రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, మే 2020, శనివారం

948 : 'పాలపిట్ట' ఆర్టికల్, విస్మృత సినిమాలు


       కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సామాజిక సినిమాల్లో ‘అదిగో అల్లదిగో’ ఎవరి దృష్టిలో పడకుండా కనుమరుగై పోయింది. 1984లో ‘మంగమ్మగారి మనవడు’ అనే సంచలన హిట్ కంటే ముందు తీసిన ఈ సామాజికంలో చంద్రమోహన్, సుహాసిని, గుమ్మడి, నూతన్ ప్రసాద్, పిఎల్ నారాయణ, రాళ్ళపల్లి మొదలైన వారితో కూడిన ప్రముఖ తారాగణమే వుంది. ఆత్రేయ పాటలున్నాయి, ఎంవీఎస్ హరనాథరావు మాటలున్నాయి, కన్నప్ప ఛాయాగ్రహణమూ వుంది. సాంప్రదాయ వాదం, హేతు వాదం కలబడితే మధ్యలో దుష్టశక్తులు జొరబడతాయని సందేశమిచ్చే ఆసక్తికర కథావస్తువూ వుంది. 

       
యినా ఆ కాలంలో ఎందుకనో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ కాలంలో ఇది జియోలో  స్ట్రీమింగ్ అవుతోంది. ఓ యాభై వేల వ్యూస్ తో యూట్యూబ్ లో ఎలాగూ  చాలాకాలంగా వుంది. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు దీన్ని చూస్తే, నిత్యసత్యమే కన్పిస్తుంది. ఈ కాలానికి కూడా పనికొచ్చే ముక్క. సాంప్రదాయ వాదాన్ని ఆధ్యాత్మిక వ్యాపకాలకి పరిమితం చేసుకోవాలే తప్ప, అంధవిశ్వాసంగా మార్చుకుంటే లేని పోని సామాజిక అనర్ధాలకి సాంప్రదాయ వాదులు మూలమవుతారన్న హెచ్చరిక ఇందులో వుంది. సాంప్రదాయ వాదుల అంధవిశ్వాసాల చుట్టూ చేరి మూఢభక్తులు, మూఢ భక్తుల మనోభావాలతో ఆడుకుని అందలా లెక్కే రాజకీయ శక్తులు, రాజకీయ శక్తుల్ని మూఢ భక్తిలోకి లాగి బాముకునే దొంగ బాబాలు, మళ్ళీ ఆ దొంగ బాబాలకి నిలువు దోపిడీలిచ్చుకుంటూ సాష్టాంగపడే అదే జనాలూ... ఇలా వొక విషవలయాన్ని సృష్టించి పెట్టేస్తారన్న అర్ధం వచ్చేలా కోడి రామకృష్ణ సోషల్ కామెంట్ చేశారు. సాంప్రదాయ వాదం ఆధ్యాత్మికాన్ని దాటి నప్పుడే హేతువాదం ప్రశ్నిస్తుంది. సాంప్రదాయ వాది పాత్రలో గుమ్మడి మానవవాదాన్ని మర్చిపోతే, కొడుకు పాత్రలో చంద్రమోహన్ పాల్పడే ఓ చర్యే దీనికంతటికీ దారి తీస్తుంది. కంఠ శోష తప్ప, సాంప్రదాయం - హేతువాదం ఏదీ గెలవదు, ఓడిపోదు. యుగాలుగా తెగని పంచాయితీ. సందట్లో సడేమియాలకి చేతినిండా పని. 

