రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జనవరి 2017, గురువారం

Review - Fresh Copy!

రచన- దర్శకత్వం : క్రిష్
తారాగ‌ణం: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, హేమమాలిని, క‌బీర్ బేడీ, శివ‌రాజ్ కుమార్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్  తదితరులు
మాట‌లు
: సాయి మాధ‌వ్ బుర్రా, పాట‌లు: సీతారామ‌శాస్త్రి, సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌ ఛాయాగ్ర‌హ‌ణం: జ్ఞాన‌శేఖ‌ర్‌, నృత్యాలు  : స్వర్ణ
బ్యానర్ :
 ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, స‌మ‌ర్ప‌ణ: బిబో శ్రీనివాస్‌, నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు
విడుదల :12 జనవరి, 2017

***
బాలకృష్ణ నందమూరి నూరవ ప్రయత్నంగా చారిత్రాత్మక కథ కావడం, అందులోనూ శాతకర్ణి పాత్ర కావడం ముందుగానే  ఒక ఎస్సెట్ తన ప్రతిష్టకి. రెగ్యులర్ మాస్ మసాలా 
జోకిలి పోకుండా వయసుకి తగ్గ పాత్రతో అభద్రతాభావమనే గ్లామర్ ఇమేజి చట్రాన్ని 
ఒక్క వేటుతో  ముక్కలు చేసి పారేసి ఇవతలపడ్డారు ఈ పండక్కి. 
ఇక కరుడుగట్టిన ఆయన అభిమానులు కూడా నోరెత్తకుండా పండగ చేసుకోవడమే మిగిలింది. వాళ్లకి థియేటర్లో జాతీయ గీతం కూడా ఆనలేదు-  
జై బాలయ్య నినాదాలే ఇచ్చుకున్నారు వీరాభిమానులుగా. 


      దర్శకుడు  క్రిష్ కాల్పనిక  చరిత్ర ( 2015 - ‘కంచె’) నుంచి చరిత్ర కొచ్చారు. ఆయన కూడా ఎవరికీ తెలియని ఒక తెలుగు యోధుడి  విశిష్టతని, తొలి భారత చక్రవర్తి గాథని  తెరకెక్కించాలన్నఆలోచన చేయడం దగ్గరే నూటికి నూరుపాళ్ళూ సక్సెస్ అయ్యారు. అయినా అంత చరిత్రని హడావిడిగా 79 రోజుల్లో ఎలా తెరకెక్కిస్తారనే  దాని గురించి సందేహాలక్కర్లేదు- ‘కంచె’ తో సాధించింది ఇంకొంచెం ఎక్కువే సాధించి చూపిస్తారు ఈ చరిత్రతో. 

        ఒక యోధుడి  చరిత్ర తెరకెక్కిస్తూ సినిమాటిక్ గా న్యాయం  చేయాలంటే ‘రుద్రమ దేవి’ లా ఆల్ ఇన్ వన్ చేయడం గాక - సింపుల్ గా మరేం చేయవచ్చో ఈ కింది విధంగా చేసుకుపోయారు క్రిష్. అదేమిటో చూద్దాం...


