రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, నవంబర్ 2014, ఆదివారం

రివ్యూ..

స్క్రీన్ ప్లే తోనే జీవితం!
రచన- దర్శకత్వం : ఏఎస్ రవికుమార్ చౌదరి 
తారాగణం : సాయి ధరమ్ తేజ్, రెజినా కసాండ్రా, జగపతిబాబు, ప్రకాశ రాజ్,సాయాజీ షిండే, రఘుబాబు, షఫీ తదితరులు.
సంగీతం : అనూప్ రూబెన్స్ , ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర, కూర్పు : గౌతమ్ రాజు, కళ : రమణ, యాక్షన్ : గణేష్
బ్యానర్ : గీతా ఆర్ట్స్ – శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్    నిర్మాతలు : బన్నీ వాస్, శ్రీ హర్షిత్
విడుదల : నవంబర్ 14, 2014
***
మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో  సాయి ధరమ్ తేజ్ ప్రయోగం సాఫీగా జరిగిపోయింది. ఇక కక్ష్యలో ప్రవేశించడమే మిగిలింది. నింగి నంతా పర్చుకుని ఇప్పటికే  తళుక్కు మంటున్న బోలెడు తారల్లో  ఏ తారగా మెరుస్తాడో  ఇక అతడిపైనే ఆధారపడి వుంది. రిమోట్ ఎలాగూ గ్రౌండ్ స్టేషన్ లో వుంటుంది కాబట్టి, ఆ విషయంలో ఆందోళన చెందనవసరం లేదు.
          గత నాల్గేళ్ళుగా అజ్ఞాతంలో వున్న దర్శకుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరికి మెగా వారసుణ్ణి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసే ఖ్యాతి దక్కింది. ఏదో గేమ్ ఆడిస్తే తప్ప యువహీరో జెట్ స్పీడుతో దూసుకుపోలేడన్న నమ్మకం కొద్దీ కావొచ్చు- నితిన్ తో  ‘ఆటాడిస్తా’ లాంటి గేమ్ విఫలమయ్యాక, రిస్కు చేసి మళ్ళీ ఇంకో గేమ్ తో ఈ కొత్త మెగా హీరోని బరిలోకి దింపాడు.
          అల్లు అరవింద్, దిల్ రాజు లిద్దరూ ఈ బరువుని మోశారు. ఇద్దరికీ ఒక హిట్ చాలా అవసరమే. ఈ బెట్ బెడిసి కొట్టలేదు.
          రవికుమార్ చౌదరి పూర్వపు పేలవమైన టేకింగ్ ని పక్కనబెట్టి, ఈ సారి ట్రెండీ గా –ఆడియెన్స్ ఫ్రెండ్లీ గా వుండడం కోసం ప్రయత్నించడం వల్ల ఈ బెట్ బెడిసి కొట్టలేదు.
మరో మాస్ శీను మసాలా!
          తెలుగు రాష్ట్రాల్లో వున్న అనాథల్ని ఎవరు ఆదుకుంటున్నారో లేదో గానీ, తెలుగు సినిమాలని మాత్రం అనాథలే బతికిస్తున్నారు. అలాటి ఒక శీను (సాయి ధరమ్ తేజ్) అనే అనాథ ఈసారి ఏకంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తునే నిర్ణయించే గేమ్ ఆడేశాడు. తొలి సినిమాకి టెండర్ క్యారక్టర్, లవ్ స్టోరీ ఉండాలన్న నియమ నిబంధనలు ఇప్పుడు లేవు కాబట్టి, శీను సీన్ వన్ నుంచీ  రాఫ్ఫాడించేస్తూంటే ఈ సడెన్ జెర్కుకి అడ్జస్టయ్యే  స్టామినా కూడా ప్రేక్షకులకి వుండాలి. పాలకొల్లు నుంచి వచ్చి అతను హైదరాబాద్ లో సుపారీ కిల్లర్ మైసమ్మ (జగపతి బాబు) ని కలిసి తనని చంపెయ్యమని ఆఫరిస్తాడు. మైసమ్మ ఆరా తీస్తే తన ప్రేమ కథ చెప్పు కొస్తాడు. తను చదువుతున్న కాలేజీలోనే శైలూ (రెజినా కసాండ్రా) ని ప్రేమించాడు, ఆమె ఛీ కొడుతోందంటూ రకరకాల మలుపులతో, మెలికలతో చెప్పుకొస్తూ- మైసమ్మ ఒప్పుకున్న కాంట్రాక్టుకే  గట్టి షాకిచ్చే అసలు విషయం విప్పుతాడు.