కథ చూద్దాం
        శివానంద శాస్త్రి అలియాస్ శివానంద్ (చంద్రమోహన్) ఎరువుల ఆఫీసర్ గా ఆ గ్రామాని కొస్తాడు. సహజనటి జయసుధ వీరాభిమానిగా అమ్మాయిల్నేసుకుని అల్లరిగా తిరిగే రాజేశ్వరి (సుహాసిని) కంటపడి అల్లరవుతాడు. ఈ అల్లరి ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. సుహాసిని తల్లి మరియా క్రైస్తవురాలు. ఈ కారణంగా రాజేశ్వరికి పెళ్లి సమస్య వుంటుంది. తండ్రి సంగీతరావు (పిఎల్ నారాయణ) వ్యవసాయ దారుడు. శివానంద్ వీళ్ళ ఇంటికి స్నానానికి వచ్చినప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటాడు.  


        ‘అసలే మీరు అగ్రకులం. మా యింటికి స్నానికి రావడం...’ అంటూ సంగీతరావు సంకోచిస్తే, ‘ఈ రోజుల్లో కులాలేంటండీ మనిషి గ్రహాల్లో తిరుగుతూంటేనూ...’ అని కొట్టి పారేస్తాడు శివానంద్. ‘ఈనాటికీ మావూరు అగ్రహారంలో ఇంకో కులం వాడు కాలు పెడితే కాలు విరగ్గొడతారు’ అని సంగీతరావు పరిస్థితి చెప్తాడు. ఈ పరిస్థితిని కళ్ళతో చూస్తాడు శివానంద్. ఒక దళిత పిల్లాడు అగ్రహారంలోకి అడుగుపెట్టాడని ఎడాపెడా కొట్టేస్తూంటాడు పూజారి. దీనిమీద శివానంద్ తిరగబడతాడు, ‘అగ్రహారాలు ఆకాశం నుంచి వూడి పడ్డాయా? మీ చెప్పులు కుట్టే దెవరురా? మీ బట్టలు ఉతికే దెవరురా? మీరు తినే తిండి పండించే దెవరురా? వీటన్నిటికీ పనికొచ్చే మనుషులు ఇక్కడికి రావడానికి పనికిరారా? ఈ హరిజనులతో ఇప్పుడే ఆలయంలో ప్రవేశిస్తాను’  అని మొత్తం దళితులందరితోఆలయంలో కెళ్ళి పోతాడు. బ్రాహ్మణ వర్గం హాహాకారాలు చేస్తారు.

        ‘ఏది మతం, ఏది కులం’ అని పాడుతూ కోవెల కులం, ప్రమిదల కులం, పూజ పువ్వుల కులం, విబూధి కులం, పుట్టించినవాడి కులం, గిట్టే మట్టికి కులం అడుగుతాడు. ఇలా వున్న శివానంద్ వ్యవహారం, వీరంగం, వేరే గ్రామంలో వుంటున్న తండ్రికి తెలిసిపోతుంది. తండ్రి గౌరీనాథ శాస్త్రి (గుమ్మడి) రాజరాజేశ్వరీ దేవిని ఉపాసిస్తాడు. ప్రతీ శుక్రవారం దేవిని పూజించి, పేటికలోని తాళపత్ర  గ్రంథంలో ఖాళీగా వున్నఒక రాగిరేకుని తీసి ఆసక్తిగా చూస్తాడు. అదయ్యాక, ఇంటిముందు వరస కట్టిన గ్రామ ప్రజలకి విబూధి, తీర్థం ప్రసాదంగా పెడతాడు. వాటితో రోగాలు నయమవుతూంటాయి.

        ఆ తాళపత్ర గ్రంథం పూర్వీకుల నుంచి సంక్రమించింది. అందులో ఖాళీగా వున్న రాగి రేకుకి ఒక విశిష్టత వుంటుంది. దాని మీద దేవి ప్రపంచంలో ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో స్వహస్తాలతో లిఖిస్తుందని తాత ముత్తాతల కాలం నుంచీ నమ్ముతూ వస్తున్నారు. దేవీ  సాక్షాత్కారమే పాపపంకిలమైన ఈ ప్రపంచానికి మోక్షదాయకమని నమ్ముతూ వున్నారు. ఆ దేవీ దర్శనం కోసం తాత ముత్తాతలు ఎదురు చూశారు. ఇప్పుడు గౌరీనాథ శాస్త్రి హారతులిస్తూ ఆహ్వానిస్తున్నాడు. 

