రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, ఏప్రిల్ 2015, మంగళవారం

అప్పీల్ ప్లీజ్!

 రచన- దర్శకత్వం  : సతీష్ కార్తికేయ 
తారాగణం : క్రాంతి, శ్రీదివ్య, హేమంత్, రంగనాథ్, ఎమ్మెస్, శ్రీనివాస రెడ్డి, కృష్ణ భగవాన్, ధన్ రాజ్
సంగీతం : విజయ్ గొర్తి, ఛాయాగ్రహణం :  రాజేంద్ర కోసాని
బ్యానర్  : కాస్మిక్ ఇమాజినేషన్స్ ప్రొడక్షన్,  నిర్మాత : పి. వివేకానంద వర్మ
విడుదల : 17 ఏప్రెల్ 2015
***
కొత్త దర్శకులు ప్రతియేటా కనీసం ఓ వంద మంది దాకా పరిచయమౌతున్నారు తెలుగు సినిమాలతో. ఆ ఒక్క సినిమాతోనే  మళ్ళీ  కన్పించకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సంవత్సరం ఇంకో వందమంది వచ్చిపోతున్నారు. ఇదొక చక్ర భ్రమణంలా రిపీటవుతూనే ఉంటోంది. ఫీల్డులో వివిధ శాఖల్ని పోషించడానికీ, రెండు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడకుండా వారం వారం వాటికి టంచన్ గా ఫీడింగ్ ఇవ్వడానికీ,  తమ వంతుగా  నిర్మాతల్ని బలి తీసుకుని, లెక్క కోసం ఓ వంద సినిమాలు తీసేసి అప్పగించి వెళ్లి పోతున్నట్టుందే తప్ప- తాము నిలదొక్కుకునే పాపాన పోవడం లేదు. మొదటి సినిమా పట్టుకోవడానికి ఎన్నేళ్ళు తిప్పలు పడతారో, మళ్ళీ అన్నేళ్ళు రెండో సినిమా కోసం కష్టాలు తప్పడం లేదు. నూటికి 99 శాతం ఇక రెండో సినిమా అనేదే లేకుండా కాలగర్భంలో కలిసిపోతున్నారు. నిజానికి మొదటి సినిమాని ఏవరేజిగా నిలబెట్టుకో గల్గినా కెరీర్ కంటిన్యూ అవడానికి పెద్దగా అవరోధం వుండదు. మొదటి సినిమాతోనే తమ కెరీర్ కి డెత్ వారెంట్ రాసుకోవడం తెలియకుండానే జరిగిపోతోంది. మొదటి సినిమా పట్టుకోవడానికి ఇన్నేళ్ళు కష్ట పడ్డావు కదా, దీని తర్వాత మళ్ళీ ఇదే స్ట్రగుల్ కంటిన్యూ అయితే నీ సినిమా డ్రీమ్స్ కి అర్ధంలేదు- దీన్ని ఏం చేసి నిలబెడతావో ఆ టెక్నిక్ పట్టుకో- నీదైన ప్రత్యేక ముద్రతో, శైలితో దృష్టిలో పడు- ప్రపంచం దృష్టి నాకర్షించూ..అని చెప్పామనుకోండి, చాలా ఇగో వచ్చేస్తుంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యాకనో, లేదా విడుదల నొప్పులు ప్రారంభమయ్యాకనో, మళ్ళీ పాత జీవితం మొదలైతే అప్పుడు అర్ధమవుతుంది!
ఈ నేపధ్యంలో మరో కొత్త దర్శకుడి ఈ మొదటి సినిమా ఎలా వుందో ఓసారి  చూద్దాం :
అతడు- ఆమె- ఆత్మలు!
        వైజాగ్ లో కాలేజీలో చదివే గౌతమ్ (హేమంత్) అదే కాలేజీ స్టూడెంట్ ఆరాధన ( శ్రీదివ్య) ని ప్రేమిస్తూంటాడు. ఆమె ఓకే చెప్పడానికి మూడేళ్ళూ తీసుకుంటుంది. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో గౌతమ్ చనిపోతాడు. కథ ఆరేళ్ళు ముందు కెళ్తుంది. ఆరాధన హైదరాబాద్ లో జాబ్ చేస్తూంటుంది. గౌతమ్ ని మర్చిపోలేక పోతున్న ఆమె పెళ్ళి గురించి ఇక ఆలోచించదు. ఆమె తల్లిదండ్రులు బాధపడుతూంటారు. హైదరాబాద్ లోనే  వినయ్ ( క్రాంతి)  అనే ఒక సైకో ఉంటాడు. అందర్నీ ఇబ్బంది పెట్టి ఆనందించడం, ఎవరికీ సాయం చేయకపోవడం ఇతడి అతి లక్షణాలు. ఓ శుభ ముహూర్తాన ఆరాధనని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెని ఫాలో అయి కంపెనీ బాస్ ని పట్టుకుంటాడు. ఆమె మీద ఆ బాస్ కి చాడీలు చెప్పి ఆమె డిస్మిస్ అయ్యేలా చూస్తాడు. ఆమెని తన కంపెనీలో నియమించుకుని జోరుగా ప్రేమించడం మొదలెడతాడు. ఓ రోజు రోడ్ యాక్సిడెంట్ లో గాయపడతాడు. అప్పట్నించీ అతడికి ఆత్మలు కన్పించడం మొదలెడతాయి. గుంపు గా ఆత్మలు ఇతడి వెంటపడుతూ, తమ సమస్యలు తీర్చ మంటూ వేధిస్తూంటాయి.  గౌతమ్ ఆత్మ కూడా ప్రత్యక్ష మవుతుంది. ఆరాధనని ఇలా చూడలేకపోతున్నాననీ, ఎలాగైనా ఆమె పెళ్లి చేసుకునేలా చేసి, ఈ ఇహ లోకం నుంచి తనకి విముక్తి కల్గించమనీ ప్రాధేయపడుతుంది...


