రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, సెప్టెంబర్ 2023, గురువారం

1263 : రివ్యూ!

 


రచన-దర్శకత్వం : మహేష్ బాబు
తారాగణం : నవీన్ పొలిశెట్టి, అనూష్కా శెట్టి, జయసుధ, తులసి, నాజర్, మురళీశర్మ, అభినవ్ గోమఠం
సంగీతం : రాధన్, నేపథ్య సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : నీరవ్ షా 
బ్యానర్: యువి క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్
విడుదల : సెప్టెంబర్ 7, 2023
***

        2021 లో జాతిరత్నాలు హిట్ కామెడీ తర్వాత నవీన్ పొలిశెట్టి, 2020 లో నిశ్శబ్దం సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత, అనూష్కా శెట్టీ కలిసి నటించిన మిస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి రోమాంటిక్ కామెడీ ప్రేక్షకుల మధ్యకొచ్చింది. దీనికి మెగా స్టార్ చిరంజీవి ఫస్ట్ రివ్యూ ఇచ్చి అభినందించడంతో హైప్ వచ్చింది. ట్రైలర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. మరో కొత్త దర్శకుడుగా మహేష్ బాబు దీంతో పరిచయమయ్యాడు. ప్రసిద్ధ బ్యానర్ యూవీ క్రియెషన్స్ నిర్మాణంలో ఈ కొత్త మూవీ కొత్తగా ఏం చెబుతోందీ, ఎలా చెబుతోందీ చూద్దాం...

కథ  

అన్వితా శెట్టి (అనూష్కా) లండన్లో మాస్టర్ షెఫ్ గా పని చేస్తూంటుంది. తల్లి (జయసుధ) అనారోగ్యం పాలు కావడంతో ఆమెని తీసుకుని ఇండియా వస్తుంది. తల్లి మరణించడంతో ఒంటరితనం ఫీలవుతుంది. అయితే పెళ్ళి మీద సదభిప్రాయం వుండదు. పెళ్ళి లేకుండా బిడ్డని కనాలని నిర్ణయించుకుంటుంది. ఆమెకి సిద్ధార్థ్ పొలిశెట్టి (నవీన్) పరిచయమవుతాడు. ఇతను ఇంజనీర్. అయితే స్టాండప్ కమెడియన్ గా జీవిస్తూంటాడు. ఇతను అన్వితతో ప్రేమలో పడతాడు. ఆమె పెళ్ళి లేకుండా సరొగసీ(అద్దె గర్భం) ద్వారా బిడ్డని కంటానని, వీర్యదానం చేయమని కోరేసరికి షాక్ తింటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ కథలో రెండు కాన్సెప్ట్ లున్నాయి : సరోగసి, స్టాండప్ కామెడీ. ఈ రెండిటినీ కలిపి ఒక రిలేషన్ షిప్ కథ చేశారు. సరోగసి (అద్దె గర్భం) కథతో గతంలో సినిమా లొచ్చాయి. 1981 లో వి. మధుసూధనరావు దర్శకత్వంలో శోభన్ బాబు- జయసుధ నటించిన సంసారం -సంతానం’, 1993 లో ఏ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు- మహేశ్వరి నటించిన జాబిలమ్మ పెళ్ళి’, 2001 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో సౌందర్య- విక్రమ్ నటించిన ‘9 నెలలు’, 2022 లో హరి- హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన యశోద. అలాగే స్టాండప్ కామెడీ కథతో 2021 లో భాస్కర్ దర్శకత్వంలో అఖిల్- పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. వీటిలో యశోద తప్ప మిగిలిన సినిమాలన్నీ హిట్టయినవే.
       
అయితే ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా విడివిడి కథలుగానే వచ్చాయి. ఈ రెండిటినీ కలిపి
మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి అనే కొత్త కథగా చేశాడు కొత్త దర్శకుడు. ఒక సరోగసి కోరుతున్న హీరోయిన్, ఆమెతో పెళ్ళి కలలుగన్న స్టాండప్ కమెడియన్ హీరో. ఈ రెండు వ్యతిరేక పాత్రల్ని ఎదురెదురు పెట్టి కొత్త డైనమిక్స్ ని సృష్టించాడు. దీంతో కథకి బలమైన సంఘర్షణ ఏర్పడింది.
       
పైన చెప్పుకున్న తెలుగు సరోగసి సినిమాలు సహా ఇతర భాషల్లో వచ్చినవి (హిందీలో
మిమీ తప్ప) సరోగసి సమస్యతో బరువైన సెంటిమెంటల్ మెలోడ్రామాలే. ప్రస్తుత సినిమా ఇందుకు భిన్నంగా కామెడీ. ఒక స్టాండప్ కమెడియన్ కి తీవ్రమైన వ్యక్తిగత సమస్య పుడితే అతనేం చేస్తాడు? ఏడుస్తూ కూర్చోలేడు. స్టాండఫ్ కామెడీతో నవ్వించాల్సిందే. దీంతో ఈ సరోగసి కథ ఫన్నీ రోమాంటిక్ కామెడీ అయ్యే అవకాశమేర్పడింది.
       
