రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జనవరి 2017, శనివారం

రివ్యూ!

రచన –దర్శకత్వం : సతీష్ వేగ్నేశ
తారాగణం : శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ, ఇంద్రజ, నరేష్, తనికెళ్ళ భరణి తదితరులు
పాటలు : సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, సంగీతం : మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
బ్యానర్ :  శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, నిర్మాత : దిల్ రాజు
విడుదల : జనవరి 14, 2017
***
తిరిగి ఈ సంవత్సరం కూడా శర్వానంద్ సంక్రమించాడు సంక్రాంతికి. గత సంవత్సరం ముగ్గురు పెద్ద స్టార్ సినిమాల మధ్య (సోగ్గాడే చిన్నినాయనా, డిక్టేటర్, నాన్నకు ప్రేమతో) తను ‘ఎక్స్ ప్రెస్ రాజా’ గా  వచ్చి తన బిజినెస్ తాను చేసుకున్నాడు. మళ్ళీ ఈసారి మెగాస్టార్,
నటసింహుడు
ల భారీ సినిమాల మధ్య తానూ
దిగిపోయాడు పెద్ద నిర్మాత దిల్ రాజు అండదండలతో. ఇద్దరూ కలిసి
ఈ సంక్రాంతికి సంక్రాంతి సినిమా ఇద్దామని సంకల్పించారు. సంక్రాంతికి విదేశాల్ని అంటిపెట్టుకున్న ఎన్నారై పరివారాన్ని  వూరికి రప్పించే కథ. ఈ కథకి ఎలాటి ముగ్గులేసి ప్రేక్షకుల్ని ఆకర్షించారో 
ఈ కింద చూద్దాం...



కథ     గోదావరి జిల్లా ఆత్రేయపురం. ఆ పురంలో రాజుగారు (ప్రకాష్ రాజ్) జానకమ్మ (జయసుధ) ల కాపురం. ఇద్దరు పెళ్ళయి పిల్లలున్న కొడుకులు, ఒక కూతురూ తలో దేశంలో స్థిరపడి తల్లి దండ్రుల్ని మర్చిపోయారు. పండగలకి పిలిచినా రాలేని బిజీగా వుంటున్నారు. ఇప్పడు సంక్రాంతి వచ్చింది- వాళ్ళని ఎలాగైనా పిలవాల్సిందే నని భీష్మించుకుంది జానకమ్మ. రాజు గారితో మాటా మాటా పెరిగింది- అయితే తనే వాళ్ళ దగ్గరికి వెళ్లి పోతానంది. రాజుగారో ప్లానేసి కొడుకుల్ని, కూతుర్నీ రప్పించారు ఎట్టకేలకు. ఆల్రెడీ ఒక మనవడు రాజు (శర్వానంద్) రాజుగారితోనే వుంటున్నాడు. ఆ వచ్చిన పరివారంలో తనకి మరదలయ్యే  నిత్య (అనుపమా పరమేశ్వరన్) కూడా వుంది. ఇద్దరూ షికార్లు సరదాలు చేసుకుంటూ వున్నారు. రాజు గారి ప్లానుకి కంగారు పడి వచ్చిన వాళ్ళంతా కూడా సరదాగా గడుపుతున్నారు. ఇంతలో ఒక సంఘటన జరిగి,  రాజు గారు ఎలాటి ప్లానేసి ఈ పరివారాన్ని రప్పించాడో  జానకమ్మ కి తెలిసిపోయి- గొడవయ్యింది. ఇంతకీ ఏమిటా ప్లాన్? ఏమిటా  గొడవ? ఆ ప్లానుతో రాజుగారు ఏం సాధించాలనుకున్నాడు? ఈ ఉద్రిక్త పరిస్థితిలో రాజు ఏం చేశాడు? - అన్నవి వెండి తెర మీద తిలకించాల్సిందే. 