          ఇప్పుడు వినయ్ ఈ ఆత్మల సమస్యలు తీరుస్తాడా? ఆరాధనతో తన ప్రేమ ఏమవుతుంది? ఈ రెండు పాయింట్లు ఆధారంగా కథ ఇక్కడ్నించీ ముందుకు సాగుతుంది. అమ్మాయి- అబ్బాయి,  మధ్యలో ఆత్మల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో మిగతా విషయాలు ఎలా వున్నాయో ఈ కింద చూద్దాం..

క్రాంతి-దివ్య  కూర్చోబెడతారు?
       ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’, ‘ఆ అయిదుగురు’ అనే రెండు  సినిమాలతో ఇదివరకే ప్రేక్షకులకి పరిచయమున్న క్రాంతి ఈ  సినిమాకి చెప్పుకోదగ్గ ఎస్సెట్. అలాగే ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ లో క్రాంతి తోనే హీరోయిన్ గా నటించిన శ్రీదివ్య,  మరోసారి ఈ సినిమాకి కూడా మెయిన్ ఎట్రాక్షన్. ఈమె ‘మనసారా’, ‘బస్టాప్’ అనే రెండు సినిమాల్లో కూడా నటించి వుంది. తమిళంలో ప్రముఖ హీరోలతో  అనేక సినిమాల్లో నటించింది, ఇంకా నటిస్తోంది. ఇచ్చిన పాత్రల్ని అర్ధం జేసుకుని ఆ మేరకు వాటిని పండించగల నేర్పు ఈ ఇద్దరికీ వుంది. కథా కథనాలెలా వున్నా, ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చివరివరకూ కూర్చోబెడుతుంది. అయితే కేవలం హీరో హీరోయిన్లనే చూస్తూ కూర్చోవాలని ప్రేక్షకులందరూ అనుకోకపోవచ్చు. ఇలా ఈ ఇద్దరికీ ఇది చెప్పుకోదగ్గ సినిమా కాలేదంటే, అది పూర్తిగా కథా కథనాల పరంగా, పాత్ర చిత్రణల పరంగా దర్శకుడి బాధ్యతే.

          కామెడీకి శ్రీనివాసరెడ్డి, ధన రాజ్, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ లున్నారు. రంగనాథ్ హీరోయిన్ తండ్రి పాత్ర పోషిస్తే, శంకర్ మెల్కోటే కంపెనీ జీఎం గా నటించారు. రెండో హీరో పాత్రలో హేమంత్ కి నటనతో పెద్దగా పనిలేకుండా పోయింది.

    కెమెరా వర్క్, సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో వున్నాయి. సినిమాని సాంకేతికంగా తీర్చి దిద్దడం లోనూ, నటీ నటులనుంచి ఫీల్ తో కూడిన నటనలు రాబట్టుకోవడంలోనూ కొత్త దర్శకుడికి ప్రతిభ వుంది. మూస సినిమాలకి ఓ మెట్టు పైనే వుంది ప్రమాణాల పరంగా. ఐతే తనదైన ఒక శైలిని సృష్టించుకునే ప్రయత్నం చేయలేదు. పేర్లు తీసేసి ఇలాటి సినిమాలు నాలుగు వేస్తే  ఏది ఈ కొత్త దర్శకుడి సినిమా చెప్పడం కష్టం. టెక్నికల్ గా  ‘డీ ఐ’ కారణంగా ఈ రోజుల్లో ఛాయాగ్రాహకుల్ని గుర్తు పట్టలేక పోవచ్చు నేమో గానీ, దర్శకులకి ఆ ఇండివిడ్యువాలిటీ చూపించుకోవడానికి ఇంకేవో మిగిలే వున్నాయి. ఉదాహరణకి విజువల్ స్టైల్ ని తీసుకుంటే, ట్రాకింగ్ షాట్స్ విధానం వుంది. హీరో హీరోయిన్లు కలుసుకున్నప్పుడల్లా ఒకే  రకమైన ట్రాకింగ్ షాట్స్ వేస్తూంటే, అది ఆ దృశ్యాల్ని ఉద్విగ్నభరితంగా మార్చేసే వీలుంది. కేవలం కంటికి కనబడ్డానికే కాక మనసు లోతుల్లోకి దిగినప్పుడే దృశ్యపరంగా దర్శకుడు బలమైన ముద్ర వేయగల్గుతాడు. ట్రాకింగ్ షాట్ ల  దర్శకుడని పేరు తెచ్చుకుంటే ఎవరూ తప్పుబట్టరు.

