రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 27, 2018


Q : ‘దొంగరాముడు’ లో హీరోయిన్ సావిత్రి విలన్ తో పోరాడి కథకి ముగింపునిస్తే మీ పరిభాషలోనే హీరో పాసివ్ అయిపోయాడన్నారు. ఇది ఆ రోజుల్లో చెల్లిందన్నారు. ఈ రోజుల్లో హీరో పాసివ్ అవకుండా హీరోయిన్ తో కథ ముగించే మార్గం ఏదైనా వుందా? ఇలా చేసిన సినిమాలేమైనా వున్నాయా?
పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు 

A : పాసివ్ పాత్రనేది స్క్రీన్ ప్లే పరిభాష. ‘దొంగరాముడు’ చూడకముందు ఒక అసోసియేట్ కథకి పరమ రొటీన్ గా వున్న-  క్లయిమాక్స్ లో హీరోయిన్ ని విలన్ కిడ్నాప్ చేసే అరిగిపోయిన ఫార్ములాని - తిరగేసి హీరోయినే విలన్ ని కిడ్నాప్ చేసేట్టు చేయాలన్నప్పుడు అందులో స్పార్క్ గుర్తించలేకపోయాడు. ఆ కథ ప్రకారం హీరో పాసివ్ అవకుండా చేసే మార్గముంది. ‘దొంగరాముడు’ చూసినప్పుడు ఈ తిరగేసిన ఫార్ములా ఎదురై మనకి మనమే థ్రిల్లయ్యాం. ఇందులో క్లయిమాక్స్ హీరో చేతిలో లేక పాసివ్ అయ్యాడు. హీరోయినే నిభాయించింది. దీనికి హీరో పాసివ్ అవకుండా చూసే మార్గముంది. హీరోయిన్ ని హేండాఫ్ పాత్రగా మార్చేస్తే. అంటే ఎక్కడో వుండి హీరో ఆదేశాలిస్తూంటాడు. ఆ ఆదేశాలందుకుని హీరోయిన్ విలన్ సంగతి చూస్తుంది. క్లయిమాక్స్ వ్యూహం హీరోది గనుక అతను కథలో పాల్గొంటూ యాక్టివ్ పాత్రగా వున్నట్టే. అదే సమయంలో హీరోయిన్ కూడా యాక్టివ్ పాత్రే. గతంలో ఒక మూలనబడ్డ కథలో ఇలాటిదే యాక్టివ్ పాత్ర చిత్రణ చేశాం. అసలు సెకండాఫ్ లో హీరో యాక్షన్ లోకి రాడు. హీరోయిన్ తో తనపని తాను చూసుకుంటాడు. ప్రత్యర్ధులైన పోలీసులు ఒకళ్ళ నొకళ్ళు చంపుకుంటూ వుంటారు. ఒక్క ఫోన్ కాల్ తో హీరో క్లయిమాక్స్ మొదలెట్టేసి వూరుకుంటాడు. ఆ ఫోన్ కాల్  ఫలితంగా విలన్లయిన పోలీసులు ఒకర్నొకరు కాల్చుకు చావడం. క్లయిమాక్స్ వెనుక మాస్టర్ మైండ్ హీరో అయితే చాలు - అందులో చేతులు పెట్టక పోయినా యాక్టివ్ పాత్రగానే వుంటాడు. ఇలా వున్న సినిమాలు మనకి తెలిసినంత వరకూ రాలేదు. వస్తే కాపీ కొట్టడానికి క్యూలో చొక్కాలు చించుకుంటారు. ఇప్పుడు చెప్తే అర్ధమవక పాత మూసలోనే కమ్మగా కునుకు తీస్తారు.

Q : ‘దొంగ రాముడు’ కి చాలా లోతైన విశ్లేష చేశారు. ఇప్పటికిప్పుడు దొంగ రాముడు’ చూస్తూ మీ విశ్లేష సాయంతో అధ్యయనం చేయాలనిపిస్తోంది. అయితే సందేహం. మీ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు – “ఇందులో మిడ్ ఫ్రాక్చర్ ఇలా వుంటుంది : లావు తగ్గాలని (సైజ్ జీరోలో) ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ -1 తో వేసే గోల్ అక్కడితోనే ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభం కాగానే వేరే కథ మొదలెడతారు. అంటే ఫస్టాఫ్ లో ఎత్తుకున్న కథా దాని పాయింటూ సఫా. ఇక రెండో సినిమా షురూ. 