కథ 
    శాతకర్ణి (క్రీపూ 78-102)  అమరావతి రాజు శివస్వతి శాతకర్ణి కొడుకు, కరీంనగర్ జిల్లా కోటి లింగాలలో  పుట్టాడు. ఐదేళ్ల వయసులో శాతకర్ణి (బాలకృష్ణ) తల్లి గౌతమీ  బాలాశ్రీ (హేమమాలిని) ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు- యుద్ధాలు ఎందుకు జరుగుతాయని. ఆ తల్లి చెప్పిన సమాధానం విని, అన్ని రాజ్యాలూ ఒకటయితే యుద్ధాలే జరగవు కదా, అలాటి ఒక పెద్ద యుద్ధం చేసి. ఇక యుద్ధాలే అవసరం లేకుండా  రాజ్యాలన్నిటినీ కలిపేస్తానంటాడు. దీన్ని తను పట్టాభిషిక్తుడయ్యేవరకూ గుర్తుంచుకుంటాడు. దేశంలో చిన్న చిన్న రాజ్యాల్ని విదేశీ రాజులు హస్తగతం చేసుకుని ఆ పాలకుల్ని వాళ్ళ కింద సామంత రాజులుగా చేసుకోవడం శాతకర్ణికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకని భారతదేశంలో రాజ్యాలన్నీ ఒకే  బలవంతుడైన రాజు కింద- ఆ రాజు తను- వుండాలని దక్షిణ రాజ్యాల్ని  జయించి, ఉత్తరాన సౌరాష్ట్ర (మరాఠా) మీద దృష్టి పెడతాడు. అక్కడి కల్యాణ్ దుర్గ్ ని జయిస్తాడు. ఇక నహపాణుడు  (కబీర్ బేడీ)  రాజ్యాన్నీ జయిస్తాడు. ఇక అప్పుడు అలెగ్జాండర్ తర్వాత అంతటి శక్తి శాలియైన  డిమిత్రియస్ అనే గ్రీకు రాజు , అలెగ్జాండర్  సాధించలేనిది తను సాధించాలని మూడులక్షల మంది సైన్యాన్ని వెంటేసుకుని భారీయెత్తున దేశం మీదకి  దండయాత్ర కొస్తాడు....

        దీన్ని శాతకర్ణి ఎలా ఎదుర్కొన్నాడు? అప్పటికే 33 రాజ్యాలని జయించిన శాతకర్ణికి కుటుంబ పరమైన, నైతిక పరమైన ఆటంకాలేం ఎదురయ్యాయి?  అతడి వెన్నుపోటు దార్లెవరు? ప్రాణాలు తీయబోయిన వగలాడి ఎవరు? తల్లితో, భార్య వాశిష్టీ దేవి (శ్రియ) తో సంబంధాలు ఎలా ప్రభావితం చేశాయి? ఆ ఒడిదుడుకుల సంబంధాల్ని ఎలా మేనేజ్ చేశాడు? వీటన్నిటి నడుమ నులుగుతూ, తన చిన్ననాటి కలని ఎలా నిజం చేసుకుని తొలి అఖండ భారత చక్రవర్తి అయ్యాడు?...ఇవన్నీ మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ 
   500 సంవత్సరాలు పాలించిన శాతవాహన వంశీయులలో 23 వ రాజైన శాతకర్ణుడి కథ ఈ సినిమాతో ఒక అవగాహనని కల్పిస్తుంది. ఇది మరుగున పడిపోయిన చరిత్రే. దర్శకుడే వ్యాఖ్యానించినట్టు ఇది ఏ గ్రీకు వీరుడి చరిత్రో అయ్యుంటే ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి, ఆస్కార్ అవార్డులు కూడా కొట్టేసే వాళ్ళు. క్రిష్ కి ముందు శాతకర్ణి చరిత్రని సినిమాల పరంగా ఎవరూ ఆలోచన లేదన్నది వాస్తవం. అసలు ఇలాటి యోధుడున్నాడా  అని తెలుగు వాళ్ళకే తెలీదంటే అతిశయోక్తి కాదు. రుద్రమ దేవితోనే సరిపెట్టుకుంటున్న  ప్రభుత్వాలు కూడా చేయలేనిది ఈ సినిమా కథ  చేసి చూపించింది. ఈ కథలో శాతకర్ణి తన పేరు ముందు తనే ఒకానొక ప్రధాన ఘట్టంలో,  ‘గౌతమిపుత్ర’  అని పెట్టుకున్నట్టు చూపించారు. కానీ ఆ కాలంలో రాజులకి ఎందరో భార్యలుండేవాళ్ళు కాబట్టి, సంతానాన్ని వాళ్ళ  తల్లిని బట్టి గుర్తించడానికి అలా తల్లి పేరు కలిపి పెట్టేవారని ఒక చోట రాసివుంది. ఇది సరైనదో కాదో తెలీదుగానీ  - దర్శకుడు క్రిష్  తన పేరు ముందు మాత్రమే కాకుండా, ఈ సినిమాలో నటించిన, పని చేసిన వాళ్ళందరి పేర్లకీ ముందు ఫలానా తల్లి ‘పుత్ర’, 'పుత్రి'  అని కలిపి టైటిల్స్ లో వేశారు. హిందీ దర్శకుడు సంజయ్  భన్సాలీ- ‘లీలా’ అని మధ్యలో తన తల్లి పేరు కలిపి పెట్టుకున్నప్పుడు, కేవలం తల్లి మీద ప్రేమతోనే పెట్టుకున్నాడు - ఎవరి చరిత్రలోంచో  ఉదాహరణ తీసుకుని కాదు. 
       శాతకర్ణుడి చరిత్ర సినిమా కథగా తెర కెక్కడం మాత్రం చారిత్రక ఘట్టమే. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరం. 