          కథాకథనాల్లో, పాత్ర చిత్రణల్లో లోపాల్ని మరిపించడానికి స్పీడ్ రాంపింగ్ షాట్స్ వేసి సినిమాలు తీసిన దర్శకులున్నారు. ఐతే ముందుగా కొత్త దర్శకుడికి తన స్క్రిప్టులో బలాబలాలేమిటో తెలిసి వుండాలి. ఈ సినిమాలో అవెలా వున్నాయో ఇక్కడ చూద్దాం..

స్క్రీన్ ప్లే సంగతులు
       ఇది త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లేనే ( అన్ని సినిమాలూ త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లేలతోనే వున్నా కొన్నే వాటిలోని బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల సమగ్ర నిర్వహణలతో పక్కాగా వుంటాయి).  యాభయ్యోవ నిమిషంలో కథలో కొచ్చారు, బావుంది. ఆతర్వాత మిడిల్ నుంచే సమస్య మొదలయింది. కారణం లాజిక్ లేకపోవడం, సినిమా ప్రారంభంలోనే ఘోర తప్పిదం చేయడం!

          తెలుగు సినిమాలు అదేమిటో గానీ, ఇంకా పాతబడిపోయిన కథన టెక్నిక్ గా ఓపెనింగ్ బ్యాంగ్ నే పట్టుకు వెళ్ళాడుతున్నాయి. ఈ సినిమా ప్రారంభంలోనే హీరోయియిన్ తో కార్లో వెళ్తున్న హీరోకి యాక్సిడెంట్ చేసి చంపేసి ఓ బ్యాంగ్ ఇచ్చామనుకున్నారు. దీంతో ప్రేక్షకులు ఉలిక్కి పడి కనెక్ట్ అయిపోతారుకున్నట్టుంది- కనెక్ట్ అవడం కాదు కదా, రిపల్స్ అయ్యే చర్యే ఇదని తెలుసుకోలేకపోయారు!

          ‘ఏక్ విలన్’ ( 2014-హిందీ) లో ఇలాగే సినిమా ప్రారభంలోనే హంతకుడు వెంటాడి హీరోయిన్ ని దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత అదే హీరోయిన్ కథ ఫ్లాష్ బ్యాక్ గా వస్తుంది. హీరోయిన్ని అంత దారుణంగా చంపిన దృశ్యాలే కళ్ళముందు కదలాడుతూంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఆ హీరోయిన్ గ్లామర్ ని, రోమాన్స్ నీ, చిలిపితనాన్నీ  ఎంజాయ్ చేయగలిగే మూడ్ ఉంటుందా? సరే, ఇది హంతకుడి థ్రిల్లర్ కథ కాబట్టి ఆ జానర్ నుంచి సెన్సిబిలిటీస్ ని ఆశించకుండా చూడొచ్చనుకుందాం. కానీ అదే ఓ ప్రేమకథలో వెంటనే ప్రేమికుణ్ణి చంపేశాక, ఇంకా ఆ హీరోయిన్ తాలూకు గ్లామర్ కోషెంట్, యూత్ అప్పీల్ ఏం మిగిలుంటాయని ఎంజాయ్ చేయాలి? ఈ రెండూ లేకపోయాక అదెలాటి ప్రేమ కథ అన్పించుకోవాలి?

          టైటిల్స్ ముగిసిందే  మొదలు... ప్రియుణ్ణి  కోల్పోయిన హీరోయిన్ శ్రీదివ్య విషాద ముద్ర- మౌన ముద్రలతో గంభీర వాతావరణమే నెలకొంది చివరంటా.  హీరోయిన్నుంచీ ప్రేక్షకు లాశించే సరదాతనం, కవ్వింపు, ప్రేమ ప్రహసనాలూ ఇవేవీ లేకపోవడంతో – ‘షోలే’ లో వితంతువైన జయబాధురిని చూస్తున్నట్టో, లేదా ‘కటీ పతంగ్’ లో విధవరాలైన ఆశా పరేఖ్ ని చూస్తున్నట్టో తయారయ్యింది సినిమా! చూసేది ఈ కాలం యువ ప్రేక్షకులు, వాళ్ళకి ఇలాటి వడ్డన! తొలి సినిమాకే మార్కెట్ పట్ల అవగాహన ఇలా వున్నప్పుడు,  షో వేస్తే ఇలాగే నల్గురే ప్రేక్షకులుండి, వాళ్ళలో ఇద్దరు లేచిపోయే దృశ్యాలే కనపడతాయి అనివార్యంగా.

