ప్రేమలే వర్కౌటవుతాయని అవే కాలక్షేపంగా తీయడం. తాజాగా మలయాళంలో హిట్టయిన ఇలాటి దొకటి ‘తన్నీర్ మథన్ దినంగళ్’ (పుచ్చకాయల రోజులు) తెలుగు రీమేక్ హక్కులు కొనే పోటీ కూడా మొదలైందని తెలుస్తోంది. ఒక దర్శకుడు దీని మీద ఆసక్తి పెంచుకుని రీమేక్ చేస్తే ఎలా వుంటుందని అడిగారు. తెలుగులో రెగ్యులర్ గా వస్తున్న రోమాంటిక్ కామెడీలకి  గత కొన్ని నెలలుగా ప్రేక్షకుల్లేక, నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్సే వరసగా చూస్తున్న మార్పు కన్పిస్తోంది. ఇప్పుడీ రీమేక్ తలపెడితే రిజల్ట్ ఏమిటో చెప్పడం కష్టం. పైగా అది మలయాళ కొత్త దర్శకుడు తన పర్సనల్ డైరీలాగా ఫీలై తీశాడు. ఎవరివో పర్సనల్ డైరీలూ, ముచ్చటైన ఫోటో ఫ్రేమ్ కథలూ, పోయెట్రీలూ  రీమేక్ చేసేకంటే, అలాటివి స్వయంగా ఫీలై క్రియేట్ చేసుకోలేరా అన్నది ప్రశ్న.

          హాలీవుడ్ లో ప్రేమలొక్కటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కావు. వాళ స్పాన్ వైవిధ్యంతో విశాలమైనది. ఇంకోటేమిటంటే, ఈ తరహా కథలకి వరల్డ్ మూవీస్ కి ఏ స్ట్రక్చర్ వుండదో, హాలీవుడ్ కథలకి ఆ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటూ, కమర్షియల్ ప్రదర్శనలకి విశాల ప్రాతిపదికన నోచుకుంటాయి. తెలుగు మేకర్లు ఈ తేడా గమనిస్తే, నాన్ కమర్షియల్ వరల్డ్ మూవీస్ కి ఇన్స్పైర్ అయ్యే పొరపాటు చేయకుండా జాగ్రత్తపడొచ్చు.

          సంధికాలంలో ఎదుగుదల కోసం టీనేజర్ల సంఘర్షణాత్మక హాలీవుడ్ మూవీస్ కి కొన్ని ఉదాహరణలు :  ‘రెబెల్ వితౌట్ కాజ్’ లో బాధాకర గతమున్న టీనేజర్ కొత్త టౌనుకి వచ్చి, కొత్త స్నేహితులతో బాటు, కొత్త శత్రువుల్ని సృష్టించుకుంటాడు. ‘స్టాండ్ బై మీ’ లో ఒక రచయిత అదృశ్యమైన ఒక బాలుడి మృతదేహాన్ని కనుగొనే ప్రయాణంలో, తన టీనేజీలో చనిపోయిన తన మిత్రుడి జీవితం గురించి చెప్పుకొస్తాడు. ‘లేడీ బర్డ్’ ర్ లేత టీనేజర్, తను కోరుకుంటున్న భవిష్యత్తుని హై స్కూలు ఇవ్వడం లేదని, తనలోని కళాభినివేశం కోసం సంఘర్షిస్తుంది. ‘ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్’ లో పోలీసులు రోజూ ఉదయం ఒక టీనేజర్ ని తెచ్చి లాకప్ లో పడేస్తూంటారు. వీళ్ళేం చేశారనేది వీళ్ళు చెప్పుకునే కథలు. ‘మస్టాంగ్’ లో ఐదుగురు అనాథలైన టీనేజీ అక్క చెల్లెళ్ళు యువకులతో తిరుగుతున్నారని బంధిస్తారు. అమ్మాయిల స్వేచ్ఛమీద మోరల్ పోలీసింగ్ ఈ కథ. ‘రివర్స్ ఎడ్జ్’ లో లేత టీనేజర్ తను చేసిన ఘోర నేరాన్ని క్లాస్ మేట్స్ కి గొప్పగా చెప్పుకుంటే, క్లాస్ మేట్స్ ఇంకా మతిపోయేలా కామెడీ చేస్తారు.  ‘హేవెన్లీ క్రీచర్స్’ లో ఇద్దరు టీనేజీ అమ్మాయిలు సన్నిహితంగా గడపడాన్ని సహించలేక తల్లిదండ్రులు విడదీస్తే, ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల మీద పగ దీర్చుకుంటారు...


ఇదో పెద్ద పరిశ్రమ

          టీనేజిలో తమ మనసేమిటో తమకే తెలీక గందోరగోళంగా వుంటుంది. ఈ గందరగోళాన్ని తీరుస్తాయి ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు. హాలీవుడ్ లో కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు దానికదే ఒక పెద్ద పరిశ్రమ. ఏడాదికి ఇరవై ముప్ఫై తీస్తూంటారు. 2018 లో 35  తీశారు. ఈ సంవత్సరం ఇప్పటికే 22 తీశారు. వీటిలో అన్ని జానర్లూ వుంటున్నాయి. ఎదుగుదల గురించే కాక, లవ్, కామెడీలే కాకుండా, యాక్షన్, అడ్వెంచర్, హార్రర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, అన్ని జానర్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు హేరీ పోటర్ సినిమాలన్నీ ఈ జానర్వే.

         తెలుగులో ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ (16 -19 ఏజి గ్రూపు) సినిమాల సెగ్మెంట్ ఖాళీగా పడివుంటోంది. దీన్ని క్యాష్ చేసుకుంటూ ఇంతవరకు లేని కొత్త ట్రెండ్ ని సృష్టించే ఆలోచన చేయడం లేదు. ఎంత సేపూ ఇరవై పైబడిన హీరోహీరోయిన్లతో అవే ముదురు రోమాంటిక్ కామెడీలు. థ్రిల్లర్ తీసినా గడ్డాలు పెంచుకున్న హీరోల హీరోయిజాలే. హాలీవుడ్ లో ‘బ్లడ్ సింపుల్’ తీసిన కోయెన్ బ్రదర్స్ ఇంకో ప్రయోగం చేశారు. నియో నోయర్ జానర్లో ‘బ్రిక్’ అనే నూనూగు మీసాల టీనేజీ జ్యూనియర్ కాలేజీ మర్డర్ మిస్టరీ తీసి సంచలనం సృష్టించారు. ‘బ్లడ్ సింపుల్’ లాగే ఇది కూడా యూనివర్సిటీల్లో కోర్సుగా నమోదైంది. నియో నోయర్ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ!

          మనమేకర్లు ఆ వరల్డ్ మూవీస్ అనే ఆర్ట్ మూవీస్ అడ్డాలోంచి, కాఫీ షాపు చర్చల్లోంచి బయట పడితే తప్ప ఇవన్నీ అర్ధం గావు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ పదం కూడా తెలియని వాళ్ళు మేకర్లుగా వున్నారు. యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తప్ప ఇంకోరకం సినిమా తెలీదు. వూరూరా ఆధునికంగా వెలిసే మల్టీప్లెక్సులు గొప్ప, వాటిలో వేసే సినిమాలు దిబ్బ.

          ప్రేమల్ని కామెడీల్ని కాసేపు పక్కనబెడదాం. ఎదుగుదల గురించిన కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో ‘హోం ఎలోన్’ వుంది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ వుంది. మొన్న వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘అలీటా’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే అంటున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ లో ఫ్లాష్ బ్యాక్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ ప్రమాణాలతో వుంటుంది. హిందీలో వచ్చిన ‘కయీ పోచే’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. ఇండియన్ కథతో డానీ బాయల్ తీసిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఇంకొకటి.

చుట్టూ వయోలెంట్ లోకం
               ఈ నేపథ్యంలో ఎదుగుదల లేని, యాక్షన్, అడ్వెంచర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ అనే ఏ వెరైటీలేని, మరో ఉత్త హైస్కూలు ప్రేమల మలయాళ  ‘తన్నీర్ మథన్ దినంగళ్’ ని రీమేక్ చేయడం ఎంత వరకు అవసరమో వాళ్ళకే వదిలేద్దాం. కానీ తాము ఎలాటి ప్రపంచంలో వున్నారో టీనేజర్లకి తెలుసు. తియ్యటి అమాయక ప్రేమ సినిమాలు వాళ్ళనింకా మభ్య పెట్టలేవు. ప్రపంచం అతి సంక్లిష్టంగా, కన్ఫ్యూజింగ్ గా వుంది. పరమ వయోలెంట్ గా వుంది. ఇంకా చెప్పాలంటే అరచేతిలో విజువల్స్ కి దిగి వయోలెంట్ గా వుంది. వీడియో గేమ్స్ దగ్గర్నుంచీ సెల్ఫీల వరకూ. టిక్ టాక్ ల వరకూ. పబ్ జీ ల వరకూ. పోర్న్ వరకూ. టీనేజర్ల గ్యాంగ్ రేపుల వరకూ. పిల్లల కిడ్నాపుల వరకూ. తమతో ఆడుకునే పిల్లల రేపుల వరకూ. మార్కుల రేసుల వరకూ. కారు రేసుల వరకూ. బైక్ చోరీల వరకూ. చైన్ స్నాచింగుల వరకూ. బెట్టింగుల వరకూ. మాదక ద్రవ్యాల వరకూ. సోషల్ మీడియాల్లో వయోలెంట్ కామెంట్స్ వరకూ. వయోలెంట్ కానిదేదీ లేదు. ఒక విషయంపై ఎవ్వడూ వినడం లేదు. మాట్లాడ్డం లేదు. సమాచార మివ్వడం లేదు. అరుస్తున్నాడు. తిడుతున్నాడు. ఎవర్ని అడగాలి? ఎవర్ని అడిగి మార్గం నిర్దేశించుకోవాలి? ఈ ముళ్ళ చక్రం అనే ప్రపంచంలో ఇరుక్కోకుండా ఎలా వుండాలి? ఇరుక్కుంటే ఎలా బయట పడాలి?