ఎవరెలా చేశారు 
     బాలకృష్ణ ఈ బరువైన పాత్రని- అందులోనూ యుద్ధ ప్రధాన పాత్రని- సర్వశక్తులూ ఒడ్డి పోషించారు. అంతే బలంగా డైలాగుల దుమారం రేపారు- నా బిడ్డ కోసమో నీ గడ్డ కోసమో కాదు నేను పోరాడుతున్నది...ఈ దేశం అంతటినీ ఏక ఖండంగా కలపడానికి- లాంటి డైలాగులు రోమాలు నిక్కబొడుచుకునేలా పేల్చారు. కత్తి యుద్ధాలు, యుక్తి పన్నాగాలూ, మళ్ళీ అటు-  ఎదురు తిరిగే భార్యతో  సుతిమెత్తని సున్నిత వూరడింపులూ- ఈ ద్విముఖ వ్యూహ పాత్రచిత్రణకి తాను తప్ప శరణ్యం లేనట్టు తాను అదృశ్యమైపోయి-  ఈ 21వ శతాబ్దంలోకి శాతకర్ణిని సజీవంగా రప్పించారు బాలకృష్ణ. 

       శ్రియకి  కూడా బలమైన పాత్ర దక్కింది. మాఫియా సినిమాల్లో చూస్తూంటాం-  నాగార్జున మాఫియా అయితే అమల పరిస్థితి, శ్రీ విష్ణు మాఫియా అయితే తాన్యా హోప్ పరిస్థితి...కానీ యుద్ధం, హింస, చావులూ వీటితోనే  గడిపే, ఐదారేళ్ళ కొడుకు పులోమావిని కూడా  యుద్ధానికి తీసికెళ్ళి పోయే శాతకర్ణి లాంటి కటువైన భర్తతో, వాశిష్టీ పాత్రలో శ్రియ మోద ఖేదాల డోలాయమాన స్థితి చాలా ఉన్నతంగా బ్యూటిఫుల్ గా అర్ధవంతంగా చిత్రణ చేశారు.


        అందులో పరిపక్వ నటనతో శ్రియ కొన్ని  చోట్ల కంట తడికూడా పెట్టిస్తారు. మాఫియా సినిమాల్లో ఫ్లాట్ గా వుండే భార్య పాత్రలు ఇంత బలంగా కట్టి పడెయ్యవు.  హేమమాలిని అయితే మహారాణి ఎలా వుంటుందో అలాగే వుంటారు. ఈ మూడే ముఖ్యపాత్రలు. మూడు సీన్లలో కన్పించే ఇంకో అతిధిపాత్ర ( కత్రినా కైఫ్ లా వున్న విదేశీ నటి పేరు తెలియదు- గ్రీకు యువతి పాత్ర పోషించింది) కూడా ఆ మూడు సీన్లకి హైలైట్.
      
        ఈ సినిమా ఒక సాంకేతిక విజయం కూడా. ఈ 79 రోజులనేది ప్రధాని మోడీ 50 రోజుల్లాగా బాగా పాపులర్ అయిపోయింది. రెండున్నర నెలల్లో ఇంత సినిమా- ఇంత చారిత్రక యుద్ధాలతో, విశేషాలతో, సెట్సూ ఆభరణాలతో తీస్తారా అనేది రేపు ఒక  అధ్యయన అంశంగా మారవచ్చు. 79 రోజుల్లో ఇంత సినిమా తీయడం బడ్జెట్ విజయం కూడా- ఇలాటి చారిత్రికాలు తీయడానికి బాలీవుడ్ కార్పొరేట్స్ కూడా పరికించి చూసే ఒక మోడల్. 