          ఈ సినిమా అప్పీల్ ఫ్యాక్టర్  ఏమిటో ఏ కోశానా కనపడదు. హీరోయిన్ చూస్తే అలా  వుంది, హీరో చూస్తే రానురానూ ఫన్ ఫ్యాక్టర్ బోరుగా మారిపోయింది, కథ చూస్తే కామెడీనా కాదా తెలియకుండా వుంది, క్లయిమాక్స్ లో బయట పడే క్రైం ఎలిమెంటు తో మరీ కన్ఫ్యూజన్ గా వుంది- ఇంకేం చూసి ప్రేక్షకుడు ఈ సినిమాని అక్కున జేర్చుకోవాలి? పాటలా? ఫైట్లా? పంచ్ డైలాగులా?

         ఇలా గజిబిజిగా ఎందుకయ్యిందంటే, ఈ కొత్త దర్శకుడు తనదైన ష్యూర్ షాట్ సొంత కథతో రాలేదు. హాలీవుడ్ నుంచి ఎత్తేసిన కథతో వచ్చాడు. ‘ఘోస్ట్ టౌన్’ అనే 2008 లో వచ్చిన హాలీవుడ్ సినిమా ఫక్తు కామెడీ. దీనిదర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ సినిమాల రచయిత డేవిడ్ కెప్. హీరో రికీ గెర్వైస్ అనే బ్రిటిష్ టీవీ కమెడియన్. ఇది తొలి సినిమా. ఈ సినిమాలో అమెరికాలో నివసించే డెంటిస్టు పాత్ర. మనుషులంటే పడదు. వాళ్ళ మాటలూ భరించలేడు. ఈ మనుషుల నుంచి దూరంగా పారిపోయి బతకాలనుకుంటాడు. పేషంట్లని కూడా మాట్లాడ నీయకుండా వాళ్ళ నోళ్ళల్లో స్వాబ్స్ కుక్కి పళ్ళు బాగు చేస్తాడు. ఒంటరిగా నివసిస్తాడు. ఒకప్పుడు ప్రేమలో దెబ్బ తిన్నాడు. ఇలాటి ఇతనికి ఓ వ్యాధి సోకి చికిత్సకి వెళ్ళినప్పుడు, తన నిర్వాకం వల్లే  దాదాపు ఏడు నిమిషాలు టెక్నికల్ గా చనిపోతాడు. బతికి లేచి కూర్చుంటే, ఆత్మలు కన్పించడం ప్రారంభిస్తాయి. అయితే ఇతడి కథకి ముందు ఇంకో పాత్రతో వేరే ప్రారంభం వుంది..

          సెకెండ్  హీరో గ్రెగ్ కిన్నెర్, సెల్ ఫోన్లో పెళ్ళాం తో మాట్లాడుతూ, ఉంపుడుగత్తె కోసం ఫ్లాట్ కొనడానికి నడుచుకుంటూ పోతూంటాడు. అంతలో ఒక బిల్డింగ్ పై నుంచి ఊడి పడుతున్న ఏర్ కండిషనర్ ని తప్పించుకోవడానికి, పక్కకి దూకి బస్సుకింద పడి చచ్చిపోతాడు. ఓపెనింగ్ బ్యాంగ్ అనుకుంటే ఇదే ఓపెనింగ్ బ్యాంగ్!

          ఇక హీరోకి కన్పిస్తున్న ఆత్మలకి ఇతను కూడా ఆత్మగా మారి తోడవుతాడు. ఆ వివిధ ఆత్మలు తమ సమస్యలు, కోర్కెలూ తీర్చి పుణ్యం కట్టుకోమని ప్రాధేయ పడుతూంటాయి.  ఇప్పుడు ఈ కథ అప్పీల్ ఫ్యాక్టర్  ఏమిటంటే, ఏ మనుష్య ప్రపంచమంటే అసహ్యంతో హీరో దూరం పారిపోవాలనుకుంటున్నాడో, సరీగ్గా ఆ మనుష్యుల మధ్యకే, వాళ్ళ జీవితాల్ని బాగుచేసేందుకే  వెళ్ళాల్సిన పరిస్థితి రావడం- ఇది సీన్ రివర్సల్!  కథ ఉన్నపళంగా ఉల్టాపల్టా అయిపోయే టర్నింగ్- ప్రేక్షకుల్ని కట్టిపడేసే  ఆసక్తికరమైన అప్పీల్ ఫ్యాక్టర్! 

          మనిషనేవాడు మనుషులమధ్య... మనుషుల పాటూ జీవించడం వినా గత్యంతరం లేదన్న శాశ్వత సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాడిలా హాలీవుడ్  దర్శకుడు. దీనికి ఆత్మలనే సినిమాటిక్ టూల్ ని రూపకాలంకారం (metaphor)  గా వాడుకున్నాడు. కథ రాస్తున్నప్పుడు కథకుడి ప్రతీ ఆలోచన వెనుకా ఒక ఉద్దేశం వుంటుంది.