          ఆ శైలూనే మైసమ్మ చంపబోతున్నాడు. ఇప్పుడు శీను ఛాలెంజి చేస్తున్నాడు. మైసమ్మ ఏం చెయ్యాలి? ఇదీ పాయింటు. ఇక్కడ్నించీ ద్వితీయార్ధం కథ.
          అప్పుడప్పుడే ఎన్నికలు జరిగి, గెలిచిన పార్టీ సీనియర్లు రెండు వర్గాలుగా చీలిపోయి సీఎం పదవికోసం పోటీ పడుతోంటే షఫీ (షఫీ) అనే టీవీ జర్నలిస్టు ఇద్దరి అవినీతి, అనైతిక బాగోతాలూ చేజిక్కించుకుంటాడు. సుపారీ తీసుకున్న మైసమ్మ  అతణ్ణి చావబాదుతాడు. అతన్నే కాదు, బాగోతం బైటపడే అవకాశమున్న శైలూని కూడా చంపే బాధ్యత అతడి మీద వుంది. శైలూ కేం సంబంధం? ఇదీ సస్పెన్సు.
          నేపధ్యంలో ప్రభాకరరావు ( ప్రకాష్ రాజ్), గంగా ప్రసాద్ ( సాయాజీ షిండే) వర్గాలు, ప్రత్యక్షంగా మైసమ్మా అతడి గ్యాంగు, వెంట ద్వేషించే శైలూ..ఇలాటి పరిస్థితుల్లో శైలూని  శీను ఎలా కాపాడాడు? ఇదీ విషయం.
ఎవరెలా చేశారంటే...
          హడావిడీ చేశారు. పట్టుకోలేనంత స్పీడుతో పరుగులు తీశారు. హీరో సరే సరి, పాత హిందీ హీరోయిన్ సాధన పేరు మీదుగా పాపులరైన ‘సాధన కటింగ్’ అనే హేర్ స్టయిల్ తో అబ్బిన చైల్డిష్ లుక్స్ తో, కావలిసనంత మాస్ నటన పాత కాపులా రుద్ది అవతల పడేశాడు. శరీరం, ముఖ్యంగా తొడలు లావెక్కి డాన్స్ మూవ్ మెంట్స్ లో అవి కొట్టొచ్చినట్టు కన్పించసాగాయి. ఫైట్స్ కూడా స్పీడే. డైలాగ్ డెలివరీ, వాయిస్ బలంగానే వున్నాయి, కానీ హావభావాల దగ్గర అంత పట్టులేదు. పైగా పాత్ర ఒకటే పరుగు తీయడం వల్ల కాస్తయినా ఊపిరి తీసుకునే స్పేస్ లేక – అతను హృదయాల్లో ఒదిగిపోయే సీన్స్ కొరవడ్డాయి. ఎక్కడ మన మనసులో ముద్ర వేశాడంటే ఏమీ చెప్పుకోలేం. కనీసం ఒక ఫీల్ తో కూడుకున్న క్లోజప్ కూడా! అతన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు కావలసినంత టెక్నికల్ హంగామాకి పాల్పడ్డాడే తప్ప అందులో ఆత్మని పోయలేకపోయాడు. జ్యూనియర్ ఎన్టీఆర్ నటించిన  ‘అశోక్’ లో ఆ పాత్ర ఎలా వున్నా, ఇంటర్వెల్ తర్వాత  వచ్చే సోలో మెలోడీ పాటలో లయబద్ధంగా స్టెప్పు లేస్తూ అతను చాలా హోమ్లీగా హత్తుకు పోతాడు.
          హీరోయిన్ రెజీనా ది సీరియస్ పాత్ర కావడంతో ( రోమాంటిక్ కామెడీలో శోకరసం తో కూడిన సీరియెస్ నెస్ కి  తావులేదు, అలాగని రోమాంటిక్ కామెడీ కాని ఈ యాక్షన్ కామెడీలో నూ సీరియెస్ నెస్ కి చోటు వుండ కూడదు)  గ్లామర్ కోషెంట్, యూత్ అప్పీల్  వగైరా కొరవడ్డం తో బాటు, రోమాన్స్ కీ అవకాశం లేకుండా పోయింది. ఈ  నేపధ్యానికి  తగట్టే ఆమె ముఖ కవళికలూ వున్నాయి.