ఎలావుంది కథ

          కొందరు ఎన్నారైలు స్వదేశంలో వుంటున్న తమ తల్లిదండ్రులతో పరోక్ష సంబంధాలు నెరపుతున్నారనీ, ప్రత్యక్ష ఆనందాలకి వాళ్ళని దూరం చేస్తున్నారనీ, ఇది తప్పనీ చెప్పే కథ. ఈ కథకీ, క్రితం సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కథకీ పోలిక ఏమిటంటే, రెండూ ఒకటే పాయింటుతో మొదలవుతాయి. అందులో కథాప్రారంభంలోనే నాగార్జున- లావణ్యలు  విదేశం నుంచి స్వదేశానికి ఎందుకొస్తారో,  ఇందులో కూడా విదేశాల్లో వుంటున్న కొడుకులూ కూతురూ అందునిమిత్తమే కంగారుగా వస్తారు- కాకపోతే ఇక్కడ ఈ పాయింటు సీనియర్ పాత్రలైన ప్రకాష్ రాజ్- జయసుధల మీద వుంటుంది.  అయితే నాగార్జున హీరోగా వచ్చిన ఆ కథతో  పాయింటుని యూత్ అప్పీల్ తో చాలా వినోదాత్మకంగా చూపిస్తే, యూత్ స్టార్ అయిన శర్వానంద్ తో  అదే ఈ కథ పాయింటుని యూత్ అప్పీల్ కి దూరంగా సీరియస్ గా  చూపిస్తారు. 2009 లోవచ్చిన సిద్ధార్థ్ –తమన్నాలు నటించిన ‘కొంచెం ఇష్టం- కొంచెం కష్టం’ లో ఎలాగైతే అది యూత్ అప్పీల్ కి వ్యతిరేకమైన ప్రకాష్ రాజ్- రమ్య కృష్ణల పెద్ద పాత్రల కథయ్యిందో, ఇదీ అలా ప్రకాష్ రాజ్- జయసుధ ల పెద్ద వయసు పాత్రల కష్టాల కాపురం కథయ్యింది. 


ఎవరెలా చేశారు

       ఇది ప్రకాష్ రాజ్ ప్రారంభించి ప్రకాష్ రాజే ముగించే తన పాత్ర కథ కావడంతో హీరోగా శర్వానంద్ కి పని లేకుండా పోయింది. పాసివ్ పాత్ర అన్నమాట. చిట్ట చివర్లో నైనా హీరో అన్పించుకోవాలన్నట్టు,  కథని ముగించడానికి ముందుకొస్తూ  ‘ఆపని’ చేసింది నేనే అంటాడు. మరి ఆ పని చేసుకొస్తున్నట్టు ఎక్కడా కన్పించడు. అంతగా   తాత - నానమ్మల మధ్య తలెత్తిన సమస్య తనకి తెలిసే వుంటే, ఆ వచ్చిన కొడుకులూ, కూతురూ ఎలాటి వాళ్ళో తెలిసీ, పెద్ద కొడుకుని దూరమైన పాతికేళ్ళ నాటి అతడి ప్రియురాలితో కలిపి సంబర పడ్డమేమిటి?  తల్లిదండ్రుల్ని కలవాలని లేని వాడికి ప్రియురాలు గుర్తొచ్చిందా? ఆ కోరిక తను  తీర్చాలా? రెండో కొడుకుతో కూతురి భర్తకి మాటల్లేక పోతే ఏమయ్యింది- మాటలు కలపాలని అంత పథకమెందుకు- ఒక హీరోగా తను రిపేరు చేయదల్చుకుంటే- రిపేరు చేయాల్సింది  తాతానానమ్మలతో ఈ పరివారం నిర్లక్ష్యాన్నికదా? కథ దీని గురించి కాదా? చివర్లో 'ఆ పని' చేసింది నేనే అంటాడు- ఆ లీగల్ మ్యాటర్ తాతయ్య ప్రమేయంలేకుండా తనెలా చేస్తాడు- అలా లీగల్ నోటీస్ ఇచ్చిన అర్భక లాయర్ ఎవరు? ఇద్దరూ కలిసి కటకటాల్లో వుంటారు. శర్వానంద్ పాత్రకి ఇవన్నీ ఉత్త నాన్సెన్సే. అతను ఇంకా చేసిందల్లా-     వూళ్ళో నేటివిటీ పేరుతో రకరకాల సరదాలు చేసుకుంటూ దసరా బుల్లోడిలా తిరగడమే.  కనీసం సంక్రాంతి సంబరాలైనా చేసుకుంటే బావుండేది. సినిమా అంతా  సంక్రాంతి పండగ నేపధ్యంలోనే నడుస్తుంది మరి! ఆ పండగ ఎక్కడుందో సీన్లలో కనపడదు. తను గ్లామర్ గా, ఫన్నీగా, రోమాంటిక్ గా, డైనమిక్ గా కన్పించేవన్నీ కథతో సంబంధం లేని వ్యవహారాలే. కథలో ఇన్వాల్వ్ కానీ హీరో కథ అన్నమాట. 