    పూర్తిగా అంతర్జాతీయ స్థాయి మేకింగ్ ఇది- జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం, సీతారామ శాస్త్రి సాహిత్యం, చిరంతన్ భట్  (‘కంచె’ ఫేం) సంగీతమూ సరే (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ లు కూడా పాడారు), స్వర్ణ నృత్యాలూ సరే, ఇక ఎడిటింగ్ (రామకృష్ణ అర్రం- సూరజ్ జగ్తాపీ), ఆర్ట్ ( భూపేష్ ఆర్ భూపతి, అజీజ్ హమిచి), కాస్ట్యూమ్స్- జివెలరీ (నీతా లుల్లా), కాస్టింగ్ (హమీద్ తిమఘ్రిత్), సౌండ్ (జస్టిన్ జోస్, పరీక్షిత్ లల్వానీ), విజువల్ ఎఫెక్ట్స్ (ప్రైమ్ ఫోకస్), యాక్షన్ ( రామ్- లక్ష్మణ్, యూనస్ అఫ్రోఖ్, మహమ్మద్ అతోగీ, హామీ బెలాల్, బ్రహీం బౌకిజూ, యూసుఫ్ మర్చౌకి, అబ్దుల్లా ఔకేష్)...వీళ్ళందరూ కూడా శాతకర్ణికి నివాళులు అర్పిస్తున్నట్టే కళాపోషణ చేశారు.          
       
      యుద్ధ దృశ్యాలు టెక్నికల్ వండర్స్. కానీ గ్రాఫిక్స్ టెక్నిక్ లా  అన్పించవు. మొదటి సముద్ర యుద్ధం దగ్గర్నుంచి, చివరి హిమాచల్ ప్రదేశ్ పచ్చిక బయళ్ళ, మంచు కొండల మయమైన ప్రాంత రణరంగం వరకూ యాక్షన్ కొరియోగ్రఫీ హేమా హేమీల చేతుల్లో ఒక రికార్డు. అయితే ఈ యుద్ధాల్లో ఎన్నో గుర్రాలుంటే వాటిని ఎక్కడా ప్రత్యేకంగా హైలైట్ చేసే షాట్లు తీయలేదు. గ్రూపుగా గుర్రాలు ఒక లయతో స్లో మోషన్ లో దౌడు తీస్తూంటే  ('బెన్హర్') ఆ విజువల్స్ ఆ యుద్ధ దృశ్యాల్లో మరింత ఉత్తేజాన్ని నింపడమేగాక, కళాత్మకంగా వుండేది.   

       ఇకపోతే ఒక కలం వీరుడు సాయినాథ్ బుర్రా కూడా వున్నారు. నిన్ననే ఈయన మెగాస్టార్ (ఖైదీ నెం -150) కి  డైలాగులు రాసి, ఇవ్వాళ బాలకృష్ణతో వచ్చారు. రైటర్ గా ఈయన ఏ తరహా సినిమాలకి బెస్టో ఇక్కడ అప్రస్తుతం గానీ, ప్రస్తుత సినిమాకి నిజంగా ఈయన చేసింది ఒక ఆర్టు. ఈ ఆర్టుకి సినిమా మొత్తం కలిపి  ‘శంకరాభరణం’ లాగా పాతిక పేజీలకి మించి డైలాగులు వుండవు! ఇందులో బాలకృష్ణ కెన్నుంటాయి- ఆయనేం పేల్చినట్టు- అన్నది పిచ్చి ప్రశ్న! వెళ్లి సినిమా చూడండి.