          మరోసారి జగపతిబాబు విలన్ గా ముద్రవేశాడు. గమ్మత్తేమిటంటే  హీరో కంటే కూడా జగపతిబాబే ఆ పాత్రలో గుర్తుండి పోతాడు. కామిక్ విలనీ ఎప్పుడూ కలర్ ఫుల్ గానే హైలైట్ అవుతుంది.
          కామెడీ ని మోసిన ఇంకో ముఖ్య నటుడు రఘుబాబు. ఇక బ్రహ్మానందం అవసరమే రాలేదు! ఇతర పాత్రల్లో నటించిన వాళ్ళందరూ –ప్రకాష్ రాజ్ –సహా కామెడీకి కావలసినంత తోడ్పడ్డారు.
          సంభాషణల పరంగా డైమాండ్ రత్నం రాసిన డైలాగు ‘మనిషి అనేవాడు బ్లడ్ రిలేషన్ ని వదిలేస్తాడేమో గానీ, మనీ రిలేషన్ ని వదులుకోడు’ టాప్ డైలాగ్. సంగీతం, ఛాయాగ్రహణం, పోరాటాలు ఇతర సాంకేతికాంశాలూ ఓకే. ముఖ్యంగా స్టయిలిష్ లుక్ తీసుకు రావడానికి ఎడిటింగ్ చాలా తోడ్పడింది- స్మాష్ కట్స్, జంప్ కట్స్ వగైరాలతో.  రీ రికార్డింగ్ విషయాని కొస్తే – రైల్వే ట్రాక్ మీద హీరో మైసమ్మ గ్యాంగుతో అభిమన్యుడిలా తలపడుతున్నప్పుడు, ఆ సన్నివేశానికి ఉత్తేజం తీసుకురావడానికి ఉద్వేగ భరిత పాట వేయడం వరకూ ఓకే- హిందీ ‘గ్యాంగ్ స్టర్’  లో ‘యా ఆలీ’ పాట వేసినట్టుగా- కానీ, దానికది అదొక ఘట్టం మాత్రమే! దాంట్లో కి తర్వాతి మెయిన్ షో డౌన్ ని కూడా కలిపేసి గుంపులో గోవిందా చేయకూడదు. అది ముగిసి, అదే చోట ఇక ఫైనల్ గా హీరో మైసమ్మ తో తలపడుతున్నప్పుడు- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సన్నివేశం దానికదే ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. ఆ ప్రత్యేకత గాంభీర్యం!  దీనికి మునుపు ముఠా తో పోరాడినప్పటి నేపధ్య సంగీతాన్నే గోలోగోలగా కంటిన్యూ చేస్తే ఆ గాంభీర్యం కాస్తా, ఎదురుచూసిన హైలైట్ కాస్తా మట్టి కొట్టుకు పోయింది. పూర్తి నిశ్శబ్ద వాతావరణంలో, కేవలం వాళ్ళిద్దరి ఎమోషన్స్ తో, పిడి గుద్దుల  చప్పుళ్ళతో మాత్రమే రక్తికట్టించాల్సిన ఘట్టమది- ‘షోలే’  లో ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ వచ్చి హతమారు స్తున్నప్పుడు, విన్పించే ఒక్క ఆ గన్ షాట్స్ లాగా!
          కథలోనే ఆత్మ గురించి ఆలోచించ నప్పుడు టెక్నికల్ విలువలకీ అది పట్టలేదు. ఎంత రిచ్ గా తీశామని కాదు- సినిమా వీడియో గేమ్ కాదేమో? దాని రక్త మాంసాల గురించి కూడా కాస్త పట్టించుకోవాలేమో?