          రమేష్ బాబు ‘నీడ’ కాలంలో ప్రపంచమిలా లేదు. అరచేతిలో ఇన్ని తలలతో విచ్చుకోలేదు. చెడు కన్పిస్తే, వూరిస్తే, కుతూహలం కల్గిస్తే, ఎక్కువలో ఎక్కువ రోడ్డు పక్క వేశ్య రూపంలోనే. ఇవ్వాళ ఇలా లేదు. ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచాన్ని మనం దాటేశాం. అదృష్టవశాత్తూ మనం గడిపిన ప్రపంచం వేరు. కానీ మన వెనక వచ్చిన టీనేజర్లకి మనం కాకపోతే ఇంకెవరు చేతనయింది చేస్తారు? 


          చుట్టూ ఈ కొత్త వయోలెంట్ ప్రపంచంతో కూడా ఏం చేయాలా అని మనసు పెట్టి ఆలోచిస్తే, టీనేజర్లని  ఇంకా పల్లీ బఠానీలతో మభ్యపెట్టకుండా వాళ్ళ వాయిస్ ని విన్పించే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో పుణ్యం కట్టుకోవచ్చు. ఖాళీగా వున్న ఈ సెగ్మెంట్ ని భర్తీ చేయవచ్చు. కళా సేవ కాదు, కాసు లొచ్చేదే. హాలీవుడ్ జానర్లు క్యాష్ కౌంటర్లే, డోంట్ వర్రీ! ఈ వ్యాసం మేసేజీలా వుందేమో, ఇదొక వ్యాసమంతే!



next : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రాయడమెలా?
సికిందర్



22, సెప్టెంబర్ 2019, ఆదివారం

874 : మూవీ నోట్స్


      పెద్ద సినిమాల సంక్షోభం ఇంకా తీరడం లేదు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆది సాయికుమార్ లాంటి గుర్తింపు వున్న హీరోల నుంచీ, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్స్ సినిమాలు 31 విడుదలైతే 11 మాత్రమే గట్టెక్కాయి. పెద్ద సినిమాల ప్రమాణాలు చిన్నా చితకా సినిమాలకేం తీసి పోవడం లేదు. ఈ తొమ్మిది నెలల్లో 31 లో 20 పెద్ద సినిమాలు ఫ్లాపయ్యాయంటే పరిస్థితిని అర్ధం జేసుకోవచ్చు. సినిమా చిన్నదైనా పెద్దదైనా కథతోనే తీస్తారు. టేబుల్ తోనో, కుర్చీతోనో తీయరు. స్టార్స్ తో కూడా తియ్యరు. కథతోనే తీస్తారు. సినిమా ఫ్లాపయిందంటే మాత్రం టేబుల్నో కుర్చీనో కారణంగా చూపిస్తారు. కథ చీకేసిందని ఒప్పుకోరు. కథ నిప్పులాంటి స్వచ్ఛమైనది. పప్పు లాంటి ప్రేక్షకులే ఫ్లాప్ చేస్తున్నారు. ఒక్కోసారి ప్రేక్షకులు కూడా తెలిసో తెలీకో పప్పు లాంటి సినిమాల్ని కూడా నిప్పులాంటి హిట్ చేసేస్తారు. ఇలాటివి హిట్టయిన 11 పెద్ద సినిమాల్లో వున్నాయి. అప్పుడా తప్పుల తడక కథే కథా రాజ్యాంగ మైపోతుంది. చూశారా, కథకి రూల్స్ గీల్స్ లేవని కింద పడేస్తారు. ఇలా పప్పులాంటి సినిమాలు కథా రాజ్యాంగాన్ని నిర్ణయిస్తూంటాయి. కాబట్టి ఇక హిట్టయిన పప్పులాంటి సినిమాల్ని స్క్రీన్ ప్లేలకి  కథా రాజ్యాంగంలా వాడుకుని బోధించాలేమో ఆలోచించాలి.

         
మిళ డబ్బింగ్ సినిమాలకి ప్రేక్షకులు నో ఎంట్రీ పెట్టేస్తున్నారు. మనకే చాలా మంది స్టార్స్ వున్నారు, ఇంకా వీళ్ళ నెక్కడ మోస్తామన్నట్టు చెక్ పోస్ట్ పెట్టేశారు. వచ్చిన సినిమాని వచ్చినట్టు వెనక్కి పంపించేస్తున్నారు. సూర్య, విక్రమ్, విజయ్, ఆర్య, ప్రభుదేవా, లారెన్స్ రాఘవ, కన్నడ నుంచి కిచ్చా సుదీప్ ఎవరైనా కానీ, ఇదివరకటి ఓపెనింగ్సే ఇవ్వకుండా అవమానిస్తున్నారు. ఇక తమిళ డబ్బింగులు మానుకుంటే మంచిది. తమిళంలో కొత్త స్టార్ల కొరత వుంది. తెలుగులో విజయ్ దేవరకొండ, నాని, వరుణ్ తేజ్, శర్వానంద్ లాంటి కొత్త తరం బ్రాండ్ న్యూ స్టార్లు తమిళ డబ్బింగుల్లో కనిపించడం లేదు. విశాల్, కార్తీ, విజయ్ ఆంటోనీ లాంటి ఓ ముగ్గురు ఏం సరిపోతారు. మనకున్నంత మంది వారసులుకూడా అక్కడ లేరు, అదీ సమస్య.
 
         
స్క్రీన్ ప్లే సంగతులు ఒకే మూసలో రాయడం లేదు. నేటి అవసరాన్నిబట్టే అవి వుంటున్నాయి. ఇది వరకు చేసినట్టుగా మొత్తం అంకాల విశ్లేషణ అంతా చేయకుండా, సినిమా హిట్టవడానికో, ఫ్లాపవడానికో కారణమైన ఒకటి రెండు అంశాలపైనే విశ్లేషణ లుంటున్నాయి. ఈ తేడా గమనిస్తే వీటిని ఆపెయ్యాలని ఎవరూ కోరుకోరు. ఏ సినిమా ఏమిటో ఒక రికార్డు మెయింటెయిన్ చేయడం కోసమైనా స్క్రీన్ ప్లే సంగతుల అవసరముంది. చదివి తీరాలని నిర్బంధమేమీ లేదు.

         
డైలాగ్ వెర్షన్ అంటే డైలాగులు రాసుకోవడంలా వుంది కొందరి వరస చూస్తూంటే. పైగా అన్ని జానర్లకీ కలిపి ఒకే మూస డైలాగులు రాసెయ్యడం. మూస సినిమాలకి సాంకేతికంగా డైలాగ్ వెర్షన్ రాసుకోనవసరం లేదు. డైలాగులు రాసేసి, అడ్డ గీతలు గీసేసి షాట్ డివిజన్ అనుకుంటే సరి. ఇతర సినిమాలకి షాట్ డివిజన్లు కాదు, అది షూట్ చేసేప్పటి విషయం. లెఫ్ట్ సాంకేతికంగా వుండాలి. మైక్రో లెవెల్లో రాయాలి. సీను పేపర్ మీద అనుభవం కావాలి. ఆ అనుభవమయ్యే దాకా పాలిష్ చేస్తూనే వుండాలి. మూస సినిమాలకి వారం రోజుల్లో  ముతక డైలాగ్స్ రెడీ, స్క్రిప్ట్ వూడకుండా లాక్ చేశామని చంకలో పెట్టుకుంటే సరిపోతుంది పవిత్ర గ్రంథంలా. ఇతర సినిమాలకి ఐదు వారాలు పడుతుంది. రెండు వారాలు రఫ్ రాయడానికి, ఓ వారం రాసింది మర్చిపోయి తిరగడానికి. ఇంకో రెండు వారాలు రాసింది ఫ్రెష్ మైండ్ తో తీసి, కొత్త ఐడియాలతో, కొత్త సమాచారంతో, అదే పనిగా పాలిష్ పట్టడానికి. కడుపుకి పాలిష్ బియ్యం తింటున్నవిశ్వాసానికి. ఇంత టైం నిర్మాతలు ఇవ్వడం లేదంటే, అప్పుడు మూసకెళ్ళి మరో మూస తీయాలి.

         
రోమాంటిక్ కామెడీలకి అలవాటు పడిన ప్రాణాలు మార్కెట్ పిలుపునిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ల ఆరాటం పెంచుకుంటున్నాయి. కానీ అవి రాయలేకపోతున్నాయి, తీసే సంగతి తర్వాత.  గత ఇరవై ఏళ్ళూ ఊక దంపుడుగా రోమాంటిక్ కామెడీలతో కాలక్షేపం చేశాక, ఇప్పుడు మార్కెట్ తిరగబడే సరికి, సృజనాత్మక లేమి అంటే ఏమిటో కొత్తగా తెలిసివస్తోంది. కలిమి రోమాంటిక్ కామెడీ లతోనూ లేదు, ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్లతోనూ లేమితో పరంపరాగత పారవశ్యమే.