      ఇక ఆత్మగా వచ్చిన సెకండ్ హీరో ప్రపోజల్ తో కథలో ఇంకో డైనమిక్, ఒక సబ్ ప్లాటూ పుట్టుకొస్తాయి. అదేమిటంటే- తను చచ్చాక తన పెళ్ళాం ఒక డకోటా గాడితో అమాయకంగా మూవ్ అవుతోంది- ఆమె వాడి వల్లో  పడకుండా చూస్తే, నీకీ ఆత్మల పీడా నేను వదిలిస్తానని ఆ ప్రపోజల్. ఈ ప్రపోజల్ ని సృష్టించి, దీని ద్వారా ఈ సినిమాకి అవశ్యమైన ఇంకో అప్పీల్ ఫ్యాక్టర్ కి న్యాయం చేశాడు దర్శకుడు- అదేమిటంటే, ఆ పెళ్ళాం అంటే హీరోయిన్ (టీ లియోనీ) ని పిక్చర్లో కి తేవడం ద్వారా,  హీరోకి రోమాంటిక్ యాంగిల్ ని అంటగట్టి వదలడం! దీంతో మొండిగా ఒంటరిగా బతుకుతున్న హీరోకి –ఆడా మగా కలిస్తేనే జీవితమని ఇంకో శాశ్వత సత్యాన్ని చెప్పాడు దర్శకుడు. ఇది  చెప్పడం కోసం సెకండ్ హీరో ఆత్మని రూపకాలంకారంగా  వాడుకున్నాడు. మిగతా ఆత్మలు సమ్మిళిత మానవ సమాజానికి ప్రతీకలైతే, సెకండ్ హీరో ఆత్మ ఆడా మగా ప్రేమలకి ప్రతీక. ఇదీ ఈ సినిమా కర్ధం!

          దారితప్పిపోతున్న హీరోకి సామాజిక సంపర్కమూ, ప్రేమ సంపర్కమూ రెండూ కలగజేసి పరిపూర్ణ  వ్యక్తిగా మలచడమే దర్శకుడి కార్యాచరణ పథకం. ఈ రెండూ ఉంటేనే పరిపూర్ణ జీవితమని పరోక్షంగా చెప్పడమే ధ్యేయం.  

          సినిమా కథలు మన మానసిక లోకపు భావోద్వేగాల్ని పాత్రలుగా మల్చి  సైకో థెరఫీ చేస్తాయి- సినిమాలనేవి సైకో థెరఫీ సాధనాలు- అని జేమ్స్ బానెట్ ఏనాడో చెప్పాడు. హాలీవుడ్ సినిమాలు శాస్త్రం తెలిసి సైకో థెరఫీ చేస్తాయి, తెలుగు సినిమాలు ఏమీ తెలీక సైకోలుగా తయారు చేస్తాయి. ఒకసారి ప్రముఖ నిర్మాత- దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అననే అన్నారు- ఏ సైన్సూ లేకుండా సినిమాలు తీసేది మనమే నని!

          ‘ఘోస్ట్ టౌన్’ టైటిల్ లోనే వుంది ప్రేమకథ కాదని. ఇది మనుష్య ప్రపంచంతో, ఆత్మలతో హీరో పడే పాట్లతో కామెడీ ప్రధానంగా సాగే మెయిన్ స్టోరీ, ఇందులో భాగంగా మాత్రమే సబ్ ప్లాట్ ( ఉప కథ) గా సాగే ప్రేమాయణం వున్న స్ట్రక్చర్. ఈ ప్రేమాయణం కూడా కామెడీయే.
\
          ఉపకథ గా వున్న ఈ ప్రేమాయణాన్ని ప్రధాన కథగా చేసి, ప్రధానమైన  కామెడీ కథని ఉపకథ గా మార్చేసి చాలా హాస్యాస్పదంగా  ‘వారధి’ గా తీశారు! అమెచ్యూరీష్ చేష్ఠ! ఇందుకే  ఎటూ చెప్పుకోలేని ప్రొడక్టు అయింది.

          ‘ఘోస్ట్ టౌన్’ లో ఓపెనింగ్ లో సెకెండ్ హీరోకి జరిగే ప్రమాదాన్నే, ‘వారధి’లో సెకెండ్ హీరో తో హీరోయిన్ని కలిపి ప్రమాదంగా చూపెట్టేస్తే ఎలా కుదుర్తుంది? అందుకే హీరోయిన్ కడదాకా అదే విషాదాన్ని మోయాల్సి వచ్చింది. క్లయిమాక్స్ లో క్రైం ఎలిమెంట్ తో అనవసర ట్విస్టు-ఆ ప్రమాదాన్ని హీరోయిన్ తండ్రే జరిపించాడని! మరి అంత కర్కోటకుడైన వాడు కూతురికి అంతే ఫోర్సుగా  మరొకడికిచ్చి పెళ్లి చేసేయ్యకుండా ఏళ్ల తరబడి ఎందుకు ఊరుకున్నాడు? ఇదొక అర్ధం లేని పాత్ర చిత్రణైతే, మరణించిన ప్రేమికుడి ఆత్మది మరో అర్ధం లేని బాధ. ఘోస్ట్ టౌన్ లో ఈ పాత్ర తన పెళ్ళాం ఫలానా వాడితో ప్రేమలో పడకుండా చూడమని అర్ధవంతంగా అడిగి- ఒక రోమాంటిక్  ట్రాక్ కి తెరతీయిస్తే, ఇక్కడ నిస్తేజంగా హీరోయిన్ పెళ్లి చేసుకునేలా చూడమని వేడికోలు! ఆ పెళ్లి ఎలాగూ హీరోయే చేసుకుంటాడని అందరికీ తెలిసిందే, ఇంకా ఆత్మకి బాధెందుకు? కథని కూడా ఇంత కీలక పాత్ర ఎక్కడ మలుపు తిప్పింది? 