చివరికేమిటి? 
        హై కాన్సెప్ట్ సినిమాల స్క్రిప్టులు సింపుల్ గానే  వుంటాయి. ఒక సింగిల్ లైన్, ఒక లక్ష్యం,  ఒక సంఘర్షణ, ఒక విజయం, అంతే. శాతకర్ణి చరిత్రకి దీన్నే అప్లై చేశారు క్రిష్. ప్రారంభంలో చిన్నప్పుడు శాతకర్ణి ఏ గోల్ నైతే వెల్లడిస్తాడో, దాన్నాధారంగా చేసుకునే మొత్తం ఈ కథ నడిపారు. అందుకని రాజుగా ఇందులో రాజ్యపాలనా, ఆనాటి సామాజిక పరిస్థితులూ, సమస్యలూ, రాజుగా ఆయనకు అభిషేకాలూ, పొగుడుతూ ప్రజల బృందగానాలూ వగైరా అనవసరం.  యోధుడిగా  ఏ లక్ష్యంకోసం శాతకర్ణి యుద్ధాలు చేశాడన్నదే ఈ కథ. వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' తీసినప్పుడు పోలీసులు వీరప్పన్ ని ఎలా ఎన్ కౌంటర్  చేశారన్నదే కథ-  కనుక వేరే వీరప్పన్  జీవితం అనవసరం. అదింకో సినిమా తీసుకోవచ్చు. అటెన్ బరో 'గాంధీ' తీసినప్పుడు అందులో మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్ర్య సమరంతోనే కథకి పని. కొడుకుతో వివాదాస్పదమైన ఆయన సంబంధాల గురించి వేరే 'మై ఫాదర్  గాంధీ'  అని తీసుకోవచ్చు. జీవిత చరిత్రల్ని పుస్తకాల్లో నింపినట్టు  సినిమాల్లో నింపలేరు. ఆ జీవితంలో ఏదో ఒక పార్శ్వమో,ఖండమో తీసుకుని, లక్ష్యం - సంఘర్షణ- విజయం లేదా అపజయం- అనే  స్క్రీన్ ప్లే సూత్రాల్లోనే  సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఏ జీవిత చరిత్ర అయినా ఇంతే. ఆ మాట కొస్తే రామాయణ భారతాలు సినిమాలుగా తీసినా ఇంతే. దీన్ని అర్ధం జేసుకోవాలి ప్రేక్షకులు. ఇలాకాక శాతకర్ణి  పాలనా, ఆయన  చేసిన అభివృద్ధీ, సంక్షేమ పథకాలూ, ప్రజలకి తాయిలాలూ, చీరెల పంపకాలు, సాగునీటి పారుదలా, శాంతి భద్రతలూ, ఈ సినిమాకి టికెట్లూ- వాటికి  వినోద పన్ను మినహాయింపూ  - ఇంకా మాటాడితే ట్రాఫిక్ రూల్సూ, ఎలక్షన్ హామీలూ, పాల్పడిన అక్రమాలూ, స్కాములూ, బ్లాక్ మనీ, పెద్ద నోట్ల రద్దూ   చూపించ లేదన్నట్టు వుంటున్నాయి చాలా మంది ప్రేక్షకుల కామెంట్స్ ! పేపర్లు  చదవడం వేరు, సినిమలుచూడ్డం వేరని గుర్తించాలి ఈ కాలంలో కామన్ సెన్స్ లేని ఇలాటి ప్రేక్షకులు. 

           అంతమాత్రాన మరీ యుద్ధాలు మాత్రమే చేసుకునే  మరమనిషిగా ఏమీ చూపించలేదు శాతకర్ణిని- అతడి యుద్ధ జీవితంతో బాటు సమాంతరంగా కుటుంబ జీవితమూ చూపించుకొచ్చారు. ఈ రెండు సమాంతర రేఖల మధ్య మళ్ళీ  ఆయన పాలనా గీలనా చూపించుకుంటూ కూర్చుంటే కథేమిటో అస్సలు అర్ధం కాదు. డాక్యుమెంటరీ గా మాత్రం అర్ధమౌతుంది. కానీ డాక్యుమెంటరీ చూడ్డానికి ప్రేక్షకులు రారు. శాతకర్ణికి ప్రధానంగా యుద్ధాలు - కుటుంబ జీవితం ఈ రెండే పరస్పరం సంఘర్షించుకుంటూ వున్నాయి.  కాబట్టి కథకి ఇవే ప్రధానం. ఈ కథనాల్లో అక్కడక్కడా సంభాషణల పరంగా శాతకర్ణి పాలనా, విధానాలు, విశ్వాసాలు, రాజకీయ నిర్ణయాలూ  మొదలైన వాటి గురించి సమాచారం అందుతూనే వుంటుంది ప్రేక్షకులకి టూకీగా.         మొత్తం శాతకర్ణి భారత్ ని ఏకం చేయాలన్న లక్ష్య గాథని నాల్గే  నాల్గు సీక్వెన్సుల్లో సింపుల్ గా చూపించారు ( సాధారణంగా సినిమాల్లో ఆరు సీక్వెన్సులుంటాయి). ఫస్టాఫ్ రెండు, సెకండాఫ్ మరో రెండు సీక్వెన్సులు. ఫస్టాఫ్ లో కేవలం రెండు ఘట్టాలు- సెకండాఫ్ లో కేవలం మరో రెండు ఘట్టాలు. వీటితో చెప్పాలనుకున్న అఖండ భారత చక్రవర్తిగా శాతకర్ణి ఎదిగిన క్రమమంతా కళ్ళకి కడుతుంది. చరిత్ర అనగానే మూడేసి గంటలు ఏవేవో చూపిస్తూ  కూర్చోకుండా, కేవలం రెండు గంటలా 12 నిమిషాల్లో సూటిగా సాఫీగా సింపుల్ గా శుభం!