స్క్రీన్ ప్లే సంగతులు
          ఈ మధ్య వస్తున్న చాలా స్టార్ సినిమాల స్క్రీన్ ప్లేలు ఏవైనా కొత్త టెక్నిక్స్ తో కథ చెప్పడంగాక, ఎప్పుడు ఈ సోదిని ఇంటర్వెల్ కి చేరవేస్తామా, అక్కడ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసి పారేసి, ఎప్పుడు సెకండాఫ్ లోకి దూకేస్తామా అన్నట్టుగా ఉంటున్న విషయం  తెలిసిందే. ఫస్టాఫ్ ని కేవలం సెకండాఫ్ కి బల్ల కట్టుగా ఉపయోగించుకుంటున్నారు. విషయం లేకుండా ఏదో కాలక్షేపం మాత్రంగా  కానిచ్చేస్తున్నారు. ఆ సెకండాఫ్ అయినా విషయం వుంటుందా అంటే అదీ లేదు. విషయంతో సంబంధంలేని కామెడీ ట్రాకుతో నడిపేసి చివర్లో మొక్కుబడిగా విషయం  చెప్పేయడం. ఈ సెకండాఫ్ సిండ్రోమ్ అనేది ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా రకరకాలుగా వెంటాడుతున్నదే. క్రియేటివిటీ కోల్లేరవడం అంటారు దీన్ని. కొల్లేటి సరస్సులో బల్లకట్టు విన్యాసాలు.
          ప్రస్తుత సినిమాకి అదృష్ట వశాత్తూ ఇది దాపురించలేదు.  ఉన్న రొటీన్ కథని ఏదో భిన్నంగా చెప్పాలని తపన పడ్డాడు. ఐతే ఈ భిన్నత్వం ఇందాక పైన చెప్పుకున్న హీరో-విలన్ల మధ్య షోడౌన్ లో రసోత్పత్తిని అంతకి ముందు ఫైట్ ఆర్.ఆర్ తోనే ఫ్లాట్ గా చదును చేసేసి నట్టు- ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ నే సెకండాఫ్ లోనూ ప్రయోగించి- రెంటికీ తేడా లేకుండా చేశాడు. అంతసేపూ ఫస్టాఫ్ టెక్నిక్ తో ప్రేక్షకులు అలసిపోతారు- సెకండాఫ్ లో మళ్ళీ దాన్నే ప్రారంభించాడమంటే రిలీఫ్ ఏదీ లేదు, కొత్త ఫీల్ ఏదీ లేదు. ఈ తరహా కథనాన్ని ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లోనూ చూడొచ్చు. 

      ఈ టెక్నిక్ ని - అంటే ఎండ్ సస్పెన్స్ తో నడిచే ఇలాటి కథలతో అనుసరించాల్సిన  టెక్నిక్ ని-1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ‘ధువాఁ’ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు. దురదృష్ట మేమిటంటే, ఎండ్ సస్పెన్స్ తో వచ్చే, వస్తున్న సవాలక్ష సినిమాలు ఈ టెక్నిక్ ని పట్టుకోకపోవడంతో అట్టర్ ఫ్లాపవుతూ వస్తున్నాయి. నవలకి తప్ప దృశ్య మధ్యమానికి ఎండ్ సస్పెన్స్ కథలు పనికి రావని ఇప్పటికీ తెలుసుకోవడం లేదు.
          దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి పైన చెప్పుకున్న బ్రిటిష్ థ్రిల్లర్ టెక్నిక్ తోనే ఇంటర్వెల్ దగ్గర ఎండ్ సస్పెన్స్ ని సమర్ధవంతంగా బ్లాస్ట్ చేశాడు. ( ఇది కాకతాళీయమే కావొచ్చు- ఈ బ్రిటిష్ సినిమాలో గిటార్ తో విన్పించే థీమ్ మ్యూజిక్ లాంటిదే అక్కడక్కడా హీరో ని హైలైట్ చేస్తున్నప్పుడు అనూప్ రూబెన్స్ విన్పించాడు)  అప్పటివరకూ నడించింది ఒక దోషిని పట్టుకునే పన్నాగమే నని మనకి తట్టదు. కాకపోతే బ్రిటిష్ సినిమాలో ఆ దోషిగా ఏన్ బాక్స్టర్ దొరికిపోతుంది, హిందీలో రాఖీ దొరికిపోతుంది, ఇప్పుడు తెలుగులో జగపతి బాబు!