అయితే దీన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ఇద్దరి విభిన్న కోరికలతో బలమైన సంఘర్షణ ఏర్పడినా
, దాని తాలూకు కథా కథనాలు బలంగా లేవు. కారణం ఎవరు కథ నడిపే ప్రధాన పాత్ర అవుతారనేది స్పష్టత లేకపోవడం. సరోగసితో సమస్య ఆమె పుట్టిస్తే, సమస్యనెదుర్కొనే అతనే ప్రధాన పాత్ర అవుతాడు. ఆ సమస్యని కథని ఎలా నడిపి పరిష్కరించుకుంటాడనేది ప్రధాన పాత్రగా అతడి లక్ష్యమే అవుతుంది. కాబట్టి అతడి స్టాండప్ కమెడియన్ పాత్రచిత్రణ ప్రధానంగా కథ వుండాలి.
       
2005 లో చందన్ అరోరా దర్శకత్వంలో పొట్టి కమెడియన్ రాజ్ పల్ యాదవ్ కి
, పొడుగు భార్య రీతూపర్ణా సేన్ గుప్తా తో మై మేరీ పత్నీ ఔర్ వోహ్ హిట్ కథ ఇలాటిదే. అతను ఏమీ జరగనట్టు పైకి నవ్విస్తూ బతికినా, లోపల పొడుగు భార్యతో ఇన్ఫీరియారిటీ, ఇన్ సెక్యూరిటీ, ఇంకొకడి మీద అనుమానం వంటి రకరకాల బాధలతో గించుకుచచ్చే బ్రహ్మాండమైన ఎమోషనల్ కామెడీ. మనకి నవ్వూ తెప్పిస్తుంది, కన్నీళ్ళూ తెప్పిస్తుంది. వ్యతిరేక పాత్రల మధ్య హీరోతో ఈ డైనమిక్సే మిస్సయ్యింది మిశె-మిపొ.
       
ఫస్టాఫ్ లో పదిహేను నిమిషాలపాటు అనూష్కా- జయసుధ తల్లీ కూతుళ్ళ పాత్రలతో విషాద కథ సినిమా ప్రారంభాన్ని నీరు గారిస్తే
, 15 నిమిషాల తర్వాత నవీన్ ఎంట్రీతో ఊపందుకుంటుంది. నవీన్ –అనూష్కాల మధ్య ఇంటర్వెల్ వరకూ రోమాన్స్ యూత్ అప్పీల్ తో ఫన్నీగానే సాగినా, సెకండాఫ్ షరా మామూలుగా అరగంట సేపు కథ లేక బోరు కొట్టే పరిస్థితి వస్తుంది. తర్వాత నవీన్ కామెడీతో హుషారు తెప్పించినా, క్లయిమాక్స్ లో ముగింపు  తెలిసి పోయేలా వుంటుంది. అనూష్కా తీసుకునే నిర్ణయానికి తగిన జస్టీఫికేషన్ లేకుండా. సమస్య అనూష్కా పాత్రదైనట్టు కథ నడపడంతో సీరియస్ అయిపోయింది సెకెండాఫ్.

నటనలు సాంకేతికాలు  

ఎప్పటిలాగానే నవీన్ పొలిశెట్టి కామెడీని రక్తికట్టించాడు. స్టాండప్ కమెడియన్ పాత్రతో పేల్చిన జోకులు సోషల్ మీడియా కాపీ జోకులు కాకుండా ఫ్రెష్ గా వున్నాయి. స్టాండప్ కమెడియన్ షో ఇవ్వడమంటే ఏకపాత్రాభినయం చేయడమే కాబట్టి తన అనుభవంతో అద్వితీయంగా చేశాడు. తన సీనియర్ అనూష్కాతో జోడీ మ్యాచ్ కాకపోయినా కామెడీతో కవర్ చేశాడు. తను ఏ సినిమా నటించినా ఒన్ మాన్ షో చేస్తాడు కాబట్టి ఇదీ అలాటిదే. కాకపోతే పాత్ర చుట్టూ కథ బలంగా లేదు. దాంతో పాత్రకుండాల్సిన భావోద్వేగాల్లేవు.
       
అనూష్కా సెంటిమెంటల్
, ఎమోషనల్ నటన ఫర్వాలేదుగానీ, ఇవి వుండాల్సింది నవీన్ పాత్రకి. అనూష్కా గ్లామర్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ గానీ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఆమెతల్లి పాత్రలో జయసుధ ఫర్వాలేదు. మురళీ శర్మ, నాజర్, తులసి తదితరులు వాళ్ళ పాత్రల్ని నిలబెట్టుకున్నారు. కమెడియన్ అభినవ్ గోమఠం ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందవచ్చు.
       
రాధన్ సంగీతంలో పాటలు సాధారణంగా వుంటే
, గోపీసుందర్ నేపథ్య సంగీతం, నీరవ్ షా ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఈ నవతరం రోమాంటిక్ కామెడీ కి విజువల్ అప్పీల్ ని చేకూర్చి పెట్టాయి. కొన్నే బలాలు, చాలా బలహీనతలున్న ఈ కొత్త దర్శకుడి సినిమాకి నవీన్-అనూష్కా పాత్రల కంటే వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రేక్షకుల్లో వున్న ఆకర్షణ కాపాడుతుందేమో చూడాలి. గతవారం విజయ్ దేవరకొండ - సమంతల ఖుషీ తో ఆకర్షణ వీకెండ్ తర్వాత 20 శాతానికి పడిపోయింది- కంటెంట్ లోపం వల్ల.

—సికిందర్