        ప్రారంభంలో సముద్రం మీద కల్యాణ్ దుర్గ్ జయించడం కోసం మొదటి యుద్ధం, తర్వాత న హపానుణ్ణి  జయించే యుద్ధం- దీంతో ఇంటర్వెల్. దీంత్తర్వాత రాజసూయ యాగమూ  దాని కీలక పరిణామాలు, ఆ తర్వాత డిమిత్రియాస్  మీద యుద్ధం...ఈ నాల్గు సీక్వెన్సుల్లో భాగంగానే తల్లితో, భార్యతో అతడి సంబంధాల సీన్లూ వస్తాయి. ఇవే అన్ని సీక్వెన్సుల్లో అంతర్లీనంగా బాలకృష్ణ పాత్రకి ఎమోషనల్ థ్రెడ్ గా వుంటాయి- యాక్షన్ థ్రెడ్ వచ్చేసి బయట చేసే యుద్ధాలు. 

        అయితే సినిమాటిక్ అనుభవంకోసం కథలో ఏకైక విలన్ వుండడం అవసరం. ఇక్కడ విలన్లు అనే వాళ్ళు ఎప్పటి కప్పుడు లొంగిపోయే, చచ్చిపోయే రాజులుగా వుంటున్నారు. కాబట్టి పై సీక్వెన్సులన్నిటినీ కలిపి సాగే ఒక మెయిన్ విలన్  అంటూ లేకపోవడంతో  యాక్షన్ థ్రెడ్ లో కంటిన్యూ అవాల్సిన హీరో తాలూకు ఎమోషన్ వుండదు. అయితే విడివిడిగా ఈ యుద్ధాల్లో అప్పటికప్పుడు శత్రువులతో ఏర్పడే భారీ ఎమోషన్స్, సెంటిమెంట్స్  లేకపోలేదు.  అవేమిటంటే, మొదటి యుద్ధంలో యవనుడు (గ్రీకు) పరిథాస్ ని శాతకర్ణి చంపిన విధానం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కథా ప్రారంభం కాబట్టి శాతకర్ణి పాత్రని పరిచయం చేసే ఈ యుద్ధంలో పరిథాస్ ని చంపడమనే అతడి లక్ష్యం లోంచి పుట్టిన  ఆ చర్య బలమైన ఎమోషన్ గా  కన్పిస్తుంది.  కానీ ఈ పరిథాస్ ని అంత కసిగా  చంపడమే చివరి యుద్ధంలో శాతకర్ణి ప్రాణాల మీదికి తెస్తుంది. రెండో యుద్ధంలో శాతకర్ణి కొడుకుని తీసి కెళ్ళి పణంగా పెట్టే ఎమోషనల్ - సెంటిమెంటల్ దృశ్యాలు వస్తాయి. ఇక్కడ నహపాణుడు 
 బందీలుగా పెట్టుకున్న సామంతుల పిల్లల్ని కూడా విడిపించాల్సి వుంటుంది శాతకర్ణికి. చివరి యుద్ధానికి సెంటిమెంట్లు, ఎమోషన్సు  భార్యతో ముడిపడి వుంటాయి. భార్యకి పీడకలు రావడమనే ప్రిమానిషన్ ని కూడా లెక్క చేయకుండా శాతకర్ణి యుద్ధానికెళ్ళి విషప్రయోగం పాలబడి, రణ రంగంలో మంచాన పడిపోతాడు...