సికిందర్



19, సెప్టెంబర్ 2019, గురువారం

873 : స్క్రీన్ ప్లే సంగతులు


           
      118’ నుంచీ ‘గ్యాంగ్ లీడర్’ వరకూ ఈ తొమ్మిది నెలల కాలంలో ఆశాజనకంగా 10 సస్పెన్స్ థ్రిల్లర్లు విడుదలయ్యాయి. 118, గేమ్ ఓవర్, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, నిను వీడని నీడను నేనే, రాక్షసుడు, కథనం, ఎవరు, ఏదైనా జరగొచ్చు, గ్యాంగ్ లీడర్. వీటిలో 118, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, రాక్షసుడు, ఎవరు - తప్ప మిగిలినవి ఫ్లాపయ్యాయి. పదిలో 5 ఫ్లాప్స్. ఒక జానర్లో తీసినవన్నీ హిట్టవ్వాలని లేదు. ప్రేమ జానర్లు, దెయ్యం జ్వరాలూ మార్కెట్ కోల్పోయి సస్పెన్స్ థ్రిల్లర్లు మార్కెట్ ని భర్తీ చేయడం మంచిదే, ప్రేక్షకులు కూడా సంతోషంగా వున్నారు లేకి ప్రేమలు, పిచ్చి దెయ్యాలు వదిలాయని. సస్పెన్స్ థ్రిల్లర్లు చిన్న సినిమాలు. వీటిని స్టార్లు నటిస్తున్నప్పుడు రిస్కే అవుతుంది. వీటి కథల్లో స్టార్ మెటీరియల్ వుండదు. ఈ తొమ్మిది నెలల్లో విడుదలయిన పది సస్పెన్స్ థ్రిల్లర్స్ లో తొమ్మిదీ చిన్న, మధ్య తరగతి హీరోలవే. గ్యాంగ్ లీడర్ ఒక్కటే  స్టార్ తో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో పాత్రకీ, కథకీ స్టార్ మెటీరియల్ లేకపోవడంతో ఫ్లాపయ్యింది. ఒక రేంజికి ఎదిగిన నేచురల్ స్టార్ నాని లాంటి మాస్ – కమర్షియల్ సినిమాలతో స్ట్రాంగ్ ఇమేజి వున్న స్టార్లు, హిట్టయిన 118, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, రాక్షసుడు, ఎవరు –లలో ఏది నటించినా స్టార్ మెటీరియల్ దోషంతో ఫ్లాపవుతుంది. యాక్షన్ కామెడీలు, యాక్షన్ థ్రిల్లర్లు వాళ్ళ జోన్. జర్నలిస్టు పాత్ర వాళ్ళ రేంజి, రచయిత పాత్ర కాకుండా. 

        గ్యాంగ్ లీడర్ కథకి  బలహీనంగా వున్న క్రియేటివ్ యాస్పెక్ట్ ని దిద్దుకుంటే మార్కెట్ యాస్పెక్ట్ బావుండేదే. ఆ క్రియేటివ్ యాస్పెక్ట్ లో స్టార్ ని వూహిస్తే మాత్రం మార్కెట్ యాస్పెక్ట్ వుండే అవకాశం లేదు. ఈ కథ కాన్సెప్టు, లేదా ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ తో కళకళ లాడేదే స్టార్ ని వూహించకుంటే. శ్రీ విష్ణు, లేదా ‘ఆత్రేయ’ బ్రాండ్ నవీన్ పొలిశెట్టి లాంటి చిన్న రేంజర్లు వుంటే ఈ కాన్సెప్ట్ కి న్యాయం జరిగే మాట. ఇందులో తారాగణంలో ఒకటి గమనిస్తే, నానికి సూటయ్యే స్టార్ హీరోయిన్ ఇందులో లేదు. ఎందుకు లేదు? వుంటే లీడ్ క్యారక్టర్ లక్ష్మి ఫేడవుట్ అవుతుంది కాబట్టి. పైగా ఇందులో హీరోయిన్ కి పనికూడా లేదు కాబట్టి. కనుక ఈ కథ నాని అవసరాన్ని కూడా డిమాండ్ చేయని రేంజిలో నే వుందని అర్ధం జేసుకోవాలి. పెద్ద సినిమాలు తీసే దర్శకుడు విక్రం కుమార్ తన ప్రతీ కథా పెద్ద సినిమాకి తగును అనుకోవడం తగని పనైంది. పెద్ద సినిమాలు తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కిది వరసగా క్రియేటివ్- మార్కెట్ యాస్పెక్ట్ లు పని చేయని ఐదో పరాజయమైంది.

స్ట్రాంగ్ గా వున్నది ట్రైలరే 
  ట్రైలర్ స్ట్రాంగ్ టీలావుంది. స్టార్ మెటీరియల్ అన్పిస్తూ కారు ఛేజింగులువిలన్స్ తో ఫైట్స్గన్ ఫైర్స్బ్లాస్టింగ్స్ వగైరాలతో వైరల్ అయింది.ఐదుగురు ఆడవాళ్ళతో నానీస్ గ్యాంగ్ ఓషన్స్ ఎలెవన్’ లెవెల్లో ఫోజిస్తూ నడుస్తూంటేయుద్ధానికి సిద్ధం కండిసమర శంఖం నేనూత్తాను అనినానిడైలాగేస్తేనేనింకా థ్రిల్లర్‌ జానర్లోనే వున్నానుసైకో థ్రిల్లర్ జానర్లోకి మారక ముందే మొదలెట్టేద్దాం’ అని విలన్ కార్తికేయని కార్నర్ చేస్తూంటే, ఒక ఫుల్ రేంజి సస్పెన్స్ / యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ అన్నట్టు ఆశలు కల్పించింది. తీరా సినిమాలో ఇవన్నీ ఓ రెండు మూడు సీన్లలో వున్న షాట్స్ ని ఏర్చికూర్చినవే తప్ప మరేమీ కాదని తేలింది. ఈ ట్రైలర్ లో కనబర్చిన కంటెంట్ ని సినిమాలో కూడా కనబర్చి వుంటే ఏంతో బావుండేది.


          ముఖ్యంగా ఈ కథకి జానర్ మర్యాద లోపించింది. రెండోది స్ట్రక్చర్ సమస్య. స్ట్రక్చర్ ఏం డిమాండ్ చేస్తుందో ఆ ప్రకారం కథనం లేదు. ప్రారంభంలో రాత్రి పూట ముసుగేసుకున్న ఆకారాలు హైటెక్కుగా బ్యాంకుని దోచుకునే దృశ్యాల దగ్గరే ఈ కథ చప్ప బడిపోయింది. ఎడ్గార్ వాలెస్ నవలల్లో ముసుగు ఆకారాలు బ్యాంకుని దోచుకున్నాయని రాయవచ్చు. నవల చదవడం మనసులో ఊహించుకోవడం కాబట్టి ఇబ్బంది వుండదు. సినిమా చూడ్డం కళ్ళతో చూడ్డమైనప్పుడు ఆ కళ్ళు టీవీ ఛానెల్ కవరేజిని డిమాండ్ చేస్తాయి. ముసుగేసుకోకుండా ఓపెన్ ఫేసులతో క్యారక్టర్లుంటే, రక్తితో, కిక్కుతో, ప్రేక్షకులకి బాగా రిజిస్టరై కథలో లీనం చేస్తాయి. ఏ సినిమాలో నైనా ఓపెనింగ్ బ్యాంగులు ఓపెన్ గానే వుంటాయి. ఎవరేం చేశారో చూపించేస్తారు. అప్పుడే ఆ బ్యాంగ్ కథకి హుక్ లా అర్ధవంతంగా పనిచేస్తుంది.

           ఈ సినిమాలో చీకట్లో ఎవరేమిటో తెలీని ముసుగు ఆకారాల దోపిడీ ఆపరేషన్ ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ కి దూరంగా, ఇంటరాక్టివ్ వ్యూయింగ్ కి వీల్లేకుండా, ఉత్త పాసివ్ వ్యూయింగ్ తో చప్పగా వుంది. ఎక్కడో నవలలో చదివింది చదివినట్టు దృశ్యాలంకరణ చేసినట్టుంది. లేదా ఇంకే సినిమాలోనో పరిచయమైన క్యారెక్టర్లు ప్లాట్ పాయింట్ వన్ దగ్గరో, మిడ్ పాయింట్ లోనో ముసుగులేసుకుని పాల్పడ్డ దోపిడీ దృశ్యాల్ని ఇక్కడ ఓపెనింగ్ కి వాడుకున్నట్టుంది. తెలిసిన క్యారక్టర్లు కథ మధ్యలో ముసుగులేసుకుని దోపిడీ చేస్తే ఇంటరాక్టివ్ వ్యూయింగ్  కి దెబ్బ రాదు, ఎందుకంటే వాళ్ళెవరో  మనకి తెలుసు కాబట్టి. ఇలా ఏదో సినిమాలో కథ మధ్యలో వున్న దోపిడీ దృశ్యాల్ని ఆలోచించకుండా ఓపెనింగ్ బ్యాంగ్ కి వాడుకున్నట్టుంది.  ‘నిను వీడని నీడను నేనే’ లో ‘సిక్త్ సెన్స్’ లో వున్న ముగింపు ట్విస్టుని  తెచ్చుకుని కథ నడపబోయి బోల్తా పడలేదా? 
 
          ఒకవేళ ఈ దోపిడీ ఐదుగురు లేడీస్ గల నానీస్ గ్యాంగే చేస్తున్నట్టు అన్పించాలని, అప్పుడది పవర్ఫుల్ ఓపెనింగ్ బ్యాంగులా వుంటుందని ముసుగులేసిన ఉద్దేశమేమో? దోపిడీలో ఈ ఐదుగురూ చచ్చిపోతే బలమైన సస్పెన్స్ క్రియేటవుతుందనేమో? ఆలాంట ప్పుడా ఐదుగుర్లో ఒక చిన్న పిల్ల ముసుగు ఆకారం కూడా వుండాలి.
పెన్సిలు చెక్కుట 
         నానిది పెన్సిలు పార్థసారథి అనే రివెంజి నవలలు రాసే రచయిత పాత్ర. ఈ రోజుల్లో నవలా  రచయితలూ, వాళ్ళ నవలలు చదివే పాఠకులూ ఎవరున్నారనే ప్రశ్నకి తగ్గట్టుగానే పెన్సిల్ రాసే నవలలు అమ్ముడుబోవు. పైగా ఇతను హాలీవుడ్ సినిమాలు కాపీ చేసి రాస్తాడు. లక్ష్మి ఒక ప్రతీకారేచ్ఛతో వున్న 80 ఏళ్ళావిడ. బ్యాంకు దోపిడీలో చనిపోయిన వాళ్ళ బంధువుల్ని కూడగట్టి, చంపిన వాడి మీద పగదీర్చుకోవాలని నానిని సంప్రదిస్తుంది. ఇది కాన్సెప్ట్ లేదా స్టోరీ ఐడియా ఏర్పాటయ్యే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.