         
ఇక హీరో విషయానికొస్తే, ఒరిజినల్ లోని నిరాశావాది హీరో కాస్తా ఈ కాపీలో అరాచక వాది అయ్యాడు. మనుషుల మధ్యే ఉంటూ మనుషుల్ని హింసించి ఆనందిస్తాడు. ఇలాటి వాణ్ణి ఆత్మలు వచ్చి సాయం కోరడంలో అర్ధముందా, ఇలాటి వాడి అంతు చూస్తాయేమో గానీ? ఏ సైకో ఎనాలిసస్ ప్రాతిపదికన ఇలా పాత్రని మార్చేసి సృష్టించినట్టు? ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, స్పైడర్ మాన్, మిషన్ ఇంపాసిబుల్.. ఇప్పుడు ఇన్ ఫెర్నో మొదలైన 27 హాలీవుడ్ సినిమాల రచయిత డేవిడ్ కెప్ తప్పుడు పాత్ర చిత్రణ చేశాడనా ఇలా మార్చేసి సృష్టించారు?

          పైగా ఒరిజినల్లో ఈ పాత్రకి ఆత్మలు కన్పించడానికి ఏడు నిమిషాల పాటు చచ్చిపోయాడని ఏవో  మెడికల్ కారణాలు చెప్పారు, కానీ ఈ కాపీలో హీరోకి యాక్సిడెంట్ జరికగి చేతికి మాత్రమే  గాయమైతే ఆత్మలెలా కన్పిస్తాయి?

        హీరోకి ఈ యాక్సిడెంట్ జరిపించడం కోసమే అన్నట్టు దొరికిపోయే కథనం ఏమిటంటే- అతణ్ణి సిటీ బయట చీప్ ధాబా కి డ్రింక్ కోసం పంపడం!  ఆ హైవే మీదైతే యాక్సిడెంట్ బాగా జరుగుతుందనీ!

          ఒక సినిమాని విశ్లేషించలేని దర్శకుడు సినిమా కథ తయారు చేయలేడు. కాపీని ప్రోత్సహించడం కాదు గానీ, ఆ ఒరిజినల్ ని ఉన్నదున్నట్టు కాపీ కొట్టి తీసి వున్నా ‘వారధి’ ఒక ఎంతో కొంత కామిక్ రిలీఫ్ అయ్యేది. ఒరిజినల్ ని అన్నిరకాలుగా తారుమారు చేయడంతో దీని జాతకం తారుమారై పోయింది.  ఒరిజినల్లో వున్న ఓపెనింగ్ బ్యాంగ్ ఆ కథకి అవసరం. తెలుగులో తారుమారు చేసి హీరోయిన్ పాత్రని బలి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రమాదంలో ప్రియుణ్ణి కోల్పోయిన విషయం దాచిపెట్టి,  కథాక్రమంలో ఎప్పుడో రివీల్ చేసి వుంటే- అంతవరకూ అయినా హీరోయిన్ పాత్ర బతికి పోయేది.

          సినిమా సక్సెస్ మంత్రమేమిటో బ్రహ్మ రహస్యమే కావొచ్చు, కానీ ఫ్లాపయ్యే  కళలు పైకి తెలిసిపోతూనే వుంటాయి. ఫ్లాపవుతున్న ఏడాదికి వంద సినిమాల్లో అవే కళలు పదేపదే జడలు విప్పుకుంటున్నా- కొత్తగా మరో ‘కళ’ వచ్చేసి ఆ సంఖ్యని పెంచేసే  ట్రెండే  ఆప్రతిహతంగా  ఇంకా కొనసాగుతోంది. 

          ఒక మంచి సినిమాని అందిస్తూ, ఆ సినిమాకీ ప్రేక్షకులకీ మధ్య వారధిగా ఉండాల్సిన దర్శకుడు, తానే విరోధిగా మారిపోయే చిత్రీకరణలకి పాల్పడ్డం  చాలా విచారకరం. పోస్టర్స్ లో కనబర్చిన కొత్తదనం, క్రియేటివిటీ, విజువల్ బ్యూటీ సినిమాకొచ్చేసరికి శూన్యమవడం ఇంకా విచారకరం.

          కావాల్సింది థియేటర్లకి ఫీడింగ్ ఇస్తూ సినిమాల సంఖ్య తగ్గకుండా చూసే క్యాజువల్ దర్శకులు కాదు, దిక్కులేని చిన్న సినిమాకి ప్రాణమైన కథాబలాన్ని పెంపొందించుకునే లేబర్ వ్యక్తులు చాలా అవసరం.  