       ఇలా ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ విడివిడి ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉత్పన్నమవుతూ  ఆ ఎపిసోడ్స్ తో బాటే అవికూడా ముగిసి పోతూంటాయి. జస్ట్ లైక్- స్టార్ట్ అండ్ స్టాప్ అనే డాక్యుమెంటరీ లకి వాడే  ట్రీట్ మెంట్ లాంటిదన్నమాట. కానీ సినిమా అన్నాక ఆదిమధ్యాంతాలన్నిటా చెప్పాలనుకున్న పాయింటుకి సంబంధించిన ఒకే మేజర్ ఎమోషన్ ని పాత్ర మోస్తూండాలి. మోయాలంటే ఒకే విలన్ వుండాలి. ఒక లక్ష్యం, ఒక విలన్, అతడితోనే  సంఘర్షణ -అనే  సూత్రం చాలా జీవిత చరిత్రలకి అసాధ్యమైపోతుంది. అందుకని జీవిత చరిత్రలు కమర్షియల్ సినిమాయేతర గాథలుగా వుంటాయి. గాథల్లో ఆర్గ్యుమెంట్ వుండదు. ఒకే విలన్ అంటూ వుంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ పుట్టి అది 'గాథ' అవక సినిమా 'కథ' లా వుంటుంది. ఆర్గ్యుమెంట్ సహితంగా  కథలే వుంటాయి, గాథ లుండవు. అవి స్టేట్ మెంట్ మాత్రంగానే వుంటాయి. 

     శాతకర్ణి పాత్రకి ఒక లక్ష్యమైతే  వుందిగానీ, ఆ లక్ష్యంకోసం  సంఘర్షించడానికి ఒకే  విలన్ అంటూ లేడు. తనతో  తనే ఆర్గ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీ సమస్య. 
 ఈ సమస్య ‘కంచె’ లో కూడా వుంది. రెండు వేర్వేరు కాలాల్లో జరిగే రెండు కథలకీ కలిపి ఒక ‘హుక్’ అందులో లేనట్టే,  ఇక్కడ కూడా  నాల్గు సీక్వెన్సుల్నీ కలిపి వుంచే ఒక  హుక్-  ఒకే విలన్ లేడు.  concentric circles అయితే వున్నాయిగానీ వాటిని కలిపివుంచే హుక్ లేదు. ఇది చరిత్రకి చేసిన కథ కాబట్టి ఏకైక విలన్ అనేది కుదరలేదు. ఆ మాటకొస్తే అటెన్ బరో తీసిన ‘గాంధీ’ కూడా ఇంతే- నాల్గు వేర్వేరు సీక్వెన్సులు- ప్రత్యర్థులు ఎందరో! 

        అప్పుడు దీనికి పరిష్కార మార్గం- శాతకర్ణి చివరి యుద్ధం ఎవరితోనైతే చేస్తాడో,  ఆ డిమిత్రియాస్ నే మెయిన్ విలన్ గా  పెట్టుకుని కథ ప్రారంభించాలి. మిగతా  రాజులతో యుద్ధాలు ఫ్లాష్ బ్యాక్స్ గా చెప్పుకురావాలి. ఇలా వర్కౌట్ అవుతుందా? చెప్పలేం, ఇదొక  ప్రయోగం. కానీ వర్మ తీసిన బలహీన 'వంగవీటి' కి ఇదే కరెక్ట్ సొల్యూషన్. 

        ఒక్కోసారి  క్యారక్టర్ పోషిస్తున్న స్టార్  కొన్ని లోపాల్ని తనే హేపీగా జయించేస్తూంటాడు. యువరత్న బాలకృష్ణ  నటసింహుడే  కాబట్టి, ఇలాటి లోపాల్ని నమిలేయడం  సినిమాలో  ఆయన చీమా - సింహం కథ చెప్పినంత తేలిక!

        సినిమా చివర గౌతమీ పుత్ర శాతకర్ణికి నిరాజనాలు పలికే వాక్యాలు గొప్పగా వున్నాయి!

-సికిందర్
http://www.cinemabazaar.in