          ఇక్కడ మనం ఏ నేపథ్యం తెలిసి వున్నామంటే, ఓపెనింగ్ బ్యాంగ్ చూసిన నేపథ్యం తెలిసి వున్నాం. ఆ ఓపెనింగ్ బ్యాంగ్  క్లోజ్డ్ విండోతో వుంది. అంటే ఆ దోపిడీలో పాల్గొని చనిపోయిన ముసుగేసిన ఆకారాలు ఎవరో మనకి తెలీదు. ఇప్పుడు లక్ష్మి వచ్చి వాళ్ళు తమ ఐదుగురి బంధువులంటోంది. అంటే డెకాయిటీలు తమ బంధువులంటోందన్న మాట. అప్పటికీ ఫోటోలు చూపించి మన క్యూరియాసిటీని తీర్చలేదు. మొహాలు కూడా మనకి తెలీని వాళ్ళ హత్యలకి ప్రతీకారమంటోంది. ఎలా మనం కనెక్ట్ అవుతాం. వీళ్ళని చంపి 300 కోట్లు డబ్బుతో పారిపోయిన పెద్ద డెకాయిటీని పట్టుకుని పగదీర్చుకోవాలంటోంది.

          లక్ష్మి బృందంలో నడివయసావిడ, వయసమ్మాయి, ఇంకో టీనేజీ అమ్మాయి, ఐదేళ్ళ చిన్న పిల్లా వున్నారు. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాంగ్ కొద్దిగా ఓపెనై, ఆ ముసుగు డెకాయిటీలు వీళ్ళ తాలూకు అని మనకి అర్ధమయింది. అంటే ఈ ఐదుగురు లేడీస్ మంచి ఫ్యామిలీస్ కాదనీ, డెకాయిటీ బ్యాచ్ అనీ అర్ధం వస్తోంది. ఇలా ఇప్పుడు వీళ్ళ పట్ల బ్యాడ్  ఫీలింగ్ మనకేర్పడి పోతోంది. ఇది కథకుడు ఫీల్ కాలేదా? పదుల కోట్ల బడ్జెట్ కథకి క్వాలిటీ ఇలా వుంటే సరిపోతుందా? బాక్సాఫీసు నో చెప్పే క్వాలిటీ?

          ఎందుకిలా జరిగింది? కథకుడు కాన్సెప్ట్ తో కూడా సస్పెన్స్ కి పాల్పడాలనుకోవడం వల్ల. సగం కాన్సెప్ట్ చెప్పి కథ మొదలెట్టాలనుకోవడం వల్ల. ఒక ఐడియా అనుకుంటే ముందుగా అందులో కథ వుందా లేదా, ఐడియా స్ట్రక్చర్ లో వుందా లేదా చూసుకోవడం అలవాటు. లక్ష్మి వచ్చి బ్యాంకు దోపిడీలో చనిపోయిన డెకాయిటీలు మా బంధువులు, వాళ్ళని చంపిన పెద్ద  డెకాయిటీ మీద పగ దీర్చుకోవాలన్నట్టు మాట్లాడుతున్నప్పుడు, ఏం కాన్సెప్ట్ ఏర్పాటయ్యింది? నెగెటివ్ క్యారెక్టర్స్ తో యాంటీ స్టోరీ ఏర్పాటయింది.

          ఇక్కడ కథ నానిది. ప్లాట్ పాయింట్ వన్ అతడిది. గోల్ అతడిది. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో అతనేం గోల్ తీసుకున్నాడు? నెగెటివ్ పాత్రల పగ దీర్చే గోల్ తీసుకున్నాడు. ఇది నెగెటివ్ గోల్. ఈ నెగెటివ్ గోల్ తీసుకోవడానికి - ఈ రియల్ రివెంజిని ప్రాక్టికల్ గా చూసి నవల రాస్తే తను సక్సెస్ అవచ్చని కారణం చెప్పారు. కారణం జస్టిఫై అవచ్చు, కానీ గోల్ నెగెటివ్ గోల్. అంటే తనూ నెగెటివ్ క్యారక్టరే. దీంతో ఈ మొత్తం నెగెటివ్ క్యారక్టర్లతో ఎలా సినిమా చూపించి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనుకున్నారు?

          నాని ఏమని అని వుండాలి? – ‘ఏవమ్మా, బలపంలా కన్పిస్తున్నానా? 300 కోట్ల అత్యంత భారీ దోపిడీలో  మీ వాళ్ళు పార్టనర్సా? వాళ్ళని మెయిన్ డెకాయిటీ చంపి పారిపోయాడని పగదీర్చుకోవాలంటున్నారా? మీ వాళ్ళు చేసిన పనికి సిగ్గు వేయడం లేదా? మిమ్మల్ని చుట్టుపక్కలెవరూ వెలివేయలేదా? మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్ళి ఫోర్త్ ఎస్టేట్ కి తెలియకుండా థర్డ్ డిగ్రీతో చిమచిమ లాడించలేదా, మెయిన్ డెకాయిటీ ఎక్కడున్నాడో చెప్పమని? మీమీద ఇప్పుడూ పోలీసు నిఘా లేదంటావా? వెళ్ళెళ్లమ్మా, నన్నెందుకు ఇరికిస్తావు. ఈ చిన్న పిల్లకి, ఈ చదువుకునే పిల్లకీ నీ పగ ఎక్కించి పాడు చెయ్యాలా? అలాటి మీ వాళ్ళు చచ్చినందుకు సంతోషించక పగ కూడానా?’ నేను పెన్సిలునే కానీ బలపాన్ని కాను. ఈ బలపం రచయితెవరో సరీగ్గా ప్లాట్ పాయింటు రాయించుకురా, అప్పుడాలోచిద్దాం’ అనాలి గబగబా పెన్సిల్ చెక్కుతూ.

అంతా పైపైనే 


          ఇక నాని విలన్ (కార్తికేయ) ఆచూకీ కోసం ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటి మోరల్ ప్రెమీజ్ లేని, రసభంగమైన కథతో, నెగెటివ్ పాత్రల గోడుతో. దోపిడీ గ్యాంగ్ రిహార్సల్ చేసిన చోట చెప్పులు, టిఫిన్ బాక్సులు వగైరా చనిపోయిన దోపిడీ దార్ల వస్తువులు దొరికితే ఎవరికి మాత్రం సానుభూతి? లేడీస్ గ్యాంగ్ ఏడ్పులు ఎవరికవసరం. ఇంటర్వెల్ కల్లా విలన్ తెలిసిపోయాక వాణ్ణి చంపే ప్లాను వెయ్యక ఇంకా డొంక తిరుగుడు దేనికి. కారు రేసుల పిచ్చి గల ఆ విలన్ రేస్ ట్రాక్ కోసం, రేసు కార్ల కోసం బ్యాంకు దోచుకున్నాడు. మరి నూట యాభై కోట్లతో రేస్ ట్రాక్ నిర్మించుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మిగిలిన 150 కోట్లు నిర్మాణం ఆగిపోయిన అపార్ట్ మెంట్లో ఫాల్స్ పిల్లర్ నిర్మించి అందులో దాచుకుని – ఏటీఎంలా దాన్ని వాడుకుంటూ వుంటే ఈ రాకపోకల్ని ఎవరూ అనుమనించరా? నాని అనుమానించి, ఆ 150 కోట్లు దోచుకుని విలన్ ని ఏడ్పించే ఆట మొదలెడతాడు. దేనికి? పగ తీర్చుకోవాలన్న కాన్సెప్ట్ ప్రకారం విలన్ ని అప్పుడే చంపేసి ఆ డబ్బు ప్రభుత్వానికి అప్పజేప్తే, విలన్ని చంపిన కేసు కూడా వుండక పోవచ్చుగా? పెన్సిల్ రైటర్ గ్లోబల్ హీరోగా పాపులర్ అవుతా డుగా, కోటి రెండు కోట్ల రివార్డు మనీతో?

          ఆ 150 కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు! దానికోసం విలన్ వచ్చేస్తే ఆ 150 కోట్లతో లక్ష్మి జంప్! ఆ డబ్బు ఏదో శరణాలయానికిచ్చేసి అక్కడ సెటిల్! పగాప్రతీకారాలేమయ్యాయో. ఇలా 150 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఎలా తిప్పుతూంటారంటే, వెచ్చాల సంచేసుకుని బజారుకెళ్ళి నట్టు. నాని సహా లక్ష్మీ, శరణాలయం బ్యాచీ ఈ డబ్బుతో క్రిమినల్స్ ఐపోయమని గుర్తించడమే లేదు. టాప్ దర్శకుడు ఎలా పడితే అలా పైపైన రాసేసి పైపైన తీసేశాడు.