        తన తర్వాత దేవిని ఆహ్వానించేదెవరా అని ఆలోచించకుండా, కొడుకుని కోరిన ఉద్యోగం ఎరువుల కంపెనీలో చేసుకోనిచ్చి, భార్య కాత్యాయినితో  హాయిగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా సుఖంగా గడిచిపోతున్న జీవితానికి ఉన్నట్టుండి కొడుకు కొరివి దెయ్యంలా తయారయ్యాడు. 

        అవధాని వచ్చి చెప్తాడు, ‘మీ కొడుకు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రహ్మణ్యంపై తిరగబడి హరిజన ప్రవేశం కల్పించాడు. వర్ణసంకరానికి పుట్టిన పిల్లతో ప్రేమలో పడ్డాడు’ అని. దీంతో గౌరీ పునాదులు కదిలిపోతాయి. కోడలికి అన్నిఅర్హతలూ వున్నాయంటూ చల్లగా వచ్చి చెప్తాడు శివానంద్. ‘ఆ కులహీనురాలికి తాళి కట్టావో, ఈ యజ్ఞోపవీతంతో వురేసుకుంటా!’ అని బెదిరిస్తాడు గౌరీ. ‘మీ మూర్ఖత్వానికి మూఢాచారాల కోసం ఆ అమ్మాయిని బలి చెయ్యాలా?’ అని ఎదురుతిరుగుతాడు శివానంద్. చెంప ఛెళ్ళుమన్పిస్తాడు గౌరీ. శివానంద్ కోపంతో వెళ్ళిపోయి, రాజేశ్వరి నేస్తాలడిగితే జంధ్యం తీసిచ్చేస్తాడు. ఆ జంధ్యానికి పసుపు కొమ్ము కట్టి, తాళిగా మార్చి పెళ్లి జరిపించేస్తారు నేస్తాలు. 

        ఇక మీ ఇంటి కెళ్దామంటుంది రాజేశ్వరి. ‘అక్కడికా? తుఫానులో సముద్ర స్నానం చేసినట్టుంటుంది’ అని వద్దంటాడు. ‘ఆ ఇంటి కోడలిగా నేనొప్పించుకుంటాగా’ అని తీసికెళ్తుంది. వీళ్ళని చూసి మండిపడ్డ  గౌరీ, ఇంటిని రెండు ముక్కలు చేసి ఒక ముక్కలో పడుండమంటాడు. ఒక ముక్కలో పక్కమీద కాపురం పెడతారు. ఓ తెల్లారే తులసి కోటకి ముగ్గు పెట్టలేదేమని భార్యనడుగుతాడు గౌరీ. బయట వున్నానని అంటుంది. ఇది విన్న రాజేశ్వరి వచ్చి ముగ్గు పెట్టేస్తుంది. ఇది చూసి మౌనంగా వెళ్ళిపోతాడు గౌరీ. మామగారు కరిగిపోయారు, ఇక మనదే విజయమని శివానంద్ కి చెప్పుకుని ఆనందిస్తుంది సుహాసిని. గబగబా నీళ్ళు తెచ్చి గుమ్మరించి ముగ్గు కడిగి పారేస్తాడు గౌరీ. 