సికిందర్  

సాంకేతికం

ఎం కె మోహన్ కుమార్, సీనియర్ కలరిస్ట్, ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ 

“ సినిమా రీళ్లే వుండని, ఇప్పుడున్న ప్రొజెక్టర్లే వుండని రోజులు మరింకేంతో దూరం లేవు! డిజిటల్ ప్రొజెక్షన్ విధానంతో సినిమాలు తీసే, చూసే తీరే పూర్తిగా మారిపోనుంది!” అన్నారు  సీనియర్ కలరిస్టు ఎం. కె. మోహన్ కుమార్ పూర్తి నమ్మకంతో. అంత విప్లవాత్మక మార్పు తీసుకు రానున్నది డిజిటల్ ఇంటర్మీడియేట్ (డీ ఐ) అనే ఈ సాంకేతిక పరిజ్ఞానం. ఈ రోజుల్లో సినిమా జనాల్లో విరివిగా విన్పిస్తున్న మాట డీ ఐ! ఈ డీ ఐ టెక్నాలజీని వినియోగించుకోని నిర్మాత అంటూ ఇటీవల ఎవరూ వుండడం లేదని చెప్పొచ్చు. అసలేమిటి ఈ డీ ఐ? ల్యాబ్స్ ఉనికినే ప్రశ్నార్ధకం చేసేంత మహా శక్తిగా ఇదెలా మారింది?
        
    సింపుల్ గా చెప్పాలంటే డీ ఐ అంటే కలర్ కరెక్షనే. ఓ ఐదేళ్ళ క్రితం సినిమాలకీ, ఇప్పటి సినిమాలకీ ఓ తేడా వుంది. ఇప్పటి సినిమాల్లో దృశ్యాలు మరింత ఉద్విగ్నంగా, కళ్ళు తిప్పుకోలేనంత  కళాకారుడు వేసిన పెయింటింగులా ఉండడాన్ని గమనిస్తున్నాం. ఇదంతా ఏ సూపర్ 35 లాంటి అత్యాధునిక కెమెరా మహాత్మ్యమో నని పొరబడతాం సహజంగానే. కానీ అదేం కాదు. సంతోష్ శివన్ లాంటి కాకలు తీరిన కెమెరామానే వచ్చి చిత్రీకరించినా, ఈ స్థాయి క్వాలిటీని రాబట్టడం అసాధ్యం. కెమెరామాన్ తీసిన దృశ్యాల్ని లస్టర్ ( Lustre ) సూట్ లో డిజిటల్ గా కలర్ కరెక్షన్ చేస్తే మాత్రమే ఇది సాధ్యం.

లస్టర్ సూట్ 
    ఈ పనే చేస్తూంటారు మోహన్ కుమార్.  ‘ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్’ హైదరాబాద్ శాఖలో గత నాలుగేళ్ళుగా కలరిస్టుగా పనిచేస్తున్న ఈయన ఊటీలో జన్మించిన తమిళుడు. తెలుగు చక్కగా మాట్లాడతారు. ఓపెన్ గా మాట్లాడతారు. 1989 లో మద్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ఫిలిం ప్రాసెసింగ్ కోర్సు పూర్తి చేసి, 1990 నుంచీ రామానాయుడు స్టూడియోలో చీఫ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ, ప్రస్తుతం ఇదే స్టూడియో ప్రాంగణం లో నెలకొల్పిన ‘ప్రైమ్ ఫోకస్’ లో కలరిస్టు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ప్రైమ్ ఫోకస్’  భారతీయుడికి చెందిన బహుళ జాతి సంస్థ. ఉత్తర అమెరికా, బ్రిటన్, ఇండియాలలో దీనికి శాఖలున్నాయి. దీని ఎండీ నమిత్ మల్హోత్రా ముంబాయిలో ఉంటారు. ముంబాయితో బాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గోవాలలో బ్రాంచీలున్నాయి.

డి ఐ కి ముందు- డి ఐ కి తర్వాత 

      నాల్గేళ్ళ  క్రితం మహేష్ బాబు నటించిన ‘సైనికుడు’ తో తమ డీ ఐ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు మోహన్ కుమార్. చరిత్ర లో కెళ్తే, హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ క్రిస్ ఎఫ్. వుడ్స్ మొట్టమొదటి సారిగా 1993 లో డిజిటల్ గా ‘సూపర్ మారియో బ్రదర్స్’  అనే సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ సృష్టించారు. సినిమా రీలుని డిజిటల్ గా స్కాన్ చేసే ఈ విధానమే డీ ఐ ప్రాసెస్ కి దారితీసి, అదే సంవత్సరం ‘ఓ బ్రదర్, వేర్ ఆర్ట్ థౌ?’ మొదటి డీ ఐ సినిమా గా విడుదలైంది. అయితే 2005 లోనే ఈ ప్రక్రియ ఊపందుకుని 2007 కల్లా 70 శాతం హాలీవుడ్ సినిమాలు డీ ఐ తో కళకళలాడుతూ వచ్చాయి. ఇప్పుడు డి ఐ లేని సినిమాయే  లేదు. గతంలో కలర్ కరెక్షన్ కి గ్రేడింగ్ అనే పధ్ధతి వుండేది. దాంతో కనిష్టంగా ఐదు ఫ్రేములకి  రంగులు సరిదిద్దేందుకు వీలయ్యేది. డీ ఐ వచ్చాక  ప్రతి ఫ్రేముకూ సాధ్యమౌతోంది.