          ఇక అనుపమా పరమేశ్వరన్ రొటీన్ గా కొత్తగా చూస్తున్న పల్లెని అమాయక  ప్రశ్నలేస్తూ ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడ్డం, డ్యూయెట్స్ పాడ్డం వగైరాలతో గ్లామరస్ గా చిలిపిగా కన్పిస్తుంది. ఇది ఫారిన్ నుంచి వచ్చే మూస పాత్ర. ఐటీ పరివ్యాప్తమైన ఈ రోజల్లో కూడా ఎన్ని సినిమాల్లోనైనా దేశం గురించి తెలీని ఇవే అమాయక పాత్రలు. మారిన  పరిస్థితుల్ని బట్టిగాక ఇదివరకే మోడల్ గా వున్న మూస  పాత్ర చిత్రణలు పెట్టేసి రాసేయడం చాలా తేలిక. ఎవరైనా ఈ తేలిక పనే కానిచ్చేస్తారు. పది కోట్ల బడ్జెట్ ఇచ్చినా సరే.


           ప్రకాష్ రాజ్ ది లాజిక్ కి అందని పాత్ర. తను తీసుకునే నిర్ణయంలో లాజిక్ లేకపోగా, అపరిపక్వంగానూ కన్పిస్తుంది. కుటుంబ కథల్ని, కుటుంబ సంబంధాల్ని లాజిక్ లేకుండా సృజనాత్మక  స్వేచ్ఛ అనుకుని పై పైన రాసేసి తీసేస్తే ఇబ్బందికరంగా వుంటాయి. కుటుంబాల్లో ఎవరూ ఇలా చేయరు. ఇదే తను గతంలో ఒక జంటకి ఉద్భోదించి వుంటాడు ప్రకాష్ రాజ్ - ఇప్పుడు ఆ జంట చేయబోయిన తప్పుడు  పనే తను చేసేస్తాడు. సర్దుబాటుల గురించి ఆ జంటకి చెప్పిన తనే, భార్యతో ఇగోలకి పోయి అలాటి సిల్లీ నిర్ణయం తీసుకుంటాడు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాకి ఎస్సెట్- అయితే  కథ- ఆయన మీద వుండాల్సింది కాదు, అదీ  ఇలా వుండాల్సిందీ  కాదు.



          జయసుధ  విషాదంగా, ముభావంగా వుండే సీన్లే ఎక్కువ. పిల్లల్ని చూడాలన్న ఆమె పాత్ర సమస్యని ప్రకాష్ రాజ్ పాత్ర సున్నితంగా హాయిగా సులువుగా తీర్చేయాల్సింది పోయి, అనవసరంగా డిప్రెషన్ లోకి తోసేశాడు. 

          మిగిలిన పాత్రల్లో కామెడీకి నరేష్, ఇంకా ఇతర జ్యూనియర్ కమెడియన్లూ వున్నారు. వీళ్ళు అక్కడక్కడా  బిట్లతో కామెడీని తెచ్చి అతికిస్తూంటారు. హీరో హీరోయిన్లు రోమాంటిక్ గా  వున్న సమయంలోనూ కామెడీ తృష్ణ  తీర్చుకుంటూంటారు. ఈ కామెడీని బిట్లు గా వేరే చూస్తే బావుంటాయేమోగానీ, కథతో కలిపి కాదు. కథేమిటి? కథే లేదు. ఎలా లేదో తర్వాత చూద్దాం. కాబట్టి కథే లేనప్పుడు కామెడీ బిట్లే  కథయిపోయింది. 

          ఇక విక్కీ జే మేయర్ పాటలు మాత్రం హుషారుగా వున్నాయి. అయితే సాహిత్యాన్ని గుర్తు పెట్టుకోగల  క్యాచీ క్రేజీ పదాలేవీ పలకవు. సమీర్ రెడ్డి ఛాయగ్రహణం పల్లె వాతావరణాన్ని బాగానే నయనానందకరం చేసింది గానీ, ఈ కనువిందులో సంక్రాంతి సంబరాలు కరువయ్యాయి. 

చివరికేమిటి?