        ఇంకో రోజు తన పుట్టిన రోజని పళ్ళూ పలహారం తీసుకొచ్చి, దీవించదీమంటాడు శివానంద్. తీసి ఇంటవతల విసిరేస్తాడు గౌరీ. సుహాసిని నెల తప్పుతుంది. నెలలు నిండాక తీసికెళ్దామని వస్తారు తల్లిదండ్రులు మరియా, సంగీత రావులు. రెండు బిందెల్లో సూడిదలు తీసుకుని వస్తారు. గౌరీ ఆగ్రహించి, పంచ పాతక జలం తెమ్మంటాడు భార్యని. ఆ జలాన్ని బిందెల మీద పోసి, బిందెల్ని ఎత్తి బయటికి విసిరి పారేస్తాడు. ఆవు పంచకంతో ఇల్లు శుద్ధి చేయమంటాడు. దిగ్భ్రాంతి చెందుతారు సుహాసిని తల్లిదండ్రులు. తల కొట్టేసినట్టవుతుంది శివానంద్ కి.

        ‘మీ దృష్టిలో మనుషులు ఆవు పంచకం కంటే హీనమైపోయారు. కానీ మనిషికి నియమ నిష్టల కన్నా, వేద వేదాంగాల్లో పాండిత్యం కన్నా, సాటి మనిషిని అర్ధం చేసుకునే  హృదయం, సంస్కారం వుండాలని నా అనుభవం చెప్పింది... మీ ధర్మాలూ శాస్త్రాలూ నా బిడ్డని కులం లేని దానిగా నిర్ణయించవచ్చు. కానీ మీ మనస్సాక్షికి నా బిడ్డ ఒక గర్భవతి. అభం శుభం తెలీని ఆడపిల్లగా కన్పిస్తే చాలు...’ అని బాధనణుచుకుని వెళ్ళిపోతాడు సంగీత రావు. 

        మనవడు పుట్టి వచ్చేసరికి గౌరీ పరమానంద భరితుడై పోతాడు. వాడు శ్లోకాలు పఠించేసరికి దగ్గరై పోతాడు. వాడిలో తనని చూసుకుంటాడు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవదు. ఓ శుక్రవారం తను ఇచ్చిన విబూధికి ఒకడు చచ్చిపోతాడు. దీంతో దారంట పోతూంటే ప్రతివాడూ మాటలే. కులం లేని కోడలి రాకతో అమ్మవారి అనుగ్రహం ఆగ్రహమైపోయిందని. సాటి బ్రాహ్మణులు కూడా ఎత్తి పొడుస్తారు. దీంతో ఇంటికొచ్చి తుఫాను రేపుతాడు, ‘ఏ క్షణంలో ఈ కులహీనురాలు అడుగుపెట్టిందో, ఆ క్షణమే మన నియమ నిష్టలన్నీ మంటగలిసి పోయాయి. శక్తి విహీనులమైపోయాం. విబూధి స్మశానంలో బూడిదైంది, తీర్ధం మురిక్కాల్వలో నీళ్ళు. దాన్ని వెళ్ళిపొమ్మని చెప్పు!’ అని వూగిపోతాడు. దేవి ముందు క్షమించమని విలపిస్తాడు. 

         రాజేశ్వరి తన తక్కువ జన్మ తల్చుకుని కుమిలిపోతుంది. ఇక లాభం లేదని శివానంద్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. రహస్యంగా పూజ గదిలో పేటిక లోంచి తాళపత్ర గ్రంథం తీస్తాడు. అందులో ఖాళీగా వున్న రాగి రేకుని తీసి ఒక పని చేస్తాడు. ఏమిటా పని? ఏం చేశాడు? ఏం చేస్తే గౌరీనాథ శాస్త్రి ప్లేటు ఫిరాయించి కోడల్ని బంగారంలా చూసుకున్నాడు? పొలోమని జనాలూ, రాజకీయ నాయకులూ, దొంగబాబాలూ వచ్చిపడి  వాళ్ళ వాళ్ళ లాభాలూ చూసుకున్నారు? ఇదంతా చివరికి ఏ పరిణామాలకి దారితీసింది?...ఇదీ మిగతా కథ.