అసలు విషయం 
     అసలు విషయాని కొద్దాం. ఇది ప్లాట్ పాయింట్ వన్ లో రావాల్సిన బేస్ పాయింట్. కథకుడి ‘సస్పెన్స్ పోషణ’ వల్ల ఎగిరి వచ్చి ఇక్కడ పడింది - సెకండాఫ్ అరగంట గడిచాక, నాని చెప్తాడు ఆ లేడీస్ కి తెలియని వాళ్ళ రహస్యమే. అసలేం జరిగిందంటే, లక్ష్మి మనవడు, నడివయసావిడ కొడుకు, వయసమ్మాయి ప్రేమికుడు, టీనేజి అమ్మాయి అన్న, చిన్నపిల్ల తండ్రి – ఈ ఐదుగురూ క్యాన్సర్ బాధితులు. ఇక చనిపోతామని తెలిసి, కుటుంబాలకి ఏదో చేయాలనుకున్నారు. విలన్ కలిసి బ్యాంక్ దోపిడీ గురించి చెప్పాడు. దాంతో అందులో తమ కొచ్చే సొమ్ముని కుటుంబాలకిచ్చేసి చనిపోవాలనుకున్నారు. కానీ విలన్ బ్యాంకుని దోచుకున్నాక వాళ్ళని చంపేశాడు. ఇదీ విషయం. ఇంత సస్పెన్స్ సెకండాఫ్ లో రివీల్ అయినందుకు మనం థ్రిల్లయి పోతాం కదా. రాంగ్. ఇది ఏడుపుగొట్టు సస్పెన్స్.

          ఇంత సేపూ నాని సహా లేడీస్ ని నెగెటివ్ అర్ధంలో చూపిస్తూ సినిమాకి హాని చేశాక, ఇప్పుడు జాలి కథ చెప్తే పాజిటివ్ సెన్స్ తో ఫీలైపోతామా? జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. పైగా అసలు విషయం నాని రివీల్ చేశాకైనా లక్ష్మి సిన్సియర్ గా వుండదు. తమ ఐదుగురి కుటుంబాల కోసం క్యాన్సర్ దాచుకుని త్యాగం చేసిన వాళ్ళ పట్ల ఏ ఫీలింగ్ లేకుండా, ప్రతీకారం సంగతికి ఏవో సాకులు చెప్పి, డబ్బు కొట్టేసి శరణాలయంలో సెటిల్ అవడం. నాని నిలదీస్తే అప్పుడేమంటుంది? చనిపోయింది మనవడు కాదట, తన భర్తట! ఏమిటో తమాషాగా వున్నాయి ట్విస్టులు.

ప్లాట్ పాయింట్ ఫ్రాక్చర్ 
       ఇదంతా కాదు, ఇక్కడ రివీల్ చేసిన విషయం ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ లోనే రావాలి. అక్కడ లక్ష్మి నాని దగ్గరికి వచ్చినప్పుడు, తమ వాళ్ళ క్యాన్సర్ గురించీ, దోపిడీతో వాళ్ళు చేసిన త్యాగం గురించీ కూడా చెప్పేసి,  విజువల్స్ తో వాళ్ళని ఓపెన్ చేసి, సాయం అడగాలి. అప్పుడు సానుభూతితో వాళ్ళందరూ పాజిటివ్ క్యారక్టర్లయి కథతో బావుంటారు. ఇందుకే ఓపెనింగ్ బ్యాంగ్ లో ముసుగులు వుండకూడదనేది. చనిపోయిన వాళ్ళ నెగెటివ్ రూపాలు, ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో కనపడి, అయ్యోపాపం అనుకోవడానికి వీలుంటుంది.

          ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పాల్సిన ప్రాబ్లం పూర్తిగా చెప్పకుండా సగం సస్పెన్స్ కోసమన్నట్టు దాచి, సెకండాఫ్ లో చెప్పారు. ఇలా ప్లాట్ పాయింట్ వన్ ని విరిచి రెండు ముక్కలు చేసి నష్టం చేసుకోవడం ఎక్కడా చూడలేదు. క్రియేటివ్ స్కూలుతో ఇదే ప్రాబ్లం. స్ట్రక్చర్ స్కూలు మాత్రమే స్క్రిప్టులో సమస్య లేమిటో చెప్పగలదు.

          ఐతే ఈ పూర్తి ప్రాబ్లం ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పేస్తే నిర్దుష్టంగా వుంటుందా స్క్రిప్టు? మోరల్ గా వుండదు. అప్పుడూ అన్యాయంగానే వుంటాయి అన్ని పాత్రలూ చనిపోయిన వాళ్ళు సహా. ఎలా? ఎలాగేమిటి, చనిపోయిన వాళ్ళనుంచి త్యాగపు సొమ్ము రావాలే గానీ, అన్యాయపు సొమ్ము కాదు. వాళ్ళు బ్యాంకు దోపిడీ అనే నేరం చేసి కుటుంబాల కివ్వాలనుకున్నారు. అది అన్యాయపు సొమ్ము. పైగా కుటుంబాల్ని చట్టం కోరల్లో ఇరికించి నాశనం చేస్తుంది. కుటుంబాలు తిట్టిపోసుకుంటాయి.

          1974 ‘మజ్బూర్’ లో, అమితాబ్ బచ్చన్ తను బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోతానని తెలిసి, కుటుంబం కోసం హంతకుడి డీల్ ఒప్పుకుంటాడు. ఐదు లక్షలు తీసుకుని, హంతకుడు చేసిన హత్యని తన మీదేసుకుని, ఉరికంబం ఎక్కబోతాడు. ఇది అన్యాయపు సొమ్ము కాదు, తను నేరాలు చేయలేదు. చెయ్యని నేరాన్ని మీదేసుకున్న త్యాగపు సొమ్ము.

          స్ట్రక్చర్ ఒక్కటే స్క్రీన్ ప్లే కష్టాల నుంచి విముక్తి కల్గిస్తుంది.


సికిందర్
telugurajyam.com



17, సెప్టెంబర్ 2019, మంగళవారం

872 : రివ్యూ!


దర్శకత్వం : అజయ్ బహల్
తారాగణం : అక్షయ్ ఖన్నా, రిచా చడ్డా, మీరా చోప్రా, రాహుల్ భట్, కిషోర్ కదమ్, కృతికా ఖాన్ తదితరులు
రచన : మనీష్ గుప్తా, సంగీతం : క్లింటన్ సిరేజో, ఛాయాగ్రహణం : సుధీర్ చౌధురి
బ్యానర్ : పనోరమా స్టూడియోస్, టీ సిరీస్
         కోర్టు రూమ్ డ్రామాలకి లైంగిక వేధింపుల / మానభంగాల కథలు సెక్స్ అప్పీల్ ని సమకూర్చి పెడుతున్నాయి బాక్సాఫీసు విజయాల కోసం. ఇవి ఫార్ములాకి దూరంగా చుట్టూ జరుగుతున్న సంఘటనలకి వాస్తవిక సినిమాల రూపంలో అద్దం పడుతున్నాయి. లైంగిక వేధింపుల కథతో ‘పింక్’ ఒక కోర్టు రూమ్ డ్రామా కాగా, తాజాగా మానభంగ కథతో ‘సెక్షన్ 375’ ఇంకో అలాటి కోర్టు రూమ్ డ్రామా అయింది. ‘పింక్’  కొంత ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తే, ‘సెక్షన్ 375’ చట్టాన్ని, న్యాయాన్నీపల్టీ కొట్టించే అస్త్రంగా రేప్ ని చూపించింది.

          టు హాలీవుడ్ లోనూ, ఇటు ఇండియాలోనూ ఇంకా ‘మీ టూ’ ఉద్యమం ప్రారంభం కాక ముందే ఈ కథ తయారైందని చెబుతున్నా, ఇప్పుడా ఉద్యమ నేపథ్యంలో, నిత్యవార్తలైన మానభంగాల ఉధృతిలో, బాధితుల ఫిర్యాదుల పైనే అనుమానాలు కలిగేలా వుందీ చిత్రణ. వరకట్న వేధింపుల సెక్షన్ 498 దుర్వినియోగమైనట్టే, మానభంగాల సెక్షన్ 375 నీ వాడుకునే ప్రమాదం వున్నట్టు, స్త్రీలకోసం చట్టాలు చేస్తే వాళ్ళు పురుషుల్ని వేధించడానికి మానిప్యులేట్ చేస్తారన్న అర్ధంలో వుంది కథా రచన. పూర్తిగా పురుష పక్షం వహించి, అవి మగవాళ్ళ చేసే రేపులు కావు, ఆడవాళ్ళు తీర్చుకునే రివెంజిలు అని ముక్తాయించిన ముగింపూ  వుంది. ఎక్కడో అరుదుగా జరిగే అవకాశమున్న ఇలాటి కుయుక్తిని సినిమా కోసం జనరలైజ్ చేసినట్టుగా వుంది కాన్సెప్ట్.

          ఇలా ఎవరైనా చట్టాన్నిదుర్వినియోగం చేస్తే కోర్టు శిక్షించేట్టు కాకుండా, సమర్ధిస్తున్నట్టు తీర్పు చెప్పడం ఇంకో ‘ప్రధానాకర్షణ’. ఈ హైకోర్టు తీర్పు చెప్పడం కూడా బయట ప్రజాందోళనకి లొంగి చెప్పినట్టు వుండడం ‘ప్రధానాకర్షణే’. రేపిస్టుని శిక్షించాలని హైకోర్టు బయట జనం లాఠీ దెబ్బల్ని లెక్కచెయ్యకుండా తీవ్రస్థాయిలో గొడవ చేస్తూంటే, న్యాయమూర్తి మాటిమాటికీ కిటికీలోంచి తొంగి చూసి టెన్షన్ తో గడపడం, ఈ జనాలకి అనుకూలంగా తీర్పు చెప్పకపోయామో, ఇక తమ తలలు వేయి వ్రక్కలే అన్నట్టు హడవిడిగా - ఆ ఇద్దరు న్యాయమూర్తులూ బెంచి మీదికొచ్చేసి -  ‘ఔను వాడు రేపిస్టు ముష్టివాడే’ - అని తీర్పు చెప్పి పారెయ్యడం, అత్యంత ప్రధానాకర్షణ గల చర్యే విశ్వసనీయత పట్ల. 