     ఇలాటి స్క్రిప్టుల్లోనే రివ్యూలు  రాయడానికి ఆనందం దొరుకుతుంది. ‘మనం’ తర్వాత ఆ ఆనందం ఇదే. దీంతో అయిపోలేదు. అసలు మొత్తం కథలోనే ఒక ఎండ్ సస్పెన్స్ సమస్య వుంది. అది ప్రధాన విలన్ చిట్ట చివర్లోనే రివీలయ్యే సస్పెన్స్. అప్పటివరకూ ఆ విలన్ వున్నట్టు మనకే కాదు, హీరోకీ తెలీదు. మైసమ్మ పాత్ర లేకపోతే, ఈ కథ ఇలా వుండేది : ఎవరు తనమీద, హీరోయిన్ మీదా హత్యాయత్నాలు చేస్తున్నారో తెలీక, హీరో ఆ దాడుల్ని తిప్పి కొడుతూ మాత్రమే ఉండిపోయే రియాక్టివ్ ( అంటే పేలవమైన పాసివ్) క్యారక్టర్ గా వుండి  పోయేవాడు- ‘అశోక్’  లో ఇలాటి సిట్యుయేషన్ లోనే ఎన్టీఆర్ పాత్ర వుండి  పోయినట్టు!
          చిట్ట చివర్లో ఆ విలన్ని కనుక్కుని అప్పుడు మాత్రమే నేరుగా తలపడేవాడు.
అప్పటివరకూ విలన్ని దాచడం ఎండ్ సస్పెన్స్ కథ. ఇలాటి కథలో హీరో పాత్ర పేలవమై పోతుంది. ఏకపక్షంగా కథ నడుస్తూ వుంటుంది. దిక్కుతోచక హీరో తిరుగుతూంటాడు. మనల్ని దిక్కులు చూసేలా చేస్తాడు.
          ఈ  సమస్యని కవర్ చేయడానికే మైసమ్మ పాత్ర పనికొచ్చింది. దీంతో హీరో విలన్ కోసం వెతుక్కుంటు న్నాడన్నవిసుగు పుట్టలేదు. కళ్ళ ముందు మైసమ్మే విలన్ గా కన్పిస్తున్నాడు, అతడి మనుషులే వెంట పడ్డారు, అతడితోనే హీరో తలపడుతున్నాడు- ఇలా ఎండ్ సస్పెన్స్ అనే ఆత్మహత్యా సదృశ ఫీల్ కలక్కుండా కథ  నడుస్తూ- ఇక చివర్లో అసలు విలన్ రివీలయ్యే టప్పటికి మరో కొత్త మూడ్ లోకి ప్రేక్షకులు సర్దుబాటు అయ్యేట్టు ప్లే అయ్యింది.
          కథలో స్ట్రక్చర్ పరంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి పాత్ర పనికొస్తే అది నిలబడుతుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులుగా మనసంగతి వదిలేస్తే, అసలు మైసమ్మకి ఆ కాంట్రాక్టు ఇచ్చిన అసలు కుట్రదారు ఎవరా అని హీరో ఆలోచించక పోవడం అతడి కుశాగ్రబుద్ధి పాత్ర చిత్రణకే గొడ్డలి పెట్టు.  సెకండాఫ్ లో హీరోయిన్ చెప్పే వరకూ అతను తెలుసుకోడు.           ఇలాకాక, మైసమ్మ గురించి మొత్తం ముందే తెలిసి ఎలా వచ్చాడో- అలా అప్పటికి ప్రధాన విలన్ గురించి కూడా హీరో కి అంత ముందే తెలిసివుండాలి. అది చివర్లో తనే రివీల్ చేయాలి. అప్పుడీ పాసివ్ నెస్ పోయేది. మొత్తం కథా ప్రపంచంలో ఏం జరుగుతుందో హీరోకి తెలియకుండా వుండకూడదు కదా?.
          ఇక క్లైమాక్స్ కూడా జర్నలిస్టు చేతికి వదిలేశాడు. ఇలా ఎప్పుడు వదిలేస్తారంటే- ప్రాణాలు వదుల్తున్నప్పుడు! ఒక పాత్ర క్లైమాక్స్ లో ప్రాణాలు వదుల్తూ  లక్ష్యం పూర్తి చేయమని ఇంకో పాత్రకి అందిస్తుంది. అప్పుడా అందుకున్న పాత్ర ఫ్లాగ్ క్యారక్టర్ అవుతుంది. ఇక్కడ లెక్క ప్రకారం జర్నలిస్టు పాత్ర వుండకూడదు. చనిపోతూ ఆ ట్రంప్ కార్డు హీరో ప్లే చేసుకోవడానికి ఇచ్చేసి అడ్డుతొలగాలి.

-సికిందర్