గుమ్మడియే ప్రధానాకర్షణ  
     గౌరీనాథ శాస్త్రి పాత్రలో గుమ్మడిది శక్తివంతమైన నటన. ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో తనకి తానే సాటి అనేది తెలిసిందే. సన్నివేశాల్లో తనే ప్రధానాకర్షణ. కథకి మూలస్థంభం. సాంప్రదాయం ఆచారాలూ అంటూ పట్టుబట్టే సద్బ్రాహ్మణుడి పాత్ర రొటీనే, కొత్తదేం కాదు. అయితే ఓ కాస్త వూరటకి చాపల్యానికి పోయి, చాప కిందికి నీరు తెచ్చుకోవడం కొత్త చిత్రీకరణే. పాత్రకి ఆసక్తికర మలుపు. కొడుకు శివానంద్ చేసిందేమిటి? భార్యమీద తండ్రి అభిప్రాయం మార్చాలని రాగి రేకు మీద, ‘గౌరీనాథా...తరతరాలుగా నువ్వు చేస్తున్న పూజా ఫలితంగా నీ కోడలి రూపంలో నేను నీ ఇంట వెలిశాను’ అని మాత్రమే సువర్ణా క్షరాలు లిఖించాడు. ఇది చదువుకున్న గౌరీ ఓవరాక్షన్ చేశాడు. ఇక తరతరాలుగా వస్తుందని, వచ్చి రాగి రేకు మీద తన ఆగమనం గురించి లిఖిస్తుందనీ నీరీక్షిస్తున్న దేవీయే, ఇక సాక్షాత్కరించిందని నమ్మేశాడు గౌరీ. ఆనందం పట్టలేక ఇప్పుడు దేవీ అవతారంగా మెరిసిపోతున్న కోడలు రాజేశ్వరికి సాష్టాంగ పడిపోయాడు. లెంప లేసుకున్నాడు. పశ్చాత్తాపం ప్రకటించాడు. ఆమె కేమీ అర్ధంగాక తలుపేసుకుంది. పూజా గదిలో చేయి కాల్చుకుంటే వచ్చి ఆపింది. దీంతో పరవశుడైపోయాడు, ‘తల్లీ, నీ స్పర్శతో నాలో కొత్త జీవం వచ్చింది. నా అజ్ఞానం గానీ నీవు దయామయివి...ధరిత్రిని మించిన క్షమా మయివీ ....’ అంటూ పాలాభిషేకం చేశాడు. గౌరీ ప్రవర్తన చూసిన గ్రామస్థులు, ‘పూజలో అమ్మవారు వొంటి మీదికి వచ్చి వుంటుంది’ అనుకోసాగారు.


        గుమ్మడి పాత్ర ‘శంకరాభరణం’ లో జేవీ సోమయాజులు పాత్రకి దగ్గరగా వుంటుంది. ఇద్దరూ చేసింది ఒకటే. కాకపోతే పరిస్థితులు, ఉద్దేశాలు వేరు. సోమయాజులు శంకరశాస్త్రి పాత్ర నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. నాట్యంలో ఆమెని ప్రోత్సహిస్తాడు.
ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్పమనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదు అని ప్రకటిస్తాడు. ఇందుకు కలిసి వచ్చిన పరిస్థితి, సంగీతంలోనే తను అభ్యుదయవాది కాదు, జీవన యానంలోనూ గొప్ప అభ్యుదయవాది కావడం. 

       దీనికి విరుద్ధ భావజాలంతో వున్న గుమ్మడి గౌరీనాథ శాస్త్రి పాత్ర, ‘మనిషికి నియమ నిష్టల కన్నా, వేద వేదాంగాల్లో పాండిత్యం కన్నా, సాటి మనిషిని అర్ధం చేసుకునే  హృదయం, సంస్కారం వుండాలని’ ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితి. ఇలాటి తను కులహీనురాలని ఈసడించుకున్న కోడల్ని దేవతగా చేసేశాడు. కొడుకు చేసిన పనికి అంధ విశ్వాసంతో ఈ చర్యకి పాల్పడ్డాడు. ఆధ్యాత్మిక శాస్త్రాలకి మూఢత్వం తోడయితే దేవుళ్ళు పుట్టుకొచ్చేస్తారు. కొడుకు శివానంద్ ఈ మూఢత్వాన్నే వ్యతిరేకిస్తాడు. శంకరశాస్త్రి, గౌరీనాథ శాస్త్రి పాత్రల్ని పక్కపక్కన చూసినప్పుడు, ఇద్దరూ సామాజిక భక్తి కిరువైపులా కన్పిస్తారు. 