       విడతలు విడతలుగా మనకి అందించిన కథనం ప్రకారం అతను రేప్ చేయలేదు, అలా ఆమె ట్రాప్ చేసింది. దీనికి రుజువు లేదు. మొదట అతనే ట్రాప్ చేశాడు. అతను పెళ్ళయిన విషయం దాచి పెట్టాడని ఎదురు తిరిగింది. మోసపోయానని మోసానికి ప్రతీకారంగా అతణ్ణి ట్రాప్ చేసి రేప్ కేసులో ఇరికించింది. ఆమె ట్రాప్ చేసిందనడానికి రుజువుల్లేవు, పైగా కోర్టు బయట జనం రెచ్చిపోతున్నారు. అందుకని న్యాయ మూర్తులు అతను రేపిస్టేనని, ఆమె రేప్ బాధితురాలనీ గట్టెక్కించేశారు.

          ఒక నిర్భయ ఘటనలోనో, ఇంకో ఖటువా ఉదంతంలోనో రేప్ బాధితుల్ని చంపి పడేస్తే, కళ్ళారా చూసిన ఆ ఘోరాలకి ప్రజాందోళనలు పెల్లుబకడంలో అర్ధముంది. పడగ్గది లో ఇద్దరి మధ్య అసలేం జరిగిందో తెలిసే వీలులేని కేసుల్లో, జనాలకేం తెలుసనీ రేపిస్టుని ఉరితీయాలని వీధికెక్కుతారు. సోషల్ మీడియాలో వీరంగాలేస్తారు. కోర్టుల మీదికి దండయాత్ర చేస్తారు. ఇలాటి మూకల్ని ఎంకరేజి చేస్తున్నట్టూ, దీన్ని తీర్పుకి వాడుకుంటున్నట్టూ కథ చేశారు. ఈ కేసు నువ్వెలా తీసుకున్నావని అల్లరి మూక నిందితుడి లాయర్ మీద దాడి చేసేలా, ఇంకు జల్లి అవమానపర్చేలా, న్యాయప్రక్రియని అల్లరి మూక చేతిలో పెట్టేసేలా కథాసంవిధానాన్ని తీర్చిదిద్దారు. ఈ కథామాలికలో అల్లరి మూకల పాత్రకి లాజిక్కే లేదు.

          ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులుంటే, వాళ్ళలో ఒకరు మేడమ్  వుంటే, ఆవిడకి ప్రాధాన్యం లేనట్టే చిత్రణ. ఛాంబర్ లోకి వాళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళినా అతడేం చెప్తాడని ఆమే అతడి వైపు చూస్తూంటుంది తప్ప, ఆమె అభిప్రాయం కోసం అతను చూడడు గాక చూడడు. అతనే ఏదో డిక్లేర్ చేస్తే, దానికామె తలూపుతుంది. తలలు పగులుతాయన్న భయం కూడా అతడిదే. అతడి ప్రకారమే తీర్పుకి ఆమె ఓకే. ఛాంబర్లో అంతా వాడిన మేల్ డామినేషన్ పూలతో కథాలంకరణ. వాడిన పూలే వికసించెనే - అని మనం పాడుకునేట్టు.

కేసు కథా ‘కామా’ మిషు
       నిందితుడి బెడ్ కింద వాడిన పూలుంటాయి రేప్ కి సాక్ష్యంగా. తర్వాత ఆమె వికసించిన పూలతో మళ్ళీ వచ్చిందని ఎదురు సాక్ష్యం తీస్తాడు నిందితుడి తరపు లాయర్. బెడ్ కింద వున్న వాడిన పూలు రేప్ కి నాల్గు రోజులు ముందటివి అంటాడు (ఇంట్లోపని మనిషి వుంది, బెడ్ రూమ్ ఊడ్వదా? కథ కోసం అవసరమని నలిగిన పూలు వదిలేసిందా?... సినిమా ఫీల్డులో మోడ్రన్ కాస్ట్యూమ్స్ అసిస్టెంట్ జడలో వొత్తుగా, వెడల్పుగా కొట్టొచ్చినట్టూ, మల్లెపూల పట్టీ వేసుకు తిరగడం కూడా కథ కోసమేనేమో).

          అంజలీ డాంగ్లే (మీరా చోప్రా) ఒక సినిమా కాస్ట్యూమ్స్ అసిస్టెంట్. కాస్ట్యూమర్ మేడమ్ కింద పనిచేస్తూ, అదే సినిమా షూటింగులో దర్శకుడు రోహన్ ఖురానా (రాహుల్ భట్) కి లొంగిపోతుంది. పెళ్ళయిన విషయం చెప్పడు. కానీ ఆమె వల్ల ఇంట్లో భార్యకి తెలిసిపోయి ఆమెని వెళ్ళగొడతాడు. దీంతో తనని మోసం చేశాడని మనసులో పెట్టుకుని, పథకం ప్రకారం పని ఇప్పియ్యమని జాలి కథలు చెప్పుకుని మళ్ళీ వస్తుంది. షూటింగ్ కి అవసరమైన కాస్ట్యూమ్స్ ని పథకం ప్రకారం వంగి చూపిస్తూ, వక్ష సంపదని ఎక్స్ పోజ్ చేస్తుంది (అప్పుడు బ్రా వేసుకుని వుండదు. ఈ పాయింటు కేసులో ఎక్కడా ఉత్పన్నం కాదు. రోహన్ కూడా తన లాయర్ కి చెప్పడు. చెప్పి వుంటే తన మీద కేసు కింది కోర్టులోనే ఎగిరిపోయేది). ఆ ఎక్స్ పోజింగ్ కి అతను తన సహజ మగ తేనియలు తేరగా వూరగా ఆమె మీద పడతాడు. ఆమె పథకం ప్రకారం ప్రతిఘటించి గాయాలు చేసుకుని, వెళ్లి పోలీస్ స్టేషన్లో  రేప్ కేసు పెట్టేస్తుంది.


        అక్కడ పోలీసాఫీసర్ అడగరాని ప్రశ్నలు అడిగి కేసు రాసుకుంటాడు (ఈ కేసు రాయాల్సింది లేడీ ఆఫీసరైతే నువ్వెందుకు రాశావని తర్వాత హైకోర్టులో రోహన్ లాయర్ తరుణ్ సలూజా (అక్షయ్ ఖన్నా) అడుగుతాడు. సినిమాకి సెక్స్ అప్పీలు పీక్ కి వెళ్ళడానికి  తనుంటేనే బాగుంటుందని ఆ పోలీసాఫీసర్ చెప్పలేకపోతాడు).

          ఇలా రేప్ కేసులో దర్శకుడు రోహన్ అరెస్టయి, సాక్ష్యాలన్నీ ఆమె ఆరోపణలకి నిరూపణలుగా వుండడంతో సెషన్స్ కోర్టు పదేళ్ళ  శిక్ష వేస్తుంది. హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. లాయర్ తరుణ్ సలూజా రంగంలోకొస్తాడు. ప్రాసిక్యూషన్ వైపు ఒకప్పుడు తన అసిస్టెంటే అయిన హీరల్ గాంధీ (రిచా చడ్డా) వస్తుంది. ద్విసభ్య బెంచి (కిషోర్ కదమ్, కృతికా ఖాన్) అప్పీల్ విచారణ. ఈ విచారణలో పై చేయి అంతా మేల్ డామినేషన్ తో తరుణ్ దే. వైరి పక్షాల సమీకరణ కూడా ఎలా వుందంటే, ఆడ జట్టు ఒక వైపు – మగ జట్టు ఒకవైపు అన్నట్టు. మేల్ డామినేషన్ తో మగజట్టుదే పై చేయి. బాధితురాలు, ఆమె తరపు ప్రాసిక్యూటర్ ఆడజట్టు. నిందితుడూ అతడి లాయర్ మగజట్టు. వీళ్ళదే హల్చల్. తన అధికార స్థానాన్ని ఉపయోగించుకుని మగవాడు స్త్రీలని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నాడని చెప్పే రేప్ కథలో కోర్టులోనే, కోర్టు ఛాంబర్లోనే ఈ దృశ్యాలు.

          పబ్లిక్ ప్రాసిక్యూటర్ హీరల్ గాంధీ (గాంధీ పేరు దేనికి? ‘అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ మిస్ గాంధీ’ అని మాటిమాటికీ న్యాయమూర్తులు ఆమె నోర్మూయిస్తూంటే, మహాత్మా గాంధీ పట్ల శాడిజంగా వుంటుందన్నఆనందంతోనా?) ఈ కేసుని తీసుకున్నప్పుడు ఎన్ని తప్పులున్నాయో చూసుకోనట్టు వుంటుంది ఆమె వాదించే తీరు. పైగా తను రాష్ట్రానికి మొదటి మేడమ్ అడ్వొకేట్ జనరల్ గా పనిచేసినట్టు బిల్డప్ ఇచ్చారు.

          లాయర్ తరుణ్ రేప్ జరగలేదనే తేలుస్తాడు- బెడ్ షీట్ ఆధారంగా. బెడ్ షీట్ ని వెంటనే లాబ్ కి పంపకుండా ఇన్స్పెక్టర్ ఐదురోజులు తన దగ్గరుంచుకోవడం వల్ల, దాని మీద సాక్ష్యాధారాలు కలుషితమయ్యాయని, అందువల్ల ఈ ఎవిడెన్స్ చెల్లదని చెప్పేస్తాడు. ధర్మాసనం దీన్ని ఒప్పుకున్నా, ఇంతమాత్రాన కేసుని కొట్టివేయలేమని అంటుంది. దీంతో బాధితురాలు ఏ రకంగా ముద్దాయిని ట్రాప్ చేసిందో సుదీర్ఘ వాదోపవాదాల మధ్య విజువల్ ఎవిడెన్సుని ముందుంచుతాడు తరుణ్. దీన్ని కూడా ధర్మాసనం ఒప్పుకున్నా, బయట మూక అల్లరికి బెంబేలేత్తినట్టు కింది కోర్టు తీర్పునే సమర్ధిస్తూ తీర్పిచ్చేస్తుంది.