    డీ ఐ ప్రక్రియని ఇలా వివరించారు మోహన్ కుమార్ : సినిమా తీశాక నెగెటివ్ మొత్తాన్నీ  స్కాన్ చేసి, లస్టర్ మీద డి ఐ పూర్తి చేసి, ఒకే ఫుల్ నెగెటివ్ గా ఎడిటింగ్ కి పంపిస్తారు. ఈ ఫుల్ నెగెటివ్ ని ఆరీ (Arri) రికార్డర్ తో 5242 కోడక్, లేదా ఫ్యూజీ ఆర్డీ ఏ 8511 మీద ఎక్కించి పంపిస్తారు. దీనికి సౌండ్ మిక్స్ చేశాక ప్రింట్లు లేదా డిస్కులు తీసి, ప్రదర్శనల కోసం థియేటర్లకి  పంపిస్తారు. ప్రస్తుతం తను పని చేస్తున్న రవితేజ నటిస్తున్న ‘డాన్ శీను’ లో డీ ఐ పూర్వం వున్న దృశ్యాల స్థితి, డీ ఐ చేసిన తర్వాత వచ్చిన క్వాలిటీ చూపించారు మోహన్ కుమార్.
          
    ప్రొడక్షన్ శాఖల్లో ఒక అభిప్రాయముంది. డీ ఐ వచ్చాక షూటింగ్ లో పెద్దగా లైట్లు వాడే అవసరం రావడం లేదని. దీన్ని  గురించి ప్రస్తావిస్తే,  ఇది తప్పన్నారు మోహన్ కుమార్. కెమెరా మాన్ పూర్తి స్థాయిలో లైటింగ్ ని వాడితేనే డీ ఐ తో లైటింగ్, కలరింగ్ సత్ఫలితా లుంటాయని స్పష్టం చేశారు. డీ ఐ తో ఉన్న ఇంకో సౌలభ్యం గురించి చెప్పారు. ఒక ఆర్టిస్టు తో ఈవెనింగ్ ఎఫెక్ట్ తో తీయాల్సిన షాట్, ఆ ఆర్టిస్టు అర్జెంటుగా వెళ్ళిపోవలసి వస్తే, ఆ షాట్ ని మధ్యాహ్నం పూటే అత్యవసరంగా తీయాల్సి వచ్చిందనుకోండి, అప్పుడా తర్వాత దాన్ని డీ ఐ తో చల్లని సాయంవేళ గా మార్చేయ వచ్చన్నారు.

       పూర్వం ఓ సినిమాకి డీ ఐ చేయాలంటే నిర్మాత 45 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి వచ్చేదనీ, ఇప్పుడు 10-15 లక్షలకి తగ్గి వచ్చిందనీ అన్నారు. (ఇప్పుడు 2015 నాటికి ఇది ఎవరుపడితే వాళ్ళు చేసే కుటీర పరిశ్రమగా మారిపోయి, ఖర్చు వేల రూపాయలకి పడిపోయి, ఆ మేరకు క్వాలిటీ కూడా పతనమైంది)

       అలాగే బయ్యర్లు ఒక్కో ప్రింటు కి 60 వేల ఖర్చు పెట్టాల్సి వచ్చేది.  ఇప్పుడొక 18 వేలకే డిస్కులు తీసుకెళ్ళి థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్షన్ చేసుకో వచ్చన్నారు మోహన్ కుమార్. దీ నివల్ల సినిమా ఫ్లాపైనా నష్ట తీవ్రత  కొంత తగ్గుతుందన్నారు. ఇప్పుడు చాలా థియేటర్లు డిజిటల్ ప్రదర్శనలకి  అనుకూలంగా మారిపోతున్నాయని చెప్పారు.
            
    ఏడాదికి ఇరవై సినిమాలు చొప్పున ఇప్పటికి 80 సినిమాలకి డి ఐ కల్పించిన ఈయన ప్రస్తుతం ‘డాన్ శీను’, ‘బృందావనం’, ‘ఆరెంజ్’, ‘ఖలేజా’, ‘చంద్ర ముకి-2’  సినిమాలతో బిజీగా వున్నారు. ‘అదుర్స్’, ‘కేడీ’,  ‘గోలీమార్’ సినిమాలకి చేసిన డీ ఐ తనకు మంచి సంతృప్తి నిచ్చిందన్నారు.

సికిందర్ 
(ఆగస్టు 2010 ‘ఆంధ్రజ్యోతి’ సినిమాటెక్ శీర్షిక)