          “సెకెండాఫ్ సిండ్రోమ్ ఇలా వుంటుంది : ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ -1 వేసి లావు తగ్గే పాయింటు వేశాక, దాన్నెలా కొనసాగించాలో తెలీనట్టు, ఇంటర్వెల్ తర్వాత దాన్నొదిలేసి, క్లినిక్ అక్రమాల పాయింటు నెత్తుకుంటారు. ఇంటి దగ్గర తల్లిగారు పెళ్లి కోసం లావు తగ్గమంటే, తల్లీనీ పెళ్ళీనీ వదిలేసి క్లినిక్ అక్రమాలంటూ వూరు మీద పడేశారు. ఉన్న పాయింటుతో సెకెండాఫ్ ఏం చేయాలో తెలీక, వేరే పాయింటుతో ప్లేటు ఫిరాయిస్తే, ఇలా సెకెండాఫ్ సిండ్రోమ్ లో- సుడిగుండంలో పడుతుంది సినిమా” అని.  

          ఇక్క మిడ్ ఫ్రాక్చర్, సెకెండాఫ్ సిండ్రోమ్ రెండింట్లోనూ స్టాఫ్కు భిన్నంగా సెకెండా ఫ్ లో వేరే చెప్పమే దా. అంటే రెండూ ఒకటే దా అనిపిస్తోంది. వాటి ధ్య భేదమేంటో కాస్త విపులంగా చెప్పరు.
-
ల్లా నాగార్జున, పాత్రికేయుడు

A :  మరేమీ లేదు, మిడ్ ఫ్రాక్చర్ రెండు రకాలుగా వుంటుంది : ఒకటి ఇంటర్వెల్ కే కథ అయిపోవడం; మరొకటి, ఇంటర్వెల్ కి ప్లాట్ పాయింట్ వచ్చినా కథేమిటో తేల్చక పోవడం. మొదటిది బాగా అర్ధమవాలంటే 2014 లో సుమంత్ అశ్విన్ నటించిన ‘చక్కిలిగింత’ ఒకటి చూస్తే చాలు. ఇందులో పాయింటేమిటంటే, ఫస్టాఫ్ ప్రారంభంలోనే హీరో ఒక గోల్ పెట్టుకుని ప్లాట్ పాయింట్ వన్ వేసుకుంటాడు. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడకుండా, అమ్మాయిలే అబ్బాయిలకి ప్రేమని ప్రతిపాదించాలన్న పట్టుదలకి పోతాడు. కానీ హీరోయినే అతణ్ణి ప్రేమలోకి దింపి, ఆ గోల్ ని పటాపంచలు చేస్తుంది. ఈ ఇంటర్వెల్ సీన్లో ఓటమిని ఒప్పుకుంటాడు హీరో. ఇక్కడితో కథ అయిపోయినట్టే. ఇక సెకెండాఫ్ ప్రారంభం కాగానే, అయినా నన్ను ప్రేమలో పడేసి నిజంగానే నాలో ప్రేమని పుట్టించావంటూ ఇంకో రాగం ఎత్తుకుంటాడు హీరో. ఇది  అయిపోయిన కథకి ఇంకా అవసరం లేని కథని అనవసరంగా అతికించడం. అందువల్ల ఇది మొదటి రకం మిడ్ ఫ్రాక్చర్. 