          నైతిక విజయం తరుణ్ దే, ముద్దాయిదే. బాధితురాలే సెక్షన్ 375 ని, పోలీసుల్నీ, ప్రాసిక్యూటర్స్ నీ, కోర్టుల్నీ, అందర్నీ తెలివిగా ఏమార్చి వ్యక్తిగత పగ తీర్చుకుంది. దీంతో ఇంతవరకూ వున్న సానుభూతి కరిగిపోయి క్రిమినల్ మాస్టర్ మైండ్ గా, నెగెటివ్ గా  ఆమె కనపడుతుంది. రేప్ బాధితులకి అండగా వున్న సెక్షన్ ని తను ఇలా దుర్వినియోగపర్చి  అప్రతిష్ట తెస్తే, రేపు వేలాది రేప్ బాధితురాళ్ళ పరిస్థితేమిటని ఆడదై వుండి కూడా, ఈ కథకి కథానాయకి అయికూడా ఆలోచించకుండా.

          మద్యనిషేధాన్ని అవకాశంగా తీసుకుని హీరో డబ్బులు సంపాదించుకునే మద్యం స్మగ్లింగ్ కింద మార్చుకునే ‘రణరంగం’ అనైతిక కథకీ, దీనికీ తేడా లేదు.


సికిందర్
telugurajyam.com

11, సెప్టెంబర్ 2019, బుధవారం

871 : స్పెషల్ రివ్యూ!


రచన - దర్శకత్వం : రామ్
తారాగణం : వసంత్ రవి, ఆండ్రియా, అంజలి తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : థేనీ ఈశ్వర్
బ్యానర్ :
డి.వి.సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్
నిర్మాతలు: ఉదయ్ హర్ష, డి.వి.వెంకటేష్
విడుదల : సెప్టెంబర్ 6, 2019
***
        మిళ సినిమాల్లో కొత్త కోణాలూ కొత్త ప్రయోగాలూ కొత్త కాదు. అందులోనూ ప్రేమ సినిమాల్లో ఏదోవొక కొత్తదనమో, ప్రయోజనకర విషయమో వుంటుంది. ఐటీ, కార్పొరేట్ రంగాల నేపధ్యంలోనూ చాలా ప్రేమ సినిమాలు వచ్చాయి. అయితే నేపథ్యాలు మారతాయే తప్ప ప్రేమలు అవే మూస ఫార్ములా ప్రేమలుగా వుంటాయి. నేపథ్యాల్లోంచి ఫార్ములా అనే పాతని తీసేస్తే మిగిలేది కాలానికి తగ్గట్టు రియలిస్టిక్కే. రియలిస్టిక్ లో క్రియేటివిటీతో చాలా పనుంటుంది, మూస ఫార్ములాల్లో రొడ్డకొట్టుడు వుంటుంది. రియలిస్టిక్ అసలు ప్రేమలెలా వున్నాయో చూపిస్తుంది. ఐతే తమిళ దర్శకుడు రామ్ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో వుండే ప్రేమ లెలా వుంటాయో 2013 లోనే కనిపెట్టేశాడు. ఆ చేదు మాత్రలు ప్రేక్షకులకి తినిపించేందుకు సంసిద్ధుడయ్యాడు. ప్రేమల చేదు తెలిస్తేనే ప్రేమల మత్తు వదిలి చట్టబద్ధమైన హెచ్చరిక కన్పిస్తుంది. దర్శకుడు ఎలాటి హెచ్చరిక చేశాడు, చేదుతో ఎలా ఎంటర్ టైన్ చేశాడు ఈ కింద చూద్దాం...

కథ
 ఆల్థియా జాన్సన్ (ఆండ్రియా) అనే ఆంగ్లో ఇండియన్ యువతి చెన్నైలో కార్పొరేట్ జాబ్ చేస్తూంటుంది. ఒక రోజు బస్టాప్ లో వర్షంలో చిక్కుకుంటుంది. అక్కడే బికారిలా ఒకడు నక్కి వుంటాడు. మాటా మాటా కలిసి ఫ్రెండ్స్ అవుతారు. అతను ప్రభురాజ్ (వసంత్ రవి) అనే వైజాగ్ నుంచి వచ్చి కాల్ సెంటర్లో పని చేస్తున్న ఉద్యోగి. ఎదురుగా ఇటీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ సౌమ్య (అంజలి) ని ప్రేమించాడు. ఆమె యూఎస్ లో జాబ్ చూసుకుని వెళ్ళిపోతోంది. అందుకు మూడు లక్షలు కావాలి. ప్రభురాజ్ రైల్లో నిద్రపోతున్న వ్యక్తి దగ్గర ఆ డబ్బు కొట్టేసి ఆమె కిచ్చాడు. ఆ డబ్బుతో ఆమె యూఎస్ వెళ్ళిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో షాక్ తిన్నాడు. పైగా తను రైల్లో డబ్బు కొట్టేసిన వ్యక్తి గుండె పోటుతో చనిపోయాడని తెలిసి ఆత్మహత్య చేసుకోబోయాడు. రైల్వే గార్డు కాపాడి ఆశ్రయమిచ్చాడు.

          ఇలా దెబ్బతిన్న ప్రభురాజ్ జీవితం గురించి తెలుసుకున్న ఆల్థియా, తన ఫ్లాట్ లో ఆశ్రయమిస్తుంది. ఆమెకి విడాకులై ఐదేళ్ళ కొడుకుతో వుంటోంది. పనీ పాటా లేక ఆమె సొమ్ము తిని తిరుగుతూంటాడు ప్రభురాజ్. తిని తిరగడమే గాక, వాడెవడు - వీడెవడు అని ఆమె మీద అధికారం చెలాయిస్తూంటాడు అనుమానాలు పెట్టుకుని. ఫ్లాట్లోంచి నెట్టి పారేస్తుంది. రోడ్డున పడ్డ ప్రభురాజ్ ఇలా రెండోసారి అమ్మాయిలతో మోసపోయానని, ఆడవాళ్ళతో గేమ్ ఆడుకోవడం మొదలెడతాడు...

          ఏమిటా గేమ్? ఈ గేమ్ లో డబుల్ గేమ్ ఆడుతున్న ఒక పోలీసు అధికారి తన భార్యని చంపెయ్యడానికెలా కారకుడయ్యాడు? యూఎస్ లో భర్తని వదిలేసి వచ్చిన సౌమ్యని తన డబ్బుల కోసం ఎలా బ్లాక్ మెయిల్ చేశాడు? గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి డబ్బు ఇచ్చేయడాని ఇంటికెళ్తే ఏం జరిగింది? అటు ఆల్థియా తనని లైంగికంగా వేధిస్తున్న బాస్ నెలా ఎదుర్కొంది? ప్రభురాజ్ రాకపోవడంతో ఆమె కొడుకు ఎలాటి సంఘర్షణ పడ్డాడు? ఈ మొత్తం అనుభవాల్లోంచి ప్రభురాజ్ ఏం నేర్చుకున్నాడు?... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

 ఇది టీనేజి ప్రేక్షకుల కోసం లేకి అపార్ధాలతో విడిపోయి, మళ్ళీ కలుసుకునే టైపు అచ్చిబుచ్చి ప్రేమల, కృత్రిమ లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీ కాదు, మెచ్యూరిటీ గల 25 -35 ఏజి గ్రూపు ప్రేక్షకుల కోసం రియలిస్టిక్ ప్రేమకథ. ఐటీ, కార్పొరేట్ కల్చర్లు నియంత్రిస్తున్న ప్రేమలెలా వుంటాయో చెప్పే కరకు వాస్తవాల చిత్రణ. సహజ ప్రేమల్ని సహజ ప్రేమలు నియంత్రించకుండా, ఇంకేవో కల్చర్ల ఆజమాయిషీలోకి వెళ్ళిపోతే ఆ జీవితాలెలా తయారవుతాయో చెప్పే నియో రియాలిజం కథ. వర్కింగ్ క్లాస్ జీవితాల్ని వున్నన్నదున్నట్టు వలువలు వొలిచి చూపించే నియో రియాలిజం జానర్ లో ఇది తమిళం నుంచి వచ్చిన ఒక కొత్త ప్రయోగం అనొచ్చు.

          తారామణి అంటే చెన్నైలో ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ - కార్పొరేట్ జోన్. ఈ ప్రాంతంలో యువతీ యువకుల గ్లోబల్ కల్చర్ ని తొలిసారిగా వాస్తవికంగా తెరకెక్కించాడు దర్శకుడు. తారామణి రైల్వే స్టేషన్లో హీరో నివాసం సహా. కెరీర్ పరంగా ఈ కల్చర్ ఎంత రిచ్ అయ్యేందుకు తోడ్పడుతుందో, ప్రేమల విషయంలో అంతే రోడ్డున పడేలా చేస్తుందనీ, నువ్వు రిచ్ గా వుండాలంటే ఇక్కడి ప్రేమల్ని టచ్ చెయ్యకు అనీ చెప్పే ‘తారామణి’ ని టీనేజర్లు చూడడానికి మెచ్యూరిటీ, అభిరుచీ సరిపోవు.
 