        సుహాసిని రాజేశ్వరి పాత్ర సంక్లిష్టమైనదే. కథా ప్రారంభంలో ఆమె పాత్ర ప్రవేశం రాజరాజేశ్వరీ దేవిగా నటిస్తూ నేస్తాలకి వరాలిచ్చే అల్లరిగా వుంటుంది. జీవితంలో ఇదే నిజమై, మామగారు తనని అదే దేవతగా చేస్తాడని వూహించి వుండదు. మామగారి కులహీనురాలి ముద్రతో కించ పడుతున్న తను, ఏకాఎకీన ఆ మామ తన సింహాసనం మీదే కూర్చోబెట్టి ప్రసాదాలు ఇప్పించేసరికి, నవ్వాలో ఏడ్వాలో తెలియని స్థితి ఆమె నటనకి ఒక చేర్పు. దీన్ని వేళాకోళంగా తీసుకుని, జనాల వెర్రి తనాన్ని చూసీ, విబూధీ తీర్ధాల తోనే కాదు, నిమ్మకాయలతో కూడా నోటికొచ్చిన వైద్యం చేసి పారేసే తమాషా క్యారక్టర్ ని వినోదం పండేలా చేసింది. తను చేస్తున్నది తప్పని తెలిశాక వెనక్కి తీసుకోలేని పరిస్థితి. వెనక్కి తీసుకుంటే తండ్రి సహా అందరం దోషులుగా నిలబడతామని శివానంద్ హెచ్చరిక. చివరికి తన కొడుకే జబ్బునపడితే తన మహిమలతో బాగు చేసుకోలేక వాణ్ణి కోల్పోవాల్సిన దౌర్భాగ్యం. ఇదంతా సుహాసిని పాత్రని సంక్లిష్ట పాత్రగా మార్చడంతో బాటు, నటిగా ఆమెకో నిఘంటువు కూడా అయింది. ఈ కథకి క్రమక్రమంగా తను దేవత అయ్యేసరికి ప్రధాన పాత్ర తనే అయిపోయింది.

        చంద్రమోహన్ శివానంద్ పాత్ర ఉత్ప్రేరక పాత్ర. రాగిరేకు మీద అలా రాయడంతో అతనే ఈ కథని ప్రధాన మలుపుతిప్పి సుహాసిని పాత్ర చేతిలో పెట్టేశాడు. పరిణామాలు చూస్తూ బెంబేలెత్తి పోయాడు. తన అభ్యుదయం, తండ్రి సాంప్రదాయం తగాదా పడితే మధ్యలో భార్య అమ్మవారై పోయి జీవితం తిరునాళ్ళయి పోవడమేమిటో అర్ధంగాక జుట్టు పీక్కునే పరిస్థితి. చివరికి వెర్రి జనం తననే చంపడానికి వెంటపడడం...ఆ రోజుల్లో ఇలాటి ఎమోషనల్ పాత్రలు పోషిస్తున్న చంద్రమోహన్ కి ఈ పాత్ర కష్టమేం కాదు. 