          ‘సైజ్ జీరో’ లో ఈ రకం మిడ్ ఫ్రాక్చర్ లేదు. ఇంటర్వెల్ కి కథ అయిపోలేదు. పెళ్లవడానికి లావు తగ్గమంటే, లావు తగ్గాలా అని ఏడుస్తుంది హీరోయిన్. దీంతో ఇంటర్వెల్. ఇది ప్లాట్ పాయింట్ వన్ సన్నివేశమే. కానీ హీరోయినేం చేయాలో గోల్ ఏర్పడని అసంపూర్ణ ప్లాట్ పాయింట్ వన్. పోనీ సెకెండాఫ్ లోనైనా దీని కొనసాగింపు వుండదు. వూసే వుండదు. గోల్ లేకుండా వేరే గొడవ లెత్తుకుంటుంది. అందుకని ఇది రెండో రకం మిడ్ ఫ్రాక్చర్ అయింది. మొదటి రకం ఇంటర్వల్ కల్లా కథ ముగిసిపోతే, రెండో రకం ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ అసంపూర్ణంగా వున్నప్పుడు. 

          ఈ రెండిటికీ, సెకెండాఫ్ సిండ్రోంకీ తేడా ఏమిటంటే, ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పడ్డ గోల్ కి భిన్నంగా సెకెండాఫ్ వేరే కథ ఎత్తుకుంటే సెకండాఫ్ సిండ్రోంలో పడ్డట్టు. ‘సైజ్ జీరో’ లో హీరోయిన్ గోలేమిటో ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పలేకపోయినా, అమె లావు తగ్గడమే గోల్ అని మనకర్ధమై పోతుంది. ఈ గోల్ వదిలేసి క్లినిక్ అక్రమాలతో వేరే గోల్ ఎత్తుకోవడం వల్ల సెకెండాఫ్ సిండ్రోం అయింది.
***

698 : శనివారం సంత


    ఓ కొత్త దర్శకుడు వెళ్లి కథ చెప్తే నమ్మేస్తారు హీరోలు, నిర్మాతలు. అదే ఒక కొత్త రచయిత వెళ్లి కథ చెప్తే నమ్మరు. కొత్త దర్శకుడికి తెలిసిందేమిటి, కొత్త రచయితకి తెలియని దేమిటి? రచన చేయడానికి  కొత్త దర్శకుడికి వున్న అర్హతలేంటి, కొత్త రచయితలకి లేని అర్హతలేంటి? కొత్త దర్శకుడు కొత్త రచయితతో ఎందులో గొప్పవాడు? కొత్త దర్శకుడొచ్చి గందరగోళంగా ‘వీరభోగ వసంత రాయలు’ కథ చెప్పేస్తే అద్భుతమైన వాడా? ఒకరు కాదు, ముగ్గురు హీరోలు పోటీలు పడి నటించేస్తారా? కొత్త దర్శకుల కథల టాలెంట్ కి ‘వీరభోగ వసంతరాయలు’ పరాకాష్ట! దీనికి రేటింగ్ 1 కాదు, జీరో ఇచ్చినా ఎక్కువే. కొత్తవాళ్ళు దర్శకుడి లేబిల్ తగిలించుకుంటే రచయితలై పోతారా? అన్ని హక్కులు, అధికారాలు  వచ్చేస్తాయా? హీరోలు, నిర్మాతలు రచయితల కథలు తీసుకునే సాంప్రదాయం ఇరవై ఏళ్ల క్రితమే ముగిసిపోయింది, అదివేరు. ప్రత్యాన్మాయంగా ఆ స్థాయి కథలు వింటున్నారా అంటే అంత ఓపిక లేదు. అదే 90 % అట్టర్ ఫ్లాపులతో దశాబ్దాలు గడిపేస్తున్నారు. అట్టర్ ఫ్లా పులకి కారణం రచనలా, దర్శకత్వాలా? రచయితల్ని చంపేసిన ఈ ట్రెండ్ లో కొత్త బచ్చా దర్శకుడు కూడా రచయితల్ని చులకనగా చూస్తున్నాడు. రాసుకోలేక తను తీసేది అట్టర్ ఫ్లాపే. అది తెలుసుకోడు. మరిన్ని వీరభోగ వసంత రాయళ్ళు తీయాల్సిందే. ఎన్ని తీస్తే అన్ని బండారాలు బయటపడి మూతబడతారు. ‘కథ – మాటలు – స్క్రీన్ ప్లే – చాదస్తం’ అని వేసుకోలేక వాళ్ళే పారిపోతారు.
 ***