ఎవరెలా చేశారు
 వసంత్ రవి పాత్ర, నటన ఈ రియలిస్టిక్ కి హైలైట్. పాత్ర మానసిక సంఘర్షణని, భావోద్వేగాల్నీ, ప్రవర్తననీ, చర్యల్నీ, బాగా స్టడీ చేసినట్టు లీనమై సమర్ధవంతంగా పాత్ర పోషణ చేశాడు. అతడికి రోమాంటిక్ గా గడిపే అవకాశమే ఎక్కడా లేదు. జీవితమే అలా తయారయ్యింది. క్యారెక్టర్ ఆర్క్, గ్రోత్ నెగెటివ్ గా వుండడం అనుభవాల్లోంచే వచ్చింది. అమాయకంగా వున్నపుడు మొదటి అమ్మాయి మోసం చేసిందని సోమరిగా మారిపోవడం, రెండో అమ్మాయి మీద అదుపు కోసం మగ దురహంకారాన్ని పెంచుకోవడం, ఈమె కూడా మోసం చేసిందనుకుని కన్నింగ్ గా మారిపోయి ఇతర అమ్మాయిల్ని మోసం చేయడం, క్రిమినల్ గా మారడం...ఈ దశలన్నీ కథ నడపడానికి పాత్రకి తోడ్పడ్డాయి. 


          ఒకమ్మాయిని మోసం చేయాలనుకుని ఆమె ఉంగరం లాగేసుకున్నప్పుడు, ఆ ఉంగరం ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ అధికారి గిఫ్ట్ గా ఇచ్చిందని తెలుసుకుని, అతడి భార్య దగ్గరి కెళ్ళి పోయి ఉంగరమిచ్చి విషయం చెప్తాడు. ఆమె ఆ ఉంగరంతో భర్తని నిలదీయకుండా, భర్త ద్రోహానికి తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడడం వసంత్ కి ఇంకో పాపభారంగా మారిపోతుంది. ఉంగరం కొట్టేసిన వాడు కొట్టేసినట్టు వుండక, ఇంకేదో ఉపకారం చేసి మంచి వాడు అన్పించుకోవాలన్న కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీతో పాపిగా మారిపోయాడు. మొదటి పాపభారం రైల్లో నిద్రపోతున్న వ్యక్తి దగ్గర డబ్బు కొట్టేసినప్పుడు చుట్టుకుంది. చివరికీ పాత్ర ఎక్కడికి చేరింది? ఐటీ కల్చర్ నుంచి దర్గాకి చేరింది...ఖవ్వాలీ పాటతో కొత్త జీవితం దొరికింది. ఇలా కథానుగతమైన మెటఫర్స్ తో సాగే పాత్రలో వసంత్ కిది ‘బిచ్చగాడు’ లాంటి మూవీ. 

 హీరోయిన్ ఆండ్రియాది ఇంకో కల్చర్ బాధిత పాత్ర. కట్టుకున్న వాడు గే అని తెలిశాక, అతడి పరువు తీయకుండా, తనే బిచ్ అన్పించుకుని విడాకులతో బయటపడి, సింగిల్ మదర్ గా జీవించే, స్కర్ట్స్ లోకి మారిపోయి, స్మోక్ చేసే జీవన శైలిని తెచ్చి పెట్టుకుని, అర్ధంకాని అమ్మాయిగా - కన్న తల్లి చేత కూడా బిచ్ అన్పించుకుని - ఒక వైపు బికారీ హీరోతో, ఇంకోవైపు సెక్సాకలి బాస్ తో సతమతమవుతూ - అదే కల్చర్ తో వాళ్లిద్దరి తాట తీసే సంఘర్షణాత్మక పాత్రల్లో కదిలిస్తుంది. 

          ఇక అమెరికా వెళ్లి మోసపోయే అంజలిది ఇంకో కల్చర్ బాధిత పాత్ర. డబ్బు సాయం చేసిన బాయ్ ఫ్రెండ్ కే  మొండిచెయ్యి చూపించి, అమెరికాలో ఇంకొకడ్ని చూసుకుంటే ఏం జరగాలో అదే జరిగి, ఎక్కడికి రావాలో అక్కడికే తిరిగి వస్తుంది. తిరిగి వచ్చాక హీరోతో గమ్మత్తైన సన్నివేశంలో వుంటుంది. ఇలా రెండు మూడు సీన్స్ లో కన్పించే అంజలి ఆ సీన్స్ ని నిలబెట్టింది.  

          సీన్స్ తారామణి ఏరియాని దాటిపోవు. ఆ నేటివిటీని కథలో భాగం చేశాడు. ఎత్తైన అపార్ట్ మెంట్స్, ఫ్లై ఓవర్లు, రైల్వే ట్రాకులూ వీటిని ప్రధానంగా ఫోకస్ చేశాడు. థేనీ ఈశ్వర్ కెమెరా వర్క్ డీసెంట్ గా వుంది. యువన్ శంకర్ రాజా ఈ నియో రియలిజంకి తన స్వరాలతో సొబగులద్దాడు. ముఖ్యంగా ‘హేయ్ ఇక చాలు చాలు ఆటలే’ పాట కథకి బాగా కుదిరింది.

చివరికేమిటి
  ఐటీ - కార్పొరేట్ ప్రేమల్ని సూక్ష స్థాయిలో చూసి మైక్రో లెవెల్లో కథ చేయడం వల్లే ‘తారామణి’ లో ఇంత ఆకర్షణ కన్పిస్తుంది. చూడని, వున్నాకూడా సినిమాల్లో చూపెట్టని,  కొత్త ప్రేమ లోకాలని చూపించాడు. ఆలోచింపజేసే ప్రయత్నం చేశాడు. ప్రేమల్ని తీసికెళ్ళి కెరీర్ తో వుండే కల్చర్ కి తాకట్టు పెట్టొద్దని హెచ్చరికగా దీన్ని తీశాడు. ఐతే ఈ హెచ్చరిక ప్రేక్షకులు ఫీలయ్యేట్టుగా చేశాడు గానీ, చివరికి పాత్రలు ఫీలయ్యేట్టు చేయలేకపోయాడు. జడ వేసుకుంటే ఆఫీసు కల్చర్ ఒప్పుకోనప్పుడు భౌతిక రూపంలో ఆ కల్చర్లో వుండొచ్చు, మానసిక రూపంలో ఆ కల్చర్ వల్లే ప్రేమల్లో చిక్కులు వస్తున్నాయి. ఇది పాత్రలు గుర్తించినట్టు ముగింపు నిచ్చి వుండాల్సింది.

          ఎంత రియలిస్టిక్ అయినా, ఎంత సీరియస్ అయినా, దీంతో ఎక్కడా డార్క్ మూడ్ క్రియేట్ చేయడమో, డార్క్ మూవీగా తీయడమో చేయలేదు. ఒక తెలివైన పని చేశాడు. ఎంత సేపూ రెండు మూడు పాత్రల మధ్య సంఘర్షణతో బరువెక్కినప్పుడల్లా, వాయిసోవర్లు వేసి నవ్విస్తూ పోయాడు. వసంత్, ఆండ్రియాలు తిట్టుకుని, ఘర్షణ పడి, అతడ్ని ఆమె బయటికి తోసి పారేసి తలుపపేసుకున్నప్పుడు చాలా విషాదమావరిస్తుంది. దీన్ని తేలిక బరుస్తూ ఇలా ఫన్నీగా వాయిసోవర్ వేశాడు...

          ‘ఎత్తైన ఈ భవనాల్లోంచి విన్పించే అల్లర్లు, ఆర్తనాదాలూ కేవలం ఈ వొక్క సాఫ్ట్ వేర్ జీవితాల్లోనే కాదు, ఆయా బిల్డింగుల కోసం ఏంతో శ్రమించే సామాన్య కార్మిక కుటుంబాల్లోనూ, వీళ్ళందరికీ వినోదాన్నందించే సినిమా వాళ్ళ జీవితాల్లోనూ, ఏంతో  కష్టపడి తీసిన సినిమాని రెండు గంటల్లో రివ్యూలు రాసేసే రివ్యూ రైటర్ల జీవితాల్లోనూ, ఆ రివ్యూలతో ఏ సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల జీవితాల్లోనూ నిత్యం జరుగుతూంటాయి. అలాటి ఓ చిన్న సంఘర్షణ మన తారామణిలో జరిగింది...’

          ఇలాగే రిలీఫ్ అవసరమైనప్పుడల్లా మరికొన్ని వాయిసోవర్లతో నవ్వించాడు... పెద్ద నోట్ల రద్దు మీద, చెన్నైలో చెరువుల్ని కబ్జాలు చేసి కడుతున్న బిల్డింగుల మీద, తరిగిపోతున్న వ్యవసాయం మీద, ఎలాటి మగాడైనా ఆడదాన్ని ఒకేలా పురుగులా చూసే దుర్బుద్ధి పైనా...సెటైర్లు వేశాడు. ఇది నియో రియాలిజం టెక్నిక్కే.  

          2013 లో ప్రారంభించి 2017 లో విడుదల చేశాడు. ఇంకా ఆలస్యం చేస్తూ తెలుగులో డబ్బింగ్ అయింది. ఎప్పుడో హిందీలో రాజ్ కుమార్ సంతోషీ, తమిళంలో బాలూ మహేంద్రల దగ్గర పనిచేసిన దర్శకుడు రామ్, కాలం చెల్లిన ఓల్డ్ ఫ్యాషన్ దర్శ కత్వం చేయకుండా, కొత్త దర్శకుల్ని తలదన్నే కంటెంట్ తో, టెక్నిక్ తో రంగంలో వుండడం ప్రత్యేకత. తమిళంలో ప్రశంసలతో బాటు బాక్సాఫీసు విజయం కూడా సాధించింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచుల రీత్యా దీని కమర్షియల్ విజయమెలా వున్నా, కథా ప్రయోజనం దృష్ట్యా దీనికి 3/5 రేటింగ్ ఇవ్వాల్సి వుంటుంది.

సికిందర్