   ఎన్నారైలూ - సంక్రాంతి పండగా అనే రెండు అంశాల ఆధారంగా తల్లిదండ్రుల సమస్య తీర్చే  కథ ఇదయిప్పుడు- దేనికీ నిజమైన న్యాయం జరిగిందా అంటే లేదనే చెప్పాలి- మచ్చు కోసం అన్నీ, మెచ్చు కోసం ఏవీ కావు అన్నట్టుంది. పండగ వాతావరణమైనా సరీగ్గా చూపించడానికి మొహమాట పడ్డారు. నాల్గు ముగ్గులేసి, పాటలో ఓ భోగి మంటేసి, కొన్ని పిండి వంటలు తినేస్తే అదే  సంక్రాంతి సంబరాలు అన్నట్టుగా సరిపుచ్చారు. ఎన్నారైలని సంక్రాంతికి స్వస్థలాలకి రమ్మన్నప్పుడు సంక్రాంతి పండగని ఎలా చూపించాలి- పంటలు,  పంట చేతికొచ్చిన రైతులు, కళ్ళాల్లోంచి బళ్ల మీద బస్తాలు, హరిదాసులు, గంగి రెద్దులు, పగటి వేషగాళ్ళు, జానపద వినోదాలు, ఎడ్ల బళ్ల పందాలు,  కోడిపందాలు, పేకాట జూదాలు, కోర్టు ఉత్తర్వులతో పోలీసులు, కొత్త అల్లుళ్ళ రాకలు, మందుకొట్టి కరకరలాడే కోడి కూర తెగ నంజుకోవడాలూ- లాంటి దృశ్యాల్ని ఉన్న ఒక్కో జ్యూనియర్ కమెడియన్ కి అప్పగించినా మొత్తం టాంటాం చేసి పెట్టేవాళ్ళు సంబరాల్ని. ఆ పెట్టిన కామెడీ బిట్లేవో  ఈ సంస్కృతీ సాంప్రదాయాల మీదే పెట్టి వుంటే చాలా న్యాయం జరిగేది ఈ రెండున్నర గంటల సంక్రాంతి నేపధ్య కథకి - ప్రత్యేకంగా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాని ఆర్నెల్ల క్రితం ప్లాన్ చేసినప్పుడు. సంక్రాంతి అంటే ఇంతే కాదు- అందిన వాహనాలందుకుని రోడ్ల మీదా, పట్టాల మీదా భారీ యెత్తున జనం పరుగులు తీయడం కూడా – టోల్ గేట్ల దగ్గర తిరునాళ్ళు జరుపుకోవడం కూడా. నగరాలు పల్లె బాట పట్టే జన సందోహం- దీన్ని సొమ్ము చేసుకునే శక్తులు. సంక్రాంతికి విమానాల మీద ఎన్నారైలు కాదు, ముందు నగరాల నుంచి ప్రజలు చేరుకోవడానికి పడే పాట్లని సెటైరికల్ గా చూపించి ప్రేక్షులకి కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు. 

      కథ ప్రకాష్ రాజ్ తీసుకునే నిర్ణయంతో మొదటి రెండు సీన్లలోనే ప్రారంభమవుతుంది. అప్పుడు  ఫారిన్ లో వున్న పరివారం  తల్లి అయిన జయసుధ పాత్రని వెంటనే  ఫోన్లు చేసి అడగరు. పోనీ వూరికి వచ్చాకైనా అడగరు. ఎంజాయ్ చేస్తూంటారు. మధ్యలో ఎప్పుడో అల్లుడు గుర్తు చేస్తే అలాగే అమ్మని అడుగుతానంటుంది కూతురు. రోజులు గడుస్తూంటాయి. ఆ అమ్మనడిగే సీనే రాదు. ఈ మాత్రం దానికి ఈ పరివారమంతా ఇక్కడికి రావడమెందుకో అర్ధంగాదు. ఎవరికైనా తండ్రి ఫోన్ చేసి - ఉదాహరణకి –అమ్మకి జబ్బు చేసిందంటే వెంటనే ఆ  అమ్మతో ఫోన్లో మాటాడడం సహజ మానవ స్పందన. దీన్ని దర్శకుడు ఎందుకాపాడంటే, అలా జరిగితే  అక్కడే ఈ కథ మూడో సీనుకే అయిపోతుంది గనుక !!!


          వచ్చాక అల్లుడు గుర్తు చేశాకనైనా కూతురు అమ్మని అడక్క పోవడానికి కూడా కారణం ఇదే- కథ అక్కడే అయిపోతుంది!!!

    ఇక ఇంటర్వెల్లో అమ్మకి విషయం తెలిసిపోయినా – ఇంటర్వెల్ తర్వాత వెంటనే కథ ముగిసిపోకుండా కామెడీలూ – లవ్ సీన్లూ వేస్తూపోయి ఇక క్లయిమాక్స్ కే - అమ్మకి తెలిసి పోయి పెండింగులో వున్న విషయంతో అమీతుమీ!!! 

        ఇంత రెడ్ టేపిజమా కథతో!!! అంటే ఓ ఐదారు సీన్లు  మాత్రమే వుండే కథని  కామెడీ మసాలా సీన్లతో బన్ మస్కాచేశారన్న మాట!!!
        సీనియర్ నిర్మాత దిల్ రాజు కాస్త పండగ పూటయినా కుటుంబ కథల్లో మానవ ప్రవర్తనని మానవ ప్రవర్తనలాగా చూపించి ఆనందపరిస్తే బావుంటుంది. 
        ప్రేక్షక్షులు కథా యూత్ అప్పీల్ అని పెట్టుకోకుండా  కామెడీ సీన్ల కోసం ఈ సినిమాని దర్శించుకో వచ్చు.


-సికిందర్
http://www.cinemabazaar.in