అర్ధవంతమైన కథనం  
       కథనంలో ఏఒక్క సీనూ అనవసరంగా వుండదు. అరగంటలో ప్రధాన మలుపుకొ చ్చి కథ ప్రారంభమైపోతూ, ప్రతీసీనూ ఇంకో సీనుగా మలుపు తీసుకునే పాయింటుతోనే వుంటుంది. పాయింటు నుంచి పాయింటు గా సాగే ఈ కథనంతో కథ చిక్కనవుతూ వుంటుంది. కథ పెద్దదవుతూ కూడా వుంటుంది. రాజేశ్వరి అభిమాన నటి జయసుధ కూడా వచ్చేసి ఆశీర్వాదం పొంది, లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చేస్తుంది. రాజేశ్వరి దేవతగా వెలసిన విషయం రాజకీయ పార్టీలకీ తెలిసిపోతుంది. కండువా పార్టీ నాయకుడు కొండలరావు వచ్చేసి కండువా పర్చి ఆశీర్వదించమంటాడు. ఆశీర్వదిస్తూంటే ఆమె పాద ముద్రలు కండువా మీద పడతాయి. అంతే, ఆ పాదముద్రలు ప్రచారం చేసుకుంటూ పాదముద్రల గుర్తుకే ఓటెయ్యాలంటాడు. జనం శివాలెత్తి ఆ పాదముద్రలకే ఓట్లు గుద్ది అతణ్ణి సీఎంని చేసి పారేస్తారు! 


        ఇక సీఎం కొండలరావు రాజేశ్వరికి ఆశ్రమం కట్టించేస్తాడు. తిరునాళ్ళు జరిపించేస్తాడు. ఇదంతా గమనిస్తున్న, 33 సార్లు జైలునుంచి తప్పించుకొచ్చిన దొంగబాబా (నూతన్ ప్రసాద్), వచ్చేసి రాజేశ్వరిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు, ‘నేను నందీశ్వరుడ్ననీ, నీకోసం నీతో పాటు నేనూ పుట్టానని భక్తులకి చెప్పు. నా వ్యాపారం చేసుకుంటాను. నీ కలెక్షన్ కేం అడ్డు రాను’ అని బేరం పెడతాడు.

        ఈ బ్లాక్ మెయిల్ ఆశ్రమాన్ని కబ్జా చేసేదాకా పోతుంది. అమ్మవారు సజీవ సమాధికి సిద్ధమయ్యారని ప్రకటించి జనాల్ని రెచ్చగొడతాడు. ఇప్పుడు రాజేశ్వరి అసలైన సంక్షోభంలో పడుతుంది. దీంతో అంతిమ నిర్ణయం ఏం తీసుకుందన్నది ముగింపు. 

        ఇందులో కథకి సంబంధం లేకుండా వచ్చిపోయే హాస్య పాత్ర వుంటుంది. రాళ్ళపల్లి పోషించిన హేతువాది డాక్టర్ తేయాకు పాత్ర. అతడికి విప్లవ కారుంటుంది, విప్లవ పనిమనిషుంటాడు, విప్లవ కుక్క వుంటుంది. కానీ విప్లవ భార్య వుండదు. ఆమె పిల్లల కోసం రావి చెట్టు చుట్టూ తిరుగుతూంటుంది. 

        కోడి రామకృష్ణ ఒక సామాజిక. రాజకీయ వ్యాఖ్యానం చేశారు ఈ ప్రయత్నం ద్వారా. సమస్యలకి మూలం ఎక్కడుందో ఆరోపించకుండా ఆలోచనాత్మకంగా అందించే సృజనాత్మకతని ప్రదర్శించారు. ప్రతివొక్కరూ ఇది తెలుసుకో గల్గితే కోడి రామకృష్ణ ముక్తాయించినట్టు, ఆచారాలు చేసే దేవుడు కాదు మనకి కావాల్సింది, మనసుతో మనుగడ చేసే మనిషి కోసం అదిగో అల్లదిగో... ఆ దిశగా సాగుదామని కోరుకుంటాం.

సికిందర్

 (‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక మే ’20 సంచిక నుంచి)